Pages

Monday, January 6, 2014

బానిసత్వ సంకెళ్ళు తెంచుకొనే ప్రయత్నం - మోడీ ప్రతిపాదించిన కొత్త పన్ను విధానం

ఎప్పుడో బ్రిటిష్‌ వారి హయాంలో ఏర్పరిచిన కాలం చెల్లిన పన్నుల విధానాన్నే అవలంభిస్తూ, అందిన కాడికి ప్రజల్ని దోచుకొనే విధానానికి స్వస్తి పలుకబోతున్నామంటూ, భాజపా అభ్యర్థి నరేంద్ర మోడి నుండి స్పష్టమైన సంకేతాలు రావడం దేశ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది.

ప్రస్తుతం ఉన్న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వంటి ప్రత్యక్ష పన్నులు, సేల్స్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ డ్యూటీ వంటి ఎన్నో రకాల పన్నుల స్థానంలో లావాదేవీ పన్ను మాత్రమే విధిస్తే ఎలా ఉంటుందన్నదే ప్రస్తుత ఆలోచన. సాంప్రదాయ పన్నుల విధానంలో ఎవరికీ అర్తం కాని బ్రహ్మ పదార్థం వంటి పన్నులు, అవి వేటిమీద విధించాలో ఆయా శాఖల్లో ఉన్న తలపండిన అధికారులకే తెలియక తలపట్టుకుంటూ ఉంటారు. పన్ను మీద పన్ను, దాని మీద మరో పన్ను వంటివి మనం చాలా బిల్లుల్లో చూస్తూ ఉంటాము. కొన్ని రకాల వస్తువుల మీద ఎంత శాతం పన్ను వసూలు చేయాలో ప్రభుత్వానికే అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ప్రజల దగ్గర నుండి సంస్థలు  పరోక్ష పన్నులు వసూలు చేసినప్పటికీ అవి ప్రభుత్వానికి జమ అవుతున్నాయో లేదో తెలియని అయోమయం. మధ్యలో అధికారుల దందాలు, ఎవరికి తోచిన విధంగా వారు ఆయా చట్టాలకు భాష్యం చెబుతూ ప్రజల్ని మరింత అయోమయానికి గురి చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, తమ ఆదాయాన్ని పెంచుకొనే దారులు వెతుక్కుంటున్నారు. మధ్యలో బలయ్యేది ముమ్మాటికీ సామాన్య ప్రజలు మాత్రమే. ఈ మధ్యన ఒక వాణిజ్య పన్నుల అధికారి తిరుమల తిరుపతి దేవస్థానానికి యాత్రికులు విడిది చేసే గదులపై విలాసపన్ను కట్టమని తాఖీదు ఇచ్చాడట. అంటే ఇష్ట దైవాన్ని దర్శించుకుంటే అది విలాసం కింద లెక్కట. దేవుడిని దర్శించుకుంటే విలాసం ఎందుకవుతుందో ఆ ఏడు కొండల వాడికే తెలియాలి. ఒక్కొక్క ట్యాక్స్‌ మాన్యూల్‌ చూస్తే కొన్ని వేల పేజీలు ఉంటుంది. ఎవరికి అర్థం కాని సెక్షన్లు, ఎందుకూ పనికి రాని వివరణలు. ఇవన్నీ వలస పాలకులు భారత ప్రజల్ని ఇబ్బందులు పెట్టడానికి మాత్రమేనని, వారి కష్టాల నుండి తమ ఆదాయాన్ని పెంచుకొనే మార్గంగా ఏర్పరిచినవేనని చూడగానే అర్థం అవుతుంది. నేను ఎన్నో సార్లు ఈ విషయం గురించి ఆలోచించాను. మధ్య యుగాల్లోని ముస్లిం పాలకులు హిందువులపై ఆచరణ సాధ్యంగాని ఎన్నో రకాల పన్నులు విధించిన విషయం గుర్తుకు వచ్చేది. సంస్థానాల మీద బ్రిటిష్‌ పెత్తందార్లు విధించిన లెక్కకు మిక్కిలి పన్నులు గుర్తుకు వచ్చేవి. మనకు పేరుకు  స్వాతంత్య్రం వచ్చిన్పటికీ, కేవలం అధికార మార్పిడి మాత్రమే జరిగింది అనడానికి, సామాన్య ప్రజల కష్ట సుఖాల్ని పరిగణలోకి తీసుకోకుండానే పరిపాలన విధానాన్ని కొనసాగించారనడానికి ఈ పన్నుల విషయమే ఒక పెద్ద ఉదాహరణ.
 
ప్రస్తుత విషయానికి వస్తే నరేంద్ర మోడీ ఆలోచనలో నుండి పుట్టిన ఈ కొత్త పన్ను విధానం అన్ని విధాల స్వాగతించదగిందే. ఇన్‌కమ్‌ట్యాక్స్‌, సేల్స్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌ వంటి అన్ని రకాల పన్నుల్ని రద్దు చేసి, వాటి స్థానంలో కేవలం లావాదేవీ పన్ను మాత్రమే వసూలు చేయబూనడం ఒక మంచి ఆలోచన. అంటే బ్యాంకు ద్వారా జరిగే ప్రతి  లావాదేవీపై ఒక వాతం నుండి ఒకటిన్నర శాతం వరకు పన్నుగా వసూలు చేస్తారు. ఎవరికైనా కొంత మొత్తాన్ని ఇవ్వదలిచినా, వారి నుండి కొంత మొత్తాన్ని పొందదలచినా, ఈ పన్ను విధించబడుతుంది. ఈ విధానం విజయవంతం కావాలంటే నేను కొన్ని సూచనలు చేయదలిచాను.

