Pages

Friday, July 22, 2011

కార్పొరేట్‌ కాలేజీలు - కోళ్ళ ఫారాలు - ఒక పోలిక

జనాలకి చదువు మీద మోజు పెరిగిందో లేక కార్పొరేట్లకి చదువు చెప్పాలని బుద్ది పుట్టిందో తెలీదు కాని, రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా కార్పొరేట్‌ సూల్స్‌, కాలేజీలు తామర తంపరగా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఈ జాడ్యం దేశం మొత్తం మీద ఆంధ్రరాష్ట్రంలో ఎక్కువగా ఉందంటే అతిశయోక్తి కాదు. అసలే మనం ఆంధ్రులం - అందులోను ఆరంభశూరులం. ఏ పనైనా మొదలంటూ పెట్టం - మూడ్‌ వచ్చి మొదలు పెడితే మాత్రం అందరూ ఒకే పని చేస్తాం. ఒకేసారి కొన్ని వందల స్కూల్స్‌, కాలేజీలు స్థాపిస్తాం. ఒకేసారి కొన్ని పదుల ప్రాజెక్టులు మొదలుపెట్టేస్తాం - అవి పూర్తయినా అవ్వకపోయినా మనకనవసరం. సక్సెస్‌ అయినా కాకపోయినా పట్టించుకోం. ఎదుటి వాడు చేసాడు కాబట్టి మనం కూడా చేసెయ్యాలి - అంతే... ఎదురింటి వాడి కొడుకు డాక్టరో - ఇంజినీరో అయ్యాడు కాబట్టి మనం కూడా మన పిల్లల్ని ఇంజినీర్‌ చేసేయాలి. మన తెగులు ఇలా తగులడింది కాబట్టే - ఒక ప్రఖ్యాత కార్పొరేట్‌ స్కూల్‌ మంచి క్యాప్షన్‌ పెట్టింది - అందరికీ కనబడేలా - హోర్డింగ్‌ల్లో - ''మా స్కూల్లో వేసే ప్రతి అడుగు - ప్రతి అడుగు ఐ.ఐ.టి / మెడిసిన్‌వైపు మాత్రమే '' అంటూ ఊదరగొట్టి పాడేస్తున్నారు. పిల్లలు ఏమయి పోయినా పర్లేదు - వారికి డాక్టర్‌ అవ్వాలని లేకపోయినా - ఆరోగ్యం నాశనమయిపోయినా - జీవితం మీద విరక్తి పుట్టినా - చివరికి ఆత్మహత్య చేసుకున్నా - వాళ్ళు ఇంజినీరో, డాక్టరో అయిపోవాల్సిందే. మనం అప్పులు చేసయినా సరే వాళ్ళని కార్పొరేట్‌ స్కూల్లో చేర్పించాల్సిందే..

   ఇదంతా ఎప్పుడూ చెప్పుకునేదే కాని - విద్య కూడా వ్యాపారమయిపోయిన తరువాత ఈ విద్యా వ్యాపారస్తులు పవిత్ర విద్యాసంస్థల్ని ఎలా తయారు చేసారో తలుచుకుంటే మనసుకి బాధ కలుగుతుంది. ఒకప్పుడు కాలేజ్‌ అంటే విశాలమైన ప్రాంగణం -  చుట్టూ పచ్చటి చెట్లు - ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్‌ - ఎన్ని ఉండేవని... అవన్నీ గత కాలపు హిమసమూహాలు... ఇప్పుడన్నీ కోళ్ళ ఫారాలే... అందుకే సరదాగా - కోళ్ళఫారాలకి - కార్పొరేట్‌ కాలేజీలకి చిన్నపోలిక...


1. కోళ్ళ ఫారం పెట్టడానికి చిన్న షెడ్‌ ఉంటే చాలు - చుట్టూ గ్రౌండ్‌ కూడా అక్కర్లేదు. కాలేజ్‌కి కూడా అదే షెడ్‌ సరిపోతుంది.

