Pages

Sunday, November 28, 2010

మనసును చెమర్చిన జ్ఞాపకాలు - సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మ్యూజియం



కార్తీక మాస విహార యాత్రల సందడి మొదలయ్యింది. మా కాలేజ్‌లో విద్యార్థినులు ప్రతి రోజు విహారయాత్ర కోసం నన్ను అడుగుతూ ఉంటే, రాజమండ్రి వెళదామని ప్రపోజ్‌ చేసాను. అలా అన్నానే గాని ఎక్కడికి వెళ్ళాలో నాకూ పూర్తిగా ఆలోచన లేదు. వాటర్‌ వరల్డ్‌కు తీసుకువెళితే బాగుంటుందని సన్నిహితులు సలహా యిచ్చారు. కాని వినోదంతో బాటుగా పిల్లలకు విజ్ఞానం కూడా లభించే విధంగా టూర్‌ ప్లాన్‌ చేద్దామని అనిపించింది. నిన్న ఉదయం మొత్తం నాలుగు బస్సుల్లో అందరం కలిసి విహార యాత్రకు బయలుదేరాము. ధవళేశ్వరం బ్యారేజ్‌ మీద కొద్ది సేపు బస్సులు ఆపుచేయించి, గోదావరి అందాలని చూస్తూ, చల్లగా వీచే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అందరూ మైమరచిపోయారు. అప్పుడు గుర్తుకు వచ్చింది. అవతలి గట్టు మీదకు చేరగానే అక్కడ సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మ్యూజియం ఉందని. ఎప్పటి నుంచో నేనూ ఒకసారి వెళదామని అనుకుంటున్నాను గాని వెళ్ళడం కుదరలేదు. వెంటనే బస్సు డ్రైవర్లను పిలిచి తరువాత మనం ఆగవలసిన చోటు మ్యూజియం అని చెప్పేసాను. అలా అన్నానే గాని, అక్కడి గొప్పతనం ఏమిటో, ఎలా ఉంటుందో నాకే తెలియదు. ఇక పిల్లలకి ఏమి చెబుతాను. మొత్తానికి ఉదయం 11: 30 ని.లకు అక్కడకు చేరుకున్నాం.

    ధవళేశ్వరం బ్యారేజ్‌ మీద నుండి ఊళ్ళోకి వచ్చే బ్రిడ్జి ప్రక్కన గోదావరి గట్టున ఉన్నది ఈ కాటన్‌ మ్యూజియం. మ్యూజియంకి వెళ్ళే దారిలో అటూ ఇటూ పచ్చని చెట్లతో మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. లోపలికి వెళ్లడానికి మనిషికి 2 రూపాయిలు టిక్కెట్‌. పరిసరాలన్నీ చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. చక్కటి గార్డెన్‌ కూడా ఉంది. మధ్యలో ఠీవీగా నుంచుని ఉంది రెండు వందల సంవత్సరాల చరిత్రకు సాక్షిగా నిలబడిన చక్కటి భవనం. ఆ భవనంలోకి వెళుతుంటే మనసు అప్రయత్నంగా ఉద్విగ్నతకు లోనయింది. ఈ రోజు గోదావరి జిల్లాలు ఇంత సుసంపన్నంగా ఉండడానికి కారణమైన ఒక మహావ్యక్తి నివసించిన భవనం అదే అని తెలిసి ఒక పవిత్ర భావానికి లోనయ్యాను. మ్యూజియం లోపల గత కాలపు చరిత్రను చక్కగా చెప్పే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాటన్‌ జీవిత విశేషాలు, ఆయన వాడిన పరికరాలు, గోదావరి నదిపై కట్టిన ఆనకట్ట నిర్మాణ విశేషాలు, గోదావరి డెల్టా వివరాలు, ఆనకట్ట నమూనా, ఆక్విడెక్టుల వివరాలు ఇలా ప్రతి గదిలోను ఎన్నో విశేషాలు కొలువై ఉన్నాయి.

