Pages

Sunday, September 3, 2017

అమ్మాయిల్ని ప్రేమించండి - కామించకండి... (చెత్త సినిమాలపై చిన్న చురక)

    ప్రేమ ఒక మధురమైన, అనిర్వచనీయమైన అనుభూతి. అది హృదయాంతరాళలో నుండి రావాలి. అంతేగాని నేటి సినిమాల్లో చూపించినట్లు ఒక అమ్మాయి భౌతిక రూపం చూసీ చూడగానే చిత్త కార్తె కుక్కల్లాగా వెంటబడి, వాళ్ళని తరిమి, హింసించి, తికమక పెట్టి, ఏదో రకంగా ప్రేమించాను అని వాళ్ళచేతనే చెప్పించుకునే పైశాచిక హీరోలు చేసే పిచ్చి చేష్టలు కాదు. డబ్బు కక్కుర్తి కోసం కొంత మంది సినిమాలు తీస్తున్నారు. తమలో ఉన్న పైశాచిక ఆనందాన్ని (శాడిజం) తీర్చుకోవడానికి కొంత మంది నీచులు డైరెక్టర్‌ అవతారం ఎత్తుతున్నారు. వీళ్ళు చేసేదల్లా సగటు మనిషిలో ఉన్న బలహీనతల్ని సినిమా అనే ముసుగులో రెచ్చగొట్టి, ఉచితంగా పబ్లిసిటీ, డబ్బు సంపాదించడం. ఇలాంటి నీతి జాతి లేని కుక్కలకు (అలా అంటే కుక్కలు బాధపడతాయేమో) మిగతా వాళ్ళు వత్తాసు పలకడం, అటువంటి చౌకబారు సినిమాలకు సో కాల్డ్‌ పనీపాట లేని యువత వెళ్ళి, వాళ్ళకు డబ్బుల వర్షం కురిపించడం... ఇదంతా చూస్తుంటే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. సదరు డైరెక్టర్లకు, నిర్మాతలకు సామాజిక బాధ్యత ఉండదు. కుటుంబ విలువల పట్ల, నైతికత పట్ల ఎటువంటి గౌరవం ఉండవు. వాళ్ళకు ఉండేది పశు వాంఛ. దాన్ని తీర్చుకోవడానికి సినిమాని ఒక సాధనంగా మార్చుకుంటారు. వారు తీస్తున్న ఇటువంటి నీచపు పనుల వల్ల ఎన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయో వారికి పట్టదు. అసభ్యత, అశ్లీలత మేళవించే సినిమాలు తీస్తున్నారంటే వారు పశువు కంటే హీనమైన వారు అని అర్థం. ఎందుకంటే ఏ జంతువైనా తన బాధ్యతగా, ప్రకృతి ధర్మం ప్రకారం కొన్ని సమయాల్లోనే తమ కోరికను తీర్చుకుంటాయి. కాని, ఇటువంటి నీచులు సర్వకాల సర్వావస్థల్లో అదే పనిగా ఉంటూ, తాము చెడిందే కాక, లోకమంతా అదే విధంగా నడవాలని కోరుకుంటారు. అందుకే వీరు పశువు కంటే ప్రమాదకరమైన వాళ్ళు.

    సహజంగా ఇటువంటి సినిమాల్లో హీరోయిన్‌కు ఎటువంటి వ్యక్తిత్వం, సొంత ఆలోచనలు ఉండవు. ఎదుటివాడు తమ మనసుతో, శరీరంతో ఎలా ఆడుకున్నా వాళ్ళు ఎదురు చెప్పరు. పైగా లొంగిపోయి, ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. కాని, వాస్తవంలో ప్రతి ఆడపిల్లకు ఒక మనసుంటుంది. సొంత ఆలోచన ఉంటుంది. తమకు ఏది మంచో, ఏది చెడో ఆలోచించుకోగలిగిన మానసిన పరిపక్వత అబ్బాయిల కన్నా అమ్మాయిల్లోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు సినిమాలో నీచ హీరోలు చేసే పిచ్చి చేష్టలకు లొంగరు. అలాంటి అమ్మాయి ఎదురైనపుడు, సినిమాల్లో చూపించిన విధంగా జరగకపోయే సదరు చిత్తకార్తె కుక్కకు అహం దెబ్బతింటుంది. ఆ అమ్మాయిని అల్లరి చేయడానికి, హింసించడానికి, చివరకు యాసిడ్‌ దాడి చేయడానికి కూడా వెనుకాడడు. సినిమాల ప్రభావంతో తాను ప్రేమిస్తున్నాననే అనుకుంటాడు. పత్రికలు కూడా దీనికి వత్తాసు పలుకుతూ 'అమ్మాయిపై ప్రేమోన్మాది దాడి' అని హెడింగ్‌ పెడుతూ ఉంటారు. నిజానికి ఆడపిల్లల్ని హింసించే వాళ్ళని ప్రేమోన్మాది అని కాదు... కామోన్మాది అని పిలవాలి.

    ఒక రచయిత్రి మాటల్లో చెప్పాలంటే... ''ఒక ఆడపిల్ల తన గుండె నిండుగా, నిండు మనసుతో ప్రేమిస్తే... ఆ ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో తెలుసా... అమాయకమైన ఆ ప్రేమ అమృతంతో సమానం... కాని ప్రేమను పొందే అదృష్టం ఎంత మందికి ఉంటుంది?'' అటువంటి ప్రేమను పొందడానికి ప్రయత్నించాలిగాని, శరీరాన్ని చూసి వెంటబడితే అది కామం అవుతుందేగాని, ప్రేమ ఎన్నటికీ కాదు...