Pages

Thursday, March 22, 2012

తెలుగు వారికి మాత్రమే గల ప్రత్యేకతలు

    తెలుగు వారి అచ్చ తెనుగు పండుగ 'ఉగాది' వచ్చింది. నందనానంద కరంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా మన తెలుగు వారికి మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకతలు, అవి చాలా ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు మీతో పంచుకుందామని...

అవధానం: సాహితీ ప్రక్రియల్లో విశిష్టమైనది అవధాన ప్రక్రియ. అష్టావధానం మొదలుకొని, సహస్రావధానం వరకు పృచ్ఛకులు అడిగిన అన్ని రకాల సాహితీ ప్రశ్నలను, గుర్తుంచుకొని, ఏక కాలంలో, ఆశువుగా అవధాని ఎవరి సమాధానం వారికి చెప్పడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అవధాని యొక్క మేధస్సు, ధారణా శక్తి, సాహిత్య పటిమ మీద అవధాన ప్రదర్శన, విజయం ఆధారపడి ఉంటాయి. ఇంతటి క్లిష్టతరమైన ప్రక్రియ మరే భాషా సాహిత్యంలోను కనిపించదు.

ఆవకాయ: ఆవకాయ పేరు చెప్పగానే నోరూరని తెలగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎవరో కవి చెప్పినట్లు, చెట్టు మీద కాయని, సముద్రంలో ఉప్పుని కలిపి చేసే ఈ పచ్చడి, దాని రుచి తెలుగు వారికి మాత్రమే సొంతం. పెళ్ళిజరిగినా, పేరంటం జరిగినా ఆవకాయ ఘుమఘుమలు లేకుండా నిండుదనమే ఉండదు కదండి.

బుర్ర కథ: గ్రామీణ ప్రాంతాల్లో బుర్రకథని మించిన కాలక్షేపం మరోటి ఉండదు. గ్రామీణుల జీవనం, జానపదుల సాహిత్యం, వారి కథలు, పురాణాలు ఇలా ఒకటేమిటి? తందాన తాన అంటూ ముగ్గురు కలిసి ప్రదర్శిస్తూ, పాటలు పాడుతూ, పద్యాలు ఆలపిస్తూ  బుర్రకథ చెబుతుంటే, చెవి ఒగ్గని తెలుగు వాడు ఉంటాడా?


నాటకాల్లో పద్యాలు: తెలుగు వారి  నాటకాల్లో ప్రత్యేకత పద్యాలు. 'బావా ఎప్పుడు వచ్చితీవు' అని రాయబారం పద్యం ఆలపించినా, 'చెలియో చెల్లకో' అంటూ హరిశ్చంద్ర కాటిసీను పద్యం ఆలపించినా, తెలుగు వారు మైమరచిపోతారు. ఒకసారి ఒకటో కృష్ణుడు పద్యం ఆలపించి, దాని చివర ఆ..ఆ......ఆ........ఆ....... అంటూ రాగం ఆలపించడం మొదలు పెడితే ఇక నాటకం పూర్తయే సరికి తెల్లారిపోవలసిందే. తెలుగు అజంత భాష అవ్వడం వలన పద్యం చివర రాగం తీసినా మధురంగానే ఉంటుంది.

శ్రీ వెంకటేశ్వరుడు / అన్నమయ్య కీర్తనలు : తెలుగు వారికే ప్రత్యేకమైన ఇష్ట దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. అందరు దేవతలకి అన్ని చోట్ల దేవాలయాలు ఉండొచ్చు గాని, సాక్షాత్తు విష్ణువు వేంకటేశ్వరునిగా కొలువై వున్న తిరుమల గిరి తెలుగు వారి వరాల కొండ.  'ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే' అంటూ ఆ స్వామిని నోరారా కీర్తించిన అన్నమయ్య కీర్తనలు మనకు మాత్రమే సొంతం. 'చందమామ రావే, జాబిల్లి రావే' అంటూ అచ్చ తెలుగు సొగసులద్దిన అన్నమయ్య మన తెలుగు వాడు కావడం మనం చేసుకున్న అదృష్టం కాక మరేమిటి?

వేమన పద్యాలు: చిన్న చిన్న పద్యాలలో కొండంత భావాన్ని పొదిగిన వేమన పద్యాలు జీవిత సారాన్ని విశదీకరిస్తాయి. వేయి మాటల్లో చెప్పలేని విషయాన్ని నాలుగు వరుసల్లో చెప్పగలగడం, అదీ అతి చిన్న తెలుగు వాక్యాల్లో ఇమిడిపోవడం తెలుగు భాష గొప్పదనమైతే, అలా ఇమడ్చగలగడం వేమనకే సాధ్యం. తెలుగు వారి హృదయాలలో వేమన స్థానం ఎప్పటికీ పదిలం.