    1830వ సం||రంలో గోదావరి జిల్లాల్లో అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయట. తినడానికి తిండి లేక, పశువులకు గ్రాసం దొరక్క గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయట. ఆనాటి లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో సుమారు రెండు లక్షల మంది మృత్యువాత పడ్డారు. వేరే దారిలేక పుట్టిన పసికందుల్ని పిల్లల్ని సంతలో అమ్ముకునే వారట. అటువంటి దుర్బర పరిస్థితుల్లో ఇక్కడికి దేవుడి రూపంలో వచ్చాడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌. కేవలం 15 సం||ల వయసులోనే బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఒక సామాన్య ఉద్యోగిగా వచ్చి, ఇక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుని, ఇక్కడి ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో నీటి పారుదల రంగంపై పరిశోధనలు చేసి, గోదావరి నదిపై ఆనకట్ట కట్టి నీటిని నిలువ ఉంచి, కరువు పరిస్థితులను ఎదుర్కోవాలని బ్రిటిష్‌ గవర్నమెంట్‌కు నివేదిక పంపించాడట. వారు దానికి అనుమతి నివ్వడంతో కాటన్‌ రంగంలో దిగారు. అప్పటిలో అంటే 150 సం||ల క్రితం ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో గుర్రం మీద తిరుగుతూ, దొరికిన పళ్ళనే తింటూ, గోదావరి తీరంపై అనేక పరిశోధనలు చేసారు. ఆనకట్ట నిర్మాణానికి అనువైన ప్రదేశం కోసం తిరుగుతూ పాపి కొండల నుండి ధవళేశ్వరం వరకూ తిరిగి, అనేక కష్టనష్టాలను, బాధలను తట్టుకుంటూ చివరికి ధవళేశ్వరం ప్రాంతాన్ని ఆనకట్ట నిర్మాణానికి అనువైన ప్రదేశంగా గుర్తించారు. పాపికొండల ప్రాంతంలో గోదావరి ఉరవడి ఎక్కువగా ఉండటం, ఆ రోజుల్లో రెండు కొండల మధ్య ఆనకట్ట నిర్మాణానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మాణం కావించారు. పని మొదలు పెట్టిన మూడు సంవత్సరాలు వ్యవధిలోనే ఆనకట్ట నిర్మాణం పూర్తి కావించడం కాటన్‌ ఉక్కు సంకల్పానికి నిదర్శనం.

    ఈనాటి మన వాళ్లు అంటే భారతీయులం అని చెప్పుకునే వాళ్ళు ఆయన్ని చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మన దేశస్థుడు కాకపోయినా, ఇక్కడి వాళ్ళ పట్ల అభిమానంతో రేయనక, పగలనక శ్రమించి, పూర్తి కమిట్‌మెంట్‌తో ఫలితాన్ని సాధించి అందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటి రాజకీయ నాయకుల్లో, ఇంజనీర్లలో, కాంట్రాక్టర్లలో (అందరూ పేరుకు భారతీయులే, దేశభక్తులే) ఎంత మందిలో అటువంటి కమిట్‌మెంట్‌ ఉంటుంది. ఈ రోజు వేసిన రోడ్డు, రేపు వర్షం కురవగానే పెచ్చులూడిపోతుంది. అటువంటిది 150 సం||లుగా కొద్దిపాటి మరమ్మత్తులతో ఆనకట్ట పనిచేస్తుందంటే ఆయన నిర్మాణ చాతుర్యానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఇప్పటి రాజకీయ నాయకులు ప్రాజక్టును సంవత్సరాల కొద్దీ సాగదీస్తున్నారు. ప్రాజెక్టు పూర్తికాకుండానే కాలువలు తవ్వేస్తున్నారు. కనీసం వాలు కూడా చూస్తున్నారో లేదో అనుమానమే. అటువంటిది ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో గుర్రం మీద, కాలి నడకనా, సరైన రోడ్లు కూడా లేని సమయంలో డెల్టా అంతా పర్యటించడం మాటలు కాదు. నీటి వాలు కనిపెట్టి ఆ రోజు తవ్విన కాలువలు ఈ రోజుకూ డెల్టాకు అన్నం పెడుతున్నాయి. ఇచ్చిన పనిని ఏదో ఒక రకంగా తూతూ మంత్రంగా దులిపేసే నేటి మన ఇంజనీర్‌ ఆఫీసర్లకి, ఆనాటి కాటన్‌ దొరకి ఎంత తేడాయో కదా.

