Pages

Friday, August 23, 2013

తెలంగాణా ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?

    రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక ప్రాంతం వారు తమకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని కోరుకుంటుంటే, మరో ప్రాంతం వారు అందరం కలిసి ఉందామని ఉద్యమాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా రెండు జాతుల మధ్య, తెగల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు చెలరేగినపుడు ఆ రెండు జాతుల ప్రజలు పరస్పరం ఘర్షించుకుని, విడిపోవడం చూస్తూ ఉంటాం. అది యుద్దం ద్వారా కావచ్చు, లేదా సామరస్య పూర్వకంగా కావచ్చు. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి విభిన్నమైన వాతావరణం నెలకొని ఉంది. ఇతర ప్రాంతాల వారు తమపై పెత్తనం చేస్తున్నారని, లేదా తమకు అందవలసిన వనరుల్ని తమకు దక్కనివ్వడం లేదని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణా ప్రాంతంలో తమ కష్టాన్ని ధారబోసి, పరిశ్రమలు స్థాపించి, మౌలిక వసతుల్ని సమకూర్చి, సంపదని సృష్టించిన తరువాత తమను గెంటివేయడం ఎంత వరకు న్యాయం అని సీమాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్య రెండు వైపులా పదునుగానే ఉంది. దీనికి పరిష్కారం కూడా కనుచూపు మేరలో కనబడడం లేదు.

    ఇక్కడ తెలంగాణా నాయకులు గాని, ప్రజలు గాని ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా కేవలం ఒక్కరి శ్రమ మీద గాని, మేథస్సు మీదగాని ఆధారపడి అభివృద్ధి చెందదు. ఒకవేళ అభివృద్ధి చెందినా అది సంపూర్ణం కానేరదు. ఉదాహరణకు అమెరికాని తీసుకుంటే, ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా అభివృద్ధి అంతా అనేక దేశాల ప్రజల సమిష్టి శ్రమ, మేథస్సుల ఫలితమే అని అర్థం అవుతుంది. అది ఒక స్వేచ్ఛా ప్రపంచం. ప్రపంచంలో ఏ దేశానికి చెందినా, ఏ మతానికి లేదా ఏ జాతికి చెందిన ప్రజలైనా, అమెరికా అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు. రెండవ ప్రపంచం యుద్ధ సమయంలో జర్మనీ నుండి వెళ్ళిపోయిన ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వంటి శాస్త్రవేత్తలకి అమెరికా ఆశ్రయం కల్పించింది. అంతకు ముందు కూడా బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా, భారత్‌ వంటి అనేక దేశాల నుండి వెళ్ళిన ప్రజలు అమెరికా అభివృద్ధికి అవిరళ కృషి సల్పారు. దాని మూలంగానే ఆ దేశం ప్రపంచాన్ని శాసించగల స్థాయికి చేరింది. ఇప్పుడు అమెరికా అభివృద్ధిలో ఒక భారతీయునికి ఎంత పాత్ర ఉందో, ఒక చైనా దేశీయునికి కూడా అంతే స్థానం ఉంది. ఆయా దేశాల ప్రజల్ని అమెరికా సమాజం నుండి వేరు చేసి చూడడం సాధ్యం కాదు. అందరూ తాము ఏదో ఒక దేశానికి చెందిన వారమని చెప్పుకుంటూనే, సమిష్టిగా అమెరికన్స్‌గా గుర్తించబడాలని ఆశిస్తారు. మధ్య యుగాల్లో అన్ని ఐరోపా దేశాలు మత మౌఢ్యంతో అంధకారంలో ఉన్నపుడు ఆయా దేశాల్లోని శాస్త్రవేత్తలకి బ్రిటన్‌ ఆశ్రయం ఇచ్చింది. వారి పరిశోధనా ఫలితాల్ని ఉపయోగించుకుని, బ్రిటన్‌ వంటి చిన్న దేశం ప్రపంచంపై అధికారాన్ని చెలాయించగలిగింది.

    తెలంగాణా విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. సీమాంధ్ర ప్రాంతాల్లో ఉన్న తెలివైన లేదా సంపన్న వర్గాలకి చెందిన అనేక మందికి హైదరాబాద్‌ ప్రాంతం ఒక అయస్కాంతంగా ఆకర్షించింది. దేశానికి నడిబొడ్డున్న ఉండడం, ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళడానికి రవాణా వంటి మౌలిక వసతులు కల్పించబడి ఉండడం, ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టు పక్కల ఎంతో విస్తారమైన, చౌకగా లభించే బీడు భూములు లభించడం వంటి కీలకమైన అంశాల వల్ల హైదరాబాద్‌ ఒక ప్రపంచ స్థాయి నగరం (కాస్మొపాలిటన్‌ సిటీ)గా విస్తరించబడింది. ఈ అభివృద్ధి అంతా కేవలం ఒక్క తెలంగాణా ప్రజల వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. దీని వెనుక కేవలం సీమాంధ్రుల కష్టం మాత్రమే కాక, గుజరాతీలు, రాజస్థానీయులు, మరాఠీయులు వంటి అందరి కష్టం ఇమిడి ఉంది. ఇంత మంది కష్టపడి ఒక మహోన్నత స్వప్నాన్ని సాకారం చేసుకున్నాక, అది మాకు మాత్రమే సొంతం అని ఆ ప్రాంతం వారు అంటే, ఎవరూ హర్షించరు. ఇప్పటి తెలంగాణా ఉద్యమ నాయకులమని ఎవరైతే చెప్పుకుంటున్నారో, వారు చేసిన, చేస్తున్న ప్రకటనలు ఇతర ప్రాంతాల వారిలో భయాందోళనలు పెంచుతున్నాయి. ముందు చెప్పుకున్నట్టుగా హైదరాబాద్‌ నగరం నుండి ఇతర ప్రాంతాల వారిని పంపించి వేసినట్లయితే, ఇక అభివృద్ధి అనేది సాధ్యం కాదు.

    దీనికి నిలువెత్తు ఉదాహరణ బర్మా (ఇప్పటి మియన్మార్‌). ఒకప్పుడు రంగూన్‌ (బర్మా రాజధాని) వెళ్ళివచ్చారంటే ఒక ప్రత్యేకత ఉండేది. పాత తరం ఇళ్ళలో ఇప్పటికీ రంగం సామాను (రంగూన్‌కి ఏర్పడ్డ దేశ్యం) చూడవచ్చు. కాని, ఆ దేశం ప్రజాస్వామ్యం నుండి ఒక నియంత పాలనలోకి వెళ్ళింది. ఆ నియంత పాలనలో బర్మా నుండి బయటి దేశస్థులందరినీ, వారి వారి దేశాలకి గెంటివేసాడు. ఒక్క సారిగా అక్కడి అభివృద్ధి ఆగిపోయింది. ఎన్ని సహజ వనరులు ఉన్నప్పటికీ పరిపాలన సరిగా లేకపోవడం వలన, విదేశీ మేధావి, శ్రామిక వర్గం అండదండలు లేకపోవడం వల్ల, బర్మా ఒక్కసారిగా అధఃపాతాళంలోకి కూరుకుని పోయింది. ఒకప్పటి అందరి కలల ధామం - ఇప్పటి ఒక నిరుపేద దేశం. దీనికంతటికి ముఖ్య కారణం ప్రాంతీయ బేధాలు, సంకుచిత ఆలోచనా దృక్పధం మాత్రమే.

