Pages

Thursday, December 29, 2011

వైదిక మతం సైన్స్‌కి వ్యతిరేకమా?


    చాలా మంది అనుకున్నట్టుగా, ప్రపంచంలో మిగతా మతాల మాదిరిగా కాకుండా వైదిక మతం శాస్త్ర విజ్ఞానానికి పెద్ద పీట వేసింది. హిందువులకు ముఖ్యమైన మత గ్రంధాలు వేదాలు. 'వేదం' అనే పదం 'విత్‌' అనే ధాతువు నుండి వచ్చింది. విత్‌ అంటే 'జ్ఞానం' అని అర్థం. మానవ సమాజం యొక్క మొదటి మెట్టు జ్ఞానంతోనే మొదలయిందని దీని అర్థం. మనిషి నాగరికత మొదటి అడుగు వేసింది నిప్పును కనిపెట్టడంతోనే అని అందరికీ తెలుసు. అందుకే ప్రపంచంలోనే మొట్టమొదటి, అతి ప్రాచీనమైన గ్రంధమైన ఋగ్వేదం 'అగ్నిమీళే పురోహితమ్‌' అనే అగ్ని దేవుని ఋక్కు (ప్రార్థన)తో మొదలయింది. హిందూ మత గ్రంధాలు ఎన్నడూ అంధ విశ్వాసాలను నూరిపోయవు. అలాగే తమ మతమే గొప్పది అనే తత్వాన్ని గాని, మరో మతాన్ని అణగదొక్కాలనే విద్వేషాన్ని గాని ఏ హిందూ మత గ్రంధమూ చెప్పదు. వైదిక మతం ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది. ప్రశ్నించడం జ్ఞానం తెలిసిన వాడి హక్కు. ఫలానా గ్రంధంలో ఇలాగే ఉంది కాబట్టి దాని గురించి మీకు ప్రశ్నించే హక్కు, అధికారం లేదు అని ఎవరూ అనలేరు. ప్రశ్నించ గల నేర్పు, ఎన్ని రకాలుగా ప్రశ్నించవచ్చునో కూడా ఒక శాస్త్రంగా రూపుదిద్దుకున్నాయి. అదే 'తర్కశాస్త్రం' - వేదాంగాలలో ఒకటి. వేదాంతమైన ఉపనిషత్తు కూడా గురు శిష్యుల మధ్య సంవాద రూపంలో ఉంటాయి. అంటే శిష్యుడు తనకు వచ్చిన ఒక అనుమానాన్ని గురువుని అడుగుతాడు. దానికి గురువు చక్కటి, సమాధానం చెబుతాడు. ఒకవేళ గురువుగారు చెప్పిన సమాధానంతో శిష్యుడు తృప్తి పడకపోతే, లేదా ప్రక్కనున్న మరో శిష్యుడికి దానికి సంబంధించిన మరో అనుమానం వస్తే, మరల గురువుగారిని తన ప్రశ్నని గురించి అడగవచ్చు. ఈ విధంగా మనం ఇపుడు చెప్పుకుంటున్న గ్రూప్‌ డిస్కషన్స్‌ ఆ రోజుల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధమైన చర్చల ద్వారా వేద విషయాలలోని సంక్లిష్టత అందరికీ అర్థమయ్యే సులభ భాషలో ఉపనిషత్‌ రూపంలో భద్రపరచబడింది. ఉపనిషత్తులలో లేని అంశమంటూ లేదు. ఈ సృష్టి ఏర్పడిన విధానం - భగవంతుని గుణ గణాలు - ఆయన రూపం - ఆత్మ - పరమాత్మ - వీరిద్దరికీ గల సంబంధం - ప్రకృతి శక్తులు ఏమిటి - మనిషికి ప్రకృతికిగల సంబంధం - జననం - మరణం - పునర్జన్మ - వీటి రహస్యాలు ఇలా మనిషికి వచ్చే ప్రతీ అంశం గురించి ఉపనిషత్తులలో కూలంకంషంగా అధ్యయనం చేసారు - మన ప్రాచీన ఋషులు, యోగులు.

    మానవ నాగరికతకు మూల స్థంభమే వేదం. మనకి జన్మ నిచ్చిన స్త్రీని మాతృ మూర్తిగా పిలవాలని ప్రపంచానికి నేర్పింది వేదం. అందుకే ఏ భాషలోనైనా అమ్మని పిలిచే పిలుపులో 'మ' అనే అక్షరం తప్పని సరిగా ఉంటుంది. మన జన్మకి కారకుడైన పురుషుడిని తండ్రిగాను, వీరందరినీ ఒక కుటుంబంగా వ్యవహరించాలని, నిత్యం మనం చేయవలసిన పనులు, సమాజం నడవడిక ఎలా ఉండాలో, రాజు ఎలా పరిపాలించాలో అన్నీ తెలిపింది వేదం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి నాగరికత నేర్పింది వేదం. వేదం అంటే జ్ఞానం - జ్ఞానం అంటే వేదం. ఇక వేదం జ్ఞానాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది?

    ఇదే కాకుండా ఈ రోజు ఆధునిక ప్రపంచానికి వచ్చే అనేక రుగ్మతల నుండి విముక్తి ప్రసాదిస్తున్న అతి ప్రాచీన - ఋషి ప్రసాదిత - యోగ విజ్ఞానం కూడా వేద కాలంలోనే రూపొందించబడింది. మనిషి శరీరంలో ఎన్ని నాడులు ఉంటాయి - ఏఏ నాడి పని తీరు ఎలా ఉంటుంది - ఏమి చేస్తే ఆయా అంగాల తీరుని మెరుగుపరచుకోవచ్చును - మనిషి తన ఆరోగ్యం కోసం ఏమి చేయాలి - ఇత్యాది విషయాలన్నీ యోగ శాస్త్రంలో నిబిడీకృతతం చేయబడ్డాయి. అవన్నీ కనిపెట్టడానికి ఇప్పటి వైద్య శాస్త్రానికి మరో వందేళ్ళ కాలం పట్టవచ్చు. ఇది అతిశయోక్తి కాదు - సంపూర్ణమైన నిజం. ప్రయోగాత్మకంగా నిరూపించబడిన సత్యం. ఎటువంటి స్వార్థం లేకుండా, కేవలం లోక క్షేమమే తమ పరమావధిగా తలచి మానవాళి మొత్తానికి ప్రాచీన ఋషి పుంగవులు అందించిన కల్తీ లేని, వ్యాపార ధృక్పదం లేని నిజమైన జ్ఞానం.

    భరధ్వాజుని వైమానిక శాస్త్రం - శుశ్రుతుని శస్త్ర విద్య పరిజ్ఞానం (ఆపరేషన్‌) - వరాహమిహిరుడు, ఆర్యభట్ట మొదలగు వారి ఖగోళ శాస్త్రం, భాస్కరుని లీలా గణితం (ప్రపంచంలో మొట్టమొదటి ఆల్జీబ్రా గణితం) - పాణిని వ్యాకరణ సూత్రాలు (మొట్టమొదటి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌), ప్రపంచానికే తలమానికమైన దశాంశ పద్దతి వాడుక, అంకెల్ని కనిపెట్టడం, సున్నాని కనిపెట్టడం - ప్రపంచంలో మొట్టమొదటి శాస్త్రీయమైన క్యాలండర్‌ రూపకల్పన - ఋతువుల విభజన - ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతు ఉండదు. ఇవన్నీ ఎందుకు - రెండేళ్ళ తరువాత గ్రహణం ఎప్పుడు వస్తుందో ఖగోళ శాస్త్రవేత్తని లేదా ప్లానిటేరియం వాళ్ళని అడిగి చూడండి - వాళ్ళు చెప్పలేరు. కాని ఎక్కడో రేలంగిలో ఉన్న తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారినో మరో ప్రఖ్యాత సిద్ధాంతి గారినో అడిగి చూడండి - ఖచ్చితంగా లెక్కలు వేసి - కూర్చున్న చోట నుండి లేవకుండా సమాధానం చెప్పగలరు. అది కూడా ఎలా - గ్రహణం ఏ రోజు, ఎన్ని ఘడియల - ఎన్ని విఘడియలకు మొదలవుతుంది - ఆ సమయంలో గ్రహ స్థితి ఏమిటి - ఎన్ని గంటల ఎన్ని నిముషాల పాటు ఆ గ్రహణం ఉంటుంది - దాని స్పర్శా కాలం ఎంత - సంపూర్ణ గ్రహణం ఎంత సేపు ఉంటుంది ఇలా పూర్తి వివరాల్ని సంపూర్ణంగా అందించగలరు. ఇంతటి అద్భుతమైన ఖగోళ పరిజ్ఞానం ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న ఏ ఒక్క సమాజానికి లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. పైగా ఇదంతా కూడా ఎటువంటి ఆధునిక పరికరాలు లేని (మనం అనుకుంటున్నాం- నిజమో కాదో తెలియదు) ప్రాచీన కాలంలోనే మన పూర్వీకులు వ్రాసి ఉంచిన శాస్త్రాల ఆధారంగా గణించి చెప్పినటువంటిది. అంటే ఖగోళ శాస్త్రంలో ఎంతటి అద్భుతమైన కృషి జరిగిందో ఇటే ఊహించవచ్చు.

    మిగతా మతాల్లో జ్ఞానం అనేది ఒక నిషిద్ధ ఫలం. జ్ఞానాన్ని తెలుసుకోవడం దేవుడిని ఎదిరించడమే. అందుకే ఆడమ్‌, ఈవ్‌లు సాతాను మాట విని నిషిద్ధ జ్ఞాన ఫలాన్ని తిని దేవుని శాపానికి గురయ్యారు. కాని వైదిక మతంలో జ్ఞానమే రాజమార్గం. భగవంతుడిని చేరడానికి భక్తి, యోగ, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లో జ్ఞానమార్గానిదే అగ్రస్థానం. జ్ఞానిగా మారినవారు దేవునికి ఇష్టులవుతారు. వారు ఎప్పటికైనా భగవంతునిలో ఐక్యమవుతారంటోంది వేదం. అలా నేను అనే అహంకారం నశించి, భగవంతునిలో ఐక్యమవ్వడమే మోక్షం.

    ఇప్పటి తరం దేన్నయితే నిజమైన అభివృద్ధిగా భ్రమపడుతుందో - ఏ ప్రకృతి వినాశనాన్ని వ్యాపారం అనుకుంటున్నదో - ఏ శారీరక మానసిక అనారోగ్యాన్ని నాగరికత అనుకుంటున్నదో అటువంటి ప్రయోగాలన్నీ దీర్ఘకాలంలో మనిషి మనుగడకు, తద్వారా ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. అందుచేత అటువంటి పరిజ్ఞానాన్ని ప్రాచీన కాలంలోనే సామాన్య ప్రజలకు అందకుండా చేశారు దీర్ఘదర్శులైన మన మహర్షులు.

    మరి ఇంతటి అద్భుతమైన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం ఉన్న భారతీయులు ఎందుకు మిగతా జాతులకి బానిసగా మారవలసి వచ్చింది. ప్రాచీన కాలంలో ప్రపంచానికే మార్గదర్శి అయిన భారత దేశం ఒక సామాన్య దేశంగా ఎందుకు మిగిలిపోయింది - భారతీయులంతా పర జాతికి తొత్తులుగా మారి వారు చెప్పిందే వేదంగా చెలామణీ అవుతూ  - వారి నాగరికత (?)ను అనుసరిస్తూ, అనుకరిస్తూ, తమ మూలాల్ని మరచిపోయి - ఒక నిస్సత్తువ జాతిగా మారి తమని తాము నిత్యం కించపరుచుకుంటూ - స్వార్థ పరంగా జీవిస్తున్నారు? వీటి గురించి నా తరువాతి పోస్టులో వివరిస్తాను.

