Pages

Friday, July 8, 2011

అనంత పద్మనాభుని అనంత సంపద - కొన్ని కొత్త కోణాలు - ఆలోచనలు

    శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడ్డ అనంతమైన సంపదతో భారత దేశ పురాతన వైభవం మరొక సారి వెలుగులోకి వచ్చినట్లయింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక సంపద, ఆదాయం కలిగిన తిరుమల శ్రీనివాసుని పక్కకు నెట్టివేయగలిగినంత సంపద (సుమారు లక్షన్నర కోట్ల రూపాయిలు కన్నా ఎక్కువ) వెలుగుచూడడం ప్రపంచమంతటినీ విస్మయానికి గురిచేసింది. టన్నుల కొద్దీ బంగారం, వెలకట్టలేనన్ని వజ్ర, వైఢూర్యాలు, పచ్చలు, బంగారు నాణాలు, నగలు ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాలుగా నేలమాళిగలో మగ్గిపోయాయి. ఇదివరకెన్నడూ చూడని పెద్దపెద్ద బంగారు విగ్రహాలు, నగిషీలు, ఏ దేవతల చేతనో చెక్కబడ్డాయా అనిపించే చేతికళా నైపుణ్యం కలిగిన బంగారు ఆభరణాలు - ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఇప్పటి వరకు ఎన్నడూ ఒక్క చోట చూడనంత సంపద పద్మనాభస్వామి ఆలయంలో బయటపడింది. కేరళలో ట్రావెన్‌కోర్‌ సంస్థానాధీశులచే నిర్మించబడి, నిర్వహించబడుచున్న ఈ ఆలయంలో ఇంత సంపద ఇప్పుడు బయటపడడం పురాతన భారతీయ సంపద మీద కొత్త కోణాల్ని ప్రసరింపజేస్తుంది.

    ఇప్పటి వరకు చరిత్ర పుస్తకాల్లో భారతదేశం అత్యంత అనాగరిక, నిరుపేద దేశమని, ఇక్కడి ప్రజలు నిరక్షరాస్యులని, రాజులు నిత్యం యుద్దాలతో కొట్టుకు చస్తూ ఉండేవారని చదువుకున్నాం. కాని, ఈనాడు బయటపడ్డ ఈ సంపద ప్రపంచం యొక్క పురాతన నమ్మకాన్ని ప్రశ్నించే విధంగా ఉంది. ఇప్పటి వరకు చరిత్రను పాశ్చాత్య కళ్ళద్దాలతో చదువుకున్న ప్రపంచమంతా ఈ సంఘటనతో నివ్వెరపోయింది. పురాతన భారత దేశం - మనం అనుకున్నట్లుగా పేదది కాదు. ఆనాటి ప్రపంచంలోనే అత్యధిక ధనవంతమైన దేశం. ముస్లిం సుల్తానులు దండయాత్రలు చేసినా, బ్రిటిష్‌ వారు, ఇతర యూరోపియన్లు వ్యాపారం పేరు చెప్పి వచ్చినా అది భారతదేశంలో ఉన్న అపరిమితమైన సంపదను కొల్లగొట్టడానికే. డబ్బున్న దేశానికే అందరూ వెళతారు గాని, నిరుపేద దేశానికి ఎవరూ వెళ్ళి వ్యాపారం, యుద్దాలు చేద్దామని అనుకోరు కదా. ఒక్క అనంత పద్మనాభస్వామి ఆలయంలోనే ఇంత సంపద ఉంటే, భారత దేశం మొత్తం మీద అన్ని ఆలయాల్లోను కలిపి ఎంత సంపద ఉంటుందో మనం తేలికగానే లెక్కపెట్టవచ్చు. అది కూడా సుల్తానులు, పాశ్చాత్య దేశీయులు కలిపి ఎంతో దోచుకున్న తరువాత, స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన  అధికారులు, రాజకీయ నాయకులు కలిపి మింగేసిన తరువాత కూడా మిగిలిన సంపద ఇది అని గమనించాలి.

