Pages

Wednesday, March 31, 2010

రామతత్వ దర్శనం: సాక్షిలో స్వామి మైత్రేయి గారి సందేశం (యధాతధం)

ఒక వ్యక్తి ఆదర్శవంతమయిన పుత్రునిగా, సోదరునిగా, భర్తగా, రాజుగా, స్నేహితుడిగా ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా నడుచుకోవాలి, ఇంద్రియాలపై ఎలా నియంత్రణ కలిగి ఉండాలి వంటి విషయాలు రాముని పాత్ర ద్వారా వివరించాడు వాల్మీకి. రామ అంటే "ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి" అని అర్ధం. "రం" అనేది మణిపూర చక్రానికి సంబంధించిన బీజాక్షరం. అలాగే "ర" అంటే సూర్యతత్వం, "మ" అంతే చంద్రతత్వం. ఇవే మనలోని ఇడ, పింగళ నాడులు. రాముడంటే ఆత్మా రాముడే. దశరధునికి, కౌసల్యకి రాముడు జన్మించడమంటే మనలోని "దశ" రధాలనే కర్మేంద్రియల, జ్ఞానేంద్రియాల మధ్య కుశలత ఉండి, ఆత్మను చేరుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుందని. అన్నదమ్ములు నాలుగు పురుషార్ధలు. వీరిని వరుసగా, ధర్మానికి, శ్రద్ధకు, భక్తికి, శక్తికి ప్రతీకలుగా చెప్పవచ్చు. మనలోని సత్వ రజస్తమో గుణాలే దశరధుని భార్యలు. సీతను స్వచ్చమయిన మనస్సుకు ప్రతీకగా చెప్పవచ్చు. ఆమెకు బంగారు లేడి కావాలనే కోరిక కలగనంత వరకు రాముని చెంతనే ఉంది. లేడి కావాలనే కోరిక కలిగినప్పటి నుండి రామునికి దూరమై అనేక బాధలు పడింది. మనస్సులో కోరికలు, వ్యామోహం, రాగద్వేషాలు ఉన్నంతవరకు ఈ బాధలు ఉంటాయి. అలాగే మనిషి అన్ కాన్షస్‌గా ఉండేటప్పుడు తప్పొప్పుల విచక్షణ పోతుంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చెడు వైపునకు వెళ్ళిపోతాయి. రావణుడు తెలివిగలవాడే కాని ఆ తెలివి అహంకారాన్ని పెంచి చెడువైపునకు తీసుకెళ్ళింది. అందుకే పదితలల వ్యక్తిగా చూపిస్తారు.

హృదయాన్ని తెరిచి రాముణ్ణి చూపడమంటే మనిషి శిరస్సుతో గాక హృదయంతో వుండాలని అర్ధం. అప్పుడే వానరుడు హనుమ కాగలడు. రావణుడు అరిషడ్వర్గాలకు ప్రతీక అయితే, హనుమ హృదయానికి ప్రతీక. లంక అంటే మన శరీరం . దానికున్న తొమ్మిది ద్వారాలే నవరంధ్రాలు. ఈ లంక చుట్టూ వున్న సముద్రమే మాయ. ఈ మాయను దాటి అసుర గుణాలయిన రాగద్వేషాలను హరించివేయాలి.

సీత జనకునికి పుడమిలోనే దొరికి, పుడమిలోకే వెళ్ళిపోతుంది. ధ్యానంలో సమాధి స్థితిలో మైండ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికే వెళ్ళిపోతుంది. అయోధ్య అంటే ఏ ఘర్షణ వుండదు. ఏ కోరికలు, రాగద్వేషాలు లేక ప్రశాంతత నెలకొని ఉంటుంది. మనం మైండ్‌ను శుద్ధి చేసుకోక, మంచి హృదయంతో లేనంతవరకు ఆత్మారాముణ్ణి చేరుకోలేం.

Wednesday, March 24, 2010

మానవ సమాజానికి ఒక మహనీయ కానుక... రామాయణం.

మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయనం. మనుషులు తమ జంతు ప్రవృత్తిని వీడి ఒక సమాజంగా రూపొందుతున్న కొత్తల్లో మనసులో ఎన్నో సందేహాలు.. ఏది మంచి? ఏది చెడు? ఒక వేళ మంచి అయితే ఎందుకు మంచి? చెడయితే ఎలా చెడు? ఒక మానవ నాగరికత కొన్ని వేల సంవత్సరాల పాటు నిరాటంకంగా, ఎటువంటి వడిదుడుకులు లేకుండా సాగిపోవాలంటే ఏమి చెయ్యాలి? ఇక్కడ వుండే రకరకాలయిన మనుషుల్ని ఒక దారిలో నడిపించడం ఎలా అన్న విషయంపై ప్రాచీన భారత దేశంలో జరిగినన్ని ప్రయోగాలు ప్రపంచంలోని మరే సంస్కృతిలోనూ, మరే నాగరికతలో జరిగుండవని నిరాఘాటంగా చెప్పవచ్చు. అటువంటి సంఘర్షణలో నుంచి పుట్టిందే రామాయణం. రామాయణంలో ప్రతీ సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి.

రామాయణంలో ముందుగా చెప్పాల్సి వస్తే చెప్పవలసింది సీతా దేవి గురించే. భర్త పట్ల ఒక స్త్రీకి వుండవలసిన ధర్మాన్ని గురించి సీత నుంచి తెలుసుకోవచ్చును. తెల్లారేసరికి తన భర్త రాజు కావలసిన వాడు అడవులకి వెళుతున్నాను అని చెప్పినాగాని, ఒక్క మాట మారు మాట్లాడలేదు. ఇప్పటి ఆడవాళ్ళలాగా "నువ్వేమి చేతగాని భర్తవని నిందించలేదు. ఒక దేశానికి రాకుమార్తె అయి వుండికూడా పుట్టింటికి వెళ్ళిపోతానని అనలేదు. తన భర్తనే అనుసరించింది. ఆయనతో అరణ్యవాసం చేసింది, అష్ట కష్టాలు పడింది. భార్యాభర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా, నీడగా నిలవాలనేదే సీత ఇచ్చే సందేశం.

లక్ష్మణుడి వంటి సోదరుడిని మనం చరిత్రలో ఎక్కడా చూసి వుండం. చరిత్ర ప్రారంభం నుంచి పరిశిలిస్తే రాజ్యం కోసం సొంత సోదరుల్నే కడతేర్చిన వారిని చూసుంటాము. సొంత తండ్రినే ఆస్తి కోసం కిరాతకంగా హతమార్చినవారిని ఇప్పుడు మనం చూస్తున్నాం. అటువంటింది అన్నగారి కోసం రాజభోగాల్ని వదిలి, కూడా వెళ్ళిన లక్ష్మణుడి గురించి మనం ఏంత చెప్పినా తక్కువే అవుతుంది. మిగతా ఇద్దరు సోదరులు భరతుడు, శతృఘ్నుడు కూడా అన్నగారు లేని రాజ్యం తమకెందుకని సింహాసనంపై పాదుకలు వుంచి పరిపాలన చేశారు. ఇటువంటి అన్నదమ్ముల అనుబంధం ఏ దేశ చరిత్రలోనయినా వుంటుందా?

స్వామి భక్తి అనేది హనుమంతుడి నుంచి నేర్చుకోవచ్చు. కాస్త ఎక్కువ జీతం ఇస్తే చాలు వెంటనే వుద్యోగం మారిపోయే ఈ రోజుల్లో హనుమంతుని గురించి ఆలోచించేవాళ్ళు ఎంత మంది వుంటారు? ఒక సారి తన ప్రభువుగా అంగీకరించిన తరువాత, తనకు రాముడు అప్పజెప్పిన పనిని పూర్తి చెయ్యలేకపోయానే మరలా నా స్వామికి నా ముఖం ఎలా చూపించను? అని ప్రాణ త్యాగానికి సిద్దపడతాడు హనుమ. అంతేగాని బాస్ చూడడంలేదు కాబట్టి ఈ పని పూర్తి చేసేసాను అని అబద్దం చెప్పలేదు. రామ రావణ యుద్ధం జరిగినప్పుడు కూడా యుద్దమంతా తానే అయి నడిపించాడు హనుమ. అంతటి శక్తిమంతుడయి వుండి కూడా ఎప్పుడూ తనవల్లే ఇదంతా జరుగుతుందని గొప్పలు చెప్పుకోలేదు. తన హృదయంలో కొలువయి వున్న రామ నామంవల్లనే తనకింత బలం వచ్చిందని వినమ్రంగా చెపుతాడు హనుమ. అటువంటి సేవకుడిని మనమెప్పటికయినా మరల చూడగలమా?

