Pages

Monday, December 13, 2010

కులాల కుమ్ములాటలు ఎప్పటికీ మనకి తప్పవా?

ఎప్పుడూ ఆనందంగా, విచారాన్ని దరిచేరనివ్వకుండే ఉండే నేను ఈ రోజు చాలా బాధగా ఉన్నాను. ఎద లోతుల్లో ఏదో తెలియని భావం నన్ను ఉత్సాహంగా ఉండనివ్వడం లేదు. ఎందుకని నాలో ఈ మార్పు? ఎంత వత్తిడినైనా, ఎంతటి బాధనైనా సునాయాసనంగా ఎదుర్కోవచ్చునని వీలు దొరికినప్పుడల్లా 'స్ట్రెస్‌ మేనేజిమెంట్‌'పై ఉపన్యాసాలిచ్చే నేను ఇంత ముభావంగా ఎందుకున్నాను? నాకు తెలుసు - దాని కారణం ఏమిటో... నాలుగు రోజుల క్రితం జరిగిన ఆ దురదృష్టకర సంఘటన ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది.

    ఎప్పటిలాగే కాలేజ్‌కి వెళ్ళిన నన్ను మా ఆఫీస్‌ మేడమ్‌ హడావుడిగా ఒక క్లాస్‌ కేన్సిల్‌ చేయడానికి పర్మిషన్‌ అడిగారు. కారణమేమిటంటే ఆ రోజు స్కాలర్‌షిప్స్‌ కోసం పిల్లలందర్నీ వెరిఫికేషన్‌ చేయాలని, వాళ్ళిచ్చిన వివరాలతో అన్నీ సరిపోయాయో లేదో కనుక్కోవాలని చెప్పారు. నేను కూడా పెద్దగా ఆలోచించకుండా ఒ.కే. అనేసాను. కొద్దిసేపటిలోనే వెరిఫికేషన్‌ మొదలయ్యింది. నేను కూడా చూద్దామని క్లాస్‌లోకి వెళ్ళాను. ముందుగా ఒక విద్యార్థిని పేరు పిలిచారు. ఆ అమ్మాయి లేచి నిలబడింది. నీ పూర్తి పేరు... చెప్పింది.... నీ తండ్రి పేరు... చెప్పింది. మీదే కులం..... సమాధానం లేదు. మౌనంగా నుంచుని మా వైపే చూస్తూ ఉంది. నేను కేస్ట్‌ సర్టిఫికేట్‌ తీసుకుని చూసాను. నాకు పరిస్థితి అర్థం అయింది. ఆ అమ్మాయిని కూర్చోమన్నాను. మరో అమ్మాయి పేరు పిలిచారు మా మేడం. పైన చెప్పిన పరిస్థితే మళ్ళీ రిపీట్‌ అయింది. ఈ సారి ఆ పాప కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. క్లాసులో గుసగుసలు, వెనుక బెంచిలో నుంచి చిన్నగా నవ్వులు. ఒక్క సారిగా నా మనసు బాధతో మెలిపెట్టింది. ఏమిటిది? మనం ఎక్కడున్నాం? ఆటవికుల సమాజంలోనా లేక మధ్య యుగాలనాటి కులాలతో భ్రష్టు పట్టిన భారతదేశంలోనా? కులాల ఆధారంగా ఆ రోజుల్లో మనుష్యుల్ని శారీరకంగా, మానసికంగా హింసించే వారని విన్నాం, చరిత్ర పుస్తకాల్లో చదివాం. కాని ఈ రోజున జరుగుతున్నదేమిటి? ప్రభుత్వమే సమాజాన్ని కులాల పరంగా విడదియ్యమని, వారి కులాన్ని ఎమ్‌.ఆర్‌.ఓ. దగ్గర ధృవీకరించమని ఆ సర్టిఫికెట్ల ఆధారంగా డబ్బులు పంచుతామని అంటోంది. ఇది ఎంత వరకు న్యాయం? డబ్బు లేని వాళ్ళు ఏ కులంలో అయినా ఉండవచ్చు. అటువంటి వాళ్ళకి సహాయం చెయ్యవచ్చు కదా? ఏ పాపం, పుణ్యం తెలియని పసి మనసుల్ని కులాల పేరుతో కలుషితం చేయడం ఎందుకు? కాలేజ్‌లో పిల్లల్ని ఎంతో దగ్గర నుండి గమనించాను. వాళ్ళంతా ఎంతో నిష్కల్మషంగా స్నేహితులవుతున్నారు. వాళ్ళలో ఎక్కడా కుల ప్రస్థావన లేదు. ఒకళ్ళ కేరియర్‌లో భోజనం మరొకరు ఆనందంగా పంచుకుని భోజనం చేస్తున్నారు. ఎవరి ఇంట్లోనైనా మంచి కూర చెయ్యకపోతే పక్కనున్న అమ్మాయి తన కేరియర్‌లో నుంచి కూర తీసి ఆ పాపకి పెట్టడం నేను చూసాను. ఒంట్లో బాగోక పోతే మేడమ్‌కి తెలియకుండా నోట్స్‌ రాసిపెట్టిన పిల్లల్ని చూసాను. ఇంకెక్కడుంది వివక్ష? ఇంకెక్కడుంది కులాల పేరుతో హింస? ఇప్పుడు పెద్దవాళ్ళమయిన మనమే బుద్దిలేకుండా చిన్నపిల్లల మధ్య కులాల పేరుతో చిచ్చు పెడుతున్నామేమో అనిపించింది.

    వెంటనే ఆ దుర్మార్గమైన కార్యక్రమానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసాను. ఆ రాత్రికి సరిగా నిద్ర పట్టలేదు. ఏదో కలత నిద్ర... అందులో ఒక భయంకరమైన పీడ కల... ఒక అందమైన ప్రదేశం. అక్కడ తెల్లని రంగుతో మెరిసిపోతున్న అందమైన పక్షులు.... ఇంతలో అక్కడో ఫ్యాక్టరీ లాంటిది... ఎవరో వచ్చి నిర్దాక్షిణ్యంగా ఆ పక్షుల రెక్కలు విరిచి ఆ యంత్రాలలోకి తోస్తున్నారు... వాటి రెక్కల నుండి వస్తున్న రక్తంతో అందమైన వాటి తెల్లటి రంగు ఎర్రగా మారుతోంది.... అవి విదారకంగా అరుస్తున్నాయి.... ఒక్కసారిగా మెలకువ వచ్చేసింది.... ఈ సమాజంలో అందరూ కలిసి ఎంత తప్పు చేస్తున్నామో... రాజకీయ నాయకులు వారి ఓట్ల కోసం ఈ సమాజాన్ని ఎంతలా కలుషితం చేస్తున్నారో... కుల సంఘాల పేరు చెప్పి వాటి నాయకులు సమాజంలో ఎలా చిచ్చు పెడుతున్నారో తలుచుకుంటూ... నా హృదయం ద్రవించిపోయింది. కనీసం రాబోయే తరాల్లో నయినా ఈ కుల రాక్షసి పూర్తిగా అంతమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకు మించి మనమేం చేయగలం....

1 comment:

  1. encourage inter caste arranged marriages. that is only the solution !

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.