Pages

Sunday, July 27, 2008

ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే (Part 2)

"పెళ్ళంటే నూరేళ్ళ పంట" అని పెద్దలు చెపుతారు. కాని "పెళ్ళంటే నూరేళ్ళ వంట" అని పెళ్ళయిన ఏ అమ్మాయిని అడిగినా చెపుతుంది. అదే పెళ్ళయిన మగవాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. "పెళ్ళంటే నూరేళ్ళ మంట" అని శెలవిస్తాడు. అది మంట అయినా, వంట అయినా, పంట అయినా గాని పెళ్ళి చేసుకున్నాక, ఆడయిన, మగయినా, కొంచెం కష్టాలు, ఇబ్బందులు తప్పవని దీని సారాంశం.

నేను మొదటి భాగంలో చెప్పింది సరిగా అర్ధం కాలేదని మహేష్ కుమార్ గారు అన్నారు. అర్ధం కాక పోవడానికి ఏమీ లేదండి బాబు. "ఎంత వారలయినా కాంతా దాసులే అని" ఎవరో కవి చెప్పినట్లు, భార్య ఎన్ని కష్టాలు పెట్టినా సగటు మధ్య తరగతి జీవి ఏమి జరగలేదన్నట్లు మొఖం పెట్టి, కాస్త చిరునవ్వు చిందిస్తాడు. నిజానికి ప్రపంచ0లో కష్టాలు పడే ఆడాళ్ళు కొద్దిమందయితే, భార్య చేతిలో తన్నులు తినేవాళ్ళే (కనీసం చేతిలో వస్తువుని భర్త మొఖం మీద విసిరికొట్టేవాళ్ళు) చాలా మంది ఉంటారు. కాకపోతే మగాడు అంటే గంభీరంగా వుండాలి కాబట్టి, జెంటిల్మన్‌లా పోజు పెట్టి, తనకు జరిగిన అవమానాన్ని కడుపులోనే దాచుకుంటాడు. కనీసం కన్నీళ్ళు కూడా కనబడనివ్వడు. బయటకు చెపితే పరువు పోతుంది, అందరు నవ్వుతారనే భయం వల్ల. పాపం పూర్ ఫెలో.


ఈ టపా మొదటి భాగంలో భార్య సినిమాకోసం కాక, చీర సెలెక్షన్ విషయంలో గొడవ పెట్టుకుంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడలాంటిదే మరో సరదా అయిన సంఘటన గురించి చెపుతాను. మధ్యాహ్న సమయం. భోజనానికి ఇంటికి వస్తాడు భర్త. కంచం దగ్గర కూర్చుంటాడు. ఆ భార్యా, భర్తల మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చూద్దాము.


"ఏమండి, కొత్త వంట ఒకటి వండాను. వడ్డించమంటారా?"

"సరే పెట్టు""ఎలా వుందండి, నా వంట?"

"చాలా బాగుందోయ్. వంట విషయంలో నా భార్య కన్నా బాగా ఎవరు చేస్తారు చెప్పు?" భర్త మెచ్చుకోలు.

"అలా కాదండి. నిజంగానే బాగుందా?"

"ఎందుకలా అడుగుతున్నావు? నిజంగానే బాగుంది"

"అందులో ఉప్పు ఎక్కువయింది కదాండి...."

కొంచెం మొహమాటపడుతూ, "అవునోయ్, కొంచెం బాగా లేదు"

"ఆ మాట ముందే చెప్పొచ్చు కదాండి"

"అది కాదు, నువ్వు బాధ పడతావని..."

"అంటే నేను బాధ పడతానని నన్ను మెచ్చుకుంటున్నారన్న మాట"

"లేదు, లేదు, నువ్వెప్పుడూ బాగా వంట చేస్తావు, ఇప్పుడు కూడా నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను గాని, లేకపోతే చెప్పేవాడిని కాదు".

"అదిగో, అంటే ఇన్నాళ్ళ నుంచి నేను బాగా వంట చెయ్యకపోయినాగాని, మొహమాటనికి మెచ్చుకుంటున్నారన్న మాట. పోనీలెండి, అంతగా మీకు ఇష్టం లేకపోతే వచ్చేటప్పుడు హోటల్ నుంచి ఏమన్నా తెచ్చుకోండి. ఇంకెప్పుడు కొత్త వంటలు చెయ్యనులేండి"

భర్త, మనసులో... "ఎరక్క పోయి బాగాలెదన్నాను. ఇంకెప్పుడయినా భోజనం చేసేటప్పుడు ఏమి మాట్లాడకూడదు".

ఇక చెప్పేదేముంది. ఆ మానవుడు భోజనం సమయంలో భార్య ముందు ఎప్పడూ నోరెత్తడు. ఏమన్నా అడిగినా తలూపి సమాధానం చెపుతాడు. దానర్ధం అవుననీ కాదు, కాదనీ కాదు. భార్య ఎలా అర్ధం చేసుకున్నా పర్వాలేదు. తనకి కడుపు నిండితే చాలు. ఒకవేళ తరువాత ఎప్పుడయినా మరో రోజు ఇంటికి లేట్‌గా వచ్చినట్లయితే, భార్యా మణి ఈ మానవుడికి భోజనం పెట్టకపోయినా బాధ పడడు. భర్త వచ్చిన విషయం కనిపెట్టిన ఆవిడగారు, "ఏమండి, నాకు కొంచెం తలపోటుగా ఉంది. నేను భోజనం చేసేసాను. కిచెన్ లో ఆ మూల అన్నం, కూరలు వున్నాయి. మీరే పెట్టుకుని తినేయండి" అంటుంది. ఇక అంతే. బుద్దిగా వెళ్ళి ఒక్కడే కూర్చుని భోజనం లాగించి, అంతే సైలెంట్‌గా వచ్చి పడుకుంటాడు సదరు భర్త గారు.

నీతి: భార్య ఎప్పుడు ఎటువంటి వంట చేసినా, భర్త దానిగురించి బాగుందనిగాని, బాగాలేదనిగాని కామెంట్ చేయకూడదు. అలాచేస్తే మొదటికే మోసం వస్తుంది.


ఇదండి సంగతి. ఇలాంటి మరో సరదా అయిన సంఘటన గురించి తరువాతి భాగంలో చదువుదాము.

3 comments:

  1. పంటైనా..వంటైనా..మంటైనా పెళ్ళనేది మనిషికి తప్పకుండా కావలసిన ఒక తంటా. అదిమాత్రమే నిజం. మిగతావన్నీ మాయ అంతే!

    ReplyDelete
  2. బాగుంది. సరదాగా రాస్తున్నారా...లేక మనీ స్టైల్లో...భద్రం బీ కేర్ ఫుల్లు బ్రదరూ అని బెదిరిస్తున్నారా?

    ReplyDelete
  3. పెళ్ళికాని బ్రహ్మచారి ని కావటంచేతో ఎమో విషయం సూటిగా అర్ధంకావటం లేదు. క్షమించాలి.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.