Pages

Saturday, April 24, 2010

టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా "వైష్ణవి గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యార్ధిని" (విజయవంతమయిన ఒక ప్రయోగం)

ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో మా "వైష్ణవి గర్ల్స్ జూనియర్ కాలేజ్" విద్యార్ధిని రమ్యస్మృతి తాడేపల్లిగూడెం పట్టణంలో మొదటి ర్యాంక్ సాధించింది. 470 మార్కులకుగాను 459 మార్కులు సాధించింది. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ విధంగా ర్యాంక్ సాధించినందుకు పలువురు అభినందించారు. కేవలం ర్యాంకుల సాధన మాత్రమే లక్ష్యంగా కాకుండా ప్రతీ విద్యార్ధిని సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే ధ్యేయంగా మా కాలేజ్ ని స్థాపించడం జరిగింది. నేను గత పోస్టులలొ ప్రస్తావించిన విధంగా పిల్లల మీద ఎటువంటి వత్తిడి తీసుకురాకుండా వారు స్వేచ్చగా చదువుకోవడానికి అవసరమయిన పరిస్తితులను కల్పించి, వారి మానసిక వికాసానికి తోడ్పడే విధంగా మాత్రమే ఈ విద్య వుండాలని భావించి, ఈ అంశాన్ని మా కాలేజ్‌లో ప్రాక్టికల్‌గా చేసి చూపించాను. అలాగని క్రమశిక్షణ విషయంలో కూడా ఎక్కడా రాజీ లేని ధోరణితో ముందుకు సాగిపోయాము. ఎవ్వరినీ బట్టీ పట్టడానికి ప్రోత్సహించలేదు. పిల్లలు సంపూర్ణంగా ఒక లెసన్‌ని అర్ధం చేసుకున్నాక మాత్రమే మరొక లెసన్‌లోకి వెళ్ళమని మా లెక్చరర్స్‌కి సూచించాను. దానివల్ల ఉత్తీర్ణతా శాతం ఎక్కువగ వుండడమే కాకుండా 50% మంది విద్యార్ధినులకి A గ్రేడ్ మార్కులు వచ్చాయి. నేను ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే. చదువుకోసం పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దు అని. వారికి చెప్పేలా చెపితే ఖచ్చితంగా బాగా చదువుతారనేది మా కాలేజి ద్వారా రుజువయింది.

ఈ విజయ సాధనలో నాకు తోడుగా వుండి, కాలేజీ బాధ్యతలని మనస్ఫూర్తిగా నిర్వర్తించిన నా సోదరి శ్రీమతి కృష్ణ చైతన్యకి, మా అంకుల్ శ్రీ గమిని సుబ్బారావు గారికి, నేను కాలేజ్ పెడుతున్నాని ప్రకటించినప్పుడు తమ అభినందనలు తెలిపిన బ్లాగ్మితృలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

Tuesday, April 20, 2010

పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదా?

ఈ మధ్యన సుప్రీం కోర్ట్ ఒక సినీ నటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో తీర్పు వెలువరిస్తూ పెళ్ళికి ముందు యువతీ యువకులు కలిసి సహజీవనం చేయడం తప్పు కాదు నేటి సమాజంలో అదొక తప్పని పరిస్తితి అన్నట్లుగా ఒక వ్యాఖ్య చేసింది. పైగా దాన్ని సమర్ధిస్తూ మన పురాణాలలోని కృష్ణుడు, రాధ కలిసి సహజీవనం చేసేవారు అన్నట్లుగా వుదహరించిది. సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సంప్రదాయ వాదులంతా ఇదేమి పోగాలం దాపురించిందని నోరు నొక్కుకుంటే, మన దేశంకూడా "ఎక్కడికో పోతుందంటూ" మరికొంతమంది మురిసిపోయారు.

ప్రపంచంలోని ఎన్నో సమాజాల్లో సెక్స్ అనే విషయాన్ని అత్యంత గోప్యంగా వుంచారు. అది సమాజంచేత దాచిపెట్టబడింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. లైంగికత అనేది మరుగున పెట్టబడినదే గాని నిషేదించబడలేదు. అలా నిషేదించబడినట్లయితే రాయడానికి నేను వుండను, చదవడానికి మీరు వుండరు. అది అందరికీ తెలిసిన విషయమే. పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదు అనే విషయాన్ని సమర్ధించే వాళ్ళు చెప్పే మాటేమిటంటే, జంతువులకి లేని కట్టుబాట్లు, నిషేధాలు మనుషులం మనకెందుకు అని? పైగా మనిషికి సహజసిద్దంగా వుండే ఆకలి, నిద్ర, మైధునం వంటి వాటిని జంతువులు తీర్చుకుంటున్న విధంగానే మనుషులు తీర్చుకుంటే తప్పేమిటి అని. ఇలా అనేవాళ్ళు తమ వాదనకి అనేక వుదాహరణలు చూపిస్తారు. వాళ్ళ మానసిక అపరిపక్వతని బయట పెట్టుకుంటారు.

