Pages

Saturday, December 18, 2010

హిందువులు తీవ్రవాదులయితే రాహుల్ వ్యాఖ్యానించడానికి కూడా భయపడతాడు....

భారతదేశంలో హిందూ తీవ్రవాదం ఎక్కువగా ఉందని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కల్లోలాన్ని రేపుతున్నాయి. వికీలీక్స్‌ బయట పెట్టిన రహస్య పత్రాల్లో భాగంగా అమెరికా దౌత్యవేత్తతో భారత దేశ అంతర్గత పరిస్థితి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు భారత దేశ సంస్కృతిపై జరుగుతున్న దాడిగా భావించవచ్చు. ఇటువంటి వ్యాఖ్యలు భారతదేశానికి ఏదో కావాలనుకుంటున్న రాహుల్‌ యొక్క అజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తాయి. వీర కాంగ్రెస్‌ విధేయులు ఇటువంటి వ్యాఖ్యలు తేలికగా తీసి పడేయొచ్చు లేదా తమదైన వక్ర భాష్యం చెప్పవచ్చు. కాని నిజాన్ని ఎవరూ దాచలేరు కదా. రాహుల్‌ మీద నాకు మొదటి నండి ఒక సదభిప్రాయం ఉండేది. ఒక నూతన తరం ప్రతినిధిగా భారతదేశం ఇప్పుడున్న సమస్యల నుండి బయటపడేయడానికి ఇటువంటి వారు తమ శక్తి యుక్తులను ఉపయోగిస్తారనే భావంతో నేను ఉండేవాడిని. కాని రాహుల్‌ కూడా సగటు కాంగ్రెస్‌ మార్కు రాజకీయ వాదేనన్న విషయం ఈ వ్యాఖ్యలతో నిర్ధారణ అయిపోయింది.

    భారతదేశ చరిత్ర తెలిసిన వాళ్ళెవరయినా ఈ దేశం ఇప్పటివరకు ఎవ్వరిమీదా దాడి చేయడం గాని, ఇతర మతాలతో సామరస్యంగా లేకపోవడం గాని చేయలేదనే నిజాన్ని గ్రహించే ఉంటారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అనేక పెద్దమతాలు భారతదేశంలో పుట్టాయి. బౌద్ధం, జైనం, సిక్కుమతం, ఇంకా హిందూ మతంలోనే అనేక శాఖలు ఈ గడ్డపై పుట్టాయి. ఎప్పుడూ ఏ మతంతోను భారతదేశ సంస్కృతి ఘర్షణ పడినట్లుగా చరిత్రలో లేదు. దానికి బదులుగా అన్ని మతాలను తనకు అనుగుణంగా మార్చుకుని, లేదా వాటికి తగ్గట్లుగా తనని తాను సంస్కరించుకుని, భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంస్కృతిగా రూపుదిద్దుకుంది. సరిహద్దులకు ఆవల నుండి వచ్చిన అనేక ఇతర మతాల వారిని కూడా అంటే కిరస్తానీయులను, ముస్లింలను కూడా తనతో పాటు కలుపుకుని ముందుకు వెళుతుంది విశిష్టమైన భారతజాతి. మీరు ప్రపంచంలో మిగతా దేశాలను గమనించండి. ఎక్కడైనా ఒక మతం ప్రబలంగా ఉంది అంటే దానర్థం ఇతర మతస్థులు ఆయా దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనం తెలుసుకోవచ్చు. క్రిసెండమ్‌ (అంటే క్రిష్టియన్‌ మతం ఉన్న దేశాలు) ముస్లింలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. అదే సమయంలో ఇస్లామిక్‌ దేశాలలో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అక్కడ ఇస్లాం తప్ప మరో మతానికి ఎట్టిపరిస్థితిలోను, ఆఖరికి కలలో కూడా చోటు ఉండదు. కనీసం ఎవరి మతం గురించి వారు ప్రచారం చేసుకోవడానికి కూడా అక్కడ ఆంక్షలుంటాయి. ఆ దేశాలలో పనిచేసే హిందువులు తాము అక్కడికి తీసుకెళ్ళే పంచాంగం క్యాలండర్లలో కూడా హిందు దేవుళ్ళ బొమ్మలు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే అటువంటి క్యాలెండర్లని ఎయిర్‌పోర్టులోనే చింపి చెత్తలో పడేస్తారట. మతం విషయంలో అక్కడ కఠినంగా ఉంటారు. కాని భారతదేశం యొక్క విషయాన్ని తీసుకోండి. ఇక్కడ అటువంటి పరిస్థితిని కలలో కూడా ఊహించలేము. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు పైకి కలిసి సహజీవనం చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు. మనం కూడా అలాగే చెప్పుకుంటూ ఉంటాం. కాని వాస్తవ పరిస్థితి వేరు. మైనారిటీ మతాలకు చెందిన ప్రజలు మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉంటారు. వారి సంస్కృతిని విమర్శిస్తూనో, ద్వేషిస్తూనో కాలం గడుపుతారు. విగ్రహారాధన చేస్తే పాపం అంటుతుంది అంటాడు ఒకడు. ఆడవాళ్ళందరూ బొట్టు బిళ్లలు ధరించవద్దు అంటాడు మరొకడు. పుష్కరాలలో, హిందూ పండుగలు చేసుకొనే చోట, వారి పుణ్య క్షేత్రాలలో పాంప్లెట్స్‌ పంచుతూ కనబడతాడు ఇంకొకడు. అసలివన్నీ ఎందుకు? ఏకంగా బాంబులేసి చంపేస్తే వారే (హిందువులే) దారిలోకొస్తారు అని నమ్ముతాడు మరో మతం వాడు. కాని ఎప్పుడూ ఎవర్నీ నిందితులుగా ఇక్కడ చూపించలేదే. ఏ కోర్టు వారికి శిక్ష వేసిన పాపాన పోలేదే. పార్లమెంట్‌ మీద దాడి చేసిన వాళ్ళని, తాజ్‌ హోటల్‌లో మారణహోమం సాగించిన వారిని మీనం మేషం లెక్కిస్తూ, మూడు పూటలా శుభ్రంగా మేపుతున్నాం కదా. ఇంకా సిగ్గు లేని రాజకీయ నాయకులే అటువంటి వారిని వెనకేసుకుని మాట్లాడడం మనం పబ్లిక్‌గా చూస్తూ ఉంటాం. ఇంత జరిగినా కూడా ఈ దేశంలో హిందూ తీవ్రవాదం ఉందనడం సిగ్గుచేటు. అవి రాహుల్‌ గాంధీ వంటి వ్యక్తికి తగని మాటలు.

