Pages

Friday, August 23, 2013

తెలంగాణా ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?

    రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక ప్రాంతం వారు తమకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని కోరుకుంటుంటే, మరో ప్రాంతం వారు అందరం కలిసి ఉందామని ఉద్యమాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా రెండు జాతుల మధ్య, తెగల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు చెలరేగినపుడు ఆ రెండు జాతుల ప్రజలు పరస్పరం ఘర్షించుకుని, విడిపోవడం చూస్తూ ఉంటాం. అది యుద్దం ద్వారా కావచ్చు, లేదా సామరస్య పూర్వకంగా కావచ్చు. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి విభిన్నమైన వాతావరణం నెలకొని ఉంది. ఇతర ప్రాంతాల వారు తమపై పెత్తనం చేస్తున్నారని, లేదా తమకు అందవలసిన వనరుల్ని తమకు దక్కనివ్వడం లేదని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణా ప్రాంతంలో తమ కష్టాన్ని ధారబోసి, పరిశ్రమలు స్థాపించి, మౌలిక వసతుల్ని సమకూర్చి, సంపదని సృష్టించిన తరువాత తమను గెంటివేయడం ఎంత వరకు న్యాయం అని సీమాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్య రెండు వైపులా పదునుగానే ఉంది. దీనికి పరిష్కారం కూడా కనుచూపు మేరలో కనబడడం లేదు.

    ఇక్కడ తెలంగాణా నాయకులు గాని, ప్రజలు గాని ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా కేవలం ఒక్కరి శ్రమ మీద గాని, మేథస్సు మీదగాని ఆధారపడి అభివృద్ధి చెందదు. ఒకవేళ అభివృద్ధి చెందినా అది సంపూర్ణం కానేరదు. ఉదాహరణకు అమెరికాని తీసుకుంటే, ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా అభివృద్ధి అంతా అనేక దేశాల ప్రజల సమిష్టి శ్రమ, మేథస్సుల ఫలితమే అని అర్థం అవుతుంది. అది ఒక స్వేచ్ఛా ప్రపంచం. ప్రపంచంలో ఏ దేశానికి చెందినా, ఏ మతానికి లేదా ఏ జాతికి చెందిన ప్రజలైనా, అమెరికా అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు. రెండవ ప్రపంచం యుద్ధ సమయంలో జర్మనీ నుండి వెళ్ళిపోయిన ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వంటి శాస్త్రవేత్తలకి అమెరికా ఆశ్రయం కల్పించింది. అంతకు ముందు కూడా బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా, భారత్‌ వంటి అనేక దేశాల నుండి వెళ్ళిన ప్రజలు అమెరికా అభివృద్ధికి అవిరళ కృషి సల్పారు. దాని మూలంగానే ఆ దేశం ప్రపంచాన్ని శాసించగల స్థాయికి చేరింది. ఇప్పుడు అమెరికా అభివృద్ధిలో ఒక భారతీయునికి ఎంత పాత్ర ఉందో, ఒక చైనా దేశీయునికి కూడా అంతే స్థానం ఉంది. ఆయా దేశాల ప్రజల్ని అమెరికా సమాజం నుండి వేరు చేసి చూడడం సాధ్యం కాదు. అందరూ తాము ఏదో ఒక దేశానికి చెందిన వారమని చెప్పుకుంటూనే, సమిష్టిగా అమెరికన్స్‌గా గుర్తించబడాలని ఆశిస్తారు. మధ్య యుగాల్లో అన్ని ఐరోపా దేశాలు మత మౌఢ్యంతో అంధకారంలో ఉన్నపుడు ఆయా దేశాల్లోని శాస్త్రవేత్తలకి బ్రిటన్‌ ఆశ్రయం ఇచ్చింది. వారి పరిశోధనా ఫలితాల్ని ఉపయోగించుకుని, బ్రిటన్‌ వంటి చిన్న దేశం ప్రపంచంపై అధికారాన్ని చెలాయించగలిగింది.

