Pages

Monday, November 9, 2009

మార్పు కోసం చిన్న ప్రయత్నం.. శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్


ప్రస్తుతం మన సమాజం సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎన్నో మార్పులకి లోనవుతూ ఉంది. ప్రత్యేకించి విద్యాపరంగా ఎన్నో సంస్కరణలు అవసరమని మేధావి వర్గం భావిస్తూండగా, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఇక విద్యా సంస్థలు ఇష్టా రాజ్యంగా అటు విద్యర్ధుల్ని, తల్లిదండ్రుల్నీ ఇబ్బందుల పాలు చేస్తూ, వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నయి. ఇది చాలదన్నట్లు వెర్రి మొర్రి సినిమాలు చూసి కుర్రకారు వేసే వేషాలు సాటి విద్యార్ధులకి ప్రత్యేకంగా ఆడపిల్లల పాలిట శాపాలుగా మారాయి. దీని గురించి మన బ్లాగ్లోకంలో ఎన్నో చర్చలు కూడా సాగుతున్నాయి.

ఇలా ఎన్ని మాటలు చెప్పినా వుపయోగం వుండదు కాని కనీసం ఆచరణలో కొన్నయినా చూపగలిగితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి సారిగా ప్రత్యేకించి ఆడపిల్లల కోసం ఒక జూనియర్ కాలేజీని స్థాపించాము. నాకు ఇంకా ఇతర వ్యాపారాలు వున్నప్పటికీ, కేవలం లాభార్జన మాత్రమే ధ్యేయంగా కాకుండా, పిల్లలకి మంచి చేద్దామనే వుద్దేశ్యంతో, ఒక చక్కటి మార్పుకి నాంది పలకాలనే ఉద్దేశ్యంతో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. దీనికి మా తాడేపల్లిగూడెం వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు గారు కూడా సంపూర్ణ ప్రోత్సాహం అందించారు. కాలేజీ నిర్వహణ బాధ్యతని నా సోదరి శ్రీమతి కృష్ణ చైతన్య నిర్వహిస్తుంది. మా ముగ్గురి ఆలోచనలు ఒకటి కావడంతో ఈ జూన్ నెలలో కాలేజీ ప్రారంభించాము. ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా మీకు తెలియజేసినందుకు బ్లాగ్మిత్రులు నన్ను మన్నించాలి.

పిల్లల జీవితంలో ఇంటర్మీడియెట్ అనేది ఒక ముఖ్యమయిన మలుపు. మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులకి లోనవుతూ, ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలెని స్థితిలో పిల్లలు వుంటారు. అటువంటి వారికి సరయిన దిశా నిర్దేశం చేయగలిగితే చక్కటి భవిష్యత్తుని వారు నిర్మించుకుంటారు. అందుకే మా కాలేజీలో విద్యతో బాటుగా సంపూర్ణ వ్యక్తిత్వం పొందేలాగా అన్ని జాగ్రత్తలూ తీసుకోవడం జరిగింది. విద్యార్ధినుల రక్షణ కోసం కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాము.

* మానసిక వత్తిడి తగ్గించడానికి ప్రతీ రోజు మెడిటేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాము.
* వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు.
* ప్రతీ వారాంతంలో ఫ్లవర్ మేకింగ్, డ్రాయింగ్, గార్మెంట్ డిజైనింగ్ వంటి వాటిలో శిక్షణ.
* ఆలోచనలని పెంపొందించేలా గ్రూప్ డిస్కషన్స్, కవితలు చెప్పడం, సృజనాత్మక వ్యాసాలు వ్రాయడం నేర్పించడం.
* అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేయడంతో బాటుగా, ప్రాచీన భారతీయ విలువలు, సమాజంలో మనం మెలగవలసిన విధానం గురించి ప్రత్యేక క్లాసుల నిర్వహణ.

వీటన్నిటితో బాటుగా విద్యార్ధినులందరికీ స్మార్ట్ కార్డులు అందించాము. వాటిని కాలేజ్ మెయిన్ డోర్ దగ్గర ఒకసారి చూపిస్తే ఆటోమేటిక్‌గా డోర్ ఓపెన్ కావడంతో బాటుగా, ఆ విద్యార్దిని అటెండెన్స్ కూడా పడుతుంది. వెంటనే అదే విషయం పేరెంట్ సెల్‌కి SMS పంపబడుతుంది. మరలా సాయంత్రం ఇంటికి వెళ్ళెటప్పుడు ఇక్కడ బయలుదేరిన విషయం పేరెంట్‌కి తెలియజేయబడుతుంది. ఇక పిల్లల గురించి తల్లిదండ్రులకి ఎటువంటి బెంగా పడనక్కర్లేకుండా పూర్తి బాధ్యత మేమే వహించేలా దీనికి రూపకల్పన చేసాము.

