Pages

Sunday, July 15, 2018

అందం చాటున దాగివున్న ముప్పు - ఆడపిల్లలూ.. జాగ్రత్త...

    అమ్మాయిలకున్న బలం - బలహీనత - రెండూ వారి అందం... అందంగా కనబడడం కోసం ఏమైనా చేయడానికి, ఏదైనా పూసుకోవడానికి, ఎంతైనా ఖర్చుపెట్టడానికి వారు సిద్ధం అయిపోతూ ఉంటారు. ఇదిగో... సరిగ్గా ఇదే బలహీనతని సొమ్ము చేసుకోవడానికి వీధి చివర ఉండే బ్యూటీ పార్లర్‌ నుండి బహుళజాతి కంపెనీలు వరకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. రకరకాలుగా ప్రలోభ పెట్టి, తెల్లగా లేకపోతే అదేదో పెద్ద నేరం అయినట్టు, అందరిలోను ఆకర్షణీయంగా కనబడకపోతే ఇక బ్రతుకే లేనట్లుగా ప్రకటనలు గుప్పిస్తూ ఉంటాయి. అది చూసి, ఎంతో మంది ఆడపిల్లలు, ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న పిల్లలు, టి.విలోను, పత్రికల్లోను కనబడే ప్రకటనలు చూసి, ఆయా బూడిదలు... సారీ... ఫేస్‌ పౌడర్లు కొనుక్కుంటూ ఉంటారు. కంపెనీలకు కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతూ ఉంటారు.


    సరిగ్గా అలాంటి సౌందర్య సాధనాలు తయారుచేసే కంపెనీపైనే అమెరికాలో కొందరు మహిళలు కేసుపెట్టారు. ఆ కంపెనీ తయారు చేసే  పౌడర్‌లో వాడే ఆస్‌బెస్టాస్‌ వల్ల అండాశయ కేన్సర్‌ వచ్చిందని కొందరు మహిళలు కోర్టుకెక్కారు. ఎన్నో పరీక్షలు నిర్వహించిన తరువాత, వైద్య నివేదికలు పరిశీలించిన తరువాత వారు చెప్పింది నిజమేనని కోర్టు తెల్చి, వారికి 31,000 కోట్ల రూపాయిలు పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరించింది. (ఇక్కడ నేను పెట్టిన న్యూస్‌ క్లిప్పింగ్‌ - ఈనాడు పత్రికలో 13-7-2018 తేదీన ప్రచురితమైనది). ఈ తీర్పు అందం వెంట పరుగులు తీసే యువతరానికి కనువిప్పు కావాలి.

    బహుళ జాతి సంస్థలు కేవలం లాభాలపైనే దృష్టి సారించి, ఎన్నో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా అమెరికన్‌ కంపెనీలు నైతిక విలువలకి పూర్తిగా తిలోదకాలిస్తాయి. లాభాల కోసం ఎంతకైనా దిగజారతాయనేది ఎన్నో ఉదంతాలలో రుజువయింది.. ఇక ముందు కూడా రుజువవుతూనే ఉంటుంది. ధమ్స్‌ అప్‌ యాడ్‌లో కింద చిన్న చిన్న అక్షరాలతో ఇది ఆరోగ్యానికి హానికరం అని మీరు గమనించే ఉంటారు. కాని సౌందర్య సాధనాలు (ఫేస్‌ పౌడర్‌లు, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీములు, బాడీ లోషన్‌లు) లో ఎటువంటి హానికర రసాయనాలు వాడతారో, వాటిని ఎలా తయారుచేస్తారో ఎవరికీ తెలియదు. అవి శరీరంపై దీర్ఘ కాలంలో ఎటువంటి దుష్ప్రభావాలు చూపుతాయో ఎవరూ చెప్పరు. ఒక వేళ ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసినా, డబ్బుతోను, అధికారంతోను వారి నోరు నొక్కే  ప్రయత్నం చేస్తారు. బాధ్యత లేని రాజకీయ నాయకులు, లంచాలు మరిగిన ప్రభుత్వ అధికారులు వారికి కొమ్ము కాస్తూ ఉంటారు. అందుకే ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలి.

    అమ్మాయిలు కూడా అందం అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అని గుర్తు పెట్టుకోవాలి. కేవలం ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ వాడినంత మాత్రం అందంగా కనబడతామనే అపోహను మానుకోవాలి. అటువంటివి వాడడం వలన స్కిన్‌ ఎలర్జీ వంటి వాటిలో మొదలై, కేన్సర్‌ వంటి భయంకరమైన జబ్బుల బారిన పడతారు. చర్మం తెల్లగా రావడం కోసం వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు. అవి దీర్ఘ కాలంలో శరీరంలో చేరి వివిధ అవయవాల పనితీరుని దెబ్బతీసి, చివరకు మరణానికి చేరువ చేస్తాయి. పైగా వాటిని కొనడం కోసం పెట్టే డబ్బు, కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక పౌడర్‌ రాసుకోవడం వలన ఒక జబ్బు వస్తే, మళ్ళీ వాటిని నివారించడం కోసం మరో  క్రీమ్‌ రాసుకోవడం... ఇదో విషవలయంలా మారుతుంది.

    మరో ముఖ్య విషయం... ఎటువంటి క్రీములు, లోషన్లు, పౌడర్లు వాడకపోయినా మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎంత ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉన్నారో వారిని అడిగి తెలుసుకోండి. భారతీయుల సౌందర్యానికి ముఖ్య కారణం వారుపాటించే సంప్రదాయ సౌందర్య చిట్కాలే. పూర్తి ఆయుర్వేద పరంగా, ప్రకృతిలో సహజంగా దొరికే  పసుపు, సున్నిపిండి శరీరానికి పట్టించి, నలుగు పెట్టి స్నానం చేసేవారు. గంధం చెక్క అరగదీసి, ఆ గంధాన్ని ముఖానికి పట్టిస్తే, చర్మం చల్లబడి, గంధం, పసుపు మంచి యాంటీ బయోటిక్‌గా పనిచేసి, మొటిమలు, బాక్టీరియా వంటివి రాకుండా నివారించి చర్మాన్ని ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉంటే అదే అందం... అటువంటి అందమే నిజమైన సౌందర్యం...