Pages

Monday, July 7, 2008

మమ్మీ, డాడీ వద్దు.... అమ్మా, నాన్నే ముద్దు. (దయచేసి తెలుగుని కాపాడండి)

అమ్మ పిలుపులోని కమ్మదనం, నాన్న అనే పిలులోని ఆత్మీయత తెలుగులో ప్రతిఫలించినట్లుగా మరే భాషలోనీ కనిపించవు. మనందరం తెలుగు వాళ్ళము కాబట్టి, చిన్నప్పటి నుండి తెలుగులోనే మాట్లాడుతూ, ఆ మాధుర్యం మనం అనుభవించాము కాబట్టి మనకలాగే అనిపిస్తుంది. కాని ఈ తరం పిల్లలు ఏం పాపం చేసారని, వాళ్ళని చక్కటి తెలుగు భాషకి దూరం చేస్తున్నాము? కేవలం మమ్మి, డాడీ పిలుపులతోనే కాకుండా, కంటికి కనబడిన ప్రతీ వస్తువుని, మనతో మాట్లాడే ప్రతి మాటనీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలని పట్టుబట్టే తల్లిదండ్రులకు కొదవ లేదిప్పుడు. మనకంటూ ప్రత్యేకంగా ఒక సంస్కృతి, భాష, సంప్రదాయం ఉన్నాయి కదా. వాటిని వదిలేసి, ఎక్కడిదో అయిన పరాయి భాష కోసం ప్రాకులాడడం చూస్తే చాలా బాధగా ఉంది. మన తెలుగువాళ్ళ మీద ఒక జోక్ ఉంది. ఇద్దరు తెలుగువాళ్ళు కనబడితే వాళ్ళు తెలుగులో పలకరించుకోరట. ఇంగ్లీష్‌లో మాట్లాడితే అదేదో పెద్ద గొప్పయినట్టు. అదే తెలుగులో మాట్లాడితే చిన్నతనంగా ఫీల్ అయిపోతూంటారు చాలా మంది.


ఈ మధ్యన ఒక స్కూలుకి వెళ్ళాను. అక్కడ ఒక చిన్న కుందేలు ఉంది. చుట్టు చిన్నపిల్లలు మూగి దాన్ని వింతగా చూస్తున్నారు. అక్కడే ఉన్న చిన్న పాపని సరదాకి, "పాపా, కుందేలు చాలా బాగుంది కదమ్మ" అని అడిగాను. ఆ అమ్మాయి నా వంక విచిత్రంగా చూసింది. తనకి అర్ధం కాలేదు అనుకుంటా. "కుందేలు" అంటే ఏమిటి అంకుల్ అంది. నాకు ఒక్కసారే నోట మాట రాలేదు. అదేనమ్మ, ఇది కుందేలు కదా అన్నాను. లేదు అంకుల్, ఇది rabit అని సమాధానం చెప్పింది. వెంటనే అక్కడ ఉన్న పిల్లలందరు, దీన్ని rabit అంటారండి అన్నారు. ఒక్కసారిగా. నాకేమిచేయాలో పాలుపోలేదు. అంటే వారు కుందేలు అనే పదానికి దూరమయిపోయారు. నాకు అనుమానం వచ్చి అక్కడ వున్న చెట్టుని చూపించి అదేమిటమ్మా అని అడిగాను. Tree అని సమాధానం వచ్చింది. అంటే ఆ చిన్ని బుర్రలకి కేవలం తెలుగులో వాడే క్రియలు తప్ప మిగిలిన నామవాచకాలన్ని (nouns) ఇంగ్లిష్ మయం అయిపోయాయి.


దీనికి ప్రధానంగా చాలా కారణాలు కనబడుతుంటాయి. మొదటిది ఇంగ్లిష్ బాగా వస్తే ఉద్యోగాలు తొందరగా వస్తాయనేది. వాస్తవ పరిస్తితిలో కూడా ప్రపంచంలో మన వారు అన్ని రంగాలలోను బాగా రాణిస్తున్నారంటే ఇంగ్లిష్‌లో తగినంత పరిజ్ఞానం ఉండడం వలనే. బ్రతకడం కోసమే చదువు అనే భావన ఇప్పుడు బాగా స్తిరపడిపోయింది. చదువు విజ్ఞానం కోసం కాదు. ఒక ఉద్యోగం సంపాదించుకుని హాయిగా బ్రతకడానికి. దీనిలో వాస్తవం వున్నప్పటికీ, మనదయిన భాషా మూలాలని మరచిపోవడం చాలా బాధాకరం.