    ఒకటి మాత్రం నిజం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉన్నారు. కాని మౌనంగా మాత్రం లేరు. ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంస్కృతి, మరే దేశంలోనూ లేని ఉన్నతమైన జ్ఞాన సంపద ఉన్న తమ జాతికి పట్టిన దుర్గతిని గురించి వారు ఖచ్చితంగా విచారిస్తూ ఉంటారు. మరో సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా ఈ దేశం ఖచ్చితంగా దూసుకువెళుతుంది. అది ఎప్పుడు జరుగుతుందనేది, ఎవరు నాయకత్వం వహిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేకపోవచ్చు. నేను ఇక్కడ హిందూ తీవ్రవాదాన్ని సమర్థించడం లేదు అలాగని వ్యతిరేకించడం లేదు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా కాని అది ఖండనీయమే. కాని ఎదుటి వారు హింసకు దిగినప్పుడు మనం హింసకు దిగకుండా శాంత వచనాలు వల్లిస్తే ఎంత హాని జరిగిందో ఇప్పటి వరకు అందరూ ప్రత్యక్షంగా చూసారు. హింసకు హింస పరిష్కారం కాకపోవచ్చు కాని వేరే దారి లేకపోతే మాత్రం హింసే శరణ్యమవుతుంది.

Monday, December 13, 2010

కులాల కుమ్ములాటలు ఎప్పటికీ మనకి తప్పవా?

ఎప్పుడూ ఆనందంగా, విచారాన్ని దరిచేరనివ్వకుండే ఉండే నేను ఈ రోజు చాలా బాధగా ఉన్నాను. ఎద లోతుల్లో ఏదో తెలియని భావం నన్ను ఉత్సాహంగా ఉండనివ్వడం లేదు. ఎందుకని నాలో ఈ మార్పు? ఎంత వత్తిడినైనా, ఎంతటి బాధనైనా సునాయాసనంగా ఎదుర్కోవచ్చునని వీలు దొరికినప్పుడల్లా 'స్ట్రెస్‌ మేనేజిమెంట్‌'పై ఉపన్యాసాలిచ్చే నేను ఇంత ముభావంగా ఎందుకున్నాను? నాకు తెలుసు - దాని కారణం ఏమిటో... నాలుగు రోజుల క్రితం జరిగిన ఆ దురదృష్టకర సంఘటన ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది.

