‘రాజు వెడలె రవి తేజములలరగ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత దేశ యాత్ర ఆర్భాటంగా పూర్తయింది. భారత ప్రజల అభిమానాన్ని సంపాదించడానికో లేదా ఇక్కడున్న పెట్టుబడులు, మార్కెట్లను ఆకర్షించడానికో లేదా మనస్ఫూర్తిగానో భారత ప్రజల పట్ల ఒబామా చాలా అభిమానాన్ని ఒలకపోసారు. ఆయన ప్రసంగంలో భారత దేశం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల ఎన్నో మంచి భావనలు వ్యక్తమయ్యాయి. మరో పదేళ్ళలో భారతదేశం ప్రపంచాన్ని శాసిస్తుందని, ఆర్థిక వ్యవస్థ విషయంలో చైనాను, అమెరికాలను మించిపోతుందని ఆయన ప్రశంసించారు. కాని ఆయన భయాలు చాలా వరకు అర్థరహితమైనవి. ఇక్కడి వాస్తవాలని గమనిస్తే ఆయన అలా అని ఉండకపోవచ్చు. లేదా నిజం తెలిసినా కావాలని అబద్ధమైనా చెప్పుండాలి.
ఒబామా చెప్పిన విషయాలన్నీ నిజం కావాలంటే మనం చాలా కష్టపడాలి. ఇంకా మారాల్సింది కూడా చాలా ఉంది. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు చెప్పుకుందాం.
1. వర్క్ కల్చర్: మన దేశంలో ఎక్కువ శాతం మందికి లేనిది ఇదే. పని చేయాలంటే బద్దకం. ఏదో వంక పెట్టి తప్పించుకోవాలని చూసేవాళ్ళే ఎక్కువ. దీనికితోడు పెళ్ళిళ్ళు, చావులు, పండుగలు, పేరంటాలు అంటూ ప్రతీ సారి ఏదో ఒక సాకు చెప్పి పనికి ఎగనామం పెడతారు. మన వాళ్ళకి డబ్బుతో పెద్దగా పనిలేదు. ఉన్నదానితోనే తృప్తిగా బ్రతికేస్తారు. అందుకే పని మానేసిన రోజున జీతం పోతుందని తెలిసినా, లెక్కచేయరు. గట్టిగా వర్షం వచ్చినా, ఎండకాసినా ఆ రోజుకు పనికి ఎగనామమే.
2. పని మీద శ్రద్ద: ఎవరు ఎన్ని చెప్పినా మనవాళ్ళకి పని మీద శ్రద్ద ఉండదు. ప్రపంచంలో అందరికంటే ఎంతో తెలివైన వాళ్ళయినప్పటికీ, పనిని ఇంకా బాగా చెయ్యగలిగినప్పటికీ, మనం చెయ్యం. ఏదైన ఒక పనిని పూర్తి ఖచ్చితత్వంతో చేస్తే, దానినే పెర్‌ఫెక్షన్ అంటారు. ఏదో దులుపుకు వెళ్ళిపోదామనే ధ్యాసే తప్ప మనకి చేస్తున్న పనిలో నిజాయితీ ఉండదు. ఏదైనా ఒక చిన్న వస్తువు తయారు చేసే విషయమే తీసుకోండి. అమెరికా, జపాన్ దేశాల్లో తయారైన వస్తువులకి, ఇండియా, చైనాల్లో తయారైన వస్తువులకి నాణ్యత విషయంలో చాలా తేడా ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఎవరైనా విదేశాల నుంచి వచ్చి కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ స్థాపించినప్పటికీ, అందులో తయారయ్యే వస్తువులు మాత్రం నాణ్యతగా ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే.
3. నిజాయితీ: పని చేసేటపుడు నిజాయితీగా ఉంటేనే పైన చెప్పిన పెర్‌ఫెక్షన్ సాధ్యమవుతుంది. ఒక జర్మనీ లేదా జపాన్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎలా ఉంటాడో ‘డిస్కవరీ’ ఛానల్‌లో గమనిస్తే అర్థం అవుతుంది. కార్లు కంపెనీల్లో పనిచేసే వాళ్ళతో ఇంటర్వ్యూ చూపించినపుడు ఇది నా దేశంలో తయారయిందని ప్రపంచమంతా తెలియాలి అని చెప్పడం నేను గమనించాను. తయారైన కారు లేదా రాకెట్‌ను పని పూర్తయిన తరువాత ప్రేమతో తాకడం కూడా చూసాను. చేసే పనిని వారు అంత నిజాయితీగా ప్రేమిస్తారు. మనం నేర్చుకోవాల్సింది అదే.
