Pages

Tuesday, November 2, 2010

సెల్‌ ఫోన్లు - సొల్లు కబుర్లు

పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళి సీట్లో కూర్చున్నా.. చాలా ఇంపార్టెంట్‌ వర్క్ ఉంది... పనిలో దూకడానికి రెడీ అయ్యాను. సెల్‌ మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని ఫోనెత్తాను...
‘నూనె డబ్బా రేటు ఎలా ఉందండి?’ అవతలి నుండి హడావుడిగా ప్రశ్న
‘ఇంతకీ మీరెవరండి?’ అడిగాను నేను.
‘మీ షాపు ఇంకా తియ్యలేదు కదా. ఎప్పుడు తీస్తారు?’
‘మీరెవరండి. నాకు నూనె షాపు లేదండి’
‘అదేమిటండీ? మీ నెంబరు ఈ బోర్డ్ మీద ఉంది. అది చూసే ఫోన్‌ చేస్తున్నాను’ అవతలి వ్యక్తి జవాబు.
నాకు మండిపోయింది. నెమ్మదిగా విషయం అర్థం అయింది. షాప్‌ బోర్డ్ మా ప్రెస్‌లో తయారై ఉంటుంది. దాని మీద మా ఆపరేటర్‌ నా సెల్‌ నెంబర్‌ వేసుంటాడు. మొదట్లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ కోసం నా మొబైల్‌ నెంబరు ప్రింట్‌ చేసే వాళ్ళం. కాని, ఇలాంటి తలకాయపోట్లు ఎక్కువై పోయాక వెంటనే ల్యాండ్‌ లైన్‌ నెంబర్‌ మాత్రమే ప్రకటనల్లో ఉంచుతున్నాను. ఆపరేటర్‌ని పిలిచి ఇంకెప్పుడూ నా సెల్‌ నెంబర్‌ ఎక్కడా ప్రింట్‌ చేయొద్దని చెప్పాను.

ఇంకో రకం హింస ఉంటుంది. ఒక కుర్రాడు వచ్చాడు. ‘సార్‌, మా వెడ్డింగ్‌ కార్డ్స్‌ ప్రింట్‌ అయ్యాయా’ అని అడిగాడు. ఒక్క నిముషం అని చెప్పి, గుమాస్తాని పిలవడం కోసం బజర్‌ నొక్కాను. ఈ లోపలే ఆ కుర్రాడు సెల్‌ తీసి మాట్లాడుతూ ఉంటాడు. ‘డాడీ, వెడ్డింగ్‌ కార్డ్స్ ఇంకా ప్రింట్‌ అవ్వలేదట.. ఒక్క నిముషం ఆగమంటున్నారు. ఉండనా... వచ్చేయనా... ఏమి చెయ్యమంటావు?’ అని. ‘నేను అవ్వలేదని చెప్పానా’ అని అడిగాను ఆ కుర్రాడిని. ముందు ఆ సెల్‌ఫోన్‌ కట్‌ చెయ్యి, తరువాత మాట్లాడదాం అని చెప్పాను. కట్‌ చేసిన తరువాత అతని వివరణ... ‘అంటే మీరు ఒక్క నిముషం అన్నారు కదా... అందుకని అవ్వలేదని అనుకుని ఫోన్‌ చేసానండి... ఒకవేళ అయిపోతే ఇచ్చేయండి. పట్టుకుపోతాను’ అన్నాడు. ‘ఈ మాత్రం దానికి ఫోన్‌ చెయ్యడం ఎందుకయ్యా. అనవసరంగా ఫోన్‌ వాడకండి అని సున్నితంగా మందలించాను.

