Pages

Sunday, October 9, 2011

కె.సి.ఆర్‌.కి ఇంత రక్షణ అవసరమా?

ఈరోజు ఈనాడు పేపర్‌లో చూసాను. కె.సి.ఆర్‌.కి. ప్రభుత్వం ఒక బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్‌ ఇచ్చిందట. ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమం అంటూ ఉపన్యాసాలు దంచుతున్నారు కదా, వీరికి ఇటువంటి రక్షణ చర్యలు అవసరమా? వెధవ పనులు చేసే వాళ్ళకి, ఎవరితోనైనా విరోధం పెట్టుకునే వాళ్ళకి ఇటువంటి రక్షణ చర్యలు కావాలి గాని, 'ప్రజలతో మమేకమై' తిరిగే కె.సి.ఆర్‌.కి ఇటువంటివి అవసరమా? ఇంతటి ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు. రేపు నేను కూడా గోదావరి జిల్లాలు ప్రత్యేకంగా ఒక దేశంగా ఉండాలని ఉద్యమం లేవదీసి, నా ప్రజలకి లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొడితే, అపుడు కూడా ప్రభుత్వం నాకు కూడా ఇలాగే ప్రత్యేక రక్షణ కల్పిస్తుందా? తెలుసుకోవాలి.

    ఇపుడు జరుగుతున్న ఉద్యమం మనుషులు చేస్తున్న ఉద్యమంలా నాకు కనిపించడం లేదు. మీరెలా ఊహించుకున్నా నాకు అభ్యంతరం లేదు. అమాయకులైన ప్రజల్ని నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్న పెద్ద మనుషులు కూడా వారి బాధ్యతల్ని వదిలి ఉద్యమాల బాట పట్టి అందర్నీ ఇబ్బంది పెట్టడం సిగ్గుమాలిన చర్య. రోడ్ల మీద వంటలు వండుకు తినడం ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో చూసి ఉండం. ఆ సమయంలో ఎంత మంది ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉండి ప్రయాణంలో ఉండి ఉంటారో ఊహించలేం. అలా ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వారిలో ఒక నిండు గర్భిణీ ఉండొచ్చు, ఒక పసిపాప ఆహారం, మంచి నీళ్ళు లేక విలవిలలాడిపోవచ్చు, ఒక రోగి వైద్యం అందక నరకయాత పడుతూండవచ్చు. ఇవన్నీ ఎ.సి. రూముల్లో కూర్చున్న పెద్దమనుషులకి పట్టదు. వారికి కావాలిసింది వారి పదవి మాత్రమే. సిగ్గు లేకపోతే పోయే, కనీసం మానవత్వం ఉండనక్కర్లేదా? మనకెలాగూ చదువు లేదాయే. కూలి పని చేసుకునే వాడైనా తన పిల్లల్ని మంచి చదువు చదివించి, ప్రయోజకుడిని చేద్దామనుకుంటాడు. కాని, తెలంగాణా ప్రాంతంలో మాత్రం పిల్లల్ని బడులు మాన్పించి, ఉద్యమాలకి వారి చదువుల్ని ఆహుతి చేస్తున్నారు. వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. 

    రైల్‌ రోకోలంటూ రైలు పట్టాల మీద కూర్చుంటున్నారు. సరైన నాయకుడు ఒక్కడు ఉండి మీద నుండి రైలు నడిపితే, పట్టాల మీద ఒక్కడైనా కూర్చుని ఉంటాడా? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ ఉద్యమం సామాన్యులని కూడా తప్పుదోవ పట్టిస్తోంది. పని చేయకుండా జీతాలు అడగడం ఎంత వరకు సబబు? అంటే ఒక ఉద్యమం పేరుచెప్పి పని ఎగ్గొట్టినా, డబ్బులు మాత్రం లోటు ఉండకూడదు. ఆఖరికి సింగరేణి కార్మికుల్ని కూడా రెచ్చగొట్టి, రాష్ట్రంలో మంచి సీజనులో కరెంటు కష్టాలకి కారణమయ్యారు. రాజకీయంగా ఉద్యమం ఎలాగైనా చెయ్యొచ్చు. కాని ఇలా బరి తెగించి, ప్రజలకి నిత్యావసరాలు కూడా అందకుండా చేసే వాళ్ళని ఏమనాలి? ఏ పేరుతో పిలవాలి? కరెంట్‌ లేక ఎన్నో పరిశ్రమలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇళ్ళల్లో పిల్లలు, వృద్ధులు విలవిలలాడిపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యవసర ఆపరేషన్లని బ్యాటరీ లైట్ల వెలుగులో చేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది ఒకటుందా అని అనుమానం వేస్తుంది ఇదంతా చూస్తుంటే...