అంత వరకు 'సర్వేజనా సుఖినోభవన్తు'.

Sunday, October 9, 2011

కె.సి.ఆర్‌.కి ఇంత రక్షణ అవసరమా?

ఈరోజు ఈనాడు పేపర్‌లో చూసాను. కె.సి.ఆర్‌.కి. ప్రభుత్వం ఒక బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్‌ ఇచ్చిందట. ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమం అంటూ ఉపన్యాసాలు దంచుతున్నారు కదా, వీరికి ఇటువంటి రక్షణ చర్యలు అవసరమా? వెధవ పనులు చేసే వాళ్ళకి, ఎవరితోనైనా విరోధం పెట్టుకునే వాళ్ళకి ఇటువంటి రక్షణ చర్యలు కావాలి గాని, 'ప్రజలతో మమేకమై' తిరిగే కె.సి.ఆర్‌.కి ఇటువంటివి అవసరమా? ఇంతటి ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు. రేపు నేను కూడా గోదావరి జిల్లాలు ప్రత్యేకంగా ఒక దేశంగా ఉండాలని ఉద్యమం లేవదీసి, నా ప్రజలకి లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొడితే, అపుడు కూడా ప్రభుత్వం నాకు కూడా ఇలాగే ప్రత్యేక రక్షణ కల్పిస్తుందా? తెలుసుకోవాలి.

    ఇపుడు జరుగుతున్న ఉద్యమం మనుషులు చేస్తున్న ఉద్యమంలా నాకు కనిపించడం లేదు. మీరెలా ఊహించుకున్నా నాకు అభ్యంతరం లేదు. అమాయకులైన ప్రజల్ని నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్న పెద్ద మనుషులు కూడా వారి బాధ్యతల్ని వదిలి ఉద్యమాల బాట పట్టి అందర్నీ ఇబ్బంది పెట్టడం సిగ్గుమాలిన చర్య. రోడ్ల మీద వంటలు వండుకు తినడం ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో చూసి ఉండం. ఆ సమయంలో ఎంత మంది ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉండి ప్రయాణంలో ఉండి ఉంటారో ఊహించలేం. అలా ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వారిలో ఒక నిండు గర్భిణీ ఉండొచ్చు, ఒక పసిపాప ఆహారం, మంచి నీళ్ళు లేక విలవిలలాడిపోవచ్చు, ఒక రోగి వైద్యం అందక నరకయాత పడుతూండవచ్చు. ఇవన్నీ ఎ.సి. రూముల్లో కూర్చున్న పెద్దమనుషులకి పట్టదు. వారికి కావాలిసింది వారి పదవి మాత్రమే. సిగ్గు లేకపోతే పోయే, కనీసం మానవత్వం ఉండనక్కర్లేదా? మనకెలాగూ చదువు లేదాయే. కూలి పని చేసుకునే వాడైనా తన పిల్లల్ని మంచి చదువు చదివించి, ప్రయోజకుడిని చేద్దామనుకుంటాడు. కాని, తెలంగాణా ప్రాంతంలో మాత్రం పిల్లల్ని బడులు మాన్పించి, ఉద్యమాలకి వారి చదువుల్ని ఆహుతి చేస్తున్నారు. వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. 

    రైల్‌ రోకోలంటూ రైలు పట్టాల మీద కూర్చుంటున్నారు. సరైన నాయకుడు ఒక్కడు ఉండి మీద నుండి రైలు నడిపితే, పట్టాల మీద ఒక్కడైనా కూర్చుని ఉంటాడా? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ ఉద్యమం సామాన్యులని కూడా తప్పుదోవ పట్టిస్తోంది. పని చేయకుండా జీతాలు అడగడం ఎంత వరకు సబబు? అంటే ఒక ఉద్యమం పేరుచెప్పి పని ఎగ్గొట్టినా, డబ్బులు మాత్రం లోటు ఉండకూడదు. ఆఖరికి సింగరేణి కార్మికుల్ని కూడా రెచ్చగొట్టి, రాష్ట్రంలో మంచి సీజనులో కరెంటు కష్టాలకి కారణమయ్యారు. రాజకీయంగా ఉద్యమం ఎలాగైనా చెయ్యొచ్చు. కాని ఇలా బరి తెగించి, ప్రజలకి నిత్యావసరాలు కూడా అందకుండా చేసే వాళ్ళని ఏమనాలి? ఏ పేరుతో పిలవాలి? కరెంట్‌ లేక ఎన్నో పరిశ్రమలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇళ్ళల్లో పిల్లలు, వృద్ధులు విలవిలలాడిపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యవసర ఆపరేషన్లని బ్యాటరీ లైట్ల వెలుగులో చేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది ఒకటుందా అని అనుమానం వేస్తుంది ఇదంతా చూస్తుంటే...

    ఇంత ఉద్యమం నడుపుతున్న పెద్దమనుషులకి అసలు తెలంగాణా అభివృద్ధి గురించి ఒక బ్లూ ప్రింట్‌ అంటూ ఉందా? ఏ ఏ రంగాల్లో ఎలా అభివృద్ధి సాధించాలో ఒక అవగాహన ఉందా? కేవలం రాజకీయ పదవుల కోసం పోరాటమేనా? ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. నిజంగా అభివృద్ధి మీద అంత మమకారం ఉంటే, కె.సి.ఆర్‌.ని గాని, కోదండరాంని గాని ఒక్క తెలంగాణా పల్లెని అభివృద్ధి చెయ్యమనండి. చూద్దాం. ప్రతీ పనిలోను కమీషన్లకి కక్కుర్తిపడే రాజకీయ నాయకులు, లంచం కోసం చేతులు చాచే అధికారులు ఉన్నంత కాలం అభివృద్ధి అనేది వట్టి మాట మాత్రమే. తెలంగాణా పేరు చెప్పి, చందాలు వసూలు చేసి, ఎంతో మంది నాయకులు కోట్లకు పడగలెత్తారు. అది మన కళ్ళ ముందున్న నిజం. వారిలో ఎవరైనా ప్రజల కోసం నిజంగా ఏదైనా చేసారా? చెప్పమనండి.

    తెలంగాణా వెనుకబడిన ప్రాంతమే. కాదనడం లేదు. ఆ మాట కొస్తే దేశం మొత్తం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉందిగాని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతుంది? ప్రజల జీవన ప్రమాణాలు మారినపుడే దానిని అభివృద్ధి అంటారు. అంతే గాని ఒక ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని, పదవులు పంచుకుంటే దానిని అభివృద్ధి అనరు. పైగా ప్రజల మీద భారం రెట్టింపు అవుతుంది. ఏర్పడే రాష్ట్రం యొక్క మంత్రులు, రాజకీయ నాయకులు, వారి జీతాలు, భత్యాలు, రక్షణ వంటి ఖర్చులు తడిసి మోపెడవుతాయి. అటువంటి భారాన్ని తట్టుకునే స్థితిలో రాష్ట్రం లేదు. దానికన్నా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, వారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. అదే సమయంలో కుటిల నాయకులు చేసే దుష్ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలి. అటువంటి రాజకీయ విషపురుగుల్ని ఏరిపారేయాలి. ఆ సందర్భంలో ఎవరి వత్తిళ్ళకు తలొగ్గకూడదు. ఏ ప్రభుత్వం ఇలా చేస్తుందో, చేయగలదో, ఆ ప్రభుత్వం, ఆ నాయకులు చరిత్రలో ధీరోధాత్తులుగా మిగిలిపోతారు. అంతే గాని ఏ పనీ చేయకుండా, దేవుడి మీద భారం వేసి, మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే, చరిత్ర హీనులుగా మారటం తథ్యం.

Friday, October 7, 2011

స్పూర్తినిచ్చిన స్టీవ్ జాబ్స్‌కి అశ్రు నివాళి...

స్టీవ్‌ జాబ్స్‌....

ఎల్లలెరుగని సృజనశీలి.

మ్యాక్‌ ప్రపంచపు మహారాజు



    కంప్యూటర్‌తో నా మొదటి అనుబంధం, పరిచయం ఆపిల్‌ మ్యాక్‌లతోనే మొదలయ్యింది. నాన్నగారి చెయ్యి పట్టుకుని, విజయవాడలోని ఒక ప్రెస్‌లో మొదటి సారి కంప్యూటర్‌పై డిజైన్‌ చేయడం చూసాను. అది మ్యాక్‌ -2 కంప్యూటర్‌. అప్పట్లో అది ఒక అద్భుతం. కొంత కాలం తరువాత మా ప్రెస్‌లో మొదటి కంప్యూటర్‌ వచ్చింది. అప్పట్లో అదో పెద్ద అద్భుతం. అదో పెద్ద పండుగ. సింగపూర్‌ నుండి ఇంపోర్ట్‌ చేసిన కంప్యూటర్‌ కావడంతో మా ఆఫీస్‌ అంతా కంప్యూటర్‌ చూడడానికి వచ్చిన వారితో నిండిపోయేది. అది మ్యాక్‌ ఎల్‌.సి.-2. 4 మెగాబైట్ల ర్యామ్‌, 16 మెగాహెర్జ్‌ స్పీడ్‌, మ్యాక్‌ ఓఎస్‌.4.0, హార్డ్‌డిస్క్‌ స్పేస్‌ 40 మెగాబైట్స్‌. ఆ కంప్యూటర్‌పైన డిజైన్‌చేస్తుంటే అంతా నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూసేవారు. ఒక పెద్దాయన అయితే ఉండబట్టలేక అడిగేసాడు. ''ఏమండీ, ఆ టి.వి.(మోనిటర్‌)లో ఎగురుతున్నదేమిటి? అది ఈగా?'' అని. అప్పటికి గ్రాఫిక్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ లేదు. విండోస్‌ ఇంకా నడకలు నేర్చుకుంటుంది. విండోస్‌ వైపు చూస్తే చాలు... కడుపులో దేవినట్లుండేది. ఎందుకంటే మా చేతిలో అద్భుతమైన 'మౌస్‌' ఉంది. దానితో మేము ఏదైనా చేసే వాళ్ళం. గేమ్స్‌ ఆడుకోవడం, పాటలు వినడం, మొదటి సి.డి. డ్రైవ్‌, మొదటి సారిగా కంప్యూటర్‌లో సినిమాలు చూడడం, మొదటి ల్యాప్‌టాప్‌ అనుభవం, మొదటి సారి టచ్‌ప్యాడ్‌పై మౌస్‌ అడించడం, .... అన్నీ మ్యాక్‌లోనే. ఇప్పటికీ బాగా హైఎండ్‌, హై డెఫినిషన్‌లో యానిమేషన్‌ చేయాలంటే, మ్యాక్‌ కంప్యూటర్లే గతి. ఇంతటి అద్భుతమైన ప్రపంచం సృష్టికర్త, సృజనశీలి... స్టీవ్‌ జాబ్స్‌.