గోరుముద్ద, ఉగ్గుపాలు: మీరు ఎంత గొప్పగా ఎన్ని భాషలు మాట్లాడగలిగినా, గోరుముద్దని, ఉగ్గుపాలుని ఏ భాషలోకైనా అనువదించి చూడండి. తెల్ల ముఖం వేసారే? ఎందుకంటే ఈ పదాలకి సమానమైన పదాలు వేరే భాషల్లో దొరకవు. చిన్న పిల్లలకి పెట్టే గోరు ముద్దలు, ఉగ్గుపాలు తల్లి ప్రేమకు చిరునామాలు. తెలుగు తల్లులు ప్రేమకు ప్రతిరూపాలు.

వావి వరుసలు: తెలుగు వారి వావి వరుసలకి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనకు ఉన్నన్ని వరుసలు, బాంధవ్యాలు మరే భాష వారికి లేవంటే అతిశయోక్తి కాదేమో? అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, వదిన, మరదలు, బావ, బావ మరిది, తోడికోడలు, తోడల్లుడు అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ ఒక్కొక్క వరుసతో పిలుస్తూ ఉంటే ఉండే ఆనందమే వేరు. ఇప్పుడంటే కాన్వెంట్‌ చదువులు సోకయిపోయి, రిక్షా వాడి దగ్గర్నుండి, పాలబ్బాయి దాకా కనబడ్డ ప్రతి మగాడిని ఆంకుల్‌, ఆడాళ్ళని ఆంటీ అని పిలుస్తున్నారు, ఈ కాలం పిల్లలు. వారికి తెలుగు వారి వావి వరుసల్లో ఉండే మధురమైన ఆనందాన్ని తెలియజేయాల్సిన అవసరం అందరి మీదా ఉంది.

చీర / పంచెకట్టు: భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లండి, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడికైనా వెళ్ళండి. అచ్చ తెలుగు వాళ్ళని ఇట్టే పసిగట్టవచ్చు. తెలుగు వారి పంచెకట్టు, ఆడవారి చీరకట్టు జగత్‌ ప్రసిద్ధమైనది. పంచె కట్టుకుని, నుదుటన బొట్టు పెట్టుకుని, భుజాన ఉత్తీరీయం వేసుకుని తెలుగు పెద్దాయన నడిచి వెళుతుంటే, అప్రయత్నంగా చేతులు జోడించ బుద్దేస్తుంది. అలాగే చీర కట్టులో మగువ అందాన్ని వర్ణించడం మహాకవులకయినా సాధ్యం కాదేమో కదా..

తెలుగు భాష: గొప్ప చెప్పుకోకూడదు కానీ, అసలు తెలుగు భాషే తీయనైనది, కమ్మనైనది. అందుకే రాయల వారు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు విశిష్టతను చెప్పకనే చెప్పారు. గోదారి గలగలలు, కృష్ణమ్మ ఉరవళ్ళు కలగలిపి, కొంచెం తేనె, కొంచెం పంచదార కలిపితే అది తెలుగు భాష అవుతుందని ఒక కవి హృదయం. అది నిజమే కదా. 'నల్లని వాడు, పద్మ నయనమ్ముల వాడు, కృపా రసంబు పై జల్లెడు వాడు' అని పోతన అచ్చ తెలుగులో కృష్ణుడి వర్ణిస్తుంటే ఎంతటి అపురూపం... అసలు పోతన వల్ల తెలుగులో అన్ని మంచి పద్యాలు వచ్చాయా, తెలుగు సొగసు వల్ల పోతన అన్ని మంచి పద్యాలు రాయగలిగాడా అంటే... సమాధానం లేని ప్రశ్నే. 'విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి, మా ప్రాణముల్‌ తీతువానని ప్రశ్నించె' అని కరుణ రసాన్ని పాపయ్య శాస్త్రి ఒలికించినా, గోదారి అలలపై నాయుడు బావపై కన్నేసిన ఎంకి పాడిన పాటలు నండూరి వారి కలం నుంచి జాలువారినా, 'వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌ జగన్నాధ రథ చక్రాలొస్తున్నాయ్‌' అని శ్రీశ్రీ కలం ఘర్జించినా, అన్నీ తెలుగు వారి సంపదలుగానే మిగిలిపోయాయి. అంతటి అపురూప సంపదను జాగ్రత్తగా భావి తరాలకి అందించే భారాన్ని మన భుజాల మీదే పెట్టుకునే అపురూప అదృష్టానికి నోచుకునే తెలుగువారిగా పుట్టిన మనం ఎంతటి పుణ్యాత్ములమో కదా...

అందుకే... మరలా తెలుగు వారందరికీ, హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు...

