Pages

Tuesday, May 3, 2011

ఆధునిక ప్రపంచపు హీరో... మన "గాంధేయవాదులకి" మార్గదర్శి... ఒబామా...

    ఎప్పుడూ గాంధీ సిద్ధాంతాల్ని వల్లెవేసే అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆల్‌ఖైదా అధినేత బిన్‌ లాడెన్‌ను అంతమొందించడం ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసారు. బిన్‌లాడెన్‌ మరణం తరువాత అమెరికన్‌ టి.వి.లలో ఒబామా ప్రసంగించినపుడు ఆయన మాటల్లో ప్రపంచానికి ఒక మంచి జరిగిందనే విషయం, అది అమెరికన్ల ద్వారా జరిగిందనే గర్వం తొణికిసలాడింది. నిజానికి 9/11 తేదీన బిన్‌లాడెన్‌ చేసిన పని అమెరికన్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది.  అది వారి జాతికి జరిగిన అవమానంగా భావించారు. అటువంటి పరాభవానికి కారణమైన ఒక వ్యక్తిని ఎట్టి పరిస్థితులలోను శిక్షించి తీరాలన్న వారి ఆకాంక్ష నేటికి నెరవేరింది. జూనియర్‌ బుష్‌ అమెరికా అధ్యక్షుడి ఉన్న కాలంలోను లాడెన్‌ గురించి ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. కాని ఒబామా ఒక చక్కటి వ్యూహంతో, పాకిస్థాన్‌ ప్రభుత్వానికి కూడా తెలియకుండా, దేశం కాని దేశంలో లాడెన్‌ను మట్టుబెట్టారు.

    అమెరికన్లు ఈ రోజు చేసిన పని ప్రపంచ దేశాలన్నిటికీ, ముఖ్యంగా ఇండియా వంటి దేశాలకు కనువిప్పు కావాలి. తప్పు చేసింది ఎవరైనప్పటికీ, వారు ఏ మతానికి లేదా ప్రాంతానికి చెందిన వారయినప్పటికీ వారిని శిక్షించి తీరాల్సిందే. సాక్షాత్తు భారత పార్లమెంటుపై దాడి చేసిన వారిని, దేశ ఆర్థిక రాజధానిపై దాడి చేసిన వారిని తీసుకుని వచ్చి (అదేలెండి.. అరెస్ట్‌చేసి), ముప్పొద్దులా మేపి, వారిని విచారణ పేరుతో కొత్త అల్లుడి మర్యాదలు చేస్తూ, దేశ ప్రజలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకోవడం మన నేతలకే చెల్లింది. నేరానికి పాల్పడిన వ్యక్తి ఒక మతానికి చెందినవాడనే ఒకే ఒక్క కారణంతో అతడిని శిక్షించడానికి వెనుకాడడం... న్యాయ విచారణ పేరిట కాలయాపన చేయడం... ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు తాకట్టు పెట్టడమే అవుతుంది.  ఇది మన నాయకులకు, రాజకీయ పార్టీలకు తెలియనిది కాదు. కాని, ఓటు బ్యాంకు రాజకీయాల ముందు దేశ ప్రతిష్టగాని, ప్రజల భద్రత గాని గాలికి కొట్టుకుపోతాయి. తరువాతి పరిణామాలు ఎటు దారి తీసినప్పటికీ, తమ పదవులు, పార్టీ ప్రయోజనాలు ముఖ్యంగాని, ప్రజల దృష్టిలో వారు ఎంత చులకన అవుతారో, ఎవరికీ అక్కరలేదు.

    అన్నిటికన్నా విచిత్రమైన విషయం... మే 2వ తేదీన రాత్రి జెమిని టి.వి.లో ఒక చర్చావేదిక ఏర్పాటు చేసారు. దానిలో ఒక మానవ హక్కుల కార్యకర్త (?) అనుకుంటా... పేరు గుర్తు లేదు... బిన్‌లాడెన్‌ను చంపి అమెరికా చాలా తప్పు చేసిందట... అతన్ని పట్టుకుని, చట్ట ప్రకారం విచారణ చేసి, శిక్ష వేయాల్సిందట... ఇలా సాగింది అతని వాదన. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది మరణించడానికి కారణమైన వ్యక్తిని, మతం పేరిట మారణ కాండను సాగించిన ఒక నరరూప రాక్షసుడిని... పట్టుకుని, విచారించడం, శిక్షించడం సాధ్యమవుతుందా? మానవ హక్కులు అటువంటి వారికి అసలు వర్తిస్తాయా?