    నిజానికి యాపిల్‌ మ్యాక్‌ లేకపోతే బిల్‌గేట్స్‌కి అనుకరించడానికి ఏదీ లేకపోయేది అనే నానుడి అక్షరాలా నిజం. ఇప్పటికీ ముందు మ్యాక్‌ ఒ.ఎస్‌. రిలీజ్‌ అయిన తరువాత మాత్రమే అందులో ఉన్న అన్నీ కాకపోయినా, కనీసం కొన్నయినా, విండోస్‌లో ఉండితీరుతాయి. కావాలంటే గమనించి చూడండి. అలాగే మ్యాక్‌ ఒ.ఎస్‌. ముందు బయటకు వచ్చిన తరువాత మాత్రమే విండోస్‌ రిలీజ్‌ పెట్టుకుంటారు. అంతటి అద్భుతంగా ఉంటాయి మ్యాక్‌ ఆపరేటింగ్‌ & అప్లికేషన్లు. అలాగే అడోబ్‌ వంటి పెద్ద కంపెనీలు ముందుగా తమ అప్లికేషన్లు యాపిల్‌ మ్యాక్‌కు రిలీజ్‌ చేస్తాయి. తరువాత మాత్రమే విండోస్‌కు తయారుచేస్తాయి.

    ఏదేమైనా మ్యాక్‌ అనేది ఒక అద్భుత ప్రపంచం. అదొక ఎడిక్షన్‌. ఒకసారి మ్యాక్‌పై అలవాటు అయితే ఇక మరే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రుచించదు. ఒకసారి ఆ గ్రాఫిక్స్‌కు అలవాటు పడితే... 'రాజుని చూసిన కళ్లతో..' అనే సామెత గుర్తుకొస్తుంది. ఎక్కడైనా కంప్యూటర్‌ స్టోర్‌కి వెళితే ముందు నా కళ్ళు ఆపిల్‌ గురించి వెతుకుతాయి.  మొదటి సారి కంప్యూటర్‌ చూసిన అనుభూతి నుండి.. మొదటి సారి ఐఫోన్‌ టచ్‌ చేసిన ఫీలింగ్‌ వరకు ఏదైనా యాపిల్‌ మయమే. ఆ ప్రతి ఆవిష్కరణ వెనుక ఉన్న అత్యున్నత మేథస్సు గురించి నేనెప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఆ ప్రతిభా సంపన్నుడు స్టీవ్‌ జాబ్స్‌ మాత్రమే. ప్రతి సంవత్సరం కాలిఫోర్నియాలో జరిగే ఆపిల్‌ షోలో జరిగే కొత్త ఆవిష్కరణల కోసం నేనెప్పుడూ ఎదురుచూస్తూంటాను. అందులో జాబ్స్‌ మాట్లాడే ప్రతి మాటను నేను రికార్డ్‌ చేసుకుంటాను. తను సృజించిన ఆ కొత్త ఉత్పత్తి గురించి, జాబ్స్‌ వివరిస్తున్నపుడు ఆ కళ్ళలో కనిపించే మెరుపు, ఆ గొంతులో తారాడే చిన్నపాటి గర్వం... నాకెంతో స్ఫూర్తి నిస్తాయి. మ్యాక్‌, ఐఫోన్‌ ఉన్నంత కాలం ఆయన మన మధ్య బ్రతికే ఉంటారు..

యాపిల్ కంపెనీ తన వెబ్‌సైట్లో వుంచిన విచార సందేశంలో ఇలా పేర్కొంది... అది అక్షరాలా నిజం... 
Apple has lost visionary and creative genius, and the world has lost an amazing human being. Those of us who have been fortunate enough to know and work with Steve have lost a dear friend and an inspiring mentor. Steve leaves behind a company that only he could have built, and his spirit will forever be the foundation of Apple.

ఆ సృజనశీలికి...

ఆ నిరంతర కృషీవలునికి...

ఆ అద్భుత ఆవిష్కరణ కర్తకీ...



నా హృదయపూర్వక అశ్రు నివాళి.....

Monday, August 22, 2011

డబ్బెవరికి చేదు? అందుకే మీ కోసం చిన్న మొత్తం (రోజుకి 10-20 డాలర్లు) సంపాదించే మార్గం....

యాడ్స్ చూస్తే డబ్బులిస్తారని ఇప్పుడే ఒక స్నేహితుడి దగ్గర నుండి మెయిల్ వచ్చింది. ఇదేదో బాగానే వుంది కదాని నేను కూడా నొక్కి చూసాను... ఇందులో జాయిన్ అవ్వడం కూడా పూర్తిగా వుచితం. చిన్న మొత్తమేమీ కాదు.. ఒక  సారి క్లిక్ చేసి, 30 సెకండ్లపాటు ఆ యాడ్ చూసి, వాడు ఆడిగిన నెంబర్ మీద క్లిక్ చేస్తే చాలు మన ఖాతాలో రెండు డాలర్ల నుండి నాలుగు డాలర్ల వరకు జమవుతుంది... సరాసరిగా రోజుకి 4 నుండి 12 యాడ్స్ వరకు వస్తున్నాయి. ఇప్పటికి 250 డాలర్లు నా ఖాతాలో జమయ్యాయి. 1000 డాలర్లు పోగయ్యక అప్పుడు ఒకేసారి మన paypal account లోకి ఆ మొత్తాన్ని పంపిస్తామని websiteలో రాసి వుంది.. వాళ్ళెంతవరకు నిజంగా ఇస్తారో లేదో తెలీదు కాని మన ఖాతాలో రోజూ 10-20 డాలర్ల చొప్పున పెరుగుతూ వుంటే అదో ఆనందం... మీరు కూడా ట్రై చేసి చూడండి... మీకు కూడా డబ్బు వస్తే ఆనందం... ఒక వేళ రాకపోతే నన్ను ఆడక్కండే.... ఇక్కడున్న link మీద నొక్కండి... మీ వివరాలు టైప్ చేసి లాగిన్ అవ్వండి... Best of Luck.

Sunday, August 21, 2011

అవినీతిపై పోరాడితే చాలదు.... ఇంకా చెయ్యాల్సింది చాలా వుంది..

అవినీతిపై అన్నా హజారే సంధించిన దీక్షాస్త్రం - కోట్లాది భారతీయుల గుండె గొంతుకులను ప్రతిబింబించింది. ఈ పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా అన్నా అభివర్ణించడాన్ని ఎవరూ తప్పుబట్టలేరు. ఎందుకంటే 1947లో మనకు రాజకీయ స్వాతంత్య్రం లభించిననాటి నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి చూసుకుంటే - మిగతా దేశాలతో పోల్చిచూసుకుంటే అది అసలు అభివృద్ధే కాదు. ఇంకా సామాన్య ప్రజల జీవితాలు అలా సామాన్యంగానే ఉండిపోయాయి. మౌలిక సదుపాయాల కల్పన కూడా - అంటే సరైన రోడ్లు, తాగడానికి మంచినీరు, నాణ్యమైన విద్యుత్తు వంటి అనేక అవసరాలు దేశంలో అధిక శాతం మందికి అందుబాటులో లేవు. నేడు దేశం ఉన్న ఈ దుస్థితికి అవినీతి మాత్రమే సంపూర్ణ బాధ్యత వహించాలి. దేశంలో సహజవనరులకు గాని, మేధో వనరులకి గాని, శ్రామిక వనరులకి గాని ఏలోటు లేదు. అయితే ఈ వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. సృష్టించబడిన సంపద అంతా కేవలం కొద్దిమంది చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతోంది. నిజమైన కష్టం పడే సామాన్యుడికి, మధ్య తరగతి జీవులకు ఎటువంటి  అదనపు సౌకర్యాలు అందడం లేదు. అన్నా చెప్పిన మాటల్లోని ఆంతర్యం ఇదే. అవినీతి వటవృక్షానికి మూల స్థంభాలు అధికారాన్ని చెలాయిస్తున్న రాజకీయ నాయకులు, అధికార గణం - వారి అనుచర - బంధు గణాలు మాత్రమే.   జనలోక్‌పాల్‌ బిల్లుతో అవినీతిని అరకట్టగలమా - అంటే దానికి పూర్తిగా కాదు అనే సమాధానమే వస్తుంది. అది అందరికీ తెలిసిన సత్యమే - కాని 'చీకటిని తిడుతూ కూర్చునే కంటే - చిరుదీపం వెలిగించాలి' అన్నట్లుగా ఎవరూ చేయలేని పనిని 77 ఏళ్ళ ఒక 'యువకుడు' సాధించబూనడం, పోరాటపటిమతో ముందుకు నడవడం చూసి, దేశంలో యువత అంతా 'మీ వెనుక మేమున్నాం' అంటూ కదం తొక్కుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే అసలు అవినీతికి మూల కారణాలేమిటి? అని ఆలోచిస్తే సందర్భోచితంగా ఉంటుంది.

1. రాజకీయ కారణాలు: అవినీతికి మూల కారణాలు మన దేశ చరిత్రలోనే ఉన్నాయి. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిందని అందరూ అనుకుంటూ ఉంటారు. కాని అప్పుడు మనకు లభించింది కేవలం రాజకీయ - అధికార మార్పిడి మాత్రమే. భారతదేశాన్ని కొల్లగొట్టడానికి బ్రిటీష్‌ తెల్ల దొరలు చేసుకున్న చట్టాల్నే - భారతీయుల్ని ఇబ్బందుల పాలు చేయడానికి వారు తయారు చేసిన శిక్షాస్మృతుల్నే మనం యధాతథంగానో, కొద్ది పాటి మార్పులతోనే మన నల్ల దొరలు కూడా అనుసరిస్తున్నారు. మన దేశం యొక్క సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగిన విధంగా పరిపాలనా విధానాన్ని, అధికార యంత్రాంగాన్ని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.

    దానికి  తోడు భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలోనే మొదటి అవినీతి ఘట్టం వెలుగుచూసి, పార్లమెంటును కుదిపేసింది. దీనిని వెలుగులోకి తీసుకువచ్చింది కూడా ఆయన అల్లుడు, ఇందిరా గాంధీ భర్త అయిన ఫిరోజ్‌ గాంధీయే. భారతీయ సైన్యానికి జీపులు కొనుగోలు చేసినపుడు భారీస్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి కారణం - మన మొదటి ప్రధానమంత్రి - మంత్రివర్గానికే భారతదేశం పట్ల ప్రేమ లేకపోవడం. దానికితోడు మన దేశానికి స్వాతంత్య్రం పోరాటం ద్వారా వచ్చి ఉంటే ఆ కసి, పట్టుదల వేరే విధంగా ఉండేవి. ఒక సమాన్యుడు నాయకుడు అయి ఉంటే - జనం బాధ ఆయనకు తెలిసేది. ఒక ఫ్రెంచి విప్లవం కానివ్వండి - ఒక రష్యన్‌ విప్లవం కానివ్వండి - ఒక జపాన్‌ పునర్నిర్మాణం కానివ్వండి - ఇవన్నీ ప్రజల కష్టాల నుండి, వారి బాధల నుండి పుట్టాయి - జనంలోంచి వచ్చిన నాయకుల్ని తయారు చేసాయి. వారి దేశాలను ఆ స్థాయిలో నిలబెట్టాయి. కాని, పుట్టుకతోనే ఒక కోటీశ్వరుడిని - వ్యసనపరుడిని - స్త్రీలోలుడిని దేశ ప్రధాన మంత్రిగా చేయడం వల్ల సామాన్యుల బాధలు ఆయనకు తెలియకుండా పోయాయి. మనకు 1947లో జరిగింది అధికార మార్పిడి మాత్రమే - నిజమైన స్వాతంత్య్రం కాదు.

    మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే - చట్టసభలకు పోటీ చేసే వ్యక్తుల విషయంలో ఎటువంటి నిబంధనలు లేకపోవడం. అప్పట్లో గాంధీగారి మాట విని చదువులు మాని, స్వాతంత్య్ర పోరాటంలో అందరూ పాల్గొన్నారు కాబట్టి, నాయకుల విద్యాస్థాయి విషయంలో ఎటువంటి నిబంధలు విధించలేదు అంటారు. కాని వాస్తవం పరిశీలిస్తే ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిలో ఎంతో మంది విద్యాధికులు ఉన్నారు. కేవలం పరిపాలన విషయంలో అటువంటి వారు అడ్డం కాకూడదని, - మనం చెప్పినట్టు వినే అలగా జనం, పామర జనం అయితే మన అధికారానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని, రాజ్యాంగ తయారీలోనే అటువంటి నిబంధనను కావాలనే నెహ్రూ ప్రభుత్వం చేర్చలేదని సులభంగా గ్రహించవచ్చు. మరొక ముఖ్యమైన నిబంధన - రాజకీయాల్లో ఉండే వ్యక్తి ఎన్ని సంవత్సరాలైనా అదే పదవిని పట్టుకుని వేళ్లాడవచ్చు. అది కూడా నెహ్రూ తనకు అనుకూలంగా చేసుకున్న చట్టమే - అదే అమెరికాలో అధ్యక్ష పదవికి కేవలం రెండు సార్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది. అధ్యక్షుడు ఎంత సమర్థుడైనప్పటికి మూడో అవకాశం ఇవ్వరు. కొత్త నీరు రావాల్సిందే - కొత్త ఆలోచనలు ఉరకలెత్తవలసిందే - అప్పుడే దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి అవకాశం లభిస్తుంది. ఒళ్ళంతా రోగాలు పెట్టుకుని, సరిగా నడవలేని, కళ్లు కూడా సరిగా కనబడని వారు కూడా ఈనాడు మన నాయకులే - ఎంత దౌర్భాగ్యం? ఈ నిబంధనల వల్లే అధికారం - పదవి అనేది ఒక ఇంటి వారసత్వంగా మారిపోయింది. లేకపోతే ఇంత పెద్ద దేశంలో మనకు యువ నాయకులే లేకుండా పోయారా? ఉన్నారు - కాని యువతకు అవకాశం ఇవ్వకుండా, ముసలివాళ్ళే ఎప్పటికీ అధికారంలో ఉంటే ఇక యువతకు రాజకీయాల్లో పాల్గొనాలనే ఆసక్తి ఎందుకుంటుంది?

2. సామాజిక మార్పులు: అవినీతికి మరో ముఖ్య కారణం - మనలో ఈ దేశం మనది అనే భావన లేకపోవడం. భారత దేశ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న హిందువులు - కొన్ని వందల సంవత్సరాలుగా ఇతరుల చేతిలో దోపిడీకి గురవుతూనే ఉన్నారు. 13వ శతాబ్ది నుండి ముస్లింలు, 17 శతాబ్ది నుండి క్రైస్తవుల చేతిలో దేశం పూర్తి దోపిడీకి గురయ్యింది. దాని వల్ల ఆర్థిక అభద్రతాభావం భారతీయులలో పేరుకుపోయింది. అది వారి అలవాట్లలో గమనించవచ్చు. దొరికినప్పుడే ఎక్కువ తినేసి - తిండి లేనపుడు పస్తు పడుకోవడం అనే భావన భారతీయుల్లో అంతర్లీనంగా ఉంది. అదే భావనతో అవకాశం దొరికినపుడే దోపిడీకి బరితెగిస్తున్నారు. తమకు అవసరం ఉన్నా లేకపోయినా వేల - లక్షల కోట్ల రూపాయిలు దోచేస్తున్నారు. దీనికి సరైన విద్యావకాశాలు లేకపోవడం కూడా ఒక కారణం - ముందు భారతీయులందరినీ కుల, మత, భాషా బేధం లేకుండా చైతన్య పరచగలగాలి. వక్రీకరించబడిన చరిత్ర కాకుండా, ఉన్నదున్నట్లుగా చరిత్రను భారతీయుల ముందు ఉంచాలి. మన శక్తి మనకు తెలిసేలా - దేశం పట్ల, తోటి సమాజం పట్ల బాధ్యత తెలిసేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. భూకంపం, సునామీ వంటి దారుణమైన విపత్తులు వచ్చినపుడు కూడా క్యూలో నుంచుని, రేషన్‌ తీసుకున్న జపాన్‌ సమాజం మనకు ఆదర్శం కావాలి. వారి క్రమశిక్షణ మనకు స్ఫూర్తిని కలిగించాలి. ఎదుటి వాడిది ఏ విధంగానైనా కాజేయాలనే స్వార్థమే అవినీతికి మూల కారణం.

3. చట్టాల్లో మార్పులు: అన్నా హజారే కోరుతున్నదీ ఇదే. గ్రామ సర్పంచ్‌ దగ్గర్నుండి - ప్రధాన మంత్రి వరకు అవినీతికి పాల్పడే వ్యక్తి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే - వారు కఠినంగా శిక్షించబడాలి. ధన సంపాదనకు రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఒక మార్గం కాదని అందరూ గ్రహించాలి. అవి ప్రజలకు సేవ చేయడానికి లభించే అవకాశంగా తెలియరావాలి. ప్రజలకు మంచి చేయాలి తప్పితే వారి సొమ్మును కొల్లగొడదామనుకుంటే చట్టం చూస్తూ ఊరుకోదనే భావన సమాజంలో కల్గించాలి. వీటితో పాటుగా కుల సంఘాలని రద్దు చేయాలి, ప్రాంతీయవాదాల్ని మొగ్గలోనే తుంచేయాలి. మతం పేరు చెప్పి విధ్వంసం సృష్టించేవారిని నామరూపాలు లేకుండా చేయాలి. నేతలతో పాటుగా దేశ సమగ్రతకు ముప్పు తెచ్చే ప్రతీ ప్రాంతీయ శక్తిని, కుల, మత శక్తుల్ని అదుపులోకి తీసుకుని కఠిన శిక్షలు విధించాలి. అప్పుడే అవినీతి సమూలంగా అంతమవుతుంది.

    అన్నా చెప్పిట్లుగా ఇది నిజంగా రెండో స్వాతంత్య్ర సంగ్రామమే. దేశ రాజకీయ, అధికార, సామాజిక, ఆర్థిక రంగాల్లో, ప్రజల మనస్తత్వాలలో సమూల ప్రక్షాళన జరగవలసిన సమయం ఆసన్నమయింది. 77 ఏళ్ల యువకుడు నడిపిస్తున్న ఈ పోరాటానికి మద్దతు తెలపవలసిన నైతిక బాధ్యత మనందరి పైనా ఉంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అని హజారే అన్నట్లుగా ఇదొక సువర్ణావకాశం - జారవిడుచుకుంటే మళ్లీ రాదు. అందుకే - జై అన్నా హజారే.

Friday, July 22, 2011

కార్పొరేట్‌ కాలేజీలు - కోళ్ళ ఫారాలు - ఒక పోలిక

జనాలకి చదువు మీద మోజు పెరిగిందో లేక కార్పొరేట్లకి చదువు చెప్పాలని బుద్ది పుట్టిందో తెలీదు కాని, రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా కార్పొరేట్‌ సూల్స్‌, కాలేజీలు తామర తంపరగా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఈ జాడ్యం దేశం మొత్తం మీద ఆంధ్రరాష్ట్రంలో ఎక్కువగా ఉందంటే అతిశయోక్తి కాదు. అసలే మనం ఆంధ్రులం - అందులోను ఆరంభశూరులం. ఏ పనైనా మొదలంటూ పెట్టం - మూడ్‌ వచ్చి మొదలు పెడితే మాత్రం అందరూ ఒకే పని చేస్తాం. ఒకేసారి కొన్ని వందల స్కూల్స్‌, కాలేజీలు స్థాపిస్తాం. ఒకేసారి కొన్ని పదుల ప్రాజెక్టులు మొదలుపెట్టేస్తాం - అవి పూర్తయినా అవ్వకపోయినా మనకనవసరం. సక్సెస్‌ అయినా కాకపోయినా పట్టించుకోం. ఎదుటి వాడు చేసాడు కాబట్టి మనం కూడా చేసెయ్యాలి - అంతే... ఎదురింటి వాడి కొడుకు డాక్టరో - ఇంజినీరో అయ్యాడు కాబట్టి మనం కూడా మన పిల్లల్ని ఇంజినీర్‌ చేసేయాలి. మన తెగులు ఇలా తగులడింది కాబట్టే - ఒక ప్రఖ్యాత కార్పొరేట్‌ స్కూల్‌ మంచి క్యాప్షన్‌ పెట్టింది - అందరికీ కనబడేలా - హోర్డింగ్‌ల్లో - ''మా స్కూల్లో వేసే ప్రతి అడుగు - ప్రతి అడుగు ఐ.ఐ.టి / మెడిసిన్‌వైపు మాత్రమే '' అంటూ ఊదరగొట్టి పాడేస్తున్నారు. పిల్లలు ఏమయి పోయినా పర్లేదు - వారికి డాక్టర్‌ అవ్వాలని లేకపోయినా - ఆరోగ్యం నాశనమయిపోయినా - జీవితం మీద విరక్తి పుట్టినా - చివరికి ఆత్మహత్య చేసుకున్నా - వాళ్ళు ఇంజినీరో, డాక్టరో అయిపోవాల్సిందే. మనం అప్పులు చేసయినా సరే వాళ్ళని కార్పొరేట్‌ స్కూల్లో చేర్పించాల్సిందే..

   ఇదంతా ఎప్పుడూ చెప్పుకునేదే కాని - విద్య కూడా వ్యాపారమయిపోయిన తరువాత ఈ విద్యా వ్యాపారస్తులు పవిత్ర విద్యాసంస్థల్ని ఎలా తయారు చేసారో తలుచుకుంటే మనసుకి బాధ కలుగుతుంది. ఒకప్పుడు కాలేజ్‌ అంటే విశాలమైన ప్రాంగణం -  చుట్టూ పచ్చటి చెట్లు - ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్‌ - ఎన్ని ఉండేవని... అవన్నీ గత కాలపు హిమసమూహాలు... ఇప్పుడన్నీ కోళ్ళ ఫారాలే... అందుకే సరదాగా - కోళ్ళఫారాలకి - కార్పొరేట్‌ కాలేజీలకి చిన్నపోలిక...


1. కోళ్ళ ఫారం పెట్టడానికి చిన్న షెడ్‌ ఉంటే చాలు - చుట్టూ గ్రౌండ్‌ కూడా అక్కర్లేదు. కాలేజ్‌కి కూడా అదే షెడ్‌ సరిపోతుంది.

2. ఒకో వరుసలో దగ్గర దగ్గరగా ఎన్ని కోళ్ళయినా సర్దవచ్చు. అవి అటూ ఇటూ తిరగడానికి కూడా స్థలం అవసరం లేదు - కాలేజ్‌లో కూడా అంతే... చదవడం తప్ప వేరే పనేముంటుంది తప్ప? అందుకే ఒక సెక్షన్‌లో ఎంతమందినయినా దగ్గరగా ఇరికించి కూర్చోబెట్టవచ్చు.