2. ఒకో వరుసలో దగ్గర దగ్గరగా ఎన్ని కోళ్ళయినా సర్దవచ్చు. అవి అటూ ఇటూ తిరగడానికి కూడా స్థలం అవసరం లేదు - కాలేజ్‌లో కూడా అంతే... చదవడం తప్ప వేరే పనేముంటుంది తప్ప? అందుకే ఒక సెక్షన్‌లో ఎంతమందినయినా దగ్గరగా ఇరికించి కూర్చోబెట్టవచ్చు.

3. కోళ్ళు గుడ్లు పెడితే మంచి లాభం - పిల్లలు ఎన్ని ర్యాంకులు పెడితే కాలేజీకి అంత లాభం.

4. గుడ్లు పెట్టిన తరువాత కోళ్ళని కూడా అమ్మేసుకోవచ్చు - ర్యాంకులు వచ్చిన తరువాత పిల్లల్ని వేరే కాలేజీలకి కమీషన్‌ పద్దతిని అమ్ముకోవచ్చు.

5. కోడి గుడ్డు పెట్టిందా లేదా అనేది ముఖ్యం గాని - దాని మనసుతో మనకి పనేముంది? - పిల్లలకి ర్యాంక్‌ వచ్చిందా లేదా అన్నది ముఖ్యంగాని వాళ్ళు ఎలా పోతే మనకేం?

6. ఎక్కువ గుడ్లు పెట్టాలి అంటే కోళ్ళకి రోజూ 24 గంటలూ తిండి పెడుతూనే ఉండాలి. దానికి టైమూ పాడు అక్కర్లేదు - పిల్లలకి మంచి ర్యాంకు రావాలంటే 24 గంటలూ బండబట్టీ పట్టిస్తూనే ఉండాలి. దానికి టైమ్‌ టేబుల్‌ అంటూ ఏదీ ఉండదు. నిద్ర వస్తున్నా - ఆకలేస్తున్నా - నీరసంగా ఉన్నా - చదువుతూనే ఉండాలి. కనీసం చదివినట్టు నటించాలి.



ఇవండీ... ఇంకా చాలా ఉండొచ్చు. మీకేమైనా గుర్తొస్తే మా అందరితోను పంచుకోండి...

Thursday, July 14, 2011

ఈ మౌనం - అత్యంత ప్రమాదకరం

    దేశ ఆర్థిక రాజధానిపై ఉగ్రవాద రాక్షస మూకల దాడుల పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి. జూలై 13వ తేదీన సంభవించిన పేలుళ్ళు కేవలం పాత ఘటనలకు కొనసాగింపు మాత్రమే. ఇంకా ఇటువంటి అకృత్యాలు ఎన్నో చూడాల్సి రావచ్చు. అది ముంబయిలో కావచ్చు, హైదరాబాద్‌లో కావచ్చు, మరెక్కడైనా కావచ్చు. కాని బలయ్యేది అమాయక ప్రజలు మాత్రమే. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు మీడియా వాళ్ళకి పండగే పండగ. చూపించిందే చూపించి, చెప్పిందే చెప్పి, జనాల్ని భయపెడుతూ ఉంటారు. న్యూయార్క్‌ నగరంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి జరిగినపుడు కూడా విమానాలు భవనాల్ని కూల్చివేయడం మీడియాలో వచ్చిందే తప్ప, అక్కడ చనిపోయిన వారి మృతదేహాల్ని క్లోజప్‌లో చూపించి, భయపెట్టినట్లు గుర్తులేదు. కాని మన మీడియాలో మాత్రం పొద్దున్నే లేచి ఏ పేపర్‌ తిరగేసినా ముందు పేజీలో భారీ సైజులో రక్తసిక్తం చేసిపారేసారు. మీడియా కొంచెం సంయమనం పాటిస్తే బాగుండును.

