Pages

Sunday, July 6, 2008

తిరుమల శ్రీనివాసుడి నగలని ప్రదర్శనకి ఉంచాలనుకోవడం భావ్యమేనా?


హిందువులకి, ముఖ్యంగా ఆంధ్రులకి తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడితో ఉన్న అనుబంధం చాలా గట్టిది. ఆయన నామస్మరణతోనే రోజు మొదలుపెట్టేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అందరి జీవితాల్లొ అంతటి ప్రాముఖ్యత వున్న శ్రీనివాసుడికి సంబందించిన ఏ వార్త అయిన, అయన పట్ల ఎవరు తీసుకునే నిర్ణయమయినా ఎంతో మందిపై ప్రభావం చూపుతుంది అంటే అతిశయోక్తి కాదు. శ్రీ వేంకటేశ్వరుడికి చెందిన ఆభరణాలను ప్రదర్శనకు వుంచాలనుకోవడం కూడ అలాంటి నిర్ణయమే.


అసలు విషయం చెప్పే ముందు నాకు తెలిసిన ఒక చిన్న సంఘటన గురించి చెపుతాను. చాన్నాళ్ళ క్రితం, నా స్నేహితుడు తన పెళ్ళి కోసమని శుభలేఖలు ప్రింట్ చేయించుకున్నాడు. తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని, స్వామి పాదాల దగ్గర ఆ శుభలేఖని ఉంచి, పూజ చేయించి, తరువాత అందరికీ పంచాలని తన ఆలోచన. అదెంతో కష్ట సాధ్యమయిన పనయినాగాని. వెంటనే తిరుపతికి వెళ్ళి, మొత్తం మీద స్వామి వారి పాదాల చెంత తన శుభలేఖని పెట్టించుకోగలిగాడు. పూజ ముగిసిన తరువాత, ఆ శుభలేఖని తిరిగి తీసుకుని వస్తుంటే, అక్కడ వున్న భక్తులు దేవుడిని తాకిన శుభలేఖని అత్యంత పవిత్రమయినదిగా ఎంచి, ఒక్క సారయినా ఆ శుభలేఖని ముట్టుకోవాలని ఒకేసారి ఎగబడ్డారట. వారి నుంచి తప్పించుకుని, జాగ్రత్తగా బయటకి వచ్చి చూసుకునేసరికి, తన చేతిలో శుభలేఖ తాలూకు చిన్న ముక్క మాత్రమే మిగిలిందట. దాన్నే అమూల్యమయిన ప్రసాదంగా భావించి తన పూజ గదిలో పెట్టుకూన్నాడనుకోండి. అది వేరే విషయం.


విషయమేమిటంటే, భగవంతునికి సంబంధించినది ఏదయినా, అది అత్యంత పవిత్రమూ, విలువయినది కూడా. సర్వాలంకార భూషితుడయిన శ్రీనివాసుని చూడడానికి ఎంతో శ్రమకోర్చి, ఎన్నో రోజులు ప్రయాణం చేసి భక్తులు వస్తారు. అంటే ఆయనకు అలంకారం చేసినవి కూడా ఆయనలో భాగమే. ఒక్కసారి ఆయనకు అలంకరించిన తరువాత ఏ ఆభరణమయినా, నగయినా అది భక్తులకి అత్యంత పవిత్రమయినది. అటువంటి నగలని, ఏ నిజాం నగలనో, కోహినూర్ వజ్రాన్నో పెట్టినట్టు ప్రదర్శనకు పెడితే, అది ఎంతో మంది మనోభావాలను దెబ్బ తీస్తుంది. పైగా దేవుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఒక పవిత్రమయిన ఉద్దేశ్యంతో, భక్తి భావంతో వెళతారు. కాని బయట ప్రదర్శనకు ఉంచిన ఆభరణాల విషయంలో అలా కాదు. అందుచేత, దేవునికి సంబందించిన విషయాలలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండ, టి.టి.డి. వారు తగు జాగ్రత్తలు తీసుకుని మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే ఉత్తమం.

ఇప్పుడు టి.టి.డి.వారు శ్రీనివాసుని నగలని ప్రదర్శనకు ఉంచకూడదని నిర్ణయం తీసుకోవడం ఏంతయినా అభినందించదగ్గ విషయం.

1 comment:

  1. పాలకులకు శ్రీవారు భగవంతుడు గా కాక ఒక వస్తువు గా కనబడుతున్నట్టువున్నాడు. ఆ అభరణాలు శ్రీవారికి అలంకరించ బట్టి మనం పవిత్రంగా చూస్తున్నాం. వారి దృష్టి లో ఆది అభరణాలు మాత్రమే కావున వారు దాన్ని ప్రదర్శన వస్తువు గా చూస్తున్నారు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.