3. కోళ్ళు గుడ్లు పెడితే మంచి లాభం - పిల్లలు ఎన్ని ర్యాంకులు పెడితే కాలేజీకి అంత లాభం.

4. గుడ్లు పెట్టిన తరువాత కోళ్ళని కూడా అమ్మేసుకోవచ్చు - ర్యాంకులు వచ్చిన తరువాత పిల్లల్ని వేరే కాలేజీలకి కమీషన్‌ పద్దతిని అమ్ముకోవచ్చు.

5. కోడి గుడ్డు పెట్టిందా లేదా అనేది ముఖ్యం గాని - దాని మనసుతో మనకి పనేముంది? - పిల్లలకి ర్యాంక్‌ వచ్చిందా లేదా అన్నది ముఖ్యంగాని వాళ్ళు ఎలా పోతే మనకేం?

6. ఎక్కువ గుడ్లు పెట్టాలి అంటే కోళ్ళకి రోజూ 24 గంటలూ తిండి పెడుతూనే ఉండాలి. దానికి టైమూ పాడు అక్కర్లేదు - పిల్లలకి మంచి ర్యాంకు రావాలంటే 24 గంటలూ బండబట్టీ పట్టిస్తూనే ఉండాలి. దానికి టైమ్‌ టేబుల్‌ అంటూ ఏదీ ఉండదు. నిద్ర వస్తున్నా - ఆకలేస్తున్నా - నీరసంగా ఉన్నా - చదువుతూనే ఉండాలి. కనీసం చదివినట్టు నటించాలి.



ఇవండీ... ఇంకా చాలా ఉండొచ్చు. మీకేమైనా గుర్తొస్తే మా అందరితోను పంచుకోండి...

Thursday, July 14, 2011

ఈ మౌనం - అత్యంత ప్రమాదకరం

    దేశ ఆర్థిక రాజధానిపై ఉగ్రవాద రాక్షస మూకల దాడుల పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి. జూలై 13వ తేదీన సంభవించిన పేలుళ్ళు కేవలం పాత ఘటనలకు కొనసాగింపు మాత్రమే. ఇంకా ఇటువంటి అకృత్యాలు ఎన్నో చూడాల్సి రావచ్చు. అది ముంబయిలో కావచ్చు, హైదరాబాద్‌లో కావచ్చు, మరెక్కడైనా కావచ్చు. కాని బలయ్యేది అమాయక ప్రజలు మాత్రమే. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు మీడియా వాళ్ళకి పండగే పండగ. చూపించిందే చూపించి, చెప్పిందే చెప్పి, జనాల్ని భయపెడుతూ ఉంటారు. న్యూయార్క్‌ నగరంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి జరిగినపుడు కూడా విమానాలు భవనాల్ని కూల్చివేయడం మీడియాలో వచ్చిందే తప్ప, అక్కడ చనిపోయిన వారి మృతదేహాల్ని క్లోజప్‌లో చూపించి, భయపెట్టినట్లు గుర్తులేదు. కాని మన మీడియాలో మాత్రం పొద్దున్నే లేచి ఏ పేపర్‌ తిరగేసినా ముందు పేజీలో భారీ సైజులో రక్తసిక్తం చేసిపారేసారు. మీడియా కొంచెం సంయమనం పాటిస్తే బాగుండును.

    ఎప్పటిలాగే పేలుళ్ళు జరిగిన వెంటనే ప్రధాని, కేంద్ర రక్షణ మంత్రి - మహారాష్ట్ర సిఎంతో ఫోన్‌లో మాట్లాడేసారు. హోంమంత్రిగారు ఇది ఉగ్రవాదుల దుశ్చర్య అని శెలవిచ్చారు. ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలు ఇది దురదృష్టకర సంఘటన అంటూ తీవ్రంగా ఖండించేసారు (దేనితో ఖండించారో నాక్కూడా తెలియదు). కాని ఎవరి నోటి వెంటా కూడా ఈ చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదుల్ని వెంటనే ఏరిపారేస్తాం (విచారణ లేకుండా) అని మాత్రం అనడం లేదు. బిన్‌లాడెన్‌ విషయంలో అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ప్రపంచానికి మార్గదర్శనం కావాలి. విచారణ మాట దేవుడెరుగు. దొరికిన వాడిని దొరికినట్టే చంపి పారేసింది.కనీసం మృతదేహం కనిపించకుండా మహాసముద్రంలో విసిరిపారేసింది. అలా చేస్తే మరొకడు భయపడతాడు గాని, చేతికి దొరికిన నిందితుల్ని కూడా విచారణ పేరు చెప్పి శిక్షించకుండా కాలయాపన చేయడం ప్రమాదకర సంకేతాల్ని సమాజానికి పంపిస్తుంది. అదే తప్పు మరోసారి పునరావృతమయ్యేలా  చేస్తుంది.

    ఆకలి కోసం ఒక చిన్న దొంగతనానికి పాల్పడితే అందరం కలిసి, చావచితక్కొట్టేస్తాం - అంతెందుకు - కొంచెం రక్తం తాగిన పాపానికి దోమని ఒక్క దెబ్బతో చంపిపాడేస్తాం. అంతే గాని పాపం దోమ - జీవకారుణ్యం -దానికేమీ తెలీదు - దోమకి ఆహారం పెడదాం అని ఎవరమైనా ఆలోచిస్తామా? అలాంటిది అమాయకులైన సాటి మనుషుల నిండు ప్రాణాన్ని కిరాతకంగా బలిగొంటున్న వారికి శిక్ష వెయ్యనక్కర్లేదా? ప్రత్యేక రాష్ట్రాలు కావాలి అంటూ రోడ్లెక్కే నేతలు ఇలాంటి నరరూప రాక్షసుల ప్రాణాలు తీయండి అంటూ నినాదాలు ఎందుకు చేయరు? ఎందుకంటే - వారికి ఓట్ల బ్యాంకు కావాలి కాబట్టి - ఒక వర్గం వారి సానుభూతి కావాలి కాబట్టి. మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు - దేశ ప్రజలు మాత్రం సంయమనం పాటించాలి. జరిగినదంతా పీడకలలా మర్చిపోవాలి. ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ చేస్తుంది. దోషులు పాకిస్థాన్‌లో ఉన్నారని తేలుతుంది. తప్పితే హైదరాబాద్‌లో హాయిగా ఉండినా ఉండొచ్చు. కాని పట్టుకొనే ధైర్యం, వారిని కాల్చి చంపే ధైర్యం మన పాలకులకి లేదు. ఇంకా ఇలాంటివే సహిస్తూ ఉంటే ప్రపంచ దేశాల్లో మనల్ని గొప్ప దేశంగా చూడనే చూడరు. చేతకాని చవట దద్దమ్మల్లా చూస్తారు.

    ఇప్పటికైనా ప్రభుత్వం కార్యాచరణకి పూనుకోవాలి. ఇప్పటకే ప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్న తీవ్రవాదులందరికీ మరణ శిక్షను అమలు చేయాలి. మనిషిని చంపిన వాడికి విచారణ అనవసరం. ఎందుకంటే అది కక్షతో చేసింది కాదు - మతోన్మాదంతో చేసింది. ఏ పాపం తెలియని అమాయకుల్ని ఏ కారణం లేకుండా చంపే అధికారం ఎవరికీలేదు. ఉగ్రవాదానికి పాల్పడేది ఎవరైనా కానివ్వండి - ఏ మతమైనా - ఏ కులమైనా - ఏ ప్రాంతం వారైనా వారు శిక్షని అనుభవించే తీరాలి. ఉగ్రవాదుల్ని చంపిన పోలీసులకి / సాయుధదళాలకి ప్రత్యేక రివార్డులు ప్రకటించాలి. దేశంలో ఏ వర్గం లేదా కొన్ని వర్గాల వారు తప్పుచేసినా శిక్ష పడదు అనే అభిప్రాయానికి రాకుండా చట్టం ముందు అందరూ సమానమే అనిపించేలా చట్ట సవరణ జరగాలి. రెడ్‌ హాండెడ్‌గా పట్టుబడ్డ ఉగ్రవాదుల్ని గరిష్టంగా వారం రోజుల వ్యవధిలోనే విచారణలు పూర్తిచేసి మరణ శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజలు నమ్మకంతో ఉండగలుగుతారు. తమ బతుక్కి భరోసా ఉందనే భద్రతా భావంలో ఆనందంగా ఉంటారు.

(మహాకవి రాసిన కవితకి అనుకరణ)

దేవుడా.... రక్షించు ఈ దేశాన్ని...

ఓటు బ్యాంకు రాజకీయాల నుండి

ముసలి అసమర్థ నాయకుల నుండి

గాంధీ వన్నె కుటుంబాల నుండి

కపట కాషాయ ధారుల నుండి

ప్రాంతీయ వాదాల నుండి

కులాల బారి నుండి

జీహాద్‌, క్రూసేడ్‌ యుద్ధాల నుండి

ఉగ్రవాదుల నుండి.....

దేవుడేడి...........

????????????????


Friday, July 8, 2011

అనంత పద్మనాభుని అనంత సంపద - కొన్ని కొత్త కోణాలు - ఆలోచనలు

    శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడ్డ అనంతమైన సంపదతో భారత దేశ పురాతన వైభవం మరొక సారి వెలుగులోకి వచ్చినట్లయింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక సంపద, ఆదాయం కలిగిన తిరుమల శ్రీనివాసుని పక్కకు నెట్టివేయగలిగినంత సంపద (సుమారు లక్షన్నర కోట్ల రూపాయిలు కన్నా ఎక్కువ) వెలుగుచూడడం ప్రపంచమంతటినీ విస్మయానికి గురిచేసింది. టన్నుల కొద్దీ బంగారం, వెలకట్టలేనన్ని వజ్ర, వైఢూర్యాలు, పచ్చలు, బంగారు నాణాలు, నగలు ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాలుగా నేలమాళిగలో మగ్గిపోయాయి. ఇదివరకెన్నడూ చూడని పెద్దపెద్ద బంగారు విగ్రహాలు, నగిషీలు, ఏ దేవతల చేతనో చెక్కబడ్డాయా అనిపించే చేతికళా నైపుణ్యం కలిగిన బంగారు ఆభరణాలు - ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఇప్పటి వరకు ఎన్నడూ ఒక్క చోట చూడనంత సంపద పద్మనాభస్వామి ఆలయంలో బయటపడింది. కేరళలో ట్రావెన్‌కోర్‌ సంస్థానాధీశులచే నిర్మించబడి, నిర్వహించబడుచున్న ఈ ఆలయంలో ఇంత సంపద ఇప్పుడు బయటపడడం పురాతన భారతీయ సంపద మీద కొత్త కోణాల్ని ప్రసరింపజేస్తుంది.

