Pages

Wednesday, March 20, 2013

హిందుత్వమనేది ఒక మతం కాదు, హిందూ దేవీ దేవతలు అఖండ ప్రకృతి శక్తులకు ప్రతీకలు మాత్రమే : ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌

    భారతదేశంలో వివిధ రకాలైన ప్రజలు ఆరాధించే లేదా ఆచరించే వివిధ రకాలైన ఆరాధనా పద్దతులను ఒక మతంగా పరిగణించలేమని ముంబయిలోని ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఒక కేసులో వ్యాఖ్యానించడం భారతీయ సమాజంచే స్వాగతించబడుతుంది. భారతదేశంలో చరిత్ర పూర్వ యుగం నుండే ఎన్నో వేల రకాల ప్రజలు నివసిస్తున్నారు. వారు ఎన్నో విధమైన మత విశ్వాసాలు కలిగియున్నారు. విభిన్నమైన ప్రకృతి శక్తుల్ని లేదా ప్రతీకల్ని కొలుస్తూ ఉన్నారు. నిజానికి వారందరూ తమ తమ మత విశ్వాసాల దృష్ట్యా వేర్వేరు అయినప్పటికీ, వారందరినీ కలిపి ఉంచింది మాత్రం భారత సంస్కృతి ఒక్కటే. అదే వేద సంస్కృతి. ఈ దేశంలోని ప్రజలు ఏనాడు మతం పేరు చెప్పి కలహించుకోలేదు. దేవుడి పేరు చెప్పి ఇతరుల్ని దోచుకోలేదు, చంపలేదు. ఎంత విభిన్నమైనప్పటికీ వారందరినీ కలిపి ఉంచింది మాత్రం అఖండ ప్రకృతి శక్తుల ఆరాధన మాత్రమే. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు నిజానికి భారతీయ వేదాంత సారాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే ఆచితూచి చేసిన వ్యాఖ్యానంగా మనం గమనించవచ్చు. కాని, బయటి వారికి మాత్రం హిందూ మతం ఒక మతమే కాదన్న వాదన చేయడానికి ఒక ఆయుధంగా పనికివస్తుంది. ట్యాక్స్‌ ఎగ్గొట్టడానికి హిందూ సంస్థలు చేసే ప్రయత్నంగా కొన్ని బ్లాగుల్లో ప్రచురించడం చూసాను. అటువంటి వారు ఎన్ని చెప్పినా వాస్తవం మాత్రం ఒక్కటే.

    భారతీయ తత్వ దర్శనం ప్రకారం భగవంతుడు ఎక్కడో వేరే లోకంలో ఒక రూపంతో ప్రత్యేకంగా ఉండడు. భారతీయ దైవానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా లేదు. అటువంటి దైవం గురించి ఎవరో ఒక మనిషి లేదా ప్రవక్త చెప్పలేదు. నేను చెప్పిందే నిజమని ఎవరూ చెప్పలేదు. దైవాన్ని ఎవరికి వారే తెలుసుకోమన్నారు. ఒక భారతీయుడు అఖండ ప్రకృతిలో ఉన్న అనంతమైన శక్తిలో  దైవాన్ని దర్శిస్తాడు. అందుకే వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలో మొదటి సూక్తం 'అగ్నిమీళే పురోహితమ్‌' అంటూ అగ్నిని స్తుతించడంతో ప్రారంభమవుతుంది. భారతీయ దైవాలు మిగిలిన మతాల్లోలాగా కేవలం ఊహాత్మకం (Abstract)  కాదు. అంటే ఎవరో చెప్పారు కాబట్టి నమ్మడం కాదు. ఎక్కడో ఒక గ్రంధంలో రాసారు కాబట్టి మనం కూడా ఉన్నారనే భావన చేయడం కాదు. కళ్ళెదురుగా ఉండే వాస్తవం. అదే ప్రకృతి దర్శనం. భారతీయ సంస్కృతిలో ప్రధానంగా పూజలందుకొనే శివుడు, విష్ణువు, దుర్గ వంటి వారందరూ కూడా ప్రకృతి శక్తులే.

    శివునికి ప్రత్యేకించి ఒక రూపం లేదు. ఆయన లింగాకారుడు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న తత్వమే శివ తత్వం. శరీరంలో ఉన్న ప్రాణమే శివుడు అంటారు (శివపురాణం). అందుకే శివుడికి ఆత్మలింగం ఉంటుంది. ఆత్మయే శివుడు. ఆ శివుడు వెళ్ళిపోతే మిగిలిందే శవం. అంటే జీవుడి నుండి శివుడు వేరయితే అది శవం. అంటే జాతి, కుల, మత బేధం లేకుండా ప్రతి ప్రాణిలో ఉండే ప్రాణమే శివుడు. అది ఏ జాతి అయినా, ఏ దేశమయినా, ఆఖరికి మన ప్రపంచం కాకుండా వేరే లోకమైనా కూడా అందరిలోను శివతత్వాన్ని చూడవచ్చు. దీన్నే విశ్వజనీయత ( Universality) అంటారు. ఈ విశ్వాసానికి ఏ మత గ్రంధం అక్కర్లేదు. ఎవరూ చెవిలో ఇల్లు కట్టుకుని, పోరుపెట్టి చెప్పనక్కర్లేదు. పాంప్లెట్లు పంచనక్కర్లేదు.