    కేవలం జీతం కోసం మాత్రమే పని చేసుంటే సవాలక్ష ఇంజనీర్లలో ఒకరిగా కాటన్‌ మిగిలిపోయేవాడు. కాని గుండెల నిండా కమిట్‌మెంట్‌, ప్రజలకు మేలు చేయాలనే తపనతో పని చేయడం వల్లనే కాటన్‌ ఒక మహామనీషి కాగలిగాడు. అందరికీ ఆదర్శం కాగలిగాడు. ఆయన నివసించిన ప్రదేశాన్ని కూడా ఈ రోజుకీ మనం గౌరవిస్తున్నామంటే అది ఆయన కృషి వల్ల మాత్రమే. ఇలా మా విద్యార్థినులకి కాటన్‌ గొప్పతనాన్ని చెబుతూ, మనసులో చెమర్చిన కృతజ్ఞతా భావం కన్నులలో నీటి రూపంలో తిరుగుతూండగా, దానికి ఆనకట్ట కట్టమని కాటన్‌ను స్మరించుకుంటూ, తిరిగి బస్సులలో బయలుదేరి రాజమండ్రి పయనమయ్యాము.

Tuesday, November 23, 2010

అమెరికా అధ్యక్షుని అనవసరమైన భయాలు

    ‘రాజు వెడలె రవి తేజములలరగ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత దేశ యాత్ర ఆర్భాటంగా పూర్తయింది.  భారత ప్రజల అభిమానాన్ని సంపాదించడానికో లేదా ఇక్కడున్న పెట్టుబడులు, మార్కెట్లను ఆకర్షించడానికో లేదా మనస్ఫూర్తిగానో భారత ప్రజల పట్ల ఒబామా చాలా అభిమానాన్ని ఒలకపోసారు. ఆయన ప్రసంగంలో భారత దేశం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల ఎన్నో మంచి భావనలు వ్యక్తమయ్యాయి. మరో పదేళ్ళలో భారతదేశం ప్రపంచాన్ని శాసిస్తుందని, ఆర్థిక వ్యవస్థ విషయంలో చైనాను, అమెరికాలను మించిపోతుందని ఆయన ప్రశంసించారు. కాని ఆయన భయాలు చాలా వరకు అర్థరహితమైనవి. ఇక్కడి వాస్తవాలని గమనిస్తే ఆయన అలా అని ఉండకపోవచ్చు. లేదా నిజం తెలిసినా కావాలని అబద్ధమైనా చెప్పుండాలి.

    ఒబామా చెప్పిన విషయాలన్నీ నిజం కావాలంటే మనం చాలా కష్టపడాలి. ఇంకా మారాల్సింది కూడా చాలా ఉంది. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు చెప్పుకుందాం.

1. వర్క్‌ కల్చర్‌: మన దేశంలో ఎక్కువ శాతం మందికి లేనిది ఇదే. పని చేయాలంటే బద్దకం. ఏదో వంక పెట్టి తప్పించుకోవాలని చూసేవాళ్ళే ఎక్కువ. దీనికితోడు పెళ్ళిళ్ళు, చావులు, పండుగలు, పేరంటాలు అంటూ ప్రతీ సారి ఏదో ఒక సాకు చెప్పి పనికి ఎగనామం పెడతారు. మన వాళ్ళకి డబ్బుతో పెద్దగా పనిలేదు. ఉన్నదానితోనే తృప్తిగా బ్రతికేస్తారు. అందుకే పని మానేసిన రోజున జీతం పోతుందని తెలిసినా, లెక్కచేయరు. గట్టిగా వర్షం వచ్చినా, ఎండకాసినా ఆ రోజుకు పనికి ఎగనామమే.

