Pages

Tuesday, June 15, 2010

భారతీయుల మీద జరిగిన కుట్రకి సాక్ష్యమిదిగో...

భారత దేశ విద్యారంగంలో పెను మార్పులు తీసుకురావడానికి ఆద్యుడు లార్డ్ మెకాలే. ఇప్పటికీ సాంప్రదాయవాదులు ఆయన విద్యావిధానాన్ని దుమ్మెత్తి పోస్తూనే వుంటారు. ఈ మధ్యన ఒక ఫ్రెండ్ దగ్గర నుండి వచ్చిన ఈ మెయిల్ చూసి నేను షాక్ కీ గురయ్యాను. అది నిజమో కాదో నాకు తెలియదు కాని, అందులో వ్యక్తపరచబడిన భావాలు మాత్రం ఖచ్చితంగా నిజమే అని నమ్ముతున్నాను. దాని తెలుగు అనువాదం ఇక్కడ ఇస్తున్నాను. చదవండి..

లార్డ్ మెకాలే 1835, ఫిబ్రవరి 2వ తారీఖున బ్రిటిష్ పార్లమెంటుకి రాసిన  వుత్తరం.

"నేను భారత దేశం నలుమూలలా పర్యటించాను. కాని దేశం మొత్తం మీద ఎక్కడా ఒక బిచ్చగాడు కాని, ఒక దొంగ కాని కనిపించలేదు. ఇంతటి సంపన్నమయిన దేశాన్ని, ఇంతటి నీతిమంతులయిన ప్రజులున్న దేశాన్ని, ఇంతటి సమర్ధులయిన ప్రజలున్న దేశాన్ని మనమెప్పటికయినా జయించగలమని నేను అనుకోవడం లేదు. కాని ఈ దేశానికి వెన్నెముక అయిన ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, అత్యంత  పురాతనమయిన విద్యావ్యవస్తని నాశనం చేయడం ద్వారా, వారి సాంప్రదాయ విద్య స్తానంలో మన ఇంగ్లీష్ విద్యని ప్రవేశపెట్టడం ద్వారా, భారతీయులకి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా చేసి, వారి ఔన్నత్యాన్ని కోల్పోయేలా చేసి, కేవలం విదేశీయులు మాత్రమే గొప్పవారు, అందులోనూ అంగ్లేయులు ఇంకా గొప్పవారు అనిపించేలా చెయ్యగలిగితే మనం అనుకున్నది సాధించవచ్చు. (భారత దేశాన్ని ఆక్రమించవచ్చు)


పైన వున్న వుత్తరం నిజమయినా కాకపోయినా, ఇప్పుడున్న పరిస్తితి చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మన బ్లాగర్లలో కొంత మంది భారత దేశ సంస్కృతిని, సంప్రదాయాల్ని పనిగట్టుకుని తిడుతూ, దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటివారందరికీ ఒక మనవి. ఎవరినయినా ద్వేషించేముందు, దూషించే ముందు ఒక్కసారి అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎవరో చెప్పింది, ఎవరో రాసింది మాత్రమే సరయినదనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి. మనల్ని మనం అవమాన పరచుకోకూడదు. ఎవరి గొప్పదనం వాళ్ళకుంటుంది, ఎవరి లోపాలి వాళ్ళకుంటాయి. అంతే గాని ఇతరులని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని, అదేదో పెద్ద గొప్ప విషయంలా చూపడం మానుకోవాలి.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, భారత దేశ సంస్కృతి అధమ పక్షం 10,000 సంవత్సరాల నాటిది. అంత పూర్వకాలం నుండి అవిచ్చిన్నంగా కొనసాగుతున్న సంస్కృతి, నాగరికత ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. భారతీయ సంస్కృతితో పరిడవిల్లిన ఈజిప్ట్, పర్షియన్, మాయన్ వంటి నాగరికతలు చరిత్రలో కలిసిపోయాయి. అదీ ఎటువంటి ఆధారాల్లేకుండా... కేవలం వాళ్ళు వాడిన కుండ పెంకులు, సమాధులని తవ్వి తీసి చరిత్ర రాస్తున్నారు. కాని అన్ని ఆధారాలతోను, సుసంపన్నమయిన సంస్కృత భాషలో అప్పటి చరిత్ర గురించి ఆధారాలు లభిస్తుంటే, ఇది నిజం కాదు అని తిరస్కరించడం పర దేశ సంస్కృతి దాసోహమనడం వల్లనే వచ్చింది. ఇంతటి అరుదయిన సంస్కృతిని పొగడనకర్లేదు, కనీసం మిగిలిన వాళ్ళతో కలిసి తిట్టకుండా వుంటే చాలు.

