Pages

Friday, May 26, 2017

భారతదేశం అత్యంత సురక్షితమైన ప్రదేశం

    భారతదేశం అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పాకిస్థాన్‌ చెర నుండి విడిపింపబడి, తిరిగి భారతదేశానికి వచ్చిన ఉజ్మా అహ్మద్‌ అనే మహిళ అభిప్రాయపడ్డారు. ఒక పాకిస్థాన్‌ జాతీయుడితో బలవంతంగా వివాహ బంధంలో చిక్కుకుని అక్కడకు వెళ్ళిన ఉజ్మా అక్కడి పరిస్థితులలో ఇమడలేకపోయారు. ఆ దేశాన్ని ఒక 'మృత్యు బావి' గా అభివర్ణించారు. భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్‌ను సమర్థించే వారంతా ఈ సంఘటనతో కళ్లు తెరవాలి. నిజానికి భారతదేశం ఏ సంస్కృతి, సాంప్రదాయాలను అనుసరించే వారు ఎవరికైనా సురక్షితమైన ప్రదేశం. వారి వారి ఆచారాల్ని, సంస్కృతిని అవలంభిస్తూనే ఇక్కడి సాంప్రదాయాలతో మమేకమై తమ జీవనాన్ని సాగించవచ్చు. వారిని ఇక్కడి మతంలోకి మారమనిగాని, ఇక్కడి ఆచారాల్ని అనుసరించమని గాని ఎవరూ బలవంతం పెట్టరు. ఎటువంటి ప్రలోభాలకి గురిచేయరు. ''మనం బాగుండాలి, మనతో పాటు అందరం బాగుండాలి'' అనేది ఇక్కడి ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న అత్యున్నత జీవన ప్రమాణం.

    గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని విదేశీ మతాలు, అక్కడి బానిస ఆలోచనా విధానాల్ని పుణికిపుచ్చుకున్న స్వదేశానికి చెందిన స్వయం ప్రకటిత మేధావులు ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా అవలంభిస్తున్న సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అన్ని మతాలను, అన్ని సంస్కృతుల్ని గౌరవించే ఈ దేశ ప్రజల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ తమ మతాల వైపు ఆకర్షించడానికి అన్ని రకాల కుతంత్రాలు చేస్తున్నారు. ఇటువంటి వారి వలన దేశ ప్రజల మధ్యలో కనిపించని అడ్డుగోడలు ఎన్నో మొలుస్తున్నాయి. వాళ్ళు పనిగట్టుకుని ప్రచారం చేసే లేని దేవుళ్ళ పేరు చెప్పి ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. ఎంతో మంది ప్రజలు ఆర్థికంగా నష్టపోతూ, మానసికంగా నలిగిపోతున్నారు. అయినప్పటికీ, తమ మతమే గొప్పదంటూ, ఇక్కడ వేల సంవత్సరాలుగా ఉన్న ఆచార వ్యవహారాల్ని కించపరుస్తూ, చెలరేగిపోతున్నారు. ఎదుటి వారిని గుడ్డి నమ్మకాలవైపు లాగుతున్నారు.

    ఇప్పటికైనా మతాలు మారే వారు, మార్చేవారు తమ తమ సంకుచిత్వాన్ని విడనాడాలి. ఈ దేశంలో ఉంటూ, ఇక్కడి సాంప్రదాయాల్ని గుడ్డిగా వ్యతిరేకించే వారు కళ్ళు తెరవాలి. తమ తమ మతాన్ని అనుసరించడం, నమ్మడం అనేవి వారి వ్యక్తిగత విషయాలు. అవి ఎప్పటికైనా తప్పు అని తెలుసుకొనే రోజు వస్తుంది. అప్పుడు వారు నిజం తెలుసుకోవచ్చు. అంతేగాని, మా మతమే గొప్పది, మా మతంలోకి మారండి అంటూ చేసే బోధనలు ఎప్పటికైనా ముప్పు తెస్తాయి. అందరూ బాగుండాలి అనే విశాలదృక్పధం నుండి, నేను, నా దేవుడు మాత్రమే గొప్ప అనే సంకుచితత్వంలోని ప్రయాణం చేస్తే, ఎవరి దేవుడు వారికి గొప్పవుతాడు. ఎవరి అహంకారం వారికుంటుంది. అది ఘర్షణకు దారి తీస్తుంది. సమాజాన్ని శాంతియుత సహజీవనం చేసే పరిస్థితుల నుండి ఒకరినొకరు దేవుడి పేరు చెప్పి చంపుకునే పరిస్థితి వస్తుంది. అది అభిలషణీయం కాదు. ఇప్పటికే మూడొంతుల దేశాలు మతాల పేరు చెప్పి మారణకాండను సాగిస్తున్నాయి. ప్రతీ రోజు కొన్ని వేల, లక్షల కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయి. కొన్ని వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి పరిస్థితి భారతదేశానికి రాకూడదు. విభిన్న ఆలోచనల శాంతియుత జీవనమే భారతదేశ సంస్క ృతికి ఆయువుపట్టు. అటువంటి మూలాధారాన్ని కోల్పోయిన నాడు, తమ మూలాల్ని కోల్పోయి, చీకటిలో కొట్టుమిట్టాడుతున్న అనేక ఇతర దేశాల్లాగానే భారత దేశ ప్రజలు కూడా అంధకారంలో మునిగిపోవాల్సి ఉంటుంది. తస్మాత్‌ జాగ్రత్త...