Pages

Thursday, May 17, 2018

తిరుమల శ్రీవారి ప్రధానార్చకులు శ్రీ రమణ దీక్షితులు గారికి మద్దతు తెలపడం ప్రతీ హిందువు కర్తవ్యం...

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే రాష్ట్రంలో భద్రత లేకుండా పోయింది. సిగ్గు లేని రాజకీయాలు దేవాలయంలో కూడా తిష్టవేసుకుని కూర్చున్నాయి. శ్రీవారి ఆలయం గురించి, ఆచారం గురించి, ఆభరణాల గురించి సాక్షాత్తు శ్రీవారి ప్రధాన అర్చకులు శ్రీ రమణదీక్షితుల వారే పొరుగు రాష్ట్రం వెళ్లి మరీ ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే, పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. దేవాలయాల్ని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసారు. తమకు, పార్టీకి అడుగుకు మడుగులొత్తే తొట్టిగ్యాంగ్‌ని దేవాలయ కమిటీ సభ్యులుగా నియమిస్తే పరిస్థితులు ఇలాగే తయారవుతాయి. ప్రస్తుతం తితిదే  పాలకవర్గ అధ్యక్షుడిని చేయవద్దంటూ ఎంతమంది హిందువులు విమర్శించినా, ప్రభుత్వం తలొగ్గలేదు. ఇతర మతాల జోలికొస్తే, తాట తీస్తారని తెలుసు... కాని హిందువుల జోలికొచ్చినా, వారి దేవాలయాల్ని పరమతస్తులతో నింపేసినా, దేవుడి ఆభరణాలను, ఆస్తుల్ని నిర్లజ్జగా కాజేసినా, వాటిని బయటపెట్టినందుకు అర్చకుల్ని బయటకు గెంటేసినా, రాజకీయ కారణాలతో హిందువులందరూ కిమ్మనకుండా ఉన్నారు. ఇదే ఇతర మతాల్లో జరిగితే రాజకీయాలకు, భాషలకు, దేశాలకు అతీతంగా ప్రపంచమంతా ఆ మతస్థులు ఏకమవుతారు. కాని, హిందూ మతంలో మాత్రం పైవాడు మా కులపోడు కాబట్టి, మా పార్టీవోడు కాబట్టి, మా నాయకుడు కాబట్టి, వాడు ఏమి చేసినా, దైవానికి ద్రోహం చేసినా మేము మాత్రం సిగ్గులేకుండా వాడినే సమర్థిస్తాము. ఎంత సిగ్గులేని తనం? ఎంత బరితెగించిన తెంపరితనం?

    శ్రీ రమణ దీక్షితులుగారు చదువు లేని వాడు కాదు. పరిస్థితులు అర్థం చేసుకోలేని వాడు కాదు. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి, విదేశాలలో ఉద్యోగం కూడా కాలదన్నుకుని, దైవం పట్ల అనురాగంతో, వంశ పారంపర్య అర్చకత్వాన్ని చేపట్టిన మహోన్నత వ్యక్తి. ఏ దైవాన్ని రెప్పపాటు కాలంపాటు దర్శించుకున్నా, జన్మ ధన్యమవుతుందని భావిస్తామో, అటువంటి దైవాన్ని జీవితాంతం స్వయంగా అర్చన చేసి, తరించే అదృష్టశాలి. ఆయన మరే ఉద్యోగం చేసుకున్నా ఇంత కంటే ఎక్కువ జీతం వస్తుంది. రాజకీయాల్లో చేరి, ఏ అడ్డమైన గడ్డి కరిచినా ఇంత కంటే ఎక్కువ 'గిట్టుబాటవుతుంది'. అర్చకులకు ఎటువంటి జీతం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవు. అది కూడా అర్థం చేసుకోకుండా, సాక్షాత్తు ఆలయ ప్రధాన అర్చకుడిపైనే వేటు వేయాలనుకోవడం ఆలయంపై జరిగిన దాడిగానే అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులకు గాని, పాలకమండలికి గాని శ్రీవారి ఆలయ చరిత్ర తెలుసా? అసలు ఆగమ శాస్త్రం అనే మాట వినే ఉంటారా? శ్రీవారికి ఎప్పుడెప్పుడు ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయో, ఏఏ నైవేద్యాలు సమర్పిస్తారో ఎవరికైనా తెలుసా? ఇవన్నీ 'కనకపు సింహాసనమున శునకాలే' కదా... ఏ అధికారంతో ఆలయ సేవల్లో వేలుపెడుతున్నారు? ఏ తెగింపుతో స్వామి వారి నిధుల్ని తమ సొంత అవసరాలకు మళ్ళించుకొంటున్నారు? ఏ ధైర్యంతో కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరునితో ఆడుకుంటున్నారు?

