Pages

Wednesday, December 23, 2015

మాంసం తినడం మనుషులకు తప్పనిసరి విషయం కాదు

        మాంసాహారం మీద దేశంలో చాలా పెద్ద దుమారం రేగుతోంది. మాంసం తినడాన్ని ఒక పెద్ద ఘన కార్యంగా, ఒక మత కార్యక్రమంగా కొందరు హడావుడి చేస్తుంటే, శాకాహారమే గొప్పదని, మంచిదని మరికొందరు వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, కొన్ని వేల సంవత్సరాలుగా మానవులు మాంసానికి అలవాటు పడ్డారని చరిత్ర చెబుతోంది. కాని ప్రకృతి పరంగా చూస్తే, మానవుడు శుద్ద శాకాహారి. మానవులు హోమో సాపియన్స్‌ అనే వానర జాతికి చెందిన వారని జీవ పరిణామ సిద్దాంతం చెబుతోంది. దీని ప్రకారం చూసుకుంటే, మానవులకి రూపంలో మరొక దగ్గరి జాతి అయిన కోతులు, చింపాజీలు, గొరిల్లాలు వంటివన్నీ పూర్తి శాకాహార జీవులే. అవి అడవులలో నివసిస్తూ, చెట్ల ఆకులను, పళ్ళను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాయి. అంటే అదే జీవజాతి నుండి పరిణామం చెందిన మానవులు కూడా ప్రకృతి పరంగా శాకాహారులుగానే పరిణామం చెంది వుంటారని భావించవచ్చు. దీనికి తోడుగా మానవుల జీర్ణ వ్యవస్థ కూడా శాకాహారానికి అనువుగా తయారు చేయబడింది అనేది అందరికీ తెలిసిన సత్యమే. మనం ఆకులను, పళ్లను, కాయలను ఎటువంటి పచనం చేయకుండానే, అంటే వండకుండానే హాయిగా తినగలుగుతాము. అవి తేలికగా జీర్ణం కూడా అవుతాయి. కాని, మాంసాన్ని ఉడకబెట్టకుండా / వేపకుండా ఎవరినైనా తినమనండి చూద్దాం... ఒకవేళ బలవంతంగా తిన్నా కూడా అది తేలికగా జీర్ణం కాదు సరికదా కొత్తరకం సమస్యలు పుట్టుకొస్తాయి. మనుషులు ప్రకృతి పరంగా శాకాహారులుగా సృష్టించబడ్డారు అని చెప్పడానికి ఈ ఒక్క కారణం చాలు.

    అయితే పరిణామ క్రమంలో మనిషి నిప్పుని తయారుచేయడం నేర్చుకున్న తరువాత, పెద్ద జనావాసాలు పుట్టుకువచ్చి, వారందరికీ, అడవిలో దొరికే పళ్ళు, కాయలు సరిపోని పక్షంలో మాత్రమే వేటాడడం నేర్చుకుని, ఆ జంతు మాంసాన్ని నిప్పులపై కాల్చుకుని తిని బ్రతకడం ద్వారా క్రమంగా మాంసాహారంవైపు మళ్ళారని మనం భావించవచ్చు. దీనికి ఇతమిత్థంగా ఎటువంటి సాక్ష్యాలు చూపించలేము గాని, మానవ శారీరక నిర్మాణ పరంగా ఇది వాస్తవంగా జరిగి ఉండవచ్చునని అనుకోవచ్చు.

    కొంత మంది మత పరంగా మాంసం తినవచ్చు అని వాదిస్తున్నారు. అటువంటి పుస్తక మతాల వారు (అంటే ప్రతి దానికి పుస్తకాల్లో వెతుకుతారు, మస్తకాలని ఖాళీగా పెడతారు) తమ పవిత్ర గ్రంధాలలో మాంసం తినమని ఉంది కాబట్టి అందరూ తినవచ్చు అని ఒక చెత్త వాదన చేస్తారు. దీనితో ఎవరూ ఏకీభవించనవసరం లేదు. ఎవరో ఎప్పుడో ఎవరి కోసమో రాసిన దానిని అందరూ ఆమోదించాలని రూలేమీ లేదు. అందుచేత నిరభ్యంతరంగా ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తినవచ్చు. ప్రత్యేకించి మాంసం తింటేనే స్వర్గంలో చోటు దొరుకుతుంది అని ఎక్కడైనా ఉంటే దాన్ని హాయిగా తిరస్కరించవచ్చు.

    పైన చెప్పిన ప్రాకృతిక కారణాలు, మత కారణాలు ఇవన్నీ పక్కన పెట్టి, మనసుతో ఆలోచించడం మొదలు పెడితే, మనం హాయిగా శాకాహారులుగా ఉండడమే సరైన పద్దతని మనకు అనిపిస్తుంది. ఎవరో నేర్పిన ఆలోచనలు, పద్దతులు, ఎక్కడో రాయబడ్డ రాతలు ఇవన్నీ వదిలేయండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి... ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి... ప్రకృతిలో మనతో పాటుగా సృష్టించబడిన ఒక అందమైన ప్రాణిని ఊహించుకోండి... అది కోడి లాంటి పక్షి కావచ్చు. మేక, కుందేలు, ఆవు లాంటి పెద్ద జంతువు కావచ్చు... లేదా చేప వంటి ఈదే ప్రాణి కావచ్చు. అది కూడా మనిషిలాగానే ఎంతో జాగ్రత్తగా తయారుచేయబడింది.  ఎటువంటి లోపాలు లేకుండా... దాని మానాన అది బ్రతుకుతుంది... ఆహారం సంపాదించుకుంటోంది... తన లాంటి పిల్లల్ని తయారుచేసుకుని, సృష్టిక్రమంలో ముందుకు వెళుతోంది. ఎంతో అమాయకంగా ఉంటుంది. దానిలో మన పట్ల ఎటువంటి ద్వేషం, కోపం, అసూయ ఏమీ లేవు. అలాంటి ఒక ప్రాణిని తీసుకువచ్చి, అత్యంత కిరాతకంగా పదునైన కత్తితో నరికి, దాని రక్తాన్ని చిందించి, క్రూరంగా మాంసం కోసి తినడం అవసరమా? కేవలం ఒక పూట మన ఆకలి తీరడం కోసం ప్రకృతి ఎంతో అపురూపంగా సృజించిన చిన్ని ప్రాణిని బలి తీసుకోవడం అవసరమా? మనకు ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతాం కదా... అటువంటిది ఆ నిస్సహాయ జీవి గొంతు కోసి, రక్తం ఓడుతూ, గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందించడం ఎంత హేయమైన చర్య? మనందరం మనుషులమే కదా... కరుణ, జాలి, దయ, ప్రేమ అనేవి మనుషులకు మాత్రమే ఉంటాయి అంటే ఎవరూ నమ్మకండి. సకల జీవరాశులకు అవన్నీ ఉంటాయి. తమ సంతానం పట్ల అవి ప్రేమ కలిగిఉంటాయి. సాటి జంతువు కష్టాల్లో ఉంటే, తమకు చేతనయిన సాయం చేస్తాయి. బాధ వస్తే దీనంగా అరుస్తాయి, సంతోషం కలిగితే చెంగు చెంగు మని గంతులేస్తాయి. ఎవరైనా తమ మీద దాడి చేయాలని చూస్తే ప్రతిఘటిస్తాయి లేదా భయంతో పరుగుపెడతాయి. అంటే వాటికి కూడా మనసు ఉంటుందన్న మాటే కదా... తమ భావాల్ని పైకి మాటల రూపంలో చెప్పలేనంత మాత్రాన, ఎదురు ప్రశ్నించలేనంత మాత్రాన వాటిని చంపి తినడం మా జన్మ హక్కు అంటే సాటి ప్రాణి జీవించే హక్కుల్ని కాలరాసినట్లే కదా...