    ఇప్పటి వరకు చరిత్ర పుస్తకాల్లో భారతదేశం అత్యంత అనాగరిక, నిరుపేద దేశమని, ఇక్కడి ప్రజలు నిరక్షరాస్యులని, రాజులు నిత్యం యుద్దాలతో కొట్టుకు చస్తూ ఉండేవారని చదువుకున్నాం. కాని, ఈనాడు బయటపడ్డ ఈ సంపద ప్రపంచం యొక్క పురాతన నమ్మకాన్ని ప్రశ్నించే విధంగా ఉంది. ఇప్పటి వరకు చరిత్రను పాశ్చాత్య కళ్ళద్దాలతో చదువుకున్న ప్రపంచమంతా ఈ సంఘటనతో నివ్వెరపోయింది. పురాతన భారత దేశం - మనం అనుకున్నట్లుగా పేదది కాదు. ఆనాటి ప్రపంచంలోనే అత్యధిక ధనవంతమైన దేశం. ముస్లిం సుల్తానులు దండయాత్రలు చేసినా, బ్రిటిష్‌ వారు, ఇతర యూరోపియన్లు వ్యాపారం పేరు చెప్పి వచ్చినా అది భారతదేశంలో ఉన్న అపరిమితమైన సంపదను కొల్లగొట్టడానికే. డబ్బున్న దేశానికే అందరూ వెళతారు గాని, నిరుపేద దేశానికి ఎవరూ వెళ్ళి వ్యాపారం, యుద్దాలు చేద్దామని అనుకోరు కదా. ఒక్క అనంత పద్మనాభస్వామి ఆలయంలోనే ఇంత సంపద ఉంటే, భారత దేశం మొత్తం మీద అన్ని ఆలయాల్లోను కలిపి ఎంత సంపద ఉంటుందో మనం తేలికగానే లెక్కపెట్టవచ్చు. అది కూడా సుల్తానులు, పాశ్చాత్య దేశీయులు కలిపి ఎంతో దోచుకున్న తరువాత, స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన  అధికారులు, రాజకీయ నాయకులు కలిపి మింగేసిన తరువాత కూడా మిగిలిన సంపద ఇది అని గమనించాలి.

    ఇంత సంపదని ఏం చేద్దామనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నిజానికి ఆలయంలో బయటపడ్డ నిధికి వెలకట్టలేం. వాటికి ఉన్న పురావస్తు ప్రాధాన్యత దృష్ట్యా చూసినా ఇప్పటి వరకు లెక్క చూసిన దానికన్నా కనీసం నాలుగైదు రెట్లు ఎక్కువ ఉండవచ్చు. ఈ మొత్తంతో (అంటే సుమారు లక్షన్నర కోట్లతో) అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేయవచ్చని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని కొన్ని ఊహాగానాలు వినపడుతున్నాయి. కాని అది కార్యరూపంలో సాధ్యం కాదు. ఎందుకంటే కేవలం బంగారం, వజ్రాలు వంటివి ఇచ్చినంత మాత్రాన ఎవరూ పనులు చేయరు కదా. ఎవరైనా ఒక కార్యక్రమం చేపట్టాలి అంటే మన రూపాయిలు కరెన్సీ కట్టలు కావాలి. అలా డబ్బులు కావాలంటే ఈ సంపద మొత్తాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్మేయాలి. కాని ఒకదేశానికి గర్వకారణమైన ఆ దేశ పురాతన సంపదను, వారసత్వ వస్తువుల్ని బహిరంగ మార్కెట్‌లో అమ్మడానికి ఏ సమాజము ఒప్పుకోదు. ఏ ప్రభుత్వమూ దానికి సాహసించదు. అందుచేత ఆ సంపద మొత్తాన్ని అదే దేవాలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రజలకు / భక్తులకు సందర్శించడానికి ఏర్పాట్లు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినట్లుగా భక్తుల ద్వారా ఆదాయంతో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చు. తద్వారా ఎవరి మనో భావాలు  దెబ్బతినకుండా, ఆలయ సంపద బయటకు పోకుండా, దేశ ప్రతిష్ట మసకబారకుండా జాగ్రత్త పడినట్లు అవుతుంది.  ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి ఉమన్‌ ఛాందీ, సంపద మొత్తం ఆలయానికి చెందుతుందని ఒక ప్రకటనలో పేర్కొనడం ఆహ్వానించదగ్గ విషయం.

    కాని, గత అనుభవాల దృష్ట్యా, ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల చిత్తశుద్దిని మనం శంకించాల్సి వస్తుంది. తిరుమల వేంకటేశ్వరుని నగలు కొన్ని మాయమైపోవడం, హైదరాబాద్‌, భారత్‌లోని ఇతర సంస్థానాల్లో అపూర్వ వస్తు సంపద, వారసత్వ కళా విశేషాలు కనిపించకుండా పోయిన వైనం ప్రజల మనస్సుల్లో మెదులుతూనే ఉంది. సుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి, ప్రభుత్వం పూర్తి సంపదను రికార్డ్‌ చేసి, రాజకీయ ప్రమేయం లేని విధంగా, సమాజంలో నిజాయితీ పరులైన ప్రముఖులతో ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో, ప్రజల మనోభావాలు, సెంటిమెంట్స్‌ దెబ్బతినకుండా ఆ సంపదను పద్మనాభుని సన్నిధానంలోనే ఉంచితే అది అందరికీ ఆనందదాయకం కాగలదు.

Wednesday, May 4, 2011

పైసా ఖర్చు లేకుండా ఇల్లంతా ఎ.సి. కావాలనుందా?

మీరు చదివింది నిజమే. అసలే వేసవి. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉండబోతున్నాయట. అది సహజం. ప్రతీ సంవత్సరం వేసవిలో వేడి గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటున్నది. ఓజోన్‌ పొరకు తూట్లు పడుతున్నాయి. మరి వేడి తగ్గించే మార్గం లేదా? లేకేం? ఉంది... సింపుల్‌గా ఒక ఎ.సి. కొనుక్కోవచ్చు. మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎ.సి. కొనుక్కుంటాం. దానికి బిల్లు కట్టుకుంటాం.  మరో గదిలో ఎ.సి. కావాలంటే? మళ్ళీ డబ్బు కావాలి. అలా కాకుండా ఇల్లంతా ఒక్కసారిగా ఎ.సి. చేస్తే వదిలిపోతుంది కదా? అమ్మో చాలా డబ్బు కావాలి. కరెంట్‌ బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది. మన సంపాదనంతా ఎ.సి.కే సరిపోతుంది కదా. ఇప్పుడెలా? అక్కడికే వస్తున్నా... ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లంతా ఎ.సి. చెయ్యాలంటే...

    దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళండి... అదేనండి.. మొక్కలు అమ్మే చోటు... వాటిలో నుండి బాగా గుబురుగా పెరిగే  చక్కటి మొక్కల్ని తీసుకోండి. పసుపు రంగు పువ్వులు ఉండే మొక్కలు గాని, వేప, రావిచెట్లు గాని, త్వరగా, దట్టంగా పెరిగే ఏ మొక్కల్నయినా నాలుగు తీసుకోండి. ఇంటికి నాలుగువైపులా, వీలు కాకపోతే, మీ యింటి ముందు రోడ్డు వారనయినా నాటండి. ఒక్క సంవత్సరం కష్టపడి, మొక్కకి రెండు పూటలా నీరు పోయండి. దీనితో రెండు పనులు అవుతాయి. ఒకటి - పైసా ఖర్చులేకుండా, ఆ మొక్క చల్లదనంతో ఇల్లంతా ఎ.సి.గా మారుతుంది. రెండు - సన్నబడడానికి స్కైషాప్‌కి వెళ్ళి ఎక్సర్‌సైజ్‌ పరికరాలు కొనుక్కోనవసరం లేకుండా ఒంట్లో అనవసరంగా పేరుకున్న కొవ్వంతా కరిగిపోతుంది. వావ్‌... గ్రేట్‌ ఐడియా కదా...

మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని సర్వ నాశనం చేస్తున్నాడు. ప్రకృతిని ఎంత నష్టపరిస్తే అంత అభివృద్ధి అనుకుంటున్నాం. ఫలితం.... విధ్వంసం. ఇంటికి చల్లబరుచుకోవడానికి ఎ.సి. కావాలనుకుంటున్నామే గాని... ఒక పచ్చటి మొక్క కూడా అంతే చల్లదనాన్ని ఇస్తుందని మరచిపోతున్నాం. ఇంటి ముందు పచ్చగా ఒక చెట్టు ఉంటే, గాలికి దాని ఆకులు రాలి, గుమ్మంలో చెత్త పేరుకుపోతుందని, చెట్టుని నరికేస్తున్నాం. మళ్ళీ మనమే ఎ.సి.ల కోసం వెంపర్లాడుతున్నాం. ఒక చెట్టుని కొట్టివేస్తే ప్రకృతికి ఎంత నష్టమో మనకీ అంతే నష్టం. మనం పీల్చే గాలిలలోని ఆక్సిజన్‌ పెరగాలంటే చెట్లు కావాలి. మనం తాగే నీళ్ళు వర్షం కురవాలంటే చెట్టు ఉండాలి. మనకు చల్లటి నీడ కావాలంటే చెట్టు ఉండాలి. చెట్టు మన తల్లి లాంటిది. అది మరచిపోయి, తల్లిని కాదని, మరొకరి వెంట పడుతున్నాం. అందరూ మొక్కలు నాటితే... అవి చెట్లుగా మారితే... మ ఇల్లు మాత్రమే కాదు... మన ఊరంతా ఎ.సి. అవుతుంది. అందరూ హాయిగా ఉంటారు.. సర్వే జనాస్సుఖినోభవంతు..

Tuesday, May 3, 2011

ఆధునిక ప్రపంచపు హీరో... మన "గాంధేయవాదులకి" మార్గదర్శి... ఒబామా...

    ఎప్పుడూ గాంధీ సిద్ధాంతాల్ని వల్లెవేసే అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆల్‌ఖైదా అధినేత బిన్‌ లాడెన్‌ను అంతమొందించడం ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసారు. బిన్‌లాడెన్‌ మరణం తరువాత అమెరికన్‌ టి.వి.లలో ఒబామా ప్రసంగించినపుడు ఆయన మాటల్లో ప్రపంచానికి ఒక మంచి జరిగిందనే విషయం, అది అమెరికన్ల ద్వారా జరిగిందనే గర్వం తొణికిసలాడింది. నిజానికి 9/11 తేదీన బిన్‌లాడెన్‌ చేసిన పని అమెరికన్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది.  అది వారి జాతికి జరిగిన అవమానంగా భావించారు. అటువంటి పరాభవానికి కారణమైన ఒక వ్యక్తిని ఎట్టి పరిస్థితులలోను శిక్షించి తీరాలన్న వారి ఆకాంక్ష నేటికి నెరవేరింది. జూనియర్‌ బుష్‌ అమెరికా అధ్యక్షుడి ఉన్న కాలంలోను లాడెన్‌ గురించి ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. కాని ఒబామా ఒక చక్కటి వ్యూహంతో, పాకిస్థాన్‌ ప్రభుత్వానికి కూడా తెలియకుండా, దేశం కాని దేశంలో లాడెన్‌ను మట్టుబెట్టారు.

