Pages

Thursday, July 29, 2010

కొంచెం వెరైటీగా ఉండాలని ఉందా? ఇవి ట్రై చెయ్యండి

ఎప్పుడూ ఒకే రకమయిన లైఫ్‌లో బ్రతికి, అలిసిపోయి, విసిగిపోయిన వారికి కొంచెం వెరైటీగా ఉంటుందని ఇది రాస్తున్నాను..

1. మనుషులంతా ప్రాధమికంగా జంతువులే కాబట్టి ఏమి చేసినా ఎలా చేసినా తప్పులేదని ఈ మధ్యన ఒకాయన సెలవిచ్చారు. కాబట్టి, ఒక పనిచేస్తే సరి.. జంతువులన్నీ నాలుగు కాళ్ళమీద నడుస్తున్నాయి కాబట్టి, మనిషి కూడా ఒక రకమయిన జంతువే కాబట్టి, మనుషులు కూడా నాలుగు కాళ్ళ మీద నడిస్తే సరి. ఒక్క సారి ఊహించుకోండి.... అందరూ నాలుగు కాళ్ళ మీద నడిస్తే ఎలా వుంటుందో... ఇదేమిటి పైనున్న వాటిని చేతులంటారనికదా మీ అనుమానం.... లేదండి.. పూర్వం ఒకప్పుడు అవి కాళ్ళే... తరువాత మన సౌలభ్యం కోసం చేతులని పేరు పెట్టుకున్నాం... అంతే....

2. ఎప్పుడూ చేత్తోనే కంప్యూటర్ కీ బోర్డ్ మీద టైప్ చేస్తారెందుకు? అప్పుడప్పుడు వెరైటీగా కాలితో కూడా ప్రాక్టిస్ చెయ్యొచ్చుకదా.. కాలికి కూడా వేళ్ళు వున్నాయి కదా...

3. బైక్‌ని ఎప్పుడూ రోడ్ మీద మాత్రమే ఎందుకు నడపాలి? ఫుట్‌పాత్ మీద ఎక్కించి నడపొచ్చు కదా.. అలాగే రోడ్‌కీ ఎడమవైపునే ఎందుకు వెళ్ళాలి? కుడి వైపున వెళితే ఏమవుతుంది? అది ఇదీ కుడా రోడ్డే కదా... ఎవరయినా గుద్దితే వాళ్ళమీద లాజిక్ ప్రయోగిద్దాం. ఏదయినా రోడ్డే కదా... ఎవరు ఎటువైపు వెళితే ఏంటి? నేను వెరైటీ గా ఉంటాను కాబట్టి ఇలా వెళతాను అని చెప్పొచ్చు, ఎదుటి వాడి నోరు మూయించొచ్చు.

4. కూరగాయలు, బియ్యం, మాంసం అన్నీ వండుకు తినడం ఎందుకు దండగ? మనుషులు కూడా జంతువుల్లాంటి వాళ్ళే కాబట్టి వాటినలాగే, పచ్చిగా, పిచ్చిగా తినేస్తే నష్టమేంటంటా? అహ నష్టమేంటంటా అని?

5. పుస్తకాలని ముందు నుంచి వెనకకి చదువడమెందుకు? వెనకవైపు నుంచి ముందుకు చదవచ్చు కదా.. ఎందుకంటే ఏదయినా చదవడమే... అవే పేజీలు, అవే అక్షరాలు... అదే విషయం...  అలా చదివితే అడిగేదెవడంట....