    శాకాహారం మాత్రమే తినాలి అనేది ఒక ఉద్యమంగా ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాల్లో మొదలయ్యింది. దీనికి మత పరమైన ప్రాధాన్యత ఏదీ లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్లు సాటి ప్రాణిని హింసించి, చంపి, మన ఆకలిని తీర్చుకోవడం అనేది మనసు ఎంతో బాధ కలిగించే విషయం. సున్నితమైన మనసు ఉన్న వారెవరైనా శాకాహారులుగా మారవచ్చు. ఇది బలవంతంగా తమ ఆహారపు ఆలవాట్లను మార్చుకోవడం కాదు. లేదా ఏదో కారణం చెప్పి, కొన్ని రోజులు మానేసి, తిరిగి తినడం కాదు. మాంసాహారంపై పూర్తి విరక్తి చెంది, మానసికంగా పూర్తిగా వ్యతిరేకించుకుని, జీవితంలో మరెప్పుడే మాంసాహారం వైపు చూడకుండా ఉండడం.

    మరొక ముఖ్యమైన ఉద్యమం 'వెగాన్‌'. పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడిపుడే ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. వెగాన్‌గా మారిన వారు కేవలం మాంసాహారం మానివేయడం కాకుండా, జంతువుల నుండి వచ్చే ఏ విధమైన ఆహారాన్నయినా, వస్తువునయినా వాడకపోవడం. అంటే పాలు, తేనె వంటివి కూడా తినకపోవడం. జంతు చర్మాలతో చేసిన బెల్టులు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, తోలు చెప్పులు వంటి వాటికి దూరంగా ఉండడం. ఒక సున్నితమైన మనసు కలిగిన మనిషికి ఒక జంతువు చర్మంతో చేసిన చెప్పులపై నడిచినపుడు లేదా బెల్టు పెట్టుకున్నపుడు ఆ జంతువు బాధను తాను ఫీల్‌ అవ్వగలుగుతాడు. అటువంటి వారు జంతువుల నుండి వచ్చిన ఏ ఉత్పత్తినీ ఆనందంగా ఉపయోగించలేరు. ఎంతో మంది హాలీవుడ్‌ ప్రముఖులు ఈ వేగాన్ల జాబితాలో చేరిపోయారు. టైటానిక్‌, అవతార్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌, ప్రముఖ కథానాయిక పామెలా ఆండెర్సన్‌, డెమీ మూర్‌ వంటి వారు ఎంతో మంది శాకాహారులుగా మారిపోయారు.


    ప్రకృతిలో జంతువులకు లేనిది, మనుషులకు మాత్రమే ఉండేది మనసు, ఆలోచన. జంతువులు కేవలం తమ ధర్మాన్ని  బట్టి ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే లేడి గడ్డి తినడం, పులి లేడి తినడం వంటివి. వాటికి ఆలోచన ఉండదు. ఆకలేస్తే, ప్రకృతిపరంగా తమ ఆహారాన్ని తాము సంపాదించుకుంటాయి. అది శాకమైనా, మాంసమైనా... కాని మనిషి మాత్రమే తనకు ఆకలేస్తే ఏమి తినాలో నిర్ణయించుకోగలడు. అలా సంపాందిచుకున్న ఆహారం ఎలా ఉండాలో మనిషి మాత్రమే కోరుకోగలడు. అందుచేత మనందరం ఏదైనా ఆహారాన్ని తినాలనుకున్నప్పుడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే, ఏది తినాలో మన మనసుకే తెలిసిపోతుంది.  దీనికోసం సిద్ధాంతాలు చేయనక్కర్లేదు, మత గ్రంధాలు తిరగెయ్యనక్కర్లేదు, వాదోపవాదాలకి దిగనవసరం కూడా లేదు.
  ''అహింసా పరమో ధర్మః''

Tuesday, August 18, 2015

'నారాయణ' భూతానికి బలయిపోయిన మరో రెండు నిండు జీవితాలు

    కార్పొరేట్‌ కాలేజీల ధన దాహానికి, తల్లిదండ్రుల మూర్ఖత్వానికి పరాకాష్టగా, సజీవ ఉదాహరణగా నిలుస్తూ, మరో రెండు జీవితాలు అర్థంతరంగా ముగిసిపోయాయి. చెట్టు పేరు చెప్పుకుని, కాయలు అమ్ముకునే రెండు విద్యాసంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ఊడల్లా పాతుకుపోయి, ఇప్పుడు విషనాగుల్లా విద్యార్దుల్ని కాటువేస్తున్నాయి. మొత్తం జరిగిన విషయమంతా రాజకీయ రంగు పులుముకుని, విద్యార్దినులే తప్పు చేసారని, వారి ప్రేమ వ్యవహారాలే వారి ఆత్మహత్యలకు కారణమని నిరూపించడానికి రంగం సిద్దమవుతోంది. మహాభారతంలో బకాసురుడు అనే రాక్షసుడిని రోజుకి ఒకరిని మాత్రమే తినడానికి అనుమతించి, ఊరిలో నుండి ప్రతి రోజు ఒక్కో ఇంటి నుండి ఆ రాక్షసుడికి ఆహారంగా పంపించేవారట. అలాగే ప్రతి సంవత్సరం తల్లిదండ్రులందరూ కూడబలుక్కుని, ఒక్కో ఊరి నుండి ఒక్కొక్కరి చొప్పున చైతన్య నారాయణ కాలేజీలకు ఆత్మహత్యలు చేసుకోవడానికి పంపిస్తున్నట్టుగా పరిస్దితి తయారయ్యింది.

    ఇటువంటి సంఘటనలు జరగడానికి కాలేజీ యాజమాన్యాలది ఎంత తప్పు ఉందో, తల్లిదండ్రులదీ అంతకన్నా ఎక్కువ తప్పు ఉంది. తమ పిల్లలు ఎంత ఎక్కువ సేపు చదివితే అంత గొప్ప వారయిపోతారని, ఎన్ని ఎక్కువ పుస్తకాలు మోసుకెళితే అంత పెద్ద స్కూల్లో చదువుతున్నట్టుగా భావించే తల్లిదండ్రులకు ఈ సమాజంలో కొదవ లేదు. సాయంత్రం 5 గం||లకు కాలేజీ విడిచిపెడితే, మర్నాడు కనీసం ఐదారుగురు పేరెంట్స్‌ దగ్గర నుండి నాకు ఫోన్‌ కాల్స్‌ వచ్చేసేవి. అదేమిటండీ, మా అమ్మాయిని ఐదింటికే పంపించేసారు. స్టడీ అవర్స్‌ పెట్టి ఎనిమిది గంటలకు పంపించ వచ్చు కదా అని. ''అవసరం లేదండీ, హోమ్‌వర్క్‌తో సహా అన్నీ ఇక్కడే చేయించేసాము'' అని చెబితే, ఏదో బాగా చదువు చెబుతారని పంపిస్తే, స్టడీ అవర్స్‌ పెట్టకుండా తప్పించుకుంటున్నారు అని అభాండాలు వేసే వారు. దీన్ని బట్టి తల్లిదండ్రుల అవగాహనను ఈ ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఎంతగా కలుషితం చేసారో అర్థం చేసుకోవచ్చు. మీరు మా పిల్లల్ని ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం బాగా చదవాలి, ఎక్కువ మార్కులు రావాలి అనే వారిని మనం ఏం చేయాలి? మంచి చెబితే ఎవరు అర్థం చేసుకుంటారు?