    ఎప్పటిలాగే పేలుళ్ళు జరిగిన వెంటనే ప్రధాని, కేంద్ర రక్షణ మంత్రి - మహారాష్ట్ర సిఎంతో ఫోన్‌లో మాట్లాడేసారు. హోంమంత్రిగారు ఇది ఉగ్రవాదుల దుశ్చర్య అని శెలవిచ్చారు. ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలు ఇది దురదృష్టకర సంఘటన అంటూ తీవ్రంగా ఖండించేసారు (దేనితో ఖండించారో నాక్కూడా తెలియదు). కాని ఎవరి నోటి వెంటా కూడా ఈ చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదుల్ని వెంటనే ఏరిపారేస్తాం (విచారణ లేకుండా) అని మాత్రం అనడం లేదు. బిన్‌లాడెన్‌ విషయంలో అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ప్రపంచానికి మార్గదర్శనం కావాలి. విచారణ మాట దేవుడెరుగు. దొరికిన వాడిని దొరికినట్టే చంపి పారేసింది.కనీసం మృతదేహం కనిపించకుండా మహాసముద్రంలో విసిరిపారేసింది. అలా చేస్తే మరొకడు భయపడతాడు గాని, చేతికి దొరికిన నిందితుల్ని కూడా విచారణ పేరు చెప్పి శిక్షించకుండా కాలయాపన చేయడం ప్రమాదకర సంకేతాల్ని సమాజానికి పంపిస్తుంది. అదే తప్పు మరోసారి పునరావృతమయ్యేలా  చేస్తుంది.

    ఆకలి కోసం ఒక చిన్న దొంగతనానికి పాల్పడితే అందరం కలిసి, చావచితక్కొట్టేస్తాం - అంతెందుకు - కొంచెం రక్తం తాగిన పాపానికి దోమని ఒక్క దెబ్బతో చంపిపాడేస్తాం. అంతే గాని పాపం దోమ - జీవకారుణ్యం -దానికేమీ తెలీదు - దోమకి ఆహారం పెడదాం అని ఎవరమైనా ఆలోచిస్తామా? అలాంటిది అమాయకులైన సాటి మనుషుల నిండు ప్రాణాన్ని కిరాతకంగా బలిగొంటున్న వారికి శిక్ష వెయ్యనక్కర్లేదా? ప్రత్యేక రాష్ట్రాలు కావాలి అంటూ రోడ్లెక్కే నేతలు ఇలాంటి నరరూప రాక్షసుల ప్రాణాలు తీయండి అంటూ నినాదాలు ఎందుకు చేయరు? ఎందుకంటే - వారికి ఓట్ల బ్యాంకు కావాలి కాబట్టి - ఒక వర్గం వారి సానుభూతి కావాలి కాబట్టి. మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు - దేశ ప్రజలు మాత్రం సంయమనం పాటించాలి. జరిగినదంతా పీడకలలా మర్చిపోవాలి. ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ చేస్తుంది. దోషులు పాకిస్థాన్‌లో ఉన్నారని తేలుతుంది. తప్పితే హైదరాబాద్‌లో హాయిగా ఉండినా ఉండొచ్చు. కాని పట్టుకొనే ధైర్యం, వారిని కాల్చి చంపే ధైర్యం మన పాలకులకి లేదు. ఇంకా ఇలాంటివే సహిస్తూ ఉంటే ప్రపంచ దేశాల్లో మనల్ని గొప్ప దేశంగా చూడనే చూడరు. చేతకాని చవట దద్దమ్మల్లా చూస్తారు.

    ఇప్పటికైనా ప్రభుత్వం కార్యాచరణకి పూనుకోవాలి. ఇప్పటకే ప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్న తీవ్రవాదులందరికీ మరణ శిక్షను అమలు చేయాలి. మనిషిని చంపిన వాడికి విచారణ అనవసరం. ఎందుకంటే అది కక్షతో చేసింది కాదు - మతోన్మాదంతో చేసింది. ఏ పాపం తెలియని అమాయకుల్ని ఏ కారణం లేకుండా చంపే అధికారం ఎవరికీలేదు. ఉగ్రవాదానికి పాల్పడేది ఎవరైనా కానివ్వండి - ఏ మతమైనా - ఏ కులమైనా - ఏ ప్రాంతం వారైనా వారు శిక్షని అనుభవించే తీరాలి. ఉగ్రవాదుల్ని చంపిన పోలీసులకి / సాయుధదళాలకి ప్రత్యేక రివార్డులు ప్రకటించాలి. దేశంలో ఏ వర్గం లేదా కొన్ని వర్గాల వారు తప్పుచేసినా శిక్ష పడదు అనే అభిప్రాయానికి రాకుండా చట్టం ముందు అందరూ సమానమే అనిపించేలా చట్ట సవరణ జరగాలి. రెడ్‌ హాండెడ్‌గా పట్టుబడ్డ ఉగ్రవాదుల్ని గరిష్టంగా వారం రోజుల వ్యవధిలోనే విచారణలు పూర్తిచేసి మరణ శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజలు నమ్మకంతో ఉండగలుగుతారు. తమ బతుక్కి భరోసా ఉందనే భద్రతా భావంలో ఆనందంగా ఉంటారు.