    తెలంగాణా విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. సీమాంధ్ర ప్రాంతాల్లో ఉన్న తెలివైన లేదా సంపన్న వర్గాలకి చెందిన అనేక మందికి హైదరాబాద్‌ ప్రాంతం ఒక అయస్కాంతంగా ఆకర్షించింది. దేశానికి నడిబొడ్డున్న ఉండడం, ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళడానికి రవాణా వంటి మౌలిక వసతులు కల్పించబడి ఉండడం, ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టు పక్కల ఎంతో విస్తారమైన, చౌకగా లభించే బీడు భూములు లభించడం వంటి కీలకమైన అంశాల వల్ల హైదరాబాద్‌ ఒక ప్రపంచ స్థాయి నగరం (కాస్మొపాలిటన్‌ సిటీ)గా విస్తరించబడింది. ఈ అభివృద్ధి అంతా కేవలం ఒక్క తెలంగాణా ప్రజల వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. దీని వెనుక కేవలం సీమాంధ్రుల కష్టం మాత్రమే కాక, గుజరాతీలు, రాజస్థానీయులు, మరాఠీయులు వంటి అందరి కష్టం ఇమిడి ఉంది. ఇంత మంది కష్టపడి ఒక మహోన్నత స్వప్నాన్ని సాకారం చేసుకున్నాక, అది మాకు మాత్రమే సొంతం అని ఆ ప్రాంతం వారు అంటే, ఎవరూ హర్షించరు. ఇప్పటి తెలంగాణా ఉద్యమ నాయకులమని ఎవరైతే చెప్పుకుంటున్నారో, వారు చేసిన, చేస్తున్న ప్రకటనలు ఇతర ప్రాంతాల వారిలో భయాందోళనలు పెంచుతున్నాయి. ముందు చెప్పుకున్నట్టుగా హైదరాబాద్‌ నగరం నుండి ఇతర ప్రాంతాల వారిని పంపించి వేసినట్లయితే, ఇక అభివృద్ధి అనేది సాధ్యం కాదు.

    దీనికి నిలువెత్తు ఉదాహరణ బర్మా (ఇప్పటి మియన్మార్‌). ఒకప్పుడు రంగూన్‌ (బర్మా రాజధాని) వెళ్ళివచ్చారంటే ఒక ప్రత్యేకత ఉండేది. పాత తరం ఇళ్ళలో ఇప్పటికీ రంగం సామాను (రంగూన్‌కి ఏర్పడ్డ దేశ్యం) చూడవచ్చు. కాని, ఆ దేశం ప్రజాస్వామ్యం నుండి ఒక నియంత పాలనలోకి వెళ్ళింది. ఆ నియంత పాలనలో బర్మా నుండి బయటి దేశస్థులందరినీ, వారి వారి దేశాలకి గెంటివేసాడు. ఒక్క సారిగా అక్కడి అభివృద్ధి ఆగిపోయింది. ఎన్ని సహజ వనరులు ఉన్నప్పటికీ పరిపాలన సరిగా లేకపోవడం వలన, విదేశీ మేధావి, శ్రామిక వర్గం అండదండలు లేకపోవడం వల్ల, బర్మా ఒక్కసారిగా అధఃపాతాళంలోకి కూరుకుని పోయింది. ఒకప్పటి అందరి కలల ధామం - ఇప్పటి ఒక నిరుపేద దేశం. దీనికంతటికి ముఖ్య కారణం ప్రాంతీయ బేధాలు, సంకుచిత ఆలోచనా దృక్పధం మాత్రమే.

