Pages

Monday, May 17, 2010

చిన్నారి చిట్టి కూతుళ్ళంటే నాకు చాలా ఇష్టం.. ఎందుకంటే...

కూతుళ్ళు మాత్రమే వున్నవాళ్ళు చాలా అదృష్టవంతులు.. నమ్మకం లేదా... వీరిని చూడండి... బిల్ క్లింటన్ (అమెరికా మాజీ అధ్యక్షుడు), జార్జ్ బుష్ (అమెరికా మాజీ అధ్యక్షుడు), ఒబామా (అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు), బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ అధినేత), డా. ప్రతాప్ సి. రెడ్డి (అపోలో హాస్పిటల్స్), డా. అంజి రెడ్డి (డాక్టర్ రెడ్డి ల్యాబ్స్), వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి,  ఎస్పీ జగదీష్ రెడ్డి. (అంటే నేనే, నాక్కూడా ఇద్దరు కూతుళ్ళు). ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది కరెక్టేనా?    
 

చిన్నారి చిట్టి కూతుళ్ళని సృజియించువేళ
కడు శ్రద్ధ వహించె ఆ సృష్టికర్త
లోకమెల్ల గాలించె విలువయిన నిధుల కోసం
తను ఇవ్వబోవు అపురూప వరముల కొరకు.

దేవ కన్యల చిరునవ్వులని వారికిచ్చె
అందమయిన నీహారికల వెతికితెచ్చె
ముచ్చటయిన నక్షత్ర ధూలిని
మెరిసే, మైమెరిపించే ఆ కనులలో పెట్టె...

ఆయన బహు మధురమయిన వాటితో
వారిని నింపె, చక్కని చక్కెరతో, నవరస ఫలములతో
సూర్య కాంతిని వారి నవ్వులలో ఇమిడ్చె
ఆహా అతడే చమత్కారి..

చిరునవ్వు ఉదయించె ఆయన మోముపైన
ముద్దులొలుకు బంగారు తల్లిని తయారుచేసినపుడు
ఏలననగా ఆయనకు తెలుసు... ప్రతీ అమ్మకీ, నాన్నకి
ప్రేమని, ఆనందాన్ని ఇవ్వబోతున్నానని..  


పై పద్యం నా స్వేచ్చానువాదం... దానికి ఇంగ్లిష్ మాతృక... ఎప్పుడో చిన్నపుడు రాసుకున్నది..

When God created daughters
He took very special care
To find the precious treasures
that would make them sweet and fair...
 
He gave them smiles of angels,
then explored the midnight skies
And took a bit of stardust
to make bright and twinkling eyes...
 
He fashioned them from sugar
and a little bit of spice,
He gave them sunny laughter
and everything that is nice...
 
He smiled when He made daughters,
because He knew He had
Created love and happiness
for every mom and dad.

Friday, May 14, 2010

గత 5000 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎందుకు ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు?

ఒక సందర్భంలో మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారికి వచ్చిన అనుమానం. నిజమే గత చరిత్రని పరిశిలించి చూస్తే భారత దేశం ఎప్పుడూ తనంత తానుగా ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు. ఎప్పుడూ ఇతర దేశాల నుండి ధనం కోసం, బంగారం కోసం, మత వ్యాప్తి కోసం చేసే యుద్ధాల నుంచి ఆత్మ రక్షణ చేసుకోవడమే సరిపోయింది. ఇక్కడ ప్రబలంగా వున్న వైదిక జీవిత విధానంలో యుద్ధాలకి చోటే లేదు. (దీన్నే తరువాతి కాలంలో హిందూ మతమని మన మీదెక్కి తొక్కిన వాళ్ళు అంటే మనమూ చంకలు గుద్దుకుంటూ దానికి తందాన అంటున్నాము). నిజం చెప్పాలంటే ప్రపంచంలోని రెండు ప్రధాన మతాలయిన క్రైస్తవ, ఇస్లాం మతాలు తమ మత వ్యాప్తి కోసం మధ్య యుగాల్లో రక్తాన్ని ఏరులై పారించాయి. క్రైస్తవ మత యుద్ధాన్ని "క్రూసేడ్" అని, ముస్లిములు మతవ్యాప్తి కోసం చేసే యుద్ధాన్ని "జీహాద్" అని అంటారు. కాని మన సంస్కృతిలో మతానికన్నా మనిషికే ప్రాధాన్యత ఎక్కువ. ఇతర మతాల్లో, ఒకవ్యక్తి తాను అనుసరించే మతాన్ని మిగావారు అనుసరించకపోతే, వారు సొంత కొడుకయినా, కూతురయినా, భార్య అయినా, ఆఖరికి ప్రాణ స్నేహితుడయినా సరే, కత్తికి బలిపెట్టామని వారి "పవిత్ర గ్రంధాల్లో" రాసి వుంటుంది. కాని మతాన్ని బలవంతంగా ఇతరులపై రుద్దమని ఏ హిందూ సిద్ధాంతమూ చెప్పలేదు.