    తెలంగాణా నాయకులు మరో ముఖ్య వాదన - సీమాంధ్ర నాయకుల వలన తమ ప్రాంతం అభివృద్ధి చెందడం లేదు అని. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. హక్కుల్ని పోరాడి సాధించుకోవడంలో ఉన్న ఓర్పు నేర్పు బాధ్యతల్ని నెరవేర్చే క్రమంలో కూడా ఉండాలి. సీమాంధ్ర నేతలు కేవలం హైదరాబాద్‌ రాజధాని ఉండడం వల్ల ఆ ఒక్క ప్రాంతంపై మాత్రమే అధికారం కలిగి ఉంటారు. కాని, తెలంగాణాలో మిగిలిన ప్రాంతం అంతా ఆయా ప్రాంత ప్రజా ప్రతినిధుల ఏలుబడిలోనే ఉంది. దీనిలో ఎటువంటి సందేహాలకి తావు లేదు. మరి, సీమాంధ్రలో సాధ్యమైన అభివృద్ధి, తెలంగాణాలో ఎందుకు సాధ్యం కాలేదు? అంటే, అక్కడి నాయకుల్లో ప్రజలకి మంచి చేయాలనే తలంపు లేదు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన లేదు. వనరులు ఉన్నా, లేకపోయినా, సంకల్ప బలం వల్ల మాత్రమే అభివృద్ది సాధ్యమవుతుంది. దీనికి ఇజ్రాయేల్‌ దేశం మంచి ఉదాహరణ. దేశమంతా ఎడారి మయం. ఏ పంటలు పండవు. తాగడానికి చుక్క నీళ్ళు గగనం. నాలుగువైపులా ముస్లిం దేశాలతో ప్రతిరోజు సరిహద్దు యుద్దాలు. అటువంటి ప్రతికూల వాతావరణంలో సైతం, సంకల్ప బలంతో అభివృద్ధి చెంది చూపించారు. అంతేగాని, తాము పతనమయ్యి, కారణాన్ని ముస్లిం దేశాల మీద నెట్టలేదు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడుపుతున్న తెలంగాణా నాయకులు (?) ఎవరికైనా అభివృద్ధి అంటే ఏమిటో తెలుసా? వారి దగ్గర అభివృద్ధి చెందడానికి బ్లూ ప్రింట్‌గాని, రోడ్‌ మేప్‌ గాని ఉందా? ఎంతసేపు సోదరుల్లా కలిసి ఉన్న తెలుగు జాతి మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించడం, ఈ ప్రాంతం కాని వారిని ఇక్కడి నుండి వెళ్లగొడతాం అంటూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం, ఉన్న వనరులన్నీ మనమే సొంతం చేసుకుందా అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం - ఇవన్నీ కాదు అభివృద్ధి అంటే...

    అభివృద్ధి అంటే - అన్ని ప్రాంతాల ప్రజల్ని కలుపుకు పోవడం, సమిష్టిగా జీవన ప్రమాణాల్ని, మౌలిక వసతుల్ని కల్పించుకోవడం, ప్రతీ పౌరుడు నిర్భయంగా, ఆనందంగా గడిపేలా చేయగలగడం, మన దేశం నుండి మాత్రమే కాక, ప్రపంచంలో నలుమూలల నుండి నిపుణుల్ని, శాస్త్రవేత్తల్ని, మేధావుల్ని ఆకర్షించడం, వారి మేధా ఫలాల్ని సంపద సృష్టికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగించగలగడం. ఇవన్నీ చేసినపుడు దాన్ని అభివృద్ధి అంటారు. తెలంగాణా ప్రజలు, మిగతా తెలుగు జాతి వలే ఏ విషయంలోను తీసిపోరు. ఇంగ్లీషులో ఓ సామెత ఉంది. ఒక గొర్రెల గుంపుకి సింహం నాయకత్వం వహిస్తే, ఆ గొర్రెల గుంపు, గొర్రె నాయకత్వం వహిస్తున్న సింహాల గుంపుని సునాయాసనంగా ఓడిస్తుందని దాని అర్థం. అంటే సింహాలు ఎంత గొప్పవి, పరాక్రమం కలవి అయినప్పటికీ, గొర్రె నాయకత్వం వల్ల ఓటమి పాలవుతాయి. ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్నది అదే. అక్కడ గొర్రెలు నాయకత్వం వహిస్తున్నాయి. మేధావులైన తెలంగాణా ప్రజలు ఆ గొర్రెల మాటలు నమ్ముతున్నారు. ఇప్పటికైనా తెలంగాణా ప్రజలు కళ్ళు తెరిచి, తాము సింహాలమని గుర్తించి, తమ శక్తి సామర్థ్యాలని తెలుసుకుని, గొర్రె నాయకుల్ని పక్కనపెట్టి, నిజమైన అభివృద్ధి పథం వైపు పయనిస్తారని ఆశిద్దాం.