బాబోయ్... ఇప్పటికే చాలా చెప్పేసాను... ఇంక నాకు ఓపిక లేదు.. ఇంకా వెరైటీ ఆలోచనలుంటే మీరు కూడా రాయవచ్చండోయ్... అప్పుడు అందరూ కలిసి మరింత వెరైటీగా వుండొచ్చు కదా... మీరేమంటారు.. ఈ సంస్కృతి, సంప్రదాయాలు, పాత చింతకాయ పచ్చళ్ళు వల్ల ఉపయోగం ఏమిటి? ఇన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులంతా పిచ్చోళ్ళు కాబట్టి, వాళ్ళకి మతిలేదు కాబట్టి ఇలాంటి అర్ధం పర్ధం లేనివన్నీ పెట్టారు. మనం తెలివయినవాళ్ళం కాబట్టి, "ఆధునిక యుగంలో" వున్నాం కాబట్టి... ప్రశ్నించాలి కాబట్టి మనకి దొరికిన ప్రతీదాన్నీ తలా తోకా లేకుండా ఖండించి, వాదించి అవతల పారేద్దాం...

(గమనిక: పైవన్నీ నేనెప్పుడూ ట్రై చెయ్యలేదు... "వెరైటీ", "ఆధునికత" కోరుకునే వారికోసం ఈ పోస్ట్. పైవన్నీ ఎవరయిన ప్రయత్నించి, దానివల్ల ఏమయినా ఇబ్బంది పడితే నాకు సంబంధం లేదు... నన్నడగవద్దని మనవి)

Sunday, July 25, 2010

పిల్లల్ని ప్రేమించాలి గాని, కామించకూడదు

గత రెండు రోజులుగా రామూ గారికి, తాడేపల్లి గారికి జరుగుతున్న మాటల యుద్దాన్ని చూస్తున్నాను. ఇద్దరికీ మద్దతుగా మిగిలిన బ్లాగర్లు ఎగదోస్తున్న వత్తుల్నీ చూస్తున్నాను.ఏదేమయినప్పటికీ ఈ విషయంలో నేను రాము గారిని నూటికి నూరుశాతం సమర్ధిస్తున్నాను. ఆయన అభిప్రాయ పడుతున్నట్టుగా ఒక పురుషుడికి ఒక స్త్రీ అనే సిద్దాంతమే న్యాయమయినది. ఈ విషయంలో మరో సందేహానికి తావులేదు. బహుభార్యాత్వం, బహు భర్తృత్వ సిద్దాంతాలని తోసి రాజని ఏక పత్ని వ్రతం ఎందుకు అమల్లోకి వచ్చిందో చరిత్ర చదివిన ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా Sociology, Anthropology విద్యార్ధులకి బాగా తెలుస్తుంది. ఎవరిని బడితే వారితో శృంగారం జరపడమనేది జంతు సమాజాల్లో చెల్లుబాటవుతుందేమో కాని మానవ సమాజంలో చెల్లుబాటు కాదు.

పిల్లల్కి విద్యాబుద్దులు నేర్పి, వారిని మంచి మార్గంలో పెట్టవలసిన గురువే, బుద్ది లేకుండా, గడ్డి తిని, తాడేపల్లివారి మాటలు పుచ్చుకుని పిల్లలతో సరస సల్లాపాల్లోకి దింపితే, అందరూ కలిసి తంతారు. అది గ్రహించాలి. అదీ కాకపోయినా, తమ వద్దకు విద్యాబుద్దులు నేర్వడానికి వచ్చిన విద్యార్ధినుల పట్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే, తమ వద్ద పనిచెయ్యడానికి వచ్చిన ఆడవాళ్ళని లొంగదీసుకోవాలని చూస్తే మక్కెలిరగదంతారు. (కొంచెం అంపార్లమెంటరీ భాష వాడుతున్నాను. క్షమించాలి. తప్పదు మరి). పిల్లల్ని సొంత కూతురిగా భావించగలిగిన వాడే వారిని సరయిన దారిలో పెట్టగలరు. అంతే గాని కామ వికారాల్ని కలిగివున్న వాడు వాళ్ళకేమి విద్యాబుద్దులు నేర్పించగలుగుతాడు? అది చదువయినా కానివ్వండి... ఆటలయినా కానివ్వండి... కంప్యూటర్స్ కానివ్వండి.. మరింకేదయినా కానివ్వండి..

