Pages

Sunday, December 7, 2014

7 రంగుల పువ్వు సోవియట్‌ పుస్తకం తెలుగు అనువాదం సరికొత్తగా మీ కోసం...

    సోవియట్‌ పుస్తకాలతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ వాటి విలువ ఏమిటో బాగా తెలుసు. అందులోను అత్యంత అరుదైన పుస్తకాలను మరలా చదువుతున్నపుడు కలిగే అనుభూతి అపురూపంగా ఉంటుంది. అలాంటి అనుభవమే నాకు కూడా కలిగింది. నాకు సోవియట్‌ పుస్తకాల పట్ల అనురాగం కలిగేలా చేసింది నిస్సందేహంగా మా నాన్న గారే. ఆయన లైబ్రరీలో ఎన్నో సోవియట్‌ పుస్తకాలు ఉండేవి. వాటిలో కొన్ని నాకు ఊహ తెలిసి, చదవడం మొదలుపెట్టే నాటికే మా లైబ్రరీలో లేవు. కారణాలు ఏవైనా కానివ్వండి... అవి లేవు అంతే... అటువంటి వాటిలో నాన్న గారు ఎక్కువగా మాకు చెప్పిన కథ ''ఏడు రంగుల పువ్వు''. అదే ఇంగ్లీష్‌లో '' Rainbow Flower ''. నేను బత్తుల అనిల్‌కు ఫోన్‌ చేయగానే ముందుగా అడిగిన పుస్తకం... ''ఏడు రంగుల పువ్వు''. వెంటనే అనిల్‌ ఆ పుస్తకం పూర్వా పరాలన్నీ చెబుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పుస్తకం తెలుగు అనువాదం ఇప్పుడు ఎవరి దగ్గరా లేదు. ఎక్కడ ఉందో తెలియదు. అత్యంత అరుదైన పుస్తకం. నేను అడిగిన మూడో రోజు అనుకుంటాను ఆ పుస్తకం ఇంగ్లీష్‌ వెర్షన్‌ను నాకు కొరియర్‌ చేసారు. ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. కనీసం ముఖ పరిచయం కూడా లేని అనిల్‌ ఇలా వెంటనే పుస్తకాన్ని పంపడం ఏమిటి? ఈ బహుమతికి బదులుగా ఏమైనా చెయ్యాలనిపించింది. వెంటనే ఫోన్‌ చేసి, పుస్తకం పంపినందుకు కృతజ్ఞతలు తెలియజేసి, బదులుగా నేను చెయ్యగలిగింది ఏమిటి అని అడిగాను. ''ఈ పుస్తకాన్ని తెలుగులోకి మీరే అనువాదం చెయ్యాలి'' సూటిగా చెప్పేసాడు అనిల్‌. కాని నేను ఎంత వరకు చెయ్యగలను. సరే ప్రయత్నిద్దాం అనుకున్నాను. ఇప్పటి వరకు తెలుగు - ఇంగ్లీష్‌ లేదా ఇంగ్లీష్‌ - తెలుగు అనువాదాలు చాలా చేసి ఉన్నాగాని, అవన్నీ సైన్స్‌కి, లేదా చరిత్రకు సంబంధించినవి మాత్రమే. పిల్లల సాహిత్యం ఎప్పుడూ అనువాదం చెయ్యలేదు. సరే... నెమ్మదిగా మొదలుపెట్టాను. దిగిన కొద్దీ లోతు బాగా అర్థమయ్యింది. కొన్ని చోట్ల ఇక నా వల్ల కాదు అని కూడా అనిపించింది. తేలికగా ఉండే పదాలు వెతికి పట్టుకోవాలి. అవి పిల్లలకు అర్థం అవ్వాలి. అందుకే మా అమ్మాయిలు శ్రీ సత్య, శ్రీ మహి సహాయం తీసుకున్నాను.. 6వ తరగతి, వ తరగతి చదువుతున్నారు. వాళ్ళే చదివి తెలుగులో అర్థం చెబుతూ ఉంటే, వారి మాటల్లో నుండి నాకు కావలసిన పదాల్ని వెతికి పట్టుకుని, వాటిని వ్రాసేవాడిని.  అలా వారం రోజుల పాటు సాగిన యజ్ఞం పూర్తయింది. దాన్ని ఫెయిర్‌ చేసి, నాకున్న పనుల ఒత్తిడిలో నుండి వీలు చూసుకుని, మా ప్రెస్‌లోనే డిజైనింగ్‌ చేయించే సరికి మరో వారం గడిచిపోయింది. అనిల్‌ మాత్రం మధ్యలో ఎక్కడా మర్చిపోకుండా నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. తనకి ఎన్ని అభినందనలు తెలిపినా సరిపోదు. చివరిగా ఇప్పుడు మీరు చూసిన రూపం వచ్చింది. నా ప్రయత్నంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, వాటిని నాకు తెలియజేస్తే, సరిదిద్దుతాను. కథనం పరంగా గాని, అక్షర దోషాలుగాని ఏమైనా ఉన్నట్లయితే సరిచేస్తాను. ఈ పుస్తకాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. మీ... ఎస్పీ జగదీష్‌ రెడ్డి