Monday, June 17, 2013

భారతదేశం అంటే గాంధీ, నెహ్రులు మాత్రమే కాదు

ఇండోనేషియా ప్రభుత్వం అమెరికాతో తన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరుచుకునే చర్యల్లో భాగంగా ఇటీవల ఒక సరస్వతీ దేవి విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్టించడానికి ఆ దేశానికి బహూకరించింది. ఇండొనేషియా జనాభాలో సుమారు 80 శాతం మంది ముస్లిములు. అయినప్పటికీ, ఆ దేశంలో శతాబ్దాల క్రితమే మరుగున పడిపోయిన ఆ దేశ సాంస్కృతిక వారసత్వం ఇప్పటికీ సజీవంగా ఉండేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇండొనేషియా అంతటా, ఆ మాటకొస్తే ఆగ్నేయాసియా దేశాలన్నిటిలోను పూర్వకాలం హిందూ సంస్కృతి వ్యాప్తి చెంది ఉండేది. కాని కాల క్రమంలో చాలా దేశాల్లో బౌద్ధమతం ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇండొనేషియా, కంబోడియా వంటి దేశాల్లో ముస్లిం మతం వ్యాప్తి చెందింది. కాని ఇప్పటికీ ఆయా దేశాల్లో హిందూ ఆచారాల్ని, దేవీ దేవతల ఆలయాల్ని, విగ్రహాల్ని ఎంతో గౌరవంగా పరిరక్షించడం మనం గమనించవచ్చు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా దేశాలు తమ ఘనమైన వారసత్వ సంపదను ఎటువంటి అరమరికలు లేకుండా ప్రపంచానికి చాటి చెప్పడం
కూడా చూడవచ్చు. ఇండొనేషియా దేశంలో చెలామణీలో ఉన్న 20000 రూపాయిల నోటుపై వినాయకుడి బొమ్మ ఉంటుంది. ఆ దేశ ఎయిర్‌లైన్స్‌ పేరు గరుడ ఎయిర్‌లైన్స్‌. ఇది పురాణాలలోని విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడికి సంకేతం. కంబోడియా దేశంలో 'అంగ్‌కోర్‌వాట్‌'లో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఉన్నది. ఇది 400 ఎకరాలలో విస్తరించి ఉంది. 12వ శతాబ్దం నాటి కంబోడియా రాజు రవి వర్మ -2 దీనిని నిర్మించినట్లుగా చెబుతారు. తరువాతి కాలంలో ఇంతటి అద్భుతమైన దేవాలయం తన ఉనికిని కోల్పోయి, అడవులలో కప్పబడి ఉండిపోయింది. కంబోడియా ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తరువాత తిరిగి వెలుగులోకి తీసుకురాబడింది. కంబోడియా జాతీయ పతాకంపై 'అంగ్‌కోర్‌వాట్‌' దేవాలయం ముద్రించబడి ఉంటుంది. కంబోడియా ఈ ఆలయానికి ఇచ్చే గౌరవం అటువంటిది. థాయ్‌లాండ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు 'సువర్ణభూమి ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌'. ఇది సంస్కృత పదం. బంగారు నేల అని దీని అర్థం. విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ముందుగా కనిపించేది నిలువెత్తు 'క్షీర సాగర మథన ఘట్టం' విగ్రహం. ఆ దేశంలో బౌద్ధం ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ, వారు క్షీర సాగర మధనం విగ్రహాన్ని ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో పెట్టడం, ప్రాచీన సంస్కృతిపై వారికి గల అభిమానాన్ని స్పష్టం చేస్తుంది.

ప్రపంచమంతటా ఇలా ఉంటే, అన్ని దేశాల సంస్కృతిని ఇంతగా ప్రభావితం చేసిన మన దేశంలో మాత్రం ప్రాచీన సంస్కృతిపై ఎనలేని నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. ఎక్కడ చూసిన గాంధీ నెహ్రూల జపం వినిపిస్తుంది. మన దేశానికి విదేశీ అతిధులు ఎవరు వచ్చిన ముందుగా వాళ్ళని సరసరి రాజ్‌ఘట్‌ దగ్గర తీసుకుని పోయి మహాత్మా గాంధీ సమాధికి పువ్వులు జల్లిస్తారు. ఇంకా లోకువ ఎవరైన దొరికితే నెహ్రూ సమాధి దగ్గకి ఇంకా ఇందిరా గాంధీ సమాధి దగ్గరకు కూడా తీసుకువెళతారు. భారతదేశాన్ని సందర్శించిన ప్రతిసారీ ఈ సమాధుల సందర్శన గొడవేమిటో అని కొందరు విదేశీ నాయకులు తిట్టుకున్న సందర్భాలు కూడా మనకు తెలుసు. దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలున్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేనంత శిల్ప సంపద ఉంది, తాజ్‌మహల్‌ వంటి అద్భుత కట్టడాలు ఉన్నాయి, సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే మన వాళ్ళకి ఇవేమీ పట్టవు. మన దేశ కరెన్సీ నోట్ల మీద ఓ పది సంవత్సరాల క్రితం వరకు మూడు సింహాల బొమ్మలు ఉండేవి. మన ఘన చరిత్రకు ఆనవాలుగా ఉండేవి. భారత ప్రభుత్వం అధికారిక ముద్ర అది. ఇప్పటి తరం వారికి అవేమీ తెలియవు. ఏ కరెన్సీ నోటు మీద చూసినా గాంధీ గారి బొమ్మే. అసలు గాంధీ బొమ్మ ముద్రించమని రిజర్వు బ్యాంకు వారికి ఎవరు ఆదేశించారో తెలుపమని, ముంబాయికి చెందిన ఒక విద్యార్థిని సమాచార హక్కు చట్టం క్రింద దరఖాసు చేస్తే, బ్యాంకు అధికారులు నీళ్ళు నమిలారు. అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి కరెన్సీ ప్రింటింగ్‌ విషయంలో ఎవరి సలహాలు, సంప్రదింపులు లేకుండా, కేవలం మౌఖిక ఆదేశాల మేరకు డిజైన్‌ మార్చారన్నమాట. అలా చేయమని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ గారికి ఎవరు చెప్పి వుంటారో మన ఊహకి అందని విషయం కాదు. 

ఆధునిక భారతదేశ చరిత్రలో గాంధీజీ పాత్ర మరువలేనిది. ఆయన అనుసరించిన సత్యాగ్రహం, వ్యూహాలు ఇవన్నీ ఎన్నో ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం చేసాయి. అందులో కూడా అనుమానం లేదు. ఆయన్ని కరెన్సీ నోట్ల మీద ముద్రించడం కూడా తప్పేమీ కాదు, కాని గాంధీ మాత్రమే భారతదేశం కాదు. భారతదేశానికి కొన్ని వేల యేళ్ళ సాంస్కృతిక చరిత్ర ఉందన్న విషయం ఎప్పుడూ మరువ రాదు. అందుకనే అశోక స్థూపాన్ని మన దేశ అధికారిక ముద్రగా స్వీకరించారు. ముండకోపనిషత్‌లోని 'సత్యమేవ జయతే' అనే వాక్యాన్ని భారతదేశ అధికారిక వాక్యంగా పెట్టారు. కాని నేటి ప్రభుత్వాలు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని గాంధీ మయం చేయాలని చూస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లన్నీ గాంధీ మయమే. ప్రాజెక్టులన్నీ నెహ్రూ మయమే. ఇక పట్టణాల్లో ప్రతి వీధిలోను కనీసం రెండు నాయకుల విగ్రహాలు ఉంటున్నాయి. ఎవరెవరనేది మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఆ విగ్రహాల మీద పక్షులు రెట్టలు వేసినా ఎవరూ కనీసం పట్టించుకోరు. కానీ, ఖర్మ కాలి ఆ విగ్రహానికి ఒక వేలు విరగిపోతే నానా యాగీ చేసి, బంద్‌లు, రాస్తారోకోల వరకు ఈ వ్యవహారాన్ని తీసుకువెళతారు. ఒక వ్యక్తి పట్ల గౌరవ భావం ఉండవచ్చు. ఆరాధనీయుడే కావచ్చు. ఆ గౌరవం, ఆరాధన ఒక స్థాయి వరకు తప్పు లేదు. కానీ వ్యవహారం శృతి మించకూడదు.

