Pages

Monday, June 3, 2013

పగటి వేషగాళ్ళకి, సినిమా హీరోలకీ తేడా ఏమిటి?

    నేటి సమాజం మొత్తం సినిమా ప్రభావానికి లోనయి ఉంది. ఏ టి.వి. ఛానల్‌ చూసినా సినిమా ఆధారిత కార్యక్రమాలు ఉంటున్నాయి. ఏ మాటలు మొదలు పెట్టినా అవి చివరికి సినిమావైపు మళ్ళుతున్నాయి. ఇక యువత అయితే సినిమాకి బాగా ఎక్కువగా ప్రభావితమవుతున్నది. సినిమాలో  కళాకారులు వేసే వేషభాషల్ని అనుకరించడం నాగరికతగా భావించడం, అదే చాలా గొప్పగా ఆలోచించడం మనం చూస్తూనే ఉన్నాము. మంచి చెడ్డలు చెప్పాల్సిన తల్లిదండ్రులు గాని, సంస్కారం నేర్పాల్సిన పెద్దలుగాని ఈ విషయంలో ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు. వారు కూడా ఎంతో కొంత సినిమా ప్రభావానికి లోనవడం వల్ల, పిల్లలకి ఎటువంటి మేలు చేకూర్చలేకపోతున్నారు. మితిమీరిన అశ్లీలత, హింస, పరిమితి లేని భావోద్వేగాల వ్యక్తీకరణ ఎంత ఎక్కువగా ఉంటే అంత 'మాస్‌' సినిమాగా, కథంటూ ఏదీ లేకపోయినా, అదే గొప్ప సూపర్‌హిట్‌ సినిమాగా చలామణీ అవుతున్నది.

    వీటన్నిటి కంటే అత్యంత ప్రమాదకరమైనది వ్యక్తిపూజ. దాన్నే ఇంగ్లీష్‌లో 'హీరో వర్‌షిప్‌' అంటారు. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, అతని వ్యక్తిత్వం, సమాజ హితం కోసం అతడు చేసే త్యాగాలు, ఇవన్నీ కలిపి ఒక సామాన్యుడిని నిజమైన హీరోని చేస్తాయి. ఇంకా మంచి గుణాలున్న వ్యక్తి దేవుడిగా ఆరాధించబడతాడు. యుగపురుషుడిగా కీర్తించబడతాడు. హీరోలనే వాళ్ళు ప్రతి సమాజంలోను కనబడతారు. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాలలో, సమాజం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనే వేళ ఆయా పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొని, ఎవరైతే తమ ప్రయత్నంలో సఫలీకృతమయ్యి, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారో వారే నిజమైన హీరోలు. పురాతన కాలంలో ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఆధునిక కాలంలో ఒక శివాజీ, ఒక గాంధీజీ, జీవితాన్ని సౌకర్యవంతం చేయడానికి కష్టపడ్డ ఒక శాస్త్రవేత్త, ... వీరందరూ హీరోలే. సమాజాన్ని ఒక మలుపు తిప్పిన కథానాయకులే. అటువంటి వారిని ఆరాధించడంలో ఏ తప్పులేదు. వారిని అనుకరించడంలో ఎటువంటి ఇబ్బందిలేదు. హీరోల కథలు చదివిన వారిలో స్ఫూర్తినింపుతాయి. వారిని అనుకరించిన వారిలో మంచి లక్షణాలు కనబడతాయి. ఇది వ్యక్తిగతంగానే కాకుండా, సమాజ పరంగా కూడా ఎంతో మంచిని కలుగజేస్తుంది. వారిలాగానే త్యాగాలు చేయడానికి, సమాజ శ్రేయస్సుకోసం పాటుపడడానికి మరింత మందికి ఉత్తేజం కలిగిస్తుంది.

