Pages

Sunday, December 20, 2009

తెలంగాణ వద్దు.. సమైఖ్యాంధ్ర ముద్దు అనే నినాదంతో ర్యాలీ..


తెలంగాణ వద్దు.. సమైఖ్యాంధ్ర ముద్దు అనే నినాదంతో తాడేపల్లిగూడెం మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఒక ర్యాలీ చేసాము. నా ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలోని అన్ని ప్రింటింగ్ ప్రెస్సుల యజమానులు, స్టాఫ్ అందరూ, ప్రెస్సులకి శెలవు ప్రకటించి సమైక్యంగా ర్యాలీలో పాల్గొన్నారు. స్తానిక పోలీస్ ఐలాండ్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి, తాలూకా ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించి, దారిలో వున్న అఖిల పక్ష కమిటి వారి శిబిరాన్ని సందర్శించి అక్కడ దీక్షలో కూర్చున్నవారికి మా మద్దతు తెలిపి, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి, మా ప్రదర్శనని ముగించాము. జై సమైక్యాంద్ర అనే నినాదాలతో ఆ రోజు పట్టణం మొత్తం హోరెత్తింది.

Tuesday, December 15, 2009

నేనూ నిరాహార దీక్ష చేస్తా.. నాకూ ఒక రాష్ట్రం ఇస్తారా.... ప్లీజ్....

నాకూ ఒంటి నిండా పని లేకుండా పోయింది... ఎంతసేపూ చిన్న చిన్న వ్యాపారాలు ఏమి చేస్తాం? శుభ్రంగా నిరాహార దీక్ష అని పేరు చెప్పి కాస్సేపు తిండి తినకుండా కూర్చుంటే... ఆ పై అమ్మ దీవెన లభిస్తే నేను కూడా ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయిపోవచ్చు.

ఏమిటీ పనికి మాలిన సోది అనుకుంటున్నారా?.. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది చూస్తుంటె అదే అనిపిస్తుంది. కాస్త కడుపుకి అన్నం తింటున్న వాడెవడికయినా సేం ఫీలింగ్ వస్తుంది. అసలింత అర్జంటుగా రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పమంటే ఎవరూ చెప్పరు. పోని తెలంగాణా వాళ్ళకు జరిగిన అన్యాయం ఏమిటో ఎవరూ చెప్పరు. అదేదో బ్రహ్మ పదార్ధం అనుకుంటా. మనకు అర్ధం కాదు. పూర్వం నుంచి తెలంగాణా వాదాన్ని తెరపైకి తెస్తున్న వారందరికీ రాజకీయ దురుద్దేశ్యం తప్ప మరొకటి వున్నట్టు కనబడదు. రాష్ట్రాన్ని భాషా ప్రయుక్తంగా అంటే భాషల వారీగా విడదీసినప్పుడు తెలుగు వాళ్ళందరు ఒకే నేలపై సంఘటితంగా వుండాలని కోరుకుంటేనే కదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది? మళ్ళీ ఇప్పుడేమిటీ గోల? మనం వున్నది ప్రజాస్వామ్యంలోనే కదా.. మనకు కావలసినవి శాసన సభలో పోరాడి సాధించుకోవచ్చు. ఇలా ఎవరికి వారు తమకు అన్యాయం జరుగుతోందని రోడ్లెక్కి కొట్టుకుంటే, ప్రతీ ఒక్కరికి ఒక్కో రాష్ట్రం ఇవ్వడం మొదలు పెడితే దేశాన్ని కనీసం ఒక వంద ముక్కలు చెయ్యాలి. బహుశా అంతకన్న ఎక్కువయినా ఆశ్చర్య పడనక్కర్లెదు.

భారత దేశ చరిత్రని పరిశీలిస్తే పూర్వం నుండి, ఈ దేశంలో అనేక రకాలయిన ప్రజలు సహజీవనం సాగిస్తున్నారు. వారు ఏ సంస్కృతికి చెందిన వారయినా, ఏ భాష మాట్లాడే వారయినా, ఏ మతానికి చెందిన వారయినా ఇక్కడ చక్కటి ఐకమత్యంతో ఒకే ఒక భారతీయత అనే భావంతో వున్నారు. అయితే మధ్య యుగాల్లో ప్రాంతాల వారిగా ఎక్కువయిన పోరాటాల వల్ల స్తానిక రాజులకి ఒకరికొకరికి పడక, వీళ్ళళ్ళొ వీళ్ళు కొట్టుకుచచ్చి దేశాన్ని ముందుగా ముస్లింలకి, తరువాత యూరోపియన్స్ కి అప్పచెప్పారు. ఇంక వాళ్ళు పెట్టే బాధలు పడలేక మనందరం ఏకమై భారతీయులమనే భావనతో స్వాతంత్ర పోరాటం చేసాము.. సాధించుకున్నాము.. స్వాతంత్రం వచ్చిన తరువాతయినా ఇంకా మిగిలిపోయిన సంస్తానాల్ని భారతావనిలో విలీనం చేయడం అనే కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వుక్కు మనుషుల కృషి ఫలితంగా అఖండ భారతావని ఆవిర్భవించింది.

ఇప్పుడు కె.సి.ఆర్ లాంటి వాళ్ళని చూస్తుంటే మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుందేమో అనిపిస్తుంది. దేశాన్ని మళ్ళి కుక్కలు చింపిన విస్తరి చేస్తారేమో అనిపిస్తుంది... అలాంటి చిల్లర రాజకీయ నాయకుల్ని, మతిలేని వాళ్ళని అదుపులో పెట్టుకోలేక పోవడం వల్లనే నేడు ఈ దుస్తితి వచ్చింది. ఎందుకూ పనికిరాని కె.సి.ఆర్ ప్రసంగాలని, వాడు చేసే అర్ధం లేని పనులని కూడా రోజూ మెయిన్ హెడ్డింగుల్లో, కలర్ ఫోటోల్లో వేసి ప్రజలందరికి వాడినొక పెద్ద నాయకుడిగా ఇమేజ్ కల్పించిన మీడియాకి కూడా ఈ పాపంలో భాగం వుందని చెప్పక తప్పదు. అడగ్గానే రాసిచ్చెయ్యడానికి ఇదేమీ ఆయన సొంత జాగీర్దారు కాదు కదా. కోట్లాది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన సున్నితమయిన అంశం.

కె.సి.ఆర్ అడిగాడు కదాని తెలంగాణా ఇచ్చెస్తే దేశం ఇంకా వంద ముక్కలవుతుంది. రేపు మళ్ళి ఇదే కె.సి.ఆర్ పత్యేక తెలంగాణా దేశం కావాలని నిరాహార దీక్ష చెయ్యడని నమ్మకమేమిటి? అప్పుడు కూడా ఇలాగే హైదరాబాద్ ప్రత్యేక దేశం ఏర్పాటు చేస్తారా? ఒకవేళ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా ఇస్తే, ఇప్పటికే హైదరాబాద్ వున్న వుగ్రవాదుల్ని ఆణచడంలో ఆ చిన్న రాష్ట్రానికి వున్న శక్తి సరిపోతుందా... ఒక వేళ ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల లాగా తెలంగాణా పూర్తిగా వుగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతే దాన్ని నిరోధించే సత్తా ఈ వూసరవెల్లి రాజకీయ నాయకులకి వుంటుందా?

