Pages

Tuesday, July 7, 2015

మద్యం వ్యాపారానికి - హిందూ దేవాలయాలకి పోలిక తెచ్చిన వాళ్ళను ఏమనాలి?

    తన మతం మాత్రమే గొప్పది, తను చెప్పిందే అందరూ ఒప్పుకోవాలని భావించే ఒక వ్యక్తి విగ్రహారాధనను ఒక భయంకరమైన పాపంగాను, విగ్రహారాధన చేయడం ఎంతో ఘోరమైన నేరంగాను ప్రచారం చేస్తున్నారు. భగవద్గీతలో విగ్రహారాధన గురించి ఉందా అని సవాల్‌ చేస్తున్నారు. అలా సవాల్‌ చేసిన వ్యక్తి ఇంటిపేరును బట్టి ఒకప్పుడు ఆయన కూడా హిందువు అనే విషయం అర్థం అవుతుంది. ఆయన మాత్రమే కాదు, ఇప్పుడు మన దేశంలోనే ఉంటూ, ఇక్కడి సంస్కృతిని, జీవన విధానాన్ని మంట కలపాలనే ఆరాటం ఉన్న అనేక మంది కూడా ఒకప్పుడు హిందువులే అన్న విషయం మరువకూడదు. వారి పూర్వీకులు ప్రలోభాలకు లొంగడం వల్లగాని, బలవంతంగా హింస ద్వారాగాని మతం మార్చబడ్డారు. ఇందుకు ఎటువంటి సందేహం లేదు. చరిత్ర చదివితే విషయం అర్థం అవుతుంది. తమ శరీరంలో పూర్వీకుల హిందూ రక్తం ప్రవహిస్తున్నప్పటికీ, అటువంటి వారు నిజంగానే తాము పరాయి మతాలకు నిజమైన ప్రతినిధులమని చంకలు గుద్దుకుంటూ, ప్రచారం చేయడం, వారికి ప్రాతినిధ్యం వహించడం భావదాస్యం తప్ప మరొకటి కాదు. తమ మతాన్ని ప్రచారం చేసుకోవడం, దాని గొప్పదనాన్ని అందరికీ చెప్పుకోవడం ఎప్పటికీ తప్పుకాదు. కాని ఆ ముసుగులో ఎదుటి వారి గురించి, వారి ఆరాధనా పద్దతుల గురించి చులకనగా మాట్లాడడం, వారికి సవాల్‌ విసరడం అహంకారం తప్ప మరేమీ కాదు. ఒకవేళ అలా మాట్లాడాలి అంటే, ఎదుటి వారి మతాన్ని గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. అలా సంపూర్ణంగా వైదిక ధర్మాన్ని గురించి తెలుసుకోవడం ఎవ్వరి వల్లా కాదు. ఎందుకంటే ఇది అత్యంత సనాతనమైనది, ఎన్నో ఆలోచనల పరంపరలో నుండి వచ్చింది. ఈ భారతీయ వైదిక ధర్మం ఎవ్వరి మీదా ఆధారపడింది కాదు, ఏ ఒక్కరి బలవంతం మీదనో ఆచరింపబడేది కాదు. ఏదో ఒక్క వాక్యం మీదనో, పుస్తకం మీదనో నిలిచింది కాదు. దీనికి మొదలు లేదు, అంతం కూడా ఉండదు. కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టి, ఒక ప్రవక్త లేదా మత బోధకుడు చెప్పిన విషయం మీదనో, వారు సంకలనం చేసిన పుస్తకం మీదనో ఆధారపడ్డ మతానికి అంత గొప్పదనం ఉంటే, కొన్ని వేల సంవత్సరాలుగా మనుగడలో ఉంటూ, ఎన్నో వందల మంది మహర్షులు దర్శించిన నిస్వార్థమైన సత్యానికి, మానవ సంక్షేమం కోసం వారు పడ్డ తపనకు ఇంకెంత విలువ ఉండాలి. మీ దగ్గర ఉన్నది కేవలం ఒక పుస్తకం మాత్రమే. కాని వైదిక ధర్మంలో ఉన్నవి నాలుగు వేదాలు (ఒక్కొక్క వేదాన్ని అధ్యయం చేయడానికి కనీసం 12 సంవత్సరాలు పడుతుందనేది పండితుల అంచనా), 108 ఉపనిషత్తులు, 6 వేదాంగాలు, 18 పురాణాలు, లక్ష శ్లోకాల మహాభారతం, 24 వేల శ్లోకాల రామాయణం, ఇవికాక సర్వ మానవాళికి మార్గనిర్దేశనం చేసే భగవద్గీత - వెరశి ఒక పెద్ద లైబ్రరీ ఉంది. కొన్ని వేల పుస్తకాలు, వేల ధర్మ సందేహాలు, వాటికి  వివరణలు, ఎక్కడా ఎవరినీ బలవంతంగా, ప్రలోభపెట్టి, ప్రచారం చేయమనే ఆదేశాలు లేకుండా ప్రపంచమంతటా ఆచరించేలా చేయగలిగిన ఘనత వైదిక ధర్మానిది. ముందు వాటిని కూలంకషంగా చదవండి, ఆలోచించండి. మన మతమే గొప్పది అనే సంకుచితత్వం వదిలి, అప్పుడు చదవండి, నిజమైన సత్యం, జ్ఞానం మీ ముందుకు వస్తుంది.

