Pages

Thursday, December 27, 2012

ఇది మనుషులు చేసే పనేనా?

    ఇటీవల దేశ రాజధానిలో ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన, తదనంతర పరిస్థితులు దేశంలో నెలకొన్న విపరీత పరిస్థితులకి అద్దం పడుతున్నాయి. ఇక్కడ యువతిపై జరిగింది కేవలం అత్యాచారం మాత్రమే కాదు, హత్యాయత్నం కూడా. యువతలో పెరిగిపోతున్న విచ్చలవిడితనానికి, పాశ్చాత్య నాగరికతా అనుకరణకు ఈ సంఘటన ఒక నమూనా మాత్రమే. నైతిక విలువలు లేకపోతే మనిషి ఎంత మృగంగా మారతాడో ఈ సంఘటన వల్ల మనకు తేటతెల్లమవుతుంది. అత్యాచారానికి గురయిన యువతికి కలిగిన గాయాలు, ఆమె అనుభవిస్తున్న నరకం చదువుతుంటే, చూస్తుంటే, మనసుని ఎవరో గట్టిగా మెలిపెట్టినంత బాధ కలిగింది. రెండు రోజుల తరువాత కూడా కన్నీటి చెమ్మ ఆరలేదు. సభ్య సమాజం, మానవత్వం ప్రతి ఒక్కరు, ప్రభుత్వం అందరూ సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన ఇది. ఢిల్లీలో జరిగిన సంఘటన కేవలం ఉదాహరణ మాత్రమే. ప్రతి రోజు వార్తల్ని పరిశీలిస్తే, దేశం మొత్తం మీద, ఆ మాటకొస్తే ప్రపంచంలో ప్రతి దేశంలోను ప్రతి సమాజంలోను మహిళల పట్ల లైంగిక వేధింపులు చాలా సర్వ సాధారణంగా ఉంటున్నాయి. బాలికలు, యువతులు, మహిళలు.. ఆ మాటకొస్తే, స్త్రీ అనే ప్రతి ఒక్కరూ ఇటువంటి లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారు. హేళనగా చూడడం, చులకనగా మాట్లాడడం, లైంగికంగా వేధించడం మొదలుకొని, అత్యాచారానికి తెగించడం చివరకు హత్య చేయడానికి కూడా వెనుకాడకపోవడం ద్వారా మహిళలను మానసికంగా శారీరకంగా హింసించడానికి నిత్యం ఎంతో మంది కామాంధులు అవకాశం కోసం కాచుకుని ఉంటారు.

    ఇటువంటి సంఘటనలు జరిగిన తరువాత స్పందించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరి మనసులోను ఉదయించే ప్రశ్న ఒకటే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆపలేమా? మరింత మంది చిట్టితల్లులు బలికాకుండా చూడలేమా? దీనిలో మన బాధ్యత ఎంత వరకు ఉంది? మన కూతుళ్లకు, తోబుట్టువులకు, అలాంటి మరికొంత మంది బంగారుతల్లులకి ఈ సమాజంలో రక్షణ కల్పించలేమా? అనిపిస్తుంది. కాని ఇవన్నీ చేసే ముందు కొంతమంది మగాళ్ళు, 'మృగాళ్ళు'గా ఎలా మారతారో ఆలోచించి, దానికి మూలకారణాలు ఆన్వేషించి, అక్కడి నుండి నివారించే ప్రయత్నం చేస్తే తప్ప, ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా నివారించలేము.

అంతర్జాలం మరియు వినోద సాధనాలు:

    ఆధునిక సమాజంలో మహిళల పట్ల జరిగే పాపాల్లో వీటి వాటా కనీసం 80 శాతం ఉంటుంది. వినోదం కోసమైతే నేమి, వ్యాపారం కోసమైతేనేమి, స్త్రీలను ఒక ఆట బొమ్మగా, మాంసం ముద్దగా వాడుకుంటున్నారు. సినిమాల్లో, టివిల్లో అయితే ఎంత తక్కువ బట్టలేసుకుంటే అంత గొప్ప హిట్‌ లేదా అసలు ఏమీ వేసుకోకపోతే అది కూడా ఒక సంచలనం. అలాంటి సంచలనాత్మక అంగడిబొమ్మలు (పేరుకు హీరోయిన్లు) నటిస్తే, ఆ సినిమాకు కోట్ల రూపాయిల వసూళ్ళు. టీవీ సీరియళ్ళలో అయితే చెప్పనక్కర్లేదు. కేవలం ఆడవారిని ఏడిపించి రేటింగ్‌ పెంచుకునే చానళ్లు ఎన్నో... పగలంతా ఎన్నో నీతులు వల్లించి, రాత్రయేసరికి కామ పాఠాలు వల్లించే నీతి బాహ్యమైన 'ఛా'నళ్ళకు కొదవే లేదు. ఇవన్నీ చివరకు ఆడవారి పట్ల శాపాలుగా మారుతున్నాయి.

    ఇక అంతర్జాలం సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు. నెట్‌లో విహరించే వాళ్ళలో కనీసం 80 శాతం మంది లైంగిక ప్రేరేపిత (పోర్నో) సైట్లు చూస్తారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇలా చూసే వాళ్ళలో 14 నుండి 20 ఏళ్ల నవ యువకులు ఎక్కువగా ఉంటారని సర్వేల్లో వెల్లడయిన నిజం. ఆడపిల్లను అంగడి బొమ్మగా మార్చి, తమ సొంత కూతుళ్లను, తోబుట్టువుల్ని, సాటి ఆడపిల్లల్ని వివస్త్రలుగా చేసి, ఫోటోలు, వీడియోలు తీసి, అలా వచ్చిన దరిద్రపు సొమ్ముని వ్యాపారం చేస్తున్నామని ప్రకటించుకోవడం పాశ్చాత్య దేశాల్లో చేతనయినంతగా మరే దేశం వారికీ రాదు. నైతికంగా దిగజారిన అటువంటి సమాజంలోని పెనుపోకడలు ఇప్పుడు భారతీయ సమాజంపై పడడానికి ముఖ్య కారణం అంతర్జాలమే. దేశాల మధ్య సమాచార వారధి సృష్టించిన అంతర్జాలం ఇప్పుడు లైంగిక విషపురుగుగా తయారయింది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌లో 'సెక్స్‌' అనే పదాన్ని వెతకమని చెబితే 25 లక్షల పైచిలుకు వెబ్‌సైట్స్‌ దర్శనమిస్తాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది అమాయక బాలికలు, ఆడపిల్లలు, యువతులు ఈ వెబ్‌ మహమ్మారి బారిన పడుతున్నారో అర్థం అవుతుంది. పైగా అమెరికా వంటి దేశాల్లో ఆడపిల్లల్ని నగ్నంగా ఫోటోలు తీసి అమ్ముకోవడం ఒక పరిశ్రమ. దానికి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తుంది. ఈ పరిశ్రమ ముసుగులో ఎంత మంది అమాయక ఆడపిల్లలు దారుణంగా బలయిపోతున్నారో తెలుసుకుంటే గుండెలు పగిలిపోతాయి. ముందు కేవలం నగ్నంగా ఫోటోలు తీస్తామని చెప్పి తరువాత అత్యాచారం చేసి, ఇక వారిని శాశ్వతంగా ఆ రొంపిలోనే కూరుకుపోయేలా చేస్తారు ఈ వెబ్‌సైట్ల నిర్వాహకులు. ఈ పైత్యపు సైట్లు నిర్వహించే దేశాల్లో పరిస్థితులు ఇలా ఉంటే, మనలాంటి సాంప్రదాయ దేశాల్లో ఈ అంతర్జాలం వల్ల మరో విధమైన ప్రమాదం జరుగుతోంది. భారతీయ మహిళలు సహజంగానే సున్నిత మనస్కులు, సాంప్రదాయాలకి ఎక్కువ విలువనిస్తారు. అటువంటిది ఒకేసారి, ఇటువంటి వెబ్‌సైట్ల ప్రభావం వలన మగ స్నేహితులు లేదా భర్త వారిని అసహజ ప్రవర్తనకు ప్రేరేపించడం వంటివి చేస్తున్నారు. దాని వల్ల వారు మానసికంగా, శారీరకంగా పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇవే వారిని పరాయి ఆడపిల్లలపై అత్యాచారాల వంటి వాటికి పురికొల్పుతున్నాయి.