మానవ సమాజానికి, జంతు సమాజానికి ఎంతో వ్యత్యాసముంది. మానవ నాగరికత ఈనాటిది కాదు. అది ఎన్నో లక్షల సంవత్సరాలుగా పరిణామం చెందుతూ వచ్చింది. ఈ రోజు మనం చూస్తున్న ఈ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఎన్నో ప్రయోగాల తరువాత ఏర్పడ్డాయి. నేను చెప్పేది మూడ నమ్మకాల గురించి కాదు, సమాజ మౌలిక లక్షణల గురించి మాత్రమే. మానవ సమాజం, నాగరికత కొన్ని వేల, లక్షల సంవత్సరాల పాటు అవిచ్చిన్నంగా సాగిపోవాలంటే, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పయనించాలంటే సామాజానికి కొన్ని కట్టుబాట్లు అవసరం అని ఏనాడో మన పెద్దలు గ్రహించారు. అందుకే ఇన్ని రకాల కట్టుబాట్లు మనపై విధించారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని, చదువు నేర్పే గురువుని గౌరవించాలని, మనతో బాటు పుట్టిన వాళ్ళని తోబుట్టువులంటారని, వాళ్ళతో ప్రేమగా మసలుకోవాలని, ఇంకా ఇతర బంధుత్వాలు ఒకరికి ఒకరు ఏమవుతారో, ఎవరెవరి మధ్యన లైంగిక సంబంధాలు ఆమోదయోగ్యమో, ఎవరి మధ్యన అవి నిషిద్దమో ఇటువంటివన్నీ ఎంతో క్లియర్‌గా నిర్వచించారు. ఇది సమాజ రీతి.

ఇక అసలు విషయానికి వస్తే, మనం మానవులం కాబట్టి, జంతువులవలే ప్రవర్తించలేము. అది అందరికీ తెలిసిన విషయమే. మనకు ఆకలేస్తే ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి కావలసిన పదార్ధాలని తినగలమా? పక్కింటి చెట్టు కాయ దొంగతనంగా కోసి చూడండి. ఏమి జరుగుతుందో.. అదే జంతువయితే పోనిలే ఊరుకోవచ్చు. అదే మనిషయితే పట్టుకుని తన్నుతారు. అదే విషయం కామానికి కుడా వర్తిస్తుంది. సహజంగా మనిషికి స్వార్ధం ఎక్కువ. ఏదయినా వస్తువు తనది అనుకున్నప్పుడు ఇక ఎవ్వరూ ఆ వస్తువుని ఆశపడకూడాదనుకుంటాడు. నా ఇల్లు, నా టి.వి., నా బట్టలు ఇలా సాగిపోతుంది ఆలోచన. ఇదే సూత్రం భార్య భర్తలకి కూడా వర్తిస్తుంది. తన భార్య వంక పరాయి మగాడు చూడకూడదనుకుంటాడు భర్త. అలాగే తన భర్త పరాయి స్త్రీ వంక కన్నెత్తి చూసినా, పన్నెత్తి పలకరించినా పెద్ద రాద్ధాంతం చేసేస్తుంది భార్య. ఒక వస్తువుని కొంటే దాని మీద సర్వ హక్కులూ మీకు సొంతమవుతాయి. దానికి ఆధారంగా షాప్ వారిచ్చిన బిల్లు మీ దగ్గర వుంటుంది. ఒక తల్లికి పుట్టడం వల్ల ఆ తల్లికి బిడ్డపై సర్వ హక్కులూ సంక్రమిస్తాయి. కాని ఒక యువతికి, ఒక యువకుడికి ఒకరిపై ఒకరికి హక్కులు ఎలా సంక్రమిస్తాయి? దానికేదయినా పద్దతి వుండాలి కదా? అందుకే వివాహం అనే ఒక పద్దతి ప్రవేశపెట్టబడింది. ఎవరికి ఎవరు సొంతమవుతారనే విషయాన్ని సమాజంలో వుండే అందరికీ తెలియచెప్పడానికి వుద్దేశించినదే వివాహం. దాదాపు ప్రపంచంలోని అన్ని సమాజాల్లో, నాగరికతల్లో వివాహం అనే వ్యవస్త ఆమోదం పొందింది.

