Pages

Sunday, May 25, 2014

భారత్‌ గెలిచింది.... ఇది రెండవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే సమయం


    అవును... ఇది నిజమే... భారత్‌ నిజంగానే గెలిచింది. ఇప్పటి వరకు పరాయి సంకర జాతి పాలనలో మగ్గిన భారత్‌ తన ప్రాభవాన్ని పునరుద్దరించుకోవడానికి, పునరుత్తేజితమవడానికి సమాయత్తమయింది. అది ఈ ఎన్నికల్లో నిరూపితమైంది. దాదాపు 500 సంవత్సరాల పాటు పరాయి పాలనలో నానా అగచాట్లు పడి, 67 సం||ల క్రితం స్వతంత్ర దేశంగా అవతరించినప్పటికి, తెచ్చిపెట్టుకున్న బానిసత్వంతో భౌతికంగా, మానసికంగా ఎంతో వేదన అనుభవించాం. ఇక చాలు... వాళ్ళను, వీళ్ళను కాళ్ళు, గడ్డం పట్టుకుని అడగనక్కర్లేదు. మనకు కావలసినదేదో మనం చేసుకోవచ్చు. ఎవరి కోసమో ఎదురు చూడనవసరం లేదు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ, అధికార బదిలీ మాత్రమే జరిగింది. అవే పరాయి చట్టాలు, వలసవాద విధానాలు. అన్ని దేశాల నుండి కాపీ చేసిన విషయాలనే ప్రజల నెత్తిన రుద్దారు తప్ప, ఒకప్పుడు ప్రపంచానికే మార్గ దర్శకత్వం చేసిన దేశంలో, ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చిన సంస్కృతిని నిర్దాక్షిణ్యంగా అణచివేసారు. అలా చేయడాన్నే అభివృద్దికి సూచికగా ప్రజల్ని వంచించారు.  కాని ఏ దేశం కూడా తన మూలాల్ని మరచి అభివృద్దిని పొందజాలదు. విష సంస్కృతిని భుజాల కెత్తుకున్న ఏ నాగరికతా మనజాలదు. ఇది మన దేశంలో ఎన్నో సందర్భాలలో రుజువయ్యింది.

    ప్రజలకు సుపరిపాలన అందించే విషయంలో హిందూ విధానం ప్రపంచంలో అత్యుత్తమమైనదిగా చెప్పుకోవాలి. ఇక్కడ అత్యంత ప్రాచీన కాలం నుండి ఎన్నో రాజ్యాలు విలసిల్లాయి, ఎన్నో మతాలు ఆవిర్భవించాయి. కాని ఎప్పుడూ ఇక్కడ విప్లవం సంభవించలేదు. ఏది జరిగినా ఎంతో సామరస్యపూర్వకంగా జరిగింది. రక్త పాతంతో ఎప్పుడూ ఏదీ సంభవించలేదు. ఒక చాణక్యుని సహాయంతో అర్థశాస్త్ర సహకారంతో చంద్రగుప్త మౌర్యుని ఆధ్వర్యంలో సువిశాల మగధ సామ్రాజ్యం స్థాపించబడి, అశోకుని కాలం నాటికి ఉచ్చస్థితికి చేరుకుంది. చరిత్ర కారులు పేర్కొనే స్వర్ణ యుగాలన్నీ కూడా హిందూ రాజుల పరిపాలనలో ఏర్పడినట్లుగా మనం గమనించవచ్చు. విద్యారణ్యుల వారి మార్గదర్శకత్వంలో, హరిహర రాయలు, బుక్కరాయలు స్థాపించిన విజయ నగర సామ్రాజ్యం తదుపరి శ్రీ కృష్ణదేవరాయలు కాలం నాటికి స్వర్ణయుగాన్ని సంతరించుకుంది. గుప్తుల కాలం నాటి స్వర్ణ యుగం కూడా హిందూ పాలకుల పుణ్యమే. రాజ్యాన్ని పరిపాలించడాన్ని కూడా ఒక యజ్ఞంగా భావించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. 'రాజ్యంతే ధ్రువమ్‌ నరకమ్‌' అని మహాభారతంలో ఇంద్రుడు ధర్మరాజుకు చెబుతాడు. అంటే రాజ్యం చేసిన వాడు నరకానికి వెళతాడని అర్థం. పరిపాలన చేసేపుడు తెలిసి గాని, తెలియక గాని కొంత మందికి ఆనందం చేకూర్చే క్రమంలో, మరికొంత మందికి దుఃఖాన్ని కలుగచేయవచ్చు. తమ కష్టార్జితాన్ని ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించేటపుడు ప్రజలు పడే బాధ కూడా ఆ రాజుకే తగులుతుందట. అందుకే పన్నుల్ని వసూలు చేసేటపుడు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడాలని చాణక్యుడు అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజు తన రాజ్యంలోని ప్రజల్ని కన్నబిడ్డల వలే పరిపాలించాలి అని ధర్మ శాస్త్రం చెబుతున్నది. కాని ఇతర మత గ్రంధాల్లో మాత్రం గెలిచిన రాజ్యంలోని ప్రజలందర్నీ బానిసలుగా చేసుకోవాలని, వారి స్త్రీలతో కోరికలు తీర్చుకోవాలని, వారి నగరాలన్నిటినీ పాడుపెట్టాలని ఎంతో 'పవిత్రంగా' రాసిపెట్టారు. అందుకే వాటిని అనుసరించే వారు తాము ఆక్రమించిన దేశాలన్నిటిని కొల్లగొట్టి, పాడుచేసి, వారి సంస్కృతిని తుడిచిపెట్టి, ప్రజల్ని ఎందుకూ పనికిరాకుండా చేసి, సర్వనాశనం చేస్తున్నారు. ఫలితం మారణహోమం, విధ్వంసం. అదే విద్వేషాన్ని, బానిసత్వాన్ని ప్రజలపై రుద్ది, తమ అనంతరం కూడా బానిస వ్యవస్థ కొనసాగేలా చేసుకున్నారు కాబట్టే నేడు దేశంలో మనం చూస్తున్న అన్ని రంగాల పతనం. ఇటువంటి పతనాన్ని అరికట్టాలంటే, స్వదేశీ సంస్కృతిని, ధర్మాన్ని సంపూర్ణంగా నమ్మిన, ఆచరించిన వారే నాయకులుగా ఉండాలి. 'యధా రాజా తథా ప్రజా' అంటారు. రాజు మంచివాడయితే ప్రజలు మంచివారవుతారు, కాని రాజు ధర్మం తప్పి ప్రవర్తిస్తే, రాజ్యం పరుల పాలవుతుంది. ఇప్పటి వరకు జరిగింది ఇదే. కాని, ప్రజలు ఇప్పటికైనా తమ తప్పిదాన్ని తెలుసుకున్నారు. మంచి నాయకుడు వారికి దొరికాడు. అందుకే అందలం ఎక్కించారు.