    మహిళల్ని కేవలం లైంగిక వస్తువులుగా చూపించే ఇటువంటి సైట్లు, సినిమాల వలన స్త్రీ అంటే కేవలం లైంగికంగా ఉపయోగపడే వస్తువు మాత్రమే అనే భావన యువకుల్లో కలుగుతోంది. ఆయా సినిమాల్లో చూపించే డబ్బుకు అమ్ముడుపోయే కొంత మంది నైతికంగా పతనమయిన ఆడవాళ్ళ వల్ల లోకంగా ప్రతీ ఆడపిల్లని ఇంతే తేలికగా లోబర్చుకోవచ్చుననే ఒక చులకన భావన, తప్పుడు అభిప్రాయం యువకుల్లో కలుగుతుంది. లోకంలో అమ్మాయిల శరీర అవయవాల్ని (అనాటమీ) చూపించే వెబ్‌సైట్లకు కొదవలేదు. కాని ఒక ఆడపిల్ల మనసులో ఏముందో, అదెంత లోతయినదో తెలియచెప్పే వెబ్‌సైట్స్‌ ఏమయినా ఉన్నాయా? ఆడపిల్ల కనబడగానే ప్రపోజ్‌ చేయడం, ఆనక వెంటబడడం, ఒకవేళ ఇంకెవర్నో అప్పటికే ప్రేమించి ఉన్నా సరే, మన వైపు తిప్పుకోవడం ఎలా అనే దిక్కుమాలిన కాన్సెప్ట్‌ల మీదే ఇప్పటి సినిమా, సీరియల్స్‌ నడుస్తున్నాయి. అటువంటి ఛండాలపు పనులు చేసే వాళ్ళే నేటి మన వెండితెర హీరోలు. ముందు ఇటువంటి వాటిని నియంత్రించాలి. 'ఎ' సర్టిఫికెట్‌ సినిమాలకి కూడా చిన్న పిల్లల్ని తీసుకెళ్లి చూపించే తల్లిదండ్రులకు నేటి సమాజంలో కొదవ లేదు. పిల్లలు లేకుండా వెళ్ళడం కుదరకపోతే వెళ్ళడం మానేయాలి. అంతేగాని చిన్న పిల్లల్ని కూడా అటువంటి సినిమాలకు తీసుకువెళ్ళి లేదా సీరియళ్ళు చూపించి వారి లేత మనసుల్ని కలుషితం చేయకూడదు.

 పాశ్చాత్యీకరణ: 
 
'పొరుగింటి పుల్ల కూర రుచి' అనే సామెత నేటి సమాజానికి సరిగ్గా అన్వయిస్తుంది. సనాతన భారతీయ సంస్క ృతిని వదిలి, పరాయి సాంప్రదాయం వెంట పడడం వల్ల సహజంగానే అనర్థం వస్తుంది. భాష ఎలాగో సగం మారిపోయింది. దుస్తులు సరేసరి, ఇప్పుడు మనసు కూడా మార్చేసుకుని మారు మనసు పొందితే సరి. బాయ్‌ ఫ్రెండ్‌ సంస్క ృతి, సగం శరీరం బయటపడేలా దుస్తులు, నైట్‌ క్లబ్‌లు, పబ్బుల సంస్క ృతి, మాదక ద్రవ్యాల వాడకం వంటి వాటి వల్ల కూడా యువతులకు హాని కలుగుతోంది. ఇలా సమాజం భ్రష్టు పట్టినపుడు ముందుగా బలయ్యేది మహిళలు మాత్రమే. 'డ్యాన్స్‌ బేబి', ఆట వంటి చిన్ని తెర కార్యక్రమాల్లో కూడా పిల్లల్ని పాల్గొనేలా ప్రోత్సహించడం, శరీరాన్ని ప్రదర్శించడమే అన్నిటి కన్నా గొప్ప గౌరవం అనిపించేలా పిల్లల్ని ప్రలోభపెట్టడం, వారు పెరిగి పెద్దయిన తరువాత సమాజం పట్ల వారి నడవడికను, వ్యక్తిగతంగా వారు పడే ఇబ్బందుల్ని చూసి తీరిగ్గా ఏడవడం... ఇవన్నీ నేటి ఆధునిక తల్లిదండ్రుల సహజ సుగుణాలు. ముందు మనం మారి పిల్లల చేత మమ్మీ, డాడీ బదులు అమ్మా, నాన్నా అని పిలిపించుకుంటే చాలా రుగ్మతలు వదులుతాయి. నీతి కధలు చెప్పే నానమ్మలు, తాతయ్యలు ఎలాగో వృద్ధాశ్రమంలో మగ్గుతున్నారు. చందమామ వంటి పత్రికలు చదివే అలవాటు పిల్లలకి లేదు. వెధవ పనులు చేసే పాశ్చాత్య దేశాల హీరో లందరూ వీళ్ళకి ఆదర్శప్రాయులే. బాల హనుమాన్‌ టీవీలో వస్తే, చిన్నప్పటి నుండీ ఇటువంటివి ఎందుకని కొందరు, మనం ఇప్పుడు కొత్తగా ఫారిన్‌ మతం తీసుకున్నాం కాబట్టి, టామ్‌ అండ్‌ జెర్రీ తన్నులాటలు చూడమని ప్రోత్సహించే తల్లిదండ్రుల ఉన్నంత కాలం పిల్లలకి సుగుణాలు రమ్మంటే ఎక్కడ నుండి వస్తాయి?
 
విద్యావ్యవస్థ: 
 
ఈ పాపంలో విద్యా వ్యవస్థకి కూడా భాగం ఉంది. నేటి చదువులు ఎందుకూ పనికిరాని జీవం లేని వ్యర్థం మాత్రమే. భౌతిక పరమైన అభివృద్ధికి, నూతన వస్తు ఆవిష్కరణకి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి గాని సమాజం కొన్ని వేల సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రయాణించడానికి, మానసికంగా ఎదుగుదలకు, పశుస్థాయి నుండి మానవస్థాయికి మారడానికి  ఏ విధంగాను దోహదపడవు. 'కనకపు సింహాసనమున శునకము కూర్చొండబెట్టిన' అని సుమతీకారుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే సెలవిచ్చినట్లు, నేటి మనుషులమని చెప్పుకునే వారు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అది మనం కళ్ళెదురుగా చూస్తూనే ఉన్నాం. కుక్కని తీసుకెళ్ళి, ఎ.సి. రూమ్‌లో మెత్తటి ఫోమ్‌ బెడ్‌ వేసి పడుకోబెట్టి, 3జి కనెక్షన్‌ ఫోన్‌ ఇచ్చి, హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ పెట్టించి, దాని మెడలో బాగా చదివినట్టు ఒక డిగ్రీ సర్టిఫికెట్‌ వేళాడదీసినంత మాత్రాన అది మానవత్వం ఉన్న మనిషి అవదు. పాత చెప్పు ముక్క కనబడగానే చెంగున దూకి దాన్ని అందుకుంటుంది. అలా ఉంది నేటి యువత పరిస్థితి. మారాల్సింది వస్తుగత స్థాయి కాదు, మానసిక స్థాయి. పూర్వపు గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ముందుగా మానవ ధర్మం గురించి నేర్పేవారు. పాఠ్యాంశాలు కూడా 'మాతృ దేవో భవ, పితృ దేవో భవ' అంటూ ఒక వ్యక్తి తన కుటుంబం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, మొత్తం మానవ సమాజం పట్ల నెరవేర్చవలసిన బాధ్యతను అనుక్షణం గుర్తు చేసేవి. ముందుగా అవన్నీ నేర్చుకున్నాక, ఆ వ్యక్తి కులవృత్తిని నేర్పేవారు. అంటే ఒక వ్యక్తి వృత్తి ఏదయినప్పటికీ, సమాజంలో అంతర్భాగంగానే దానికి అనుకూలంగానే నడిచేవాడు. కాని, ఇప్పుడు ధర్మం బదులు ధనం చేరింది. ఏ విద్యనయినా డబ్బు తీసుకుని నేర్పుతున్నారు. యంత్ర శాస్త్రం (ఇంజినీరింగ్‌) వంటివి పనిని ఎంత బాగా చేయగలమనే దానిపైనే దృష్టి పెడుతున్నాయి తప్ప మనిషిగా ఎంత ఎదగాలో, ఎలా ఎదగాలో ఎవ్వరూ నేర్పించడం లేదు. ఎందుకంటే వాటిని నేర్పే గురువులు కూడా ఆ తానులో ముక్కలే కాబట్టి. గురువులే తాము చదువు చెప్పే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూంటే, వారి దగ్గర చదువుకునే విద్యార్థులు కూడా అదే బాట పడుతున్నారు. ఎనిమిది మంది కలిసి పశువుల్లాగా ఒక ఆడపిల్లని అత్యంత కిరాతకంగా అత్యాచారం స్థాయి వరకు దిగజారాం. ఇక్కడతో ఆగుదామా? లేదా తుపాకి తీసుకుని ముందు తల్లిని చంపి తరువాత 28 మంది చిన్న పిల్లల్ని, చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఉదంతం జరిగిన అమెరికా స్థాయికి కూడా దిగజారదామా? ఎందుకంటే అన్నిటికీ మనకు ఆదర్శప్రాయం అమెరికాయో, రష్యాయో మాత్రమే కదా.
 
