ఈ మధ్యన ఏ టి.వి. చానల్ చూసినా, డాన్స్ బేబి డాన్స్ అనో, డాన్స్ హంగామా అనో పేరు ఏదయితేనేనేం, పిచ్చి పిచ్చి డాన్స్ ప్రోగ్రాములు వెల్లువెత్తుతున్నాయి. పెద్దవాళ్ళవరకు అయితే పరవాలేదు కాని, మరీ దారుణంగా చిన్నపిల్లలచేత కూడా అర్ధ నగ్నంగా ఎబ్బెట్టు కలిగేలా డాన్సులు చేయిస్తున్నారు. కనీసం వారు డాన్స్ చేసే పాటలకు అర్ధం కూడా తెలియకపోయినా, ఆయా సినిమాలలో హేరో, హేరోయిన్లను అనుకరిస్తూ వారు చేసే చేష్టలు చూస్తుంటే జాలి, కోపం ఒకే సమయంలో కలుగుతున్నాయి. ఎక్కడయినా పల్లెటూరిలో రికార్దింగ్ డాన్స్ జరిగితె పత్రికలు, మీడియా, పోలీసులు దాన్నో పెద్ద తప్పుగా చిత్రీకరిస్తారు. అవి చేసేవాళ్ళు పొట్ట కూటి కోసం చేస్తున్నాగాని. ఇక్కడ వాళ్ళని సమర్ధించడం నా ఉద్దెశ్యం కాదు గాని, అదే తప్పు బహిరంగంగా రాష్ట్రమంతటా అనేక కోట్ల మంది చూస్తుండగా ప్రసారం చేయడం నిజంగా తప్పే. పైగా అదేదో గొప్ప పనిలా ఆ పిచ్చి గంతులలో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు అంటు కొలతలొకటి.
అన్నిటికంటే దారుణమయిన విషయం ఏమిటంటె తల్లితండ్రులు కూడా తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదు కాని, తమ పిల్లలని ఇలాంటి ప్రోగ్రాములకి ఎందుకు పంపుతున్నరో వారికే తెలియాలి. కన్న బిడ్డలకి అలాంటి చెత్త డ్రెస్సులు వేసి, పనికిమాలిన డాన్స్ (?) నేర్పించి అందరి ముందు పరువు పోగొట్టుకోవడానికి ఎందుకు పంపుతారో తెలియదు. మనకంటూ ఒక ప్రత్యేకమయిన సంస్కౄతి ఉంది కదా. దాన్ని ప్రోత్సహించనక్కర లేదు. కనీసం చెడగొట్టకుందా ఉంటే అదే పది వేలు. ఇలాంటి విష సంస్కౄతి ఇంకా విస్తరించకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవలసింది పిల్లల తల్లితండ్రులే.
పిచ్చి ముదిరి రోకలికి తల చుట్టుకున్నటుంది నేటి పరిస్థితి.తల్లిదండ్రులకు తమ పిల్లలు టీ.వీ లో కనబడాలనే దుగ్ధ తప్ప వే్రే ఆలోచన వాళ్ళకున్నట్లు కనబడ్డంలేదు.
ReplyDelete