Saturday, March 10, 2012

జ్యోతిష్యం గురించి కొన్ని వాస్తవాలు - అపోహలు (పార్ట్- 1)

       జ్యోతిశ్శాస్త్రం గురించి ఎన్నో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న వాదోపవాదాలు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్నాయి. వేదిక మారింది. తెలుగు బ్లాగులే ఆ వాదాలకి వేదిక. అత్యంత ప్రాచీనమైన భారతీయ శాస్త్ర సాంకేతిక విషయాలకి పట్టిన గతే ఇపుడు జ్యోతిశ్శాస్త్రానికి కూడా పట్టబోతోందనేది సుస్పష్టం. దీనికి కారణం ఈ శాస్త్రంపై అనేక మందికి ఉన్న అపోహలు మాత్రమే.

    జ్యోతిషం నిజంగా శాస్త్ర బద్దమైనదేనా, లేదా అది కేవలం వట్టి కల్పన మాత్రమేనా, మనుషుల బలహీనతలతో ఆడుకోవడానికి కొంత మంది మేధావులు తయారు చేసిన వట్టి అబద్దాలతో కూడిన పుస్తకం మాత్రమేనా? ఇవన్నీ పరిశీలించే ముందు మనకు మనం ఒక అభిప్రాయానికి రావడం మంచిది. ఎవరో చెప్పింది విని, రాసింది చదివి, మనకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచకుంటే అది అన్ని వేళలా సరైనది కాకపోవచ్చు, మనం తప్పు దారి పట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ముందు మన బుద్దికి పదును పెడదాం... అంటే తార్కికంగా ఆలోచిద్దాం. దేవుడు మనకు బుర్ర ఇచ్చింది అందుకే కదా...

    ఈ విశాల విశ్వంలో ప్రతీ అణువు మరో అణువుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఇది క్వాంటం మెకానిక్స్‌లో మొదటి సూత్రం. అతి చిన్న పరమాణువు మొదలుకొని, నక్షత్ర మండలాల వరకు ఉన్న కోటాను కోట్ల పరమాణువులు నిత్యం అదృశ్యంగా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటూ ఉంటాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఆ అణువులు అలా పరస్పర ఆధారితాలు కాకపోతే మనం ఇప్పుడు చూస్తున్న విశ్వమే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేదే కాదు. అంతెందుకు ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు. మన శరీరంలోని అతి చిన్న కణం, మరో కణం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి కొన్ని కోట్ల కణాలు కలిసి, భూమిచేత ఆకర్షించబడి ఉన్నాయి. ఈ భూమి తన కన్నా పెద్దదైన నక్షత్రం - సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరలా ఆ సూర్యుడు తన గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు వంటి వాటిటో కలిసి పాలపుంత (మిల్కీవే గెలాక్సి) చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పాలపుంత కూడా గుర్తు తెలియని మరో అద్భుత శక్తి చుట్టూ తిరుగుతోంది అంటారు. అంటే, ఈ విశ్వంలోని ప్రతి అణువు మరో అణువు చుట్టూ తిరుగుతుంది. ఆఖరికి బ్రహ్మాండం కూడా. ఆ తిరగడం కూడా ఎంతో ఖచ్చితత్వంతో.... ఎంత ఖచ్చితత్వమంటే పరమాణు గడియారంలో కొలవగలిగినంత... మిల్లీ సెకనులో అరసెకను కూడా తేడా రానంత... ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. విశ్వంలో అణువులన్నీ పరస్పర ఆధారితాలు మరియు అత్యంత ఖచ్చితమైన విశ్వ నియమాల ప్రకారం అవి నడుచుకుంటున్నాయి.

    ఇక జ్యోతిష శాస్త్రం విషయానికి వద్దాం. విశ్వంలో ఉండే ప్రతి గ్రహం, నక్షత్రం అంత నిర్దుష్టంగా ప్రవర్తిస్తున్నపుడు భూమి మీద ఉన్న మానవ జీవితం మాత్రం ఎందుకింత గందరగోళంగా ఉంది? దీనిపై ప్రాచీన ప్రపంచంలో ఎన్నో ఆలోచనలు, పరిశీలనలు జరిగాయి. ఒకసారి గ్రహాలు, నక్షత్రాల నడవడికను, దానిలోని నిర్ధుష్టాన్ని కనిపెట్టిన తరువాత, మానవ జీవిత విధానం కూడా వాటికి అనుగుణంగా ఉందేమో అన్న భావన ప్రాచీన సమాజంలో తలెత్తి ఉంటుంది. ఆ విదంగా గ్రహాలకు, నక్షత్రాలకు, మానవ జీవితానికి ఉండే సంబంధాన్ని ఆపాదిస్తూ ప్రతిపాదించబడిందే జ్యోతిశ్శాస్త్రం.