ప్రభుత్వం - చట్టాలు: 
 
ఇప్పటి ప్రభుత్వాలన్నీ రాజకీయ పార్టీలే. పార్టీ ఎజెండాయే ప్రభుత్వ ఎజెండా. అవెప్పుడూ కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదిక మీదనే అన్ని వర్గాల వారినీ సంతృప్తి పరచడమే ధ్యేయంగా పనిచేస్తుంటాయి. చట్టాల రూపకల్పలో గాని, వాటి అమలులో గాని, విశాల సమాజ హితం వాటికి పట్టనే పట్టదు. పార్లమెంటు దాడి కేసులో నిందితుడికి శిక్ష విధించడంలో జాప్యం చేయడం - అతడు కేవలం ఒక ప్రత్యేకమైన మతానికి చెందిన వాడు కావడమే అనేది బహిరంగ రహస్యం. ఆడపిల్లల పట్ల నేరాల్ని అదుపు చేయడంలోను, నిందితులకు కఠిన శిక్షలు విధించడంలోను అదే అలసత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. ధైర్యం చేసి ఒక నిర్ణయం తీసుకుంటే తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరికి ఎరుక? దాని కన్నా కళ్ళుండీ గుడ్డి వాడిలా నటిస్తే ఏ గొడవా ఉండదు. లేదా ఇటువంటి సంఘటనలకు కారణం ప్రభుత్వాధినేతలు, అధికారులు, లేదా వారి వంశాంకురాలో కారణమయి ఉంటే, ఇక నిందితుల్ని రక్షించడానికి చట్టాలకి తూట్లు పొడవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాగ్రహం, ప్రత్యేకించి ప్రభుత్వంపై, దాని పాలనపై యువత పోరాటం చేయడం సహేతుకమే. సమర్థనీయమే. నిందితులకు కఠిన శిక్షలు విధించడం వంటివి చేస్తేనే సమాజంలో నేరాల రేటు కొంత శాతమైనా తగ్గుతుంది. ఒక చిట్టితల్లిపై అకారణంగా దాడిచేసి, అమె వేదనకు కారణమైన మృగాలకి మరణ శిక్ష మాత్రమే సరైన శిక్ష. మన శరీరం మీద వాలి కొద్ది పాటి రక్తం తాగినందుకే దోమని ఒక్క దెబ్బ కొట్టి చంపుతాం కదా. అటువంటిది ఒక అమ్మాయిని శారీరకంగా, మానసికంగా హింసించి, ఆమె శాశ్వత అంగవైకల్యానికి లేదా మృతికి కారణమవుతున్న వికృత మనస్తత్వం గల దుర్మార్గులకు సమాజంలో చోటు లేకుండా చేయడం సరైన పనే. అటువంటి వారి వల్ల, లేదా వారు మారినట్లు కనిపించినా, వారి వల్ల సమాజానికి ఎటువంటి మేలు జరుగదు. వారు లేకపోవడం వల్ల ఎటువంటి కీడూ జరగదు. పైగా అటువంటి తప్పు మరొకరు చేయడానికి భయపడతారు.
 
 ప్రకృతి పరమైన కారణాలు: 
 
మానసిక శాస్త్ర రీత్యా పరిశీలిస్తే ప్రకృతి పరంగానే స్త్రీ పురుషుల మనస్తత్వాలలో చాలా తేడాలుంటాయి. అంతెందుకు? లైంగిక చర్య పరంగానే ప్రకృతిలో మిగతా ఉన్నత స్థాయి జంతువులకి, మనుషులకి బేధముంది. జంతువులు ఆయా కాలాల్లో మాత్రమే లైంగిక ఆసక్తిని ప్రదర్శిస్తాయి లేదా అటువంటి చర్యల్లో పాల్గొంటాయి. కాని, మనుషుల్లో మాత్రం - అది వరమో శాపమో తెలియదు గాని - యుక్త వయసుకి వచ్చినప్పటి నుండి వార్థక్యం వచ్చే వరకు లైంగిక ఆసక్తిని కలిగి ఉంటారు. ఇక స్త్రీ పురుషుల విషయానికి వస్తే, లైంగిక ఆసక్తి పరంగా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మగవాళ్లు కేవలం దృశ్య పరంగా ఉద్రేకం పొందుతారు. అంటే అందమైన ఆడవాళ్ళను చూసినపుడు గాని, లేదా లైంగిక పరమైన అంశాల గురించి వినడం వల్లనే కోరిక పుడుతుంది. అందుకనే అటువంటి వ్యాపార ప్రకటనలకి, సినిమాలకి అంతటి ప్రాధాన్యత మరియు సంచలనం. వాటిలో కూడా స్త్రీలను మాత్రమే ఆకర్షక సాధనంగా చూపిస్తారు. ప్రతి పురుషుడిలోను కొంత స్థాయిలో కామం ఉంటుంది. కాని, ఇంటర్‌నెట్‌ వంటి మాధ్యమాల వల్ల గాని, సెల్‌లోగాని కామాన్ని కలిగించే విషయాన్ని చూడడం వల్ల కామాసక్తి మరింత ఎక్కువయ్యి, హద్దులు దాటి, అనైతిక ప్రవర్తనకి కారణమవుతుంది. కాని స్త్రీల విషయంలో అది పూర్తిగా వ్యతిరేకం. వారు రూపం కంటే గుణం కోరుకుంటారు. అంటే భర్త పెద్ద అందగాడు కానక్కర్లేదు గాని తనను ప్రేమగా చూసుకుంటే చాలనుకుంటుంది స్త్రీ. ఆమె ఎప్పుడూ ప్రేమను కోరుకుంటుంది. అందుకే భర్త పెద్దగా అందంగా లేకపోయినా, ఎక్కువ సంపాదనా పరుడు కాకపోయినా, తనను తాను పూర్తిగా అర్పించుకుంటుంది. అదే స్త్రీ ప్రేమలోని గొప్పదనం. కాని, కొన్ని పాశ్చాత్య దేశాలు స్త్రీకి కూడా పురుషుడితో సమానంగా లైంగిక ఆసక్తి ఉంటుందని, కొండొకచో ఎక్కువగానే ఉంటుందని, కాని దాన్ని వెల్లడి చేయలేదని... ఇటువంటి తప్పుడు వాదనలతో విష ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని చదివిన యువకులు కూడా అది నిజమేనని భ్రమించి, ఆడపిల్లల అభిప్రాయం, వారి మానసిన స్థితి వంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా, ప్రేమ పేరుతోను, లైంగిక చర్యల పేరుతోను వారిని వెంటాడి, వేధిస్తుంటారు. అయినా సరే వారు ఒప్పుకోకపోయే సరికి, తమ అభిప్రాయం నిజం కాలేనందుకు ఉక్రోషంతో వారిపై అమానుషంగా కత్తులతోను, యాసిడ్‌తోను దాడులు చేస్తారు. ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో అమ్మాయిలు 'మా దుస్తులపై ఆంక్షలు విదించడం కాదు - మగవారిని బుద్ధి మార్చుకోమనండి' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దాని అర్థం ఏమిటంటే ఆంక్షలు, చట్టాలు విధించడం వల్ల పరిస్థితి మరింత విషమిస్తుందే తప్ప అది పరిష్కారం కానే కాదు. చట్టాలు చేసే కన్నా, ఆంక్షలు విదించే కన్నా సమాజాన్ని సంస్కరించడమే మనం చేయగలిగిన మహోపకారం. చట్టాల వల్ల వచ్చే ప్రయోజనం తాత్కాలికమైతే, సమాజంలో సంస్కారాన్ని పెంచడం వల్ల వచ్చే ప్రయోజనాలు శాశ్వతంగా, దీర్ఘ కాలికంగా ఉంటాయి.