వేదాల్లో వున్న శ్లోకాల్ని ఒకసారి పరిశిలిస్తే మనవారు ప్రపంచ శాంతికి, సాటి మనిషి వున్నతి కోసం ఎంత పరితపించారో మనకి అర్ధ్మ అవుతుంది. "సర్వేత్ర సుఖినస్సంతు" అంటే మానవులందరూ సుఖంగా వుండాలి, "సర్వేసంతు నిరామయా" అందరూ ఆరోగ్యంగా జీవించాలి, "సర్వే భద్రాణి పశ్యంతు" అంటే అందరూ భద్రంగా వుండాలి అని అర్ధం. ఇటువంటి ఉదాత్త భావనలని ప్రపంచంలో ఏ మతమయినా చెప్పగలిగిందా? భగవద్గీతలో "విజ్ఞుడయిన వాడు ఒక ఏనుగులోనూ, పక్కనే వున్న కుక్క లోనూ, కుక్కని తినే చండాలునిలోనూ, సద్బ్రహ్మణుడిలోనూ పరమాత్మని దర్శిస్తాడు" అని చెప్పబడినది. అంతటి సమదర్శిత్వ భావన ఎప్పటికయినా మరో గ్రంధంలో చూడగలమా? మనం మనుషులమే కాకుండా, ప్రతీ ప్రాణిని తమతో సమానంగా భావించమని చెప్పే వున్నతమయిన సంస్కృతి గురించి, దేవుడు సృష్టించిన జంతువులన్నీ తమ ఆహారం కోసమే అని వాదించే వారికి ఏమని చెపితే తెలుస్తుంది? భూమి తల్లిగా భావించి, నదిని అమ్మగా ప్రేమించి, గాలిని దేవుడిగా ఆరాధించే వారి గురించి, పైవన్నీ వ్యాపార వస్తువులుగా భావించి, ప్రకృతిలో వున్న ప్రతీదీ అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి అని భావించే వారికి ఎలా చెపితే అర్ధం అవుతుంది? కూర్చున్న కొమ్మను నరుక్కోవడమూ, ప్రకృతిని నాశనం చేయ్యడం ఇదేగా మనం నాగరికులం అనుకునే వాళ్ళు చేసేది? తాగే మంచి నీళ్ళని కూడా కొనుక్కుని బ్రతకాల్సి వస్తుందంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి వుంటుందా?