    ఈ విజయం నిస్సందేహంగా నరేంద్ర మోడీ సాధించిన విజయంగా చెప్పుకోవాలి. భారత్‌ నుండి ఒక శక్తివంతమైన, సమర్థవంతమైన నాయకుడు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రధాన మంత్రులుగా పనిచేసినప్పటికీ వారందరూ ఏదో విధంగా ఒక కుటుంబ ప్రభావానికి, కుహానా మేధావుల ఒత్తిడికి, సాంస్కృతిక బానిసత్వానికి తలొగ్గి బాధ్యతలు చేపట్టారు. వారంతట వారు స్వతంత్రించి ఏ నిర్ణయమూ తీసుకోలేని దుస్థితి. భారతీయ సంస్కృతీ వైభవంపై ఏ మాత్రం అవగాహన లేని వారు, దేశ భక్తి శూన్యులు, పరదేశ స్తోత్ర పరాయణులు ఇప్పటి వరకు మన నాయకులయ్యారు.

    కాని, ఇప్పుడు పరిస్థితి మారింది. నిజమైన లౌకిక వాదానికి అర్థం తెలిసిన, ఆచరణలో పెట్టగలిగిన వారు ప్రధాని పదవిని అధిష్టించబోతున్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశాన్ని ప్రేమించగలిగిన నాయకుడుండాలి. అతనికి స్వార్థం ఉండకూడదు. తన హితం కన్నా పరహితమే ముఖ్యమని పోరాడే వాడు అయ్యుండాలి. ముఖ్యంగా ఆ దేశ సంస్కృతి గురించి పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ నూటికి నూరుపాళ్ళు ఉన్న వ్యక్తి నరేంద్ర మోడి గారు. ఇటువంటి వ్యక్తి చేతిలో దేశ భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండబోతోంది అన్న విషయంలో ఎటువంటి సందేహం ఉండనక్కర్లేదు. దేశాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుని, దేశ సంస్కృతిని ప్రపంచ దేశాల్లో హేళన చేసే వారే మేధావులుగా చెలామణి అవుతున్న చోట, నిజమైన దేశ భక్తుడు ప్రధాని పదవిని అధిష్టించబోవడం నిజంగా అద్భుతమే. ఇన్నాళ్ళకి దేశ ప్రజల ఆకాంక్షలకి అనుగుణమైన నాయకుడు దొరికాడు. అది కూడా ఎవరూ ఊహించనంత ప్రజా బలంతో గెలిచాడు. ఇక అతనికి తిరుగేలేదు. భారత అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జైహింద్‌...