    అమెరికన్లు ఈ రోజు చేసిన పని ప్రపంచ దేశాలన్నిటికీ, ముఖ్యంగా ఇండియా వంటి దేశాలకు కనువిప్పు కావాలి. తప్పు చేసింది ఎవరైనప్పటికీ, వారు ఏ మతానికి లేదా ప్రాంతానికి చెందిన వారయినప్పటికీ వారిని శిక్షించి తీరాల్సిందే. సాక్షాత్తు భారత పార్లమెంటుపై దాడి చేసిన వారిని, దేశ ఆర్థిక రాజధానిపై దాడి చేసిన వారిని తీసుకుని వచ్చి (అదేలెండి.. అరెస్ట్‌చేసి), ముప్పొద్దులా మేపి, వారిని విచారణ పేరుతో కొత్త అల్లుడి మర్యాదలు చేస్తూ, దేశ ప్రజలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకోవడం మన నేతలకే చెల్లింది. నేరానికి పాల్పడిన వ్యక్తి ఒక మతానికి చెందినవాడనే ఒకే ఒక్క కారణంతో అతడిని శిక్షించడానికి వెనుకాడడం... న్యాయ విచారణ పేరిట కాలయాపన చేయడం... ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు తాకట్టు పెట్టడమే అవుతుంది.  ఇది మన నాయకులకు, రాజకీయ పార్టీలకు తెలియనిది కాదు. కాని, ఓటు బ్యాంకు రాజకీయాల ముందు దేశ ప్రతిష్టగాని, ప్రజల భద్రత గాని గాలికి కొట్టుకుపోతాయి. తరువాతి పరిణామాలు ఎటు దారి తీసినప్పటికీ, తమ పదవులు, పార్టీ ప్రయోజనాలు ముఖ్యంగాని, ప్రజల దృష్టిలో వారు ఎంత చులకన అవుతారో, ఎవరికీ అక్కరలేదు.

    అన్నిటికన్నా విచిత్రమైన విషయం... మే 2వ తేదీన రాత్రి జెమిని టి.వి.లో ఒక చర్చావేదిక ఏర్పాటు చేసారు. దానిలో ఒక మానవ హక్కుల కార్యకర్త (?) అనుకుంటా... పేరు గుర్తు లేదు... బిన్‌లాడెన్‌ను చంపి అమెరికా చాలా తప్పు చేసిందట... అతన్ని పట్టుకుని, చట్ట ప్రకారం విచారణ చేసి, శిక్ష వేయాల్సిందట... ఇలా సాగింది అతని వాదన. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది మరణించడానికి కారణమైన వ్యక్తిని, మతం పేరిట మారణ కాండను సాగించిన ఒక నరరూప రాక్షసుడిని... పట్టుకుని, విచారించడం, శిక్షించడం సాధ్యమవుతుందా? మానవ హక్కులు అటువంటి వారికి అసలు వర్తిస్తాయా?

    ఇక్కడ విషయం హింసని సమర్థించమని కాదు... హింసకు హింసే సమాధానం కాకపోవచ్చు. కాని, కరుడు కట్టిన నేరగాళ్ళని, తప్పు చేస్తున్నామని తెలిసి, ప్రణాళికా బద్దంగా, తాము అనుకున్న దానిని అమలు జరపడం కోసం ఎంతో మంది అమాయకుల్ని చేరదీసి, వారికి శిక్షణ ఇచ్చి, వారి మనసుల్ని మార్చి, ప్రపంచం పట్ల విరక్తి కలిగించి, రక్తపుటేర్లు పారిస్తున్న వారు మారతారనుకోవడం, వారిని న్యాయబద్దంగా శిక్షించాలను కోవడం ఎప్పటికీ జరగని పని. ఏదో ఆవేశంలోనో, తెలియకో ఒకసారి నేరం చేసిన వారిని స్వల్ప శిక్షల ద్వారా, మానసిక పరివర్తన ద్వారా మార్చాలనుకోవడం మంచిదే. చాలా సార్లు అది మేలు చేస్తుంది కూడా. కాని బిన్‌లాడెన్‌ వంటి, ఇంకా మత ఛాందస వాదం ద్వారా, హింస ద్వారా ప్రపంచాన్ని మార్చాలనుకొనే వారిని, వారు పాకిస్థాన్‌లో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే. అప్పుడే ఒక భద్రతతో కూడిన ప్రపంచాన్ని మన భావి పౌరులకి అందించగలుగుతాం. లేదా ఇప్పటిలాగే తాత్సారం చేస్తూ ఉంటే... చేతగాని ధర్మపన్నాలు వల్లిస్తూ కూర్చుంటే, భారత దేశం ఆటవిక మనుషులు, చట్టాలతో కూడిన భయంకర తాలిబన్ల పాలనలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Saturday, March 26, 2011

ఇది చదవండి... నచ్చితే మీ ఆత్మీయులకి పంపండి....

డియర్‌ ఫ్రెండ్స్‌,

నేను ఇపుడే నా చెల్లెలు డా. జయ దగ్గర నుంచి వచ్చిన మెయిల్‌ చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యాను. జీవితం చాలా చిన్నది. అందులో ఈ కోపాలు, ఆవేశాలు, ద్వేషాలు, అసూయలు ఎందుకో... ఇది పూర్తిగా చదివి, మీకు నచ్చితే మీకు కావలసిన వారికి పంపండి.

మీ

జగదీష్‌

There was a blind girl who hated herself because she was blind. 

She hated everyone, except her loving boy friend. He was always there for her..
She told her boyfriend, 'If I could only see the world, I will marry you.'

One day, someone donated a pair of eyes to her. When the bandages came off, she was able to see everything,including her boyfriend.

He asked her,'Now that you c an seethe world, will you marry me?'


The girl looked at her boyfriend and saw that he was blind.The sight of his closed eyelids shocked her. She hadn't expected that. The thought of looking at them the rest of her life led her to refuse to marry him.

Her boyfriend left her in tears and days later wrote a note to her saying: 'Take good care of your eyes, my dear, for before they were yours, they were mine.'

This is how the human brain often works when our status changes.
Only a very few remember what life was like before, an dwho was always by their side in the most painful situations.


Life Is a Gift


Today before you say an unkind word-
Think of someone who can't speak.

Before you complain about the taste of your food - Think of someone who has nothing to eat.

Before you complain about your husband or wife - Think of someone who's crying out to GOD for a companion.

Today before you complain about life -

Think of someone who went too early to heaven.

Before you complain about your children -
Think of someone who desires children but they're barren.


Before you argue about your dirty house someone didn't clean or sweep -

Think of the people who are living in the streets.

Before whining about the distance you drive
Think of someone who walks the same distance with their feet.

And when you are tired and complain about your job -
Think of the unemployed, the disabled, and those who wish they had your job.

But before you think of pointing the finger or condemning an other -
Remember that not one of us is without sin and we all an swer to one MAKER.

And when depressing thoughts seem to get you down -
Put a smile on your face
and thank GOD you're alive and still around.

And before you think of signing out, Please think of sending this to atleast ten people including the one who sent it to you.

SAY THANKS GOD FOR WHO I AM
?

Thursday, March 10, 2011

యువతను ప్రేమ మత్తులో ముంచేస్తున్న సినిమా టైటిల్స్‌

సినిమాలు చూస్తేనే యువత చెడిపోతున్నారంటూ, పెద్దతరం వారంతా ఆడిపోసుకుంటుంటే, మేమేదో కళాపోషణ చేస్తుంటే.అందులోను చివరలో సందేశాలు ఇస్తుంటే వాటిని చూసి అందరూ చెడిపోతున్నారనడంలో అర్థం లేదంటూ సినీ కళా ప్రియులు వెటకారం ఆడుతూంటారు. కాని నేటి యువత సినిమాకి వెళ్ళనక్కర్లేదు, కేవలం వాటి టైటిల్స్‌ చూసి చెడిపోతున్నారనడంలో నాకైతే ఏ సందేహం లేదు. లేటెస్ట్‌గా వచ్చిన ఒక సినిమా టైటిల్‌ 'ప్రేమ కావాలి'. చిన్నప్పటి నుంచి అది కావాలి, ఇది కావాలి అని అందరం అడిగే ఉంటాం. ఇప్పుడు మంచినీళ్ళు కావాలి అనేంత ఈజీగా యువత 'ప్రేమ కావాలి' అంటే ఎవ్వరినీ తప్పు పట్టలేం. ఇప్పటికే స్కూల్‌కి / కాలేజ్‌కి వెళితే ఖచ్చితంగా అక్కడ ఒక అమ్మాయి / అబ్బాయిలో ప్రేమలో పడాలి అనేంతగా మన సినిమాల్లో చూపిస్తున్నారు. వారిని అంతలా థియేటర్స్‌కి రప్పించాలంటే టైటిల్‌కూడా అంతే క్యాచీగా ఉండాలనే తాపత్రయంలో దర్శక నిర్మాతలు వారి హద్దులు మీరుతున్నారనిపిస్తుంది ఇప్పటి పరిస్థితి చూస్తుంటే...

    ఎప్పుడో 'ఖుషి' సినిమాలో నెలల పసికందుల మధ్యలో పుట్టిన ప్రేమ, వారు పెద్దయిన తరువాత ఎలా మొద్దులా మారిందో చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తరువాత వచ్చిన సినిమాలో 'తూనీగా ... తూనీగా' అంటూ చిన్న తనంలో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న వారు కూడా తరువాతి వయసులో మంచి లవర్స్‌గా ఎలా మారారో రొమాంటిక్‌గా చూపించారు. చిన్నతనంలో ఒక అమ్మాయి, ఒక  అబ్బాయి కలిసి ఆడుకుంటూంటే, వారిని చూసి వారు పెద్దయ్యాక ఎంత గొప్ప లవర్స్‌ అవుతారో అని అనుకునేంతగా సమాజాన్ని మార్చేసారు. ఇక 'టెంత్‌ క్లాస్‌'లో నిక్కర్‌ లవ్‌, ఇంటర్‌లో ప్రేమలో పడితే 'కొత్త బంగారు లోకం' చూడొచ్చు అంటూ పిల్లల మనసుల్ని కలుషితంచేసేసారు. స్కూల్లో చదువుతూనే మోటార్‌సైకిల్‌ మెకానిక్‌తో ఎలా ప్రేమలో పడొచ్చో కూడా ప్రాక్టికల్‌గా చేసి చూపించారు.

    ఇప్పుడొస్తున్న ఎక్కువ శాతం 'ప్రేమ' (?) సినిమాల్లో స్కూల్స్‌/ కాలేజ్‌ని బ్యాక్‌డ్రాప్‌గా చూపిస్తున్నారు. లెక్చరర్స్‌ని పరమ బేవార్స్‌గాళ్ళుగా, హాస్య గాళ్ళుగా చూపించే తత్వం కూడా ఈ సినిమాల్లో ఎక్కువయిపోయింది. కాలేజ్‌కి వెళ్ళడమంటేనే ప్రేమలో పడేందుకే అన్నంతగా మన సినిమాల్లో కథలు ఉంటున్నాయి.

    పిల్లలు - ముఖ్యంగా యువత మనసు చాలా సున్నితమైనది. అది చాలా రకాలైన భావోద్వేగాలతో, గందరగోళంతో నిండి ఉంటుంది. ఎవరు ఏది చెబితే అది నిజం అనే పరిస్థితిలో వారు ఉంటారు. తమకంటూ ఒక  ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే ప్రయత్నంలో వారు సహజంగానే చెడువైపు ఎక్కువగా ఆకర్షితమవుతారు. అటువంటి యువత బలహీనతను సొమ్ము చేసుకునే ప్రయత్నమే పైన చెప్పిన సినిమా కథలన్నీ... ప్రేమలో పడడం  - కాలేజ్‌ ఎగ్గొట్టడం - పెద్దల్ని ఎదిరించడం - చివరికి పెళ్ళి చేసుకోవడం - సినిమాల్లో  ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. కాని నిజజీవితంలో వాస్తవానికి దగ్గరగా వచ్చేప్పటికీ, ఇవన్నీ చాలా మంది జీవితాల్లో కావలసినంత విషాదాన్ని నింపుతాయి.