భారతదేశం ఎన్నో కళలకి ప్రసిద్ధి. విభిన్నమైన నాట్య రీతులున్నాయి, ప్రతీ ప్రాంతానికి విభిన్నమైన కళారూపాలున్నాయి, సాంస్కృతిక భిన్నత్వం ఉంది. ఎంతో మంది అద్భుతమైన నాయకులు, చక్రవర్తులు, మహనీయులు ఈ గడ్డమీద జన్మించారు. కరెన్సీ నోట్ల మీద వీటన్నిటినీ ప్రతిబింబించవచ్చు. ప్రధాన కట్టడాలకి ఆయా నాయకుల పేర్లు పెట్టవచ్చు. ప్రధాన కూడళ్ళలో దేశ శిల్పకళను ప్రతిబింబించేలా మహోన్నటమైన శిల్పాలను ప్రతిష్టించవచ్చు. దీని ద్వారా పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు. మన దేశ వారసత్వ సంపదను అందరికీ తెలియజేయవచ్చు. కావలసింది సత్‌ సంకల్పం మాత్రమే. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడితే ఓట్లు రాలవచ్చును. కాని సుసంపన్నమైన దేశ వారసత్వ సంపద భావి తరాలకు అందకుండా పోతుంది.

(ఈ టపా రాయడానికి స్ఫూర్తి నిచ్చిన మిత్రుడు శ్రీ చక్కా ఉమకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు)

Monday, June 3, 2013

పగటి వేషగాళ్ళకి, సినిమా హీరోలకీ తేడా ఏమిటి?

    నేటి సమాజం మొత్తం సినిమా ప్రభావానికి లోనయి ఉంది. ఏ టి.వి. ఛానల్‌ చూసినా సినిమా ఆధారిత కార్యక్రమాలు ఉంటున్నాయి. ఏ మాటలు మొదలు పెట్టినా అవి చివరికి సినిమావైపు మళ్ళుతున్నాయి. ఇక యువత అయితే సినిమాకి బాగా ఎక్కువగా ప్రభావితమవుతున్నది. సినిమాలో  కళాకారులు వేసే వేషభాషల్ని అనుకరించడం నాగరికతగా భావించడం, అదే చాలా గొప్పగా ఆలోచించడం మనం చూస్తూనే ఉన్నాము. మంచి చెడ్డలు చెప్పాల్సిన తల్లిదండ్రులు గాని, సంస్కారం నేర్పాల్సిన పెద్దలుగాని ఈ విషయంలో ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు. వారు కూడా ఎంతో కొంత సినిమా ప్రభావానికి లోనవడం వల్ల, పిల్లలకి ఎటువంటి మేలు చేకూర్చలేకపోతున్నారు. మితిమీరిన అశ్లీలత, హింస, పరిమితి లేని భావోద్వేగాల వ్యక్తీకరణ ఎంత ఎక్కువగా ఉంటే అంత 'మాస్‌' సినిమాగా, కథంటూ ఏదీ లేకపోయినా, అదే గొప్ప సూపర్‌హిట్‌ సినిమాగా చలామణీ అవుతున్నది.

    వీటన్నిటి కంటే అత్యంత ప్రమాదకరమైనది వ్యక్తిపూజ. దాన్నే ఇంగ్లీష్‌లో 'హీరో వర్‌షిప్‌' అంటారు. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, అతని వ్యక్తిత్వం, సమాజ హితం కోసం అతడు చేసే త్యాగాలు, ఇవన్నీ కలిపి ఒక సామాన్యుడిని నిజమైన హీరోని చేస్తాయి. ఇంకా మంచి గుణాలున్న వ్యక్తి దేవుడిగా ఆరాధించబడతాడు. యుగపురుషుడిగా కీర్తించబడతాడు. హీరోలనే వాళ్ళు ప్రతి సమాజంలోను కనబడతారు. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాలలో, సమాజం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనే వేళ ఆయా పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొని, ఎవరైతే తమ ప్రయత్నంలో సఫలీకృతమయ్యి, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారో వారే నిజమైన హీరోలు. పురాతన కాలంలో ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఆధునిక కాలంలో ఒక శివాజీ, ఒక గాంధీజీ, జీవితాన్ని సౌకర్యవంతం చేయడానికి కష్టపడ్డ ఒక శాస్త్రవేత్త, ... వీరందరూ హీరోలే. సమాజాన్ని ఒక మలుపు తిప్పిన కథానాయకులే. అటువంటి వారిని ఆరాధించడంలో ఏ తప్పులేదు. వారిని అనుకరించడంలో ఎటువంటి ఇబ్బందిలేదు. హీరోల కథలు చదివిన వారిలో స్ఫూర్తినింపుతాయి. వారిని అనుకరించిన వారిలో మంచి లక్షణాలు కనబడతాయి. ఇది వ్యక్తిగతంగానే కాకుండా, సమాజ పరంగా కూడా ఎంతో మంచిని కలుగజేస్తుంది. వారిలాగానే త్యాగాలు చేయడానికి, సమాజ శ్రేయస్సుకోసం పాటుపడడానికి మరింత మందికి ఉత్తేజం కలిగిస్తుంది.

    కాని, ఇప్పటి సమాజంలో హీరో అనే పదానికి అర్థమే మారిపోయింది. సినిమా అనే మాధ్యమం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో అప్పటి నుండి హీరో పదం తన అర్థాన్ని మార్చేసుకుంది. వెండి తెర వెలుగునీడల్లో ముఖానికి రంగులేసుకుని, ఆయా రకాల నాటకాలు వేసే పగటి వేషగాళ్ళందరూ హీరోలు అయిపోయారు. రంగుల ప్రపంచంలో మైమరచిపోయి, నిజమైన ప్రపంచానికి, మాయా లోకానికి తేడా మర్చిపోయి, ఆయా పాత్రలు వేసిన వాళ్ళందరినీ నిజమైన హీరోలే అనుకునే స్థితికి మన సమాజం దిగజారిపోయింది. వెండి తెరపైన రంగులేసుకుని గెంతులు వేసే వారందరికీ సమాజం లేని విలువను ఆపాదించింది. అటువంటి వారందరికీ స్టార్‌లని బిరుదులివ్వడం, యుగపురుషులని కీర్తించడం, మహానుభావులని ప్రచారం చేయడం... ఇవన్నీ అవసరమా? అనిపిస్తుంది. నిజానికి ఈ వెండితెర హీరోలందరూ చేసిన పనేమిటి? పగటి వేషం వేయడం మాత్రమే కదా... మనం ఇచ్చే డబ్బుల కోసం రకరకాల వేషాలు వేయడం, మన వినోదం కోసం కిందా మీదా పడడం, ఎవరో రాసిన డైలాగులు పలకడం, మరెవరో చెప్పినట్టు నటించడం... ఈ మాత్రం దానికే వారికి అన్ని బిరుదులు ఇవ్వడం, సన్మానాలు చేయడం అవసరమా?