    ఈ ప్రకృతిలో... ఆ మాటకొస్తే ఈ విశ్వంలో ఉండే ప్రతీ అణువు ఒక నిర్ధిష్ట విధానంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అది మనకు ఎంత గందరగోళంగా కనిపించినా సరే... చర్మంపై ఉండే కణాలను భూతద్దంతో పరిశీలిస్తే, అవి ఒక రకంగా ఉన్నట్టు అనిపించవు. గందరగోళంగా, గజిబిజిగా ఉంటాయి. కాని దూరం నుంచి చూస్తే మాత్రం కణాలన్నీ కలిసి ఒక చక్కటి ఆకారంగా... మనిషిగా కనిపిస్తాయి. ఆపిల్‌ కంపెనీ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ చెప్పిన సూత్రం ఇదే. కనెక్టింగ్‌ డాట్స్‌... జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు అర్ధం పర్థం లేనివిగా కనిపిస్తాయి. కానీ వాటన్నిటినీ కలిపితే వాటిలో అర్థం ఉంటుంది.... అవన్నీ కలిస్తే... అదే జీవితం. ప్రతి మనిషి జీవితం వ్యక్తిపరంగా చూస్తే, ఎటువంటి అర్థం ఉండక పోవచ్చు. కాని, అందరినీ కలిపి, ఒక పద్దతి ప్రకారం వర్గీకరిస్తే, జీవితం యొక్క మౌలికాంశాల్లో ఏకరూపత మనకు అర్థం అవుతుంది. మనుషుల్ని ప్రవర్తనా పరంగా, ఆలోచనల పరంగా, జీవన విధాన పరంగా విడదీసి చూస్తుంది జ్యోతిశ్శాస్త్రం.

మానవులపై గ్రహాల ప్రభావం వుంటుందా?: 
జ్యోతిషాన్ని విమర్శించే వాళ్ళు ముందుగా చూపే కారణం... ఎక్కడో ఆకాశంలో ఉండే గ్రహాలు, అంత కన్నా దూరంగా ఉండే నక్షత్రాలు మానవ జీవితంపై, వారి ప్రవర్తనపై ఎటువంటి కారణాన్ని చూపలేవు అనేది. ఎక్కడో ఉండే కుజ గ్రహం (మార్స్‌ లేదా అంగారకుడు) భూమిపై ఒక సూదిని కూడా కదిలించలేడు, యుద్దాలకి, ప్రకృతి వైపరీత్యాలకి కారణం అవుతాడా.. అంటూ ఎగతాళి చేస్తారు. వీళ్ళందరికీ గురువయిన న్యూటన్‌ కనిపెట్టిన గ్రహబలం సిద్ధాంతం ఆధారంగా ఒక గ్రహం మనిషిపై చూపించే ప్రభావం కన్నా, ఇంట్లో వెలిగే బల్బు మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని లెక్కలు కట్టి మరీ వాదిస్తారు. కాని కఠోర వాస్తవం మరోలా ఉంది. దాన్ని మనం నమ్మక తప్పదు.

    జ్యోతిషంలో ముఖ్యమైన గ్రహం, మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది.. చంద్రుడు. చంద్రుడి ప్రభావం మనిషి మనసుపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే చంద్రుడు మనసుకి అధిపతి. ఈ ప్రతిపాదనకి మూల కారణం కూడా వివరిస్తాను. భూమిపై సముద్రంలో సంభవించే ఆటు పోట్లకి కారణం చంద్రుడే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అమావస్య, పౌర్ణమి రోజుల్లో ... చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు సముద్రంలో కొన్ని వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నీటి బుగ్గ పైకి లేస్తుంది. అది పైకి బోర్లించిన గిన్నెలా సముద్ర జలాల్లో కనిపిస్తుంది. చంద్ర భ్రమణంతో పాటుగా ఆ నీటిబుగ్గ సముద్రంపై తేలియాడుతూ ప్రయాణిస్తుంది. దాని వల్లనే పోటు వచ్చి, సముద్ర జలాలు ఉప్పొంగుతాయి. దీని వల్ల చంద్రుడి ప్రభావం భూమిపై ఉందని నిర్ధారణ అయింది. మనిషి శరీరంలో కూడా నూటికి 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. మనిషి ప్రవర్తనను నియంత్రించే మెదడులో అయితే 96 శాతం నీరు ఉంటుంది. అది చంద్రుడిచే ఆకర్షించబడుతుంది. అందుకే అమావస్య, పౌర్ణమి రోజుల్లో మానసిక వ్యాధిగ్రస్తులకి పిచ్చి ఎక్కువవుతుంది. చంద్రుడి వల్ల ప్రేరేపించబడతారు కాబట్టి వారిని ఇంగ్లీష్‌లో లూనాటిక్స్‌ (లూనార్‌ అంటే చంద్రుడు) అని వ్యవహరిస్తారు. అంటే ఇక్కడ మానవ మెదడుపై చంద్రుడి ప్రభావం నిజమని తేలింది.