    స్త్రీపురుష సంబంధాలలో హుందాగా, పరిపక్వతతో వ్యవహరించడాన్నే సంస్కారమంటారు. అది వ్యక్తి మతాన్ని బట్టి, వారి సంస్కృతిని బట్టి మారుతుంటుంది. అందుకనే ఒక మతాన్ని ఎక్కువగా అవలంభించే దేశాల్లో స్త్రీని పూర్తిగా వ్యాపార వస్తువుగా మార్చేసారు. ఆమె శరీరమే అంగడి సరుకయిపోయింది. కొంత భాగం చూపించాలంటే ఒక రేటు - పూర్తిగా చూపించాలంటే మరో రేటు - ఇదీ వారి దౌర్భాగ్యం. వారి మతంలో స్త్రీ ఎట్టి పరిస్థితిలోను అలంకరించుకోకూడదు. ఇక మరో మతం పూర్తిగా అవలంభించే దేశాల్లో స్త్రీల దుస్థితి వర్ణనాతీతం. శరీరంలో ఏ భాగం కనిపించకుండా పూర్తిగా దాచేయాలి లేదా కప్పేసుకోవాలి. ఆఖరికి కాళ్లు కూడా బయటకి కనిపించకూడదు. ఎందుకంటే ఏది కనిపించినా మగవాళ్ళ దౌష్ట్యానికి బలయిపోతుందనే వాదన వినిపిస్తారు. అది నిజం కూడా. కఠిన శిక్షల ద్వారా మాత్రమే పరిస్థితిని అదుపులో ఉంచగలమనే భావనలో వారు ఉంటారు.

    కాని ఒక్క భారతీయ సంస్కృతిలో మాత్రమే రెండింటికీ సమన్వయం సాధించారు. స్త్రీ ఎప్పుడూ చక్కని అలంకరణ కలిగి ఉండాలి. నుదుటన బొట్టుతో, చక్కటి పొడవైన జుట్టుతో లక్ష్మీ దేవిలా భాసిల్లాలి. సర్వ మంగళ స్వరూపిణిగా ఉండాలి. మందస్మితంగా ఉండాలి. ఆమెకు సమాజ పరంగా ఎటువంటి ఆంక్షలు లేవు. స్వేచ్ఛగా ఉండొచ్చు. భర్తతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆమె లేకపోతే పురుషుడు చేసే ఏ యజ్ఞమైనా యాగమైనా ఫలితాన్నివ్వదు. పరాయి పురుషుల్ని సోదరుల్లా భావించాలి. ఇదీ స్త్రీకి భారతీయ సమాజం ఇచ్చిన గౌరవం.

    అదే సమయంలో మగవారికి కూడా కొన్ని సుద్దులు నేర్పింది. పరాయి స్త్రీ ఎదురయితే గౌరవంగా పక్కకి తొలగాలి. ఆపదలో ఉన్న స్త్రీని సోదరిలా భావించాలి. పరాయి స్త్రీ ఎవరిని పలకరించాల్సి వచ్చినా 'అమ్మా' అని పలకరించాలి. ఎక్కడ ఒక ఆడది కన్నీరు పెడుతుందో, ఆ యింటిలో సిరి సంపదలు తొలగిపోతాయని శాస్త్ర కారుడి శాసనం. స్త్రీని గౌరవిస్తే, అక్కడ సర్వ దేవతలు ఆనందంగా ఉంటారని శాస్త్ర వచనం. అటు ఆడవారి గౌరవాన్ని కాపాడుతూనే, మగవారిని కూడా మృగాల్లా కాకుండా వారిని ప్రేమగా చూసుకునే రక్షకుల్లా ఉండమని శాస్త్ర నిర్దేశం. కామాన్ని నిషేధిత వస్తువుగా కాకుండా, మానవ ధర్మాలలో ఒకటిగా (ధర్మ, అర్థ, కామ, మోక్ష) చూపిస్తూనే, కామాన్ని సైతం ధర్మానికి అనుగుణంగా పొందమని విధి నిర్దేశించారు మన పెద్దలు. పరాయి స్త్రీ పొందు కోరడం వలన ఎటువంటి ఇబ్బందులు పడతారో, ఎంతటి గొప్పవారయినా ఎలా పతనమయిపోతారో రామాయణంలో రావణుడి ద్వారా, మహా భారతంలో దుర్యోధన, దుశ్శాసన పాత్రల ద్వారా నిరూపించి, సమాజాన్ని మంచి నడవడికలో పెట్టే ప్రయత్నం చేసారు. రాఖీ పూర్ణిమ వంటి పండుగల్ని పెట్టి, సొంత తోబుట్టువులే కాకుండా, పరాయి ఆడపిల్ల ఎవరు రాఖీ కట్టినా, ఆమెను తన సొంత సోదరిగా భావించి, జీవితాంతం ఆమె రక్షణ బాధ్యత వహిస్తానని ఒక అన్నగా మాటివ్వాలి అని సంప్రదాయం పెట్టారు. ఆడపిల్ల అంటే కేవలం లైంగిక వస్తువు మాత్రమే కాదు. ప్రేమను పంచే దేవత కూడా. ఇవన్నీ గుర్తు పెట్టుకుని, రాబోయే తరానికి కూడా ఈ విలువల్ని నేర్పాలి. పాశ్చాత్య వస్తువుల్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలిగాని, వారి ఆలోచనా విధానాన్ని, వారి మతాన్ని కూడా దిగుమతి చేసుకుని, అభాసుపాలు అవ్వాల్సిన అవసరం లేదు. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు మరలా మరలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా మనందరి మీదా ఉంది.

Saturday, October 27, 2012

దేవుడా! మనీ తీసుకుని మానవత్వాన్ని మాకివ్వు - మతాన్ని తీసుకుని మంచితనాన్ని మాకివ్వు





మనసు మూగబోయింది

మాటలు రాక కాదు - మాటలు లేక

చిట్టితల్లి సాన్వి ఇకలేదని తెలిసాక

చదువుకుంటానన్నందుకు మొన్న మాలాల

ఏపాపం తెలియని వయసులో నేడు సాన్వి

దేశాలు మారినా, మతాలు మారినా

మానవ మృగాల దారుణాలు

కన్నీటితో నిండిన శోకతప్త హృదయాలు...