(మహాకవి రాసిన కవితకి అనుకరణ)

దేవుడా.... రక్షించు ఈ దేశాన్ని...

ఓటు బ్యాంకు రాజకీయాల నుండి

ముసలి అసమర్థ నాయకుల నుండి

గాంధీ వన్నె కుటుంబాల నుండి

కపట కాషాయ ధారుల నుండి

ప్రాంతీయ వాదాల నుండి

కులాల బారి నుండి

జీహాద్‌, క్రూసేడ్‌ యుద్ధాల నుండి

ఉగ్రవాదుల నుండి.....

దేవుడేడి...........

????????????????


Friday, July 8, 2011

అనంత పద్మనాభుని అనంత సంపద - కొన్ని కొత్త కోణాలు - ఆలోచనలు

    శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడ్డ అనంతమైన సంపదతో భారత దేశ పురాతన వైభవం మరొక సారి వెలుగులోకి వచ్చినట్లయింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక సంపద, ఆదాయం కలిగిన తిరుమల శ్రీనివాసుని పక్కకు నెట్టివేయగలిగినంత సంపద (సుమారు లక్షన్నర కోట్ల రూపాయిలు కన్నా ఎక్కువ) వెలుగుచూడడం ప్రపంచమంతటినీ విస్మయానికి గురిచేసింది. టన్నుల కొద్దీ బంగారం, వెలకట్టలేనన్ని వజ్ర, వైఢూర్యాలు, పచ్చలు, బంగారు నాణాలు, నగలు ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాలుగా నేలమాళిగలో మగ్గిపోయాయి. ఇదివరకెన్నడూ చూడని పెద్దపెద్ద బంగారు విగ్రహాలు, నగిషీలు, ఏ దేవతల చేతనో చెక్కబడ్డాయా అనిపించే చేతికళా నైపుణ్యం కలిగిన బంగారు ఆభరణాలు - ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఇప్పటి వరకు ఎన్నడూ ఒక్క చోట చూడనంత సంపద పద్మనాభస్వామి ఆలయంలో బయటపడింది. కేరళలో ట్రావెన్‌కోర్‌ సంస్థానాధీశులచే నిర్మించబడి, నిర్వహించబడుచున్న ఈ ఆలయంలో ఇంత సంపద ఇప్పుడు బయటపడడం పురాతన భారతీయ సంపద మీద కొత్త కోణాల్ని ప్రసరింపజేస్తుంది.

    ఇప్పటి వరకు చరిత్ర పుస్తకాల్లో భారతదేశం అత్యంత అనాగరిక, నిరుపేద దేశమని, ఇక్కడి ప్రజలు నిరక్షరాస్యులని, రాజులు నిత్యం యుద్దాలతో కొట్టుకు చస్తూ ఉండేవారని చదువుకున్నాం. కాని, ఈనాడు బయటపడ్డ ఈ సంపద ప్రపంచం యొక్క పురాతన నమ్మకాన్ని ప్రశ్నించే విధంగా ఉంది. ఇప్పటి వరకు చరిత్రను పాశ్చాత్య కళ్ళద్దాలతో చదువుకున్న ప్రపంచమంతా ఈ సంఘటనతో నివ్వెరపోయింది. పురాతన భారత దేశం - మనం అనుకున్నట్లుగా పేదది కాదు. ఆనాటి ప్రపంచంలోనే అత్యధిక ధనవంతమైన దేశం. ముస్లిం సుల్తానులు దండయాత్రలు చేసినా, బ్రిటిష్‌ వారు, ఇతర యూరోపియన్లు వ్యాపారం పేరు చెప్పి వచ్చినా అది భారతదేశంలో ఉన్న అపరిమితమైన సంపదను కొల్లగొట్టడానికే. డబ్బున్న దేశానికే అందరూ వెళతారు గాని, నిరుపేద దేశానికి ఎవరూ వెళ్ళి వ్యాపారం, యుద్దాలు చేద్దామని అనుకోరు కదా. ఒక్క అనంత పద్మనాభస్వామి ఆలయంలోనే ఇంత సంపద ఉంటే, భారత దేశం మొత్తం మీద అన్ని ఆలయాల్లోను కలిపి ఎంత సంపద ఉంటుందో మనం తేలికగానే లెక్కపెట్టవచ్చు. అది కూడా సుల్తానులు, పాశ్చాత్య దేశీయులు కలిపి ఎంతో దోచుకున్న తరువాత, స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన  అధికారులు, రాజకీయ నాయకులు కలిపి మింగేసిన తరువాత కూడా మిగిలిన సంపద ఇది అని గమనించాలి.