    వీటన్నిటికీ తోడు సినిమా రంగంలో కూడా రాజరికం వచ్చేసింది. తెలుగు సినిమాలో మరీ దారుణం. ఇక్కడ హీరో అవ్వాలంటే మరో పెద్ద హీరో కొడుకు గాని, లేకపోతే మరో పెద్ద నిర్మాత మనుమడు గాని అయి ఉండాలన్న భావం రాజ్యమేలుతోంది. పూర్వం నాటకాల్లో స్టేజి ఎక్కాలంటే ఎన్నో అర్హతలు చూసేవారు. సందర్భానుసారంగా శరీర ఆకృతి, భావ వ్యక్తీకరణ - ఆంగికం, స్పష్టంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడగలిగిన నేర్పు, భాష మీద పట్టు - వాచికం, నాటకాన్ని రక్తి కట్టించగలిగే నటన,.... ఇవన్నీ నటులకి ఉంటేనే రంగస్థలం మీదకి వెళ్ళనిచ్చేవారు. ఇవి లేకపోతే అటువంటి నటుల వల్ల నాటకం పాడయితే అది మొత్తం నాటక సమాజానికి చెడ్డ పేరు తెస్తుందని భయపడేవారు. కాని ఇప్పటి నటుల వారసులకి, అదేనండి బలవంతంగా రుద్ద బడ్డ హీరోలకి పైన చెప్పబడిన లక్షణాలేవీ ఉండనక్కర్లేదు. ముఖం బాగా లేకపోతే ప్లాస్టిక్‌ సర్జరీ చేయిస్తారు. మాటలు సరిగ్గా లేకపోతే అదో కొత్త వింత కింద జనం మీద రుద్దుతారు. తెలుగు ఎంత చెత్తగా మాట్లాడితే అంత గొప్ప. ఇక నటించడం రాకపోయినా ఫర్లేదు. ఎడిటింగ్‌లో సర్దుబాటు చేస్తారు. ఇంకా బాగా రాకపోయినా, గ్రాఫిక్స్‌లో సరిచేస్తారు. ఇంత బలవంతంగా తయారైన హీరోని బలవంతంగా జనం మీద రుద్దుతారు.  వీళ్ళు తప్ప మరెవ్వరూ బాగా చేయలేరు అనే భావన కలుగజేస్తారు. మధ్య మధ్యలో మా వంశం ఇంత గొప్పది, అంత గొప్పది, మేము తప్ప మరెవ్వరూ ఇంత చెత్తగా నటించలేరు అని డైలాగులు చెప్పిస్తారు. వీలయితే పాత తరంలో వాళ్లని కూడా ఒకసారి చూపిస్తారు. వినోద రంగం కూడా కులాల వారీగా, కుటుంబాల వారీగా విడిపోయింది. ఇంతటి దారుణం మరే ఇతర పరిశ్రమలోను చూడమేమో.

    సినిమా అనేది ఒక రంగుల కల. 25 రకాల వృత్తి నిపుణలు కలిసి, దర్శకుడు కనే ఒక అందమైన కలకి దృశ్య రూపం ఇస్తారు. కెమెరా, ఎడిటింగ్‌, మ్యూజిక్‌, మేకప్‌, కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌, ఆర్టిస్టులు... ఇలా విభిన్న రకాల నిపుణలు కలిసి, ఎంతో కాలం కష్టించి, ఒక సినిమాని నిర్మిస్తారు. సినిమా అందంగా రావడంలో కనీసం 200 నుండి 300 మంది సాంకేతిక నిపుణుల శ్రమ ఉంది. వీరందరి శ్రమ కలిసి, ఒక వ్యక్తిని హీరోగా తెర మీద చూపిస్తారు. కాని వీరందరి శ్రమను ఒక్క హీరోయే దోచుకోవడం నిజంగా చాలా దారుణం, నీచం కూడా. ఇంత మంది కష్టపడ్డప్పుడు వచ్చిన లాభం నిపుణులందరికీ సమానంగా ఉండాలి కాని, ఎవరో ఒకరే దోచుకెళ్ళడం బాధాకరం.

    ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే యువత అటువంటి రంగుల వలలో పడకూడదనేది నా ఆవేదన. నటులంటే గౌరవం ఉండొచ్చు, వారి నటనకి మైమరచిపోవచ్చు. కాని అదంతా సినిమా వరకే. నటులు కూడా మామూలు మనుష్యులే. మేకప్‌ తీసేస్తే, వాళ్ళని కనీసం చూడను కూడా చూడలేం. ముసలి హీరోలు విగ్గు పెట్టకుండా, మేకప్‌ వేయకుండా బయట కనబడితే కనీసం ఎవరూ పలకరించరు కూడా. అటువంటి రీల్‌ లైఫ్‌ హీరోలు వ్యక్తిగతంగా, నైతికంగా  కూడా ఎంతో దిగజారి ఉంటారు. ఒక మామూలు మనిషి వీరికంటే ఎంతో ఉన్నతంగా ప్రవర్తిస్తాడు కూడా. మనందరిలో ఒక మంచి ఇంజనీర్‌, ఒక డాక్టర్‌, ఒక శాస్త్రవేత్త, ఒక శ్రామికుడు, ఒక నిపుణుడు.... ఇలా ఎంతో మంది ఉండొచ్చు. మేకప్‌ తీసిన పగటి వేషగాడు మీకన్నా గొప్పవాడు కాడు. మీరు సమాజానికి ఒక రకంగా ఉపయోగపడితే, ఒక నటుడు పది మందికీ వినోదాన్నిస్తూ, తన జీవితాన్ని గడుపుతున్నాడు. అంత మాత్రం చేత మీ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందని, కాలేజ్‌ ఎగ్గొట్టడం, ఇంట్లో అమ్మానాన్నలు కష్ట పడి సంపాదించింది వాళ్ళతో దెబ్బలాడో, దొంగతనం చేసో బ్లాక్‌లో టికెట్లు కొనడం, బ్యానర్లు రాయించడం, స్నేహితులకి పార్టీలు ఇవ్వడం.... ఇవన్నీ దారుణమైన నేరాలు. పగటి వేషగాళ్ళని అనుకరిస్తూ, ఫ్యాన్స్‌ అని చెప్పుకోవడం బాగానే ఉంటుంది గాని, చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. వ్యక్తి పూజ హద్దుల్లో ఉంటే ఫర్వా లేదు, కాని, అది హద్దులు మీరి మీ జీవితాన్ని పాడు చేసే స్థితికి తెచ్చుకోవద్దు. ఒక ఆడపిల్లని ఏడిపించడం, ప్రేమలోకి దించడం, వెర్రిమొర్రి వేషాలు వేయడం, ఎక్కడపడితే అక్కడ పిచ్చి గెంతులు వేయడం, అడ్డొచ్చిన ప్రతి వాడిని నరికేయడం వంటివి రీల్‌ లైఫ్‌లో బాగానే ఉంటాయి. కాని రియల్‌ లైఫ్‌లో అటువంటివి చేస్తే జనం రాళ్ళిచ్చుకొని కొడతారు.