    ఇక విష్ణువు విషయానికి వస్తే, విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. మరోలా చెప్పుకుంటే ఈ విశ్వమే విష్ణువు (విశ్వం విష్ణ్ణు: - విష్ణు సహస్రనామ స్తోత్రం, మొదటి నామం), లోకాలన్నీ ఎవరిలోనైతే ఇమిడి ఉన్నాయో, ఎవరైతే ఈ లోకాలన్నిటిలోను నివాసం ఉంటున్నాడో ఆయనే (ఆ మహాశక్తే) విష్ణువు. (వాసితం భునవత్రయం - సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే). అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతీ జీవి, ప్రతీ వృక్షం, ప్రతీ మనిషీ - మరలా చెబుతున్నాను, కేవలం ఈ దేశంలోనో, ఈ మతంలోనో కాదు, జీవించి ఉన్న ప్రతీ జీవి కూడా, విష్ణువే అని భారతీయ దర్శనం. భారతీయ సంస్కృతిలో మరో విశేషమేమిటంటే, ప్రకృతిని మాతృ భావనతో ఆరాధించడం. అదే దుర్గా స్వరూపం. ఇంతటి ఉన్నతమైన భావన కేవలం భారతీయులకు మాత్రమే ఉన్నదని నేను గర్వంగా చెప్పగలను. నేను మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి గురించి స్పష్టమైన అవగాహన ఉన్నవారు ఎవరైనా చెప్పగలరు.

    ఇక ట్రిబ్యునల్‌ వ్యాఖ్యల్లో భారతీయ జీవిత విధానాన్ని ఒక మతంగా గుర్తించలేము అన్న దానికి కూడా విస్తృతమైన అర్థం ఉంది. మతం అంటే అందరికీ సమ్మతమైనది. ఒక జన సమూహం ఆచరించే ఆరాధనా పద్దతులు ఒకేలా ఉంటే అపుడు దాన్ని మతం అనవచ్చు. లేదా ఒక వ్యక్తి చెప్పినదాన్ని ఆచరించే వాళ్ళని ఒక మతంగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో చాలా మతాలు ఆ విధంగా ఏర్పడినవే. వాటికి సార్వజనీనత ఉండదు. క్రీస్తు చెప్పాడు కాబట్టి క్రైస్తవం ఏర్పడింది. మహ్మద్‌ ప్రవక్త చెప్పాడు కాబట్టి ఇస్లాం ఏర్పడింది. బుద్దుడు చెప్పిన బోధనలన్నీ కలిసి బౌద్ధ మతంగా ఆచరిస్తున్నారు. కాని  భారతీయ తత్వ దర్శనం ఆ విధంగా ఒక వ్యక్తి చెప్పడం వల్ల కాని, ఒక కాలంలో కాని ఏర్పడలేదు. చరిత్రకు పూర్వం, అంటే ఈ మతాల కుమ్ములాటలు ఏవీ లేని కాలంలో, ప్రపంచంలో దేశాలకి కృత్రిమ సరిహద్దులేవీ లేని కాలంలో, మానవులంతా ఒక్కటే  అనే ఉదాత్త భావన రాజ్యమేలిన కాలంలో ప్రాచీన మహర్షులకి వచ్చిన అత్యున్నత ఆలోచనల పరంపరే భారతీయ సంస్కృతి. అందుకే హిందు మతం అనే పదాన్ని భారతీయ సంస్కృతికి తగిలించలేము. మతం అనే చట్రంలో భారతీయతని బంధించలేము. భారతీయ ధర్మం సార్వజనీనమైనది. అంటే ప్రతీ సమాజం, ప్రతీ జాతి ఆచరించదగినది. ఇది మతం కాదు - ధర్మం. ధర్మాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. మంచి సమాజాన్ని సాధించవచ్చు. ధర్మాన్ని ఆచరించకపోతే అది సమాజ హానికి దోహదం చేస్తుంది. అందుకే ఈ సనాతన ధర్మం గురించి ఎవరూ ప్రచారం చేయలేదు. నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది. అది అగ్ని ధర్మం. దీని గురించి మైకుల్లో హోరెత్తించనక్కర్లేదు, టి.వి.ల్లో చెప్పనక్కర్లేదు. సూర్యుడు అందరికీ జీవ ప్రదాత. ఆయన లేకపోతే ఈ ప్రపంచంలో జీవులే లేవు. వాటికి ఆహారమూ లేదు. సూర్యుడు ఒక్క రోజు కనబడకపోయినా ఈ ప్రపంచం అల్లకల్లోలమవుతుంది. ఆయన గనుక ఉదయించకపోతే ఇక మీరు చెప్పుకునే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. ఇది ఊహ కాదు, వాస్తవం. అందుకే సూర్యుడు ప్రత్యక్ష దైవం. ప్రపంచంలో మొట్టమొదట ఆరాధించిన వాళ్ళలోను, ఇప్పటికీ సూర్యుడిదే అగ్రస్థానం. సూర్యుడి గురించి ఎవరికీ ఎవరూ చెప్పనక్కర్లేదు, కళ్ళెదురుగా కనిపించే సత్యం. అటువంటి సూర్యుడిని ఆరాధించే వాళ్ళది ఒక ప్రత్యేకమైన మతం ఎందుకవుతుంది? అటువంటి ఆరాధనకు ఏ పేరు పెడతారు?