ఒక పరాయి స్త్రీని ఆశపడితే ఎంతటి విషమ పరిస్తితులని ఎదుర్కోవలసి వస్తుందో అన్నదానికి సరయిన వుదాహరణ రావణుడు. రావణుడు నిజానికి ఎంతో విద్వాంసుడు, మహా శివ భక్తుడు. రక రకాల శాస్త్రాల్లో నిష్ణాతుడు. అయినా ఒక స్త్రీని బలాత్కరించబోయి యావత్ దానవ సామ్రాజ్యానికే ముప్పుని కొనితెచ్చుకున్నాడు. చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు. ఈ రోజు ఏ పేపర్ చూసినా, ఏ టి.వి. పెట్టినా పర స్త్రీ గురించి జరుగుతున్న నేరాలే కనిపిస్తున్నాయి. కామాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే మనిషి ఎంత పతనమవుతాడో రావణుడే ఒక హెచ్చరిక.

సీతా దేవి నగల మూట దొరికినప్పుడు రాముడు నీళ్ళు నిండిన కళ్ళతో "లక్ష్మణా, ఇవి మీ వదినగారి నగలేనా చూడవయ్యా" అని అడిగితే, దానికి లక్ష్మణుడు నేను వీటిలో వదినగారి కాలి మట్టెల్ని మాత్రమే గుర్తుపట్టగలను అని చెప్పాడు. అంటే ఎప్పుడూ తన తల్లి లాంటి వదినగారి పాదాల వంక తప్ప పైకి కూడా చూడలేదన్న మాట. అదీ ఒక వదినకీ, మరిదికీ వుండవలసిన గౌరవం.

ఇక రాముడి గురించి చెప్పాల్సి వస్తే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. అది మీకు తెలుసు. తండ్రికి మంచి తనయుడిగా, ఇల్లాలికి మంచి భర్తగా, సోదరులకి మంచి అన్నయ్యగా, సేవకుడికి మంచి యజమానికి, స్నేహితుడికి మంచి స్నేహితుడిగా, శతృవుకి సరయిన ప్రత్యర్ధిగా, ఇలా రాముడి ప్రతీ మాట, ప్రతీ కదలిక, ప్రతి సంఘటన మనకి ఒక సందేశాన్నిస్తూనే వుంటాయి. ఒక స్ఫూర్తిని నింపుతూనే వుంటాయి. రాముడు ఒక మతానికో, ఒక కాలానికో లేదా ఒక సమాజానికో సంబంధించిన వ్యక్తి కాడు. వ్యక్తిగా ఆయన అనుసరించిన మార్గం మానవ సమాజంలో వున్న ప్రతీ వ్యక్తికీ దేశ, కాల, మత, కుల ప్రసక్తి లేకుండా అనుసరణీయం.

రాముడు నిజంగా దేవుడా, కాడా అన్న విషయాన్ని పక్కన పెడితే, అప్పటి వరకూ పుస్తకాలకే పరిమితమయి వున్న అనేక ధర్మ సూత్రాల్ని, న్యాయాల్ని ఆచరణలో చూపించిన మహనీయుడు. అందరికీ నీతులు చెప్పాలని వుంటుంది. అందరికీ తాము ఆదర్శప్రాయుడుగా ఉండాలని వుంటుంది. కాని దాన్ని ఆచరణలో చూపించేది కొందరే. ఎన్ని కష్టాలు ఎదురయినా తాను నమ్మినదాన్ని ఆచరణలో పెట్టినవాడే చరిత్రలో ధీరోదాత్తుడిగా మిగిలిపోతాడు. కోట్లాది భారతీయులకి స్ఫూర్తిని రగిలించిన గాంధీజికి ఆత్మ బలాన్ని అందించిన వాడు రాముడు. రాముడు నిజంగా వారధి కట్టాడా లేదా అని కొట్టుకు చచ్చే బదులు రాముడి జీవితంలో ఆయన ఆచరించి చూపిన సద్గుణాల్లో కొన్నయినా ఆచరించగలిగితే ఈనాడు మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల నుంచి బయట పడగలుగుతుంది. అందుకే రామాయణం ఒక మహత్తర కావ్యం అయింది. కొన్ని వేల సంవత్సరాలుగా సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతుంది.

ఈ శ్రీరామ నవమి నాడు ఆ మహనీయుని ఒకసారి మరలా స్మరించుకుందాం. ప్రతీ వ్యక్తీ తనలోని రావణుడిని రూపుమాపగలిగితే, ఒక రాముడిగా అవతరిస్తాడు. తన సమాజానికి అనుసరణీయుడవుతాడు. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలతో... లోక స్సమస్తా సుఖినోభవంతు....