    ఇక సూర్యుడు... భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటికి, వృక్ష కోటికి ఏకైక ఆధార భూతుడు. ఆయన నుంచి వచ్చిన శక్తి రకరకాల రూపాల్లోకి మారి, భూమిలోకి, భూమి నుండి మొక్కల్లోకి, మొక్కల నుండి మనకి ప్రవహిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే రకరకాల రంగులు, తరంగ దైర్ఘా ్యలు (ఫ్రీక్వెన్సీలు) మొక్కలు, జంతువుల్లో ఎన్నో మార్పుల్ని కలుగజేస్తాయి. ప్రాణులకి ఎంతో అవసరమైన 'డి' విటమిన్‌ మొదలుకొని, ప్రాణ హానిని కలుగజేసే అతి నీలలోహిత కిరణాలు (ఆల్ట్రా వయోలెట్‌ రేస్‌) కూడా సూర్యుడిలోనే ఉద్భవిస్తాయి. సూర్యుడి తాపం 5 డిగ్రీలు పెరిగితే చాలు... భూమి మీద జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. సూర్యుడు ప్రాణి కోటికి అత్యంత ముఖ్యమైన ఆధారం కాబట్టే సూర్యుడిని మన పూర్వీకులు 'సూర్య నారాయణుడు' అని నారాయణుడితో పోల్చారు. సూర్యుడికి ఉన్న విశిష్టతను, ప్రాచీన నాగరికతలన్నీ సూర్యుడినే ఎందుకు దైవంగా కొలిచాయన్న విషయాన్ని గురించి అత్యంత రహస్యమైన, విలువైన విషయాల్ని తరువాతి పోస్ట్‌లో వివరిస్తాను. దీన్ని బట్టి మానవ జీవితంపై సూర్యుడి ప్రభావం ఉందని తేలింది.

    ఇక మిగిలింది... ఇతర గ్రహాలు. బుధుడు మొదలుకొని, వరుణుడు (యురేనస్‌) వరకు గ్రహాలన్నీ సౌర కుటుంబంలో భాగమే. ముందు చెప్పుకున్నట్లుగా, గ్రహాలన్నీ పరస్పర ఆధారితాలు. సౌర కుటుంబంలో ఉన్న ఏ ఒక్క గ్రహాన్ని తొలగించినా సౌర కుటుంబం మొత్తం కుప్పకూలిపోతుంది. సూర్యుడు తన అఖండమైన శక్తితో ఏ విధంగా తనకు దగ్గరగా ఉన్న బుధ గ్రహాన్ని ఆకర్షించి ఉంచాడో, అంతే శక్తి వంతంగా తనకు అత్యంత సుదూరంలోని తోకచుక్కల్ని కూడా ఆకర్షించి, తన చుట్టూ పరిభ్రమించేలా చేసుకుంటున్నాడు. అత్యంత సాంద్రత కలిగిన గురు గ్రహం, నీటి కన్నా తక్కువ సాంద్రత కలిగిన శని గ్రహం కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అదే విధంగా ప్రతి గ్రహం ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తూ ఉంటుంది. ఆయా గ్రహాల్లో ఉండే మూలకాల్ని బట్టి, అది విడుదల చేసే ఫ్రీక్వెన్సీ ఆధారపడి ఉంటుంది. సహజంగానే ఆ ఫ్రీక్వెన్సీ సౌర కుటుంబ మంతా వ్యాపిస్తూ ఉంటుంది.