    ఇంత ఉద్యమం నడుపుతున్న పెద్దమనుషులకి అసలు తెలంగాణా అభివృద్ధి గురించి ఒక బ్లూ ప్రింట్‌ అంటూ ఉందా? ఏ ఏ రంగాల్లో ఎలా అభివృద్ధి సాధించాలో ఒక అవగాహన ఉందా? కేవలం రాజకీయ పదవుల కోసం పోరాటమేనా? ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. నిజంగా అభివృద్ధి మీద అంత మమకారం ఉంటే, కె.సి.ఆర్‌.ని గాని, కోదండరాంని గాని ఒక్క తెలంగాణా పల్లెని అభివృద్ధి చెయ్యమనండి. చూద్దాం. ప్రతీ పనిలోను కమీషన్లకి కక్కుర్తిపడే రాజకీయ నాయకులు, లంచం కోసం చేతులు చాచే అధికారులు ఉన్నంత కాలం అభివృద్ధి అనేది వట్టి మాట మాత్రమే. తెలంగాణా పేరు చెప్పి, చందాలు వసూలు చేసి, ఎంతో మంది నాయకులు కోట్లకు పడగలెత్తారు. అది మన కళ్ళ ముందున్న నిజం. వారిలో ఎవరైనా ప్రజల కోసం నిజంగా ఏదైనా చేసారా? చెప్పమనండి.

    తెలంగాణా వెనుకబడిన ప్రాంతమే. కాదనడం లేదు. ఆ మాట కొస్తే దేశం మొత్తం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉందిగాని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతుంది? ప్రజల జీవన ప్రమాణాలు మారినపుడే దానిని అభివృద్ధి అంటారు. అంతే గాని ఒక ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని, పదవులు పంచుకుంటే దానిని అభివృద్ధి అనరు. పైగా ప్రజల మీద భారం రెట్టింపు అవుతుంది. ఏర్పడే రాష్ట్రం యొక్క మంత్రులు, రాజకీయ నాయకులు, వారి జీతాలు, భత్యాలు, రక్షణ వంటి ఖర్చులు తడిసి మోపెడవుతాయి. అటువంటి భారాన్ని తట్టుకునే స్థితిలో రాష్ట్రం లేదు. దానికన్నా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, వారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. అదే సమయంలో కుటిల నాయకులు చేసే దుష్ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలి. అటువంటి రాజకీయ విషపురుగుల్ని ఏరిపారేయాలి. ఆ సందర్భంలో ఎవరి వత్తిళ్ళకు తలొగ్గకూడదు. ఏ ప్రభుత్వం ఇలా చేస్తుందో, చేయగలదో, ఆ ప్రభుత్వం, ఆ నాయకులు చరిత్రలో ధీరోధాత్తులుగా మిగిలిపోతారు. అంతే గాని ఏ పనీ చేయకుండా, దేవుడి మీద భారం వేసి, మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే, చరిత్ర హీనులుగా మారటం తథ్యం.

Friday, October 7, 2011

స్పూర్తినిచ్చిన స్టీవ్ జాబ్స్‌కి అశ్రు నివాళి...

స్టీవ్‌ జాబ్స్‌....

ఎల్లలెరుగని సృజనశీలి.

మ్యాక్‌ ప్రపంచపు మహారాజు



    కంప్యూటర్‌తో నా మొదటి అనుబంధం, పరిచయం ఆపిల్‌ మ్యాక్‌లతోనే మొదలయ్యింది. నాన్నగారి చెయ్యి పట్టుకుని, విజయవాడలోని ఒక ప్రెస్‌లో మొదటి సారి కంప్యూటర్‌పై డిజైన్‌ చేయడం చూసాను. అది మ్యాక్‌ -2 కంప్యూటర్‌. అప్పట్లో అది ఒక అద్భుతం. కొంత కాలం తరువాత మా ప్రెస్‌లో మొదటి కంప్యూటర్‌ వచ్చింది. అప్పట్లో అదో పెద్ద అద్భుతం. అదో పెద్ద పండుగ. సింగపూర్‌ నుండి ఇంపోర్ట్‌ చేసిన కంప్యూటర్‌ కావడంతో మా ఆఫీస్‌ అంతా కంప్యూటర్‌ చూడడానికి వచ్చిన వారితో నిండిపోయేది. అది మ్యాక్‌ ఎల్‌.సి.-2. 4 మెగాబైట్ల ర్యామ్‌, 16 మెగాహెర్జ్‌ స్పీడ్‌, మ్యాక్‌ ఓఎస్‌.4.0, హార్డ్‌డిస్క్‌ స్పేస్‌ 40 మెగాబైట్స్‌. ఆ కంప్యూటర్‌పైన డిజైన్‌చేస్తుంటే అంతా నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూసేవారు. ఒక పెద్దాయన అయితే ఉండబట్టలేక అడిగేసాడు. ''ఏమండీ, ఆ టి.వి.(మోనిటర్‌)లో ఎగురుతున్నదేమిటి? అది ఈగా?'' అని. అప్పటికి గ్రాఫిక్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ లేదు. విండోస్‌ ఇంకా నడకలు నేర్చుకుంటుంది. విండోస్‌ వైపు చూస్తే చాలు... కడుపులో దేవినట్లుండేది. ఎందుకంటే మా చేతిలో అద్భుతమైన 'మౌస్‌' ఉంది. దానితో మేము ఏదైనా చేసే వాళ్ళం. గేమ్స్‌ ఆడుకోవడం, పాటలు వినడం, మొదటి సి.డి. డ్రైవ్‌, మొదటి సారిగా కంప్యూటర్‌లో సినిమాలు చూడడం, మొదటి ల్యాప్‌టాప్‌ అనుభవం, మొదటి సారి టచ్‌ప్యాడ్‌పై మౌస్‌ అడించడం, .... అన్నీ మ్యాక్‌లోనే. ఇప్పటికీ బాగా హైఎండ్‌, హై డెఫినిషన్‌లో యానిమేషన్‌ చేయాలంటే, మ్యాక్‌ కంప్యూటర్లే గతి. ఇంతటి అద్భుతమైన ప్రపంచం సృష్టికర్త, సృజనశీలి... స్టీవ్‌ జాబ్స్‌.