    విగ్రహారాధన మహాపాపం అంటూ ఊదరగొడుతున్నారు. దీనికి ప్రతిపాదిక ఏమిటి? మీ గ్రంధంలో చెప్పబడిన వాక్యమా?      ''నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని నిన్ను ప్రేరేపించిన యెడల వారిని కటాక్షించ కూడదు. అవశ్యముగా వారిని చంపవలెను. రాళ్ళతో చావగొట్టవలెను.''   ద్వితీయోపదేశము 13 : 6,10 (బైబిలు పాత నిబంధనల గ్రంధం - ఇదే క్రైస్తవులకు, ముస్లింలకు కూడా మూలాధారం). ఎదుటి మనిషిని చంపమని చెప్పి, దాన్ని దేవుని వాక్యంగా చెలామణి చేస్తున్న వారిది  నిజంగా మానవత్వమేనా? ఇటువంటి వాటిని దేవుని మాటలుగా ఒప్పుకోవడం సాధ్యమవుతుందా? సర్వమానవాళి మాత్రమే కాకుండా సర్వ సృష్టిలో ప్రాణులన్నీ సుఖంగా ఉండాలనే వేద వాక్యం ''సర్వేత్ర స్సుఖినస్సన్తు - సర్వే సన్తు నిరామయా - సర్వే భద్రాణి పశ్యన్తు'' అనే భావనతో మీ గ్రంధాన్ని పోల్చగలమా?

    దేవుడి గురించిన భావనల్లో వైదిక ఆలోచనలకి, మిగతా వ్యాపార మతాలకి ఎంతో వ్యత్యాసం ఉంది. వారి ఆలోచనల్లో దేవుడు అంటే ఎక్కడో ఒక లోకంలో మానవ రూపంలో ఉంటాడు. అక్కడకి చేరడం, ఆ లోకంలో దేవుడితో కలిసి జీవించడం మాత్రమే మానవ జీవిత ప్రధాన లక్ష్యం కావాలి. అందుకోసం ఎదుటి మనిషిని చంపినా తప్పులేదు, తమ మతానికి విధేయులై ఉండడం, దేవుడిని నమ్మి, విశ్వాసిగా ఉండడం మాత్రమే కావలసింది. ఇక్కడ ధర్మం గాని, మానవ జీవిత విలువల గురించి ప్రస్తావన గాని ఉండవు. దైవ బోధకుడుగా స్వీయ ప్రకటన చేసుకున్న వ్యక్తి చెప్పిందే అంతిమం. దాన్ని ఎదురు ప్రశ్నించడానికి వీలు లేదు. అలా చేస్తే దైవ ద్రోహం చేసినట్లే.