విముక్తిలేదా చిన్నారులకు


దేవుడా! మనీ తీసుకుని మానవత్వాన్ని మాకివ్వు

మతాన్ని తీసుకుని మంచితనాన్ని మాకివ్వు

Friday, October 26, 2012

'వెర్రి ముదిరింది - రోకలి తలకి చుట్టండి' సామెత ఎందుకొచ్చిందో అర్థం అయింది

    కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచమంతటా రావణాసురుడిని చంపినందుకు పండుగ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు కంచె ఐలయ్య గారికి మాత్రం రావణాసురుడు హీరోగా కనిపించాడు. 'మూలవాసీ రారాజు రావణాసురుడు' అని కితాబిచ్చారు. అసలు రావణుడు మూలవాసీ ఎలా అయ్యాడో, ఏ చారిత్రక ఆధారం బట్టి ఆ విధంగా నిర్ణయించారో ఎంత ఆలోచించినా అర్థం కాదు. రామాయణమంతా తిరగేసినా రావణుడు వెనుకబడిన మూలవాసీతెగకు చెందిన వాడని వాల్మీకి ఎక్కడా ప్రస్తావించలేదు. రావణుడు సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మ మునిమనుమడు. అందుకే రావణుడిని రావణబ్రహ్మ అని కూడా అంటారు. అంటే రావణుడు శూద్రుడు కాడు, బ్రాహ్మణుడు. సాటి బ్రాహ్మణుడిని దురుద్దేశ పూరితంగా కుట్ర చేసి చంపాల్సిన అవసరం ఏముంటుంది? కంచె ఐలయ్య గారి హ్రస్వ దృష్టి కేవలం ఈ ఒక్క ఉదాహరణ ద్వారా విశదమవుతుంది.

    రావణుడు స్వతహాగా మహాజ్ఞాని, వేదవేదాంగ కోవిదుడు, మహా శివభక్తి సంపన్నుడు. తన భక్తితో శివుడిని ఎన్నో సార్లు ప్రసన్నం చేసుకున్నాడు. అంత మాత్రం చేత రావణుడు గొప్పవాడు, ఆరాధ్యనీయుడు అయిపోడు. అతనికున్న దుర్గుణాల వల్ల మాత్రమే పతనం అయ్యాడు. ఈ సమావేశంలో ఐలయ్యగారు ''రాముడి కంటే రావణుడు నీతివంతమైన పాలన అందించాడని'' సెలవిచ్చారు. అంటే ఏ విధంగానో కూడా చెబితే బాగుంటుంది. రాక్షసుల్ని పాలిస్తూ, వారి దుర్మార్గాలని ప్రోత్సహిస్తూ, కేవలం తన జాతి వారనే అభిమానంతో వారు ఎటువంటి అన్యాయం చేసినా, వారిని కాపాడుతూ ఉండే నేటి రాజకీయ నాయకుల్లాగా పాలించాడు. అన్యాయాన్ని, అధర్మాన్ని ప్రోత్సహించే నాయకులు ఎవరైనా చివరికి పతనంకాక తప్పదు. అదే రావణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం.

    ఇక్కడ మరో ఉదాహరణ కూడా చెప్పవచ్చు. ఒక పెద్దమనిషి ఉన్నాడు. ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఎంతో మేధావి, పాండిత్యం కలవాడు. గవర్నర్‌ స్థాయికి వెళ్ళాడు. కాని ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. చివరికి తన పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయన పదవి కాని, అనుభవం కాని, తెలివితేటలు కాని ఏవీ ఆయన్ను కాపాడలేకపోయాయి. కేవలం అసభ్యంగా ప్రవర్తించినందుకే ఆయన అంత శిక్ష అనుభవించితే, పరాయి భార్యను అపహరించి, అధర్మంగా ప్రవర్తించి, తన తప్పు తెలుసుకోకుండా యుద్దానికి సిద్దపడ్డందుకే రాముడు రావణుడిని చంపాల్సి వచ్చింది. ఒక మనిషి ఎంత గొప్ప వాడయినప్పటికీ, అతని ప్రవర్తన మీదే అతని గౌరవం ఆధారపడి ఉంటుంది. డబ్బు, పలుకుబడి, హోదా ఇవేవీ మంచి గుణం లేనప్పుడు రాణించవు. అందుకే రావణుడు చరిత్రలో హీనుడయ్యాడు. ఇప్పుడు రావణుడిని ఆదర్శంగా తీసుకోవాలి అని గౌరవనీయ ఐలయ్య గారు ఏ విధంగా చెప్పారో ఆయనకే తెలియాలి.

    చరిత్రను తిరగరాసి, రావణాసురుడు, తాటకి, నరకాసురుడు, శూర్పణఖ వంటి వారి చరిత్రల్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన శెలవిచ్చారు. ఇప్పుడు మనం ఉన్న ఈ చరిత్రలో రాజకీయ నాయకులు చేసిన, చేస్తున్న పనులు చూస్తుంటే, పురాణాలలో వర్ణించిన రాక్షసులే మేలనిపించేలా ఉన్నారు. అంత మాత్రం చేత అప్పటి రాక్షసుల చరిత్రల్ని, ఇప్పటి చరిత్ర హీనులయిన రాజకీయ నాయకుల్ని ప్రజలు పాఠ్యాంశంగా చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే, ఇప్పటి వరకు మనం సాధించిన నాగరికతకు, సంస్క ృతికి అర్థం లేకుండా పోతుంది.

    రాముడు కూడా ధర్మ సంస్థాపనార్థం యుద్ధం చేసాడే కాని, రాజ్య కాంక్ష కోసం యుద్ధం చేయలేదు. యుద్దంలో విజయం సాధించిన తరువాత కూడా లంకా రాజ్యాన్ని ఆయోధ్య సామంత రాజ్యంగా కలుపుకోలేదు. రావణుడి తమ్ముడు, ధర్మ బద్ధుడైన విభీషణుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం చేసాడు. రావణ వధ అనంతరం యుద్ధభూమికి వచ్చిన మండోదరి కూడా తన పతిని చంపినందుకు రాముడిని శాపనార్థం పెట్టలేదు. ధర్మాన్ని విడవవద్దని చెప్పినా వినకుండా తన పతి చెఎప్పిన మాట విననందుకు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడని విచారించింది. ఇదంతా రామాయణం చదివితే తెలుస్తుంది.

    రామాయణం కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని కోట్ల మందికి ఆరాధ్యనీయ గ్రంధం. అటువంటి కావ్యం మీద వ్యాఖ్యానించే ముందు, అందులోని పాత్రలపై తమ అభిప్రాయం వెలిబుచ్చే ముందు కొంచెం అధ్యయనం చేస్తే మంచిది. ఇదే మరో మతంలో చేస్తే ఏమయ్యేదో, ఎన్ని గొడవలకి దారితీసేదో అందరికీ తెలిసిన విషయమే. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, పోయేది మాట్లాడే వారి గౌరవమే. ఆకాశం మీదకి ఉమ్ము వేయాలని ప్రయత్నిస్తే, చివరికి జరిగేదేమిటో కూడా అందరికీ తెలుసు. కాని సమాజంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడకూడదు. చేతనయితే సమాజంలో మరింత మంచిని పెంచడానికి ప్రయత్నించాలే కాని, విపరీత ఆలోచనల్ని రేకెత్తించకూడదు. మన కులం, మన ప్రాంతం, మన భాష... ఇలా 'మనోడు' అయినంత మాత్రాన వారు ఎన్ని తప్పులు చేసినా, ఎంతటి దుర్మార్గుడయినా వాడిని వెనకేసుకు రావాలా? ఆరాధించాలా? అలా చేస్తే సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఐలయ్య లాంటి వారు ఇకనైనా తమ సంకుచిత దృష్టిని వీడి, విశాల ప్రజాహితం కోరితే బాగుంటుంది.

