Pages

Thursday, August 10, 2017

ఇండియా అనే పదం ఎక్కడ నుంచి వచ్చిందో మీకు తెలుసా?

    భారతదేశానికి 'ఆగష్టు'లో స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇండియా అనే పేరు వచ్చిందనే తప్పుడు ప్రచారం సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున సాగుతోంది. నిజానికి స్వాతంత్య్రానికి, ఇండియా పేరుకి ఏ సంబంధం లేదు.

    ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో అత్యున్నత నాగరికత వెలసింది. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, కళలు, భాష, సాహిత్యం వంటి అనేక రంగాలలో ఉజ్జ్వలమైన ప్రగతి సాధించింది. కేవలం భౌతిక పరమైన అభివృద్ది మాత్రమే కాకుండా, మానవ విలువల పరంగా, ఆధ్యాత్మికంగా, సంఘ పరంగా ఎవరూ ఊహించలేని అత్యున్నత స్థానానికి చేరుకుని, గురుస్థానాన్ని పొంది, ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం చేసింది.

    శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలకు, ఉపాధికి ఈనాటి ప్రపంచంలో అన్ని దేశాలు అమెరికా వైపు చూస్తున్నట్లుగానే, ప్రాచీన కాలంలో ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేది. ఆనాటి కాలంలో ఎవరైనా భారతదేశానికి వచ్చి, ఇక్కడ పర్యటిస్తే, వారికి వారి దేశాల్లో ''హిందూదేశాన్ని దర్శించినవాడు'' అనే బిరుదును ప్రదానం చేసేవారు. ఎన్నో రకాల విద్యలకు, కళలకు, వాణిజ్యానికి, శాస్త్రాలకు నిలయమైన హిందూ దేశాన్ని దర్శించడం అంటే వారి ఉద్దేశ్యంలో ఒక అద్భుత కార్యాన్ని సాధించిట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు.

    చారిత్రికంగా చూస్తే, భారతదేశంలో ప్రాచీన నాగరికత సుమారు 5000 సంవత్సరాలకు పూర్వమే సింధు నదీ తీరంలో ప్రారంభమయినట్లుగా తెలుస్తోంది. అందుకే విదేశీయులు ఈ నేలను సింధు దేశమనే పిలిచే వారు. యూరోపియన్లకు, భారతదేశానికి మధ్య వాణిజ్య సంబంధాలు ప్రధానంగా అరబ్బులు, పర్షియన్ల ద్వారానే జరిగేవి. ఇక్కడ నుండి వస్త్రాలు, వజ్రాలు, సాంకేతిక పరికరాలు, శాస్త్ర సంబంధ విషయాలు, ఆహార పదార్థాలు వంటివి భారతదేశం నుండి మిగతా ప్రపంచానికి అరబ్బుల ద్వారానే పరిచయమయ్యాయి. సామాన్య శక పూర్వం 300 సం||లకు ముందే పర్షియన్లు తమ భాషలో సింధ్‌ పదాన్ని 'హింద్‌' గా పలికేవారు. అందుకే ఈ దేశాన్ని 'హిందు స్థాన్‌'' గా వ్యవహరించేవారు.  అయితే యూరోపియన్ల భాషలో 'హ' అక్షరం సరిగా పలకలేరు. అందుచేత వారు 'హింద్‌' పదాన్ని 'ఇండ్‌'గా పలికేవారు. ఆ విధంగా మన దేశం పాశ్చాత్యుల వాడుకలో ఇండియాగా పిలవబడింది.

    ఇక్కడ ఇండియా అంటే 'హిందూ దేశం'గా అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏనాడూ ఎటువంటి మతమూ లేదు. ఉన్నదల్లా ఒక చక్కని జీవన విధానం. మంచి కుటుంబ వ్యవస్థ, మంచి ఆహార, ఆరోగ్య అలవాట్లు, ప్రకృతితో మమేకమైన జీవిత విధానం, ఆధ్యాత్మికంగా, సాంకేతికంగా ఎంతో పురోగమించిన సమాజం. ఇక్కడి మహర్షులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు ఏనాడూ తాము ఎంతో కృషిచేసి సాధించిన విజ్ఞాన ఫలాలతో వ్యాపారం చేయాలని అనుకోలేదు. వారికున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర సమాజాలపై ఆధిపత్యం చెలాయించాలని గాని, వారి దేశాల్ని, సంస్క ృతుల్ని ఆక్రమించుకోవాలనిగాని అనుకోలేదు. కాని, ప్రపంచమంతటా హిందూ జీవన విధానం విస్తరించింది. కొత్త మతాలు వచ్చేనప్పటికీ, ఈనాటికీ, ప్రపంచమంతటా అన్ని సమాజాల్లో అంతర్లీనంగా మానవత్వం వెల్లివిరిసేలా చేస్తున్న అదృశ్య జీవిత విధానం ఉందంటే అది ముమ్మాటికీ హైందవ జీవన విధానం మాత్రమే. ఈ పుణ్య భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ జన్మత: హిందువులే. ఇక్కడి ఆలోచనా విధానంతో ప్రభావితమైన వ్యక్తి, సమాజం, దేశం ఏదైనా సరే హిందూ దేశమే. ఇండియా అంటే హిందూస్థాన్‌ మాత్రమే.

జై హింద్‌

(ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ఆలోచనా మాలిక - మీ ఎస్పీ జగదీష్‌)