Pages

Monday, June 12, 2023

ఇందులో అద్భుతం ఏమీ లేదు... ప్రకృతి తానేమిటో నిరూపించుకుంది.....

ప్రకృతి తనకు దగ్గరగా ఉండి, తనలో ఇమిడిపోయే జీవుల్ని ప్రేమగా చూసుకుంటుంది. వాటికి ఎటువంటి హానీ కలుగనివ్వదు. దానికి సజీవ ఉదాహరణే... కొలంబియాలో జరిగిన ఘటన.

కారడవిలో కూలిపోయిన విమానంలో ప్రయాణిస్తున్న పిల్లల తల్లి, పైలట్‌, గైడ్‌ అందరూ చనిపోయారు. కాని అదే విమానంలో ప్రయాణిస్తున్న 11, 9, 4 సం॥ల వయసున్న పిల్లలు క్షేమంగా బయటపడడం విశేషం.. మరొక అద్భుతం ఏమిటంటే.. వారిలో 11 నెలల చిన్నారి కూడా ఉండడం. వీరందరూ దట్టమైన కారడవిలో 40 రోజుల పాటు క్షేమంగా, సజీవంగా ఉన్నారు. ఇది మరింత అద్భుతం.

నిజానికి మనందరికీ ఈ సంఘటన చాలా అద్భుతంగా కనిపించవచ్చు. కాని, జాగ్రత్తగా ఆలోచిస్తే... ప్రకృతిలో ఇవన్నీ సహజమే అని తెలుస్తుంది. ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల కోట్ల జీవులు వున్నాయి. అవన్నీ ప్రకృతికి అతి దగ్గరగా జీవిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అవన్నీ ప్రకృతిలో కలిసిపోయి వున్నాయి. సృష్టి మొత్తం మీద అత్యంత తెలివైన జీవిని అని విర్రవీగే మనిషి మాత్రం రోజు, రోజుకీ ప్రకృతి నుండి దూరం అయిపోతున్నారు. అలా దూరం అయిపోవడం వలన తనకు కలిగే కష్టాలు,  ఆకలి, అనారోగ్యాలు, ప్రకృతి విపత్తులు... వీటన్నిటికీ ప్రకృతి కారణమని నిందిస్తున్నాడు. అన్ని జీవులు తమకు కలిగే అనారోగ్యాలకు, వ్యాధులకు ప్రకృతిలోనే మందులను వెతుక్కుంటాయి. వాటి ఆహారంలో మార్పులు చేసుకుంటాయి. ఆయా కాలాలకు తగ్గట్టుగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ, అనారోగ్యం బారిన పడకుండా ఆనందంగా జీవిస్తున్నాయి.

కాని మనిషి మాత్రం ఆధునిక నాగరికత పేరుతో ప్రకృతి దూరం అవ్వడమే కాకుండా, ప్రకృతిని నాశనం చేసి, సమస్త సృష్టికి ద్రోహం చేస్తున్నాడు. వేళకు నిద్రపోకుండా, వేళకు లేవకుండా, సహజంగా దొరికే ఆహారాన్ని తినకుండా, దానిలో అడ్డమైన కెమికల్స్‌ కలిపి తింటూ, తన ఆరోగ్యానికి తానే తూట్లు పొడుచుకొంటున్నాడు. తిరిగి ఆరోగ్యవంతుడు కావడానికి కూడా అదే ప్రకృతిని పాడు చేస్తున్నాడు. నిజానికి మనకు వచ్చే అనారోగ్యాలలో 90 శాతం వరకు ప్రకృతికి విరుద్ధంగా జీవించడం వలనే వస్తాయి. మన జీవన అలవాట్లను మర్చుకోవడం ద్వారా చాలా వరకు అనారోగ్యాలను దూరం చేసుకుని, ఆనందంగా జీవించవచ్చు. భారతీయ జీవన విధానం ఇందుకు ఎంతగానో తోడ్పడుతుంది. ఎన్నో వేల సంవత్సరాలుగా ఎంతో మంది మహర్షులు, శాస్త్రవేత్తలు ఈ దేశంలో అత్యుత్తమ జీవన విధానాన్ని రూపొందించి ఇచ్చారు. ఆధునికత పేరుతో ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేని ఆహారపు అలవాట్లని, వింత వింత జీవన విధానాలను అవలంబించి, మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాము.