    జీవితంలో వినోదం ఒక అంశం మాత్రమే. అది మాత్రమే జీవితం కాదు. మీ కేరీర్‌ కన్నా ముఖ్యమైనది, మీ జీవితంకన్నా ముఖ్యమైనది మరేదీ ఉండదు, ఉండబోదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. హీరోల చేతుల్లో కాదు. మీకేదన్నా జరిగితే మీ అమ్మానాన్నలు, మిగిలిన  కుటుంబ సభ్యులు ఆదుకుంటారు గాని, మీ హీరోలు మాత్రం కాదు అని గుర్తుంచుకోండి. చివరిగా మరొక్క విషయం... సినిమాలో నటించే వాళ్ళందరూ పగటి వేషగాళ్ళు మాత్రమే. వాళ్ళు ఎప్పటికీ నిజ జీవితంలో హీరోలు కాలేరు.

Monday, April 1, 2013

బ్లాగర్లపై పన్ను పోటు - యోచనలో చిదంబరం

    అసలే ఎన్ని పన్నులు వేసినా ప్రభుత్వం నడపడానికి డబ్బులు సరిపోవడం లేదు. ప్రజల్ని పిండి, పిండి, వారి రక్తం మొత్తం తోడేసినా, ప్రభుత్వానికి ఆర్థిక ఆకలి తీరడం లేదు. ఒకవైపు కిలో రూపాయికి బియ్యం ఇవ్వాలి. రేపు ఎన్నికలొస్తే అర్థరూపాయికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వెనుకబడిన వారికి ఎన్నో పథకాలు ప్రకటించాలి. ప్రభుత్వోద్యోగుల జీతాలు పెంచాలి. ఇవన్నీ చేస్తే ఇప్పుడు వస్తున్న ఆదాయం చాలదు. మరేం చేయాలి? ఉన్న పన్నుల్ని ఇంకా పెంచితే ప్రజా వ్యతిరేకత ఎదురవుతుంది కాబట్టి, కొత్త పన్నుల్ని విధిస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, దానితోపాటు ప్రజలకి భారం అనిపించదు. అందుచేత కొత్త పన్నుల్ని వేయడానికి ముసాయిదా సిద్దం చేసారట అధికారులు. ఇందుకోసం తుగ్లక్‌ మరియు ఇతర సుల్తానులు భారతదేశాన్ని ఎలా పన్నుల రూపంలో కొల్లగొట్టిందీ ప్రజల్ని ఎలా హింసించిందీ ఆరా తీస్తున్నారట. బ్రిటిష్‌ వారి సమయంలో కూడా ఎటువంటి కొత్త పన్నులు ముక్కు పిండి వసూలు చేసారో కూడా అవన్నీ మరలా విధించడానికి ఆలోచిస్తున్నారట. కొద్దిగా బయటకు వచ్చిన (లీకయిన) అంశాల సారాంశమేమిటంటే:

    1. గాలి పన్ను: ఇప్పటి వరకు పంచభూతాలయిన భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం - వీటిలో భూమి పైన (ఆస్థి పన్ను, రిజిస్ట్రేషన్‌ పన్ను) ఇప్పటికే పన్ను ఉంది. నిప్పు (వంట గ్యాస్‌) మీద పన్నును ప్రతి ఆరు నెలలకి పెంచుతున్నారు. ఇక మినరల్‌ వాటర్‌పైన ఎలాగో సేల్స్‌ ట్యాక్స్‌ వడ్డిస్తున్నారు. అందుకే గాలి మీద కూడా పన్ను వేయాలి. ప్రతి మనిషి రోజుకి ఎంత గాలి పీలుస్తున్నాడో లెక్కగట్టి, సంవత్సరానికి దాని విలువ మధింపు చేసి పన్ను వేయాలి. ఇలా లెక్క వేయడం కోసం చైనాకు ప్రత్యేక మైన పరికరాల తయారీ కోసం ఆర్డరివ్వాలి. (కనీసం పదివేల కోట్లు ఈ బడ్జెట్టుకు కేటాయించాలి)

    2. నడక మీద పన్ను: మనిషన్నాక ఏదో పని మీద నడుస్తూనే ఉంటాడు. నెలకు ఎన్ని అడుగులు వేస్తాడో లెక్కగట్టి, ప్రభుత్వ రోడ్ల మీద నడుస్తున్నాడు కాబట్టి, అవి అరుగుతాయి కాబట్టి, వాటికి పన్ను వసూలు చేయాలి. రెండు కాళ్ళకి మీటర్లు పెట్టి, ఎవరు ఎన్ని అడుగులు వేస్తారో వారి దగ్గర నుండి అంత పన్ను వసూలు చేయవచ్చు. వికలాంగులకి ఈ పన్ను నుండి మినహాయింపు ఉంటుంది.

    3. పడక గది పన్ను: బ్రిటన్‌లో బెడ్‌రూమ్‌ ట్యాక్స్‌ విధించింది ప్రభుత్వం. చివరకు ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత వెల్లువెత్తడంతో దాన్ని ఎత్తేసారు. కాని మన దేశంలో ఎన్ని పన్నులు వేసినా, ప్రజల నుండి ఎటువంటి వ్యతిరేకత రాదు కాబట్టి, ఇక్కడ వెయ్యొచ్చు. బెడ్‌రూం ని ఎన్నిసార్లు వాడుకుంటే అంత, ఎంత వాడుకుంటే అంత పన్ను వేసి వసూలు చేయవచ్చు. దానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, అధికారుల్ని నియమిస్తే, వారు ప్రతి ఇంటికి రాత్రి పూట 'రైడింగు' చేసి, నిజంగా పడకగదిని వాడుతున్నారా లేదా అని నిర్ధారించుకుని, పన్ను విధిస్తారు. ఎవరైనా పడక గదిని వాడుతూ, వాడట్లేదని లెక్కలో చూపిస్తే మాత్రం వారికి భారీ జరిమానా విధిస్తారు.

    4. బ్లాగర్లపై పన్ను: ఇక మన విషయానికి వస్తున్నాను. బ్లాగింగు చేయడం ద్వారా మానసిక ఆనందాన్ని, కామెంట్లు విసరడం ద్వారా మరికొంత ఆనందాన్ని, చదవడం ద్వారా కాలక్షేపాన్ని పొందుతున్నారు కాబట్టి, బ్లాగులు రాసే వాళ్ళకి సేవా పన్ను, దాని మీద సర్‌ఛార్జీలు, చదివే వాళ్ళకి, కామెంట్లు చేసే వాళ్ళకి యూజర్‌ ఛార్జీలు విధించబోతున్నారు. అందుకే బ్లాగర్లందరూ కాంగ్రెస్‌ పార్టీకి, చిదంబరానికి రుణపడి ఉండాలి. ఇక మీ అభిప్రాయం చెప్పడమే తరువాయి.