    కాని, ఇప్పటి సమాజంలో హీరో అనే పదానికి అర్థమే మారిపోయింది. సినిమా అనే మాధ్యమం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో అప్పటి నుండి హీరో పదం తన అర్థాన్ని మార్చేసుకుంది. వెండి తెర వెలుగునీడల్లో ముఖానికి రంగులేసుకుని, ఆయా రకాల నాటకాలు వేసే పగటి వేషగాళ్ళందరూ హీరోలు అయిపోయారు. రంగుల ప్రపంచంలో మైమరచిపోయి, నిజమైన ప్రపంచానికి, మాయా లోకానికి తేడా మర్చిపోయి, ఆయా పాత్రలు వేసిన వాళ్ళందరినీ నిజమైన హీరోలే అనుకునే స్థితికి మన సమాజం దిగజారిపోయింది. వెండి తెరపైన రంగులేసుకుని గెంతులు వేసే వారందరికీ సమాజం లేని విలువను ఆపాదించింది. అటువంటి వారందరికీ స్టార్‌లని బిరుదులివ్వడం, యుగపురుషులని కీర్తించడం, మహానుభావులని ప్రచారం చేయడం... ఇవన్నీ అవసరమా? అనిపిస్తుంది. నిజానికి ఈ వెండితెర హీరోలందరూ చేసిన పనేమిటి? పగటి వేషం వేయడం మాత్రమే కదా... మనం ఇచ్చే డబ్బుల కోసం రకరకాల వేషాలు వేయడం, మన వినోదం కోసం కిందా మీదా పడడం, ఎవరో రాసిన డైలాగులు పలకడం, మరెవరో చెప్పినట్టు నటించడం... ఈ మాత్రం దానికే వారికి అన్ని బిరుదులు ఇవ్వడం, సన్మానాలు చేయడం అవసరమా?

    వీటన్నిటికీ తోడు సినిమా రంగంలో కూడా రాజరికం వచ్చేసింది. తెలుగు సినిమాలో మరీ దారుణం. ఇక్కడ హీరో అవ్వాలంటే మరో పెద్ద హీరో కొడుకు గాని, లేకపోతే మరో పెద్ద నిర్మాత మనుమడు గాని అయి ఉండాలన్న భావం రాజ్యమేలుతోంది. పూర్వం నాటకాల్లో స్టేజి ఎక్కాలంటే ఎన్నో అర్హతలు చూసేవారు. సందర్భానుసారంగా శరీర ఆకృతి, భావ వ్యక్తీకరణ - ఆంగికం, స్పష్టంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడగలిగిన నేర్పు, భాష మీద పట్టు - వాచికం, నాటకాన్ని రక్తి కట్టించగలిగే నటన,.... ఇవన్నీ నటులకి ఉంటేనే రంగస్థలం మీదకి వెళ్ళనిచ్చేవారు. ఇవి లేకపోతే అటువంటి నటుల వల్ల నాటకం పాడయితే అది మొత్తం నాటక సమాజానికి చెడ్డ పేరు తెస్తుందని భయపడేవారు. కాని ఇప్పటి నటుల వారసులకి, అదేనండి బలవంతంగా రుద్ద బడ్డ హీరోలకి పైన చెప్పబడిన లక్షణాలేవీ ఉండనక్కర్లేదు. ముఖం బాగా లేకపోతే ప్లాస్టిక్‌ సర్జరీ చేయిస్తారు. మాటలు సరిగ్గా లేకపోతే అదో కొత్త వింత కింద జనం మీద రుద్దుతారు. తెలుగు ఎంత చెత్తగా మాట్లాడితే అంత గొప్ప. ఇక నటించడం రాకపోయినా ఫర్లేదు. ఎడిటింగ్‌లో సర్దుబాటు చేస్తారు. ఇంకా బాగా రాకపోయినా, గ్రాఫిక్స్‌లో సరిచేస్తారు. ఇంత బలవంతంగా తయారైన హీరోని బలవంతంగా జనం మీద రుద్దుతారు.  వీళ్ళు తప్ప మరెవ్వరూ బాగా చేయలేరు అనే భావన కలుగజేస్తారు. మధ్య మధ్యలో మా వంశం ఇంత గొప్పది, అంత గొప్పది, మేము తప్ప మరెవ్వరూ ఇంత చెత్తగా నటించలేరు అని డైలాగులు చెప్పిస్తారు. వీలయితే పాత తరంలో వాళ్లని కూడా ఒకసారి చూపిస్తారు. వినోద రంగం కూడా కులాల వారీగా, కుటుంబాల వారీగా విడిపోయింది. ఇంతటి దారుణం మరే ఇతర పరిశ్రమలోను చూడమేమో.

