Pages

Monday, July 21, 2008

అచ్చుతప్పులా... మజాకా...

ముద్రా రాక్షసాలు.... సో కాల్డ్ ప్రింటింగ్ మిస్టేక్స్... మనిషి వ్రాత మొదలు పెట్టినప్పటినుండి తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. కాగితం మీదో, తాళ పత్ర గ్రంధంలోనో ఏదయినా ఒకటి రాసినట్లయితే ఇక దాన్ని చెరపడం కుదరదు. అందుకే హంసపాదు అనే ప్రక్రియని మన కవులు కనిపెట్టారు. అంటే రాసేసిన తరువాత, ఎక్కడయినా తప్పులు కనిపిస్తే ఎక్కడయితే తప్పులు వున్నాయో, అక్షరం వదిలేసామో అక్కడ ఒక చిన్న ^ పెట్టి, పైన ఆ అక్షరాన్ని రాయడం అన్న మాట. అక్కడ వరకు బాగానే ఉంది గాని, ప్రింటింగ్ వాడుకలోకి వచ్చిన తరువాత అసలయిన ఇబ్బంది మొదలయింది. "ఈ భాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు" అని రజనీకాంత్ సినిమాలో డైలాగ్‌లా, ఒక సారి ప్రింటింగ్ అయిపోతే, ఎన్ని కాపీలు ప్రింట్ చేస్తే, అన్ని సార్లు తప్పు చేసినట్టు. ఇక దాన్ని సరిచేసే అవకాశం ఉండదు. అందుకనే పాత రోజుల్లో ప్రతీ పుస్తకానికి వెనుక తప్పొప్పుల పట్టిక తప్పనిసరిగా ఉండేది. ఏ పేజీలో ఎక్కడెక్కడ తప్పు ఉన్నది, దాన్ని సరిగా చదవవలసిన పదం ఏమిటి అనేది ఆ పట్టికలో వివరంగా ఇచ్చేవారు. ఈ ముద్ర రాక్షసాల్లో కూడా ఎన్నో సరదా పుట్టించేవి వుంటాయి.


అందరికీ తెలిసిందే. చాలా ప్రఖ్యాతి వహించిన అచ్చుతప్పు. "రాముని తోక పివరుండు ఇట్లనియె". చదివే వారికి రాముడికి తోక వుండడం ఏమిటో, రామాయణం మొత్తం వెదికినా పివరుడు అనే పాత్ర ఎక్కడ ఉందో తెలియక జుట్టు పీక్కుంటారు. నిజానికి అది స్పేసింగ్ వల్ల వచ్చిన అచ్చుతప్పు. "రామునితో కపివరుండు ఇట్లనియె" అనేది సరయిన పదం.



మరో సందర్భంలో పాండురంగారావు గారు విజిటింగ్ కార్డ్ ప్రింటింగ్ చేయమని ఇచ్చారు. తీరా ప్రింట్ అయిన తరువాత చూసుకుంటే మధ్యలో సున్నా ఎగిరిపోయింది. పాండురంగారావు కాస్తా "పాడురంగారావు" అయింది. ఇక ఆయన మొఖం చూడాలి. ఏమి అనలేని పరిస్తితి. ఆయన మంచివాడయితే దిద్దుకుని సరిపెట్టుకుంటారు. లేకపోతే మళ్ళీ ప్రింట్ చేసి ఇవ్వడమే. ఇదే క్రమంలో రంగారావు గారు కాస్తా లంగారావుగారు కూడా అయిపోతారు. చూసే వాళ్ళకు వినోదం, ప్రింట్ చేసిన వాళ్ళకు సంకటం, చేయించుకున్న వాళ్ళకు ఇబ్బంది.