ఇక్కడ తెలంగాణా ఇవ్వాలా వద్దా అనేది కాదు సమస్య.. అసలు తెలంగాణా రాష్ట్రం అవసరమా కాదా అనేదే... గొడవలనేవి ఎక్కడయినా వుంటాయి... అన్యాయం అనేది ఎక్కడయినా జరుగుతుంది.. అది భార్యా భర్తల మధ్య కావచ్చు.. అన్నదమ్ముల మధ్య కావచ్చు.. అత్తా కోడళ్ళ మధ్య కావచ్చు. ప్రతీ దానికి విడిపోవడమే పరిష్కారం అనుకుంటే ఇంక మనకు చుట్టుపక్కల కలిసుండే వాళ్ళెవరు కనిపించరు. చచ్చి సాధించేదేమీ వుండదు.. విడిపోయి బావుకునేదేమీ వుండదు. కలిసి వుంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. ప్రతీ సమస్యకీ ఒక పరిష్కారం వుంటుంది. అది సరయిన సమయంలో కనుక్కోవడంలోనే విజ్ఞత వుంటుంది...

రాజకీయమంటే ప్రజల బలహీనతలతోను, వారి భావోద్వేగాలతోనూ ఆడుకోవడం కాదు.. నిజంగా మనస్ఫూర్తిగా వారి బాగుకోసం కృషి చేసిన వారే ధీరోదాత్తులుగా చరిత్రలో నిలబడతారు.. అంతే గాని చవకబారు రాజకీయాలు చేసి, తెలుగు జాతిని నిలువునా విడదీసి, వారి ఆత్మ గౌరవాన్ని బజారు కీడ్చి, ప్రపంచం ముందు తలవంచుకొనేలా చేస్తున్న కె.సి.ఆర్. వంటి నాయకుల్ని చరిత్ర, భావి తరాల ప్రజలు క్షమించరు...

Friday, November 13, 2009

ప్రపంచానికి ఆఖరు ఘడియలు... 2012 సినిమా రివ్యూ..


ఈ ప్రపంచానికి ఆఖరి రోజు వచ్చి, వినాశనం కళ్ళ ముందు జరుగుతూంటే, ఈ భూమి మీద మానవ జాతి అంతరించిపోతే, ఎలా వుంటుంది అనే అంశాలతో తీసిన చిత్రమే ఈ 2012. ఈ సినిమా దర్శకుడు రొనాల్డ్ ఎమ్రిక్ కి జనాలని భయపెట్టడం ఇదేమి కొత్త కాదు. ఇది వరకు ఇండిపెండెన్స్ డే, 10,000 బి.సి., డే ఆఫ్టర్ టుమారో వంటి సినిమాలలో తన ప్రతిభను చాటుకున్నాడు. వినాశనం, ప్రళయం వంటి సబ్జక్టులతో సినిమాలు రావడం హాలీవుడ్ లో కొత్త కాకపోయినా, 2012 లో నిజంగానే భూమి వినాశనం అవుతుందనే అంచనాలతో రూపొందించిన సినిమాగా అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

సహజంగానే హాలీవుడ్ సినిమాలని ఇష్టపడే నేను, ఈ సినిమా చూడడానికి, అందునా ప్రపంచంలో అందరికన్నా ముందుగా (హాలీవుడ్‌లో ఈవాళ రిలీజ్ అవుతుంది) చూడడం థ్రిల్లింగ్‌గా వుండి నిన్న సాయంత్రమే థియేటర్‌కి వెళ్ళాను. మన దేశ ప్రేక్షకులని ఆకర్షించడానికి కాబోలు, ఈ సినిమా ముందుగా ఇండియాలో ప్రారంభమవుతుంది. సూర్యుడిలో జరిగే విస్ఫోటనాల కారణంగా (Solar flares) న్యూట్రినోలు విడుదలయి, అవి మైక్రోవేవ్స్‌లా పనిచేసి, భూమిలోపలి లావాని ఉడికించడం, దాని వలన విపరీతమయిన వేడి విడుదలయ్యి, భూమి పై పొరలు కంపించి, అగ్ని పర్వతాలు, భూకంపాలు, సునామీలు వచ్చి భూమి యొక్క ధృవాలు మారిపోయి, ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యి, మానవ జాతి వునికే లేకుండా పోతుందనేది ఒక సిద్దాంతం. దీనికి తోడు, మెక్సికోలోని ఒక పురాతనమయిన మాయన్ తెగవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం రూపొందించుకున్న కేలండర్ సరిగ్గా 2012 డిసెంబర్ 21 నాటికి పూర్తవుతుంది. అంటే ఆ తేదీ తరువాత కేలండర్‌తో పని వుండదనేది మాయన్ల నమ్మకంగా చెబుతారు. ఇవన్నీ కలగలిపి, ఒక వేళ నిజంగా ఇలా జరిగితే ఎలా వుంటుందనేది మనకి రుచి చూపించడానికి, ఎమ్రిక్ చక్కటి ప్రయత్నం చేసాడు.

ఈ సినిమాలో హీరో జాక్సన్‌కి అందరికన్నా ముందుగా భూమి వినాశనం గురించి తెలుస్తుంది. వెంటనే అతను తన కుటుంబాన్ని, ఇద్దరు పిల్లల్నీ రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఉత్కంఠని రేకెత్తిస్తాయి. తన కారులో పిల్లల్ని తీసుకు వెళుతూ ఉంటే వెనకాలే భూమి విడిపోవడం, విమానంలో వెళుతుంటే, కళ్ళ ఎదురుగా పెద్ద భవనాలు, ఫ్లై ఓవర్లు కూలిపోవడం వంటివి కంపూటర్ గ్రాఫిక్స్ సహాయంతో ఎంతో అద్బుతంగా తెరకెక్కించారు. భూమి మీద వున్న నాగరికత మనుషులూ అందరూ అంతరించిపోయాక, మరలా కొత్త జీవితం మొదలు పెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పెద్ద పెద్ద షిప్స్ నిర్మించడం, ప్రపంచంలోని అన్ని రంగాలకి చెందిన శాస్త్రవేత్తలని, దేశాధినేతలని, కోటీశ్వరుల్ని ఆ షిప్స్ ద్వారా రక్షించడం వంటి దృశ్యాలు కేవలం ధియేటర్‌లో మాత్రమే చూడ వలసినవి. కొద్ది సేపటిలో అందరూ చనిపోతామనే భావన వచ్చినపుడు మనుషుల మధ్య సంబందాలు ఎలా వుంటాయి, వారి మానసిక స్తితి ఎలా వుంటుంది, తమ పిల్లల్ని కాపాడడానికి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు వంటివి, మానవీయ విలువల్ని కొత్త కోణంలో చూపిస్తాయి. కేవలం గ్రాఫిక్స్ గురించి మాత్రమే కాకుండా చక్కటి విలువలున్న చిత్రంగా కూడా ఈ సినిమా నాకు నచ్చింది.

అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఒబామా స్తానంలో ఒక నల్ల జాతీయుడిని వుంచడం, ఒబామా లాగే తన ప్రజల గురించి అతడు ఆలోచించడం వంటివి ఆలోచింపచేస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్‌ని ప్రళయం నుంచి రక్షించడం కోసం ప్రత్యేకమయిన ఏర్పాట్లు చేసినా కూడా వాటిని కాదనుకుని, తాను మరణంలోనయినా తన ప్రజలతోనే వుంటానని చెప్పి, చివరకు వారితోనే జలసమాధి కావడం వంటి సంఘటనలని చాలా చక్కగా చిత్రీకరించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే సినిమా చూస్తున్న థ్రిల్ వుండదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను.

నిజంగా 2012లో ప్రళయం వస్తుందా, రాదా అన్న విషయాన్ని పక్కన పెడితే, కుటుంబ సమేతంగా చూడదగిన చక్కటి సినిమా ఇది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా వున్న ఈ సినిమాని DVD వచ్చే వరకు వెయిట్ చేసేకన్నా, థియేటర్‌లో చూస్తేనే ఎక్కువ ఎంజాయ్ చేయగలం.