    మానవ శరీరం కూడా ఒక యంత్రమే. ఇంకా మాట్లాడితే... ఈ విశ్వంలో ఒక భాగమే. విశ్వంలోని ప్రతి శక్తి, ఈ చిన్ని యంత్రంపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. మానవ శరీరంలో ఎన్నో మూలకాలున్నాయి. అవి అత్యంత సూక్ష్మమైన మోతాదుల్లో ఉన్నాయి. మానవ ప్రవర్తనపై ఈ మూలకాలన్నీ ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఒక్కొక్క మూలకం పెరిగినా లేదా తగ్గినా, అలా జరిగిన మనిషి భావోద్వేగాల్లో, ప్రవర్తనలో, ఆరోగ్యంలో ఎంతో తేడా రావడం మనం గమనించవచ్చు. ఆయా మూలకాలు, ఆయా గ్రహాల ఫ్రీక్వెన్సీ బట్టి ప్రభావితం అవుతాయి. దాన్ని బట్టే ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం లేదా పతనమవ్వడం సంభవిస్తాయి. మనిషి ఆలోచనల్లో లేదా ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. మెదడులో ఒక చిన్న కణంలో సంభవించే మార్పు చాలు. కోపం రావడానికి గాని, ప్రేమ రావడానికి గాని. చంద్రుడు మన చేతిలో ఉన్న సీసాలో నీటిని ఏ విధంగాను ప్రబావితం చేయలేకపోవచ్చు. కాని, మెదడులో చెప్పుకోదగ్గ మార్పు తీసుకురాగలడు. అదే విధంగా కుజుడు భూమి మీది గుండు సూదిని కదల్చలేకపోవచ్చు. కాని, అదే కుజుడు భూగర్భంలో ఉన్న అపారమైన ఇనుప ఖనిజ ద్రవాన్ని (లావా) ఖచ్చితంగా ప్రభావితం చేసి, భూకంపాలను సృష్టించగలడు. ఇవన్నీ గ్రహ ప్రభావితాలే. ఇదే సూత్రం నక్షత్రాలకి కూడా వర్తిస్తుంది. ఇటువంటి సందర్భాలలో మనిషికి తెలిసిన భూమి మీది భౌతిక సూత్రాలు ఎందుకూ పనిచేయవు. అసలు గురుత్వాకర్షణ శక్తిని లెక్కగట్టడమే చాలా కష్టం. మనకి తెలిసిన సైన్స్‌ ప్రకారం కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఇతంత బ్రహ్మాండమైన గ్రహాలని, నక్షత్రాలని, తోకచుక్కల్ని ఒక చోట కట్టిపడేసి, ఒకదాని చుట్టూ ఒకటి తిరిగేలా చేయడం, పైగా ఒక్కొక్క ఖగోళ వస్తువుకి మధ్యలో కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ అవన్నీ ఒకదానికొకటి ఆకర్షించబడి ఉంటాయి. అవన్నీ అలా బంధించబడి ఉండాలంటే కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రం ఉంటే సరిపోదు. మధ్యలో ఇంకో పదార్థం ఉండి ఉండాలి. మనకి తెలియని ఆ పదార్థానికే కృష్ణద్రవ్యం (డార్క్‌ మేటర్‌) అని పేరుపెట్టారు మన ఖగోళ శాస్త్రజ్ఞులు. మనకు తెలిసిన ద్రవ్యం... భౌతిక పరమైనది ఈ విశ్వంలో 10 శాతం మాత్రమే. తెలియని ద్రవ్యం 90 శాతం ఉండొచ్చని అంచనా. ఆ డార్క్‌ మేటర్‌ విశ్వంలోని అన్ని శక్తుల్నీ ఎలా ప్రభావితం చేస్తుందే మన ఊహలకి కూడా అందదు. ఇలా గ్రహాలకి, మానవ జీవితానికి ఉన్న సంబంధాన్ని, మనిషి జీవితం కూడా కొన్ని ప్రకృతి సూత్రాలకి అనుగుణంగా నడుచుకుంటుందనే భావనని నిరూపించే ప్రయత్నమే జ్యోతిష శాస్త్రం. (ఇంకా వుంది)

Thursday, March 1, 2012

భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పతనానికి కారణాలు, నివారణలు....

      ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రాచీన భారతదేశం సాంకేతికంగా, ఆర్థికంగా అత్యంత బలమైన దేశం. సహజంగా, ఇప్పుడు మనం అమెరికా పరుగులు తీస్తున్నట్టుగా, అప్పటి ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ భారతదేశం వెళ్ళాలని ఉవ్విళ్ళూరేవారు. అలా వ్యాపారం నిమిత్తమం, విజ్ఞానం నిమిత్తం ప్రపంచం నలుమూలల నుండి భారతదేశానికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరగసాగింది. మంగోలాయిడ్లు, నీగ్రిటోలు, సుమేరియన్లు, పర్షియన్లు, అరబ్బులు ఇలా అనేక రకాల జాతుల ప్రజలు భారతదేశంలోకి వరదలా ప్రవహించారు. అలా బయటి వ్యక్తుల ప్రమేయం అధికమయ్యే సరికి ఇక్కడి ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం చోటు చేసుకుంది. కొత్త భాషలు, మతాలు, సంస్కృతులు ప్రవేశించే కొద్దీ సమాజంలో ఎన్నో సర్దుబాట్లు అవసరం అవుతాయి. వారి అలవాట్లు, వేషభాషలు ఇక్కడి వారికి అలవాటు పడడమో లేదా ఇక్కడి వారి సంస్కృతినే కొద్ది పాటి మార్పులతో వచ్చిన వారు అనుసరించడమో జరుగుతుంది. దీనినే సమాజ శాస్త్రం (సోషియాలజీ) లో అసిమిలేషన్‌ (తెలుగులో ??) అంటారు. అలా కొద్ది కాలం గడిచేప్పటికి సమాజంలో ఎన్నో చీలికలు కనిపిస్తాయి. పెద్ద కుటుంబాలు, ప్రాంతాలు, రంగులు, భాషలు ఇలా ఎన్ని రకాలుగా విడిపోవచ్చో అన్ని రకాలుగా సమాజం విడిపోవడం మొదలవుతుంది. ఇప్పటి వరకు అనుభవించిన సాంకేతిక పరిజ్ఞానం నిర్లక్ష్యం చేయబడుతుంది. సమాజంలో అలజడి రేగుతుంది. రాజ్యాలు కూలిపోతాయి. దేశమంతా చిన్న చిన్న ముక్కలవుతుంది. ఇక అంతటితో మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోతారు. ఈ విధమైన అలజడులు భారతదేశ చరిత్రలో ఎన్నో పర్యాయాలు సంభవించాయి. వేదకాలం పూర్తయిన తరువాత ఒకసారి, మరలా రాముడు రాజ్యం చేసిన తరువాత మరోసారి, మహాభారత యుద్ధం జరిగిన తరువాత మరోసారి సమాజం పూర్తిగా కల్లోలమయింది. వీటినే మనం యుగాలు అంటున్నాము. పాశ్చాత్య చరిత్రకి అందినంత వరకు భారతదేశంలో అటువంటి స్థితి మౌర్య సామ్రాజ్య స్థాపన వరకు ఉంది. అశోకుడు చిన్న చిన్న రాజ్యాల్ని జయించి, విశాల భారత సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాని అశోకుడి మరణం తరువాత మరలా సామ్రాజ్యం విచ్చిన్నమయింది. భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాల మధ్య మత పరమైన విబేధాలు రాజుకున్నాయి. శైవ, వైష్ణవ, శాక్తేయ తదితర మతాల మధ్య విద్వేషాలతో భారతదేశం అనేక కష్టాలలో పడింది. అటువంటి సమయంలో భారతదేశాన్ని ఆదుకొన్నవారు శంకర భగవత్పాదులు. ఆయన ఆసేతు హిమాచలం పర్యటించి, తన జ్ఞానంతో అన్ని మతాల సారం ఒకటే అని ప్రకటించి, దేశం నలుమూలలా శక్తి పీఠాలు స్థాపించి, అనేక చిన్న చిన్న మతాల్ని విలీనం చేసి, భారతదేశానికి ఆధ్యాత్మికంగా ఒక్కటే అనే రూపుని తీసుకువచ్చారు. మరలా దేశం అభివృద్ధి పొందడం మొదలయింది.

    కాని ఆయన ప్రయత్నం మరలా వృధా అయింది. ఈ సారి ముస్లిం దురాక్రమణదారుల చేతిలో భారతదేశం నష్టపోయింది. 13వ శతాబ్ది మొదలుకొని జరిగిన దండయాత్రల్లో దేశానికి ఆర్థిక నష్టంతో పాటు, సాంకేతిక, ఆధ్యాత్మిక నష్టం కూడా జరిగింది. వారి చేతుల్లో అనేక విలువైన దేవాలయాలు కొల్లగొట్టబడ్డాయి, అరుదైన శిల్ప కళ ధ్వంసం చేయబడింది. కొన్ని వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన విలువైన గ్రంధాలు, పరిజ్ఞానం మంటల్లో కాలి బూడిదయిపోయింది. ఈ సారి భారత సమాజంలో మరిన్ని దుర్మార్గపు మార్పులు చేయబడ్డాయి. ముస్లిం దురాక్రమణదారుల నుండి కాపాడుకోవడానికి సంపదనంతా దాచిపెట్టేసుకోవడం, పక్కవాడికి ఉన్నా లేకున్నా మన వరకు దా(దో)చుకొని, జాగ్రత్త పడడం వంటివి భారతీయుల జీన్స్‌లో అప్పుడే ప్రవేశపెట్టబడ్డాయి. అవి ఇప్పటికీ మనల్ని వదల్లేదనుకోండి - అది వేరే సంగతి. మన రాజకీయ నాయకుల్లో మరింత స్పష్టంగా వీటిని గమనించవచ్చు. ఆ సమయంలో ముఖ్యంగా, ఎక్కువగా బలయిపోయింది, నష్టపోయింది - ఆడపిల్లలే. చిన్న తనంలోనే పెళ్ళిళ్ళు చేయడం (బాల్య వివాహాలు), భర్త చనిపోతే ఎవరికీ దక్కకుండా భార్య కూడా చితిలో దూకి చనిపోవడం (సతీ సహగమనం), వయసులో ఉన్న అమ్మాయిలు ఎవరికీ కనబడకుండా ఉండాలనడం (పరదా పద్దతి) ఇవన్నీ మధ్య యుగాల్లోనే భారతీయ సమాజంలో ప్రవేశించి, మూఢాచారాలుగా స్థిరపడిపోయాయి. భారతీయులకి, ముస్లింలకి జరిగిన ఆధిపత్య పోరులో కూడా దేశం ఎంతో నష్టపోయింది.