    వైదిక ధర్మంలో మాత్రం దేవుడు సర్వాంతర్యామి. ఆయన వ్యక్తి కాదు - ఒక శక్తి. ఆ శక్తికి రూపం లేదు - ఆయన సాకారుడు, నిరాకారుడు. ''అదృశ్యో వ్యక్త రూపశ్చ'' (విష్ణు సహస్ర నామం)లో చెప్పినట్లు ఆయన అదృశ్యంగాను ఉంటాడు మరియు మనం కోరినపుడు కావలసిన రూపంలో వ్యక్తం కూడా అవుతాడు. అంటే మనం ధ్యానించిన, ఉపాసించిన రూపంలో కూడా దర్శనమిస్తాడు.  ''సహస్ర మూర్థా'' అనే విష్ణు సహస్రనామంలో ఆయన అనంతమైన రూపాలు కలవాడు. ఏ రూపమైనా ఆ దేవుడికి సంబంధించనదే. ఏ రూపంలో ఆరాధించినా ఆయనకే చెందుతాయి.  ''యేప్యన్య దేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః | తేపి మామేవ కౌన్తేయ యజన్త్య విధిపూర్వకమ్‌ ||'' భగవద్గీత 9 అ. 23 శ్లో. దీని అర్థం - అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్దతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకరముగా నన్నే పూజించువారగుచున్నారు. ఎవరు దైవాన్ని ఏ రూపంలో కొలిచినా, ఏ రూపంలో పూజించినా గాని అవి చివరికి చేరేవి ఆ పరమాత్మకి మాత్రమే. ఇక్కడ గమ్యం ప్రధానం గాని, చేరే వాహనాలు ముఖ్యం కావు. కొందరు కాలి నడకన గమ్యాన్ని చేరుకోవడానికి వెళ్ళవచ్చు. మరికొందరు వారి స్థోమతను బట్టి సైకిల్‌ మీదగాని, బైక్‌ మీదగాని, కారు మీద గాని వెళ్ళవచ్చు. మరికొందరు విమానంలో వెళ్ళవచ్చు. చేరే సమయంలో తేడాలు ఉండవచ్చుగాని, పట్టుదలగా వెళితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. అంతమాత్రం చేత విమానంలో వెళ్ళే వాడు మిగతా వాహనాల్లో వెళ్ళే వారిని అవహేళన చేస్తే, అది అతని అవగాహనా రాహిత్యాన్ని, అహంకారాన్ని మాత్రమే సూచిస్తుంది. భాగవతంలో ప్రహ్లాదుడు, హిరణ్య కశిపునికి దేవుని గురించి చెప్పే సందర్భంలో ''ఇందుగలడందు లేడని సందేహము వలదు - చక్రి సర్వోపగతుండు - ఎందెందు వెతికి చేసిన అందందే గలడు వింటె దానవాగ్రణీ'' అంటాడు. అపుడు హిరణ్య కశిపుడు అహంకారంతో ఎక్కడైనా శ్రీహరి ఉంటే ఈ స్థంభంలో ఉన్నాడా'' అని ప్రశ్నించి, ఆ స్థంభాన్ని గదతో మోదుతాడు. అక్కడ శ్రీహరి నరసింహావతారంలో ప్రత్యక్షమై, అతనిని సంహరిస్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, భగవంతుడు సర్వాంతర్యామి. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎక్కడైనా కనుగొనవచ్చు. దీనికి కావలసింది పుస్తక జ్ఞానం, పాండిత్యం కాదు, అనన్యమైన భక్తి మాత్రమే. దేవుడు ఏ  పుస్తకాల్లో ఉన్నాడు, ఏ మత గ్రంధం నిజం, విగ్రహారాధన చేస్తేనే దేవుడు కనిపిస్తాడా, లేదా అల్లానో, యెహోవానో, క్రీస్తునో బుద్దుడినో పూజిస్తేనే దేవుడు కనబడతాడా అనేవి నిజానికి అర్థం లేని ప్రశ్నలు. అణువు నుండి బ్రహ్మాండం వరకు నిండి ఉన్నది దేవుడనే మహాశక్తి మాత్రమే. అది రాతి విగ్రహం కావచ్చు, లేదా మన మనస్సు కావచ్చు. ఏదైనా ఆయన నుండి ఉద్భవించినవే. ఇక్కడ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే కుతర్కం అనవసరం. విష్ణు సహస్రనామంలో ''వాసనాత్‌ వాసు దేవస్య వాసితం భువన త్రయం, సర్వ భూత నివాసోసి, వాసుదేవ నమోస్తుతే'' అనే శ్లోకం ప్రకారం, దేవుడనే మహాశక్తి ముల్లోకాల్లోను ఉంటాడు, మరలా ముల్లోకాలూ ఆయనలోనే నివసిస్తూ ఉంటాయి. సర్వ కాల సర్వావస్థల్లోను ఆయనలో నుండే ఈ సర్వ సృష్టి ఉద్భవిస్తూ, పోషించబడుతూ, లయం కాబడుతున్నది. ఈ అద్భుతమైన భావనని అర్థం చేసుకుంటే, విగ్రహారాధన పాపం అనే మాటే అర్థం లేనిది అనిపిస్తుంది.