ప్రపంచంలో ఎన్నో భాషలకి లేని విశిష్టతలు తెలుగు భాషకి ఉన్నాయి. ప్రపంచంలోని ఏ భాషలోని కష్టమయిన పదాన్నయినా వుచ్చారణా దోషాలు లేకుందా పలకగలగడం తెలుగు వచ్చినవారు మాత్రమే చేయగలరు. అలాగే ఎంతటి సంక్లిష్టమయిన శబ్దాన్నయినా తెలుగులో స్పష్టంగా వ్రాయవచ్చు. అంత చక్కటి వర్ణమాల, వ్యాకరణం తెలుగు భాష సొంతం. అందుకే తెలుగుని Italian of the East అని అంటారు. కన్నడ, తెలుగు, సంస్కృత భాషల్లొ సమాన పండిత్యం కలిగిన శ్రీకృష్ణదేవరాయలు "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్నాడు. ప్రపంచంలో మరే భాషలోనూ లేని పద్యం, అవధానం, హరికధ, బుర్రకధ వంటి సాహితీ ప్రక్రియలు తెలుగు భాషకే సొంతం. అంతటి ప్రాముఖ్యం ఉన్న తెలుగు భాషని అంతరించిపోయే భాషల్లో చేర్చేసేలా వున్నారు ఇప్పటి పరిస్తితి చూస్తుంటే.

ప్రైవేట్ స్కూళ్ళు, కాన్వెంటులు వచ్చిన తరువాత పరిస్తితి మరింత దిగజారింది. తల్లిదండ్రుల ఆదూర్ధాని క్యాష్ చేసుకోవడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ, జాయిన్ అయిన వెంటనే "అ, ఆ"లతో కాకుండా, A,B,C,D లతో అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తున్నారు.


మీడియాలో కూడా యాంకరింగ్ పేరిట తెలుగు భాష ఎంత ఖూనీ అయిపోతుందో చూస్తూనే ఉన్నాము. ఎంత వయ్యారాలు పోతూ, తెలుగుని ఎన్ని రకాలుగా ఖూనీ చెయ్యవచ్చో అన్నిరకాలుగా చేసి మాట్లాడే వారు గొప్ప యాంకర్లుగా చెలామణి అయిపోతున్నారు. సినిమాల సంగతి చెప్పనక్కర్లేదు. ఇతర భాషల్లోని హీరోయిన్లని, విలన్లని దిగుమతి చేసుకుని, వారిచేత వచ్చీరాని తెలుగులో డబ్బింగ్ చెప్పించుకుని, వారు తెలుగుని నానా రకాలుగా హింసిస్తుంటే, విని ఆనందించేస్తుంటాము. తెలుగువారి ఆత్మాభిమానం ఎక్కడికి పోయిందో అర్ధం కాదు.


ఈ విషయంలో నా సలహా ఒకటే. మీ పిల్లలకి ఇంగ్లిష్ నేర్పండి. తప్పులేదు. కాని తెలుగుని దానికోసం బలి చేయవద్దు. గాంధీ గారు చెప్పినట్లు, "మాతృ భాషలో తగినంత పరిజ్ఞానం ఉంటే, ఆ వ్యక్తి మిగతా అన్ని భాషల్నీ తేలికగా నేర్చుకోగలుగుతాడు. A scientific knowledge of one language makes the knowledge of other languages comparatively easy. - Mahatma Gandhi. ముందు మాతృ భాషలో అంటే మనం ఇంటిలో మాట్లాడుకొనే భాషలో "అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, మమ్మ, తమ్ముడు, చెల్లి" ఇలా అన్ని తెలుగు పదాలు నేర్పించండి. కొంచెం పెద్దయ్యాకా, తన మాతృ భాషపై పూర్తి పట్టు సాధించాక, అప్పుడు ఇంగ్లిష్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ భాషనయినా ఇట్టే నేర్చుకుంటాడు. తేనెలూరు తెలుగు బాష సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించగలుగుతాడు.

6 comments:

  1. మీరన్నది అక్షరాలా నిజం. మాతృభాషే సరిగా రాని వాళ్లు పరాయి భాషలో ఏం పొడిచేస్తారు?