    ఇంత సంపదని ఏం చేద్దామనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నిజానికి ఆలయంలో బయటపడ్డ నిధికి వెలకట్టలేం. వాటికి ఉన్న పురావస్తు ప్రాధాన్యత దృష్ట్యా చూసినా ఇప్పటి వరకు లెక్క చూసిన దానికన్నా కనీసం నాలుగైదు రెట్లు ఎక్కువ ఉండవచ్చు. ఈ మొత్తంతో (అంటే సుమారు లక్షన్నర కోట్లతో) అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేయవచ్చని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని కొన్ని ఊహాగానాలు వినపడుతున్నాయి. కాని అది కార్యరూపంలో సాధ్యం కాదు. ఎందుకంటే కేవలం బంగారం, వజ్రాలు వంటివి ఇచ్చినంత మాత్రాన ఎవరూ పనులు చేయరు కదా. ఎవరైనా ఒక కార్యక్రమం చేపట్టాలి అంటే మన రూపాయిలు కరెన్సీ కట్టలు కావాలి. అలా డబ్బులు కావాలంటే ఈ సంపద మొత్తాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్మేయాలి. కాని ఒకదేశానికి గర్వకారణమైన ఆ దేశ పురాతన సంపదను, వారసత్వ వస్తువుల్ని బహిరంగ మార్కెట్‌లో అమ్మడానికి ఏ సమాజము ఒప్పుకోదు. ఏ ప్రభుత్వమూ దానికి సాహసించదు. అందుచేత ఆ సంపద మొత్తాన్ని అదే దేవాలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రజలకు / భక్తులకు సందర్శించడానికి ఏర్పాట్లు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినట్లుగా భక్తుల ద్వారా ఆదాయంతో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చు. తద్వారా ఎవరి మనో భావాలు  దెబ్బతినకుండా, ఆలయ సంపద బయటకు పోకుండా, దేశ ప్రతిష్ట మసకబారకుండా జాగ్రత్త పడినట్లు అవుతుంది.  ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి ఉమన్‌ ఛాందీ, సంపద మొత్తం ఆలయానికి చెందుతుందని ఒక ప్రకటనలో పేర్కొనడం ఆహ్వానించదగ్గ విషయం.

    కాని, గత అనుభవాల దృష్ట్యా, ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకులని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల చిత్తశుద్దిని మనం శంకించాల్సి వస్తుంది. తిరుమల వేంకటేశ్వరుని నగలు కొన్ని మాయమైపోవడం, హైదరాబాద్‌, భారత్‌లోని ఇతర సంస్థానాల్లో అపూర్వ వస్తు సంపద, వారసత్వ కళా విశేషాలు కనిపించకుండా పోయిన వైనం ప్రజల మనస్సుల్లో మెదులుతూనే ఉంది. సుప్రీం కోర్టు తీర్పుని అనుసరించి, ప్రభుత్వం పూర్తి సంపదను రికార్డ్‌ చేసి, రాజకీయ ప్రమేయం లేని విధంగా, సమాజంలో నిజాయితీ పరులైన ప్రముఖులతో ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో, ప్రజల మనోభావాలు, సెంటిమెంట్స్‌ దెబ్బతినకుండా ఆ సంపదను పద్మనాభుని సన్నిధానంలోనే ఉంచితే అది అందరికీ ఆనందదాయకం కాగలదు.

10 comments:

 1. బాగా చెప్పారండి.

  ReplyDelete
 2. తప్పదు... కేవలం ఆ సంపదని చూపించి మాత్రమే అభివృద్ది చేసుకోవాలి...అమ్మే హక్కు ఎవరికీ లేదు... పీకల మీదికి వచ్చినా కూడా...సమపద మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలి...

  మరి బ్రిటిష్ వాళ్ళు ఎంత దోచు కెళ్ళారో...