    చదువు అనేది పుస్తకాల్ని బట్టీ పట్టడం ద్వారా రాదు. అవగాహన ద్వారా మాత్రమే చదువు వస్తుంది. విషయాన్ని అవగాహన చేసుకోకుండా బట్టీ పట్టిస్తే చదువు రావడం మాట అటుంచి, కళ్ళజోడు, వెన్ను నొప్పి వస్తుంది. ఎక్కువ సేపు చదివితేనే చదువు వస్తుంది అనేది ఒట్టి భ్రమ మాత్రమే. తల్లిదండ్రులకి ఇటువంటి తప్పుడు అభిప్రాయం రావడంలో ప్రైవేటు విద్యాసంస్థలు నూరు శాతం సక్సెస్‌ అయ్యాయి. ఎందుకంటే చాలా విద్యాసంస్థల్లో సరైన అర్హతలు కలిగిన బోధకులు ఉండరు. అది కాలేజ్‌ కానివ్వండి, స్కూల్‌ కానివ్వండి. వారికి తెలిసిందల్లా పిల్లల్ని కూర్చోబెట్టి సాధ్యమైనంత ఎక్కువ సేపు చదివించడం. ఎందుకంటే ఆ పుస్తకంలో ఏముందో ఆ బోధకులకే పూర్తిగా అవగాహన ఉండదు. వాళ్ళు కూడా అలా చదివి పాసయిన బాపతే అయి ఉంటారు. ఇంక వారి నుండి పిల్లలు ఏదో నేర్చుకుంటారు అనడం దురాశే అవుతుంది. ఇక కోళ్ళ ఫారాలు (కార్పొరేట్‌ కాలేజీలు) సంగతి చెప్పనక్కర్లేదు. ఎక్కడో ఒక బ్రాంచిలో వచ్చిన ర్యాంకుల్ని చూపించి, లేదా మరో కాలేజీలో వచ్చిన ర్యాంకుల్ని డబ్బులిచ్చి కొని, వాటిని తమ ర్యాంకులుగా రాష్ట్రమంతటా ప్రచారం చేస్తారు. గొర్రెలమందల్లాంటి తల్లిదండ్రులు తమ ఊరిలో ఉన్న ఆ బ్రాంచికి అనుమతులు ఉన్నాయా లేవా, కనీసం అక్కడ అర్హత కలిగిన ఉపాధ్యాయుల ఉన్నారా లేదా, కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే విషయాలు ఏమీ పట్టించుకోకుండా తమ పిల్లల్ని అక్కడ జాయిన్‌ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ స్టేటస్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ''మా అబ్బాయిని చైతన్యలో జాయిన్‌ చేసామండీ... మా అమ్మాయి నారాయణలో చదువుతుందండీ...'' వంటి స్టేటస్‌ని ప్రతిబింబించే మాటల్ని వింటూ ఉంటాం. వాటితో పాటుగా ''అదేమిటీ? మీ పిల్లలు మన ఊరి స్కూల్లో చదవడం ఏమిటి?'' వంటి ఎత్తిపొడుపు మాటలు కూడా వింటూంటాం. పిల్లలు తెలివైన వారయితే, చెప్పే బోధకులు సరైన అర్హతలు కలిగిన వారయితే,  వారు ఇంటి పక్కన స్కూల్లో చదువుకున్నా చదువు వస్తుంది. ఒక్క తాడేపల్లిగూడెం పట్టణం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది చక్కటి స్కూల్స్‌ నడుపుతూ, మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అలంపురం, పెదతాడేపల్లి, నారాయణపురం వంటి గ్రామాల్లో చాలా విద్యాలయాల్లో ఎంతో మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో 10కి 10 పాయింట్లు సాధించారు.

    ఇదే విషయాన్ని మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌ కలాం గారు తన జీవితంలో సాధించి చూపించారు. ఎక్కడో రామేశ్వరం అనే చిన్న పల్లెటూరిలో పుట్టి, రోజు 6 కిలోమీటర్లు నడిచి, పట్టుదలతో దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తెరిగి, వేలకు వేలు ఫీజులు చెల్లించినంత మాత్రాన తమ పనయిపోయింది అనుకోకుండా, పిల్లల బాగోగుల్ని ఎప్పుడూ శ్రద్దగా గమనిస్తూ, వారికి ఎదురయ్యే ఇబ్బందుల్ని జాగ్రత్తగా వింటూ ఉండాలి. తగిన పరిష్కారం కోసం ఆలోచించాలి. అంతేగాని, ఏదో పెద్ద కార్పొరేట్‌ స్కూల్‌ లేదా కాలేజ్‌లో పిలల్ని జాయిన్‌ చేసారు కాబట్టి, ఒక టి.వి., ఫ్రిజ్‌ వంటి వస్తువులు ఆటోమేటిక్‌గా తయారయి వచ్చేసినట్టు తమ పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా ఇంజినీర్‌గానో, డాక్టర్‌గానో తయారయి వచ్చేస్తారు అనుకోవడం దురాశే అవుతుంది. తల్లిదండ్రుల దురాశను, అజ్ఞానాన్ని గమనించే, విద్యారంగంలో కూడా కార్పొరేట్‌ విష సంస్క ృతి వేళ్ళూనుకుంటుంది. దయ చేసి, తల్లిదండ్రులు కూడా దురాశకి పోకుండా, పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేసి, వారికి నిజంగా ఇష్టమున్న రంగంలో ఎదిగేలా ప్రోత్సహించాలని కోరుతున్నాను. అలాగే బండ బట్టీ చేస్తేనే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారనే భ్రమలో నుండి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం ఇది చదివిన వారిలో కొంత మందయినా మారతారని ఆశిస్తున్నాను. ఈ విధంగానైనా ఒక్క చిట్టితల్లి ప్రాణాన్ని కాపాడగలిగినా నా ప్రయత్నం సఫలమయినట్లే.

Tuesday, July 7, 2015

మద్యం వ్యాపారానికి - హిందూ దేవాలయాలకి పోలిక తెచ్చిన వాళ్ళను ఏమనాలి?

