Pages

Sunday, August 3, 2008

ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే (ఆఖరి భాగం)

"పెళ్ళికి ముందు ఆడపిల్ల తన భవిష్యత్తు ఎలా ఉంటుందో, తనకు ఎలాంటి భర్త లభిస్తాడో అని అలోచిస్తుందట. కాని పెళ్ళయిన తరువాత మగాడు ఇకపై తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని భయపడతాడట." ఎక్కడో చదివిన ఒక తెలుగు సామెత.

సాధారణంగా పెళ్ళయిన తరువాత భార్య, భర్తలు ఎంత అన్యోన్యంగా  మెలగినప్పటికీ, ఒకరినొకరు ఎంత అర్ధం చేసుకున్నామని అనుకున్నప్పటికీ, మనసులో మాత్రం ఏదోమూల సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. భర్త తన మాటే వినాలని భార్య, భార్య తను చెప్పినట్టల్లా చెయ్యాలని భర్త ఇలా ఎవరికి వారు తెలియకుండానే ఆధిపత్య పోరు మొదలవుతుంది. అది హద్దుల్లో ఉంటే పర్వాలేదు. అదుపు తప్పిందా... ఇక ఆ సంసారం వీధిన పడ్డట్టే. సాధారణంగా పెళ్ళయిన కొత్తలోనే ఇటువంటి పోరాటాలు మొదలవుతూ ఉంటాయి. ఇందులో సహజంగా, అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం ఆడవాళ్ళదే పై చేయిగా ఉంటుంది. అదెలాగో చూద్దాము. భార్య తన మాట వినని భర్తపై యుద్ధం ప్రకటిస్తుంది. ముందుగా అలకలు, నిరాహార దీక్షలు మొదలవుతాయి. అంటే భర్త ఇంటికి వచ్చేసరికి ముసుగుతన్ని పడుకోవడం, భర్తకి తెలిసేలా నిరాహార దీక్ష చేయడం వంటిది. (భోజనం ఒక్కటే మానేస్తారు లెండి. మిగతా చిరుతిళ్ళు మామూలే). కానీ పాపం నిజం తెలియని ఆ భర్త నిజంగానే తన భార్య భోజనం చేయ్యలేదేమోనని ఖంగారు పడిపోతాడు. నెమ్మదిగా భార్య దగ్గరికి చేరి ముసుగుతీసి బ్రతిమలాడడం మొదలు పెడతాడు. కారణం తెలియదు. ఎందుకు కోపగించింది. పోనీ ఏమి చేస్తే ఆ కోపం  పోతుందో అంతకన్నా తెలీదు. ముందుగా గెడ్డం పట్టుకుంటాడు. అలా కొంచెం సేపు బ్రతిమలాడాక, తప్పని సరి పరిస్తితుల్లో కాళ్ళు కూడా పట్టుకున్నాక, అప్పుడు నెమ్మదిగా నోరు పెగులుతుంది. "మరీ,... ఏమండీ.... మరేమీ లేదండి.... మొన్న మనమిద్దరం సినిమాకి వెళ్ళినప్పుడు, నేను టికెట్ తీసుకోవడానికి లేడీస్ క్యూలో నుంచున్నాను కదండి. మీరు బయట నుంచున్నారు. అప్పుడే అటువైపు వచ్చిన ఒక అందమయిన అమ్మాయి మీ వైపే చూస్తూ నవ్వింది కదండి. ఆ అమ్మాయి ఎవరండి" అని అడుగుతుంది. హమ్మయ్య, కారణం అర్ధం అయిపోయింది అని ఒక నిట్టూర్పు విడిచి, ఆ అమ్మాయి మన పెళ్ళి కాకముందు మన ఇంటి పక్కనే ఉండేవాళ్ళే. కొంచెం పరిచయం ఉంది. అందుకే నవ్వింది" అని చెపుతాడు ఆ అమాయకపు భర్త. "మరి ఆ అమ్మాయి గురించి మన పెళ్ళయినతరువాత ఇన్నాళ్ళల్లో నాకెప్పుడూ చెప్పలేదేమండి" అని అడుగుతుంది భార్య. ఇంకేమీ చెయ్యలేక, అదికాదే, ఎప్పుడూ గుర్తుకురాలేదు. ఇంకెప్పుడు ఏ అమ్మాయినీ చూసి నవ్వనులే" అని వాగ్దానం చేసేస్తాడు సదరు భర్త గారు. ఇంకేముంది కధ సుఖాంతం. భార్యకి కావలసింది భర్త నుంచి ఆ వాగ్దానం మాత్రమే. తనని తప్ప మరెవరి వంకా తన భర్త చూడకూడదనే అందమయిన స్వార్ధం. రంభ, ఊర్వశి ఎదురుగా నిలబడ్డాగాని తన భర్త వారెవరి వంకా కన్నెత్తి కూడా చూడకూడదు. తనని మాత్రమే పొగడాలి. ఇలా ఉంటాయి భార్యల ఆలోచనలు.