Monday, November 9, 2009

మార్పు కోసం చిన్న ప్రయత్నం.. శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్


ప్రస్తుతం మన సమాజం సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎన్నో మార్పులకి లోనవుతూ ఉంది. ప్రత్యేకించి విద్యాపరంగా ఎన్నో సంస్కరణలు అవసరమని మేధావి వర్గం భావిస్తూండగా, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఇక విద్యా సంస్థలు ఇష్టా రాజ్యంగా అటు విద్యర్ధుల్ని, తల్లిదండ్రుల్నీ ఇబ్బందుల పాలు చేస్తూ, వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నయి. ఇది చాలదన్నట్లు వెర్రి మొర్రి సినిమాలు చూసి కుర్రకారు వేసే వేషాలు సాటి విద్యార్ధులకి ప్రత్యేకంగా ఆడపిల్లల పాలిట శాపాలుగా మారాయి. దీని గురించి మన బ్లాగ్లోకంలో ఎన్నో చర్చలు కూడా సాగుతున్నాయి.

ఇలా ఎన్ని మాటలు చెప్పినా వుపయోగం వుండదు కాని కనీసం ఆచరణలో కొన్నయినా చూపగలిగితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి సారిగా ప్రత్యేకించి ఆడపిల్లల కోసం ఒక జూనియర్ కాలేజీని స్థాపించాము. నాకు ఇంకా ఇతర వ్యాపారాలు వున్నప్పటికీ, కేవలం లాభార్జన మాత్రమే ధ్యేయంగా కాకుండా, పిల్లలకి మంచి చేద్దామనే వుద్దేశ్యంతో, ఒక చక్కటి మార్పుకి నాంది పలకాలనే ఉద్దేశ్యంతో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. దీనికి మా తాడేపల్లిగూడెం వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు గారు కూడా సంపూర్ణ ప్రోత్సాహం అందించారు. కాలేజీ నిర్వహణ బాధ్యతని నా సోదరి శ్రీమతి కృష్ణ చైతన్య నిర్వహిస్తుంది. మా ముగ్గురి ఆలోచనలు ఒకటి కావడంతో ఈ జూన్ నెలలో కాలేజీ ప్రారంభించాము. ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా మీకు తెలియజేసినందుకు బ్లాగ్మిత్రులు నన్ను మన్నించాలి.

పిల్లల జీవితంలో ఇంటర్మీడియెట్ అనేది ఒక ముఖ్యమయిన మలుపు. మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులకి లోనవుతూ, ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలెని స్థితిలో పిల్లలు వుంటారు. అటువంటి వారికి సరయిన దిశా నిర్దేశం చేయగలిగితే చక్కటి భవిష్యత్తుని వారు నిర్మించుకుంటారు. అందుకే మా కాలేజీలో విద్యతో బాటుగా సంపూర్ణ వ్యక్తిత్వం పొందేలాగా అన్ని జాగ్రత్తలూ తీసుకోవడం జరిగింది. విద్యార్ధినుల రక్షణ కోసం కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాము.

* మానసిక వత్తిడి తగ్గించడానికి ప్రతీ రోజు మెడిటేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాము.
* వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు.
* ప్రతీ వారాంతంలో ఫ్లవర్ మేకింగ్, డ్రాయింగ్, గార్మెంట్ డిజైనింగ్ వంటి వాటిలో శిక్షణ.
* ఆలోచనలని పెంపొందించేలా గ్రూప్ డిస్కషన్స్, కవితలు చెప్పడం, సృజనాత్మక వ్యాసాలు వ్రాయడం నేర్పించడం.
* అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేయడంతో బాటుగా, ప్రాచీన భారతీయ విలువలు, సమాజంలో మనం మెలగవలసిన విధానం గురించి ప్రత్యేక క్లాసుల నిర్వహణ.

వీటన్నిటితో బాటుగా విద్యార్ధినులందరికీ స్మార్ట్ కార్డులు అందించాము. వాటిని కాలేజ్ మెయిన్ డోర్ దగ్గర ఒకసారి చూపిస్తే ఆటోమేటిక్‌గా డోర్ ఓపెన్ కావడంతో బాటుగా, ఆ విద్యార్దిని అటెండెన్స్ కూడా పడుతుంది. వెంటనే అదే విషయం పేరెంట్ సెల్‌కి SMS పంపబడుతుంది. మరలా సాయంత్రం ఇంటికి వెళ్ళెటప్పుడు ఇక్కడ బయలుదేరిన విషయం పేరెంట్‌కి తెలియజేయబడుతుంది. ఇక పిల్లల గురించి తల్లిదండ్రులకి ఎటువంటి బెంగా పడనక్కర్లేకుండా పూర్తి బాధ్యత మేమే వహించేలా దీనికి రూపకల్పన చేసాము.

మా కాలేజ్ నినాదం... "మీ బంగారు తల్లి ఉజ్జ్వల భవిష్యత్తు విజ్ఞాన వంతంగా, సురక్షితంగా, ఆహ్లాదకరంగా...."

విద్యారంగంలో నా ఈ చిన్న ప్రయత్నం విజయవంతం కావడానికి మీ అందరి అమూల్యమయిన ఆశీస్సులు , సూచనలు, సలహాలు అందిస్తారని ఆశిస్తున్నాను.

Wednesday, October 28, 2009

అమ్మాయిలూ... జాగ్రత్త... మరో ప్రమాదం పొంచివుంది... లవ్ జీహాద్ వస్తుంది...

అసలే ఆడపిల్లల మీద దాడులు యాసిడ్ దాడులు, అత్యాచారాలు, వేధింపులు వంటివి ఎక్కువయిపోయాయని అందరూ అందోళన చెందుతుంటే, ఇప్పుడు కొత్తగా ఆ లిస్ట్ లోకి లవ్ జీహద్ వచ్చి చేరింది. (జీహాద్ అంటే పవిత్ర యుద్దం. ముస్లింలు తమ మతం కాని వారిని తమ దారిని తెచ్చుకోవడాని ఎదుటి వారిని చంపడాని కూడా వెనకాడకూడదనే భావన లోంచి పుట్టుకొచ్చిందే ఈ జీహాద్. ఇది దేవుని సామ్రాజ్య స్తాపనలో భాగంగా దేవుని ఆదేశానుసారమే ఈ యుద్దం చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటారు. మధ్య యుగాల్లో, ఆధునిక యుగంలోను ఎంతో మంది ఈ పవిత్ర యుద్దానికి బలయిపోయారు). వారం రోజుల క్రితం ఈనాడు పత్రికలో వచ్చిన వార్త చదివి (రోజు గుర్తు లేదు) కాస్సేపు బుర్ర పనిచేయలేదు. లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. ఇప్పటి వరకు జీహాద్ అంటే ఎదుటివారిని చంపడం లేదా, ఎవరికి వాళ్ళు చావడం మాత్రమే చూసాం. కాని ఇప్పుడు అమాయకులయిన ఆడపిల్లల మనసుల్ని కూడా చంపేసి వారిని జీవచ్చవాలుగా మార్చే కొత్త విష సంస్కృతి మొదలయ్యింది.