    ఏం ఫర్వాలేదు... రావణాసురుడంతటి వాడు కూడా తన పాపం పండేవరకు తనంతటి వాడు లేడని విర్రవీగాడు... శిశుపాలుడిని కూడా శ్రీ కృష్ణుడు నూరు తప్పుల వరకు ఊరుకున్నాడు.... వామనుడు వచ్చే వరకు నేనే గొప్పవాడినని బలి భావించాడు... నరసింహుడు వచ్చే వరకు హిరణ్య కశిపుడు తానే దైవంగా భావించుకున్నాడు. ఏదైనా పాపం పండేవరకే... శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్షదైవం... కేవలం సంకల్పమాత్రాన సకల సృష్టిని సృజించగల ఆయన ముందు పిచ్చి వేషాలేస్తే ఏం జరుగుతుందో చరిత్రలో ఎన్నో సంఘటనలు చూసాం... ప్రత్యక్షంగా కొన్నింటికి మనమే సాక్షులం కదా... ప్రస్తుతానికి శ్రీ రమణదీక్షితులుగారికి మన మద్దతు తెలుపుదాం... అది మన నైతిక బాధ్యత... కాగల కార్యమంటారా... శ్రీవారే చూసుకుంటారు... సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు....

Sunday, February 11, 2018

అత్యున్నత భారతీయ విలువలకు నిలువుటద్దం - పద్మావతి కథ (మూవీ రివ్యూ)

    సమకాలీన సినిమాల్లో చారిత్రక నేపధ్యమున్న చిత్రాలు రావడం కొంచెం అరుదుగానే జరుగుతోంది. వచ్చిన కొన్ని సినిమాలు కూడా చరిత్రను వక్రీకరిస్తూ, కమర్షియల్‌ హంగుల్ని అద్దుకున్నవి అయి ఉంటున్నాయి. కాని, చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏ మాత్రం తక్కువ కాకుండా, అత్యున్నత భారతీయ విలువల్ని, భారతీయులు నమ్ముకున్న ధర్మంపై నిర్మించబడ్డ శిఖర సమానమైన ఆదర్శాలని, ఆ ఆదర్శాలను పాటించే క్రమంలో ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టే మహోన్నత కథా ప్రాభవానికి ఆధునిక సినిమా రూపమే సంజయ్‌ భన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావతి'.

    మేవార్‌ మహారాణి పద్మావతి అపురూప సౌందర్యవతి. రాజపుత్ర రాజయిన రతన్‌సింగ్‌ను వివాహమాడుతుంది. అదే సమయంలో భారతదేశంపైకి  దండెత్తిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ పద్మావతి సౌందర్యం గురించి విని, ఆమెను ఎలాగైనా పొందాలని చిత్తోడ్‌ఘడ్‌ కోటపైకి దండెత్తుతాడు. కాని, విజయం సాధించలేకపోతాడు. ప్రాచీన భారతీయ ఇంజినీరింగ్‌ నిపుణతతో నిర్మించిన ఆ కోట ముందు, రాజపుత్రుల పరాక్రమం ముందు ఖిల్జీ సేనలు పరాజయం పాలవుతాయి. చివరికి తమకు మాత్రమే సొంతమైన కుతంత్రంతో కోటలోకి ప్రవేశించిన ఖిల్జీకి రాణి పద్మావతి దక్కిందా లేదా అనేది సినిమా కథ.