    తన మతం మాత్రమే గొప్పది, తను చెప్పిందే అందరూ ఒప్పుకోవాలని భావించే ఒక వ్యక్తి విగ్రహారాధనను ఒక భయంకరమైన పాపంగాను, విగ్రహారాధన చేయడం ఎంతో ఘోరమైన నేరంగాను ప్రచారం చేస్తున్నారు. భగవద్గీతలో విగ్రహారాధన గురించి ఉందా అని సవాల్‌ చేస్తున్నారు. అలా సవాల్‌ చేసిన వ్యక్తి ఇంటిపేరును బట్టి ఒకప్పుడు ఆయన కూడా హిందువు అనే విషయం అర్థం అవుతుంది. ఆయన మాత్రమే కాదు, ఇప్పుడు మన దేశంలోనే ఉంటూ, ఇక్కడి సంస్కృతిని, జీవన విధానాన్ని మంట కలపాలనే ఆరాటం ఉన్న అనేక మంది కూడా ఒకప్పుడు హిందువులే అన్న విషయం మరువకూడదు. వారి పూర్వీకులు ప్రలోభాలకు లొంగడం వల్లగాని, బలవంతంగా హింస ద్వారాగాని మతం మార్చబడ్డారు. ఇందుకు ఎటువంటి సందేహం లేదు. చరిత్ర చదివితే విషయం అర్థం అవుతుంది. తమ శరీరంలో పూర్వీకుల హిందూ రక్తం ప్రవహిస్తున్నప్పటికీ, అటువంటి వారు నిజంగానే తాము పరాయి మతాలకు నిజమైన ప్రతినిధులమని చంకలు గుద్దుకుంటూ, ప్రచారం చేయడం, వారికి ప్రాతినిధ్యం వహించడం భావదాస్యం తప్ప మరొకటి కాదు. తమ మతాన్ని ప్రచారం చేసుకోవడం, దాని గొప్పదనాన్ని అందరికీ చెప్పుకోవడం ఎప్పటికీ తప్పుకాదు. కాని ఆ ముసుగులో ఎదుటి వారి గురించి, వారి ఆరాధనా పద్దతుల గురించి చులకనగా మాట్లాడడం, వారికి సవాల్‌ విసరడం అహంకారం తప్ప మరేమీ కాదు. ఒకవేళ అలా మాట్లాడాలి అంటే, ఎదుటి వారి మతాన్ని గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. అలా సంపూర్ణంగా వైదిక ధర్మాన్ని గురించి తెలుసుకోవడం ఎవ్వరి వల్లా కాదు. ఎందుకంటే ఇది అత్యంత సనాతనమైనది, ఎన్నో ఆలోచనల పరంపరలో నుండి వచ్చింది. ఈ భారతీయ వైదిక ధర్మం ఎవ్వరి మీదా ఆధారపడింది కాదు, ఏ ఒక్కరి బలవంతం మీదనో ఆచరింపబడేది కాదు. ఏదో ఒక్క వాక్యం మీదనో, పుస్తకం మీదనో నిలిచింది కాదు. దీనికి మొదలు లేదు, అంతం కూడా ఉండదు. కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టి, ఒక ప్రవక్త లేదా మత బోధకుడు చెప్పిన విషయం మీదనో, వారు సంకలనం చేసిన పుస్తకం మీదనో ఆధారపడ్డ మతానికి అంత గొప్పదనం ఉంటే, కొన్ని వేల సంవత్సరాలుగా మనుగడలో ఉంటూ, ఎన్నో వందల మంది మహర్షులు దర్శించిన నిస్వార్థమైన సత్యానికి, మానవ సంక్షేమం కోసం వారు పడ్డ తపనకు ఇంకెంత విలువ ఉండాలి. మీ దగ్గర ఉన్నది కేవలం ఒక పుస్తకం మాత్రమే. కాని వైదిక ధర్మంలో ఉన్నవి నాలుగు వేదాలు (ఒక్కొక్క వేదాన్ని అధ్యయం చేయడానికి కనీసం 12 సంవత్సరాలు పడుతుందనేది పండితుల అంచనా), 108 ఉపనిషత్తులు, 6 వేదాంగాలు, 18 పురాణాలు, లక్ష శ్లోకాల మహాభారతం, 24 వేల శ్లోకాల రామాయణం, ఇవికాక సర్వ మానవాళికి మార్గనిర్దేశనం చేసే భగవద్గీత - వెరశి ఒక పెద్ద లైబ్రరీ ఉంది. కొన్ని వేల పుస్తకాలు, వేల ధర్మ సందేహాలు, వాటికి  వివరణలు, ఎక్కడా ఎవరినీ బలవంతంగా, ప్రలోభపెట్టి, ప్రచారం చేయమనే ఆదేశాలు లేకుండా ప్రపంచమంతటా ఆచరించేలా చేయగలిగిన ఘనత వైదిక ధర్మానిది. ముందు వాటిని కూలంకషంగా చదవండి, ఆలోచించండి. మన మతమే గొప్పది అనే సంకుచితత్వం వదిలి, అప్పుడు చదవండి, నిజమైన సత్యం, జ్ఞానం మీ ముందుకు వస్తుంది.

    విగ్రహారాధన మహాపాపం అంటూ ఊదరగొడుతున్నారు. దీనికి ప్రతిపాదిక ఏమిటి? మీ గ్రంధంలో చెప్పబడిన వాక్యమా?      ''నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని నిన్ను ప్రేరేపించిన యెడల వారిని కటాక్షించ కూడదు. అవశ్యముగా వారిని చంపవలెను. రాళ్ళతో చావగొట్టవలెను.''   ద్వితీయోపదేశము 13 : 6,10 (బైబిలు పాత నిబంధనల గ్రంధం - ఇదే క్రైస్తవులకు, ముస్లింలకు కూడా మూలాధారం). ఎదుటి మనిషిని చంపమని చెప్పి, దాన్ని దేవుని వాక్యంగా చెలామణి చేస్తున్న వారిది  నిజంగా మానవత్వమేనా? ఇటువంటి వాటిని దేవుని మాటలుగా ఒప్పుకోవడం సాధ్యమవుతుందా? సర్వమానవాళి మాత్రమే కాకుండా సర్వ సృష్టిలో ప్రాణులన్నీ సుఖంగా ఉండాలనే వేద వాక్యం ''సర్వేత్ర స్సుఖినస్సన్తు - సర్వే సన్తు నిరామయా - సర్వే భద్రాణి పశ్యన్తు'' అనే భావనతో మీ గ్రంధాన్ని పోల్చగలమా?

    దేవుడి గురించిన భావనల్లో వైదిక ఆలోచనలకి, మిగతా వ్యాపార మతాలకి ఎంతో వ్యత్యాసం ఉంది. వారి ఆలోచనల్లో దేవుడు అంటే ఎక్కడో ఒక లోకంలో మానవ రూపంలో ఉంటాడు. అక్కడకి చేరడం, ఆ లోకంలో దేవుడితో కలిసి జీవించడం మాత్రమే మానవ జీవిత ప్రధాన లక్ష్యం కావాలి. అందుకోసం ఎదుటి మనిషిని చంపినా తప్పులేదు, తమ మతానికి విధేయులై ఉండడం, దేవుడిని నమ్మి, విశ్వాసిగా ఉండడం మాత్రమే కావలసింది. ఇక్కడ ధర్మం గాని, మానవ జీవిత విలువల గురించి ప్రస్తావన గాని ఉండవు. దైవ బోధకుడుగా స్వీయ ప్రకటన చేసుకున్న వ్యక్తి చెప్పిందే అంతిమం. దాన్ని ఎదురు ప్రశ్నించడానికి వీలు లేదు. అలా చేస్తే దైవ ద్రోహం చేసినట్లే.