పెళ్ళనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని నెరవేర్చలేకపోతే, మరొకరిని చూసుకుంటాను అంటే, అసలా బాధ్యతలోకే ప్రవేశించకూడదు. మరో ఆడపిల్ల జీవితాన్ని పాడు చెయ్యకూడదు. రాము గారు చెప్పినట్లు అచ్చోసిన ఆంబోతుగా వుంటే మేలు. అప్పుడిక ఎవరికీ ఎటువంటి అడ్డంకులు వుండవు. ఎవరికీ అభ్యంతరాలుండవు. చివరికి ఎయిడ్స్ వస్తే పట్టించుకోవడానికి దిక్కు లేక దికుమాలిన చావు చస్తారు. ఎందుకంటే ఇన్ని రోగాలొచ్చిన తరువాత పట్టించుకోవడానికి ఎవ్వరూ వుండరు కనుక. మనం ఒకరి పట్ల బాధ్యతగా వుంటే, మరొకరు మన పట్ల అదే బాధ్యత వహిస్తారు. ఎవ్వరితో నాకేమిపని అనుకుంటే ఎవ్వరికీ కాకుండా పోతారు.

సమాజం అనేది ఒక వ్యవస్త. ఇది అందరికీ ఆమోదయోగ్యమయిన సుత్రాలతో పనిచేస్తుంది. సమాజానికి అందులో ప్రతి వ్యక్తీ సమానమే. ఏ ఒక్కరూ సమాజ రీతికి వ్యతిరేకంగా నడవజాలరు. ఒక వేళ సమాజ సూత్రాలు ఎక్కువ మందికి నచ్చకపోతే, వారిని ఇబ్బందికరంగా వుండి వుంటే ఇన్ని వేల సంవత్సరాలుగా మనగలిగి వుండేవి కావు. కొన్ని వేల సంవత్సరాలుగా మానవ సమాజం ఎన్నో ప్రయోగాలు చేసి ఇప్పుడు మనం చూస్తున్న స్తితికి వచ్చింది. బుద్దిగా తలొంచుకు పోవడానికి, రాము గారిలాగా రాముడు మంచి బాలుడే కానక్కర్లేదు. కాస్త ఇంగిత జ్ఞానం వున్నవాడు, సంస్కారం వున్నవారెవ్వయినా చాలు. సమాజాన్ని మనమేమీ వుద్దరించనక్కర్లేదు. వున్నదాన్ని మన కలుషిత ఆలోచనలతో, అర్ధంలేని వితండ వాదంతో పాడు చెయ్యకుంటే చాలు. 

Saturday, July 24, 2010

ప్రపంచంలో తెలుగు వాడంత గొప్ప వాడు లేడు..

నిజమేనండి... మీరు నమ్మి తీరాల్సిందే. ఇప్పటి వరకు తెలుగు వారికి వున్న గొప్పదనాలకి తోడు ఎవరిచేతనయినా తన్నించుకోవాలన్నా, కుమ్మించుకోవాలన్నా, మెడ పెట్టి గెంటించుకోవాలన్నా తెలుగు వారే అందరికీ ఆదర్శం. తెలుగు వారి గొప్పదనం గురించి చెప్పాలంటే ఇంకా చాలా వుంది. ఒక సారి దూరదర్శన్ లో అనుకుంటా, చాలాకాలం క్రితం సంగతి.. జంధ్యాల గారు ముచ్చటిస్తూ... తెలుగువారు ఎప్పుడూ కూడా తాము చెప్పిందే రైటు అంటారట. అది నిజంకాకపోయినా నిజమయ్యేంత వరకు వాదిస్తారట. ఎవరికి వారు తామే రైటు అనుకుంటారట కూడా. అందుకే మన తెలుగు భాషలో ప్రతీ అక్షరానికి నెత్తిమీద "రైట్" మార్క్ వుంటుందట. మీరే చూడండి... క, గ, ర, మ, న ప్రతీ అక్షరానికీ నెత్తి మీద ఒక "రైట్" మార్క్ వుంటుంది.

