Pages

Thursday, March 3, 2011

ఆడపిల్లలంటే అంత అలుసా?

ఆడపిల్లలు ఎన్ని గొప్ప పనులు సాధించినా, ఆడపిల్లల తండ్రులు ఎంత ఘనులైనా సరే, కొన్ని విషయాలలో రాజీ పడక తప్పదని కొన్ని సంఘటనలు ఋజువు చేస్తూ ఉంటాయి. మగవాళ్ళ దాష్టీకం ముందు ఆడపిల్లలు కానివ్వండి, వారిని కన్న వారు కానివ్వండి, తలవంచుకోవాల్సిందే అనిపిస్తుంది. సమాజంలో కూడా ఇదంతా మామూలే అని అందరూ చూసీ చూడనట్లు వదిలేస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణగా రెండు సజీవ ఉదాహరణలు ఈ మధ్యలో మా సంస్థలో జరిగాయి. వాటిని మీతో పంచుకుందామని ఈ టపా వ్రాస్తున్నాను.

    ఈ ముహూర్తాలకి మా ప్రెస్‌లో సుమారు 200 మందికి పెళ్ళి శుభలేఖలు ప్రింట్‌ చేసాము. ప్రెస్‌ అన్నాకా ఏవో చిన్న చిన్న తప్పులు దొర్లడం సహజం. అది మా సిబ్బంది పొరపాటు కావచ్చు, లేదా కస్టమర్‌ అవగాహనా లోపం వల్ల కావచ్చు. అది సహజం. ఒక వారం రోజుల క్రితం ఒక అమ్మాయి (పెళ్ళి కూతురు) ఉదయాన్నే ప్రెస్‌కి వచ్చి ఏడుపు మొదలెట్టింది. ఆ అమ్మాయి మరీ పల్లెటూరు కాదు. చక్కగా చదువుకుంది. ఇంజినీరింగ్‌ అనుకుంటా... ఏమ్మా ఎందుకేడుస్తున్నావు? అనడిగితే శుభలేఖల్లో తప్పు వచ్చిందండి... మా కాబోయే వారు ఫోన్‌ చేసి నన్ను తిడుతున్నారు అంది. పోనీలేమ్మా మరీ అంత తప్పు దొర్లితే మరలా ప్రింట్‌ చేసి ఇస్తాను... బాధ పడకు అని ఓదార్చాను. తీరా చూస్తే, శుభలేఖలో ఏ తప్పు లేదు... కవర్‌ మీద ఫలానా వెడ్స్‌ ఫలానా అని ప్రింట్‌ చేస్తాను. అది పూర్తి పేరు కాకుండా ముద్దు పేరునో, చాంతాడంత పేరుంటే దానిలో నిక్‌నేమ్‌గాని కవర్‌ మీద వేస్తాము. దానిలో ఈ అమ్మాయికి కాబోయే భర్త పేరు చాలా పొడుగుంటే అందులో చివరి పేరు అంటే... శివ నాగ వెంకట సత్య సుబ్రహ్మణ్య వర ప్రసాద్‌ (ఉదాహరణకి పేరు మార్చాను) ఉంటే మా కంప్యూటర్‌ ఆపరేటర్‌ చివరి పేరు తీసుకుని ప్రసాద్‌ వెడ్స్‌ ఫలానా అని వేసింది. కాని ఆ అబ్బాయిని శివ అని పిలుస్తారట.... ఏదయినా అతని పేరే కదా... అది కూడా కావాలని చేసింది కాదు. వధువు తండ్రి గారికి అవగాహన లేక ప్రసాద్‌ అని పొరపాటున చెప్పాడు. ఆ మాత్రం దానికి పెద్ద రాద్ధాంతం చేసేసి, పెళ్ళి కూతుర్ని పట్టుకుని నానా మాటలు అన్నాడట. ఇంతకీ ఆ అమ్మాయి బాధపడుతున్నది పేరు తప్పు వచ్చినందుకు కాదు.... చిన్న పేరు విషయంలోనే ఇంత పట్టుపట్టి గొడవ చేసిన వాళ్ళతో నేను జీవితాంతం ఎలా కాపురం చేయాలి అని భయపడుతూ ఏడుస్తోంది. ఆడపిల్లని అంత బాధపెట్టడం మగవాడి అహంకారం చూపించడం కోసమా, లేక మరేదైనా కారణం ఉందా... నాకేమీ అర్థం కాలేదు...

    మరో ఉదాహరణ.... పెళ్ళికొడుకు ఒక పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడట. అమ్మాయి తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. అమ్మాయిని మాత్రం ఇంజినీర్‌ చదివించారు. ఇద్దరికీ పేర్లు ప్రక్కన డిగ్రీలు ప్రింట్‌ చేయించారు. కాని కాబోయే అల్లుడి జాబ్‌ వివరాలు వేయించలేదు. (ఉదా: విప్రో కంపెనీ, బెంగుళూరు). ఈ మాత్రం దానికి వాళ్ళకి పంపిన శుభలేఖలు వెనక్కి పంపించేసి, మేము ఏమన్నా అనామకులమా? మాకో అడ్రస్‌ లేదా? మా అబ్బాయి అంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఉంటే (సాఫ్ట్‌వేర్‌ అంటే అదో పెద్ద రాష్ట్రపతి జాబ్‌ అన్నట్టు) ఆ విషయం కార్డ్‌లో ప్రింట్‌ చేయకపోతే మా పరువేం కాను... అంటూ నానా యాగీ చేసారట. ఆ తల్లిదండ్రులు పాపం నా దగ్గరకు వచ్చి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. ఈ రోజే వాళ్ళకి మళ్ళీ కార్ట్స్‌ ప్రింట్‌ చేసి ఇచ్చాను.