    వీరిద్దరి పోరు ఇలా కొనసాగుతుండగా, మరో పెద్ద శత్రువు, యూరోపియన్లు వచ్చారు. వారి రాకతో హిందు, ముస్లింలు ఏకమైపోయి, ఆ పెద్ద శత్రువుని ఎదిరించే పనిలో లీనమైపోయారు. అయితే యూరోపియన్ల వల్ల, ముఖ్యంగా బ్రిటీష్‌ వారి వల్ల జరిగిన మంచి ఏమిటంటే, దేశానికి ఒక రూపం వచ్చింది. చిన్న చిన్న రాజ్యాలన్నీ పోయి, ఒకే దేశంగా ఆవిర్భవించింది - భారతదేశం.

    ఇలా కొన్ని వేల సంవత్సరాలుగా జరిగిన పోరాటాల వల్ల గాని, భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల వల్ల గాని భారతీయులలో మితిమీరిన సోమరితనం, నిర్లక్ష్యం, ఎదుటి వారిని దోచుకొనే తత్వం నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. దాని వల్లనే ఈనాడు సమాజంలో మనం చూస్తున్న అవినీతి, కోట్ల రూపాయిల కుంభకోణాలు, అభివృద్ధి లేకపోవడం, పేదరికం వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వాడు కూడా నాకు లాగే భారతీయుడే, సాటి మనిషే అన్న స్పృహ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనికి మతాన్ని గాని, సంస్కృతిని గాని ప్రాతిపదికగా తీసుకోవడంలో ఏ తప్పూ లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఏదో ఒక మతం వైపు మొగ్గుచూపాయి. కాని భారతదేశంలో దీనికి భిన్నంగా అన్ని మతాలు సమానమే అనే ధృక్పధంతో అందరినీ ఆదరించారు. అదే వారి పాలిట శాపమైంది.

    మనం ఏ మతాన్ని విమర్శించనవసరం లేదు. ఎవరిపైనా ఎదురు దాడి చేయవలసిన ఆగత్యం లేదు. మనలోని లోటుపాట్లని సరిచేసుకుని, మనల్ని మనం కించపరుచుకొని, ఎదుటి వారికి లోకువ ఇవ్వకుండా, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని భద్రంగా భావి తరాలకు అందించగలిగితే చాలు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కూడా బాల గంగాధర్‌ తిలక్‌ వంటి వారు ప్రసిద్ధ గణేష్‌ మహోత్సవాలు మొదలుపెట్టి, ప్రజల హృదయాల్లో జాతీయ భావనని రగిలించారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సమర్థ రామదాసు శివాజీకి, విజయనగర సామ్రాజ్య స్థాపనకి హరిహరరాయలు, బుక్కరాయలకి విద్యారణ్య స్వామి వంటి వారు వేదాలు, పురాణ కథల ద్వారానే దేశ భక్తిని రగిలించారు. పిల్లలకి కూడా పాఠ్యాంశాల్లో వేద శ్లోకాలని, పురాణాల్లోని ఆదర్శమూర్తుల కథల్నీ పెట్టడం వలన వారు కూడా పెద్దయాక ఆయా ఆదర్శాలని అవలంభించడానికి వీలవుతుంది. భారతదేశం ఎవరో దోచుకుని వదిలిపెట్టేసిన దేశం కాదని, మనం కూడా దోచుకోవడానికే ఉన్నామని కాకుండా, ఇది మనదేశమని, నేను భారతీయుడినని గర్వంగా చెప్పుకోగలిగిన విజ్ఞానం ఇక్కడ ఉందని, ఇక్కడి సంస్కృతికి నేను నిజమైన వారసుడనని, ప్రాచీన భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపచేయడం మన తక్షణ కర్తవ్యమని (-స్వామి వివేకానంద) ప్రతి వ్యక్తి భావించే విధంగా పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రతి రోజు పాఠశాల ప్రతిజ్ఞలో చెప్పుకోవడమే కాకుండా, నిజంగా ప్రతి ఒక్కరి చేత ఆలోచింపచేసి, ఆచరింపచేసే విధంగా చేయగలిగితేనే భారతదేశానికి నిజమైన విముక్తి, స్వాతంత్య్రం.