Pages

Thursday, March 10, 2011

యువతను ప్రేమ మత్తులో ముంచేస్తున్న సినిమా టైటిల్స్‌

సినిమాలు చూస్తేనే యువత చెడిపోతున్నారంటూ, పెద్దతరం వారంతా ఆడిపోసుకుంటుంటే, మేమేదో కళాపోషణ చేస్తుంటే.అందులోను చివరలో సందేశాలు ఇస్తుంటే వాటిని చూసి అందరూ చెడిపోతున్నారనడంలో అర్థం లేదంటూ సినీ కళా ప్రియులు వెటకారం ఆడుతూంటారు. కాని నేటి యువత సినిమాకి వెళ్ళనక్కర్లేదు, కేవలం వాటి టైటిల్స్‌ చూసి చెడిపోతున్నారనడంలో నాకైతే ఏ సందేహం లేదు. లేటెస్ట్‌గా వచ్చిన ఒక సినిమా టైటిల్‌ 'ప్రేమ కావాలి'. చిన్నప్పటి నుంచి అది కావాలి, ఇది కావాలి అని అందరం అడిగే ఉంటాం. ఇప్పుడు మంచినీళ్ళు కావాలి అనేంత ఈజీగా యువత 'ప్రేమ కావాలి' అంటే ఎవ్వరినీ తప్పు పట్టలేం. ఇప్పటికే స్కూల్‌కి / కాలేజ్‌కి వెళితే ఖచ్చితంగా అక్కడ ఒక అమ్మాయి / అబ్బాయిలో ప్రేమలో పడాలి అనేంతగా మన సినిమాల్లో చూపిస్తున్నారు. వారిని అంతలా థియేటర్స్‌కి రప్పించాలంటే టైటిల్‌కూడా అంతే క్యాచీగా ఉండాలనే తాపత్రయంలో దర్శక నిర్మాతలు వారి హద్దులు మీరుతున్నారనిపిస్తుంది ఇప్పటి పరిస్థితి చూస్తుంటే...

    ఎప్పుడో 'ఖుషి' సినిమాలో నెలల పసికందుల మధ్యలో పుట్టిన ప్రేమ, వారు పెద్దయిన తరువాత ఎలా మొద్దులా మారిందో చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తరువాత వచ్చిన సినిమాలో 'తూనీగా ... తూనీగా' అంటూ చిన్న తనంలో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న వారు కూడా తరువాతి వయసులో మంచి లవర్స్‌గా ఎలా మారారో రొమాంటిక్‌గా చూపించారు. చిన్నతనంలో ఒక అమ్మాయి, ఒక  అబ్బాయి కలిసి ఆడుకుంటూంటే, వారిని చూసి వారు పెద్దయ్యాక ఎంత గొప్ప లవర్స్‌ అవుతారో అని అనుకునేంతగా సమాజాన్ని మార్చేసారు. ఇక 'టెంత్‌ క్లాస్‌'లో నిక్కర్‌ లవ్‌, ఇంటర్‌లో ప్రేమలో పడితే 'కొత్త బంగారు లోకం' చూడొచ్చు అంటూ పిల్లల మనసుల్ని కలుషితంచేసేసారు. స్కూల్లో చదువుతూనే మోటార్‌సైకిల్‌ మెకానిక్‌తో ఎలా ప్రేమలో పడొచ్చో కూడా ప్రాక్టికల్‌గా చేసి చూపించారు.

    ఇప్పుడొస్తున్న ఎక్కువ శాతం 'ప్రేమ' (?) సినిమాల్లో స్కూల్స్‌/ కాలేజ్‌ని బ్యాక్‌డ్రాప్‌గా చూపిస్తున్నారు. లెక్చరర్స్‌ని పరమ బేవార్స్‌గాళ్ళుగా, హాస్య గాళ్ళుగా చూపించే తత్వం కూడా ఈ సినిమాల్లో ఎక్కువయిపోయింది. కాలేజ్‌కి వెళ్ళడమంటేనే ప్రేమలో పడేందుకే అన్నంతగా మన సినిమాల్లో కథలు ఉంటున్నాయి.

    పిల్లలు - ముఖ్యంగా యువత మనసు చాలా సున్నితమైనది. అది చాలా రకాలైన భావోద్వేగాలతో, గందరగోళంతో నిండి ఉంటుంది. ఎవరు ఏది చెబితే అది నిజం అనే పరిస్థితిలో వారు ఉంటారు. తమకంటూ ఒక  ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే ప్రయత్నంలో వారు సహజంగానే చెడువైపు ఎక్కువగా ఆకర్షితమవుతారు. అటువంటి యువత బలహీనతను సొమ్ము చేసుకునే ప్రయత్నమే పైన చెప్పిన సినిమా కథలన్నీ... ప్రేమలో పడడం  - కాలేజ్‌ ఎగ్గొట్టడం - పెద్దల్ని ఎదిరించడం - చివరికి పెళ్ళి చేసుకోవడం - సినిమాల్లో  ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. కాని నిజజీవితంలో వాస్తవానికి దగ్గరగా వచ్చేప్పటికీ, ఇవన్నీ చాలా మంది జీవితాల్లో కావలసినంత విషాదాన్ని నింపుతాయి.

    సినిమా అనేది ఒక బలమైన మాధ్యమం. అందుకు ఎటువంటి సందేహం లేదు. కళ ఒక్కటే కూడు పెట్టదు కాబట్టి కొంత డబ్బుని కూడా సంపాదించాలి కాబట్టి, వ్యాపార విలువల్ని సినిమాల్లో చొప్పించడం తప్పదు. అలాగని సినిమా మొత్తాన్ని వాణిజ్యమయం చేసేసి, యువత మనో భావాల్ని కలుషితం చేసి, వారి భవిష్యత్తును అంధకారం చేసే ఆలోచనాధోరణిని ప్రోత్సహించే సినిమాల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థియేటర్‌ లోపలికెళ్ళిన  తరువాత ఏ చెత్తయినా చూపించనివ్వండి - కనీసం టైటిల్స్‌ విషయంలోను, వాల్‌పోస్టర్స్‌, మీడియా పబ్లిసిటీ విషయంలోను  కొంత సంయమనం పాటించాలి. సినిమా ద్వారా సమాజానికి మేలు చేసి - సందేశాలు ఇవ్వనక్కర్లేదు. కనీసం పసి మనసులు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

2 comments:

  1. poster choosi siggupaddaanandi.chaalaa baadha vesindi.nenu oka teenage kodukki thallini.poster koodaa collega mundu.adige vaallu leraa leka maakendukule ani oorukuntunnaaraa?asalu deeni gurinchi evariki complaint ivvaalo teliyadam ledu.

    ReplyDelete
  2. అమ్మా ధరణిజ గారు...
    మీ బాధ వంటిదే నాది కూడాను... ఇక్కడ స్వేచ్చా, స్వాతంత్రాల గురించి కాదు విషయం... ఇవన్నీ చూసి పిల్లలు ఎక్కడ క్షణికావేశనికి లోనయ్యి, జీవితాల్ని పాడు చేసుకుంటారోననే భయం మాత్రమే... మకెందుకులే అని బాధ పడకుండా, ఇటువంటి వాటి గురించి రెవిన్యూ డిపార్ట్‌మెంట్ వారికి తెలియపరచవచ్చు... మీ దగ్గరలోనీ తహశీల్దారు గారికి కంప్లైంట్ చేస్తే సరిపోతుంది...

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.