  ReplyDelete
 3. అసలు ఏ కాలంలో అయినా ఇలా దాచిన దేవుని సొమ్ముని ఎవరైనా ఎలా వినియోగిస్తారో అలాగే ఇప్పుదూ ప్రజోపయోగం కోసం ఉపయోగించ వచ్చు కదా! దేవుడి సొమ్ముని వేలం పెడితే భక్తి భావాలున్న సంపన్నులు చాలా మంది ఎంత ధరయినా పెట్టి ఆ బంగారాన్ని వజ్ర వైడుర్యాలని సొంతం చేసుకోవడానికి తయారుగా వుంటారు.అలా సేకరించిన ధనంతో ఎన్నో మేలు కలిగించే పనులు చేయవచ్చు. నేల మాళిగలలో మూలుగుతుంటే ఏమి ప్రయోజనం?

  ReplyDelete
 4. అన్నట్లు మీ సరదా ... బ్లాగ్ చాలా ప్రయోజనకరంగా వుండండి ...అభినందనలు!

  ReplyDelete
 5. చాలా బాగా చెప్పారు. మనం చదువూ కొంటు 'న్నది బ్రిటీషు వాళ్ళు వక్రీకరించి వ్రాసిన చరిత్రనే కానీ అసలు చరిత్రని కాదు కదా. అత్యంత సంపన్న దేశం కాబట్టే మనదేశంతో వ్యాపారానికి పోటీ పడి వచ్చేవారట విదేశీయులు. ఘోరీ, ఘజినీ వంటి వారు ఒకే దేవాలయాన్ని పదే పదే కొల్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి. పాపం వాళ్ళ ఆత్మ ఎంతగా క్షోభిస్తూ ఉందో తలచుకుంటే జాలేస్తోంది.

  ఇకపోతే, తిరువాన్ కూరు ప్రిన్స్ రామవర్మతో నాకు మంచి పరిచయం ఉంది. నిన్న ఫోను చేసి సరదాగా మాట్లాడాను. ఆయన మాటల సారాంశం ఇది. " ఎంతో కొంత ఉందని మాకు తెలుసు. స్వామి సొమ్ము కాబట్టి ఆ జోలికే పోలేదు. స్వాతి తిరునాళ్ మహారాజు, చివరి రాజైన చితిర వర్మ పద్మనాభుడికి నిజమైన సేవ చేసారు. అందరూ అనుకుంటూ ఉంటారు స్వామి దేవాలయం మా ఆధీనంలో ఉందని. నిజానికి అనంత పద్మనాభ స్వామి దాసులం మేము. మేమే ఆయన ఆధీనంలో ఉన్నాము. ఆయనే మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నాడు. ఇంత సంపద గురించి నాకు కర్ణాటక సంగీత విద్వాంసుడూ సంజయ్ సుబ్రహ్మణ్యం ఎస్సెమ్మెస్ చేస్తేనే తెలిసింది. నేను ఇంటికి వచ్చి నాలుగు రోజులే అయ్యింది. ప్రపంచమంతా ఇదే ( సంపద గురించి ) మాట్లాడుకుంటున్నారు. టీవీ పెడితే చాలు చిరాకు కలుగుతోంది. అసలు ఈ వ్యవహారంతో సంబంధం లేని వాళ్ళు కూడా ఈ సొమ్ములని ఏంచేస్తే బాగుంటుందో చెప్పేస్తున్నారు. నేను ఈ కార్యక్రమాలని అస్సలు చూడట్లేదు. అందుకే మీకు ఉన్న పరిఙ్ఞానం కూడా నాకు లేదు. "

  madhuri.

  ReplyDelete
 6. " ఈశ్వరాఙ్ఞ ఏమో తెలియదు,
  అది ఎవరెరుగరు ఐశ్వరాఙ్ఞ " అని మధురంగా పాడుతూ,
  "దేవుడు కనికరిస్తాడో లేక ముప్పుతిప్పలు పెడతాడో తెలియదు " అన్న అర్థం వచ్చే కీర్తనను గుర్తుచేస్తూ సంభాషణను ముగించారు రామవర్మ.