ఇక శుభలేఖల్లో అయితే ఇలాంటి అచ్చుతప్పులు చాలా వస్తుంటాయి. సహజంగా ప్రింటింగ్ ప్రెస్సు వాళ్ళు ముందుగా ప్రూఫ్ కాపీ ఇస్తారు. శుభలేఖలు ప్రింట్ చేయించుకునే వారు జీవితంలో ఒక్క సారి ప్రెస్సుకి వస్తారు. వారికి ఈ తప్పులు గురించి అంతగా అవగాహన ఉండదు. కంప్యూటర్ ఆపరేటర్ తప్పులు లేకుండా చేస్తే ఫరవాలేదు. అక్కడేమన్నా తేడా జరిగిందా, ఇక అంతే సంగతులు. అమ్మాయికి, అబ్బాయికి కూడా వరుడు అని రావచ్చు. లేదా ఇద్దరికి వధువు అని రావచ్చు. రాత్రి పెళ్ళి ముహూర్తం అయితే, ఉదయం పెళ్ళి అని ప్రింట్ కావచ్చు. లేదా, సోమవారం బదులు శుక్రవారం అని రావచ్చు. ముందు చూసుకోరు. డెలివరి తీసుకుని, అందరికి పంచడం ప్రారంభించిన తరువాత, మీలాంటి వాళ్ళు ఎవరో అది చూసి, ఇందులో ఫలానా తప్పు ఉంది అని చెబుతారు. సగంలో ఆ శుభలేఖని పంచడం ఆపుచేసి ప్రెస్సాయనకి ఫోన్ చేస్తాడు. మీరు ప్రూఫ్ చూసుకున్నారు కదా అని సమాధానం వస్తుంది. ఇక చూడండి, శుభలేఖ వేయించుకున్నాయన లబోదిబో.


రోజు లక్షల కాపీలు ప్రింట్ అయ్యే వార్తా పత్రికలది మరో గొడవ. అసలే రాత్రి వేళల్లొ కంపోజ్ చేస్తారు. కంప్యూటర్ ముందు కూర్చున్నాయన మూడ్ బాగుంటే ఫర్వాలేదు. లేదా ఏదో తప్పు దొర్లిపోతుంది. ఇక అక్కడి నుండి సవరణలు, క్షమించమని అడగడాలు. చాలా కాలం క్రితం సంగతి. ఎవరో చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో పర్యటించారు. విలేకరి క్షామ పీడిత ప్రాంతాల్లో పర్యటించారు అని రాసి పంపించాడట. మర్నాడు పేపర్లో "ముఖ్యమంత్రి గారు కామపీడిత ప్రాంతాల్లొ పర్యటించారు అని వచ్చిందట". ఇక చెప్పేదేముంది, మర్నాడు అదే చోట సవరణలు, క్షమాపణలు మామూలే.


మరో సందర్భంలో "ఉదయం"లో అనుకుంటా, జిల్లాలో తరిగిపోతున్న వృక్ష సంపద అని ఆర్టికల్ వచ్చింది. ప్రింటింగ్‌లో మాత్రం "జిల్లాలో తరిగిపోతున్న వక్ష సంపద అని వచ్చింది. అన్ని కాపీలు ప్రింట్ అయిపోయి, అందరి దగ్గరకి వెళ్ళిపోయాయి. మళ్ళీ షరా మామూలే.


ఇవన్ని ఎవరిని ఇబ్బంది పెట్టేవి కావు గాని, మొన్నటి వారం సాక్షి పేపర్‌లో జరిగిన పొరపాటు అన్నిటి కంటే పెద్ద తప్పు. నిజానికి ఎవరో ఒక సబ్ ఎడిటర్ చేసిన తప్పుకు, యావత్తు జగన్ కుటుంబమే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తెలిసి జరిగినా, తెలియక జరిగినా తప్పు తప్పే. ఈ తప్పు దిద్దలేనిది. అచ్చుతప్పులా... మజాకా...


కొత్త సామెత: కాలు జారినా తీసుకోవచ్చు. నోరు జారినా తీసుకోవచ్చు. కాని ఒకసారి ప్రింట్ చేస్తే చెరపలేము, మార్చలేము.

11 comments:

  1. బాగుంది. నిజమే!

    ReplyDelete
  2. జగదీష్ గారు,

    "ఆదిలోనే హంస పాదా?" అన్న సామెతకు అసలైన అర్థం తెలిసిందండి మీ టపా చదివాక.
    ముద్రా రాక్షసాల గురించి భలే చెప్పారు. బావుంది.