4. దేశభక్తి: దేశభక్తి డైలాగులు చెప్పడం గాని, గేయాలు రాయడంలోగాని మనకు మనమే సాటి. కాని ఆచరణలోకి వచ్చేసరికి దేశభక్తి అనేదే ఎక్కడా కనిపించదు. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం. అంటే సాటి భారతీయుడిని ప్రేమించడం. కాని అలా ఎవరైనా చేస్తున్నారా? రాజకీయ నాయకులకు, ఆఫీసర్లకు లంచాలు తీసుకోవడంలో ఉన్న శ్రద్ద పరిపాలనలో ఉండదు. లంచం తీసుకుని సాటి దేశస్థుడిని అవమానిస్తున్నామనే కనీస జ్ఞానం కూడా వారికి ఉండదు. వీళ్లకి లంచాలు ఇవ్వడం కోసం, ఉన్న క్వాలిటీని చంపేసి నిధులన్నీ కాంట్రాక్టర్లు స్వాహా చేసేస్తారు. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి వేసిన రోడ్లు, డ్రైనేజి, ప్రాజెక్టులు వంటివి కనీసం సంవత్సరం కూడా ఉండవు. రోడ్లు పెచ్చులూడిపోయి, కంకర బయటకి వచ్చి, దుమ్ము లేచిపోతూ ఉంటాయి. డ్రైనేజిలో నీరు సరిగ్గా పారదు. అరే, ఇది మన దేశం.... మన కన్నా చిన్న దేశాలు కూడా రోడ్లు చాలా అందంగా వేసుకుంటాయి.... మనల్ని చూసి అందరూ నవ్వుతారనే సిగ్గు కూడా ఎవరికీ ఉండదు.
5. ప్లానింగ్: మనకి ప్లానింగ్, సమన్వయం అనేది ఏ కోశానా ఉండదు. అది మునిసిపాలిటీ రోడ్ల విషయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముందు రోడ్ వేసేస్తారు. తరువాత డ్రైన్ కోసం ఆ రోడ్ తవ్వేస్తారు. మళ్ళీ రోడ్ వేస్తారు. తరువాత టెలిఫోన్ తీగల కోసం మళ్ళీ తవ్వేస్తారు. కొన్నాళ్ళకి వాటర్ డిపార్ట్‌మెంట్ వారు తవ్వేస్తారు. ఇలా అందరూ తవ్వేసిన తరువాత శుభ్రంగా రోడ్ పోసి, ఈ సారి గ్యాస్‌పైప్‌లైన్ కోసం మళ్ళీ తవ్వేస్తారు. ఒక్క రోడ్ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా భవిష్యత్తు గురించి, అప్పుడు కలగబోయే అవసరాల గురించి ఎవరూ ఆలోచించరు. అప్పటికి ఆ పని అయిపోతేచాలు. బ్రిటిష్ వారు వంద, నూట యాభై సంవత్సరాల క్రితమే రోడ్స్, రైల్వే లైన్ వేసినపుడు అటూ ఇటూ కూడా భవిష్యత్ అవసరాల కోసం మరో రెండు లేన్లు వేసుకోవడానికి వీలుగా భూ సేకరణ చేసేసి ఉంచారు. అటువంటి దూరాలోచన మనకి ఎప్పుడు వస్తుందో... ఇప్పుడున్న ‘దురాలోచన’ల్లోంచి ఎప్పుడు మనం బయటపడతామో...
చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఇంత కన్నా ఎక్కువ తిట్టుకున్నా తిట్టే నాకు, చదివే మీకు బోర్ కొడుతుంది. వీటిలో కనీసం కొన్నింటినైనా రాబోయే తరంలో కొందరైనా మార్చుకుని, ఇండియా అంటే సోమరిపోతుల దేశం కాదని, నిజంగానే కష్టించి పనిచేసే నిజాయితీ కలిగిన దేశం అని ప్రపంచంలో అందరూ మెచ్చుకొనేలా చేయగలగడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అది మన దగ్గర నుండే మొదలవ్వాలి. ‘చీకటిని తిడుతూ కూర్చునే కన్నా చిరు దీపం వెలిగించాలి’ అది ఎవరో అని ఎదురు చూసే కన్నా మనమే ముందు ఆ దీపాన్ని వెలిగిస్తే మరికొంత మందికి చక్కటి దారి చూపించగలిగిన వారం అవుతాము. అపుడు ఒక్క అమెరికా మాత్రమే కాదు, మిగతా అందరు దేశాల అధ్యక్షలు వారి స్వార్థం కోసం కాకుండా, నిజంగానే మన దేశాన్ని చూసి, మన శక్తిని చూసి భయపడే రోజు, గౌరవించే రోజు వస్తుంది.
Correct
ReplyDeleteమీకు తెలీని సంగతొకటి చెపుతా! ఒబామా గారన్నది నూటికి ఎనభై శాతం నిజం! ఎక్కడ? ఆయన దేశంలో!
ReplyDeleteమనుషులుగా మనవాళ్లంటే ఎంత తిరస్కార భావం ఉందో, అదే మనుషుల పనంటే అంతే గౌరవమూ ఉంది! విచిత్రంగా లేదూ? అదే మరి! తెల్లతోలుకు మనకు తేడా!
మీకులానే చెప్పాలంటే చాలా ఉంది! కానీ, వదిలేస్తున్నా! :)
@ Indian Minerva గారు... Thanks
ReplyDelete@ వంశీ మోహన్ గారు... మీరు చెప్పింది నిజమే, మన వాళ్ళలో కూడా తప్పుందండి.. మన వాళ్ళు మన దేశంలో కష్టపడరు గాని, ఎక్కడయినా పరాయి దేశం వెళ్ళి గొడ్డుల్లాగా కష్టపడమంటే మాత్రం చక్కగా రెడీ అయిపోతారు...