ఇక కుటుంబ సభ్యుల మధ్య, లేకపోతే గుమాస్తాల మధ్య ఫోన్‌లకయితే లెక్కే ఉండదు. ఎవరికయినా దూరంగా ఉన్నారనుకుని ఫోన్‌ చేస్తే వాళ్ళు మనకు దగ్గరలో ఉన్నాగాని, లేదా పక్క గదిలో ఉన్నాగాని వెంటనే ఫోన్‌ ఎత్తేస్తారు. లేదా మాట్లాడుతూ నా దగ్గరకు వస్తారు. ఇదేమిటయ్యా, పక్క రూమ్‌లో ఉన్నపుడు వెంటనే నా దగ్గరకు రావచ్చు కదా. ఫోన్‌ ఎత్తడం దేనికి అని అడిగితే, ‘ఏదయనా అర్జంట్‌ పని ఉందేమో నని ఫోన్‌ ఎత్తాను సార్‌’ అంటారు. ఎన్ని సార్లు మందలించండి. అదే తంతు.

ఇంట్లో అడవాళ్ళకిచ్చిన సెల్‌ ఫోన్‌లకయితే ఇక చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ స్నేహితులతోనో, పుట్టింటి వాళ్ళతోనో మాట్లాడుతూనే ఉంటారు. కూరమాడిపోయినా పర్లేదు, పిల్లి పాలు తాగేసినా లెక్కలేదు, పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోరు. ఏమన్నా అంటే... అమ్మో అనే ధైర్యం కూడానా... మనలాంటి వాళ్లకి...

రోడ్‌పై వెళుతుంటే ఎక్కడ ఎవర్ని చూసినా నడుస్తూ, డ్రైవింగ్‌ చేస్తూ, పక్కన ఆగి ఇలా ఎటు చూసినా ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు. సెల్‌ ఫోన్స్ వల్ల ఎన్ని ఏక్సిడెంట్స్‌ అవుతున్నాయో ఎవరైనా సర్వే చేస్తే బాగుండును.

సెల్‌ఫోన్ల వాడకం ఎక్కువయిన తరువాత మనుషుల నోటికీ, చేతికీ కంట్రోల్ లేకుండాపోయిందేమో అనిపిస్తుంది. ఎవరితోనయినా ఏదయిన మాట్లాడాలనిపిస్తే వెంటనే ముందూ, వెనకా ఆలోచించకుండా సెల్ తీసి నంబర్ నొక్కేయడం. అవతలి వాళ్ళు ఏ పనిలో వున్నారో కూడా ఆలోచించకుండా నోటికి వచ్చింది వాగెయ్యడం, ఆనక ఎందుకలా అన్నానని బాధపడడం... ఇలాంటి వాళ్ళని బోలెడు మందిని చూసాను ఈ మధ్యన. కొంచెం ఆలోచించుకుని సెల్ మాట్లాడితే ఎన్నో అనర్ధాల నుంచి తప్పించుకోవచ్చు. 

సెల్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే రేడియేషన్‌ వల్ల అనారోగ్యం వస్తుందని, తొందరగా పోతారని చెప్పినా ఎవరికీ చెవికి / బుర్రకి ఎక్కడం లేదనుకుంటాను. అంతగా ఎక్కువ సేపు మాట్లాడడానికి ఏమి ఉంటుందో అర్థం కాదు. నిజంగా అవసరమైతే మహా అయితే ఒక నిముషమో, రెండు నిముషాలో మాట్లాడొచ్చుగాని, మరీ ఇంతలా.... జీవితంలో సగభాగం సెల్‌ఫోన్‌కే అంకితం చేసేస్తున్నారనిపిస్తుంది... ఈ జనాన్ని చూస్తుంటే... దేవుడా నువ్వే రక్షించాలి... ఈ దేశాన్ని... ఈ సెల్‌ ఫోన్ల నుండి.... ఈ సొల్లు కబుర్ల నుండి....

2 comments:

  1. సెల్ ఫోన్ల వాడకం ఎంత ప్రాణాంతకమంటే చాలా మంది చెవుల్లో ear phones పెట్టుకుని, ఫోన్లో చూస్తూ రోడ్డు దాటుతుంటారు. Horn కొట్టినా పట్టించుకోరు. ఎప్పటికి బుద్ధి వస్తుందో వీళ్ళకి.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.