Sunday, October 21, 2012

స్త్రీని గౌరవించి, పూజించడమే మన సంప్రదాయం

    ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోను మహిళల్ని అణచివేయడం గమనించవచ్చు. వారు సంఘ పరంగా అనేక వివక్షల్ని ఎదుర్కొంటారు. ఇక ఆధ్యాత్మికంగా స్త్రీలకు ఎన్నో విధి నిషేధాలు ఉన్నాయి. కాని, భారతదేశంలో, అందునా ఆర్య సంస్కృతిలో మాత్రం స్త్రీకి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. నిజమైన సంప్రదాయాన్ని పాటించే వారెవరూ స్త్రీని కించపరిచే విధంగా ప్రవర్తించలేరు. అదే భారతీయ సంస్కృతి విశిష్టత. ఆధ్యాత్మిక పరంగా చూసినా కూడా స్త్రీది విశిష్ట స్థానమే. మిగతా దేవుళ్ళు, దేవతలు ఎందరు ఉన్నా ఆదిపరాశక్తిదే అగ్రస్థానం. మొదటి పూజ కూడా ఆ జగన్మాతకే. కుటుంబంలో మరలా తల్లిదే అగ్రస్థానం. ముందుగా ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి తలుచుకుని, మిగతా వారిని నిర్లక్ష్యం చేయమని ఆర్య జీవన విధానం నేర్పదు. కంటికి ఎదురుగా కనిపించే తల్లిదండ్రుల్నే ప్రత్యక్ష దైవాలుగా భావించమని చెబుతుంది వేదం. వారిలో తల్లికే మొదటి పూజ. 'మాతృ దేవోభవ' - ముందు తల్లికి నమస్కరించిన తరువాత తండ్రికి 'పితృ దేవోభవ'.   యజ్ఞ యాగాదులలో, పూజలు, క్రతువులలో పాల్గొనడానికి వివాహితుడు కాని వారికి, భార్యా వియోగం అయిన వారికి అర్హత లేదు. భార్యతో కలిసి ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తేనే పూర్తి ఫలం దక్కుతుంది. అదీ స్త్రీకి ఉన్న ప్రాధాన్యత.

    ఇవన్నీ ఒక ఎత్తయితే, మనకు ఏ సంబంధం లేని పరాయి స్త్రీని కూడా మాతృ సమానురాలిగా, సోదర సమానురాలిగా చూడమని చెబుతుంది వేదం. పృధ్వీరాజ్‌ ఛౌహాన్‌, శివాజీ వంటి వీరులు కూడా తాము జయించిన రాజ్యంలోని పాలకుల భార్యలను సోదరి సమానంగా భావించి, సకల లాంఛనాలతో వారి  రాజ్యాలకు సాగనంపారు. అదీ ఆర్య సంస్కృతి ఆచరణ అంటే..


యత్ర నార్యస్తు పూజ్యంతే

రమంతే తత్ర దేవతా||


''స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటారనేది'' ఆర్యోక్తి. మహిళకి భారతదేశంలో ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది. కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి ఉండనొల్లదు అనే భావన కూడా మహిళకు ఆర్య సాంప్రదాయంలో ఉన్న విశిష్టతను తెలియజేస్తుంది. ప్రస్తుతం మనం జరుపుకుంటున్న దేవీ నవరాత్రులు కూడా మహిళా శక్తి గొప్పదనాన్ని, మహిమను చాటిచెబుతాయి. స్త్రీని శక్తి స్వరూపిణిగా, పరాశక్తిగా, సృష్టి స్థితి లయలకు కారకులైనవారికి కూడా తల్లిగా పురాణాలు కీర్తిస్తున్నాయి. విశ్వానికి అంతటికీ ఆధారభూతమైన, కారణమైన ఆ మహాశక్తి పురుష రూపంలో ఉండే అవకాశం లేదని రుషుల భావన. ఇంతటి మహావిశ్వాన్ని సృజించి, పెంచి, పోషించి, మరలా తనలోనే లయింపజేసుకొనే అన్ని శక్తుల మూల కారణం స్త్రీ స్వరూపమే. జగమంతటిలో ఉన్న ఇన్ని ప్రాణులకు అవసరమైనవన్నీ ఇచ్చి, చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు ప్రతి పూటా అన్నిటికీ ఆశ్రయమిచ్చి, ప్రాణం నిలవడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసి, తన చల్లని ఒడిలో లాలించి, పాలించి, తల్లి ప్రేమను పంచే ఆ మహాశక్తి ముమ్మాటికీ అమ్మ మాత్రమే అయి ఉంటుంది. ఎందుకంటే అంతటి ప్రేమను పంచి, అనురాగాన్ని కురిపించగలగడం తల్లికి మాత్రమే సాధ్యం. తండ్రి కేవలం బాధ్యత వహిస్తాడు. కాని, తల్లి తన జీవితాన్ని అర్పిస్తుంది. అందుకే విజయదశమికి అమ్మవారిని భావన చేస్తాము.

    స్త్రీని గౌరవించని, ఆమెకు ప్రాధాన్యమివ్వని ఏ నాగరికత అయినా, సమాజం అయినా మనుగడ సాగించలేదు. ఆమె సహకారం లేకుండా ఏ క్లిష్టమైన పనీ సాధ్యపడదు. ప్రతి ఇంటిలోను ఇంటిని చక్కబెట్టే ఇల్లాలిగా, పిల్లల్ని సంస్కారవంతులుగా, ఉన్నత సమాజ పౌరులుగా మార్చే గురుతరమైన బాధ్యత స్త్రీదే. ఏ ఇంటిలో స్త్రీ మానసిక, శారీరక వ్యధ అనుభవిస్తుందో ఆ కుటుంబం నుండి వచ్చే సంతానం నేరస్తులుగా మారే ప్రమాదం అంత ఎక్కువగా ఉందనేది సామాజిక నిపుణుల పరిశీలనలో తేలిన వాస్తవం. అది ముమ్మాటికీ నిజం కూడా.

    పత్రికల్లోను, తెర మీద కనబడే రంగుల వలయాల్లో బొమ్మల్ని చూసి, గోల చేస్తూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, నీచమైన ఆనందం పొందే నేటి తరానికి ఈ విలువల ప్రాధాన్యం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్ల అంటే వ్యాపార వస్తువు కాదు, మగవారి కోర్కెలు తీర్చే బానిసా కాదు. బస్సుల్లో, రైళ్ళల్లో, రోడ్లమీద, కాలేజీల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ కంటికి కాస్త నదురుగా కనబడే ప్రతి ఆడపిల్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండేవారికి ఈ దేవీ నవరాత్రులలో స్త్రీశక్తి ప్రాధాన్యతను తెలపాలి. ఆడపిల్ల కనపడిందంటే చాలు, ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, తామేదో గొప్ప వీరప్రేమికుల స్థాయిలో పోజలు కొట్టే వారికి, నిజమైన ప్రేమ రుచి చూడాలంటే అదే అమ్మాయిని మాతృ సమానంగా, సోదరి సమానంగా చూస్తే చాలు. అప్పుడే ఆమె నిజమైన ప్రేమను కురిపిస్తుంది. ఆడదంటే అబల కాదు, అవసరం వచ్చినపుడు ఆమే పరాశక్తిగా మారి దుష్ట సంహారం చేసి, లోక రక్షణ చేస్తుందనే సందేశాన్ని సకల లోకానికి తెలపడమే ఈ దేవీ నవరాత్రుల ముఖ్య ఉద్దేశం. ఈ సందేశం కేవలం భారతదేశానికే కాక, సకల ప్రపంచానికి కనువిప్పు కావాలని ఆశిద్దాం.

Saturday, September 29, 2012

ఒక రమణీయ జీవిత కావ్యం.... 'అమ్మ ఒడిలోకి పయనం'...

    'అందరి జీవితం గురించి అందరూ తెలుసుకోనవసరం లేదు, కాని కొందరి గురించి మాత్రం అందరూ తెలుసుకొనే తీరాలి'. ఈ నానుడికి సరిగ్గా అతికినట్టు సరిపోయే పుస్తకమే 'అమ్మ ఒడిలోకి పయనం..'. రాధానాధ్‌ స్వామి అనే సాధారణ యువకుడి జీవితంలో జరిగిన అసాధారణ సంఘటనల సమాహారమే ఈ పుస్తకం. రిచర్డ్‌ అనే అమెరికన్‌ యూదు యువకుడు భగవంతుని గురించి చేసే అన్వేషణలో వేసిన అడుగులు, వివిధ సంఘటనలు చివరికి రాధానాధ్‌ స్వామిగా ఎలా మారాడన్నదే ఈ పుస్తక సారాంశం.

