Pages

Sunday, August 29, 2010

స్వాములు, బాబాలు, మంత్రాలు, మహత్తులు...

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతమంది స్వామీజీలు, బాబాలు, బహుశా భారత దేశంలోనే వున్నారనుకుంటాను. నిజమయిన ఆధ్యాత్మిక విద్యనందించె గురువుల సంగతి అటుంచితే, నకిలీ బాబాలు, సాధువులు ఈ దేశంలో అడుగడుగునా కనిపిస్తారు. అమాయక ప్రజల అజ్ఞానాన్ని సొమ్ము చేసుకోని, వాళ్ళకి నాలుగు మాయ మాటలు చెప్పి వారి విలువయిన కాలన్ని ధనాన్ని కొల్లగొడుతూంటారు. పైగా ఇదేదో చీకటిమాటున సాగిపోయే వ్యవహారంగా కాక, నిర్లజ్జగా పట్టపగలే దోపిడీ చేసేస్తుంటారు. పత్రికల్లో, పేపర్లలో ప్రకటనలిచ్చి, పుస్తకాలు ప్రింట్ చేసి మరీ అమాయక ప్రజల్ని తమవద్దకి ఆకర్షించుకుంటారు.గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అన్నట్లుగా ప్రజలు కూడా అటువంటివారిని నమ్మేస్తూ వుంటారు. మండుటెండలో నిజంగా కష్టపడేవారికి ఒక పదిరూపాయిలు ఇవ్వడానికి వెనకా ముందూ ఆలోచించే బడా బాబులు కూడా స్వామీజీ గారి దగ్గరికో, బాబా గారి దగ్గరకో వెళ్ళేసరికి నిలువుదోపిడీ సమర్పించుకుంటారు.

సర్వసంగ పరిత్యాగులుగా చెప్పుకునే ఇటువంటి స్వాములు ఉండే ""ఆశ్రమాలు"" చూస్తే ఎవరికయినా కళ్ళు తిరగడం ఖాయం. ఇంద్రభవనాల్ని తలపించే భవనాలు, ఖరీదయిన కార్లు, సెంట్రల్ ఎయిర్ కండిషండ్ రూములు, ఇవిగాక దాస దాసీజనం.... అబ్బో.... ఒక్క మాటలో చెప్పాలంటే ఇంద్ర వైభోగాల్ని గుర్తుకుతెస్తాయి. ఈ బాబాలకి, స్వామీజీల దర్శనం దొరకాలంటే సామాన్యులకు సాధయమయ్యే పని కాదు. వారితో మాట్లాడాలంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న విషయం. వేలు, లక్షలు గుమ్మరిస్తే గాని "ఏకాంత సేవకి" ఇంటర్యూలకి అనుమతి లభించదు. మన వూరు వచ్చినపుడు వారికి పాదపూజ చెయ్యాలంటే ఒక రేటు, మంత్రోపదేశం పొందాలంటే ఒక రేటు, వారి "లీలలు" చూసి తరించాలంటే ఒక రేటు, ఇలా మెనూ కార్డ్ వుంటుంది. ఎవరయినా మన కోసం వచ్చినపుడు ఒక పది నిముషాలు ఆలస్యం అయితే చాలు ఎదుటి మనిషి ఒక్క నిముషం ఆలోచించకుండా మనల్ని మనసులో తిట్టుకుంటాడు. లేదా వీడికి పొగరెక్కువయిందని పదిమందికీ ప్రచారం చేస్తాడు. అదే స్వామీజీ గారి దగ్గరికెళ్ళి ఎంతసేపయినా వెయిట్ చేస్తారు. అది ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా లెక్కేమీ లేదు. ఎంత ఎక్కువసేపు వెయిట్ చెయించగలితే అంత పెద్ద స్వామీజీ అయిన్నట్టు లెక్కన్న మాట.

ఈ నకిలీ గురువులు ఏవో మాయ మాటలు చెప్పి జనాల్ని దోచుకుంటే పర్వాలేదు. ఏకంగా దేవుడి అవతారంగా ప్రచారం చేసుకుంటున్నారు. నేనే భగవంతుడి అవతారం అని నిస్సిగ్గుగా, ఎటువంటి జంకూ లేకుండా బరితెగిస్తున్నారు. అమాయక జనం కూడా అలాంటివారిని ఆదరిస్తున్నారు. ఎవరో అన్నీ వదిలేసిన వారు అలా చెపితే కొంత అర్ధం చేసుకోవచ్చు. కాని పెళ్ళయి, పిల్లలున్నవాళ్ళు కూడా దేవుడి అవతారం అని చెప్పుకుంటే ఏమనలి? తననేమో అయ్యగారిగాను, తన భార్యనేమో అమ్మవారిగానూ ప్రచారం చేసుకుంటున్నారు. వారి మీద ఎన్ని ఆరోపణలొచ్చినా, ఎంత మంది జీవితలు నాశనం అయిపోయినా వారసలు మనలాంటి మామూలు మనుషులని తెలిసినా, మత్తు మందులు వాడిస్తున్నారని పబ్లిక్‌గా చెప్పినా ప్రభుత్వలు కూడ ఏమీ చెయ్యలేని పరిస్తితి. ఇందాకే "భక్తి టి.వి"లో చూసాను. ఎవరో ఒక స్వామీజీకి, ఆయన భార్యకి వివాహ మహోత్సవం చేస్తున్నారు. నిజంగా మనుషులకి అనుకునేరు. అక్కడే తప్పులో కాలేసారు. అవి వారి విగ్రహాలు. మనం రాములవారికి, సీతమ్మవారికి భద్రాచలంలో పెళ్ళి చేస్తాం చూసారా... అలాగన్నమాట. చూడగానే ఒళ్ళు మండిపోయింది. మరీ ఇంత దారుణమా... శుభ్రంగా బతివున్నవారికి ఫోటోలకి దండెయ్యడమేమిటి? వారి విగ్రహాలకి పెళ్ళి చెయ్యడమేమీటి, మరో బాబా గారి చెప్పులు పట్టుకొచ్చి, కుర్చీలో పెట్టి, వుయ్యాలలో ఫోటో పెట్టి పూజలు చెయ్యడమేమిటి? ఈ దారుణాలకి అంతే లేదా? ఇవన్నీ చూస్తుంటే మనం వున్నది కంప్యూటర్ యుగంలోనా, లేక పురాతన యుగంలోనా అన్న సందేహం వస్తుంది.