2. పని మీద శ్రద్ద: ఎవరు ఎన్ని చెప్పినా మనవాళ్ళకి పని మీద శ్రద్ద ఉండదు. ప్రపంచంలో అందరికంటే ఎంతో తెలివైన వాళ్ళయినప్పటికీ, పనిని ఇంకా బాగా చెయ్యగలిగినప్పటికీ, మనం చెయ్యం. ఏదైన ఒక పనిని పూర్తి ఖచ్చితత్వంతో చేస్తే, దానినే పెర్‌ఫెక్షన్‌ అంటారు. ఏదో దులుపుకు వెళ్ళిపోదామనే ధ్యాసే తప్ప మనకి చేస్తున్న పనిలో నిజాయితీ ఉండదు. ఏదైనా ఒక చిన్న వస్తువు తయారు చేసే విషయమే తీసుకోండి. అమెరికా, జపాన్‌ దేశాల్లో తయారైన వస్తువులకి, ఇండియా, చైనాల్లో తయారైన వస్తువులకి నాణ్యత విషయంలో చాలా తేడా ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఎవరైనా విదేశాల నుంచి వచ్చి కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ స్థాపించినప్పటికీ, అందులో తయారయ్యే వస్తువులు మాత్రం నాణ్యతగా ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే.

3. నిజాయితీ: పని చేసేటపుడు నిజాయితీగా ఉంటేనే పైన చెప్పిన పెర్‌ఫెక్షన్‌ సాధ్యమవుతుంది. ఒక జర్మనీ లేదా జపాన్‌ కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎలా ఉంటాడో ‘డిస్కవరీ’ ఛానల్‌లో గమనిస్తే అర్థం అవుతుంది. కార్లు కంపెనీల్లో పనిచేసే వాళ్ళతో ఇంటర్వ్యూ చూపించినపుడు ఇది నా దేశంలో తయారయిందని ప్రపంచమంతా తెలియాలి అని చెప్పడం నేను గమనించాను. తయారైన కారు లేదా రాకెట్‌ను పని పూర్తయిన తరువాత ప్రేమతో తాకడం కూడా చూసాను. చేసే పనిని వారు అంత నిజాయితీగా ప్రేమిస్తారు. మనం నేర్చుకోవాల్సింది అదే.

4. దేశభక్తి: దేశభక్తి డైలాగులు చెప్పడం గాని, గేయాలు రాయడంలోగాని మనకు మనమే సాటి. కాని ఆచరణలోకి వచ్చేసరికి దేశభక్తి అనేదే ఎక్కడా కనిపించదు. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం. అంటే సాటి భారతీయుడిని ప్రేమించడం. కాని అలా ఎవరైనా చేస్తున్నారా? రాజకీయ నాయకులకు, ఆఫీసర్లకు లంచాలు తీసుకోవడంలో ఉన్న శ్రద్ద పరిపాలనలో ఉండదు. లంచం తీసుకుని సాటి దేశస్థుడిని అవమానిస్తున్నామనే కనీస జ్ఞానం కూడా వారికి ఉండదు. వీళ్లకి లంచాలు ఇవ్వడం కోసం, ఉన్న క్వాలిటీని చంపేసి నిధులన్నీ కాంట్రాక్టర్లు స్వాహా చేసేస్తారు. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి వేసిన రోడ్లు, డ్రైనేజి, ప్రాజెక్టులు వంటివి కనీసం సంవత్సరం కూడా ఉండవు. రోడ్లు పెచ్చులూడిపోయి, కంకర బయటకి వచ్చి, దుమ్ము లేచిపోతూ ఉంటాయి. డ్రైనేజిలో నీరు సరిగ్గా పారదు. అరే, ఇది మన దేశం.... మన కన్నా చిన్న దేశాలు కూడా రోడ్లు చాలా అందంగా వేసుకుంటాయి....  మనల్ని చూసి అందరూ నవ్వుతారనే సిగ్గు కూడా ఎవరికీ ఉండదు.