    సినిమా అనేది ఒక బలమైన మాధ్యమం. అందుకు ఎటువంటి సందేహం లేదు. కళ ఒక్కటే కూడు పెట్టదు కాబట్టి కొంత డబ్బుని కూడా సంపాదించాలి కాబట్టి, వ్యాపార విలువల్ని సినిమాల్లో చొప్పించడం తప్పదు. అలాగని సినిమా మొత్తాన్ని వాణిజ్యమయం చేసేసి, యువత మనో భావాల్ని కలుషితం చేసి, వారి భవిష్యత్తును అంధకారం చేసే ఆలోచనాధోరణిని ప్రోత్సహించే సినిమాల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థియేటర్‌ లోపలికెళ్ళిన  తరువాత ఏ చెత్తయినా చూపించనివ్వండి - కనీసం టైటిల్స్‌ విషయంలోను, వాల్‌పోస్టర్స్‌, మీడియా పబ్లిసిటీ విషయంలోను  కొంత సంయమనం పాటించాలి. సినిమా ద్వారా సమాజానికి మేలు చేసి - సందేశాలు ఇవ్వనక్కర్లేదు. కనీసం పసి మనసులు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

Thursday, March 3, 2011

ఆడపిల్లలంటే అంత అలుసా?

ఆడపిల్లలు ఎన్ని గొప్ప పనులు సాధించినా, ఆడపిల్లల తండ్రులు ఎంత ఘనులైనా సరే, కొన్ని విషయాలలో రాజీ పడక తప్పదని కొన్ని సంఘటనలు ఋజువు చేస్తూ ఉంటాయి. మగవాళ్ళ దాష్టీకం ముందు ఆడపిల్లలు కానివ్వండి, వారిని కన్న వారు కానివ్వండి, తలవంచుకోవాల్సిందే అనిపిస్తుంది. సమాజంలో కూడా ఇదంతా మామూలే అని అందరూ చూసీ చూడనట్లు వదిలేస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణగా రెండు సజీవ ఉదాహరణలు ఈ మధ్యలో మా సంస్థలో జరిగాయి. వాటిని మీతో పంచుకుందామని ఈ టపా వ్రాస్తున్నాను.

    ఈ ముహూర్తాలకి మా ప్రెస్‌లో సుమారు 200 మందికి పెళ్ళి శుభలేఖలు ప్రింట్‌ చేసాము. ప్రెస్‌ అన్నాకా ఏవో చిన్న చిన్న తప్పులు దొర్లడం సహజం. అది మా సిబ్బంది పొరపాటు కావచ్చు, లేదా కస్టమర్‌ అవగాహనా లోపం వల్ల కావచ్చు. అది సహజం. ఒక వారం రోజుల క్రితం ఒక అమ్మాయి (పెళ్ళి కూతురు) ఉదయాన్నే ప్రెస్‌కి వచ్చి ఏడుపు మొదలెట్టింది. ఆ అమ్మాయి మరీ పల్లెటూరు కాదు. చక్కగా చదువుకుంది. ఇంజినీరింగ్‌ అనుకుంటా... ఏమ్మా ఎందుకేడుస్తున్నావు? అనడిగితే శుభలేఖల్లో తప్పు వచ్చిందండి... మా కాబోయే వారు ఫోన్‌ చేసి నన్ను తిడుతున్నారు అంది. పోనీలేమ్మా మరీ అంత తప్పు దొర్లితే మరలా ప్రింట్‌ చేసి ఇస్తాను... బాధ పడకు అని ఓదార్చాను. తీరా చూస్తే, శుభలేఖలో ఏ తప్పు లేదు... కవర్‌ మీద ఫలానా వెడ్స్‌ ఫలానా అని ప్రింట్‌ చేస్తాను. అది పూర్తి పేరు కాకుండా ముద్దు పేరునో, చాంతాడంత పేరుంటే దానిలో నిక్‌నేమ్‌గాని కవర్‌ మీద వేస్తాము. దానిలో ఈ అమ్మాయికి కాబోయే భర్త పేరు చాలా పొడుగుంటే అందులో చివరి పేరు అంటే... శివ నాగ వెంకట సత్య సుబ్రహ్మణ్య వర ప్రసాద్‌ (ఉదాహరణకి పేరు మార్చాను) ఉంటే మా కంప్యూటర్‌ ఆపరేటర్‌ చివరి పేరు తీసుకుని ప్రసాద్‌ వెడ్స్‌ ఫలానా అని వేసింది. కాని ఆ అబ్బాయిని శివ అని పిలుస్తారట.... ఏదయినా అతని పేరే కదా... అది కూడా కావాలని చేసింది కాదు. వధువు తండ్రి గారికి అవగాహన లేక ప్రసాద్‌ అని పొరపాటున చెప్పాడు. ఆ మాత్రం దానికి పెద్ద రాద్ధాంతం చేసేసి, పెళ్ళి కూతుర్ని పట్టుకుని నానా మాటలు అన్నాడట. ఇంతకీ ఆ అమ్మాయి బాధపడుతున్నది పేరు తప్పు వచ్చినందుకు కాదు.... చిన్న పేరు విషయంలోనే ఇంత పట్టుపట్టి గొడవ చేసిన వాళ్ళతో నేను జీవితాంతం ఎలా కాపురం చేయాలి అని భయపడుతూ ఏడుస్తోంది. ఆడపిల్లని అంత బాధపెట్టడం మగవాడి అహంకారం చూపించడం కోసమా, లేక మరేదైనా కారణం ఉందా... నాకేమీ అర్థం కాలేదు...

    మరో ఉదాహరణ.... పెళ్ళికొడుకు ఒక పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడట. అమ్మాయి తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. అమ్మాయిని మాత్రం ఇంజినీర్‌ చదివించారు. ఇద్దరికీ పేర్లు ప్రక్కన డిగ్రీలు ప్రింట్‌ చేయించారు. కాని కాబోయే అల్లుడి జాబ్‌ వివరాలు వేయించలేదు. (ఉదా: విప్రో కంపెనీ, బెంగుళూరు). ఈ మాత్రం దానికి వాళ్ళకి పంపిన శుభలేఖలు వెనక్కి పంపించేసి, మేము ఏమన్నా అనామకులమా? మాకో అడ్రస్‌ లేదా? మా అబ్బాయి అంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఉంటే (సాఫ్ట్‌వేర్‌ అంటే అదో పెద్ద రాష్ట్రపతి జాబ్‌ అన్నట్టు) ఆ విషయం కార్డ్‌లో ప్రింట్‌ చేయకపోతే మా పరువేం కాను... అంటూ నానా యాగీ చేసారట. ఆ తల్లిదండ్రులు పాపం నా దగ్గరకు వచ్చి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. ఈ రోజే వాళ్ళకి మళ్ళీ కార్ట్స్‌ ప్రింట్‌ చేసి ఇచ్చాను.

    ఒక ఆడపిల్ల మనల్ని నమ్ముకుని మనతో జీవితం పంచుకోవడానికి వస్తుంటే... తనకి ఆనందాన్ని పంచాల్సింది పోయి, పంతాలతో, పట్టింపులతో ఆ అమ్మాయిల మనసుని విరిచేయడం .. వారిని బాధ పెట్టడం, ఇప్పుడే ఇలాగ ఉంటే రేపు ఎలా ఉంటుందో అన్న అభద్రతా భావంలోకి ఆ అమ్మాయిని నెట్టేయడం.... ఇవన్నీ మనషులు చేయాల్సిన పనులేనా... ఇవే కాకుండా కట్నం చాలినంత ఇవ్వలేదనో... ఆడపడుచుకి లాంచనాలు సరిపోలేదనో... తమ వైపు వారికి మర్యాదల్లో లోపం జరిగిందనో... ఇలా చిన్న చిన్న కారణాలు చాలు.... సున్నితమైన మనసులు గాయపడడానికి... జీవితాంతం కలిసి ఉండాల్సిన ఎదుటి వ్యక్తి మనసు విరిగిపోవడానికి... మనం మగాళ్ళం అయితే కావచ్చు... కాని ఎదుటి మనిషిని ఏడిపించే హక్కు మనకి లేదు. అదే ఒక ఆడపిల్ల ఎదురుతిరిగి ఇదేమిటని ప్రశ్నిస్తే... అదిగో... రోడ్డెక్కింది అంటారు. అసలు అంతదాకా తెచ్చుకోవడం ఎందుకు... ఎదుటి మనిషి తనకు భర్తగా ఉంటే బాగుంటుంది అనిపించాలిగాని, వీడేం మొగుడురా బాబూ అనేలా చేసుకోకూడదు. ఇది చదివి కొంతమందైనా చదువుకున్న మూర్ఖులు మారితే, తమని నమ్ముకు వచ్చిన అమ్మాయిని ఏడిపించకుండా చూసుకుంటే... అదే పదివేలు....

Sunday, January 9, 2011

రేలంగి, తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారి పంచాంగం క్యాలండర్‌ - మీ అందరి కోసం - మల్టీకలర్‌లో

శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారి పంచాంగం క్యాలండర్‌ గోదావరి జిల్లాల్లోనే గాక, రాష్ట్రం మొత్తం మీద ప్రసిద్ధి గాంచినది. పంచాంగ కర్త తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతిగా కూడా సేవలందిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలకు అంటే వసంతోత్సవం, బ్రహ్మోత్సవం వంటి వాటికి కూడా ఆయనే ముహూర్త నిర్ణయం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద పండుగల తేదీ నిర్ణయ విషయంలో వివిధ సిద్ధాంతుల మధ్య సమన్వయం కుదరని పక్షంలో ప్రభాకర పూర్ణయ్యగారినే సంప్రదించి, రాష్ట్ర ప్రభుత్వం ఆయన చెప్పిన తేదీలనే ఖరారు చేసి ప్రకటిస్తుంది. అంతేగాక ఈనాడు ఆదివారం మ్యాగజైన్‌లో కూడా ప్రతివారం వారఫలాలు అందిస్తున్నారు.


మా ప్రెస్‌ శ్రీ సత్య ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌లో కూడా గత రెండు దశాబ్దాలుగా ప్రభాకర పూర్ణయ్య గారి క్యాలండర్‌ని ప్రింట్‌ చేస్తున్నాము. ఇంతటి ప్రసిద్ధిగాంచిన క్యాలండర్‌ని ప్రపంచం మొత్తం మీద ఉన్న తెలుగు వారందరూ ఉపయోగించాలనే సంకల్పంతో మేము ప్రింట్‌ చేసిన పి.డి.ఎఫ్‌. ఫైల్‌ని యధాతధంగా నెట్‌లో ఉంచుతున్నాము. మీకు ఎవరికైనా ఈ క్యాలండర్‌ ప్రింటెడ్‌ కాపీ కావాలనుకుంటే ఈ పి.డి.ఎఫ్‌. నుండి ప్రింట్‌ చేసుకోవచ్చు. లేదా అధిక సంఖ్యలో కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు (ఈ సంవత్సరానికి స్టాక్‌ అయిపోయింది లెండి). ఇప్పటివరకు 4 దేశాల్లో తెలుగువారికి ఈ క్యాలండర్‌ పంపించడం జరిగింది. మిగతా దేశాలు, రాష్ట్రాల వారు ఈ క్యాలండర్‌ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. 

అందరికీ నూతన సంవత్సర మరియూ సంక్రాంతి శుభాకాంక్షలతో..