  మాధురి.

  ReplyDelete
 7. తనది కాకపోతే కాశీ దాక దేకమన్నాడని సామెత. హనుమంత రావు గారు చెప్పింది అలానే ఉంది. అత్యంత అవసరమయ్యి పీకల మీదకి వస్తేనే మనం సొంత భార్య మంగళసూత్రాలు తాకట్టు పెట్టటానికి ఆలోచిస్తామే.. అలాంటిది ఆలయ సొమ్ము ఏదో తేరగా ఉన్నట్లు అమ్మి వాటికి ఖర్చు చేద్దాం, వీటికి ఖర్చు చేద్దాం అని ఉచిత సలహాలు పారేస్తారు ఈ కుహనా లౌకిక వాదులు. అలా చేస్తే 10% చేరేది జనాలకు, 90% చేరేది అవినీతి పరుల జేబులకు.

  అట్లాంటి వారికి ఈ దేశాభ్యుదయం మీద అంత భక్తే ఉంటే విదేశాల్లో అక్రమంగా తరలించిన ఈ దేశ ప్రజల సంపద బయటకు తెచ్చే దానిమీద పోరాడాలని నా మనవి.

  ReplyDelete
 8. ... హనుమంత రావు గారికి ప్రజలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది పరాయి సొమ్ముతో..
  అంత ఉంటే ఆ నల్ల ధనం కోసం పోరాడు హనుమా.. పాపం పెద్దాయన కి తోడు తగ్గుతోంది... వెళ్ళి ఒక చేయి వెయ్యి..

  కుహనా లౌకిక వాదులు కాదు కదా.. కుహనా మేధావులు ?

  బాగా చెప్పావు sv...

  ReplyDelete
 9. హనుమంత రావు గారు...
  ముందుగా నా బ్లాగ్‌ మీకు నచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

  దేవుడి సంపదను ఇప్పటికిప్పుడు ఖర్చు చేసేస్తే, ఇక భవిష్యత్తు తరాలకు మనదంటూ చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోతుంది. షాజహాన్‌, తాజ్‌మహల్‌ కట్టించకుండా, ఆ డబ్బుతో పేద ప్రజలకి నగదు బదిలీ పథకం అమలు చేసి ఉండుంటే, ఇక మనకి చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. కాని, తాజ్‌మహల్‌ కట్టించడం వల్ల, కొన్ని వందల సంవత్సరాలుగా, మన దేశానికి కొన్ని కోట్ల రూపాయిలు సందర్శకుల ద్వారా ఆదాయం వస్తోంది.

  kaaya & sv చెప్పినట్లుగా ప్రభుత్వం ఈ విషయంలో వేలు పెడితే 90 శాతం అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది. నేను ఈ విషయాన్నే టపాలో వివరించాను.

  మాధురి గారు..
  మీకు రాజవంశీకులతో పరిచయం ఉన్నట్లు నాకు నిజంగా తెలియదండి. దయచేసి నేను టపా రాసినట్లు రామవర్మ గారితో చెప్పకండేం...

  ReplyDelete
 10. ఎస్వీ, కావ్య గార్లకు,
  ఇలాంటీ మాటలు కొత్తేమీ కాదండీ. అన్నమయ్య సంకీర్తనలు పోతాయని రాగిరేకుల మీద రాస్తే కరిగించి రాగిబిందెలు, చెంబులు చేసి "వాడుకున్న" జాతి మనది. ఇంక బంగారం కనిపిస్తే గంగవెర్రులెత్తిపోదూ.
  జగదీశ్ గారూ,
  టపా చాలా బావుందండీ. ఒకసారి నా బ్లాగుకు కూడా రండి- http://pakkintabbayi.blogspot.com
  ---సూరంపూడి పవన్ సంతోష్.

  ReplyDelete