Pages

Friday, October 7, 2011

స్పూర్తినిచ్చిన స్టీవ్ జాబ్స్‌కి అశ్రు నివాళి...

స్టీవ్‌ జాబ్స్‌....

ఎల్లలెరుగని సృజనశీలి.

మ్యాక్‌ ప్రపంచపు మహారాజు



    కంప్యూటర్‌తో నా మొదటి అనుబంధం, పరిచయం ఆపిల్‌ మ్యాక్‌లతోనే మొదలయ్యింది. నాన్నగారి చెయ్యి పట్టుకుని, విజయవాడలోని ఒక ప్రెస్‌లో మొదటి సారి కంప్యూటర్‌పై డిజైన్‌ చేయడం చూసాను. అది మ్యాక్‌ -2 కంప్యూటర్‌. అప్పట్లో అది ఒక అద్భుతం. కొంత కాలం తరువాత మా ప్రెస్‌లో మొదటి కంప్యూటర్‌ వచ్చింది. అప్పట్లో అదో పెద్ద అద్భుతం. అదో పెద్ద పండుగ. సింగపూర్‌ నుండి ఇంపోర్ట్‌ చేసిన కంప్యూటర్‌ కావడంతో మా ఆఫీస్‌ అంతా కంప్యూటర్‌ చూడడానికి వచ్చిన వారితో నిండిపోయేది. అది మ్యాక్‌ ఎల్‌.సి.-2. 4 మెగాబైట్ల ర్యామ్‌, 16 మెగాహెర్జ్‌ స్పీడ్‌, మ్యాక్‌ ఓఎస్‌.4.0, హార్డ్‌డిస్క్‌ స్పేస్‌ 40 మెగాబైట్స్‌. ఆ కంప్యూటర్‌పైన డిజైన్‌చేస్తుంటే అంతా నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూసేవారు. ఒక పెద్దాయన అయితే ఉండబట్టలేక అడిగేసాడు. ''ఏమండీ, ఆ టి.వి.(మోనిటర్‌)లో ఎగురుతున్నదేమిటి? అది ఈగా?'' అని. అప్పటికి గ్రాఫిక్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ లేదు. విండోస్‌ ఇంకా నడకలు నేర్చుకుంటుంది. విండోస్‌ వైపు చూస్తే చాలు... కడుపులో దేవినట్లుండేది. ఎందుకంటే మా చేతిలో అద్భుతమైన 'మౌస్‌' ఉంది. దానితో మేము ఏదైనా చేసే వాళ్ళం. గేమ్స్‌ ఆడుకోవడం, పాటలు వినడం, మొదటి సి.డి. డ్రైవ్‌, మొదటి సారిగా కంప్యూటర్‌లో సినిమాలు చూడడం, మొదటి ల్యాప్‌టాప్‌ అనుభవం, మొదటి సారి టచ్‌ప్యాడ్‌పై మౌస్‌ అడించడం, .... అన్నీ మ్యాక్‌లోనే. ఇప్పటికీ బాగా హైఎండ్‌, హై డెఫినిషన్‌లో యానిమేషన్‌ చేయాలంటే, మ్యాక్‌ కంప్యూటర్లే గతి. ఇంతటి అద్భుతమైన ప్రపంచం సృష్టికర్త, సృజనశీలి... స్టీవ్‌ జాబ్స్‌.

    నిజానికి యాపిల్‌ మ్యాక్‌ లేకపోతే బిల్‌గేట్స్‌కి అనుకరించడానికి ఏదీ లేకపోయేది అనే నానుడి అక్షరాలా నిజం. ఇప్పటికీ ముందు మ్యాక్‌ ఒ.ఎస్‌. రిలీజ్‌ అయిన తరువాత మాత్రమే అందులో ఉన్న అన్నీ కాకపోయినా, కనీసం కొన్నయినా, విండోస్‌లో ఉండితీరుతాయి. కావాలంటే గమనించి చూడండి. అలాగే మ్యాక్‌ ఒ.ఎస్‌. ముందు బయటకు వచ్చిన తరువాత మాత్రమే విండోస్‌ రిలీజ్‌ పెట్టుకుంటారు. అంతటి అద్భుతంగా ఉంటాయి మ్యాక్‌ ఆపరేటింగ్‌ & అప్లికేషన్లు. అలాగే అడోబ్‌ వంటి పెద్ద కంపెనీలు ముందుగా తమ అప్లికేషన్లు యాపిల్‌ మ్యాక్‌కు రిలీజ్‌ చేస్తాయి. తరువాత మాత్రమే విండోస్‌కు తయారుచేస్తాయి.

    ఏదేమైనా మ్యాక్‌ అనేది ఒక అద్భుత ప్రపంచం. అదొక ఎడిక్షన్‌. ఒకసారి మ్యాక్‌పై అలవాటు అయితే ఇక మరే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రుచించదు. ఒకసారి ఆ గ్రాఫిక్స్‌కు అలవాటు పడితే... 'రాజుని చూసిన కళ్లతో..' అనే సామెత గుర్తుకొస్తుంది. ఎక్కడైనా కంప్యూటర్‌ స్టోర్‌కి వెళితే ముందు నా కళ్ళు ఆపిల్‌ గురించి వెతుకుతాయి.  మొదటి సారి కంప్యూటర్‌ చూసిన అనుభూతి నుండి.. మొదటి సారి ఐఫోన్‌ టచ్‌ చేసిన ఫీలింగ్‌ వరకు ఏదైనా యాపిల్‌ మయమే. ఆ ప్రతి ఆవిష్కరణ వెనుక ఉన్న అత్యున్నత మేథస్సు గురించి నేనెప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఆ ప్రతిభా సంపన్నుడు స్టీవ్‌ జాబ్స్‌ మాత్రమే. ప్రతి సంవత్సరం కాలిఫోర్నియాలో జరిగే ఆపిల్‌ షోలో జరిగే కొత్త ఆవిష్కరణల కోసం నేనెప్పుడూ ఎదురుచూస్తూంటాను. అందులో జాబ్స్‌ మాట్లాడే ప్రతి మాటను నేను రికార్డ్‌ చేసుకుంటాను. తను సృజించిన ఆ కొత్త ఉత్పత్తి గురించి, జాబ్స్‌ వివరిస్తున్నపుడు ఆ కళ్ళలో కనిపించే మెరుపు, ఆ గొంతులో తారాడే చిన్నపాటి గర్వం... నాకెంతో స్ఫూర్తి నిస్తాయి. మ్యాక్‌, ఐఫోన్‌ ఉన్నంత కాలం ఆయన మన మధ్య బ్రతికే ఉంటారు..

యాపిల్ కంపెనీ తన వెబ్‌సైట్లో వుంచిన విచార సందేశంలో ఇలా పేర్కొంది... అది అక్షరాలా నిజం... 
Apple has lost visionary and creative genius, and the world has lost an amazing human being. Those of us who have been fortunate enough to know and work with Steve have lost a dear friend and an inspiring mentor. Steve leaves behind a company that only he could have built, and his spirit will forever be the foundation of Apple.

ఆ సృజనశీలికి...

ఆ నిరంతర కృషీవలునికి...

ఆ అద్భుత ఆవిష్కరణ కర్తకీ...



నా హృదయపూర్వక అశ్రు నివాళి.....

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.