    ఇంత సంపదని ఏం చేద్దామనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నిజానికి ఆలయంలో బయటపడ్డ నిధికి వెలకట్టలేం. వాటికి ఉన్న పురావస్తు ప్రాధాన్యత దృష్ట్యా చూసినా ఇప్పటి వరకు లెక్క చూసిన దానికన్నా కనీసం నాలుగైదు రెట్లు ఎక్కువ ఉండవచ్చు. ఈ మొత్తంతో (అంటే సుమారు లక్షన్నర కోట్లతో) అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేయవచ్చని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని కొన్ని ఊహాగానాలు వినపడుతున్నాయి. కాని అది కార్యరూపంలో సాధ్యం కాదు. ఎందుకంటే కేవలం బంగారం, వజ్రాలు వంటివి ఇచ్చినంత మాత్రాన ఎవరూ పనులు చేయరు కదా. ఎవరైనా ఒక కార్యక్రమం చేపట్టాలి అంటే మన రూపాయిలు కరెన్సీ కట్టలు కావాలి. అలా డబ్బులు కావాలంటే ఈ సంపద మొత్తాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్మేయాలి. కాని ఒకదేశానికి గర్వకారణమైన ఆ దేశ పురాతన సంపదను, వారసత్వ వస్తువుల్ని బహిరంగ మార్కెట్‌లో అమ్మడానికి ఏ సమాజము ఒప్పుకోదు. ఏ ప్రభుత్వమూ దానికి సాహసించదు. అందుచేత ఆ సంపద మొత్తాన్ని అదే దేవాలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రజలకు / భక్తులకు సందర్శించడానికి ఏర్పాట్లు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినట్లుగా భక్తుల ద్వారా ఆదాయంతో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చు. తద్వారా ఎవరి మనో భావాలు  దెబ్బతినకుండా, ఆలయ సంపద బయటకు పోకుండా, దేశ ప్రతిష్ట మసకబారకుండా జాగ్రత్త పడినట్లు అవుతుంది.  ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి ఉమన్‌ ఛాందీ, సంపద మొత్తం ఆలయానికి చెందుతుందని ఒక ప్రకటనలో పేర్కొనడం ఆహ్వానించదగ్గ విషయం.

    కాని, గత అనుభవాల దృష్ట్యా, ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల చిత్తశుద్దిని మనం శంకించాల్సి వస్తుంది. తిరుమల వేంకటేశ్వరుని నగలు కొన్ని మాయమైపోవడం, హైదరాబాద్‌, భారత్‌లోని ఇతర సంస్థానాల్లో అపూర్వ వస్తు సంపద, వారసత్వ కళా విశేషాలు కనిపించకుండా పోయిన వైనం ప్రజల మనస్సుల్లో మెదులుతూనే ఉంది. సుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి, ప్రభుత్వం పూర్తి సంపదను రికార్డ్‌ చేసి, రాజకీయ ప్రమేయం లేని విధంగా, సమాజంలో నిజాయితీ పరులైన ప్రముఖులతో ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో, ప్రజల మనోభావాలు, సెంటిమెంట్స్‌ దెబ్బతినకుండా ఆ సంపదను పద్మనాభుని సన్నిధానంలోనే ఉంచితే అది అందరికీ ఆనందదాయకం కాగలదు.