అసలు విషయానికి వస్తే హిందూ మతంలో వుండేది సర్దుబాటుతత్వం. వేద కాలం నుండి దాని మౌలిక సిద్ధాంతంలో వుండే వైవిధ్యంవల్ల ఎదురయిన ప్రతీ సవాలునీ సమర్ధవంతంగా ఎదుర్కొని ఈ నాటి స్తితికి చేరింది. ఈ మతంలో (నిజానికి హిందుత్వాన్ని మతం అంటే నేను ఒప్పుకోను, అది ఒక జీవిత విధానం) వున్న ఈ గుణం వల్ల ప్రాచీన యుగంలో బౌద్ధ, జైన మతాలు పుట్టినా, తరువాతి కాలంలో క్రైస్తవ, ముస్లిం మతాలు దాడి చేసినా సజీవంగా వుండగలిగింది. అయితే ఇంత మంచి విధానాన్ని ఎవరూ పనిగట్టుకుని (అంటే అబధాలు చెప్పి, భయపెట్టి, యుద్ధాలు చేసి) మతమార్పిడులు చేయ్యకపోవడం వలన మిగిలిన ప్రాంతాల్లో అది వ్యాప్తి చెందలేకపోయి వుండవచ్చు. అలాగని హిందువులు చేతగానివాళ్ళు కారు, సహనం కొంచెం ఎక్కువ. అయితే ఎంతటి సహనానికయినా ఒక హద్దు వుంటుంది. పిల్లి మామూలుగా చాలా మంచిది. ఎవరయిన వస్తుంటే అది పక్కకి తప్పించుకు పారిపోతుంది. కాని అదే పిల్లిని ఒకగదిలో తాళం పెట్టి కొట్టడానికి ప్రయత్నించారనుకోండి ఎదురు తిరుగుతుంది, ఆత్మ రక్షణ కోసం ప్రయత్నిస్తుంది. ముఖమంతా రక్కి పారేస్తుంది. హిందూ మతంలో వుగ్రవాదం అంటూ ఏర్పడదు. ఒకవేళ ఏర్పడినా, అది తాత్కాలికం మాత్రమే.

అందుచేత భారతదేశం గత 5000 సంవత్సరాలలోనే కాదు, మరో 10000 సంవత్సరాల తరువాతయినా సరే మరే దేశం మీదకీ యుద్దానికి వెళ్ళదు.

Tuesday, May 11, 2010

విశ్వ వర్ణన - కొన్ని సందేహాలు... సమాధానాలు.

విశ్వ వర్ణన - ఆధునిక పరిశొధనలకి, విష్ణు సహస్ర నామానికి పోలిక గురించి నాకు అనేకమంది అభినందనలు తెలిపారు. వారందరికీ నా కృతజ్ఞతలు. కొద్దిమంది స్నేహితులు కొన్ని సందేహాలు కూడా అడిగారు. వాటిలో మొదటిది: విష్ణు సహస్ర నామంలో వర్ణించినట్టుగా విష్ణువు ప్రత్యేకంగా వుండడా? ఆయనకి ఒక రూపం అంటూ లేదా? అని. నిజమే విష్ణువు కి రూపం లేదు. ఆయన విశ్వ స్వరూపుడు. ఈ లోకంలోని ఏ రూపం తీసుకున్నా అది ఆయన రూపమే. ఏ పేరు పలికినా అది ఆయన నామమే. మన కంటికి కనబడని ఆ మహా శక్తికి ఒక రూపం అంటూ లేదు. మనం ఎలా ఊహించుకుంటే అలాగే దర్శనమివ్వగల మహాశక్తి రూపం. మన ఊహలకి అందని అనంత శక్తి స్వరూపం. ఆ మహా శక్తికే మనం విష్ణువు అని పేరు పెట్టుకున్నాము.