ఇవన్నీ ఒకెత్తయితే, ఈ మోసగాళ్ళు ప్రచారం చేసుకునే మహిమలు, మహత్యాలు ఒకెత్తు. ఏమీ లేని దానికి ఎలా బయటికి వస్తాయో తెలీదు. పుస్తకాల రూపంలోను, నోటి మాటల రూపంలోనూ ప్రచారమయిపోతూ వుంటాయి. ఫలానా స్వామీజీ సూర్యుడిని పట్టుకుని నోట్లో పెట్టుకున్నారంటా అందుకే గ్రహణం వచ్చిందంట. లేకపోతే చంద్రుడిలో వుండే బొమ్మ మన బాబాగారిదంట... అంటూ రకరకాలుగా సాగుతుంది ప్రచారం.

ఈ జాడ్యం ఒక్క హిందూ మతానికే పరిమితం కాలేదు. మిగతా మతాల్లో కూడా జనాల్ని మోసం చెయ్యడం యధేచ్చగా కొనసాగుతుంది. మీ దేవుడిని వదిలేసి మా మతంలోకి మారండి.. మీకు పూర్తి స్వస్తత కలిగిస్తాం.. మీకు పట్టిన దెయ్యాల్ని (?) వదిలిస్తాం. మీకొచ్చిన జబ్బుల్ని పోగొడతాం... మీ పాపాలన్నీ గాలికెగిరిపోయి, మీరు మళ్ళీ ఎన్ని పాపాలయినా చెయ్యొచ్చు అంటూ హడావుడి చేస్తారు. నిజంగా వీళ్ళు చెప్పిన మాటలు విన్నవాళ్ళకి కష్టాలు గట్టెక్కుతాయో లెదో గాని, సో కాల్డ్ భక్తులు సమర్పించుకునే డబ్బులతో "దైవ సేవకులు" మాత్రం చక్కగా ఏ.సీ. కార్లలో, ఖరీదయిన భవనాల్లో ఖుషీ చేస్తూంటారు.

వీటన్నిటినీ నమ్మే వారు ఎలా నమ్ముతారో అర్ధం కావడం లేదు. ఎదురుగా వున్నది మనలాంటి మనిషే కదా. అతనికీ మనకి మల్లే రక్త మాంసాలు వుంటాయి. మనలాగే దాహం వేస్తుంది. ఆకలి వేస్తుంది. ఒకప్పుడు పుట్టాడు. అందరిలాగే ఒకనాటికి మరణిస్తాడు... అంతా మనకి తెలుసు... అంతా నిజమే. కాని ఎందుకు నమ్ముతున్నారు. నమ్మడం అటుంచితే పిచ్చిగా ఆరాధిస్తున్నారు. ఎదుటి మనిషి మనకేదన్నా సహాయం చేస్తే "మీరు దేవుడిలాంటి వారండి బాబూ" అని గౌరవిస్తాము. అంతే గాని రోజూ పువ్వులు పెట్టి పూజించంకదా.. ఇదీ అలాంటిదే. మనకన్నా కొన్ని మంచి విషయాలు తెలిసినవారిని, గురుస్తానంలో వున్నవారిని గౌరవించవచ్చు. వారిని అభిమానించవచ్చు. కాని అదే పనిగా పిచ్చిలో పడకూడదు. మన గౌరవాన్ని, అభిమానాన్ని వాళ్ళ కాళ్ళదగ్గర పెట్టి మనం జీవచ్చవంగా బ్రతక్కూడదు. నిజమయిన జ్ఞానం కావాలంటే వేదాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి, బైబిలుంది, ఖురాన్ ఉంది. వాటిని మనస్ఫూర్తిగా చదవండి.. చదివిన దాన్ని ఆచరణలో పెట్టండి... తోటి మనిషిని మనిషిగా గుర్తించి, గౌరవించండి. జ్ఞానం అదే వస్తుంది... మోక్షం అదే వస్తుంది...