    నిజానికి యాపిల్‌ మ్యాక్‌ లేకపోతే బిల్‌గేట్స్‌కి అనుకరించడానికి ఏదీ లేకపోయేది అనే నానుడి అక్షరాలా నిజం. ఇప్పటికీ ముందు మ్యాక్‌ ఒ.ఎస్‌. రిలీజ్‌ అయిన తరువాత మాత్రమే అందులో ఉన్న అన్నీ కాకపోయినా, కనీసం కొన్నయినా, విండోస్‌లో ఉండితీరుతాయి. కావాలంటే గమనించి చూడండి. అలాగే మ్యాక్‌ ఒ.ఎస్‌. ముందు బయటకు వచ్చిన తరువాత మాత్రమే విండోస్‌ రిలీజ్‌ పెట్టుకుంటారు. అంతటి అద్భుతంగా ఉంటాయి మ్యాక్‌ ఆపరేటింగ్‌ & అప్లికేషన్లు. అలాగే అడోబ్‌ వంటి పెద్ద కంపెనీలు ముందుగా తమ అప్లికేషన్లు యాపిల్‌ మ్యాక్‌కు రిలీజ్‌ చేస్తాయి. తరువాత మాత్రమే విండోస్‌కు తయారుచేస్తాయి.

    ఏదేమైనా మ్యాక్‌ అనేది ఒక అద్భుత ప్రపంచం. అదొక ఎడిక్షన్‌. ఒకసారి మ్యాక్‌పై అలవాటు అయితే ఇక మరే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రుచించదు. ఒకసారి ఆ గ్రాఫిక్స్‌కు అలవాటు పడితే... 'రాజుని చూసిన కళ్లతో..' అనే సామెత గుర్తుకొస్తుంది. ఎక్కడైనా కంప్యూటర్‌ స్టోర్‌కి వెళితే ముందు నా కళ్ళు ఆపిల్‌ గురించి వెతుకుతాయి.  మొదటి సారి కంప్యూటర్‌ చూసిన అనుభూతి నుండి.. మొదటి సారి ఐఫోన్‌ టచ్‌ చేసిన ఫీలింగ్‌ వరకు ఏదైనా యాపిల్‌ మయమే. ఆ ప్రతి ఆవిష్కరణ వెనుక ఉన్న అత్యున్నత మేథస్సు గురించి నేనెప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఆ ప్రతిభా సంపన్నుడు స్టీవ్‌ జాబ్స్‌ మాత్రమే. ప్రతి సంవత్సరం కాలిఫోర్నియాలో జరిగే ఆపిల్‌ షోలో జరిగే కొత్త ఆవిష్కరణల కోసం నేనెప్పుడూ ఎదురుచూస్తూంటాను. అందులో జాబ్స్‌ మాట్లాడే ప్రతి మాటను నేను రికార్డ్‌ చేసుకుంటాను. తను సృజించిన ఆ కొత్త ఉత్పత్తి గురించి, జాబ్స్‌ వివరిస్తున్నపుడు ఆ కళ్ళలో కనిపించే మెరుపు, ఆ గొంతులో తారాడే చిన్నపాటి గర్వం... నాకెంతో స్ఫూర్తి నిస్తాయి. మ్యాక్‌, ఐఫోన్‌ ఉన్నంత కాలం ఆయన మన మధ్య బ్రతికే ఉంటారు..

యాపిల్ కంపెనీ తన వెబ్‌సైట్లో వుంచిన విచార సందేశంలో ఇలా పేర్కొంది... అది అక్షరాలా నిజం... 
Apple has lost visionary and creative genius, and the world has lost an amazing human being. Those of us who have been fortunate enough to know and work with Steve have lost a dear friend and an inspiring mentor. Steve leaves behind a company that only he could have built, and his spirit will forever be the foundation of Apple.

ఆ సృజనశీలికి...

ఆ నిరంతర కృషీవలునికి...

ఆ అద్భుత ఆవిష్కరణ కర్తకీ...



నా హృదయపూర్వక అశ్రు నివాళి.....