అవును... మీరూహించింది కరక్టే.... ఈ లవ్ జీహాద్ లో భాగంగా అందమయిన ముస్లిం యువకులని రంగంలోకి దించుతారట. వారు అమాయకులయిన అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వలలొవేసుకుని, అదే ప్రేమ ముసుగులో వాళ్ళని మతం మార్పించి, వాళ్ళ మతం లోకి మారిన తరువాత అప్పుడు అసలు రూపం చూపిస్తారన్నమాట. ఇలా మోసపోయిన అభాగ్యులు వాడి లిస్ట్‌లో ఇంకా చాలా మంది వున్నారన్న విషయం తెలుసుకుని, వాళ్ళకి సవతిగా వుండలేక, చేసిన తప్పుని సరిదిద్దుకునే మార్గం దొరక్క జీవితాంతాం జీవచ్చవాలుగా బ్రతుకుని వెళ్ళదీస్తున్నారట. నిజంగా ఆందోళన కలిగించే విషయమిది. కర్ణాటక లో ఒక తండ్రి తన కూతురు లవ్ జీహాద్ కి బలయిపోయిందని పోలీసులకిచ్చిన కంప్లైంట్‌తో ఈ విషయం బయటకి వచ్చిందట. ఈ విధంగా వాళ్ళ జనాభాని పెంచుకునే మార్గమనుకుంటాను. వాళ్ళని ఎలాగయినా చావనివ్వండి... ఎందరినయినా చంపమనండి.. అది వాళ్ళ మత వ్యవహారంగా చూపెట్టు కోవచ్చు... కాని మన జాగ్రత్తలో మనం వుండాలి. అడవిలో వెళ్ళేటప్పుడు పువ్వులూ వుంటాయి, ముళ్ళూ ఉంటాయి... పువ్వుని చూస్తూ మైమరచిపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి. అక్కడ తప్పు ముల్లుది కాదు.. అది చూసుకోపోతే మన తప్పు. నా మనసులో ఇంకా చాలా వుంది. ఇంతకు మించి ఇక్కడ నేను రాయలేను....

కాబట్టి నా చిట్టి తల్లులందరికీ ఒక సలహా... ప్రేమ పేరుతో లేని పోని అనర్ధాలు కొనితెచ్చుకోవద్దు. ఎవరయినా కాస్త అందంగా కనిపించి మాటలు కలుపుదామని చూస్తే అటువంటివి మీకిష్టం వుండవని మొహమాటం లేకుండా చెప్పేయండి. లేదా అంతగా విసిగిస్తే తల్లిదండ్రులకీ, లేదా మీరు చదువుకునే కాలేజ్ లో చెప్పండి. అంతే గాని మీలో మీరు కుమిలిపోవద్దు. ఇప్పటికే ఎవరయినా అటువంటి ప్రేమ వలలో చిక్కుకున్నట్లయితే వెంటనే ఆ సాలిగూడు లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏమి చేస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో ఒక కంట కనిపెట్టి వుంచండి. ప్రమాదం ఎక్కడో లేదు, మన కాళ్ళ కిందనే వుంది. మన మధ్యలోనే మానవ మృగాలు పొంచివున్నాయి. ఒకసారి చేతికి చిక్కిన తరువాత అమాయకపు లేడి పిల్లలా బలి కావాల్సిందే. ఈ విషయాన్ని పిల్లలకి అర్ధం అయ్యేలా చెప్పండి.

Saturday, October 10, 2009

బాల్యాన్ని హరించే హక్కు మీకెవరిచ్చారు?

విద్య పేరిట వెర్రి మొర్రి వేషాలెయ్యడం ఈ మద్యన బాగా ఎక్కువయిపోయింది. ఎంత పట్టించుకోకుండా వుందామన్నా ఈ టపా రాయక మనసు ఆగడం లేదు. మోడల్ స్కూల్స్, మోడర్న్ స్కూల్స్, ఐడియల్ స్కూల్స్ అయిపోయాయి.. ఇక టెక్నో సూల్స్ మిగిలాయి. నేను ఈ రోజు ఒక స్కూల్ వారు పంపించిన టెక్నో స్కూల్ పుస్తకాలు చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఆరో తరగతి పిల్లల కోసం తయారు చేసిన పుస్తకాలంట... I.I.T Foundation course అని వాటి మీద రాసి వుంది. చూస్తే అవి ఇంజినీరింగ్ కాలేజ్ పుస్తకాల్లాగా అనిపించాయి. నేను చిన్నపుడు ఆరో తరగతిలో అటువంటి సిలబస్ చదివిన గుర్తు లేదు. ఆఖరికి నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నపుడు కూడా అటువంటి పుస్తకాలు చదివిదిన గుర్తు లేదు (1990 లలో). అసలు ఆరో తరగతి నుంచే I.I.T ఏమిటో నాకయితే అర్ధం కావడం లేదు. (నేను బాగా వెనుకబడి వున్నానని మీరెవరయినా భావిస్తే నాకేమీ అభ్యంతరం లేదు).

మారుతున్న ప్రపంచం బట్టి మనం కూడా మారాల్సిందే. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా పెరగాల్సిందే. కాని తమ లక్ష్యమేమిటో కూడా సరిగా ఎన్నుకోలేని లేత వయసులో పి.జి. స్థాయి పుస్తకాలతో ఆరో తరగతి చదివే పిల్లల్ని హింసించడం ఎంతవరకూ సబబు? ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే, అప్పుడే పుట్టిన వారికి కూడా I.I.T, EAMCET కోచింగ్ మొదలు పెట్టేసేలా వున్నారు ఈ సో కాల్డ్ విద్యావేత్తలు. అమ్మా, నాన్న ఎందుకు అని నేర్పించడం ఎందుకు దండగ? ఆ రెండు పదాల బదులు, గురుత్వాకర్షణ సిద్దాంతం నేర్పిస్తే పోలా? అనుకునేలా వుంది పరిస్థితి. ఒక చిన్న వుదాహరణ చూస్తే మీకే తేలికగా అర్ధమయిపోతుంది. ఆ టెక్నో బుక్ (sorry.. I.I.T Book) లోంచి ఒక ప్రశ్నని మీకు రుచి చూపిస్తాను చూడండి. నిజం చెప్పాలంటే నా కంటికి కనబడ్డ వాటిల్లో ఇదే చిన్న ప్రశ్న. ఇంతకన్నా చాలా క్లిష్టమయిన విషయాలే వున్నాయి అందులో..

Q. The level of water in a measuring cylinder is 12.5 ml. When a stone is lowered in it, the volume is 21.0 ml. Then the volume of the stone is...
option A) B) C) D)

అసలే బుర్ర తక్కువ ప్రభుత్వాలు విద్యని ఎప్పుడో నాశనం చేసేసాయని బాధ పడుతుంటే, మళ్ళి ఈ కొత్త ముప్పొకటి. విద్యలో ప్రమాణాలు పెంచాలని అందరూ గొడవ చేస్తుంటే, పి.జి.లో లెసన్స్ తీసుకు వచ్చి ఆరో తరగతి సిలబస్ లో కలిపేసి, చేతులు దులుపుకుంటున్నారు. ఎంత ఎక్కువ సిలబస్ పిల్లలకి ఇస్తే అంత ఎక్కువ స్టాండర్డ్స్ పాటిస్తున్నట్టన్న మాట. పిల్లకి మనం చెప్పేది అర్ధం అవుతుందో లేదో, వారికసలు అర్ధం చేసుకునే వయసు వుందో లేదో ఎవరూ అలోచించడం లేదు.

ఇక స్కూల్స్ గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. ఒకళ్ళు ఏది మొదలెడితే ఇక అందరూ ఫాలో అయిపోవడం. అది పిల్లలకి ఎంత వరకూ అవసరమో అలోచించరు. ఎవరయినా స్కూల్ వాళ్ళు పుణ్యం కట్టుకుని, చంద్రమండలం వెళ్ళడానికి అవసరమయిన కోర్స్ నాలుగో తరగతి నుంచే చెపుతామంటే, ఇక తెల్లారే సరికి మరొక స్కూల్ వాళ్ళు రెడీ అయిపోతారు. మేము అదే కోర్స్‌ని మూడో తరగతి నుంచే చెపుతాము అని. వెంటనే పబ్లిషర్లు రంగం లోకి దిగితారు. నాలుగో తరగతి పిల్లలకి చంద్ర మండలం వెళ్ళడానికి అవసరమయిన కోర్స్ మెటీరియల్ మార్కెట్ లో రెడీ.