మరో రకం భర్తలూ ఉంటారు. వీళ్ళకి కొంచెం బుర్ర తక్కువ. భార్య మీద ఆధిపత్యం చెలాయించేసి తామేదో పెద్ద హీరోల్లా పోజు కొట్టాలని ఆలోచన. కాని వాళ్ళ తెలివి తక్కువతనం ఎలా బయట పడుతుందో చూద్దాం. పైన చెప్పినవన్నీ చెయ్యకుండా కోపగించిన భార్య మీద యుద్దం ప్రకటించేస్తారు. వెంటనే ఆ భార్య "మీరు కాదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను" అని బెదిరిస్తుంది. భర్త ఎంతయినా మగాడు కదా, అహం దెబ్బతింటుంది. "నీ ఇష్టం, పోతే పో, నేను ఇంకో దాన్ని తెచ్చుకుంటాను" అని నోరు జారతాడు. ఇక చూస్కోండి. ఆవిడ రుద్ర కాళి అవతారం ఎత్తుతుంది. ఆడాళ్ళకుండే ఆఖరి అస్త్రం ప్రయోగిస్తుంది. అదే ఆత్మహత్యయత్నం. "ఇక నా వల్ల కాదండి. నేను చచ్చిపోతాను. ఏ నుయ్యో, గొయ్యో చూసుకుంటాను" అంటుంది. వెంటనే వంటింట్లోకి వెళ్ళి డబ్బాలన్ని వెతుకుంది. భర్తకి ఆ చప్పుళ్ళన్ని వినిపిస్తూంటాయి. కాసేపటికి మనోడి బుర్రలో లైట్ వెలుగుతుంది. కొంపదీసి ఇది నిజంగా అన్నంత పనీ చెయ్యడం లేదు కదా అని. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటాడు. ఇంకెప్పుడు ఇలా చెయ్యకే, నువ్వు చెప్పినట్టాల్లా వింటాను. నువ్వెలా ఉండమటే ఉంటాను. ఏమి చెయ్యాలో చెప్పు. జీవితంలో ఏ అమ్మాయి వంకా చూడను. ఆఫీసు నుండి పెందలాడే ఇంటికి వచ్చేస్తాను. మా అమ్మా, నాన్నల నుండి విడిపోయి మనం వేరు కాపురం పెడదాము. పక్కింటి పుల్లమ్మ కొన్న చీరలాంటిదే నీక్కూడా కొనిపెడతాను. ఇలా..... ఇలా.... ఇంకా చాలా ఉంటాయి. ఈ నిబంధనలన్నింటికీ సదరు భర్త గారు ఒప్పుకున్నాకా, అప్పుడు ఆ భార్య గారు ఆత్మహత్యా ప్రయత్నం విరమించి, మొగుడ్ని క్షమించేస్తుంది. మళ్ళి ఎప్పుడయినా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని భయపడిపోయి, ఆ భర్త తగు జాగ్రత్తలో ఉంటూ, తన భార్యకి కోపం రాకుండా చూసుకుంటూ, ఆదర్శ భర్తగా పేరు సంపాదించుకుంటాడు. అదన్న మాట సంగతి.

అయ్యబాబోయ్, ఇప్పటికే మీతో చాలా రహస్యాలు చెప్పేసాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చున్నానని మా ఆవిడకి తెలిస్తే,..... అమ్మో, ఇంకేమన్నా ఉందా.... ఉంటామరీ....

5 comments:

 1. మాలాంటి బ్రహ్మచారులకి బోల్డు విషయాలు చెప్పేసారు.

  ReplyDelete
 2. మొత్తానికి ‘సరదాగా’జ్ఞానోదయం కల్పిస్తున్నారు. లగేరహో!

  ReplyDelete
 3. వీటన్నింటిని నేను ఖండిస్తున్నాను అధ్యక్షా. మీ అనుభావాలన్నింటిని ఆడవారికి ఆపాదించేయ్యడాన్ని మేము ఒప్పుకోం. :-)

  ReplyDelete
 4. బాగా చెప్పారు!

  ReplyDelete

Note: Only a member of this blog may post a comment.