    సినిమా అనేది ఒక రంగుల కల. 25 రకాల వృత్తి నిపుణలు కలిసి, దర్శకుడు కనే ఒక అందమైన కలకి దృశ్య రూపం ఇస్తారు. కెమెరా, ఎడిటింగ్‌, మ్యూజిక్‌, మేకప్‌, కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌, ఆర్టిస్టులు... ఇలా విభిన్న రకాల నిపుణలు కలిసి, ఎంతో కాలం కష్టించి, ఒక సినిమాని నిర్మిస్తారు. సినిమా అందంగా రావడంలో కనీసం 200 నుండి 300 మంది సాంకేతిక నిపుణుల శ్రమ ఉంది. వీరందరి శ్రమ కలిసి, ఒక వ్యక్తిని హీరోగా తెర మీద చూపిస్తారు. కాని వీరందరి శ్రమను ఒక్క హీరోయే దోచుకోవడం నిజంగా చాలా దారుణం, నీచం కూడా. ఇంత మంది కష్టపడ్డప్పుడు వచ్చిన లాభం నిపుణులందరికీ సమానంగా ఉండాలి కాని, ఎవరో ఒకరే దోచుకెళ్ళడం బాధాకరం.

    ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే యువత అటువంటి రంగుల వలలో పడకూడదనేది నా ఆవేదన. నటులంటే గౌరవం ఉండొచ్చు, వారి నటనకి మైమరచిపోవచ్చు. కాని అదంతా సినిమా వరకే. నటులు కూడా మామూలు మనుష్యులే. మేకప్‌ తీసేస్తే, వాళ్ళని కనీసం చూడను కూడా చూడలేం. ముసలి హీరోలు విగ్గు పెట్టకుండా, మేకప్‌ వేయకుండా బయట కనబడితే కనీసం ఎవరూ పలకరించరు కూడా. అటువంటి రీల్‌ లైఫ్‌ హీరోలు వ్యక్తిగతంగా, నైతికంగా  కూడా ఎంతో దిగజారి ఉంటారు. ఒక మామూలు మనిషి వీరికంటే ఎంతో ఉన్నతంగా ప్రవర్తిస్తాడు కూడా. మనందరిలో ఒక మంచి ఇంజనీర్‌, ఒక డాక్టర్‌, ఒక శాస్త్రవేత్త, ఒక శ్రామికుడు, ఒక నిపుణుడు.... ఇలా ఎంతో మంది ఉండొచ్చు. మేకప్‌ తీసిన పగటి వేషగాడు మీకన్నా గొప్పవాడు కాడు. మీరు సమాజానికి ఒక రకంగా ఉపయోగపడితే, ఒక నటుడు పది మందికీ వినోదాన్నిస్తూ, తన జీవితాన్ని గడుపుతున్నాడు. అంత మాత్రం చేత మీ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందని, కాలేజ్‌ ఎగ్గొట్టడం, ఇంట్లో అమ్మానాన్నలు కష్ట పడి సంపాదించింది వాళ్ళతో దెబ్బలాడో, దొంగతనం చేసో బ్లాక్‌లో టికెట్లు కొనడం, బ్యానర్లు రాయించడం, స్నేహితులకి పార్టీలు ఇవ్వడం.... ఇవన్నీ దారుణమైన నేరాలు. పగటి వేషగాళ్ళని అనుకరిస్తూ, ఫ్యాన్స్‌ అని చెప్పుకోవడం బాగానే ఉంటుంది గాని, చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. వ్యక్తి పూజ హద్దుల్లో ఉంటే ఫర్వా లేదు, కాని, అది హద్దులు మీరి మీ జీవితాన్ని పాడు చేసే స్థితికి తెచ్చుకోవద్దు. ఒక ఆడపిల్లని ఏడిపించడం, ప్రేమలోకి దించడం, వెర్రిమొర్రి వేషాలు వేయడం, ఎక్కడపడితే అక్కడ పిచ్చి గెంతులు వేయడం, అడ్డొచ్చిన ప్రతి వాడిని నరికేయడం వంటివి రీల్‌ లైఫ్‌లో బాగానే ఉంటాయి. కాని రియల్‌ లైఫ్‌లో అటువంటివి చేస్తే జనం రాళ్ళిచ్చుకొని కొడతారు.

    జీవితంలో వినోదం ఒక అంశం మాత్రమే. అది మాత్రమే జీవితం కాదు. మీ కేరీర్‌ కన్నా ముఖ్యమైనది, మీ జీవితంకన్నా ముఖ్యమైనది మరేదీ ఉండదు, ఉండబోదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. హీరోల చేతుల్లో కాదు. మీకేదన్నా జరిగితే మీ అమ్మానాన్నలు, మిగిలిన  కుటుంబ సభ్యులు ఆదుకుంటారు గాని, మీ హీరోలు మాత్రం కాదు అని గుర్తుంచుకోండి. చివరిగా మరొక్క విషయం... సినిమాలో నటించే వాళ్ళందరూ పగటి వేషగాళ్ళు మాత్రమే. వాళ్ళు ఎప్పటికీ నిజ జీవితంలో హీరోలు కాలేరు.