ఇక పేరెంట్స్... వాళ్ళు ఈ విషవలయంలో భాగస్వాములే కాబట్టి, అటువంటి స్కూల్స్ లో పిల్లల్ని చేర్పించడానికి రెడీ. ఎందుకంటే ఫలానా చంద్ర మండలం మీదకి పంపే కోర్స్ చెప్పే స్కూల్ లో తమ పిల్లల్ని చదివిస్తున్నామంటే వాళ్ళకి అదో స్టేటస్ సింబల్. పిల్లలు ఎంత ఏడుస్తున్నా వినకుండా, పొద్దున్న ఆరుగంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆటపాటలు లేకుండా, తిండి కూడా సరిగా తినకుండా అదే పనిగా చదువుతున్నా, రోజుకి నాలుగ్గంటల పాటు స్కూల్ బస్సులలోనే బాల్యం హరించుకు పోతున్నా, తల్లిదండ్రులకి పట్టదు. ఇలా బాల్యం లేకుండా పెరిగి పెద్దయిన పిల్లలు ఏమి సాధించగలరని ఆశించగలం? శాడిస్టులగానా, లేక కార్పోరేట్ సంస్తల్లో డబ్బులు సంపాదించే యంత్రాల్లాంటి వుద్యోగులు గానా?

నాకు తెలీక అడుగుతానూ.. ఇప్పటి వరకూ మానవ నాగరికతలో శాస్త్ర విజ్ఞాన పరంగా ఎన్నో మహత్తర పరిశోధనలు చేసిన సైంటిస్టులు అందరూ ఇలాగే చదివారా? ఎవరయినా గొప్ప వాళ్ళవ్వలన్నా, ఏదయినా అద్బుతం సాధించాలన్నా, ఇంత హింస అనుభవించాల్సిందేనా? ఇంతటి మానసిక హింస భరించలేక ఆత్మ హత్యే శరణ్యమనుకుని జీవితాన్ని ముగించే పరిస్థితి ఏర్పడితే, ఆ చిన్నారి చావుకు ఎవరు బాధ్యత వహిస్తారు... బుద్దిలేని ప్రభుత్వాలా?.... కాసులకి కక్కుర్తి పడే విద్యా సంస్తలా?.. గొప్పలకి పోయే తల్లిదండ్రులా? బాధ్యత ఎవరిదయినా గాని ఈ చదువనే యజ్ఞంలో బలిపశువులుగా మారుతున్నది మాత్రం అమాయక బాల్యమే...

Thursday, September 3, 2009

ముఖ్య మంత్రి మరణం.. నేర్చుకోవలసిన గుణపాఠాలు..

మనసున్న ఒక మంచి మనిషి ఇక లేడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. నమ్మిన వారికి ప్రాణాలయినా ఇవ్వడానికి సిద్దపడే ఆపద్బాంధవుడు మరిక లేడు.. ఆపన్నుల, రోగుల పాలిట "ఆరోగ్య శ్రీ" ఇక కనబడడు..

ఏది ఏమయినా అందరి చేత "అందరివాడు"గా పిలిపించుకున్న మన ముఖ్య మంత్రి గారు ఇంతటి ఘోర పరిస్తితుల్లో మరణించడం, మనం నేర్చుకోవలసిన ఎన్నో గుణపాఠాల్ని ఎత్తి చూపుతుంది. ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతికంగా ఎటువంటి పరిస్తితుల్లో ఉందో తనిఖి చేసే నాధుడు కూడా కరువయ్యాడా? ఇంత పెద్ద ఆంధ్ర ప్రదేశ్ లో... హతోస్మి... పైగ కాలం చెల్లిన హెలికాప్టర్లో ప్రయాణం.. అదీ ఎన్నో రిపేర్లు అయింది... రాడార్ వ్యవస్త పనిచేయంది... కమ్యూనికేషన్ వ్యవస్త పనిచేయనిది... కనీసం కూలిపోతే ఆ సంగతిని ప్రసారం చేయలేని ట్రాన్స్‌మిటర్ వున్న హెలికాప్టర్‌లోనా ఇంతగా ప్రేమించే ఒక మనిషిని పరలోకాలకి సాగనంపాము.. ఇంత కన్నా సిగ్గు చేటు వుంటుందా... చంద్రుడి మీదకి, అంగారకుడి మీదకు తరువాత వెళదాము.. ముందు భూమి మీద సరిగ్గా నడవడం, ఎగరడం చేతనయితే అప్పుడు మిగతావి ఆలోచించవచ్చు.

ఇప్పటికయిన, మంత్రులూ, అధికారులూ కళ్ళు తెరచి ఒకటి ఆలోచించుకోవాలి.... లంచాలు దొబ్బే నాయకులు, అధికారులు వున్నత కాలం, చేసే పనిలో నిజాయితీ లోపించినంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వుంటాయి. ఈ రోజు మన ముఖ్య మత్రినే కోల్పోయాము.. రేపు మీ ఇంట్లోనే మరొకరికి ఇలా జరగవచ్చు. సంపాదించేది శాశ్వతం కాదు.. మంచితనమే మనం వెంట తీసుకువెళ్ళేది. ప్రజల గుండెల్లో నిలిచివుండేది కూడా ఆ మంచితనమే. అనుక్షణం ప్రజా క్షేమమే తలచి, వారి అభ్యున్నతే తన జీవిత లక్ష్యంగా అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి మన రాజశెఖర్ రెడ్డి గారు. అలాంటి మంచి మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ఒక మంచి మనిషిగా రాష్ట్ర, దేశ ప్రజలందరి హృదయాలలో ఎప్పటికీ నిలిచే వుంటాడు... వై.యస్.ఆర్.. అమర్ రహే... జైహింద్...

Thursday, August 13, 2009

మీ పిల్లల్ని చంపెయ్యాలనుకుంటున్నారా? అయితే మా దగ్గరకి పంపించండి.

మీరు సరిగ్గానే చదివారు. ఎవరి పిల్లల్ని వారు చేతులారా చంపుకోలేరు కనుక, ఏదయినా కార్పోరేట్ విద్యాసంస్తలోనో, కాలేజ్ లోనో చేర్పిస్తే సరి. ఇలా తయారయింది నేటి కార్పోరేట్ విద్యాసంస్తల ముసుగులో జరుగున్న విద్యా వ్యాపారం. ఏ వ్యాపారంలో నయినా పెట్టుబడిదారుడికి రిస్క్ వుంటుంది. కాని ఈ వ్యాపారంలో మాత్రం అంతిమంగా నష్టపోయేది మాత్రం అక్షరాలా విద్యార్ధులే. వారి విలువయిన జీవితం నాశనం కావడమే కాకుండా, వారి నిండు ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. నిన్న తాజాగా విజయవాడ శ్రీ చైతన్య కేంపస్ లో జరిగిన లోహితా రెడ్డి మరణమే దీనికి వుదాహరణ. ఈ ఒక్క సంవత్సరంలోనే ఎంతో మంది అమాయక విద్యార్దుల ప్రాణాలు విద్యపేరు చెప్పి హరించుకు పోయాయి.