    ఎప్పటిలాగే కాలేజ్‌కి వెళ్ళిన నన్ను మా ఆఫీస్‌ మేడమ్‌ హడావుడిగా ఒక క్లాస్‌ కేన్సిల్‌ చేయడానికి పర్మిషన్‌ అడిగారు. కారణమేమిటంటే ఆ రోజు స్కాలర్‌షిప్స్‌ కోసం పిల్లలందర్నీ వెరిఫికేషన్‌ చేయాలని, వాళ్ళిచ్చిన వివరాలతో అన్నీ సరిపోయాయో లేదో కనుక్కోవాలని చెప్పారు. నేను కూడా పెద్దగా ఆలోచించకుండా ఒ.కే. అనేసాను. కొద్దిసేపటిలోనే వెరిఫికేషన్‌ మొదలయ్యింది. నేను కూడా చూద్దామని క్లాస్‌లోకి వెళ్ళాను. ముందుగా ఒక విద్యార్థిని పేరు పిలిచారు. ఆ అమ్మాయి లేచి నిలబడింది. నీ పూర్తి పేరు... చెప్పింది.... నీ తండ్రి పేరు... చెప్పింది. మీదే కులం..... సమాధానం లేదు. మౌనంగా నుంచుని మా వైపే చూస్తూ ఉంది. నేను కేస్ట్‌ సర్టిఫికేట్‌ తీసుకుని చూసాను. నాకు పరిస్థితి అర్థం అయింది. ఆ అమ్మాయిని కూర్చోమన్నాను. మరో అమ్మాయి పేరు పిలిచారు మా మేడం. పైన చెప్పిన పరిస్థితే మళ్ళీ రిపీట్‌ అయింది. ఈ సారి ఆ పాప కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. క్లాసులో గుసగుసలు, వెనుక బెంచిలో నుంచి చిన్నగా నవ్వులు. ఒక్క సారిగా నా మనసు బాధతో మెలిపెట్టింది. ఏమిటిది? మనం ఎక్కడున్నాం? ఆటవికుల సమాజంలోనా లేక మధ్య యుగాలనాటి కులాలతో భ్రష్టు పట్టిన భారతదేశంలోనా? కులాల ఆధారంగా ఆ రోజుల్లో మనుష్యుల్ని శారీరకంగా, మానసికంగా హింసించే వారని విన్నాం, చరిత్ర పుస్తకాల్లో చదివాం. కాని ఈ రోజున జరుగుతున్నదేమిటి? ప్రభుత్వమే సమాజాన్ని కులాల పరంగా విడదియ్యమని, వారి కులాన్ని ఎమ్‌.ఆర్‌.ఓ. దగ్గర ధృవీకరించమని ఆ సర్టిఫికెట్ల ఆధారంగా డబ్బులు పంచుతామని అంటోంది. ఇది ఎంత వరకు న్యాయం? డబ్బు లేని వాళ్ళు ఏ కులంలో అయినా ఉండవచ్చు. అటువంటి వాళ్ళకి సహాయం చెయ్యవచ్చు కదా? ఏ పాపం, పుణ్యం తెలియని పసి మనసుల్ని కులాల పేరుతో కలుషితం చేయడం ఎందుకు? కాలేజ్‌లో పిల్లల్ని ఎంతో దగ్గర నుండి గమనించాను. వాళ్ళంతా ఎంతో నిష్కల్మషంగా స్నేహితులవుతున్నారు. వాళ్ళలో ఎక్కడా కుల ప్రస్థావన లేదు. ఒకళ్ళ కేరియర్‌లో భోజనం మరొకరు ఆనందంగా పంచుకుని భోజనం చేస్తున్నారు. ఎవరి ఇంట్లోనైనా మంచి కూర చెయ్యకపోతే పక్కనున్న అమ్మాయి తన కేరియర్‌లో నుంచి కూర తీసి ఆ పాపకి పెట్టడం నేను చూసాను. ఒంట్లో బాగోక పోతే మేడమ్‌కి తెలియకుండా నోట్స్‌ రాసిపెట్టిన పిల్లల్ని చూసాను. ఇంకెక్కడుంది వివక్ష? ఇంకెక్కడుంది కులాల పేరుతో హింస? ఇప్పుడు పెద్దవాళ్ళమయిన మనమే బుద్దిలేకుండా చిన్నపిల్లల మధ్య కులాల పేరుతో చిచ్చు పెడుతున్నామేమో అనిపించింది.

    వెంటనే ఆ దుర్మార్గమైన కార్యక్రమానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసాను. ఆ రాత్రికి సరిగా నిద్ర పట్టలేదు. ఏదో కలత నిద్ర... అందులో ఒక భయంకరమైన పీడ కల... ఒక అందమైన ప్రదేశం. అక్కడ తెల్లని రంగుతో మెరిసిపోతున్న అందమైన పక్షులు.... ఇంతలో అక్కడో ఫ్యాక్టరీ లాంటిది... ఎవరో వచ్చి నిర్దాక్షిణ్యంగా ఆ పక్షుల రెక్కలు విరిచి ఆ యంత్రాలలోకి తోస్తున్నారు... వాటి రెక్కల నుండి వస్తున్న రక్తంతో అందమైన వాటి తెల్లటి రంగు ఎర్రగా మారుతోంది.... అవి విదారకంగా అరుస్తున్నాయి.... ఒక్కసారిగా మెలకువ వచ్చేసింది.... ఈ సమాజంలో అందరూ కలిసి ఎంత తప్పు చేస్తున్నామో... రాజకీయ నాయకులు వారి ఓట్ల కోసం ఈ సమాజాన్ని ఎంతలా కలుషితం చేస్తున్నారో... కుల సంఘాల పేరు చెప్పి వాటి నాయకులు సమాజంలో ఎలా చిచ్చు పెడుతున్నారో తలుచుకుంటూ... నా హృదయం ద్రవించిపోయింది. కనీసం రాబోయే తరాల్లో నయినా ఈ కుల రాక్షసి పూర్తిగా అంతమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకు మించి మనమేం చేయగలం....