    కేవలం ఊహాత్మక (ఆబ్‌స్ట్రాక్ట్‌) దేవుళ్ళని ఆరాధించే వాళ్ళకయితే ఒక ప్రత్యేకమైన మతం కావాలి. దాన్ని ప్రచారం చేయడానికి ఎన్నో కల్పనలు, ఎంతో సరంజామా కావాలి. పాంప్లెట్లు, పోస్టర్లు, పుస్తకాలు, టి.విలు, ఇంటర్‌నెట్‌లు ఇలా ఒకటేమిటి? ఎంతో ప్రచార సామాగ్రి కావాలి. ఎంతో మంది అమాయకులు కావాలి. ఇవన్నీ చాలకపోతే కత్తులు, బాంబులు కూడా కావాలి. కాని భారతీయ ధర్మానికి ఇవేమీ అక్కర్లేదు. ఇది ఒక ప్రత్యేకమైన సమూహం కాదు. భారతీయ ధర్మం ఆచరణలో ఎన్నో రకాల పద్దతులున్నాయి. అవి వేటికవే ప్రత్యేకం. విగ్రహాలని తామస పద్దతిలో పూజిస్తూ, వాటికి బలులిచ్చే వాళ్ళున్నారు. అవే విగ్రహాలని వేదానుసారం ప్రాణ ప్రతిష్ట చేసి, భక్తి మార్గంలో సాత్వికంగా ఆరాధించే వాళ్ళున్నారు. అసలు ఏ విగ్రహంతోను పని లేకుండా కేవలం యోగ సాధన ద్వారా భగవంతుని చేరుకోవచ్చుననే వాళ్ళున్నారు. లేదా భగవంతుడు ఎక్కడున్నాడు అంటూ జ్ఞాన మార్గం ద్వారా సాధన చేసేవాళ్ళున్నారు. ఇవన్నీ కాదు మంచి పనులు చేయడం ద్వారా మాత్రమే దేవుడిని చేరుకోవచ్చు అని నమ్మి, సమాజ సేవ చేసే కర్మ యోగులున్నారు. ఆఖరికి దేవుడే లేడు అని వాదించే నాస్తికులు కూడా ఉన్నారు. సమాజంలో ఏ విధమైన ఆలోచన చేసినా, ఏ పూజా పద్దతి పాటించినా విజ్ఞానమంతా విష్ణువు నుండి ఉద్భవించినదే. (యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ: వేదా శాస్త్రాణి విజ్ఞానమ్‌ ఏ తత్సర్వం జనార్థనాత్‌ -  విష్ణు సహస్రనామ శ్లో). అంటే కేవలం ఒక విశ్వాసమో, ఒక ప్రార్థనా పద్దతి మాత్రమే భారతీయ దైవ పద్దతి కాదు. అది ఎన్నో విశ్వాసాల కలయిక. అన్ని విశ్వాసాలు  ఎక్కడా అరమరికలు లేకుండా కలిసి ఉంటాయి. ఏ పద్దతి అవలంభించినప్పటికీ వారు మిగతా వారితో కలహించుకోలేదు, ఎప్పటికీ కలహించుకోరు. పైగా ఒక పద్దతిలో వీలుకాకపోతే మరో పద్దతిలో దైవం గురించి ప్రయత్నించవచ్చు. వ్యక్తి ఆలోచనకి స్వేచ్చనిస్తూ, ఎవరిపైనా బలవంతంగా రుద్దకుండా, తమ ఇష్టమైన పద్దతిలో దైవాన్ని చేరుకోవచ్చు అనే విశాల భావన కేవలం భారతీయ ధర్మంలోనే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఉన్నది మతం కాదు - ధర్మం మాత్రమే అని ఘంటాపధంగా చెప్పవచ్చు.

    ఇటువంటి చక్కటి ఆలోచన చేయడానికి స్ఫూర్తినిచ్చిన ముంబయి ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ వారి వ్యాఖ్యలకి భారత జాతి ఋణపడి ఉంటుంది.