Tuesday, June 1, 2010

సృష్టిలో అందమయినది ఎవరు? ఆడా? మగా?

ఇదేమి ప్రశ్న? నిస్సందేహంగా ఆడవాళ్ళెగా అని మీ సమాధానం చెప్పవచ్చు. మన కవులందరూ, మగ వాళ్ళే కాబట్టి ఆడవారి అందాన్ని తెగ వర్ణించి పడేసారు. ఏ కధ తీసుకున్నా, ఏ కావ్యం చదివినా ఏమున్నది గర్వ కారణం. నరజాతి సాహిత్య సమస్తం స్త్రీ సౌందర్య వర్ణనం. అందుకే మనకి ఈ అభిప్రాయం స్తిరపడిపోయి వుండవచ్చు. ఇక కవయిత్రులెవరూ, రచయిత్రులూ మగవారి అందాన్ని గురించి వర్ణించినట్టుగా ఎక్కడా నేను చదివినట్టు గుర్తు లేదు. అంత మాత్రం చేత మగవారు అందంగా లేకుండా పోతారా? ఈ మధ్యన కొంత ట్రెండ్ మారి మగవారికి కూడా ఫేస్ క్రీములు, సౌందర్య సాధనాలు వచ్చినవి గాని, ఇప్పటి వరకు సౌందర్యం అంటే అది స్త్రీలకే పరిమితమయిన విషయంగా అందరూ భావిస్తున్నారు.

కాని ప్రకృతిని పరిశీలిస్తే అసలైన  అందాన్ని మగవారికే ఇచ్చాడు ఆ దేవుడు. ఏమిటి మీరు నమ్మట్లేదా? అయితే ఇది చదవండి. పక్షులన్నిటిలోకీ అందమయినది నెమలి. నెమలి పించం విప్పి నాట్యమాడుతూ వుంటే ఆ సౌందర్యానికీ, అందానికి పరవశులు కాని వారెవరూ వుండరు. కాని విషయమేమిటంటే, మగ నెమలికే ఆ పించం వుంటుంది. ఆడ నెమలిని ఆకర్షించడానికే ఈ ఏర్పాటు. ఆడ నెమలి చాలా మామూలుగా కొంచెం పెద్ద కోడి లాగా వుంటుంది. పించం లేకుండా..

కోకిల ఎంత అద్బుతంగా పాడుతుంది? వసంత వేళలో కోయిల గానం లేకుండా ప్రకృతికి శోభ రాదు. అటువంటి అందమయిన స్వరం కూడా మగ కోయిలదే. పాపం ఆడ కోయిల అసలు కూయలేదట. కోడి పుంజుని చూడాండి. అందమయిన తురాయితో ఎంత ఠీవీగా నడుస్తుంది. వెనక చక్కని తోక, నెత్తిమీద తురాయితో చాలా అందంగా వుంటుంది. కాని ఆడ కోడి మాత్రం ఎటువంటి హంగులు లేకుండా మామూలుగా వుంటుంది.

జంతువుల్లో చూడండి. మృగ రాజయిన సింహం నెత్తి మీద జూలుతో పెద్ద పెద్ద మీసాలతో ఎంత అందంగా వుంటుంది... అదే సివంగిని చూడాంది. జూలు లేకుండా చాలా సాదాగా వుంటుంది. "జూ"లో మగ సింహాన్ని చూసి ఆనందిస్తారే తప్ప, ఆడ సింహం వైపు కన్నెత్తి కూడా చూడరు. ఏనుగు చూడండి పెద్ద దంతాలో వుంటుంది. ఆ దంత సిరి మగ ఏనుగుకే సొంతం. ఆడ ఏనుగుకి మామూలుగా చిన్న చిన్న దంతాలుంటాయి.

అలాగే మనుషులలో కూడా మగవారికే చక్కటి మీసకట్టు, అందమయిన గెడ్డం వుంటాయి. పై వుదాహరణల వల్ల ఏతా వాతా తేలిందేమిటంటే మగవారు మాత్రమే సహజసిద్దంగా అందంగా వుంటారు అని. అందుకే ఆడవారికి లేని సౌందర్యం తెచ్చిపెట్టుకోవడానికి రకరకాల సౌందర్య సాధనాలు వాడుతారు అని. అయితే ఆడవారి పట్ల మగవారికి వుండే సహజ బలహీనత వల్ల వారి అందాన్ని అదే పనిగా పొగుడుతూ వుండి వుండవచ్చు. అది వారి తప్పు కాదు. ఇప్పుడు మీరేమంటారు? ఎవరి అందం గొప్పదంటారు? ఆడవారిదా? మగవారిదా?