తెలుగువాడికి వున్న మరో అలవాటు.. ఎలాంటి పరిస్తితిలో అయినా ఇమిడి పోతాడట.. అంటే "అందితే జుట్టు, అందక పోతే: కాళ్ళు" అన్న మాట. అందుకే మన తెలుగు అక్షరాల్లో మరే భాషలోనూ లేని విధంగా ఒక అక్షరం మీద ఒకటి ఎక్కి కూర్చుంటాయి. ఒక పెద్ద అక్షరం కింద మరో చిన్న అక్షరం దూరిపోతుంది. అంటే అవకాశం  దొరికితే ఒకరి మీద పెత్తనం చేస్తాం... అది కుదరక పోతే ఒకరి కాళ్ళ దగ్గర పడి వుండడానికి కూడా వెనకాడమన్న మాట.... అంతా ఎందుకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి డిల్లీ లో పెద్దల దగ్గర వీర విధేయులుగ వున్నది తెలుగువారే అన్నది అందరికీ తెలిసిందే. అందరికన్నా ఎక్కువ ఎం.పీ.లని పపంది మనమే అయినా గాని రాష్ట్రానికి ఒక్క మంచి ప్రాజెక్టునీ దక్కించుకోలేము. మన మాట నెగ్గించుకోలేము. ఆ భయం ఎందుకో అర్ధం కాదు. అది మంచితనమో, చేతగానితనమో మనకి అర్ధం కాదు.

తెలుగువారికున్న మరో లక్షణం... "ఆత్మ నింద, పర స్తుతి" అట. అంటే మనల్ని మనం తిట్టు కోవడంలో, మరొకళ్ళని పొగడడంలోనూ ఎప్పుడూ ముందుంటాం. అలాగే ఎవరయిన మనల్ని గురించి తిడుతూ ఉంటే అదేమిటని అడగం. బదులుగా ఆహా మహ బాగా తిడుతున్నాడురా బాబు అని మహదానందంగా వింటాం. అదే తెలుగు వాడికున్న గొప్పదనం

"ఆంధ్రులు ఆరంభ శూరులు " అన్న సామెత ఎలాగో వుండనే వుంది. ఏ పనయినా మొదలెట్టేప్పుడు వుండే ఉత్సాహం ఆ పని పూర్తి చేసేప్పుడు వుండదు. ఎప్పుడు ఏ పనిని మొదలుపెడతామో ఎందుకు ఆ పని మధ్యలో ఆపేసి మరో పనిలోకి వెళ్ళిపోతామో మనకే తెలీదు. ఒక ముఖ్య మంత్రి వుండగా నీటి ప్రాజెక్టులు, రకరకాల పధకాలు మొదలెట్టేస్తాము. మరో ముఖ్యమంత్రి వచ్చేసరికి కాళ్ళు లాగి మూల పెట్టేస్తారు.

ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఎప్పుడూ తెలుగులో పలకరించుకోరట. చాలాసార్లు అది నిజమే అనిపించింది నా అనుభవంలో. ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలోనే పలకరించుకుంటారు. ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే హిందీ లోనే పలకరించుకుంటారు. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం "Hai, How are you? What are you doing" అని పరాయి భాషలో కులుకు ఒకలబోస్తారు. ఇంటికెవరయినా చుట్టాలొస్తే, మా పాపని పిలిచి "What's your name?" అని అడుగుతారు. నాకు వళ్ళు మండి పోతుంది. కాని తప్పదు కదా.. వచ్చింది Relatives ఆయే.