సహస్ర నామంలో వాసుదేవ అనే పదానికి అర్ధం ఇదే. "వాసనాత్ వాసుదేవస్య వాసితం భువన త్రయం.. సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే" అని వుంటుంది. ఎంత అద్భుతమయిన వర్ణన. మూడు లోకాల్లో వుండేది ఆయన రూపమే. ఏ లోకాన్ని తీసుకున్నా ఆయన రూపమే. అన్ని లోకాలూ ఆయన నివాస స్తానాలే. అలాగే అన్ని లోకాలు, సర్వ ప్రాణులు ఆయన అందే నివసిస్తూ వున్నాయి అని దీనర్ధం. ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలో వున్న ప్రతీ అణువూ ఈ విశ్వంలోని అణువులతో తయారయిందే. అది ఎవ్వరూ కాదనలేని సత్యం. అలాగే ప్రతీ అణువులోనీ ఆ మహాశక్తి ప్రకటితమవుతుంది. ఏ మతానికి చెందిన వారయినా, ఏ కులానికి చెందిన వారయినా, అది ఏ ప్రాణి అయిన, ఏ మొక్కయినా, ఏ చెట్టయినా వాటన్నిటిలో వుండేది ఆ మహా విష్ణు స్వరూపమే. ఇక ఇందులో సందేహాలకు తావు లేదు. ఇలా ప్రతి దానిలోనూ, ఆఖరికి వీచే గాలిలోను, ప్రవహించే నీటిలోనూ, మండే అగ్నిలోనూ, నివసించే భూమిలోనూ ఆ పరమాత్మని చూడగలిగారు కాబట్టే, భరత భూమి ఆధ్యాత్మిక భూమి అయింది. అదే ఇప్పటి వ్యాపార నాగరికతలాగా నదులన్నిటినీ కలుషితం చేసేసి, పచ్చటి చెట్లని కొట్టివేసి, కొండల్ని పిండిచేసి, పీల్ఛే గాలిని కూడా విషంతో నింపేసి, మన చావుని మనమే కొనితెచ్చుకునేవాళ్ళుగా మన పూర్వీకులు వుండుంటే ఇప్పుడు మనం వుండే వాళ్ళం కాదనుకుంటాను. అది వేరే సంగతి.

ప్రపంచంలో దాదాపు అన్ని సమాజాల్లో దేవుని గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఎక్కువ మంది చెప్పేది ఒకటే. దేవుడు ఒక పరలోకంలో (అదెక్కడుందో ఎవ్వరూ చెప్పరు. చెపుదామన్నా వాళ్ళకీ తెలియదు) ఒక బంగారు సింహాసనంపై కూర్చుని వుంటాడు. ఆయన మనిషి రూపం ధరించి వుంటాడు. తెల్లని గెడ్డంతో, బంగారు కిరీటం పెట్టుకుని వుంటాడు. ఇవీ వాళ్ళు చెప్పే వర్ణన. కానీ వైదిక సారస్వతంలో దేవునికి ప్రత్యేకించి రూపం లేదు. ఆ మహాశక్తిని మనం కళ్ళతో చూడాలేము. మనకున్న పంచేంద్రియాల జ్ణానం సరిపోదు. అంతకుమించిన బౌద్దిక జ్ఞానం కావాలి. అది తపస్సు లేదా ధ్యానం ద్వారా మాత్రమే సిద్దిస్తుంది.

ఇక్కడ మరో ప్రశ్న ఉదయిస్తుంది. అలాగయితే దేవుడి చిత్రపటాలు, ఈ విగ్రహాలు ఏమిటి? దేవుడు విశ్వరూపంలో వుండేట్టయితే, ఈ అందమయిన బొమ్మలెందుకు? ఇది రెండవ ప్రశ్న. అదీ నిజమే. ఇది గతంలో సంగతి. ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. మహర్షులు దర్శించిన దానిని సామాన్య ప్రజలకు తెలియజేయాలి. మార్గం ఏమిటి? ఈ విశ్వం గురించి, ధ్యానం వారు దర్శించిన వున్నత తెజోమయ లోకాల గురించి సామాన్య ప్రజలకి చెప్పేదెలా? అది కూడా అందరికీ అర్ధమయ్యేలా చెప్పేదేలా? ఆ లోకం ఇలా వుంటుంది అని చెప్పేందుకు వాళ్ళ దగ్గర ఫోటోలు లేవు.. హబుల్ టెలెస్కోప్ అంతకన్నా లేదు. మరేమిటి మార్గం? అదికూడా చదువు రాని వాల్లకి కూడా అర్ధం కావాలి. మనకు తెలిసిన మనకు అర్ధమయ్యే పద్దతిలోనే ఆ వర్ణన సాగాలి. అలా పుట్టిందే ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహ రూపం. నిజానికి ఇప్పుడు మనం చూస్తున్న దేవుళ్ళ రూపాల వెనుక చాలా పెద్ద కధే వుంది. అది యోగులకి, జిజ్ఞాసా పరులకి సులభంగానే తెలుస్తుంది. మనం ఇతర దేశాల వాళ్ళు చెప్పింది విని విని, మన దేశ జ్ఞానాన్ని మనమే చేతులారా పాడు చేసుకుని, వాళ్ళకి మానసికంగా బానిసల్లాగా బ్రతుకుతున్నాము. ఇవన్నీ చెప్పాలంటే అదో పెద్ద గ్రంధం అవుతుంది. అది చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. మరో టపాలో దీనిగురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