పై సంఘటన ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే... పసిపిల్లలు ఎంత అమాయకంగా ప్రకృతికి దగ్గరగా, అడవి అమ్మ ఒడిలో సురక్షితంగా ఉన్నారో, అదే విధంగా మనం కూడా సాధ్యమైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉంటూ, ఎటువంటి చెట్ల నుండి వచ్చే చల్లటి గాలి పీలుస్తూ, సహజ జలవనరుల్ని కలుషితం చేయకుండా, అదే నీటిని తాగుతూ, ప్రతి రోజు కొద్దిసేపైనా సూర్యకాంతిని శరీరమంతా తగిలేలా వ్యాయామం, ఆసనాలు వేస్తూ, చక్కటి శాకాహారం తీసుకుంటూ ఉంటే మనం కూడా ఆ పిల్లల్లాగా సురక్షితంగా ఉంటాం. ప్రకృతిని మనం కాపాడుకుంటే, ఆ ప్రకృతి మనల్ని అమ్మలా రక్షిస్తుంది.. తన చల్లటి ఒడిలో పసిపాపల్లా మనల్ని పోషిస్తుంది.. కాపాడుకుంటుంది.... సర్వేజనా స్సుఖినో భవంతు...

Monday, June 27, 2022

మాతృభాషను మరవని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గారు


ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, మన తెలుగువాడు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గారు విదేశీ గడ్డపై తనకున్న తెలుగు భాషాభిమానాన్ని చాటిచెప్పారు. ఆయన గతంలో కూడా ఎన్నో సార్లు ఎన్నో వేదికలపై తెలుగు భాష గొప్పదనాన్ని ఉటంకించారు. ప్రతి మనిషికి కన్నతల్లి, పుట్టినగడ్డ, అమ్మభాషపై మమకారం అత్యంత సహజం. కాని దానిని కాదనుకుని పరభాషపై మమకారాన్ని పెంచుకోవడం కన్నతల్లిని కాదని సవతి తల్లి పంచన చేరడం వంటిదే. 

ఎన్నో సొబగులు, అలంకారాలు, నుడికారాలు, పలకడంలో కమ్మదనం వంటివి తెలుగు భాషకు ఎనలేని ప్రాముఖ్యాన్ని తెచ్చిపెట్టాయి. కేవలం శబ్ద సౌందర్య పరంగానే కాక, అక్షరాలు కూడా ఎంతో పొందికగా, బింకంగా ఉంటూ పలికేవారితో పాటు, చూసేవారికి కూడా చవులూరిస్తాయి తెలుగు అక్షరాలు. ‘‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు’’ అంటారు ప్రముఖ కవి మన్నెంకొండ బాలగంగాధర్‌ తిలక్‌. ఆధునిక కవులతో పాటు, తెలుగు కన్నడ నేలల్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కవి రాజు ‘‘శ్రీకృష్ణదేవరాయలు’’ చక్రవర్తి మాత్రమే కాక స్వయంగా కవి కూడా. ఆయన రాసిన ‘‘ఆముక్త మాల్యద’’ కావ్యం అజరామరమైనది. అటువంటి మహారాజు నోటివెంట ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని వినడమే ప్రతి తెలుగు వాడికి రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తుంది. ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌన్‌ తెలుగు భాషకున్న గొప్పదనాన్ని గ్రహించినందువల్లనే తెలుగులో విశేష కృషి సలిపి, మొట్టమొదటి తెలుగు ఆంగ్ల నిఘంటువును వెలువరించాడు. ఆయన నిఘంటువుని పరిశీలిస్తే, కేవలం తెలుగుకు ఆంగ్లపదాన్ని చెప్పడమే కాకుండా, ఆయా పదాలు రామాయణ, భారత పురాణాలు, వేమన, సుమతీ శతకాలలో ఏఏ సందర్భాలలో ప్రస్తావించబడ్డాయో సోదాహణగా తెలియజేసారు. అటువంటి బ్రౌణ్య నిఘంటువును తిరిగేస్తే చాలు, తెలుగు భాష కరతలామలకమవుతుంది. తెలుగు అజంత భాష. అంటే తెలుగు భాషలోని ప్రతి పదం అచ్చుతో అంతమవుతుంది. దాని వలన తెలుగుని రాగయుక్తంగా పాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. అందుకే యూరోపియన్‌ భాషల్లో మరో అజంత భాష అయిన ‘‘ఇటాలియన్‌’’తో పోల్చి ‘‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’’ అని యూరోపియన్‌ పండితులచే కీర్తించబడిరది. పోతన పద్యాలు, అన్నమయ్య పదకవితలు తెలుగుకున్న సహజసిద్దమైన అందాన్ని మరింత ఇనుమడిరపజేసాయి అనడంలో సందేహం లేదు. అక్షర సేద్యం చేసే కవులకు, అవధానం చేసే పండితులకు, రాగాలు తీసే గాయకులకు అత్యంత అనువైన మనోహరమైన భాష తెలుగు మాత్రమే. అందుకే జస్టిస్‌ ఎన్‌.వి.రమణగారు తెలుగుని పల్లకిలో పెట్టుకుని, ప్రపంచమంతా మోస్తున్నారు. ఒక తెలుగు వాడిగా ప్రతి ఒక్క తెలుగు వాడికి అనుసరణీయుడు అవుతున్నారు.