    రిచర్డ్‌ ఒక సాధారణ అమెరికన్‌ యూదు యువకుడు. చిన్నతనం నుండి యూదుల పట్ల క్రైస్తవులకు సహజంగా ఉండే ద్వేషాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటాడు. దానికి తోడు ఇంట్లో తల్లిదండ్రులు దేవుని పట్ల కృతజ్ఞతగా ఎలా ఉండాలో నేర్పుతారు. 1960ల్లో అప్పుడే అమెరికా యువతలో మొదలైన హిప్పీ సంస్కృతి (దేశ దిమ్మరులు అనవచ్చును), ఇవన్నీ రిచర్డ్‌ను ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియని కూడలిలో ఉంచుతాయి. కాని ఆ యువకుడు ఎవరి మాటను వినక, తన అంతరాత్మ ప్రబోధంతో ప్రపంచంలో ఉన్న అన్ని మతాల గ్రంధాలని చదువుతాడు. కాని దేవుడి గురించిన భావనలు ఆయన్ని అయోమయంలో పడేస్తాయి. ఈ అయోమయంలో నుంచి బయట పడే మార్గం.. ప్రపంచ పర్యటన మాత్రమే అని నమ్ముతాడు. ఆ విధంగా అమెరికా నుండి స్నేహితుడు 'గేరి'తో కలిసి బయలుదేరి, లండన్‌, ఫ్రాన్స్‌ మీదుగా, ఇటలీ చేరుకుంటారు. రోమ్‌ను సందర్శిస్తారు. ఎంతో మంది క్రైస్తవ మతపెద్దల్ని కలుసుకుని, ఎన్నో చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు. కాని ఆయన మనసుకు సమాధానం లభించదు. చివరకు ఆయన ప్రశ్నలకు సమాధానం దొరికేది కేవలం 'భారతదేశం'లో మాత్రమే అని ఒక దివ్యవాణి ఆయనకు అంతరాత్మలో ప్రబోధిస్తుంది. అక్కడి నుండి భూమార్గం ద్వారా భారతదేశం చేరుకునే ప్రయత్నంలో ముస్లిం దేశాల్లో ప్రయాణం, అక్కడ ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు మనల్ని కలిచివేస్తాయి. పుస్తకం చదువుతున్నంత సేపు రిచర్డ్‌తో పాటు మనం కూడా ప్రయాణిస్తూ, ఆయన పడుతున్న బాధల్ని, కష్టాల్ని మనం కూడా కలిసి ఎదుర్కొంటున్నట్లుగా అనిపిస్తాయి.

    తనకి అసలెన్నడూ పరిచయం లేని ఒక 'అపరిచిత దేశం' గురించి రచయిత మాటల్లోనే... ''ప్రతి మైలూ ముందుకు పోతున్నపుడు, నా హృదయం పవిత్రమైన భారతభూమి వైపు విహరించసాగింది. ఆ భూమితో సమాగమం జరుగకుండా నేను బ్రతకలేనని నాకు మొదటి నుండి తెలుసు. భారత భూమి కోసం పరితపించాను. నా హృదయపు లోతుల్లోని బలమైన కోరిక ఇప్పుడు నిజమయ్యేటట్టుగా ఉంది''.

    అలా భారతదేశం చేరుకున్న రిచర్డ్‌, దేశంలోని వివిధ ప్రాంతాల సందర్శన, హిమాలయ యోగులతో సహవాసం, గంగానది ఒడ్డున ఒంటరి వాసం, ధ్యానం, హిమాలయ పర్వత సానువుల్లో ఆయన చూసిన యోగుల అద్భుత విన్యాసాలు.... ఇవన్నీ చదువరులను కట్టిపడేస్తాయి. మనమెన్నడూ చూడని అద్భుత లోకాలని తీసుకువెళతాయి. అక్షరాల వెంట మనసును పరుగులు తీయిస్తాయి. అన్నిటి కన్నా ముఖ్యంగా బృందావనంలో ఘనశ్యామ్‌ బాబా వృత్తాంతం ఎంతటి వారికైనా కళ్ళవెంబడి నీళ్ళు చిప్పిల్లజేస్తుంది. అంతటి కరుణాత్మకంగా సన్నివేశ చిత్రణ ఒక విదేశీయునికి ఎలా సాధ్యమయిందో నాకు ఎన్నటికీ అర్థం కాదు. కృష్ణుని ప్రేమలో మునిగి తేలిన బృందావనంలో భగవంతుని పట్ల ప్రేమను ఏదో ఒక మత పరమైన కర్మకాండగా కాకుండా, ప్రదర్శన యోగ్యమైన క్రతువుగా కాకుండా, తమ జీవిత విధానంగా మార్చుకుని, తమ దైనందిన జీవితంలో, ఒకరినొకరు 'రాధేశ్యామ్‌' అని పలకరించుకోవడం చూసి, రచయిత ఉద్వేగానికి లోనవుతాడు. వ్యాపార మతాల నుండి వచ్చిన వారికి ఈ దేశంలోని సహజమైన ప్రేమతో దేవుని ఆరాధించడం ఒకింత ఆశ్చర్యం కలిగించడం మనం గమనిస్తాము.

    పుస్తకం మొదలు నుండి చివరి వరకు ఒక అపరాధ పరిశోధ నవల చదువుతున్న అనుభూతిని కలుగజేస్తాయి. ఆంగ్ల మూలం నుండి తెలుగులోకి అనువదించిన తీరు కూడా చాలా సరళంగా ఉంది. అక్కడక్కడ రచయితలోని హాస్య ప్రియత్వం, సున్నితత్వం కూడా గిలిగింతలు పెడుతూ రచన ముందుకు సాగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంలో రచయితలో ఎక్కడా దాపరికం గాని, మొహమాటం గాని చూడము. తన మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం కోసం దారిలో ఎదరైన అన్ని రకాల యోగులు, గురువులు, స్వాములు, వివిధ మతాల పెద్దలు... ఇలా ఎంత మంది తమ దారిలోకి తెచ్చుకోవాలని చూసినా, మొండితనంతో, తెగువతో, తన నిజమైన దారిని కనిపెట్టడానికి, తన గురువును చేరడానికి ఆయన పడిన తపన, చదువరుల మనసుని కదిలింపచేస్తాయి. సత్యాన్వేషణ అంటే కేవలం తను నమ్మిన ఒక దారిలో వెళ్ళి, మిగతా వారిని విమర్శించడం కాదని, ప్రపంచం చాలా విశాలమైనదని, ఎన్నో రకాల భావాలు, ఆరాధనా పద్దతులు, ఆచారాలు, వీటన్నిటినీ మించి, రకరకాల మనుష్యులు... అన్నిటినీ తులనాత్మకంగా, పక్షపాత రహితంగా, సాక్షీభూతంగా పరిశీలించి, అప్పుడు మాత్రమే మన మనస్సుని భగవంతుని అధీనం కావించి, ఆయన చెప్పిన మార్గాన్నే అనుసరించాలనేది రచయిత సూచన. ఇది సర్వకాల సర్వావస్థలలోను అనుసరించదగ్గది. అందరూ ఇలా ఆలోచిస్తే, మనిషిగా పుట్టి, విచక్షణా జ్ఞానం ఉపయోగించిన వారందరికీ ఒకే మార్గం బోధపడుతుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం సాకారమవుతుంది. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చదువదగిన మంచి పుస్తకం 'అమ్మ ఒడిలోని పయనం'