Saturday, May 1, 2010

విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక


మనం నివసించే ఈ విశ్వం, సౌరమండలం, భూమి ఇవన్ని అనేక అద్భుతాలకి నిలయాలు. మనిషి మేధస్సు ఎంత పురోగతిని సాధించినా తెలుసుకోవలసిన విశ్వ రహస్యలు ఎన్నో మిగిలే వుంటాయి. ఈ అద్భుత ప్రపంచం గురించి ఇప్పుడు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. హబుల్ టెలెస్కోప్ ని ప్రయోగించి రోదసిలో జరిగే అనేక అంతుచిక్కని నక్షత్రమండలాలని, వాటిలో జరిగే ప్రక్రియల్ని కనుగొంటున్నారు. కాని మనకి తెలియని, మనం మరిచిపోయిన మరొక విషయం ఏమిటంటే, మహా తపో శక్తి సంపన్నులయిన మన మహర్షులు, యోగులు సకల చరాచర సృష్టికి మూల స్తానమయిన మహాశక్తి కేంద్రాన్ని దర్శించారు. అది కూడా ఎటువంటి టెలెస్కోపులు, పరికరాలు లేకుండానే. దీనికి సజీవ సాక్ష్యం శ్రీ విష్ణు సహస్ర నామం.

మనం వుంటున్న సౌర కుటుంబం, పాలపుంత (Milkyway Galaxy) చుట్టు 200 మిలియన్ల సంవత్సరాలకి ఒకసారి ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఈ పాలపుంత మధ్య భాగం అనేక కోట్ల నక్షత్రాలతో కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్ని వెదజల్లుతూ ఉంటుంది. అది ఎంత అద్భుతమయిన వెలుగంటే, మనం ఒక సూర్యుడి వైపే పూర్తిగా చూడలేము. అటువంటిది కొన్ని కోట్ల సూర్య సమానమయిన కాంతిని మన నేత్రాలు చూడలేవు. ఆ నక్షత్రాలు కూడా ఒక దానికొకటి బాగా దగ్గరగా వుంటాయట. మన వున్న ఈ సౌర కుటుంబం పాల పుంతకి ఒక పక్కగా వుండడం వల్ల మనకు దాని కేంద్ర భాగాన్ని చూసే అవకాశం లేదు. అందువల్లనే భూమి మీద వున్న వారికి రాత్రి వేళ అక్కడొ నక్షత్రం ఇక్కడో నక్షత్రం కనిపిస్తూ వుంటాయి. కాని పాలపుంత మధ్య భాగంలో మాత్రం ఏ సమయంలోనయినా ఒకేలా అత్యంత ప్రకాశవంతంగా వుంటుంది. సకల విశ్వానికీ మూలాధారమయిన శక్తి అక్కడి నుండే ప్రవహిస్తు వుంటుంది. అన్ని జీవరాశులలో ప్రవహించే ఈ శక్తికే మన వారు "విష్ణు" అని, "నారాయణ" అని నామకరణం చేసారు. అటువంటి విష్ణువు వుండేది పాల సముద్రం అంటారు. విష్ణు సహస్ర నామంలో "క్షీరో ధన్వత్ ప్రదేశే" అన్న మాటకి అక్కడ పాలు వుంటాయని కాదు. ఆ లోకం అత్యంత ప్రకాశవంతంగా ఎటుచూసినా పాల వంటి స్వచ్చమయిన కాంతులు వెదజల్ల బడుతూ వుంటుంది అని అర్ధం. "విశ్వం విష్ణు " అనే పదానికి అర్ధం ఈ విశ్వమతా విష్ణు స్వరూపమే అని. ఈ ప్రపంచం మొత్తం, ఆయనలోనిదే. విష్ణువుకి నాలుగు చేతులు వుంటాయని "చతుర్భుజహ" అనే నామం చెబుతుంది. విశ్వంలో వుండే ఎక్కువ శాతం స్పైరల్ గెలాక్సీలకి నాలుగు భుజాలుంటాయి. ఈ క్రింది ఫోటొ గమనించండి. అదే విష్ణువు యొక్క స్వారూపం. "భుజగ శయనం" అనే మాటకి అర్ధం విష్ణువు పాము మీద పడుకుంటాడని కాదు. పాలపుంత మధ్యలో జరిగే అనేక చర్యల్లో భాగంగా అత్యంత వేడి, పొగలు, మనవూహకి కూడా అందనంత వేగంగా, పాము బుసలు కొట్టిన మాదిరిగా పైకి ప్రవహిస్తూ వుంటాయి. అందుకే విష్ణువు పవళించే ఆది శేషుడికి పదివేల తలలుగా పోల్చారు మన మహర్షులు.