5. ప్లానింగ్‌: మనకి ప్లానింగ్‌, సమన్వయం అనేది ఏ కోశానా ఉండదు. అది మునిసిపాలిటీ రోడ్ల విషయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముందు రోడ్‌ వేసేస్తారు. తరువాత డ్రైన్‌ కోసం ఆ రోడ్‌ తవ్వేస్తారు. మళ్ళీ రోడ్‌ వేస్తారు. తరువాత టెలిఫోన్‌ తీగల కోసం మళ్ళీ తవ్వేస్తారు. కొన్నాళ్ళకి వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ వారు తవ్వేస్తారు. ఇలా అందరూ తవ్వేసిన తరువాత శుభ్రంగా రోడ్‌ పోసి, ఈ సారి గ్యాస్‌పైప్‌లైన్‌ కోసం మళ్ళీ తవ్వేస్తారు. ఒక్క రోడ్‌ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా భవిష్యత్తు గురించి, అప్పుడు కలగబోయే అవసరాల గురించి ఎవరూ ఆలోచించరు. అప్పటికి ఆ పని అయిపోతేచాలు. బ్రిటిష్‌ వారు వంద, నూట యాభై సంవత్సరాల క్రితమే రోడ్స్‌, రైల్వే లైన్‌ వేసినపుడు అటూ ఇటూ కూడా భవిష్యత్‌ అవసరాల కోసం మరో రెండు లేన్లు వేసుకోవడానికి వీలుగా భూ సేకరణ చేసేసి ఉంచారు. అటువంటి దూరాలోచన మనకి ఎప్పుడు వస్తుందో... ఇప్పుడున్న ‘దురాలోచన’ల్లోంచి ఎప్పుడు మనం బయటపడతామో...

చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఇంత కన్నా ఎక్కువ తిట్టుకున్నా తిట్టే నాకు, చదివే మీకు బోర్‌ కొడుతుంది. వీటిలో కనీసం కొన్నింటినైనా రాబోయే తరంలో కొందరైనా మార్చుకుని, ఇండియా అంటే సోమరిపోతుల దేశం కాదని, నిజంగానే కష్టించి పనిచేసే నిజాయితీ కలిగిన దేశం అని ప్రపంచంలో అందరూ మెచ్చుకొనేలా చేయగలగడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అది మన దగ్గర నుండే మొదలవ్వాలి. ‘చీకటిని తిడుతూ కూర్చునే కన్నా చిరు దీపం వెలిగించాలి’ అది ఎవరో అని ఎదురు చూసే కన్నా మనమే ముందు ఆ దీపాన్ని వెలిగిస్తే మరికొంత మందికి చక్కటి దారి చూపించగలిగిన వారం అవుతాము.   అపుడు ఒక్క అమెరికా మాత్రమే కాదు, మిగతా అందరు దేశాల అధ్యక్షలు వారి స్వార్థం కోసం కాకుండా, నిజంగానే మన దేశాన్ని చూసి, మన శక్తిని చూసి భయపడే రోజు, గౌరవించే రోజు వస్తుంది.

Sunday, November 14, 2010

ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన 'స్కైలైన్‌ (విధ్వంసం)'

హాలీవుడ్‌ సినిమాలంటే ప్రత్యేకించి స్పెషల్‌ ఎఫెక్టుల కోసమే థియేటర్‌కు వెళ్ళి మరీ సినిమా చూస్తుంటారు. వాల్‌ పోస్టర్స్‌ చూసి దారుణంగా మోసపోయిన సినిమా 'స్కెలైన్‌'. హాలీవుడ్‌లో సినిమాలను ఇంత దారుణంగా, దరిద్రంగా తీస్తారా అనిపించింది. ఎప్పుడు థియేటర్‌ నుండి బయటకు పారిపోయి వచ్చేద్దామా అనిపించింది. దాన్ని రిలీజ్‌ చేసింది కూడా రిలయన్స్‌ బిగ్‌ పిక్చర్‌. కేవలం స్పెషల్‌ ఎఫెక్టుల్ని మాత్రమే నమ్ముకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా మొత్తాన్ని కేవలం ఐదుగురు ఆర్టిస్టులతో తీసారు. అదీ ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో. ట్రైలర్స్‌లో, వాల్‌పోస్టర్స్‌లో చూపించే కాస్త ఎఫెక్ట్స్‌ ఏవైతే ఉన్నాయో వాటినే సినిమా మొత్తం కొన్ని పదుల సార్లు రిపీట్‌ చేసారు. లాస్‌ఏంజిల్స్‌ నగరంగాని, అలియన్స్‌తో ఫైట్‌ చేయడానికి వచ్చిన ఫ్లైట్లుగాని అన్నీ కంప్యూటర్‌ మీద చేసినవే.