    వైదిక ధర్మంలో మాత్రం దేవుడు సర్వాంతర్యామి. ఆయన వ్యక్తి కాదు - ఒక శక్తి. ఆ శక్తికి రూపం లేదు - ఆయన సాకారుడు, నిరాకారుడు. ''అదృశ్యో వ్యక్త రూపశ్చ'' (విష్ణు సహస్ర నామం)లో చెప్పినట్లు ఆయన అదృశ్యంగాను ఉంటాడు మరియు మనం కోరినపుడు కావలసిన రూపంలో వ్యక్తం కూడా అవుతాడు. అంటే మనం ధ్యానించిన, ఉపాసించిన రూపంలో కూడా దర్శనమిస్తాడు.  ''సహస్ర మూర్థా'' అనే విష్ణు సహస్రనామంలో ఆయన అనంతమైన రూపాలు కలవాడు. ఏ రూపమైనా ఆ దేవుడికి సంబంధించనదే. ఏ రూపంలో ఆరాధించినా ఆయనకే చెందుతాయి.  ''యేప్యన్య దేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః | తేపి మామేవ కౌన్తేయ యజన్త్య విధిపూర్వకమ్‌ ||'' భగవద్గీత 9 అ. 23 శ్లో. దీని అర్థం - అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్దతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకరముగా నన్నే పూజించువారగుచున్నారు. ఎవరు దైవాన్ని ఏ రూపంలో కొలిచినా, ఏ రూపంలో పూజించినా గాని అవి చివరికి చేరేవి ఆ పరమాత్మకి మాత్రమే. ఇక్కడ గమ్యం ప్రధానం గాని, చేరే వాహనాలు ముఖ్యం కావు. కొందరు కాలి నడకన గమ్యాన్ని చేరుకోవడానికి వెళ్ళవచ్చు. మరికొందరు వారి స్థోమతను బట్టి సైకిల్‌ మీదగాని, బైక్‌ మీదగాని, కారు మీద గాని వెళ్ళవచ్చు. మరికొందరు విమానంలో వెళ్ళవచ్చు. చేరే సమయంలో తేడాలు ఉండవచ్చుగాని, పట్టుదలగా వెళితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. అంతమాత్రం చేత విమానంలో వెళ్ళే వాడు మిగతా వాహనాల్లో వెళ్ళే వారిని అవహేళన చేస్తే, అది అతని అవగాహనా రాహిత్యాన్ని, అహంకారాన్ని మాత్రమే సూచిస్తుంది. భాగవతంలో ప్రహ్లాదుడు, హిరణ్య కశిపునికి దేవుని గురించి చెప్పే సందర్భంలో ''ఇందుగలడందు లేడని సందేహము వలదు - చక్రి సర్వోపగతుండు - ఎందెందు వెతికి చేసిన అందందే గలడు వింటె దానవాగ్రణీ'' అంటాడు. అపుడు హిరణ్య కశిపుడు అహంకారంతో ఎక్కడైనా శ్రీహరి ఉంటే ఈ స్థంభంలో ఉన్నాడా'' అని ప్రశ్నించి, ఆ స్థంభాన్ని గదతో మోదుతాడు. అక్కడ శ్రీహరి నరసింహావతారంలో ప్రత్యక్షమై, అతనిని సంహరిస్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, భగవంతుడు సర్వాంతర్యామి. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎక్కడైనా కనుగొనవచ్చు. దీనికి కావలసింది పుస్తక జ్ఞానం, పాండిత్యం కాదు, అనన్యమైన భక్తి మాత్రమే. దేవుడు ఏ  పుస్తకాల్లో ఉన్నాడు, ఏ మత గ్రంధం నిజం, విగ్రహారాధన చేస్తేనే దేవుడు కనిపిస్తాడా, లేదా అల్లానో, యెహోవానో, క్రీస్తునో బుద్దుడినో పూజిస్తేనే దేవుడు కనబడతాడా అనేవి నిజానికి అర్థం లేని ప్రశ్నలు. అణువు నుండి బ్రహ్మాండం వరకు నిండి ఉన్నది దేవుడనే మహాశక్తి మాత్రమే. అది రాతి విగ్రహం కావచ్చు, లేదా మన మనస్సు కావచ్చు. ఏదైనా ఆయన నుండి ఉద్భవించినవే. ఇక్కడ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే కుతర్కం అనవసరం. విష్ణు సహస్రనామంలో ''వాసనాత్‌ వాసు దేవస్య వాసితం భువన త్రయం, సర్వ భూత నివాసోసి, వాసుదేవ నమోస్తుతే'' అనే శ్లోకం ప్రకారం, దేవుడనే మహాశక్తి ముల్లోకాల్లోను ఉంటాడు, మరలా ముల్లోకాలూ ఆయనలోనే నివసిస్తూ ఉంటాయి. సర్వ కాల సర్వావస్థల్లోను ఆయనలో నుండే ఈ సర్వ సృష్టి ఉద్భవిస్తూ, పోషించబడుతూ, లయం కాబడుతున్నది. ఈ అద్భుతమైన భావనని అర్థం చేసుకుంటే, విగ్రహారాధన పాపం అనే మాటే అర్థం లేనిది అనిపిస్తుంది.