Wednesday, March 20, 2013

హిందుత్వమనేది ఒక మతం కాదు, హిందూ దేవీ దేవతలు అఖండ ప్రకృతి శక్తులకు ప్రతీకలు మాత్రమే : ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌

    భారతదేశంలో వివిధ రకాలైన ప్రజలు ఆరాధించే లేదా ఆచరించే వివిధ రకాలైన ఆరాధనా పద్దతులను ఒక మతంగా పరిగణించలేమని ముంబయిలోని ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఒక కేసులో వ్యాఖ్యానించడం భారతీయ సమాజంచే స్వాగతించబడుతుంది. భారతదేశంలో చరిత్ర పూర్వ యుగం నుండే ఎన్నో వేల రకాల ప్రజలు నివసిస్తున్నారు. వారు ఎన్నో విధమైన మత విశ్వాసాలు కలిగియున్నారు. విభిన్నమైన ప్రకృతి శక్తుల్ని లేదా ప్రతీకల్ని కొలుస్తూ ఉన్నారు. నిజానికి వారందరూ తమ తమ మత విశ్వాసాల దృష్ట్యా వేర్వేరు అయినప్పటికీ, వారందరినీ కలిపి ఉంచింది మాత్రం భారత సంస్కృతి ఒక్కటే. అదే వేద సంస్కృతి. ఈ దేశంలోని ప్రజలు ఏనాడు మతం పేరు చెప్పి కలహించుకోలేదు. దేవుడి పేరు చెప్పి ఇతరుల్ని దోచుకోలేదు, చంపలేదు. ఎంత విభిన్నమైనప్పటికీ వారందరినీ కలిపి ఉంచింది మాత్రం అఖండ ప్రకృతి శక్తుల ఆరాధన మాత్రమే. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు నిజానికి భారతీయ వేదాంత సారాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే ఆచితూచి చేసిన వ్యాఖ్యానంగా మనం గమనించవచ్చు. కాని, బయటి వారికి మాత్రం హిందూ మతం ఒక మతమే కాదన్న వాదన చేయడానికి ఒక ఆయుధంగా పనికివస్తుంది. ట్యాక్స్‌ ఎగ్గొట్టడానికి హిందూ సంస్థలు చేసే ప్రయత్నంగా కొన్ని బ్లాగుల్లో ప్రచురించడం చూసాను. అటువంటి వారు ఎన్ని చెప్పినా వాస్తవం మాత్రం ఒక్కటే.

    భారతీయ తత్వ దర్శనం ప్రకారం భగవంతుడు ఎక్కడో వేరే లోకంలో ఒక రూపంతో ప్రత్యేకంగా ఉండడు. భారతీయ దైవానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా లేదు. అటువంటి దైవం గురించి ఎవరో ఒక మనిషి లేదా ప్రవక్త చెప్పలేదు. నేను చెప్పిందే నిజమని ఎవరూ చెప్పలేదు. దైవాన్ని ఎవరికి వారే తెలుసుకోమన్నారు. ఒక భారతీయుడు అఖండ ప్రకృతిలో ఉన్న అనంతమైన శక్తిలో  దైవాన్ని దర్శిస్తాడు. అందుకే వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలో మొదటి సూక్తం 'అగ్నిమీళే పురోహితమ్‌' అంటూ అగ్నిని స్తుతించడంతో ప్రారంభమవుతుంది. భారతీయ దైవాలు మిగిలిన మతాల్లోలాగా కేవలం ఊహాత్మకం (Abstract)  కాదు. అంటే ఎవరో చెప్పారు కాబట్టి నమ్మడం కాదు. ఎక్కడో ఒక గ్రంధంలో రాసారు కాబట్టి మనం కూడా ఉన్నారనే భావన చేయడం కాదు. కళ్ళెదురుగా ఉండే వాస్తవం. అదే ప్రకృతి దర్శనం. భారతీయ సంస్కృతిలో ప్రధానంగా పూజలందుకొనే శివుడు, విష్ణువు, దుర్గ వంటి వారందరూ కూడా ప్రకృతి శక్తులే.

    శివునికి ప్రత్యేకించి ఒక రూపం లేదు. ఆయన లింగాకారుడు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న తత్వమే శివ తత్వం. శరీరంలో ఉన్న ప్రాణమే శివుడు అంటారు (శివపురాణం). అందుకే శివుడికి ఆత్మలింగం ఉంటుంది. ఆత్మయే శివుడు. ఆ శివుడు వెళ్ళిపోతే మిగిలిందే శవం. అంటే జీవుడి నుండి శివుడు వేరయితే అది శవం. అంటే జాతి, కుల, మత బేధం లేకుండా ప్రతి ప్రాణిలో ఉండే ప్రాణమే శివుడు. అది ఏ జాతి అయినా, ఏ దేశమయినా, ఆఖరికి మన ప్రపంచం కాకుండా వేరే లోకమైనా కూడా అందరిలోను శివతత్వాన్ని చూడవచ్చు. దీన్నే విశ్వజనీయత ( Universality) అంటారు. ఈ విశ్వాసానికి ఏ మత గ్రంధం అక్కర్లేదు. ఎవరూ చెవిలో ఇల్లు కట్టుకుని, పోరుపెట్టి చెప్పనక్కర్లేదు. పాంప్లెట్లు పంచనక్కర్లేదు.

    ఇక విష్ణువు విషయానికి వస్తే, విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. మరోలా చెప్పుకుంటే ఈ విశ్వమే విష్ణువు (విశ్వం విష్ణ్ణు: - విష్ణు సహస్రనామ స్తోత్రం, మొదటి నామం), లోకాలన్నీ ఎవరిలోనైతే ఇమిడి ఉన్నాయో, ఎవరైతే ఈ లోకాలన్నిటిలోను నివాసం ఉంటున్నాడో ఆయనే (ఆ మహాశక్తే) విష్ణువు. (వాసితం భునవత్రయం - సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే). అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతీ జీవి, ప్రతీ వృక్షం, ప్రతీ మనిషీ - మరలా చెబుతున్నాను, కేవలం ఈ దేశంలోనో, ఈ మతంలోనో కాదు, జీవించి ఉన్న ప్రతీ జీవి కూడా, విష్ణువే అని భారతీయ దర్శనం. భారతీయ సంస్కృతిలో మరో విశేషమేమిటంటే, ప్రకృతిని మాతృ భావనతో ఆరాధించడం. అదే దుర్గా స్వరూపం. ఇంతటి ఉన్నతమైన భావన కేవలం భారతీయులకు మాత్రమే ఉన్నదని నేను గర్వంగా చెప్పగలను. నేను మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి గురించి స్పష్టమైన అవగాహన ఉన్నవారు ఎవరైనా చెప్పగలరు.