    నేటి యువత తప్పని సరిగా చూసి, ఎంతో నేర్చుకోవలసిన కథ ఇది. ప్రేమ పేరుతో ప్రతి అడ్డమైన, నీచ మనస్తత్వం కలిగిన వారందరూ దర్శకులుగా అవతారమెత్తి, నానా చెత్తా సినిమాలుగా తీసి, యువతను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు. అటువంటి సినిమా చూసిన వాళ్ళందరూ అదే జీవితం అనుకుంటూ రకరకాల నేరాల్లో చిక్కుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌ని చూడముచ్చటగా, రిచ్‌గా తీర్చిదిద్దారు. మేకప్‌, ఎడిటింగ్‌, డైరెక్షన్‌, బ్యాక్‌గ్రౌండ్‌.. ఒకటేమిటి అన్ని విధాలుగా కూడా అత్యున్నత స్థాయిలో ఒక హాలీవుడ్‌ మూవీని చూసిన ఫీల్‌ని కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఆనాటి కోటగోడలు, వస్త్రధారణ, నగలు, అలంకరణ వంటి ఏ విషయంలోను రాజీ పడలేదు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఒక పక్క నుండి భారతీయులు నమ్ముకున్న ఆదర్శాల గురించి గర్వపడుతూనే, ఒక రాజకుటుంబం పరాయి మతాల మూర్ఖత్వానికి ఎలా బలయిపోయిందో చూస్తూంటే గుండెల్ని మెలిపెడుతున్న బాధ కలుగుతుంది.

    భారతీయులు ప్రతీ విషయాన్ని ధర్మంతో ముడిపెట్టారు. ఆఖరికి యుద్ధం కూడా ధర్మ బద్దంగానే చేసారు. కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మంతోనే పెనవేసుకుపోయిన భారతీయులకి, ఎటువంటి ధర్మంతో పనిలేకుండా, ఎదుటి వాడిని కొల్లగొట్టడం, బలవంతంగా దోచుకోవడం, పరాయి వారి భార్యను చెరపట్టడం, అందుకు ఎంతకైనా తెగించి, అడ్డదిడ్డంగా యుద్దం చేయడం వంటివి బొత్తిగా కొత్త. అందుకే అవతలి శత్రువుని కూడా ధర్మబద్దంగా ఎదుర్కోవాలని భావించి, చివరికి వారి కరవాలానికే బలయిపోయారు. ఈ విధంగానే ముస్లిం, క్రైస్తవ పాలకులు హిందూ దేశాన్ని ఆక్రమించి, ఇక్కడి సంపదను, స్త్రీలను, వారసత్వాన్ని దోచుకోగలిగారు.

    సహజంగానే హిందూ జాతి గొప్పదనాన్ని, వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఎటువంటి ప్రయత్నానికైనా మీడియాలో ప్రాచుర్యం లభించదు. ఇటీవల విడుదలైన ఒక మానసిక రోగి సినిమా గురించి మాత్రం అటు మీడియాలోనీ, ఇటు వెబ్‌లోను ప్రచారం హోరెత్తిపోయింది. ఆ సినిమా చూడకపోతే అసలు యూత్‌ కాదన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ నేటి యువత అది కాదు తెలుసుకోవలసింది.. రతన్‌సింగ్‌ స్థానంలో ఉండవలసిన యువతని ఖిల్జీ స్థానంలోకి దిగజార్చేసి, అదే నిజమైన హీరోయిజం అన్నట్లుగా హైలైట్‌ చేస్తున్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క యువతీ యువకుడు తప్పని సరిగా చూసి, మన నిజమైన సాంప్రదాయ విలువల్నీ, వాటిని కాపాడడం కోసం పూర్వీకులు పడ్డ తపననీ, చేసిన త్యాగాన్ని తెలుసుకుని, గుర్తుంచుకుని, ఆచరించడమే మన పూర్వీకులకు మనమిచ్చే నిజమైన నివాళి.