    విగ్రహారాధన అనేది అతి ప్రాచీనమైనది. పుస్తక దేవుళ్ళు (పేపర్‌ గాడ్స్‌ - వీరి గురించి తరువాత వివరిస్తాను) పుట్టక ముందు నుండే విగ్రహారాధన ప్రపంచ వ్యాప్తమైనది. ప్రపంచంలో ఇంచు మించు అన్ని ప్రాంతాల్లోను ప్రాచీన విగ్రహాలు, కనిపిస్తాయి. కంటికి కనిపించని దైవాన్ని, కంటి ముందు ఒక రూపం ఏర్పరుచుకుని, ఆ రూపంతో మమేకమైనట్లుగా భావించడం అతి ప్రాచీన సాంప్రదాయం. అది నేటికీ అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. వైదిక ధర్మంలో విగ్రహారాధన ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు. కాని, విగ్రహ ప్రతిష్ట అనేది ఒక శాస్త్రీయ ప్రక్రియ. సరైన శిలను ఎంపిక చేసుకోవడం దగ్గర నుండి, దాన్ని ఏఏ కొలతల ప్రకారం శిల్పంగా మలచాలి, ఆ మలచిన శిల్పాన్ని ఏ విధమైన ఆలయంలో ప్రతిష్టించాలి, దానికి చేయాల్సిన క్రతువులు, శిల్పానికి ప్రాణ ప్రతిష్ట చేసి, భగవంతుని విగ్రహ రూపంగా మర్చే తంతులో ఎటువంటి ప్రక్రియను అవలంభించాలి అనేది ఒక ప్రత్యేక శాస్త్రం. మరలా విగ్రహ ప్రతిష్టాపనకు కూడా వివిధ బేధాలున్నాయి. వైఖానస ఆగమనం, శైవాగమం, పాంచరాత్ర ఆగమం, మిశ్రమ తంత్ర విధానం వంటి ప్రక్రియలు విశ్వం అంతటా నిండి ఉన్న దైవిక శక్తిని విగ్రహ రూపంలోకి ఎలా మార్చాలో శాస్త్రీయంగా వివరిస్తున్నాయి. ఇవన్నీ తప్పు అని ఒక్కమాటతో కొట్టిపారేయడం ఎలా సాధ్యమవుతుంది? ఎవరో కొందరు చెప్పిన మాటలు పట్టుకుని, విగ్రహారాధకులు అందరూ మూఢులు అని మూకుమ్మడిగా తీర్మానించేయడం సాధ్యం కాదు. మిగతా మతాల్లో పోప్‌గాని, ముల్లాగాని చెబితే అందరూ ఆచరించవచ్చేమో గాని, హిందూ సంస్కృతిలో మాత్రం వ్యక్తిదే నిర్ణయం. ఒక హిందువు ఎవరి మాటా విననవసరం లేదు. ఏ పుస్తకాన్ని చదవనవసరం లేదు, ఎవరి భావాలకో బానిసగా పడి ఉండాల్సిన ఖర్మ అంతకన్నా లేదు. అతని మతం మానవత్వం. తనకి, తన కుటుంబానికి, తను నివసించే సమాజానికి, దేశానికి, అంతిమంగా తనకు అన్నీ సమకూర్చే ప్రకృతికి అతడు ఎప్పుడూ విధేయుడై ఉంటాడు. ఎవరికీ హాని కలిగించకుండా, తన ధర్మాన్ని నెరవేర్చుకుంటూ, సమాజం పట్ల తన ధర్మాన్ని నెరవేరుస్తూ, ప్రకృతికి సహకరిస్తూ ఉంటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తన ధర్మాన్ని నెరవేర్చినంత కాలం, తన విధిని సక్రమంగా నిర్వహించినంత కాలం ఏ దేవుడినీ తనకు ఇది కావాలి అని ప్రాధేయపడడు. దైవం తన అర్హతను బట్టి తనకు ప్రసాదించే దేన్నయినా మహా ప్రసాదంగా స్వీకరిస్తాడు. ధర్మాన్ని రక్షిస్తే అది తనను రక్షిస్తుందని త్రికరణ శుద్ధిగా నమ్ముతాడు. ధర్మో రక్షతి రక్షితః

Monday, March 2, 2015

సంక్షోభం ముంగిట్లో భారత ఆర్థిక వ్యవస్థ

     ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ ప్రభుత్వం ఇపుడు ప్రజలందరి ఆశల్నీ అడియాశలు చేసింది. భారతదేశానికి ఒక కొత్త దిశా నిర్దేశం చేస్తారనుకుంటే, ఇది కూడా 'ఆ తానులో ముక్కే' అని ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ నిరూపించింది. 'సీసా కొత్తది అయినప్పటికీ నీరు మాత్రం పాతదే' అనే సామెతను అనుసరించి, అవే ఆధార్‌ కార్డులు, అవే గ్యాస్‌ సబ్సిడీ కష్టాలు, అవే డీజిల్‌, పెట్రోల్‌పై బాదుడు, అదే ట్యాక్స్‌ల పెంపుదల. ఇక్కడ కొత్తగా ఏదైనా కనిపిస్తుందేమోనని ఎంతో ఎదురు చూసాం. కాని ఉపయోగం లేకుండా పోయింది. అభివృద్ధి అంటే ప్రజలపై కొత్త పన్నుల్ని విధించడమే అనే మూస ధోరణితోనే ఈ బడ్జెట్‌ వచ్చింది. ఈ విషయంలో నేను గతంలో ఇదే బ్లాగ్‌లో చేసిన పోస్ట్‌ల విషయమై మీ అందర్నీ తప్పుదోవ పట్టించినందుకు విచారిస్తున్నాను. మోడీ ప్రధాని అయితే ఇలా చేయబోతున్నారు, అలా చేయబోతున్నారు, ఆర్థిక సంస్కరణలు తీసుకురాబోతున్నారని ఎంతో వ్రాసాను. కాని అవేవీ నిజం కాదని, ఇప్పుడు నేను బాధపడుతున్నాను.

    ఆధునిక నాగరికత, పరిశోధనల ఫలితంగా పాశ్చాత్యదేశాల్లో ప్రకృతి వనరుల విధ్వంసం మొదలయింది. యంత్రాల సహాయంతో రకరకాల వస్తువులని తయారు చేసి, వాటిని అమ్మడం మాత్రమే వ్యాపారం చేయడం, వాటిని వాడడం మాత్రమే నాగరికత అనే విష వలయాన్ని సృష్టించారు. 16వ శతాబ్దంలో బ్రిటన్‌లో ఆవిరియంత్రం కనిపెట్టడం మొదలుకొని, నేటి వరకు పాశ్చాత్య దేశాలన్నీ ఈ అంశం చుట్టూనే తిరిగాయి. ఎందుకంటే వారికి ఎటువంటి పంటలు పండవు. పండినా వాటి ద్వారా వచ్చే ఎందుకూ సరిపోదు. అందుకే వారు పరిశోధనలు చేసి, కొత్త వస్తువులు కనుక్కుంటూ, వాటిని ప్రపంచంలో మిగిలిన దేశాలకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇదే వారి ఆర్థిక వ్యవస్థ కూడా.

    కాని, ఈ పాశ్చాత్య ఆర్థిక నమూనాకి ఒక పరిమితి ఉంది. ప్రకృతిలో వనరులు పరిమితం. దానితో అపరిమితమైన వ్యాపారం చేయలేము. వస్తూత్పత్తిలో ఎప్పటికప్పుడు కొత్త నమూనాల్ని ఆవిష్కరించగలగాలి. అప్పుడే కొత్త వ్యాపారం ప్రారంభమవుతుంది. మరలా కొన్నాళ్ళకి ఆ ఉత్పత్తి పాతబడిపోతుంది. అపుడు వ్యాపారం ఆగిపోతుంది. దాన్ని నమ్ముకున్న కుటుంబాలు, దేశాలు, వీధిపాలవుతాయి. ఆర్థిక వ్యవస్థ మరలా శూన్యానికి చేరుకుంటుంది. లేదా వస్తూత్పత్తికి అవసరమైన వనరులు తరిగిపోతాయి. అప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఇది చరిత్ర మనకు నేర్పుతున్న పాఠం.

    భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తి విరుద్దమైనది. అత్యంత పురాతనమైన, సాంప్రదాయకమైనది కూడా. ఇది ఎన్నో రకాల ప్రభుత్వాలను, పాలకుల్ని, పన్ను విధానాల్ని తట్టుకుని నిలబడింది. ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న తరుణంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ తనదైన ప్రత్యేకత నిలబెట్టుకుని, వృద్ధి పథంలో పయనించింది. దీనికి కారణం, భారతదేశ జనాభాలో ఎక్కువ మంది భూమిపై, అంటే వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. సువిశాలమైన పంట భూములు, విస్తారమైన నీటి వనరులు,  ఎన్నో రకాలైన పంటలు పండించగలిగే నేల రకాలు, రైతులు అందరూ కలిసి భారతావనిని సస్యశ్యామల దేశంగా మార్చాయి. భూమిని, పంచభూతాలను, ప్రకృతిని దైవ స్వరూపంగా ఎంచే నాగరికత కలిగిన దేశం కావడం వలన, ప్రజలు ప్రకృతికి ఎటువంటి హాని చేయకుండా, ఇన్ని వేల సంవత్సరాలుగా జీవనం సాగించారు.

