ఎస్. ఆర్. భల్లం గారు అన్ని కవితా ప్రక్రియల్లో పేరు మోసిన కవే గాక, చక్కని సామాజిక స్పృహ వున్న వ్యక్తి. రాష్ట్ర, జాతీయ స్తాయిల్లో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. నాకు మంచి మిత్రుడవటం చేత ఆయన కవితల్లో మచ్చుకు ఒకదాన్ని మీకు రుచి చూపిందామనే ఆలోచనతో, ఆయన రాసిన "కొల్లేరు" కవితా సంపుటిలో నుండి, ఈ కవితని మీకందిస్తున్నాను.
కొల్లేరు
ఒక ప్రవాహం కాదు
స్వార్ధం ఎరకి చిక్కిన జలపుష్పం..
ప్రకృతి విడిచిన
ఒక మౌన దుఃఖ భాష్పం...
ఎన్ని రెక్కల కష్టం కూడితే
ఈ ద్రవీభూత జీవన యానం...
కొల్లేరంటే -
తడిపొడి ఇసుక కాదు
జలచరాల పోగూ కాదు
ఆశా నిరాశల అనంత యాత్రలో
బోర్లించిన అస్తిపంజరంలో
ఇసుమంత ఆర్ధ్రత
కొల్లేరంటే -
ఒక జననం... ఒక మరణం...
వాటి మధ్య నలిగే జీవనం...
తేట నీటి నుదుటి మీద
చీటపట చినుకుల
మెరుపుల మెరుగుల్ని దిద్దుకుంటూ
తెగిపోయిన
సుజల జ్ఞాపకాల్ని ముడి వేసుకోవడానికి
సమాధుల్లోంచి లేచిన శవంలా ఉందిప్పుడు కొల్లేరు.
ఎంత విశాలంగా వుండేది
వందల మైళ్ళకి విస్తరించిన ఈ జలరాశి
ఇప్పుడది అంతరించిపోయిన మూసీ
ఈ జల మైదానాన్ని
భూ ఖండాలుగా మార్చి దురాక్రమణ చేసేవాడొకడు
అపార జలనిధిని
చెరువు ముక్కలుగా కత్తిరించి
స్వార్ధ మత్స్యాల్ని సాగు చేసేవాడొకడు
క్షణం క్షణం కుచించుకుపోతున్న
ఈ జల సంపదని కాపాడేదెవరు?
ఇప్పుడు కొల్లేరు
ఏ కలంలోనూ సిరాగా ప్రవహించదు
ప్రవహించినా
అది డబ్బు సంతకానికి పనికొస్తుంది.
ఇప్పుడు కొల్లేరు
ఏ కావ్య రచనకూ ప్రేరణ కాదు
పాత జ్ఞాపకాల్ని తవ్వి తీయడానికి
పలుగూ పారల్ని సిద్దం చేసుకొండి
ఇలా కొల్లేటిని మార్చిందెవరు.
దుర్నీక్ష్య కాంతిలో వెలిగిన కొల్లేటి సలిలం
ఇప్పుడు దుర్గంద దుర్జలంగా మారిపోయింది
"నీళ్ళ పక్కన వున్నావ్... నీకేమిటి...?" అనేవారు
నీటి గొడుగు కింద వున్నావ్... నీకేమిటి...? అనేవారు
కాని ఇప్పుడు
నిజంగా కొంప కొల్లేరయింది
ఇప్పుడిది
గ్రామాల మధ్య దూరాల్ని పెంచిన
బురద మడుగు మాత్రమే...
ఈ మడుగు ఎప్పటికయినా ముందడుగు ఔతుందా...?
fine poem
ReplyDeletebollojubaba
బావుంది
ReplyDelete-- విహారి