ఈ విష సంస్కృతి కేవలం ఒక్క చైతన్యకే పరిమితం కాలేదు. ఏ కార్పోరేట్ విద్యా సంస్థని తీసుకున్నా ఇదే పరిస్తితి. పుట్ట గొడుగుల్లా పుట్టుకు వస్తున్న ఇటువంటి సంస్థలపై ఎవరికి సరయిన నియంత్రణ లేకపోవడం, తల్లి దండ్రులకు విద్యపై సరయిన అవగాహన లేకపోవడం, వారి మూర్ఖత్వం ఎంతో విలువయిన పిల్లల ప్రాణాల్ని హరిస్తున్నాయి. ఎంత ఎక్కువ సేపు చదివిస్తే అంత గొప్ప కాలేజ్ అన్నట్టుగా తయారయింది నేటి దుస్తితి. విద్యార్దులకేమీ అర్ధం కాకపోయినా గాని, వారి చేత బండ బట్టీ పట్టించేసి, ఏదో విధంగా మార్కుల్ని తెచ్చుకునేలా చేస్తున్నారు. నిజంగా సబ్జక్ట్ మీద అవగాహ వున్న విద్యార్ధి కూడా ఒక్కోసారి ఈ బట్టీ విక్రమార్కుల ముందు ఓడిపోక తప్పడం లేదు. కొన్ని వేల మందిలో ఏ ఒక్కరికో వస్తున్న ర్యాంకులని గొప్పగా చూపించుకుని, (ఎంతో మంది ఫెయిల్ అయినప్పటికీ) కొత్త అడ్మిషన్లు, కొత్త బ్రాంచీలు ప్రారంబించేస్తున్నారు. ఈ బ్రాంచీల్లో సౌకర్యాలు వున్నవా లేదా, సరయిన లెక్చరర్లు వున్నారా లేరా అని కూడా ఎవరూ ఆలోచించడం లేదు.

ఇక హాష్టళ్ళలో పిల్లలు పడుతున్న బాధల విషయానికి వస్తే అవన్నీ రాయాలంటే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. పిల్లలకి కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఎన్నో పేరుగొప్ప కాలేజిలు వున్నాయి. నలుగురికి కూడా ఇరుగ్గా వుండే ఒక్కో గదిలో పదేసి మందిని కుక్కేయడం, అందరికీ ఒకే బాత్ రూం ఏర్పాటు చెయ్యడం వంటివే కాకుండా, వారికి కనీసం నాణ్యమయిన తిండి కూడా పెట్టకుండా, విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.

ఒకసారి కార్పోరేట్ కాలేజ్ హాష్టల్లో అడుగుపెడితే ఏ నేరమూ చెయ్యకుండా, సెంట్రల్ జైల్లో అడుగుపెట్టినట్టే. తెల్లవారు జామునే నాలుగ్గంటలకి జైలు సెంట్రి... సారీ... హాష్టల్ వార్డెన్ వచ్చి నిద్ర లేపుతాడు. 4:30 నుంచి స్టడి హవర్స్ వుంటాయి. ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయ్యడానికి కలిపి మద్యలో ఒక గంట కేటాయిస్తారు. ఆ తక్కువ టైంలోనే అన్ని కార్యక్రమాలూ కానిచ్చేయ్యాలి. విజయవాడలో ఒక కాలేజ్ లో అయితే ఆడ పిల్లలు పది మందికి కలిసి ఒకే ఒక గది, దానికి అటాచ్డ్ టాయిలెట్ ఏర్పాటు చేసారట. పదిమందికి కాలకృత్యాలు తీర్చుకోవడనికి లేట్ అవుతుంది కాబట్టి అందరు కలిసి ఒకేసారి స్నానం చేసెయ్యండి, టైం కలిసి వస్తుంది కదా అని యాజమాన్యం జవాబు చెప్పిందట. మన ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్లలు ఒకేసారి అలాంటి పరిస్తితి తట్టుకోలేక ఆ కాలేజ్ నించి పారిపోవడనికి ప్రయత్నిస్తున్నారు. నేను స్వయంగా అటువంటి పిల్లలతో మాట్లాడి, తెలుసుకున్న సంఘటనలనే రాస్తున్నాను. అసలే తెల్లవారు జాము,... చలి, దానికి తోడు చన్నీటి స్నానం, ఎలా వుంటుందో పరిస్తితి వూహించండి..

ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత... వుదయం 6 గంటల నుంచి "క్లాస్" లు మొదలవుతాయి. అంత పొద్దున్నే మ్యథ్స్, కెమిస్ట్రీ వంటి సబ్జక్టులు చెపుతారు. నిద్ర వస్తున్నా, బుర్రకి ఎక్కకపోయినా, చచ్చినట్లు వినాల్సిందే. లేకపోతే శిక్షలు ఎలాగో తప్పవు. అలా మొదలయ్యే "శిక్ష"ణా కార్యక్రమం రాత్రి 10, 11 గంటలయ్యే వరకు జరుగుతూనే వుంటుంది. ఇక శెలవులు, వీకేండ్స్ అనేవి ఎలా వుంటాయో కూడా తెలియని పరిస్తితి. పండగలొచ్చినా శెలవులు వుండవు. ఇవి కాక మధ్య మధ్యలో విద్యార్ధికి అవమానాలు, శిక్షలు ఎలాగో తప్పవు. ఒక సారి కార్పోరేట్ కాలేజీలో చేరితే ఒకటి, ఆత్మ హత్య చేసుకోవాలి లేదా, ఎంత బండ బ్రతుకయినా బ్రతకడానికి సిద్దపడే సిగ్గులేని జీవితం ప్రాప్తిస్తుంది... ఇది నిజం.

ఈ కాలేజీల దగ్గర వుండే మంచి టెక్నిక్ ఏమిటంటే, కాలేజ్ లో చేరే విద్యార్ది దగ్గర ముందే పెద్ద మొత్తంలో ఫీజుని వసూలు చేసేస్తారు. దానితో ఎన్ని ఇబ్బందులున్నా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సర్దుకు పోవాల్సి వస్తుంది. ఎవరయినా హాష్టల్లో ఇమడ లేక ఇంటికి ఫోన్ చేసి, "నాన్నా, నాకిక్కడ బాగో లేదు, నేను నరకం అనుభవిస్తున్నాను, నేను చదవలేను నాన్నా." అనగానే అటువైపునుంచి వచ్చే మొట్టమొదటి సమాధానం,, "ఫీజు మొత్తం కట్టేసాం కదమ్మా, ఈ ఒక్క సంవత్సరానికే అడ్జస్ట్ అవ్వు.. వచ్చే సంవత్సరం మానేద్దువు గాని" అంటారు. కాని ఇప్పుడు కేవలం కొన్ని వేల రూపాయల ఫీజు గురించి చూసుకుంటే, తరువాత కొడుకో, కూతురో లేకుండా పోతున్నారు. దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు.

తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి.. దయచేసి మీ పిల్లలు చెప్పేది వినండి, వారి ఆవేదనని అర్ధం చేసుకోండి.. వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని తాపత్రయ పడటంలో తప్పు లేదు కాని, దాన్ని సాధించే ప్రయత్నంలో, మీరు, పిల్లలు ఏమి కోల్పోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ గొప్ప చాటుకోవడానికో, మీ స్టేటస్ చూపించుకోవడానికో పిల్లల ప్రాణాల్ని బలి పెట్టకండి. కష్టపడి చదివే వాళ్ళకి ఎక్కడయినా మంచి మార్కులు వస్తాయి. అందరూ ఇంజినీర్లు, డాక్టర్లూ అయిపోనవసరం లేదు.. కనీసం మనిషిగా బ్రతకగలిగితే అదే పది వేలు. వ్యాపారం చేసేవాళ్ళని ఎలాగో మార్చలేము... కనీసం మనమయినా మారితే, అంటే ఈ టపా చదివిన ఒక్క తండ్రి మనసులో అయినా మార్పు తీసుకురాగలిగితే, ఒక్క చిట్టి తల్లి ప్రాణన్నయినా నిలబెట్టగలిగితే నా ప్రయత్నం ఫలించినట్లే.

Saturday, August 8, 2009

దర్శకులకి శాడిజం వుంటుందా?