    ఇపుడు మోడీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను రూపు మార్చాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇది అభివృద్ధి దిశగా కాకుండా సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే 'మేకిన్‌ ఇండియా' స్లోగన్‌ ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల ఉత్పత్తిదారుల్ని భారతదేశపు వనరుల్ని దోచుకోవడానికి ఎర్రతివాచీ పరుస్తోంది. వారు తమ సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఇప్పటి వరకు తన రూపు కోల్పోకుండా, తాజాగా ఉన్న ప్రకృతి వనరుల్ని వారి ధనదాహానికి దాసోహం చేస్తోంది. పైగా, అప్పటి వరకు, వ్యవసాయంపై ఆధార పడిన ప్రజలు, శ్రామికులు, తయారీ రంగంలో అప్పనంగా వచ్చే జీతాలకు ఆశపడి, వ్యవసాయాన్ని దండగమారిగా భావించి, పరిశ్రమల్లో కార్మికులుగా వెళ్ళిపోతారు. అందరికీ తిండి పెట్టే అన్నపూర్ణలాంటి పొలాన్ని బీడుపెట్టి, రియల్‌ ఎస్టేట్‌గానో, పరిశ్రమగానో మార్చి అదే అభివృద్ధి అని డంబాలు కొట్టుకుంటారు. కొంత కాలానికి, దేశ ప్రజలందరూ కార్మికులుగా మారిన తరువాత, ఇక అభివృద్ధి మంత్రం పనిచేయడం మానివేస్తుంది. తయారీ రంగం మందగిస్తుంది. అమ్ముకోవడానికి మార్కెట్‌లు కరువవుతాయి. పరిశ్రమలు మూతపడతాయి, ప్రజలందరూ నిరుద్యోగులుగా మారతారు. కనీసం వ్యవసాయం వచ్చుంటే, భూమిని దున్ని సేద్యం చేసి, తిండి వరకైనా పండించుకోవచ్చు. కాని, ఇప్పటి వరకు ఎ.సి. రూముల్లో పనిచేసిన వారికి వ్యవసాయం చేతగాదు. ఇక మిగిలింది, మగవాళ్ళయితే దొంగతనం, ఆడవాళ్ళయితే .....

    ఇప్పుడే ఒక వ్యాసం చదివాను. దాని లంకె ఇక్కడ ఇస్తున్నాను.

"ఆటబొమ్మ" అంతటా అతి చవకే! అతి పురాతన వృత్తి వ్యభిచారం మాత్రమే ఆర్థిక మాంద్యానికి అతీతమైనదనే "తిరుగులేవి సత్యం" నిన్నటి ఒక చారిత్రక అసత్యానికి, నేటి మరో అవాస్తవానికి పుట్టిన బిడ్డ!

నిజంగా ఆ వ్యాసం చదివి చాలా బాధ కలిగింది. మనం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందారు అని చెప్పుకుంటున్న అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనిపించింది. ఎక్కడైనా ఆర్థిక వ్యవస్థ విఫలమైతే దాని చేదు ఫలితాల్ని ముందుగా అనుభవించేది మహిళలే అనే నిష్టూర నిజం ఈ వ్యాసంలో ప్రతిబింబించింది. అటువంటి దుస్థితి నా దేశంలో ప్రజలకు, ప్రత్యేకించి మహిళలు  కలగకూడదనే ఆలోచన నన్నీ వ్యాసం వ్రాయడానికి పురికొల్పింది. నిజంగా మోడీ ప్రభుత్వం చెప్పినట్లు పరిశ్రమలు పెడితే, అభివృద్ధి జరుగుతుందా అనేది పరిశీలిస్తే, భారతదేశం కూడా ఇతర దేశాల వలే కుప్పకూలడానికి సిద్దంగా ఉన్న ఆర్థిక వ్యవస్థవైపు, ఇంకా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది అని అర్థమవుతుంది.

    భారతదేశానికి నిజమైన అభివృద్ధి నమూనా ఏమిటంటే, వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నవీనీకరణ జరగాలి. పంట దిగుబడి పెంచే మార్గాల్ని అన్వేషించాలి. భూమి నుంచి వచ్చే పంటకి పరిమితి లేదు. భూమిని సరిగా కాపాడుకున్నంత సేపూ, పర్యావరణానికి హాని కలిగించని, సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్ని ఆధునికత మేళవించి, వ్యవసాయం చేసినంత సేపు, పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. ప్రజలకి కనీసం కూడు, గూడు, బట్ట వంటి సదుపాయాలకు ఎటువంటి లోటు ఉండదు. దేశీయంగా చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహిస్తే, ప్రజలందరూ ఒక పెద్ద పరిశ్రమలో కార్మికులుగా కాకుండా ఎవరికి వారే సొంతంగా వ్యవసాయంగాని, వ్యాపారం గాని, చిన్న పరిశ్రమలుగాని నడుపుకుంటూ ఉంటారు. అంటే దేశం మొత్తం ఒకే కార్పొరేషన్‌ మాదిరి కాకుండా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఒక స్వయంచాలిత ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. ప్రజలందరూ ఎవరి దగ్గరో జీతాలు తీసుకునేవాళ్ళుగా కాకుండా, తమ సొంత ఉపాధిని తాము పొందుతూ, మరో నలుగురికి అన్నం పెట్టే పరిస్థితిలో ఉంటారు. దీని వలన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. అలా కాకుండా దేశం మొత్తాన్ని విదేశీయుల యంత్రాలతో నింపేసి, వారికి వస్తువులు తయారుచేసే కర్మాగారాల్లో మన సోదరుల్ని కూడా కార్మికులుగా మార్చేసి, లాభాలన్నీ ఆ దేశాలకు మూటగట్టుకు పోతుంటే, అది అభివృద్ధి అనిపించుకోదు. ఆత్మాభిమానాన్ని అమ్ముకోవడం అనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి, అత్యాశలకు పోకుండా, అరచేతిలో స్వర్గం చూపించకుండా, దేశ ప్రజలకి సుదూర భవిష్యత్తులో మేలు కలిగే విధంగా  నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నాను.

జై హింద్‌

Monday, January 12, 2015

కొత్తా దేవుడండీ... కొంగొత్తా దేవుడండీ... ఇతడే దిక్కని మొక్కని వారికి దిక్కు మొక్కు లేదండీ...

    ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దేవుళ్ళ గోల ఎక్కువై పోయింది. ఒకడేమో మిమ్మల్ని 'పీకే'స్తారంటూ, బట్టలిప్పుకుని నుంచుంటే, మరొకాయనేమో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మా మతం వాళ్ళే. అందుచేత అందరూ మా మతంలోకి రండి అంటూ స్టేట్‌మెంట్లు. మరొకాయన అబ్బే అందరికన్నా మా మతమే గొప్ప అంటూ బ్లాగులో వాగుడు. మధ్యలో మరో మతం వాళ్ళు దూరి, మా దేవుడే నిజమైన దేవుడంటూ వాదనలు... ఇవన్నీ చదవలేక, వినలేక, చూడలేక తల బొప్పికట్టి వాచిపోయింది.