స్టోరీ లైన్‌: చెప్పడానికి ఏమీ లేదు.

స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ఒకే ఎఫెక్ట్‌ని పదిసార్లు రిపీట్‌ చేసారు

డైరెక్షన్‌: తీసునోడికే తెలిసుండదు.

చూసినోళ్ళ పరిస్థితి: వెళ్ళేపుడు జండూ బామ్‌ కొనుక్కోవడమే.

నాలాగా ఇంకెవ్వరూ బాధ పడకూడదని, డబ్బులు పాడుచేసుకోకూడదని ఈ చిన్న రివ్యూ పెట్టారు. దీన్ని టైప్‌ చేయడానికి నేను తీసుకున్న టైమ్‌ కూడా వృధా..

Tuesday, November 2, 2010

సెల్‌ ఫోన్లు - సొల్లు కబుర్లు

పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళి సీట్లో కూర్చున్నా.. చాలా ఇంపార్టెంట్‌ వర్క్ ఉంది... పనిలో దూకడానికి రెడీ అయ్యాను. సెల్‌ మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని ఫోనెత్తాను...
‘నూనె డబ్బా రేటు ఎలా ఉందండి?’ అవతలి నుండి హడావుడిగా ప్రశ్న
‘ఇంతకీ మీరెవరండి?’ అడిగాను నేను.
‘మీ షాపు ఇంకా తియ్యలేదు కదా. ఎప్పుడు తీస్తారు?’
‘మీరెవరండి. నాకు నూనె షాపు లేదండి’
‘అదేమిటండీ? మీ నెంబరు ఈ బోర్డ్ మీద ఉంది. అది చూసే ఫోన్‌ చేస్తున్నాను’ అవతలి వ్యక్తి జవాబు.
నాకు మండిపోయింది. నెమ్మదిగా విషయం అర్థం అయింది. షాప్‌ బోర్డ్ మా ప్రెస్‌లో తయారై ఉంటుంది. దాని మీద మా ఆపరేటర్‌ నా సెల్‌ నెంబర్‌ వేసుంటాడు. మొదట్లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ కోసం నా మొబైల్‌ నెంబరు ప్రింట్‌ చేసే వాళ్ళం. కాని, ఇలాంటి తలకాయపోట్లు ఎక్కువై పోయాక వెంటనే ల్యాండ్‌ లైన్‌ నెంబర్‌ మాత్రమే ప్రకటనల్లో ఉంచుతున్నాను. ఆపరేటర్‌ని పిలిచి ఇంకెప్పుడూ నా సెల్‌ నెంబర్‌ ఎక్కడా ప్రింట్‌ చేయొద్దని చెప్పాను.

ఇంకో రకం హింస ఉంటుంది. ఒక కుర్రాడు వచ్చాడు. ‘సార్‌, మా వెడ్డింగ్‌ కార్డ్స్‌ ప్రింట్‌ అయ్యాయా’ అని అడిగాడు. ఒక్క నిముషం అని చెప్పి, గుమాస్తాని పిలవడం కోసం బజర్‌ నొక్కాను. ఈ లోపలే ఆ కుర్రాడు సెల్‌ తీసి మాట్లాడుతూ ఉంటాడు. ‘డాడీ, వెడ్డింగ్‌ కార్డ్స్ ఇంకా ప్రింట్‌ అవ్వలేదట.. ఒక్క నిముషం ఆగమంటున్నారు. ఉండనా... వచ్చేయనా... ఏమి చెయ్యమంటావు?’ అని. ‘నేను అవ్వలేదని చెప్పానా’ అని అడిగాను ఆ కుర్రాడిని. ముందు ఆ సెల్‌ఫోన్‌ కట్‌ చెయ్యి, తరువాత మాట్లాడదాం అని చెప్పాను. కట్‌ చేసిన తరువాత అతని వివరణ... ‘అంటే మీరు ఒక్క నిముషం అన్నారు కదా... అందుకని అవ్వలేదని అనుకుని ఫోన్‌ చేసానండి... ఒకవేళ అయిపోతే ఇచ్చేయండి. పట్టుకుపోతాను’ అన్నాడు. ‘ఈ మాత్రం దానికి ఫోన్‌ చెయ్యడం ఎందుకయ్యా. అనవసరంగా ఫోన్‌ వాడకండి అని సున్నితంగా మందలించాను.

