Pages

Monday, April 1, 2013

బ్లాగర్లపై పన్ను పోటు - యోచనలో చిదంబరం

    అసలే ఎన్ని పన్నులు వేసినా ప్రభుత్వం నడపడానికి డబ్బులు సరిపోవడం లేదు. ప్రజల్ని పిండి, పిండి, వారి రక్తం మొత్తం తోడేసినా, ప్రభుత్వానికి ఆర్థిక ఆకలి తీరడం లేదు. ఒకవైపు కిలో రూపాయికి బియ్యం ఇవ్వాలి. రేపు ఎన్నికలొస్తే అర్థరూపాయికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వెనుకబడిన వారికి ఎన్నో పథకాలు ప్రకటించాలి. ప్రభుత్వోద్యోగుల జీతాలు పెంచాలి. ఇవన్నీ చేస్తే ఇప్పుడు వస్తున్న ఆదాయం చాలదు. మరేం చేయాలి? ఉన్న పన్నుల్ని ఇంకా పెంచితే ప్రజా వ్యతిరేకత ఎదురవుతుంది కాబట్టి, కొత్త పన్నుల్ని విధిస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, దానితోపాటు ప్రజలకి భారం అనిపించదు. అందుచేత కొత్త పన్నుల్ని వేయడానికి ముసాయిదా సిద్దం చేసారట అధికారులు. ఇందుకోసం తుగ్లక్‌ మరియు ఇతర సుల్తానులు భారతదేశాన్ని ఎలా పన్నుల రూపంలో కొల్లగొట్టిందీ ప్రజల్ని ఎలా హింసించిందీ ఆరా తీస్తున్నారట. బ్రిటిష్‌ వారి సమయంలో కూడా ఎటువంటి కొత్త పన్నులు ముక్కు పిండి వసూలు చేసారో కూడా అవన్నీ మరలా విధించడానికి ఆలోచిస్తున్నారట. కొద్దిగా బయటకు వచ్చిన (లీకయిన) అంశాల సారాంశమేమిటంటే:

    1. గాలి పన్ను: ఇప్పటి వరకు పంచభూతాలయిన భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం - వీటిలో భూమి పైన (ఆస్థి పన్ను, రిజిస్ట్రేషన్‌ పన్ను) ఇప్పటికే పన్ను ఉంది. నిప్పు (వంట గ్యాస్‌) మీద పన్నును ప్రతి ఆరు నెలలకి పెంచుతున్నారు. ఇక మినరల్‌ వాటర్‌పైన ఎలాగో సేల్స్‌ ట్యాక్స్‌ వడ్డిస్తున్నారు. అందుకే గాలి మీద కూడా పన్ను వేయాలి. ప్రతి మనిషి రోజుకి ఎంత గాలి పీలుస్తున్నాడో లెక్కగట్టి, సంవత్సరానికి దాని విలువ మధింపు చేసి పన్ను వేయాలి. ఇలా లెక్క వేయడం కోసం చైనాకు ప్రత్యేక మైన పరికరాల తయారీ కోసం ఆర్డరివ్వాలి. (కనీసం పదివేల కోట్లు ఈ బడ్జెట్టుకు కేటాయించాలి)

    2. నడక మీద పన్ను: మనిషన్నాక ఏదో పని మీద నడుస్తూనే ఉంటాడు. నెలకు ఎన్ని అడుగులు వేస్తాడో లెక్కగట్టి, ప్రభుత్వ రోడ్ల మీద నడుస్తున్నాడు కాబట్టి, అవి అరుగుతాయి కాబట్టి, వాటికి పన్ను వసూలు చేయాలి. రెండు కాళ్ళకి మీటర్లు పెట్టి, ఎవరు ఎన్ని అడుగులు వేస్తారో వారి దగ్గర నుండి అంత పన్ను వసూలు చేయవచ్చు. వికలాంగులకి ఈ పన్ను నుండి మినహాయింపు ఉంటుంది.

    3. పడక గది పన్ను: బ్రిటన్‌లో బెడ్‌రూమ్‌ ట్యాక్స్‌ విధించింది ప్రభుత్వం. చివరకు ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత వెల్లువెత్తడంతో దాన్ని ఎత్తేసారు. కాని మన దేశంలో ఎన్ని పన్నులు వేసినా, ప్రజల నుండి ఎటువంటి వ్యతిరేకత రాదు కాబట్టి, ఇక్కడ వెయ్యొచ్చు. బెడ్‌రూం ని ఎన్నిసార్లు వాడుకుంటే అంత, ఎంత వాడుకుంటే అంత పన్ను వేసి వసూలు చేయవచ్చు. దానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, అధికారుల్ని నియమిస్తే, వారు ప్రతి ఇంటికి రాత్రి పూట 'రైడింగు' చేసి, నిజంగా పడకగదిని వాడుతున్నారా లేదా అని నిర్ధారించుకుని, పన్ను విధిస్తారు. ఎవరైనా పడక గదిని వాడుతూ, వాడట్లేదని లెక్కలో చూపిస్తే మాత్రం వారికి భారీ జరిమానా విధిస్తారు.

    4. బ్లాగర్లపై పన్ను: ఇక మన విషయానికి వస్తున్నాను. బ్లాగింగు చేయడం ద్వారా మానసిక ఆనందాన్ని, కామెంట్లు విసరడం ద్వారా మరికొంత ఆనందాన్ని, చదవడం ద్వారా కాలక్షేపాన్ని పొందుతున్నారు కాబట్టి, బ్లాగులు రాసే వాళ్ళకి సేవా పన్ను, దాని మీద సర్‌ఛార్జీలు, చదివే వాళ్ళకి, కామెంట్లు చేసే వాళ్ళకి యూజర్‌ ఛార్జీలు విధించబోతున్నారు. అందుకే బ్లాగర్లందరూ కాంగ్రెస్‌ పార్టీకి, చిదంబరానికి రుణపడి ఉండాలి. ఇక మీ అభిప్రాయం చెప్పడమే తరువాయి.