బాధ్యతల పరంగా కూడా వివాహం ఎంతో విలువయినది. జంతు సమాజంలో తల్లికి మాత్రమే బాధ్యత వుంటుంది. తనకు పుట్టిన పిల్లల్ని సాకడంలో పూర్తి బాధ్యత తల్లే వహిస్తుంది. కొన్ని రకాల జంతువుల్లో ఆడవి తమతో జత కట్టిన మగ వాతికి కూడా కొంత బాధ్యతని పంచుతాయి. అంటే ఇక్కడ కూడా జతకట్టిన ఆడ, మగ వాటి మధ్యే పిల్లల పెంపకం బాధ్యతని తీసుకుంటున్నాయి. ఇదే బాధ్యతల వర్తింపు మానవ సమాజంలో అత్యంత క్లిష్టంగా వుంటుంది. ఒక బిడ్డని పెంచాలంటే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధికపరంగా గాని, ఆరోగ్యపరంగా గాని. ఇటువంటి పరిస్తితులలో ఒక యువతి తనకి పెళ్ళి కాకుండానే బిడ్డకి జన్మనిస్తే, పురుషుడు మనస్ఫూర్తిగా ఆ బిడ్డ బాధ్యతని తీసుకుంటాడా? ఆ అమ్మాయి అటువంటి పరిస్తితిలో వుండగా, ఖచ్చితంగా మరొక అమ్మాయితో సహజీవనం మొదలుపెడతాడు. ఎందుకంటే అది అతని దృష్టిలో తప్పు కాదు కాబట్టి. అదేమని అడగడానికి ఈ అమ్మాయికి కూడా హక్కు వుండదు. పెళ్ళి కాకుండానే తల్లయిన వాళ్ళు పాశ్చ్యాత్య దేశాల్లో కోకొల్లలుగా వున్నారు. వారి సమాజంలో అది తప్పు కాకపోయినా తల్లి దండ్రుల ప్రేమని పూర్తిగా పొందలేని పిల్లలు సమాజానికి ఇబ్బందులు తెచ్చిపెట్టడం, సంఘ విద్రోహ శక్తులుగా మారడం మనం చూస్తూనే ఉన్నాము. పెళ్ళి కాకుండానే పిల్లలు పుడితే అన్ని రకాలయిన ఇబ్బందుల్ని సమాజం ఎదుర్కోవలసి వస్తుంది. ఇవన్నీ సామాజిక సమస్యలు.

ఆరోగ్యపరంగా చూసినా ఎక్కువమందితో సంపర్కం ఆడవాళ్ళకయినా, మగవాళ్ళకయినా ఎన్నో చిక్కుల్ని, రోగాల్నీ తెచ్చిపెడుతుంది. మామూలుగా పెళ్ళి చేసుకుని ఇప్పుడే పిల్లలు వద్దనుకుని, అబార్షన్ చేయించున్న జంటల్లో చాలా మందికి తరువాత చాలా సమస్యలు రావడం, నిజంగా పిల్లలు కావాలనుకున్నపుడు గర్భధారణలో ఇబ్బందులు ఎదరవడం వంటివి నాకు తెలిసిన ఎంతోమంది తర్వాత బాధ పడడం గమనించాను. ఇదే కాకుండా ఎయిడ్స్ వంటి రోగాలు వుండనే వున్నాయి. అందుకే సెక్స్ విషయంలో ఈ ప్రపంచం చాలా ప్రయోగాలు చేసిందని, అందులోనూ భారతదేశం సామాజికపరంగా ఎన్నో ఒడిదుడుకుల్నిఎదుర్కొన్న తర్వాత మాత్రమే నేడు మనం వున్న సామాజిక ఆచార వ్యవహారాలు రూపుదిద్దుకున్నాయని మనం మర్చిపోకూడదు. ఒకే మనిషితో పెళ్ళి అనే బంధంతో ముడిపెట్టుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని, మనసులో భద్రతా భావం చోటుచేసుకుంటుందని మానసిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. ఎప్పుడేమి జరుగుతుందో మనకే తెలియనప్పుడు, ఎవరికెవరు ఏమవుతారో ఎవరూ ఊహించలేనపుడు సమాజం మానవ సమాజంగా వుంటుందని ఎవరు మాత్రం ఎలా ఆనందంగా జీవించగలరు?

కొత్తొక వింత, పాతొక రోత అనుకుని తమకు ఎదురయిన ప్రతి విషయాన్ని, ప్రతీ ఆచారాన్నీ వెంటనే ఖండించే దురలవాటు వున్నవారు, పెద్ద పదవుల్లో, హోదాలో వున్నవారు తమ చిన్న బుద్దిని చాటుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నవ్వులపాలవుతారు. సమాజ రీతికి ఎదురీదితే తరువాత సమస్యలు ఎదుర్కొని, ఇబ్బందులు పాలవుతారు. నోటికొచ్చినట్టు ఏదేదో వాగకుండా, ఎదురయ్యే ప్రతీ దాన్నీ తలా తోకా లేకుండా ఖండించకుండా, సంయమనంతో ఆలోచిస్తే ప్రతీ ఆచారానికి వున్న గొప్పదనం బోధపడుతుంది.

యువతీ యువకులు కూడా మానవ జీవితానికి వున్న గొప్పదనాన్ని గ్రహించి, కేవలం ఆకలి, నిద్ర, మైధునాలు మాత్రమే మానవ అవసరాలు కాదని, అవి తీరడం మాత్రమే ముఖ్యం కాదని, మానవ జీవితం యొక్క అర్ధం, పరమార్ధం మరెంతో వుందని, ఎవరి విలువల్ని వారు కాపాడుకుంటు, మనం వుండే సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు గాని చెడు చేస్తూ తోటి వారిని ఇబ్బందుల పాలు చెయ్యడం తగదని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.