ఇక కుటుంబ సభ్యుల మధ్య, లేకపోతే గుమాస్తాల మధ్య ఫోన్‌లకయితే లెక్కే ఉండదు. ఎవరికయినా దూరంగా ఉన్నారనుకుని ఫోన్‌ చేస్తే వాళ్ళు మనకు దగ్గరలో ఉన్నాగాని, లేదా పక్క గదిలో ఉన్నాగాని వెంటనే ఫోన్‌ ఎత్తేస్తారు. లేదా మాట్లాడుతూ నా దగ్గరకు వస్తారు. ఇదేమిటయ్యా, పక్క రూమ్‌లో ఉన్నపుడు వెంటనే నా దగ్గరకు రావచ్చు కదా. ఫోన్‌ ఎత్తడం దేనికి అని అడిగితే, ‘ఏదయనా అర్జంట్‌ పని ఉందేమో నని ఫోన్‌ ఎత్తాను సార్‌’ అంటారు. ఎన్ని సార్లు మందలించండి. అదే తంతు.

ఇంట్లో అడవాళ్ళకిచ్చిన సెల్‌ ఫోన్‌లకయితే ఇక చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ స్నేహితులతోనో, పుట్టింటి వాళ్ళతోనో మాట్లాడుతూనే ఉంటారు. కూరమాడిపోయినా పర్లేదు, పిల్లి పాలు తాగేసినా లెక్కలేదు, పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోరు. ఏమన్నా అంటే... అమ్మో అనే ధైర్యం కూడానా... మనలాంటి వాళ్లకి...

రోడ్‌పై వెళుతుంటే ఎక్కడ ఎవర్ని చూసినా నడుస్తూ, డ్రైవింగ్‌ చేస్తూ, పక్కన ఆగి ఇలా ఎటు చూసినా ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు. సెల్‌ ఫోన్స్ వల్ల ఎన్ని ఏక్సిడెంట్స్‌ అవుతున్నాయో ఎవరైనా సర్వే చేస్తే బాగుండును.

సెల్‌ఫోన్ల వాడకం ఎక్కువయిన తరువాత మనుషుల నోటికీ, చేతికీ కంట్రోల్ లేకుండాపోయిందేమో అనిపిస్తుంది. ఎవరితోనయినా ఏదయిన మాట్లాడాలనిపిస్తే వెంటనే ముందూ, వెనకా ఆలోచించకుండా సెల్ తీసి నంబర్ నొక్కేయడం. అవతలి వాళ్ళు ఏ పనిలో వున్నారో కూడా ఆలోచించకుండా నోటికి వచ్చింది వాగెయ్యడం, ఆనక ఎందుకలా అన్నానని బాధపడడం... ఇలాంటి వాళ్ళని బోలెడు మందిని చూసాను ఈ మధ్యన. కొంచెం ఆలోచించుకుని సెల్ మాట్లాడితే ఎన్నో అనర్ధాల నుంచి తప్పించుకోవచ్చు. 

సెల్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే రేడియేషన్‌ వల్ల అనారోగ్యం వస్తుందని, తొందరగా పోతారని చెప్పినా ఎవరికీ చెవికి / బుర్రకి ఎక్కడం లేదనుకుంటాను. అంతగా ఎక్కువ సేపు మాట్లాడడానికి ఏమి ఉంటుందో అర్థం కాదు. నిజంగా అవసరమైతే మహా అయితే ఒక నిముషమో, రెండు నిముషాలో మాట్లాడొచ్చుగాని, మరీ ఇంతలా.... జీవితంలో సగభాగం సెల్‌ఫోన్‌కే అంకితం చేసేస్తున్నారనిపిస్తుంది... ఈ జనాన్ని చూస్తుంటే... దేవుడా నువ్వే రక్షించాలి... ఈ దేశాన్ని... ఈ సెల్‌ ఫోన్ల నుండి.... ఈ సొల్లు కబుర్ల నుండి....