    విగ్రహారాధన అనేది అతి ప్రాచీనమైనది. పుస్తక దేవుళ్ళు (పేపర్‌ గాడ్స్‌ - వీరి గురించి తరువాత వివరిస్తాను) పుట్టక ముందు నుండే విగ్రహారాధన ప్రపంచ వ్యాప్తమైనది. ప్రపంచంలో ఇంచు మించు అన్ని ప్రాంతాల్లోను ప్రాచీన విగ్రహాలు, కనిపిస్తాయి. కంటికి కనిపించని దైవాన్ని, కంటి ముందు ఒక రూపం ఏర్పరుచుకుని, ఆ రూపంతో మమేకమైనట్లుగా భావించడం అతి ప్రాచీన సాంప్రదాయం. అది నేటికీ అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. వైదిక ధర్మంలో విగ్రహారాధన ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు. కాని, విగ్రహ ప్రతిష్ట అనేది ఒక శాస్త్రీయ ప్రక్రియ. సరైన శిలను ఎంపిక చేసుకోవడం దగ్గర నుండి, దాన్ని ఏఏ కొలతల ప్రకారం శిల్పంగా మలచాలి, ఆ మలచిన శిల్పాన్ని ఏ విధమైన ఆలయంలో ప్రతిష్టించాలి, దానికి చేయాల్సిన క్రతువులు, శిల్పానికి ప్రాణ ప్రతిష్ట చేసి, భగవంతుని విగ్రహ రూపంగా మర్చే తంతులో ఎటువంటి ప్రక్రియను అవలంభించాలి అనేది ఒక ప్రత్యేక శాస్త్రం. మరలా విగ్రహ ప్రతిష్టాపనకు కూడా వివిధ బేధాలున్నాయి. వైఖానస ఆగమనం, శైవాగమం, పాంచరాత్ర ఆగమం, మిశ్రమ తంత్ర విధానం వంటి ప్రక్రియలు విశ్వం అంతటా నిండి ఉన్న దైవిక శక్తిని విగ్రహ రూపంలోకి ఎలా మార్చాలో శాస్త్రీయంగా వివరిస్తున్నాయి. ఇవన్నీ తప్పు అని ఒక్కమాటతో కొట్టిపారేయడం ఎలా సాధ్యమవుతుంది? ఎవరో కొందరు చెప్పిన మాటలు పట్టుకుని, విగ్రహారాధకులు అందరూ మూఢులు అని మూకుమ్మడిగా తీర్మానించేయడం సాధ్యం కాదు. మిగతా మతాల్లో పోప్‌గాని, ముల్లాగాని చెబితే అందరూ ఆచరించవచ్చేమో గాని, హిందూ సంస్కృతిలో మాత్రం వ్యక్తిదే నిర్ణయం. ఒక హిందువు ఎవరి మాటా విననవసరం లేదు. ఏ పుస్తకాన్ని చదవనవసరం లేదు, ఎవరి భావాలకో బానిసగా పడి ఉండాల్సిన ఖర్మ అంతకన్నా లేదు. అతని మతం మానవత్వం. తనకి, తన కుటుంబానికి, తను నివసించే సమాజానికి, దేశానికి, అంతిమంగా తనకు అన్నీ సమకూర్చే ప్రకృతికి అతడు ఎప్పుడూ విధేయుడై ఉంటాడు. ఎవరికీ హాని కలిగించకుండా, తన ధర్మాన్ని నెరవేర్చుకుంటూ, సమాజం పట్ల తన ధర్మాన్ని నెరవేరుస్తూ, ప్రకృతికి సహకరిస్తూ ఉంటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తన ధర్మాన్ని నెరవేర్చినంత కాలం, తన విధిని సక్రమంగా నిర్వహించినంత కాలం ఏ దేవుడినీ తనకు ఇది కావాలి అని ప్రాధేయపడడు. దైవం తన అర్హతను బట్టి తనకు ప్రసాదించే దేన్నయినా మహా ప్రసాదంగా స్వీకరిస్తాడు. ధర్మాన్ని రక్షిస్తే అది తనను రక్షిస్తుందని త్రికరణ శుద్ధిగా నమ్ముతాడు. ధర్మో రక్షతి రక్షితః

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.