13 comments:

  1. excellent ... baga chepparu

    ReplyDelete
  2. నిజానికి బలవంతంగా రుద్దుతున్నారు అనేకంటే.. మనమే వారిని బలవంతంగా రుద్దించుకుంటున్నాం అంటే బావుంటుంది. అభిమానం ఉండొచ్చు, కాని రిలీజైన రోజే చూసెయ్యాలని ఎగబడేంత తొక్కలో బానిసత్వం అక్కరలేదు. ప్రతి హీరోకీ కొన్ని మంచి సినిమాలూ మరికొన్ని అతిచెత్త సినిమాలూ ఉంటాయి. చిన్న హీరోల సినిమాలు కూడా చూస్తూ, ఒకవేల నచ్చితే ఫ్రెండ్స్ కి రికమెండ్ చేయటం మంచిది. అలా చేయటం ద్వారా ప్రేక్షకులే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, మంచి పోటీని సృష్టించగలరు.

    ReplyDelete
  3. Yes. What you said is 100% true. Suresh

    ReplyDelete
  4. నేనెప్పుడో "సోహం" అనే ఒక కథ చదివాను. అందులో ఒక పాత్ర ఇలా అంటుంది, "ఈ సినిమా హీరోలకంటే నేనే గొప్ప వాడిని. నేను పది రుపాయలు విసిరేస్తే (ఆ కాలంలో) వాళ్ళు నా ముందు అన్ని కళలూ ప్రదర్శిస్తారు," అని. వితండ వాదమే కావచ్చు. కానీ ఈ "హీరో వర్షిప్" కంటే ఇలాంటి attitude ఉండడమే మంచిది.

    బాగా రాశారు.

    -మురళి

    ReplyDelete
  5. hero worship వీరారాధన వ్యక్తిపూజ రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ వర్జించాలి, తప్పొప్పులూ బలాలూ బలహీనతలూ సమదృష్టితో చూడగలగాలి!మాటిమాటికీ పదేపదే తమ వంకరటింకర పిల్లలను హీరోలుగా చూపిస్తే తప్పనిసరి ఐ చచ్చినట్లు చూస్తున్నారు!ఏమి చేస్తారు పాపం! సినిమా ఒక్కటే mass entertainment కదా!అప్పటికీ తమ అయిష్టాన్ని అప్పుడప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు కదా!దాసరి నారాయణరావు కే.రాఘవేంద్ర రావు పుత్రులను outright గా reject చేయలేదా?నిర్మాత పుత్రులలో పిసరంత talent ఉన్నా సాంకేతిక హంగులతో ఊదరగొట్టి బాక్సాఫీస్ వద్ద jockpot కొట్టాలని డబ్బుసంచుల కట్టులు విప్పి ఎంతయినా ఖర్చు చేయ ఒడంబడుతున్నారు!బతక నేర్చిన దర్శకులు కొత్త టాలెంట్ జోలికిపోకుండా బలిసిన నిర్మాతల మూతులు మళ్ళీ మళ్ళీ నాకుతూ తరించామనుకుంటున్నారు తెలుగుసినిమా బావిలో బెకబెకలాడే కప్పల్లా అదే తమ లోకమనుకుంటున్నారు!

    ReplyDelete
  6. శభాష్ జగదీశ్ గారు,
    ఇట్లాంటి ఘాటైన విమర్శలు ఎల్లెడలా వినిపించాలండి. నిజానికి ఇవన్నీ అందరికీ తెలిసిన నిజాలే. మొహమాటానికో అభిమానానికో పోయి బయటికి మాట్లాడరు. ఎవరైనా మాట్లాడినా ఒప్పుకోరు.

    ReplyDelete
  7. 100% true. బాగా రాసారు

    ReplyDelete
  8. అంతే కదండీ మరి....

    ReplyDelete
  9. రోజు రోజుకీ పెరిగిపోతున్న వ్యక్తి పూజ, వినోదం ముసుగులో యువతకు జరుగుతున్న అనర్ధాన్ని చూసి, సహించలేక ఆవేదనతో మాత్రమే రాసాను. నాకు ఎవరిమీద వ్యక్తిగత అభిమానం గాని, ద్వేషంగాని లేవు. అర్ధం చేసుకుని స్పందించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు..

    ReplyDelete
  10. please visit my blog
    http://ahmedchowdary.blogspot.in/

    ReplyDelete
  11. Good post.బాగా రాసారు

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.