ఇటీవలి కాలంలో అమ్మభాషను నిదారించడం ఒక సరికొత్త పోకడగా మొదలయింది. పొట్టకూటి కోసం అయితేనేమి, నలుగురిలో గొప్పగా చెలామణి అయ్యే పేరుతోనేమి పరభాషా మోజు పట్టి, తెలుగును భ్రష్టుపట్టిస్తున్నారు. కొంత మంది రాజకీయ నాయకులు కూడా ప్రజలకు మాతృభాషను దూరంచేసే పనిలో పోటీ పడుతున్నారు. అసలు తెలుగు నేర్చుకొంటేనే అదేదో నేరం అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుని పూర్తిగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారు నేటి పాలకులు. పరాయి భాషను నేర్చుకుంటేనే అభివృద్ధి అని, మనం బ్రతకాలి అంటే అమ్మభాషను చంపేయాలని సుద్దులు చెబుతున్నారు. ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, నాయకులు, పారిశ్రామికవేత్తలు మాతృభాషలోనే చదువుకుని అత్యున్నత స్థానాల్ని అలంకరించారనేది విస్మరించరాదు. వీధి బడిలో చదువుకుని రాష్ట్రపతులు అయినవారు ఉన్నారు. గొప్ప శాస్త్ర వేత్తలుగా అనేక ఆవిష్కరణలు చేసిన వారు కూడా ప్రభుత్వ బడిలోనే ఓనమాలు దిద్దిన వారు అనేది మరువకూడదు.

ప్రపంచంలో ఎన్నో నాగరిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా మాతృభాషలో చదవడం వల్లనే గొప్ప దేశాలుగా మారాయి. జర్మనీ, జపాన్‌, చైనా, ఫ్రాన్స్‌ వంటి చాలా దేశాల్లో ఇప్పటికీ మాతృభాషకే అగ్రతాంబూలం. ఆంగ్లాన్ని కేవలం అవసరం వరకే నేర్పుతారు. అంతే గాని, పరాయి భాష నేర్చుకొన్నంత మాత్రాన గొప్పవారయి పోతారు అనేది ఒట్టి అపోహ మాత్రమే. పిల్లల్ని ఇంట్లో తాము మాట్లాడే భాష నుండి దూరం చేసి, ఇంగ్లీష్‌లో చిలుకపలుకులు నేర్పితే, వారు బానిస బుద్దితో బయటకు వస్తారు తప్ప, స్వతంత్ర ఆలోచనా పరులై దేశాన్ని ఉద్దరించేది ఏదీ ఉండదు. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ఒక వేళ బయట బళ్ళో ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదువు నేర్పినప్పటికీ ఇంట్లో తెలుగులో మాట్లాడడం, తెలుగు సంస్కారాన్ని గరపడం, తెలుగు బంధాల్ని అల్లుకోవడం వంటివి పిల్లలకు నేర్పడం తమ బాధ్యతగా చేసుకోవాలి. మాతృభాషని మరిచిన సమాజం చుక్కాని లేని నావలాగా దిక్కులేనిదిగా మారుతుంది. ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి భాష ఒక మంచి మాధ్యమంగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి, తెలుగుని పరిరక్షించుకుని, మంచి సమాజం వైపు అడుగులు పడాల్సిన అవసరాన్ని జస్టిస్‌ ఎన్‌.వి.రమణగారు మరొక్క సారి గుర్తు చేసారు.

Thursday, June 10, 2021

ప్లే బ్యాక్‌ మూవీ రివ్యూ

     కరోనా కాలంలో ‘ఆహా’ ఒ.టి.టి.లో రిలీజైన ఒక చక్కటి మూవీ ‘ప్లే బ్యాక్‌’. సాధారణంగా తెలుగు సినిమాలలో ఉండే 3 ఫైట్లు, 6 పాటలు అనే రొటీన్‌కి భిన్నంగా చక్కటి కథతో, మరింత చక్కటి స్క్రీన్‌ప్లేతో ఈ మూవీని తీసారు. ఈ మూవీ కథ కూడా మన ఊహకి అందకుండా ఉంటుంది. ఇటువంటి భిన్నమైన జోనర్‌లో సినిమా చూసిన తరువాత తెలుగు సినిమాకు కూడా మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తుంది. ఎటువంటి హడావుడి లేకుండా, ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్దపెద్ద డైలాగులు, భారీ సెట్టింగులు... ఇటువంటి హడావుడి ఏదీ లేకుండా, కేవలం కథతోనే కట్టిపడేసాడు దర్శకుడు హరిప్రసాద్‌. హాలీవుడ్‌ సినిమాల్లో కనిపించే టైమ్‌ ట్రావెల్‌, టైమ్‌ మెషీన్‌ వంటి కాన్సెప్ట్‌లతో తెలుగులో కూడా చాలా మూవీస్‌ వచ్చాయి. ఆదిత్య 369, 24 వంటి మూవీస్‌లో టైమ్‌ ట్రావెల్‌ గురించి తెలుసుకున్నాం. కాని, గతాన్ని, వర్తమానాన్ని కలుపుతూ టైమ్‌, స్పేస్‌ కంటిన్యూయమ్‌లో ఒక చిన్న క్రాక్‌