    తెలంగాణా నాయకులు మరో ముఖ్య వాదన - సీమాంధ్ర నాయకుల వలన తమ ప్రాంతం అభివృద్ధి చెందడం లేదు అని. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. హక్కుల్ని పోరాడి సాధించుకోవడంలో ఉన్న ఓర్పు నేర్పు బాధ్యతల్ని నెరవేర్చే క్రమంలో కూడా ఉండాలి. సీమాంధ్ర నేతలు కేవలం హైదరాబాద్‌ రాజధాని ఉండడం వల్ల ఆ ఒక్క ప్రాంతంపై మాత్రమే అధికారం కలిగి ఉంటారు. కాని, తెలంగాణాలో మిగిలిన ప్రాంతం అంతా ఆయా ప్రాంత ప్రజా ప్రతినిధుల ఏలుబడిలోనే ఉంది. దీనిలో ఎటువంటి సందేహాలకి తావు లేదు. మరి, సీమాంధ్రలో సాధ్యమైన అభివృద్ధి, తెలంగాణాలో ఎందుకు సాధ్యం కాలేదు? అంటే, అక్కడి నాయకుల్లో ప్రజలకి మంచి చేయాలనే తలంపు లేదు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన లేదు. వనరులు ఉన్నా, లేకపోయినా, సంకల్ప బలం వల్ల మాత్రమే అభివృద్ది సాధ్యమవుతుంది. దీనికి ఇజ్రాయేల్‌ దేశం మంచి ఉదాహరణ. దేశమంతా ఎడారి మయం. ఏ పంటలు పండవు. తాగడానికి చుక్క నీళ్ళు గగనం. నాలుగువైపులా ముస్లిం దేశాలతో ప్రతిరోజు సరిహద్దు యుద్దాలు. అటువంటి ప్రతికూల వాతావరణంలో సైతం, సంకల్ప బలంతో అభివృద్ధి చెంది చూపించారు. అంతేగాని, తాము పతనమయ్యి, కారణాన్ని ముస్లిం దేశాల మీద నెట్టలేదు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడుపుతున్న తెలంగాణా నాయకులు (?) ఎవరికైనా అభివృద్ధి అంటే ఏమిటో తెలుసా? వారి దగ్గర అభివృద్ధి చెందడానికి బ్లూ ప్రింట్‌గాని, రోడ్‌ మేప్‌ గాని ఉందా? ఎంతసేపు సోదరుల్లా కలిసి ఉన్న తెలుగు జాతి మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించడం, ఈ ప్రాంతం కాని వారిని ఇక్కడి నుండి వెళ్లగొడతాం అంటూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం, ఉన్న వనరులన్నీ మనమే సొంతం చేసుకుందా అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం - ఇవన్నీ కాదు అభివృద్ధి అంటే...

    అభివృద్ధి అంటే - అన్ని ప్రాంతాల ప్రజల్ని కలుపుకు పోవడం, సమిష్టిగా జీవన ప్రమాణాల్ని, మౌలిక వసతుల్ని కల్పించుకోవడం, ప్రతీ పౌరుడు నిర్భయంగా, ఆనందంగా గడిపేలా చేయగలగడం, మన దేశం నుండి మాత్రమే కాక, ప్రపంచంలో నలుమూలల నుండి నిపుణుల్ని, శాస్త్రవేత్తల్ని, మేధావుల్ని ఆకర్షించడం, వారి మేధా ఫలాల్ని సంపద సృష్టికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగించగలగడం. ఇవన్నీ చేసినపుడు దాన్ని అభివృద్ధి అంటారు. తెలంగాణా ప్రజలు, మిగతా తెలుగు జాతి వలే ఏ విషయంలోను తీసిపోరు. ఇంగ్లీషులో ఓ సామెత ఉంది. ఒక గొర్రెల గుంపుకి సింహం నాయకత్వం వహిస్తే, ఆ గొర్రెల గుంపు, గొర్రె నాయకత్వం వహిస్తున్న సింహాల గుంపుని సునాయాసనంగా ఓడిస్తుందని దాని అర్థం. అంటే సింహాలు ఎంత గొప్పవి, పరాక్రమం కలవి అయినప్పటికీ, గొర్రె నాయకత్వం వల్ల ఓటమి పాలవుతాయి. ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్నది అదే. అక్కడ గొర్రెలు నాయకత్వం వహిస్తున్నాయి. మేధావులైన తెలంగాణా ప్రజలు ఆ గొర్రెల మాటలు నమ్ముతున్నారు. ఇప్పటికైనా తెలంగాణా ప్రజలు కళ్ళు తెరిచి, తాము సింహాలమని గుర్తించి, తమ శక్తి సామర్థ్యాలని తెలుసుకుని, గొర్రె నాయకుల్ని పక్కనపెట్టి, నిజమైన అభివృద్ధి పథం వైపు పయనిస్తారని ఆశిద్దాం.