సినిమా డైరెక్షన్ చేయడం ఒక కళ అని అందరు అనుకుంటారు కదా. కాని సినిమాలకి దర్శకత్వం వహించే వాళ్ళకి కొద్దిగా.. కాదు.. కాదు.. చాలా శాడిజం వుంటుందని నాకనిపిస్తుంటుంది. ఈ మధ్యన రాంగోపాల్ వర్మ కొత్త సినిమా అగ్యాత్ (తెలుగులో అడవి) సినిమా పబ్లిసిటీ చూసిన తరువాత అలాగే అనిపించింది. ఆ సినిమా ఫంక్షన్‌లో వర్మ పక్కన, హీరోయిన్ పక్కన శవాలని పెట్టుకున్నారు. అచ్చం మనుషుల శవాలని పోలిన విధంగా బొమ్మల్ని తయారు చేసి వాటి పక్కన కూర్చుని "వేడుక" (శవానందం అనాలేమో) చేసుకున్నారు. ఈ పిచ్చి అక్కడితో అయిపోలేదు. ఏకంగా ముంబయి లో హోర్డింగుల మీద కూడా ఈ నకిలి శవాలని తగిలించి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారట. అక్కడి వారి ఫిర్యాదు మేరకు ఆ నకిలీ డెడ్ బాడీలని పోలీసులు తొలగించారట. ప్రజల్ని మరీ ఈ రేంజ్ లో భయపెడుతున్నందుకు వర్మ గురించి మనం ఏమనుకోవాలి.

ఇవన్ని ఒక ఎత్తయితే, చాలా కాలం నుంచి సినిమాలను చూస్తున్న నాకు కొన్ని విషయాలలో దర్శకులకి కొంచెం "మెంటల్" కూడా వుండాలేమో అనిపిస్తుంది. వుదాహరణకి, మనం అన్ని సినిమాల్లో చూస్తుంటాం. హీరోయిన్ ని వర్షంలోనో, నీటిలోనో తడిపేసి, అన్ని రకాల అంగిల్స్‌లో కెమెరాని తిప్పేస్తూ వుంటారు. కొంచెం మామూలుగా ఆలోచించండి. ఎవరయినా ఒక పరాయి ఆడపిల్లని మనం నీ బొడ్డు చూపించు, నీ అందాలని ఆరబొయ్యి, నేను ఫోటో (లేదా సినిమా) తీసుకుంటాము అని అనగలమా? ఒకవేళ నిజంగా ఏ వర్షం వచ్చి ఎదురుగా వున్న ఆడపిల్ల తడిస్తే వెంటనె అటు వైపు నుంది చూపు మరల్చుకోమా (కనీసం మర్యాద కోసమయినా గాని). బొడ్డు మీద ఆపిల్స్, బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళు ఇలా రకరకాల తినుబండారాలు, పెట్టి పాటలు తీస్తారు ఒకాయన. అదేమి చిత్రమో గాని, ఏ సినిమాలో పాటల్ని చూసినా, హీరోకి ఒంటినిండా బట్టలేసుకుని డ్యాన్స్ చేస్తాడు (కుప్పిగంతులు లేదా ఎక్సర్సైజ్ అనొచ్చేమో). పాపం హీరోయిన్ దగ్గరకి వచ్చేప్పటికి అసలు కావాల్సిన దానికన్నా తక్కువ డ్రెస్సులు వేసుకుంటుంది. ఒకటి.. హీరోయిన్ కయినా పూర్తిగా బట్టలు వేస్తే బాగుంటుంది. లేదా హీరోకి కూడా చెడ్డీలు వేస్తే ఏ గొడవా వుండదు. (మహిళా పాఠకులు నన్ను క్షమించాలి)

హింస గురించి ఎంత తక్కువ చేసి చెపితే అంత మంచిది. అవసరం వున్నా లేకపోయిన బక్కెట్ల కొద్దీ రక్తాన్ని తెర మీద చిమ్ముతూంటారు ఇప్పటి దర్శకులు. ఎన్నో అధునాతన ఆయుధాలు వచ్చాయి కదా. సింపుల్‌గా తుపాకీతో కాల్చుకోవచ్చు. కాని హీరో చేతిలో కత్తి వుంటేనే వీరోచితంగా వుంటుంది అనుకుంటా. కర్రలతో వళ్ళంతా విరగ్గొట్టుకుని, కత్తులతో నరికేసుకుని, బోల్డంత రక్తం చిందిస్తే గాని మన హీరోకి కోపం చల్లారదు. శతృవు కాపాడాడని సొంత కొడుకుని కూడా చంపుకుంటాడు ఒక సినిమా విలన్. లేదా మాటలు రాని మూగ పిల్లని కత్తితో పొడిచి ఆమె పై అత్యాచారానికి తెగబడతాడు మరో సినిమా విలన్. ఇవన్నీ తెరపై చూసేప్పుడు ఎంత జుగుప్సని కలిగిస్తాయో, ప్రేక్షకులపై వాటి ప్రభావం ఎలా వుంటుందో అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సినిమాలు తీసేస్తుంటారు మన దర్శకులు.

ఈ మధ్యన మరో కొత్త ట్రెండ్ మొదలయింది. మామూలుగా లవ్వు (కొవ్వు) సినిమాలు మనకు కొత్త కాదు. కాని ఆ లవ్‌ని చాలా చిన్న వయసు నుంచే మొదలెట్టించేస్తున్నారు. చాలా కాలం క్రితం వచ్చిన ఒక సినిమాలో పుట్టిన కొన్ని నెలలకే లవ్ మొదలవుతుంది. తరువాత వచ్చిన తూనీగ సినిమాలో ఆడుకొనే వయసులో మొదలవుతుంది.
ఇక టెంత్ క్లాస్ ప్రేమలు, ఇంటర్ కాలేజ్ ప్రేమలు గురించి చెప్పనక్కర్లేదు. హీరోయిన్ బొడ్డు కనబడేలా నుంచుంటే, ఆ బొడ్డు చుట్టూ నెమలి ఈకతో గోరింటాకుపెడతాడు మన హీరో. పోనీ సినిమాలో ఆ సన్నివేశం వుంటే పర్వాలేదు. ఏకంగా పోస్టర్లకెక్కించి చిన్న పిల్లల్ని కూడా పాదు చెయ్యడమెందుకు? దీనికన్నా డైరెక్ట్‌గా బూతు సినిమాలు తీసి జనాలమీదకి వదిలితే నయం. కావలసి వాళ్ళు వెళ్ళి చూస్తారు. ఏదో ఫ్యామిలీ సినిమా అని వెళితే పైన వుదహరించిన సన్నివేశాల్లో ఏదో ఒకటో లేక కొన్నో వుంటే పక్కనే వున్న కుటుంబ సబ్యులతో కలిసి చూడాలంటే సిగ్గు వేసే విధంగా ఇప్పటి సినిమాలు తయారయ్యాయి.

ఇప్పుడు చెప్పండి, సినిమా దర్శకుడికి శాడిజం వుంటుందా? వుండదా? ...

Wednesday, July 22, 2009

గ్రహణాలపై జన విజ్ఞాన వేదిక అత్యుత్సాహం.

ఈ శతాబ్దంలోనే అద్బుతమనదగిన సంపూర్ణ సూర్య గ్రహణం ఈ రోజు చోటు చేసుకుంది. ఈ గ్రహణం సామాన్య ప్రజల నుండి, శాస్త్రవేత్తల వరకు అందరి లోనూ అలజడి కలిగించింది. శాస్త్రవేత్తలు తమకు ఎంతో కాలం తరువాత చేతి నిండా పని దొరికింది, సూర్యుడి గురించి మరిన్ని కొత్త విషయాలు పరిశోధన చేయవచ్చని అనుకుంటే, సామాన్య ప్రజలు తమ తమ విశ్వాసాలననుసరించి తగు జాగ్రత్తలు పడ్డారు.