మరో ముఖ్య విషయం ఏమిటంటే భారతీయ భాషలన్నింటిలోనూ ఎక్కువ పరాయి భాషా పదాలు దొర్లే భాష తెలుగు మాత్రమే. నేను విన్నది నిజమో కాదో తెలుసుకోవడానికి మా సిటీ కేబుల్ లో రోజుకొక చానల్ చొప్పున అన్ని భాషల చానల్స్ చూసాను. ఎన్ని ఇంగ్లీష్ పదాలు దొర్లుతాయో అని. ఆ గంట లోనూ మొత్తం మీద 4 లేక 5 పదాలు మాత్రమే కనిపించాయి... కాదు.. కాదు వినిపించాయి. అదే తెలుగులో చూడండి... తెలుగు ఎక్కడుందో భూతద్దంతో వెతుక్కోవాలి. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్లు వుంటుంది పరిస్తితి.. అదండి సంగతి... ఇలాంటి ఇంకా చాలా వున్నాయి... తరువాతి టపాల్లో ముచ్చటించుకుందాము.... అందాకా....

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా... గతమెంతొ ఘన కీర్తి కలవోడా....

Monday, July 12, 2010

ఫ్రెషర్స్ డే ఫంక్షన్‌లో మా చిట్టితల్లుల సందడులు...

మిగతా ఫోటోలు... పిల్లల ఆటలు.. పాటలు...

జూలై 8, గురువారం మా చిట్టితల్లుల ఆటపాటలతో గమిని ఫంక్షన్ ప్లాజా దద్దరిల్లింది. చక్కటి ఆహ్లాదకరమయిన వాతావరణంలో, రాష్ట్ర జర్నలిష్టుల సంఘం అధ్యక్షులు శ్రీ దూసనపూడి సోమసుందర్ ముఖ్య అతిధిగా హాజరయిన ఈ కార్యక్రమం పూర్తిగా విద్యార్ధినుల ఆధ్వర్యంలోనే జరగడం విశేషం. అంటే యాంకరింగ్, ప్రోగ్రాం సీక్వెన్స్, ఇలా ప్రతీదీ స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు. పిల్లలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికే ఈ ఏర్పాటు చేసాము.

మా విద్యార్ధినిలు సనాతన భారతీయ విలువలను అర్ధం చేసుకుంటూనే, అత్యాధునిక టెక్నాలజీతో స్నేహం చేస్తారు. ప్రపంచంలోని ఏ లేటెస్ట్ టెక్నాలజీ గురించయినా చెప్పగల సమర్ధత వారి సొంతం. మా కాలేజ్ లో అత్యాధునిక L.C.D Projectors, Modern Science Labs, Fully Automatic Attendance System, Automatic SMS to Parents, Computerised period & Class maintenance వంటివి మచ్చుకి కొన్ని మాత్రమే.

ఒక మంచి ఆశయంతో, నిజాయితీగా పనిచేస్తే అందరి ఆదరణా లభిస్తుందని మా విషయంలో రుజువయింది. కార్పోరేట్ విద్యా సంస్తల్లో పిల్లలు పడుతున్న ఆవేదనని అర్ధం చేసుకుని, తల్లిదండ్రుల ఆకాంక్షలకి అనుగుణంగా, తాడేపల్లిగూడెం పట్టణంలో సకల సౌకర్యాలతో ప్రారంభించబడిన మా కాలేజీలో ఈ సంవత్సరం ఎవరూ ఊహించని విధంగా చక్కటి అడ్మిషన్లు జరిగాయి. ర్యాంకులు, మార్కులు సాధించడం కోసం పిల్లల్ని బలిపశువుల్ని చేయనవసరం లేకుండా, చక్కటి ప్రశాంత వాతావరణం కల్పించి, వారికి తగిన స్వేచ్చనిచ్చి, బట్టి పద్దతిలో కాకుండా వారికి అర్ధమయ్యే విధంగా విద్యాబోధన చేస్తే వున్నత ఫలితాలు సాధించవచ్చని నిరూపించాము.