ఏర్పడి, అప్పటి వారితో ఇప్పటి వారికి కమ్యూనికేషన్‌ ఏర్పడితే ఏమవుతుందో అనే ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీసాడు దర్శకుడు.

ఇప్పటి వరకు నేను తెలుగు మూవీస్‌కి రివ్యూలు రాయలేదు. నేను తెలుగు సినిమాలు చూడడమే తక్కువ. ఒక వేళ చూసినా, రివ్యూ రాయవలసినంత కంటెంట్‌ ఉన్న చిత్రాలు ఇప్పటి వరకు నేను చూడలేదు... బహుశా తీయలేదు. కాని ఈ మూవీ చూసిన తరువాత, ఇటువంటి మంచి మూవీని, మంచి అభిరుచి ఉన్న వారు ఎవ్వరూ మిస్‌ అవ్వకూడదు అనిపించింది. 

కథ విషయానికి వస్తే, 1993లో ఉన్న యువతికి, ప్రస్తుతం 2020లో ఉన్న యువకుడికి మధ్య ఒక పాత టెలిఫోన్‌ ద్వారా కమ్యూనికేషన్‌ ఏర్పడుతుంది. అంటే టైమ్‌ లైన్‌లో గతంలో ఉండే వ్యక్తులు, ప్రస్తుతం ఉన్న వారు మాట్లాడుకోగలుగుతారు. నిజానికి గతంలో ఉండే యువతి ప్రస్తుతం చనిపోయి ఉంటుంది. కాని, ప్రస్తుతం ఉన్న యువకుడు ఆ విషయం తెలుసుకుని, గతంలో ఉన్న యువతికి సహాయం చేసి, ఏ విధంగా తన ప్రాణాలు కాపాడాడు అన్నది సినిమా కథాంశం. ఆ యువతికి, తన ప్రాణాలు కాపాడిన యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయం మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇవన్నీ చెబితే సినిమాలో థ్రిల్‌ ఉండదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది అమ్మ సెంటిమెంట్‌. అమ్మ ప్రాణం కాపాడుకోవడం కోసం కొడుకు ఎంత రిస్క్‌ చేసాడు అనేది కూడా అంతర్లీనంగా చాలా బాగా చూపించారు. 

కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. చక్కటి ప్రెజెంటేషన్‌ చేసాడు. ఎక్కడా ఎటువంటి తికమక లేకుండా గతానికి, వర్తమానానికి మధ్య తేడాని చూపిస్తూ, సాధారణ ప్రేక్షకుడికి కూడా కష్టమైన ఫిజిక్స్‌ సూత్రాలని అర్ధమయ్యేలా చేయడంలో విజయం సాధించాడు. నటీనటుల్లో ‘వకీల్‌సాబ్‌’లో నటించిన అనన్య చాలా చక్కటి అభినయం కనబరిచింది. 1993 నాటి ఆమ్మాయిలు ఎంత అమాయకంగా ఉండేవారో అంతే అమాయకంగా నటించింది. నటనా పరంగా తనకి చక్కటి భవిష్యత్తు ఉంది అనిపించేలా చేసింది. మిగిలిన నటీనటులు తమ పరిధిలో చక్కగా నటించారు. కెమెరా పనితనం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సినిమాకి హైలైట్‌ గా ఉంది. మంచి అభిరుచి గల ప్రేక్షకులు తప్పని సరిగా చూడతగిన సినిమా ఇది. తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకువెళ్ళిన మూవీగా ఈ ‘ప్లే బ్యాక్‌’ ప్రేక్షకులకి ఎప్పుడూ గుర్తుండి పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Sunday, September 13, 2020

చాలా కాలం తరువాత.... మరలా మీ ముందుకు...

సరదా బ్లాగ్ వీక్షకులకు నమస్కారం. నేను కొన్ని వ్యక్తిగత కారణాల వలన బ్లాగింగ్ కు దూరం అయ్యాను. ఇప్పుడు మరలా మీ అందరిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో వలే ఇకమీదట కూడా నేను పెట్టబోయే బ్లాగులను చదివి ఆనందిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.