1.  ముందుగా భారతదేశంలో ప్రతి పల్లెకు కనీసం ఒక బ్యాంకు శాఖను ఏర్పాటు చేయాలి. ఆ శాఖలన్నింటినీ కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ ద్వారా అంతర్జాలానికి అనుసంధానించాలి.

2. రూ. 100ల పైబడిన అన్ని నోట్లను (రూ.500, రూ. 1000) రద్దు చేయాలి. అంటే వాడకంలో లేకుండా చేయాలి.

3. కనీసం రూ. 10,000ల పైబడిన అన్ని లావాదేవీలనీ పూర్తి చేయడానికి ఖచ్చితంగా డెబిట్‌ / క్రెడిట్‌ కార్డు ఉపయోగించాలి.

4. ప్రతీ ఉద్యోగి జీతాన్ని నెల నెలా బ్యాంకులో వారి ఖాతాలో జమ చేయాలి.

5. ఎ.టి.యం.ల వాడకాన్ని నిరుత్సాహ పరచాలి. వాటిస్థానంలో వ్యాపార సంస్థల్లో (POS) స్వైపింగ్‌ మిషన్ల వాడకం పెంచాలి.

6. ఆదాయంపై ఉన్న అన్ని రకాల పరిమితుల్ని తొలగించాలి.ఉపయోగాలు:


1. సామాన్యులకు పన్ను నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. అతడు వినియోగించే చిన్న చిన్న వస్తువులపై ఎటువంటి పన్ను చెల్లించనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఒక వస్తువు తయారయ్యే వివిధ దశల్లో పన్ను చెల్లించబడింది కాబట్టి.

2. పైకి ఒక శాతంగా కనిపించినప్పటికీ, వస్తూత్పత్తి వివిధ దశల్లో పన్ను కట్టబడుతుంది కాబట్టి, చివరి దశకు వచ్చేప్పటికి ఆ పన్ను 10 నుండి 20 శాతం వరకు అవుతుంది.

3. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఒక శాతం అనేసరికి పన్ను కట్టడానికి ఎవరూ వెనకాడరు.

4. అవినీతిని పూర్తిగా అరికట్టవచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గరైనా లంచంగా పెద్దమొత్తంలో తీసుకొన్నప్పటికీ దాన్ని వస్తు రూపంలో మార్చడానికి వేరే దారి ఉండదు. బ్యాంకు ద్వారా లావాదేవీ చేస్తే రేపు ప్రభుత్వానికి ఖచ్చితంగా దొరికిపోతారు.

5. ఈ పన్నుల విధానం పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

6. బ్యాంకుల్లో పన్నును సేకరిస్తారు కాబట్టి, పన్ను అధికారులు, వారి కార్యాలయాలకు అయ్యే ఖర్చు ప్రభుత్వానికి కొన్ని వేల కోట్లు మిగులుతుంది. ప్రత్యేక పన్ను సేకరణ వ్యవస్థ ఉండనవసరం లేదు. ఇంత మందిని వేరే ఉత్పాదక రంగాలకు తరలించవచ్చు.

7. వినడానికి నిష్టూరంగా ఉన్నా, ప్రభుత్వ అధికారులకు ఇచ్చే లంచాలు ప్రత్యేకంగా కొన్ని లక్షల కోట్లు ప్రజలకు మిగిలిపోతాయి. వాటితో వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవచ్చు. ఆ విధమైన వ్యయంపై కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

8. ఆదాయంపై పరిమితి తొలగించడం వలన విదేశాలకు నల్లధనం తరలిపోవడం ఆగిపోతుంది. ఆ డబ్బంతా మన దేశంలోనే ఉండి ఉత్పాదక రంగం మెరుగవుతుంది. పన్ను కొద్ది శాతం మాత్రమే కావడం వలన ప్రతి ఒక్కరూ కట్టడానికి ప్రయత్నిస్తారు.
 
   ప్రజలకి నిజమైన సేవ చేయాలనుకుని, మనస్ఫూర్తిగా దేశాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు మాత్రమే ఇటువంటి ప్రగతిశీల ఆలోచనలు వస్తాయి. ఎంత సేపూ, పేదరికాన్ని నిర్మూలిస్తామని, అభివృద్ధి చేస్తామని వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే పనికిమాలిన నేతలకు ఇటువంటి ఆలోచనలు కలలో కూడా రావు. ఎంతసేపు ప్రజల నెత్తి మీద చెయ్యిపెట్టి, నుదుటి మీద వాసన చూసి, తరువాత వారి కష్టాన్ని దోచుకుని, వారికి ఎంతో చేస్తున్నట్టు నటించే నాయకులకు మన దేశంలో లెక్కలేదు. వారందరికీ భిన్నంగా ప్రజలకోసం నిజంగా ఆలోచించే మోడీ లాంటి వారిని స్వాగతించి, అధికారం అప్పజెప్పకపోతే దేశానికి ఎప్పటికీ భవిష్యత్తు ఉండదు.