మా కాలేజ్ నినాదం... "మీ బంగారు తల్లి ఉజ్జ్వల భవిష్యత్తు విజ్ఞాన వంతంగా, సురక్షితంగా, ఆహ్లాదకరంగా...."

విద్యారంగంలో నా ఈ చిన్న ప్రయత్నం విజయవంతం కావడానికి మీ అందరి అమూల్యమయిన ఆశీస్సులు , సూచనలు, సలహాలు అందిస్తారని ఆశిస్తున్నాను.

7 comments:

 1. ఆసక్తికరంగా ఉన్నది. విద్యార్ధుల భద్రత విషయంలో మీరు పాటిస్తున్న జాగ్రత్తలు బాగున్నై. కానీ విద్య, వ్యక్తిగత అభివృద్ధి గురించిన విషయాలే నాక్కొంచెం అంతుబట్టలేదు.

  ReplyDelete
 2. మంచి ప్రయత్నం. మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తూ...

  ReplyDelete
 3. @ కొత్త పాళీ గారూ... మా భద్రతా ప్రమాణాలు మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు. మీకు అర్ధం కాని విషయం ఏమిటంటే, ఈ రోజు చాలా మంది చదువుని కేవలం ఒక ఉపాధి అవసరంగా మాత్రమే చూస్తున్నారు. వాస్తవానికి బాగా చదువుకున్నవాళ్ళు అందరూ జీవితంలో ఉన్నత స్తితి సాధిస్తారని నమ్మకంగా చెప్పలేము. దానికి కావలసింది మానవ సంబంధాల పట్ల అవగాహన, సమాజంగురించిన పరిశిలన, నాయకత్వ లక్షణాలు, మానసిక సమతుల్యం వంటివి ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈనాటి చదువులు కేవలం విషయ పరిజ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. వాటికి మార్కులు మాత్రమే కొలమానం. మనకన్నా ఎన్నో చిన్న దేశాలు, ఎంతో జనాభా ఉన్న చైనా వంటి దేశాలు ఎంతో అభివృద్దిని సాధిస్తుంటే, మనం మాత్రం ప్రతీ చిన్న విషయానికి ఇంకొక దేశం మీద ఆధార పడుతున్నాము. నా వ్యాపారం వరకూ తీసుకుంటే, ఫ్లెక్సీ బ్యానర్లు ప్రింట్ చేయడానికి అవసరమయ్యే ప్లాస్టిక్ క్లాత్ కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇంత పెద్ద దేశంలో మనం తయారు చేసుకోలేమా? కావలసింది కేవలం చదువు ఒక్కటే కాదు, దానితోబాటు, పైన ఉదహరించినవన్ని పాటించగలిగితే నిజమయిన అభివృద్దిని సాధించగలమని నా నమ్మకం...

  @ అమ్మా... మీ టపాలు నేను క్రమం తప్పక చదువుతూ వుంటాను... స్పందించి అభినందించినందుకు నెనర్లు..

  ReplyDelete
 4. బాగుందండీ మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీ కళాశాల దినదినాభివృద్ధి చెంది, విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించే దిశగా పయనించాలని కోరుకుంటున్నాను.

  ReplyDelete
 5. జగదీష్ గారు, చాలా మంచి పని చేసారండి. మీ కాలేజ్ దినదినాభివృధి చెందాలని కోరుకుంటున్నాను. మహిళాభివృధికి ఇంకా ఎంతో అవసరమున్న ఈ కాలంలో మీరు చేప్పట్టిన ఈ విద్యాలయం ఆ లోటును తీర్చాలని కాంక్షిస్తున్నాను. అభినందనలు.

  ReplyDelete
 6. @ విస్వప్రేమికుడు గారూ... జయ గారూ... మీ అభినందనలకి కృతజ్ఞుడిని.

  ReplyDelete
 7. ఎంతో మంచి ఆశయం తో మొదలుపెట్టిన మీ కళాశాల మళ్ళీ అనసూయ, సీత, సావిత్రి, ఝాన్సీలక్ష్మి, శారదామాత , లోపాముద్ర, గార్గి, మైత్రేయి మరియు రుద్రమదేవి లాంటి తల్లులను తయారుచేయాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నాను.

  ReplyDelete

Note: Only a member of this blog may post a comment.