భూమి మీద వుండే ప్రాణులన్నీ విష్ణువు యొక్క నాభి నుంచి పుట్టిన కమలం నుండి పుట్టిన బ్రహ్మ ద్వార సృష్టించబడ్డాయని అంటారు. ఆయనకి అందుకే "పద్మనాభుడు" అనే పేరు పెట్టారు. నిజానికి ఈ పద్మం అనేది విశ్వం యొక్క మధ్య భాగంలో అనేక చర్యల ఫలితంగా ఏర్పడ్డ మేఘాలు మొదలయినవి ఆ నాభి ప్రాంతం నుండి కొన్ని కోట్ల కిలో మీటర్ల ఎత్తుకి ప్రయానించి అక్కడ చల్లబడి పువ్వు ఆకారంలో ఏర్పడి, అక్కడ జరిగే మరిన్ని చర్యలద్వారా క్లిష్టమయిన కార్బన్ గొలుసుకట్టు ఏర్పడి, వాటి యొక్క ఒక అజ్ఞాత విధానంలో ప్రాణం అనేది పుట్టి, అది ఈ విశ్వమంతా చేయబడుతుందని భావించవచ్చా? బహూశా అదే బ్రహ్మ స్వరూపమయి వుండవచ్చు. సృష్టించేది బ్రహ్మ అయినా గాని, ప్రాణులకి నిరంతరం శక్తి సరఫరా అయ్యేది మాత్రం విష్ణు లోకం నుంచే అనేది మనం అర్ధం చేసుకొవచ్చు అనుకుంటాను.
అదే కాకుండా విష్ణు సహస్ర నామంలో మరొక చోట "సహస్ర మూర్థా విశ్వాత్మా, సహస్రాక్ష సహస్ర పాత్" అని వుంటుంది. అంటే విష్ణువు యొక్క వైభవాన్ని వర్ణించడానికి మాటలు రాక ఆయన్ని దర్శించిన మహర్షులు "కొన్ని వేల చేతులు, కొన్ని వేల ఆకారాలు, కొన్ని వేల పాదాలు కనిపించినట్లుగా వర్ణించారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో అద్భుతాలు విష్ణు సహస్ర నామంలో వున్నాయి. బహుశా అవన్ని చదివి, మానసికంగా దర్శించగలగడం ఈ జన్మకి సాధ్యమవుతుందో లేదో తెలియడం లేదు.

నాకు ఎప్పటి నుంచో మనసులో వున్న ఈ భావాలన్ని మీతో పంచుకునేలా చేసినది శ్రీ సత్యనారాయణ శర్మ గారి గేలాక్టిక్ సెంటర్ - విష్ణు నాభి - కొన్ని సంకేతాలు . అందుకు ముందుగా శర్మగారికి నా హృదయపూర్వక కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నాను.