మీ అందరి ఆశీస్సులు, సూచనలు, ప్రోత్సాహంతో మరింత ముందుకి వెళ్ళగలమని తెలియజేస్తూ... 
మీ జగదీష్ రెడ్డి, 
సెక్రటరి & కరస్పాండెంట్, శ్రీ వైష్ణవి గర్ల్స్ జూనియర్ కాలేజ్.

Monday, July 5, 2010

అసలు మనం మనుషులమేనా?

చిన్న పిల్లలతో అర్ధనగ్నంగా పిచ్చి గంతులు వేయించడం, చూడడానికి ఎబ్బెట్టు కలిగించేలా రకరకాల వింత బట్టలు వేయడం మధ్యన టీ.వీ.ల్లో పెద్ద ఫ్యాషనయిపోయింది. పైగా ఈ పైత్యానికి రియాలిటీ షోలని, ఆట అని పేర్లొకటి. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ తీవ్రంగా స్పందించి టీ.వీ.ల్లో ప్రసారమయ్యే ఇటువంటి షోల వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, వారి హక్కులని కాలరాసినట్టవుతుందని భావిస్తూ, అటువంతి షోలని నిషేదించాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పింది. అయినా, ఇవేమీ తలకెక్కని సదరు షో నిర్వాహకులు, టీ.వీ. సంస్థల వాళ్ళు ఎటువంటి స్పందనా కనబరచక, పైగా చట్టంలో వున్న లొసుగుల్ని ఆసరాగా చేసుకుని, మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుని మరీ, నిర్లజ్జగా తమ కార్యక్రమాల్ని కొనసాగించుకుంటున్నారు. దీనికి తల్లిదండ్రుల మద్దతు కూడా పూర్తిగా వుంది అనే విషయం తెలుస్తూంది.

ఈ నేపధ్యంలో ఈ రియాలిటీ షోల కోసం పిల్లలు ఎంత హింస అనుభవిస్తారో, ఎంతగా నలిగిపోతారో తెలుసుకుంటే కడుపు తరుక్కుపోతుంది, గుండె రగిలిపోతుంది. ఈ షోలకి సిద్దంచేసే పిల్లల్ని రోజుకి  కనీసం 16 నుంచి 20 గంటల పాటు "ప్రాక్టీస్" చేయిస్తారట. ఇక్కడ మనం మాట్లాడుకునేది నిండా పదేళ్ళు కూడా దాటని చిన్న పిల్లల గురించి అని మరచిపోవద్దు. అంత చిన్న పిల్ల చేత అన్నేసి గంటల పాటు ప్రాక్టిస్ చేయిస్తే వాళ్ళు ఎలా తట్టుకుంటారో, ఎంత నరకం అనుభవిస్తారో మనకి ఊహలకి కూడా అందదు. పెద్దవాళ్ళమయిన మనమే రోజుకి ఏదయినా పది పన్నెండు గంటలకి మించి కష్టపడలేము కదా.. అటువంటిది అంత చిన్న పిల్లలు అంత కష్టాన్ని ఎలా భరిస్తారో అందరూ  ఆలోచించాలి.