    ఇక్కడ విషయం హింసని సమర్థించమని కాదు... హింసకు హింసే సమాధానం కాకపోవచ్చు. కాని, కరుడు కట్టిన నేరగాళ్ళని, తప్పు చేస్తున్నామని తెలిసి, ప్రణాళికా బద్దంగా, తాము అనుకున్న దానిని అమలు జరపడం కోసం ఎంతో మంది అమాయకుల్ని చేరదీసి, వారికి శిక్షణ ఇచ్చి, వారి మనసుల్ని మార్చి, ప్రపంచం పట్ల విరక్తి కలిగించి, రక్తపుటేర్లు పారిస్తున్న వారు మారతారనుకోవడం, వారిని న్యాయబద్దంగా శిక్షించాలను కోవడం ఎప్పటికీ జరగని పని. ఏదో ఆవేశంలోనో, తెలియకో ఒకసారి నేరం చేసిన వారిని స్వల్ప శిక్షల ద్వారా, మానసిక పరివర్తన ద్వారా మార్చాలనుకోవడం మంచిదే. చాలా సార్లు అది మేలు చేస్తుంది కూడా. కాని బిన్‌లాడెన్‌ వంటి, ఇంకా మత ఛాందస వాదం ద్వారా, హింస ద్వారా ప్రపంచాన్ని మార్చాలనుకొనే వారిని, వారు పాకిస్థాన్‌లో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే. అప్పుడే ఒక భద్రతతో కూడిన ప్రపంచాన్ని మన భావి పౌరులకి అందించగలుగుతాం. లేదా ఇప్పటిలాగే తాత్సారం చేస్తూ ఉంటే... చేతగాని ధర్మపన్నాలు వల్లిస్తూ కూర్చుంటే, భారత దేశం ఆటవిక మనుషులు, చట్టాలతో కూడిన భయంకర తాలిబన్ల పాలనలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

3 comments:

  1. మీ వ్యాసం బాగుంది. మీ రెండవ పేరాతో నేను వందశాతం ఏకీభవిస్తాను. అమెరికా కుటిలత్వాన్ని కూడా గ్రహించగలగాలి. సోవియట్ యూనియన్ ని విచ్చిన్నం చేయడానికి తనకి ఉపయోగపడతాడన్నపుడు లాడెన్ ను పెంచి పోషించింది అమెరికానే తనకే అతను ముప్పయినపుడు వేటాడి వేటాడి చంపింది. మానవ హక్కులు లాడెన్ కైనా వర్తించాల్సిందే.

    ReplyDelete
  2. మీ వ్యాసం చక్కగా వుంది. ఇది కలియుగం. అంతా కుటిల రాజకీయమే. అలాంటి కుటిలతను ఎలా ఎదుర్కోవాలో చాణక్యుడు చేసి చూపించాడు. ముల్లును ముల్లుతోనే తీయాలి. ఇలాటి విషయాలలో అమెరికాలా ఏక పక్ష నిర్ణయం తీసుకోవాలి. అదే మనమైతే అయ్యో పాకిస్తాను ఏమనుకుంటుందో అని ఫీల్ అయి పోయి బాధ పడేలోగా సదరు తీవ్ర వాది దొడ్డి దారంట చల్లగా జారుకుంటాడు. మన దేశం లో అయితే రక్షణకు ఏమీ ఢోకా వుండదు. మనము పరమత సహనం గల వాళ్ళం. మనది యోగులు నడచిన భూమి. క్షమ అన్నది మన రక్తంలో జీర్ణించుకుంది. అయితే యుగ ధర్మం మారింది. ఒక యుగంలో క్షమ అనేదాన్ని ఈ యుగంలో చేతగాని తనం అంటారు. మనం మరొక దేశం మీద దండెత్తక్ఖరలేదు. కాని మన దేశం మీదకు వచ్చిన వాడ్ని అంతమొందించడంలో ఉపేక్షించ కూడదు. అదే అమెరికా చేసింది. అయితే రాజకీయ నపుంసకులు మన దేశాన్ని పాలిస్తున్నంత వరకు మనకు ఈ పీడలు, బాధలు తప్పవు.

    ReplyDelete
  3. మనం మరొక దేశం మీద దండెత్తక్ఖరలేదు. కాని మన దేశం మీదకు వచ్చిన వాడ్ని అంతమొందించడంలో ఉపేక్షించ కూడదు. Absolutely Right!

    madhuri.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.