    ఇక ట్రిబ్యునల్‌ వ్యాఖ్యల్లో భారతీయ జీవిత విధానాన్ని ఒక మతంగా గుర్తించలేము అన్న దానికి కూడా విస్తృతమైన అర్థం ఉంది. మతం అంటే అందరికీ సమ్మతమైనది. ఒక జన సమూహం ఆచరించే ఆరాధనా పద్దతులు ఒకేలా ఉంటే అపుడు దాన్ని మతం అనవచ్చు. లేదా ఒక వ్యక్తి చెప్పినదాన్ని ఆచరించే వాళ్ళని ఒక మతంగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో చాలా మతాలు ఆ విధంగా ఏర్పడినవే. వాటికి సార్వజనీనత ఉండదు. క్రీస్తు చెప్పాడు కాబట్టి క్రైస్తవం ఏర్పడింది. మహ్మద్‌ ప్రవక్త చెప్పాడు కాబట్టి ఇస్లాం ఏర్పడింది. బుద్దుడు చెప్పిన బోధనలన్నీ కలిసి బౌద్ధ మతంగా ఆచరిస్తున్నారు. కాని  భారతీయ తత్వ దర్శనం ఆ విధంగా ఒక వ్యక్తి చెప్పడం వల్ల కాని, ఒక కాలంలో కాని ఏర్పడలేదు. చరిత్రకు పూర్వం, అంటే ఈ మతాల కుమ్ములాటలు ఏవీ లేని కాలంలో, ప్రపంచంలో దేశాలకి కృత్రిమ సరిహద్దులేవీ లేని కాలంలో, మానవులంతా ఒక్కటే  అనే ఉదాత్త భావన రాజ్యమేలిన కాలంలో ప్రాచీన మహర్షులకి వచ్చిన అత్యున్నత ఆలోచనల పరంపరే భారతీయ సంస్కృతి. అందుకే హిందు మతం అనే పదాన్ని భారతీయ సంస్కృతికి తగిలించలేము. మతం అనే చట్రంలో భారతీయతని బంధించలేము. భారతీయ ధర్మం సార్వజనీనమైనది. అంటే ప్రతీ సమాజం, ప్రతీ జాతి ఆచరించదగినది. ఇది మతం కాదు - ధర్మం. ధర్మాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. మంచి సమాజాన్ని సాధించవచ్చు. ధర్మాన్ని ఆచరించకపోతే అది సమాజ హానికి దోహదం చేస్తుంది. అందుకే ఈ సనాతన ధర్మం గురించి ఎవరూ ప్రచారం చేయలేదు. నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది. అది అగ్ని ధర్మం. దీని గురించి మైకుల్లో హోరెత్తించనక్కర్లేదు, టి.వి.ల్లో చెప్పనక్కర్లేదు. సూర్యుడు అందరికీ జీవ ప్రదాత. ఆయన లేకపోతే ఈ ప్రపంచంలో జీవులే లేవు. వాటికి ఆహారమూ లేదు. సూర్యుడు ఒక్క రోజు కనబడకపోయినా ఈ ప్రపంచం అల్లకల్లోలమవుతుంది. ఆయన గనుక ఉదయించకపోతే ఇక మీరు చెప్పుకునే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. ఇది ఊహ కాదు, వాస్తవం. అందుకే సూర్యుడు ప్రత్యక్ష దైవం. ప్రపంచంలో మొట్టమొదట ఆరాధించిన వాళ్ళలోను, ఇప్పటికీ సూర్యుడిదే అగ్రస్థానం. సూర్యుడి గురించి ఎవరికీ ఎవరూ చెప్పనక్కర్లేదు, కళ్ళెదురుగా కనిపించే సత్యం. అటువంటి సూర్యుడిని ఆరాధించే వాళ్ళది ఒక ప్రత్యేకమైన మతం ఎందుకవుతుంది? అటువంటి ఆరాధనకు ఏ పేరు పెడతారు?

    కేవలం ఊహాత్మక (ఆబ్‌స్ట్రాక్ట్‌) దేవుళ్ళని ఆరాధించే వాళ్ళకయితే ఒక ప్రత్యేకమైన మతం కావాలి. దాన్ని ప్రచారం చేయడానికి ఎన్నో కల్పనలు, ఎంతో సరంజామా కావాలి. పాంప్లెట్లు, పోస్టర్లు, పుస్తకాలు, టి.విలు, ఇంటర్‌నెట్‌లు ఇలా ఒకటేమిటి? ఎంతో ప్రచార సామాగ్రి కావాలి. ఎంతో మంది అమాయకులు కావాలి. ఇవన్నీ చాలకపోతే కత్తులు, బాంబులు కూడా కావాలి. కాని భారతీయ ధర్మానికి ఇవేమీ అక్కర్లేదు. ఇది ఒక ప్రత్యేకమైన సమూహం కాదు. భారతీయ ధర్మం ఆచరణలో ఎన్నో రకాల పద్దతులున్నాయి. అవి వేటికవే ప్రత్యేకం. విగ్రహాలని తామస పద్దతిలో పూజిస్తూ, వాటికి బలులిచ్చే వాళ్ళున్నారు. అవే విగ్రహాలని వేదానుసారం ప్రాణ ప్రతిష్ట చేసి, భక్తి మార్గంలో సాత్వికంగా ఆరాధించే వాళ్ళున్నారు. అసలు ఏ విగ్రహంతోను పని లేకుండా కేవలం యోగ సాధన ద్వారా భగవంతుని చేరుకోవచ్చుననే వాళ్ళున్నారు. లేదా భగవంతుడు ఎక్కడున్నాడు అంటూ జ్ఞాన మార్గం ద్వారా సాధన చేసేవాళ్ళున్నారు. ఇవన్నీ కాదు మంచి పనులు చేయడం ద్వారా మాత్రమే దేవుడిని చేరుకోవచ్చు అని నమ్మి, సమాజ సేవ చేసే కర్మ యోగులున్నారు. ఆఖరికి దేవుడే లేడు అని వాదించే నాస్తికులు కూడా ఉన్నారు. సమాజంలో ఏ విధమైన ఆలోచన చేసినా, ఏ పూజా పద్దతి పాటించినా విజ్ఞానమంతా విష్ణువు నుండి ఉద్భవించినదే. (యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ: వేదా శాస్త్రాణి విజ్ఞానమ్‌ ఏ తత్సర్వం జనార్థనాత్‌ -  విష్ణు సహస్రనామ శ్లో). అంటే కేవలం ఒక విశ్వాసమో, ఒక ప్రార్థనా పద్దతి మాత్రమే భారతీయ దైవ పద్దతి కాదు. అది ఎన్నో విశ్వాసాల కలయిక. అన్ని విశ్వాసాలు  ఎక్కడా అరమరికలు లేకుండా కలిసి ఉంటాయి. ఏ పద్దతి అవలంభించినప్పటికీ వారు మిగతా వారితో కలహించుకోలేదు, ఎప్పటికీ కలహించుకోరు. పైగా ఒక పద్దతిలో వీలుకాకపోతే మరో పద్దతిలో దైవం గురించి ప్రయత్నించవచ్చు. వ్యక్తి ఆలోచనకి స్వేచ్చనిస్తూ, ఎవరిపైనా బలవంతంగా రుద్దకుండా, తమ ఇష్టమైన పద్దతిలో దైవాన్ని చేరుకోవచ్చు అనే విశాల భావన కేవలం భారతీయ ధర్మంలోనే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఉన్నది మతం కాదు - ధర్మం మాత్రమే అని ఘంటాపధంగా చెప్పవచ్చు.

    ఇటువంటి చక్కటి ఆలోచన చేయడానికి స్ఫూర్తినిచ్చిన ముంబయి ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ వారి వ్యాఖ్యలకి భారత జాతి ఋణపడి ఉంటుంది.