ఈ సందడి చాలదన్నట్లు మద్యలో జన విజ్ఞాన వేదిక వారు ఈ అరుదయిన సంఘటన ద్వార జనాల్లో పాపులారిటీ సంపాదించుకోవాలనుకున్నారో ఏమో తెలీదు కాని, కొత్త వివాదాలని తెరపైకి తీసుకు వచారు. గ్రహణం రోజున దేవాలయాలు మూయవద్దని, తెరిచేవుంచమని, గ్రహణం జరిగే సమయంలో భోజనాలు చెయ్యమని ఇలా కొత్త ప్రయోగాలు చెయ్యమని జనాలకి ఊదరగొడుతున్నారు. గ్రహణం వలన ఎటువంటి ప్రమాదము లేదని
చెప్పడం వీరి వుద్దేశం కావచ్చు. వీటివల్ల వుపద్రవాలు, యుద్దాలు, సునామీలు, వుప్పెనలు వస్తాయనే అపోహలనించి సామాన్య ప్రజల్ని బయట పడేయాలనుకోవడం మంచిదే. కాని ఈ సారి మాత్రం కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించినట్టు కనబడుతుంది. మానవ శరీరంపై కూడా గ్రహణాల వల్ల ఎటువంటి ప్రభావం లేదని చెప్పడానికి ప్రయత్నం చేసారు. పూర్తిగా ౠజువుకాని, పరిశోధనలు జరగని, ప్రజల విశ్వాసాలకి సంబందించిన ఇటువంటి విషయాలలో తలదూర్చే ముందు కొంచెం ఆలోచించుకుని వుండాల్సింది.

గ్రహణం వల్ల మనిషిపై ఎటువంటి ప్రభావం లేదని అంటున్నారు. అది నిజమే అయితే గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడిని డైరెక్ట్‌గా చూడవద్దని చెబుతున్నారు? కంటిలో వుండే సున్నితమయిన పొరలు దెబ్బతిని అంధత్వం వస్తుందనే కదా. అంటే ఆ సమయంలో ఏర్పడిన కిరణాల రేడియేషన్ ప్రభవం మన మీద పడినట్లే కదా? మరి అలాంటి సున్నితమయిన అవయవాలు శరీరంలో ఎన్ని వున్నాయో మీకు తెలుసా? వాటి మీద రేడియేషన్ ప్రభావం ఎంత ఉందో ఎవరయినా అధ్యయనం చేసారా? వాటి వివరాలు మీ దగ్గర వున్నాయా? గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలను బయటకి రావద్దనడానికి కూడా వెనుక ఇటువంటి శాస్త్రీయ కారణం వుండొచ్చు కదా? ఇప్పుడు గొప్ప కోసం, మీ ప్రాచుర్యం కోసం సామాన్య ప్రజల్ని గ్రహణం సమయంలో భోజనం చెయ్యమని చెబుతున్నారు. మీరు తింటున్నారు. దీర్ఘ కాలంలో ఆ ఆహారం వల్ల ఏదయినా జరగరానిది జరిగితే మీరు దానికి బాధ్యత వహిస్తారా?

సూర్యుడి నుంచి గ్రహణం సమయంలో వచ్చే రేడియేషన్ ప్రభావాన్ని మన పూర్వీకులు సరిగ్గానే అంచనా వేసారనే విషయాన్ని మర్చిపోవద్దు. పూర్వం నుంచి ఒక జాతి మొత్తం అనుసరిస్తున్న విధానాన్ని విమర్శించే ముందు మనం దానికి సమర్దులమా కాదా అన్న విషయాన్ని ఆలోచించుకోవాలి. గ్రహణ సమయాన్ని, సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఆర్యభట్టు మన దేశానికి చెంది వాడేనని, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఖగోళ అంశాలపై భారతీయులు పట్టు సాదించారని మరచిపోతే ఎలాగ?

ప్రజలలో మూడ నమ్మకాలని పారద్రోలాలనుకుంటే మంచిదే. దొంగ బాబాలు, స్వాముల నుంచి, గుడ్డిగా అనుసరిస్తున్న మూఢ నమ్మకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనుకోవడం మంచి ప్రయత్నమే. దాన్ని అందరూ స్వాగతిస్తారు కూడా. కాని, జీవన విధానంలో అనుసరించే ప్రతీ విశ్వాసాన్ని, ప్రతీ ఆలోచనని తప్పు పడుతూ కూర్చుంటే, సామాన్య ప్రజలు తాము అనుసరిస్తున్నది ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకోలేని చిక్కుల్లో పడతారు.

Monday, January 26, 2009

మనుషులు గర్జిస్తారా? మాట్లాడతారా?

సాధారణంగా మనుషులందరూ ఏదో ఒక భాష మాట్లాడుతుంటారని తెలుసు. జంతువులయితే, ఆయా జాతుల స్వభావాన్ని బట్టి వాటి భాషకి ఒకో పేరు పెట్టడం జరిగింది. అంతవరకు ఓ.కే. కానీ ఈ మధ్యన ఏ పేపర్ చదివినా, ఏ టి.వి చూసినా, ఒకతే గర్జన, ఘీంకారాలు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ళ పాటు యువ గర్జన గురించి విన్నాము. బహుశా యువకులందరూ మాట్లాడ్డం మానేసి, గర్జిస్తున్నారేమో అనుకున్నాను. తరువాత కొన్నళ్ళకి మాల గర్జన, మాదిగ గర్జన, వెలమ గర్జన, కమ్మ గర్జన అంటూ అన్ని గర్జనలు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా మహిళా గర్జన కూడా త్వరలో నిర్వహిస్తామని ఒక రాజకీయ పార్టీ వారు ప్రకటించారు. నాకు తెలిసినంత వరకు సింహాలు మాత్రమే గర్జిస్తాయి. మరి ఈ మనుషులు గర్జించడమేమిటో. హాయిగా మనుషులందరూ కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి కదా. రాజకీయ పార్టిలకి ప్రజల సమస్యల మీద ఎటువంటి చిత్తశుద్ది లేనంత కాలం, జనాలకి గేలం వేసే ఇటువంటి చౌకబారు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే వుంటాయి. నిజంగా ప్రజలకి మేలు చేసే ఏ నాయకుడిని గాని, రాజకీయ పార్టీని గాని జనం ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. అటువంటి వారు ఎటువంతి గర్జనలూ చెయ్యనక్కరలేదు. హాయిగా మాట్లాడితే చాలు, జనం అర్ధం చేసుకుంటారు. అందరూ ఈ విషయం గుర్తెరిగి ఇకపై హాయిగా మాట్లాడుకుంటారని ఆశిస్తూ, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.

Thursday, January 1, 2009

పంచాంగం కాలండర్ మీకు నచ్చిందా?

అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు,
నేను తెలుగు పంచాంగం కాలండర్‌ని అంతర్జాలంలో పెడదామనుకున్నపుడు ఈ ఆధునిక యుగంలో అందునా, కంపూటర్ వాడేవాళ్ళకి పంచాంగంతో ఏమి పని ఉంటుందా అని ఆలోచించాను. కాని నా ఊహ తప్పని తేలింది. నిన్నటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 80 మందికి పైగ, ఈ ఫైల్‌ని దిగుమతి చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీనితో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ఫైల్స్ మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా ప్రింటింగ్ ప్రెస్ వద్ద వుండే ఫైల్స్ ఎటువంటి అచ్చుతప్పులు లేకుండా, ఒరిజినల్ PDF files ఉంటాయి. మేము ప్రింట్ చేసే వాటిలో అందరికీ ఉపయోగపడే మంచి పుస్తకాలని వీలు దొరికినప్పుడల్లా మీకు అందజేస్తూంటాను. నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ సహృదయంతో ఆదరించి అభినందిస్తారని ఆశిస్తున్నాను.
గమనిక: ఈ కాలండర్ గురించి మీ అమూల్యమయిన సూచనలు, సలహాలు నాకు తెలియచేయండి.
నిన్న download చేసుకోని వారికోసం కాలండర్ లంకెలు మరలా ఇస్తున్నాను.

rapidshare

mediafire