    ReplyDelete
  2. Chaala bagundi. Ante kaadu, chaala mandiki para bhashala meeda makkuva ekkuva. Nenu choosina chaala mandi, 1/2 years TN lo vunnaru kani Tamil ki dasoham antaru.

    ReplyDelete
  3. మీ ఆవేదన అర్థవంతం, అంగీకారాత్మకం.కానీ మన ఆధునిక సమాజంలో వేగంగా మారిన కొన్ని విలువలూ,నమ్మకాల మధ్య భాష ఒక బలిపశువైంది. కానీ భాషకు అదే ‘అంతం’ కాకపోవచ్చు.

    ఈ విషయంపై నేను రాసిన టపా ఇక్కడ చదవగలరు
    http://parnashaala.blogspot.com/2008/06/i-think-in.html

    ReplyDelete
  4. మీ వేదన అర్ధమయింది.
    కానీ ఈనాటి పోటీ ప్రపంచంలో కేవలం తెలుగు మాత్రమే నేర్చుకుంటే సరిపోదు. దానికి తోడు ఆంగ్లం కూడా నేర్చుకోవాలి. కానీ ఆ వయస్సులో రెండు భాషలు ఒకేసారి నేర్చుకోవడం చాలా కష్టం. కాబట్టి ఏదో ఒకటి మాత్రమే సాధ్యం. చిన్నప్పటి నుంచి తెలుగు మాధ్యమంలో చదివి ఇప్పటి పోటీ ప్రపంచంలో ఉనికి కోసం కష్టపడే వాళ్లెందరో నాకు తెలుసు. అలానే తెలుగు చదవడం రాక ఇబ్బంది పడే వాళ్లు కూడా తెలుసు. కాబట్టి మారుతున్న పరిస్థితులని బట్టి మనమూ మారాలి. కానీ తెలుగు భాషని పరిరక్షించుకోవాల్సిన అవసరము, భాద్యత కూడా మనమీద ఉంది.

    ReplyDelete
  5. ఇప్పుడు మరీ ఫ్యాషన్ ఎక్కువవుతోంది.. చిన్న చిన్న పిల్లలు - ఒకటి లేదా రెండు సంవత్సరాల వాళ్ళతో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు.. నిజమే ఉద్యోగాలు రావాలి అంటే ఇంగ్లీష్ కావాలి, అంత మాత్రానా తెలుగునే మర్చిపోతే ఎలా.. ఆ స్పృహ తల్లిదండ్రుల్లో ఉండాలి.. అమ్మ అని పిలుస్తున్న పిల్లలకి బలవంతంగా మమ్మీ అని అలవాటు చేసేవాళ్ళని చూశా నేను.. అంత అవసరం లేదేమో.. ఈ విషయంలో మనకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు చాలా మెరుగు అనిపిస్తూ ఉంటుంది.. నార్త్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో నే చదువుకుంటారు అలాగని వాళ్ళు హిందీ ని మర్చిపోవడం లేదే, ఇక తమిళనాడు గురించి వేరే చెప్పక్కర్లేదు..! LKG నుండే IIT! చదువుల సంస్కృతి పోనంతకాలం ఇలానే జరుగుతూ ఉంటుంది..

    ReplyDelete
  6. telugu nerchukovadaniki telugu medium lo ne chadavalani ledu...nenu తెలుగు నేర్చుకోవడానికి తెలుగు మీడియం లో నే చదవాలని లేదు.
    నేను ఇంగ్లీష్ మీడియం లో తెలుగు ౧ట్ లాంగ్వేజ్ తో చదివాను..చందమామ, బాలమిత్ర చదివేవాడిని...ఇపుడు తెలుగు కావ్యాలు చదివి అర్థం చేసుకోగలను.....

    రాష్ట్రం లో అన్ని స్కూల్ ల లో తెలుగు మొదటి లేదా రెండవ భాష గా ఉండవలసినదే నని చట్టం చేయాలి...అందుకు విరుద్ధం గ అసలు తెలుగు లేకపోఇన ఏమి కాదు అని చూస్తునారు...భాష ఎవరు నేర్చుకోకపోతే అందులో సాహిత్యం రాదు ఇంకా అంతరించిపోవడం ఒకటే తరువాయి....

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.