    ReplyDelete
  3. వార్తా పత్రికలా లేక వార్థా పత్రికలా? ఇంత రాసి మీరు కూడా తప్పులు రాయటం బావులేదు..

    ReplyDelete
  4. సరదాగా వుంది. బావుంది. ప్రూఫ్ రీడింగు నిజంగా ఓ పెద్ద కళే! అందులోనూ, రాసింది కూడా మనమే అయితే, ప్రూఫు చూసి తప్పులెన్నడంలో తెగ తప్పులు దొర్లిపోతాయి.
    మీరు స్వయంగా ప్రెస్సు నడుపుతున్నారు కాబట్టి, స్వానుభవంలోని చమత్కారాలు ఈ సారి తెలియజేయండి.

    ReplyDelete
  5. సరదాగా ఉంది మీ టపా. అయితే, అప్పుతచ్చుల మీద రాసిన టపాలో మరీ ఇన్ని తచ్చులుంటే ఎలాగండీ (ఎక్కువగా దీర్ఘాలు, కొమ్ములు లాంటివి)? మీ కొత్త సామెతని కాసేపు మర్చిపోయి ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేసుకుని టపాని దిద్దితే మరింత బావుంటుంది :)

    ReplyDelete
  6. @ విజయక్రాంతి గారు...
    మీరు చెప్పింది సరిచేసానండి.

    @ అబ్రకదబ్ర గారు...
    నిజంగా క్షమించాలి. 'లేఖినీ కీబోర్డ్ నాకింకా పూర్తిగా అలవాటు కాకపోవడం వల్ల జరిగిన పొరపాటు. అన్ని తప్పులూ సరిచేసాను. మేము ప్రెస్సులో వాడేది ఆపిల్ కీబోర్డ్. దానివల్లే ఈ అప్పుతచ్చులు.

    @ చిన్నమయ్య గారు..
    తప్పకుండానండి. ఇంకా నాకు అనుభవంలోకి వచ్చే చమత్కారాలతో మరో సారి తెలియచేస్తాను.

    @ మహేష్ కుమార్ గారు..
    నెనర్లు.

    ReplyDelete
  7. బాగున్నై .. మీ ముద్రారాక్షసోదయాలు

    ReplyDelete
  8. హహ... భలే సరదాగా ఉంటాయి ముద్రా రాక్షసాలు.

    కనీసం వెబ్ పత్రికలూ, బ్లాగులయితే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రింటు మీడియాలో కుదరదుగా !

    ReplyDelete
  9. బావుంది. మీ బ్లాగు చదువుతుంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా తమ్ముడు సోషల్ నోట్స్‌లో, ఒక ప్రశ్న "గ్రామమున సబ్బు పని యేమి" అని చదివేవాడు (గ్రామ మునసబు పని). మేము దానికి సమాధానంగా "అందరి ఒళ్ళు రుద్దడం, ముఖం తోమడం వగైరా" అని చెప్పేవాళ్ళం.

    ReplyDelete
  10. వార్తాపత్రికల్లో అప్పుతచ్చుల్ని కొండొకచో సరదాగా తీసుకోవచ్చు, ఎక్కువగా క్షమించొచ్చు. కానీ దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ కొన్ని దారుణమైన తప్పులు చేస్తుంటారు: ఉదాహరణకి 'విలేకరి' కాకుండా 'విలేఖరి', 'శాకాహారం' బదులు 'శాఖాహారం', 'పురందేశ్వరి' ని 'పురంధరేశ్వరి', ఇలా .... ఇవి ఎంత సాధారణం అయిపోయాయంటే, ఎప్పుడైనా ఒకరిద్దరు అసలైన పదాలు రాస్తే పాఠకులు అవి తప్పని పొరపడేంత!

    ReplyDelete
  11. చాలా బావుందండీ... హంసపాదు తెగ వాడేసేవాడిని కానీ అర్ధం తెలిసింది ఇప్పుడే, థాంక్స్.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.