    ఒక ఆడపిల్ల మనల్ని నమ్ముకుని మనతో జీవితం పంచుకోవడానికి వస్తుంటే... తనకి ఆనందాన్ని పంచాల్సింది పోయి, పంతాలతో, పట్టింపులతో ఆ అమ్మాయిల మనసుని విరిచేయడం .. వారిని బాధ పెట్టడం, ఇప్పుడే ఇలాగ ఉంటే రేపు ఎలా ఉంటుందో అన్న అభద్రతా భావంలోకి ఆ అమ్మాయిని నెట్టేయడం.... ఇవన్నీ మనషులు చేయాల్సిన పనులేనా... ఇవే కాకుండా కట్నం చాలినంత ఇవ్వలేదనో... ఆడపడుచుకి లాంచనాలు సరిపోలేదనో... తమ వైపు వారికి మర్యాదల్లో లోపం జరిగిందనో... ఇలా చిన్న చిన్న కారణాలు చాలు.... సున్నితమైన మనసులు గాయపడడానికి... జీవితాంతం కలిసి ఉండాల్సిన ఎదుటి వ్యక్తి మనసు విరిగిపోవడానికి... మనం మగాళ్ళం అయితే కావచ్చు... కాని ఎదుటి మనిషిని ఏడిపించే హక్కు మనకి లేదు. అదే ఒక ఆడపిల్ల ఎదురుతిరిగి ఇదేమిటని ప్రశ్నిస్తే... అదిగో... రోడ్డెక్కింది అంటారు. అసలు అంతదాకా తెచ్చుకోవడం ఎందుకు... ఎదుటి మనిషి తనకు భర్తగా ఉంటే బాగుంటుంది అనిపించాలిగాని, వీడేం మొగుడురా బాబూ అనేలా చేసుకోకూడదు. ఇది చదివి కొంతమందైనా చదువుకున్న మూర్ఖులు మారితే, తమని నమ్ముకు వచ్చిన అమ్మాయిని ఏడిపించకుండా చూసుకుంటే... అదే పదివేలు....

7 comments:

 1. నా విషయంలో కొంచెం వేరేగా జరిగింది. నాకు MTech software engineer bangalore అని రాయించారు. అది నాకు నచ్చలేదు. మనుషులను మనిషిగా గుర్తించాలి వాళ్ళ డిగ్రీలు, పెద్ద జీతము వచ్చే ఉద్యోగాలని చూసి కాదు అని నా భావం. కాని మా ఆవిడని బాధపెట్టటం ఆ విషయం పెళ్లి తర్వాత మా ఆవిడ నన్ను దేప్పటం అన్ని అయిపోయాయి.
  ;-)

  ReplyDelete
 2. Very good post. I appreciate last para. What you said is 100% right. Thanks for this useful post.

  ReplyDelete
 3. @ అనానిమస్ గారు... నా భావాన్ని మీరు సరిగ్గా గ్రహించారు... మనిషిని మనిషిగానే గుర్తించాలి గాని, నేను చెప్పిన రెండవ వుదాహరణలో వరుడు తన జాబ్ గురించి పట్టుబట్టాడు. నిజానికి వాడు పనిచేస్తున్న కంపెనీని రేపో, ఎల్లుండో విడిచిపెట్టి మరో కంపెనీలో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆమాత్రం దానికి జీవితాంతం దాచుకొనే పెళ్ళికార్డులో ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరు వెయ్యకపోతే కొంపలేమీ మునగవు కదా... మీ స్పందనకి కృతజ్ఞతలు...

  ReplyDelete
 4. every thing sounds good in context of this post, on the other hand where is the proof reading and taking the acceptance of other party, they have right to choose how they like their name to appear on their marriage card, why cant either press or the girls family check with other party.

  ReplyDelete
 5. @2nd anon,
  వాళ్ళ రైట్ ని ఎవరూ కాదనరు. ప్రెస్ వాళ్ళకి అవతలి వారి అనుమతి తీసుకోవలసిన బాధ్యత ఉన్న ఉన్నదని నేననుకోను. అలా ప్రెస్ వారు అవతలి వారి అంగీకారం కూడా తీసుకోవలసి వస్తే వారి పనే ముందుకు సాగదు. అమ్మాయివాళ్ళు అవతలివారి దగ్గర సరైన సమాచారం తీసుకోవాలి. తీసుకోకపోతే అదివారి తప్పే. కాదనను. కానీ దానికే అంత గొడవ చేయడం కరక్టేనా? ఒక్కసారి ఆలోచించండి.

  ReplyDelete
 6. sad thing that being educated.. few people are still behaving like.. illiterates..

  ReplyDelete
 7. @ అనానిమస్ గారు...
  మీరు చెప్పింది అక్షర సత్యం.... అవతలి వాళ్ళ అంగీకారం కూడా తీసుకుంటూ కూర్చుంటే ఇక పని ముందుకు సాగినట్లె... అసలే ఇప్పుడు జరుగుతున్నవి ఇన్‌స్టెంట్ పెళ్ళిళ్ళాయే...
  @ శివ చెరువు..
  yes.. you are 100% right...

  ReplyDelete