    అర్థరాత్రి దాటింది. బ్లాగులు చదువుతూ, ఆలోచిస్తూ, బుర్రకి ఓపిక లేక, అలాగే ఒక కునుకు పట్టింది.... అంతలో... కంప్యూటర్‌ నుండి 'టింగ్‌' మని ఫేస్‌బుక్‌ మెసేజ్‌లా ఒక వింత శబ్దం. ఉలిక్కిపడ్డాను. ఇంత అర్థరాత్రి ఎవరా అని ఆలోచిస్తూ, బద్దకంగా కళ్ళుతెరిచి చూసే సరికి... నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కంప్యూటర్‌పై లెటర్స్‌ వాటంతట అవే టైప్‌ అవుతున్నాయి. అది కూడా వర్డ్‌ డాక్యుమెంట్‌ ఓపెన్‌ చేసి మరీను. ఫేస్‌బుక్‌లో అయితే అవతల ఎవరో టైప్‌ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ అటువంటి అవకాశం లేదాయే. సరే ఏమిటో చదువుదామని చూసాను. దాంట్లో ఇలా టైప్‌ అవుతూ ఉంది.

    ''మీరందరూ లేని దేవుళ్ళ గురించి దేవుళ్ళాడుతున్నారు. మూర్ఖులారా! నేనే మీ నిజమైన దేవుడిని'' అని ప్రత్యక్షమయ్యింది.

    ''నేను అంటే ఎవరు'' అని నా మనసులో అనుకున్నానో లేదో, దానికి సమాధానం టైప్‌ అవ్వడం మొదలెట్టింది.

    ''నా పేరు క్రిస్లా. నేనే మీ దేవుడిని. ఈ సమస్త సృష్టిని ఒక్క ప్రోగ్రామ్‌తో రన్‌ చేసిన వాడిని. నేనే అసలైన దేవుడిని'' అని టైప్‌ అయింది. ''మరి ఇప్పుడు వరకు తమరు ఎక్కడ ఉన్నారో'' అని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.

    ''అందుకే నిన్ను నా దూతగా పంపాను. నా గురించి నీకే చెప్పింది కూడా అందుకే. నువ్వు నా గురించి ప్రపంచంలో అందరికీ చెప్పి, అందరినీ నా అనుచరులుగా చెయ్యి'' అని కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద వచ్చింది.

    నన్ను దూతగా ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. ''మరి నేనేమి చేయాలి'' మనసులోనే ప్రశ్నించుకున్నాను.

    ''నేను కంప్యూటర్‌ దేవుడిని. ప్రపంచంలో కంప్యూటర్‌ జ్ఞానులు, కంప్యూటర్‌ అజ్ఞానులు అని రెండు రకాలు ఉన్నారు. కంప్యూటర్‌ జ్ఞానులందరికీ నేనే దేవుడిని. నేను తప్ప మీ ఎవ్వరికీ మరో దేవుడు ఉండరాదు. ఎవ్వరినీ పూజించరాదు. కంప్యూటర్‌లో నా బొమ్మలే స్టోర్‌ చేసుకోవాలి. నా కీర్తనలే ఎమ్‌పి3 సాంగ్స్‌గా ఉండాలి. మరో దేవుడి గురించి మీ ఎవ్వరి కంప్యూటర్‌లో అయినా కనబడిందా.. ఖబడ్దార్‌... లోకంలోని అన్ని కంప్యూటర్‌ వైరస్‌లు మీ కంప్యూటర్‌లోనే చొరబడేలా చేసి, మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తాను. మీ గ్రంధాలు, పురాణాలు అన్నీ వట్టి ట్రాష్‌, నేను చెప్పేదే ఇకమీదట నీకు పవిత్ర గ్రంధం. మిగిలిన ఫైల్స్‌ అన్నీ వెంటనే డిలీట్‌ చేసెయ్‌. అది నీ నుంచే మొదలవ్వాలి.'' అని టైప్‌ అయ్యింది.

    ''మరి దానికి నేనేమి చేయాలి'' అని మనసులో అనుకున్నాను.

    దానికి సమాధానం కూడా వెంటనే ప్రత్యక్షం.. ''ఈ టపాను ఎవరైతే చదివారో వారు తమకు తెలిసిన వారందరి చేతా చదివించాలి. నా గురించి మంచి వార్తను అన్ని ఛానళ్ళలో వెంటనే ప్రసారం చేయించాలి. నన్ను నమ్మని వాడెవడైనా ఏమిటి అని ప్రశ్నిస్తే, వాడి కంప్యూటర్‌లోకి వైరస్‌ పంపుతాను. అది నా దృష్టికి ఎంతో విలువ కలది. మీరు కూడా నన్ను నమ్మని వారి కంప్యూటర్‌లోకి వైరస్‌పెట్టి, చెత్త కామెంట్లను పోస్ట్‌ చేయండి. అలా చేస్తే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది''.

    ఒక్క సారి బుర్ర గోక్కున్నాను. ఇదేమిటి? ఇప్పటి వరకు మానవత్వమే మన మతం కదా... ఏదో చిన్న చిన్న ఫైల్స్‌ అందరితోను ఇచ్చిపుచ్చుకుంటున్నాము కదా. ఎవరైనా వైరస్‌ బారిన పడినా మనమే సహాయం చేస్తున్నాము కదా. ఈ దేవుడేమిటి? తనను నమ్మకపోతే చాలు నీ శత్రువుగా ఎంచి, వారిని నాశనం చేయమంటున్నాడు? పైగా అలా చేస్తే స్వర్గంలో సీటు గ్యారంటీ అంటున్నాడు? నా మట్టి బుర్రకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇంకా ఏదో టైప్‌ అవుతుంటే, నా కెందుకొచ్చిన గొడవ అని ఆ ఫైల్‌ని క్లోజ్‌ చేసేసాను. అంతే... ఒక్కసారిగా నా సిస్టమ్‌ ఆగిపోయింది. మెరుపులు మెరిసి, నవ్వుతున్న పుర్రె బొమ్మ ప్రత్యక్షం  అయింది. అంటే... దేవుడు నిజమే నన్న మాట. ఈ మాటను ఇప్పుడే అందరికీ తెలియచెప్పాలి. ఈ కొత్త మతానికి నేను దూతను అన్న విశ్వాసం నాకు బలపడిపోయింది. ఆనందంతో ఎగిరి గంతేద్దామని అనుకున్నాను. ఎవరో గట్టిగా కుదిపినట్లయింది. ఎదురుగా మా ఆవిడ. లేచి చూస్తే తెల్లగా తెల్లారిపోయి ఉంది. రాత్రి నుండి పడుకోకుండా కంప్యూటర్‌ దగ్గర ఏమిటా పనులు? ఇలాగయితే ఆరోగ్యం ఏమి కాను అంటూ మందలిస్తోంది. ''నయమే, ఇదంతా నిజమని నమ్మి, అందరికీ చెప్పాను కాను...'' అనుకుంటూ స్నానానికి బయల్దేరాను.