అసభ్యత ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్ప షోగా నిర్వాహకులు భావిస్తారేమో తెలియదు. పిల్లలకి వేసే దుస్తులు ఎంత చండాలంగా వుంటాయంటే, పెద్ద వాళ్ళు కూడా వేసుకోవడానికి సిగ్గుపడేలా వుంటాయి. పాటల విషయానికి వస్తే అన్నీ ముదురు పాటలు, వయసుకు మించిన హావ భావాలతో పరమ దరిద్రంగా వుంటాయి. చిన్న పిల్లల్ని చూసినా, వారి మాటలు విన్నా ఎంతటి వెధవకయినా మనసు కరుగుతుంది. మనిషిలో వున్న పసి మనసు తొంగిచూస్తుంది. వారి ముద్దు ముద్దు మాటలు వింటూ పరవశించాలనిపిస్తుంది. ఆ పసితనపు ఒడిలో ఆడుకోవాలనిపిస్తుంది. కాని ఈ రాక్షసులకి వారిలో ఒక బూతు పాటలకి డ్యాన్స్ వేసే "నటీమణి"  కనిపిస్తుంది. సినిమాల్లోని కామాన్ని ప్రకోపింపచేసే వారి భంగిమలు గుర్తొస్తాయి. చిన్నారు చేసే ఆ చిన్ని కుప్పిగంతుల్ని సినిమా వాళ్ళతో పోల్చి ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా బాగా తిప్పుకోవాలి అంటూ పనికి మాలిన చెత్త కామెంట్లొకటి. మళ్ళీ వాళ్ళళ్ళొ వాళ్ళకి పోటీ పెట్టి ఎలిమినేషన్ చేస్తామని చెప్పి, వాళ్ళు ఏడుస్తుంటే ముఖాలని క్లోజప్ లో పెట్టి వారి కన్నీటిబొట్టుని కూడా ప్రసారం చేసి,  అందరి జాలిని, సానుభూతిని పొందడం. చూస్తూనే వళ్ళు జలదరిస్తుంది. ద్వందార్ధపు సాహిత్యం వుండే పాటలకి, చండాలంగా వుండే డ్రెస్సులు వేసి చిన్నారుల చేత వేయించే కుప్పిగంతుల్ని సంస్కారం వున్నవారెవరూ డ్యాన్స్  అనరు, పైత్యపు వికారం అంటారు. ఇటువంటి షోలు చూసి ఆనందించే వారిని సైకాలజీలో "పీడోఫీలియన్స్" అంటారు. అంటే చిన్నపిల్లల పట్ల లైంగిక వాంచ కలిగిన మానసిక రోగులన్నమాట.

ఫ్లడ్ లైట్ల వెలుగులో చిన్నారు జీవితాలు ఎలా మసిబారుతున్నాయో, పిచ్చి పిచ్చి చేష్టలకి చిన్నారుల మనసులు ఎంత కలుషితం  అవుతున్నాయో అటు తల్లిదండ్రులకి, టి.వీ. షో నిర్వాహకులకి పట్టడం లేదు. నాకు తెలియక అడుగుతున్నాను... పిల్లలకి పేరు ప్రఖ్యాతులు రావాలని తల్లిదండ్రులు ఆశ పడడం తప్పు  లేదు. కాని పిల్లల చేత రికార్డింగ్ డ్యన్సులు వేయించాలనుకోవడం ముమ్మాటికీ తప్పే. ఇక్కడ మరో సంగటి చెప్పాలి. రికార్డింగ్ డ్యాన్సులు వేసే వారు వేరే గతి లేక బజారులో బట్ట విప్పుకుని గంతులేస్తారు. అటువంటి వారిమీద పోలీస్ కేసు పెడతారు. టీ.వీ.ల్లో రహస్య కెమేరాలు పెట్టి ఫ్లాష్ న్యూస్ ప్రసారం చేస్తారు. కాని అదే టీ.వీ. చానళ్ళు చిన్నపిల్లల రికార్డింగ్ డ్యాన్సుల్ని స్పెషల్ షోలకిందా చూపిస్తారు. టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి ఇంతగా దిగజారక్కర్లేదనుకుంటాను.
ఇవన్నీ చూస్తూ కూడా, చేష్టలుడిగి చూస్తున్న ఈ సమాజం, ఈ ప్రభుత్వం, ఈ న్యాయ వ్యవస్త, అసలున్నట్లా? లేనట్లా? అసలు మనం వున్నది మానవ సమాజంలోనా, లేదా ఆటవికులు, రాక్షసులు, జంతువులూ వుండే ఆటవిక సమాజంలోనా? అసలు మనం మనుషులమేనా? రాక్షసులమా?