    క్లుప్తంగా చెప్పాలంటే ''1960లలో ధనం, ఐశ్వర్యం, విలాస వస్తువులతో, విశృంఖల విహారంతో దారి తప్పింది అమెరికా యువత. అన్నీ ఉన్నప్పటికీ, ఉన్నత ఆశయంతో సమాజం నడిచే దారిని విడచిపెట్టిన యువకుడు రిచి. హృదయంలో పిలుపును అనుసరిస్తూ, ప్రాణాలకు తెగించి, శ్రమలకు ఓర్చి, నదులు, పర్వతాలు, అరణ్యాలు, జీవారణ్యాలు, దేశాలు, ఖండాలు దాటాడు. చివరకు భారతమాత ఒడిలో చేరి, చల్లని హిమాలయాలలో సేదదీరి, గంగా ప్రవాహం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుని, వృందావన వీధుల్లో వెన్నెల రాత్రుల్లో విహరించి పరవశించడం కథ కాదు. యదార్ధం. అదే ఈ అద్భుత కథ. నాగరికత ముసుగులో అతికించుకున్న నవ్వుతో, అవిశ్వాసం తాండవించే ఆధునిక అసహజ జగత్తులో విసిగి వేసారిన ప్రతి యువకునికీ ఈ గ్రంథం ఒక చక్కటి కరదీపికగా నిలిచే అక్షరపేటిక. అందరం ఈ అమ్మఒడిలోకి పయనిద్దాం. ఆ ప్రేమామృతాన్ని ఆస్వాదిద్దాం.

    పుస్తకంలో ముందుగా త్రిదండి చిన్న జీయరు స్వామి మంగళాశాసనములు, యండమూరి వీరేంద్రనాధ్‌, అజయ్‌ కల్లమ్‌, ఐ.ఎ.ఎస్‌., బి.కె.ఎస్‌. అయ్యంగార్‌, ప్రముఖ యోగా గురువు, సౌరవ్‌ గంగూలీ, క్రికెట్‌ కెప్టెన్‌, హృషీకేష్‌ మఫత్‌లాల్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త, యశ్‌బిర్లా, పారిశ్రామికవేత్త వంటి ప్రముఖుల అభిప్రాయాలను పొందుపరచడం మరింత అందాన్నిచ్చింది.


పుస్తకం పేరు: అమ్మ ఒడిలోకి పయనం (ఒక అమెరికా స్వామి ఆత్మ కథ), పబ్లిషర్స్‌: ఎస్‌. ఛాంద్‌ పబ్లిషింగ్‌ హౌస్‌, ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి అన్ని బ్రాంచీలు, వెల: 150 రూపాయిలు.

Saturday, September 15, 2012

మంత్రాలకు చింతకాయలు రాలవు గానీ ప్రార్థనతో రోగాలు తగ్గిపోతాయా?

    'మంత్రాలకు చింతకాయలు రాలవు' అనే సామెతను మనం చాలా తరచుగా ఉపయోగిస్తుంటాము. నిజమే.. చింతకాయలు రాలడానికి మంత్రమేమీ లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని ప్రయోగించే వాడికి ఎంతో ఆత్మశక్తి ఉండాలంటారు.  కానీ విచిత్రమైన విషయమేమిటంటే, క్రైస్తవులు మాత్రం ప్రార్థన ద్వారానే సకల రోగాలు తగ్గిస్తామని చెబుతారు. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు 'సాక్షి' పేపర్‌లో ఒకనాటి సినీ కథానాయిక దివ్యవాణితో ఇంటర్వ్యూ.  బాధలు, కష్టాలు, వ్యాధులు అనేవి ప్రతీ మనిషి జీవితంలో సహజం. భగవంతుడిని నమ్మడం ఎందుకంటే, ఎంత గొప్పవాడయినప్పటికీ, కష్ట సమయంలో మనో ధైర్యాన్ని కోల్పోతాడు. అది సహజం. ధైర్యం లేనపుడు చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా పెద్దవి కనిపించి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తాయి. అటువంటి సమయంలో గుర్తుకు వచ్చేది అత్యంత శక్తివంతుడైన భగవంతుడి గురించే. కొన్నిసార్లు సాటి మనిషి ఓదార్పు మాటలు కూడా ఆయుధంలా, మంత్రంలా పనిచేస్తాయి.

    సరిగ్గా ఈ పాయింట్‌నే క్రైస్తవులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరైనా కష్టంలో ఉన్న మనిషి, లేదా వ్యాధులతో బాధపడుతున్న వారు మన దగ్గరకు రాగానే ఏవో కొన్ని ఓదార్పు మాటలు చెబుతాము. లేదా దైవాన్ని ప్రార్థించమని చెబుతాము. ఎదుటి మనిషి మరో మతానికి చెందినవారయితే వారు నమ్మిన దేవుడిని ప్రార్థించమని చెబుతాము. కాని, ఎవరైనా క్రైస్తవుల దగ్గరకు వెళ్ళినట్లయితే, వెంటనే కాసిని మంచి మాటలు చెప్పి, ప్రార్థన మొదలుపెడతారు. అది తప్పుకాదు. ఒకవేళ ఆ వ్యక్తికున్న బాధలు లేదా వ్యాధులు నయమయితే, ఇక వెంటనే బ్రెయిన్‌ వాష్‌ మొదలుపెడతారు. దేవుడిని నమ్మడం వల్లనే ఇది నయమయింది కాబట్టి నీవు వెంటనే మతం మారు అని చెబుతారు. ఒకవేళ వినకపోతే, మా దేవుడిని ప్రార్థించడం వల్లనే నీకు నయమయింది కాబట్టి నీవు మతం మారాల్సిందే. మారకపోతే మరలా నీకు కష్టం / వ్యాధి తిరిగి వస్తుంది అని బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. ఇక చేసేదేముంది? ఇష్టం ఉన్నా లేకున్నా మతం మారాల్సిందే. ఈ సకల సృష్టిలో ప్రతీ జీవిలోను, రాయి, రప్పలోను, ఆకాశంలోను, అగ్నిలోను, భూమిలోను, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, గురువులు.... ఇలా ప్రతీ జీవిలోను దైవత్వాన్ని దర్శించే విశాలతత్వం నుండి, దేవుడంటే ఒకడే అనే భావనకు మార్చేస్తారు. అక్కడి నుండి తనకు తానుతో సహా ప్రపంచంలో అందరూ అలా మారిన వారికి శత్రువులే. ఇలా మత మౌఢ్యాన్ని వ్యాప్తి చేసే హక్కు వారికెవరిచ్చారు? ప్రపంచంలో గత 25 వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. అటువంటి ఘనమైన నాగరికతకు వారసులుగా మెలగవలసిన వారిని వారి సంప్రదాయాల నుండి వేరు చేసి, వారి కుటుంబాల నుండి, సమాజం నుండి, ఆచార వ్యవహారాల నుండి వేరు చేసే దుర్మార్గం ఇంకెన్నాళ్ళు సాగుతుంది?

    నాకు తెలిసిన ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి స్నేహితుని ప్రోద్బలంతో మతం మారాడు. ఇక అప్పటి నుండి ఆ ఇంటిలో వారందరినీ శత్రువులుగా చూడడం మొదలుపెట్టాడు. ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగితే దూరంగా ఉంటాడు. ఇంటిలో ఏదైనా పండుగకి పిండివంటలు వండితే, అది దేవుని ప్రసాదం నాకు వద్దు అంటాడు. చివరికి భార్య పూజ చేసి, గంట మోగిస్తే, అది నాకు వినబడకూడదు అంటూ ఆ అమ్మాయిని హింస పెట్టాడు. చివరికి అతనితో భరించలేక భార్య పుట్టింటికి వెళ్ళిపోతే, నాకు దేవుడు ముఖ్యం.... భార్య పోయినా పర్వాలేదు అంటూ మంకు పట్టు పట్టాడు. ఆదివారం వచ్చిందంటే మా వూర్లో అది సంత రోజు. వ్యాపారాలన్నీ చాలా బిజీగా ఉంటారు. ఎక్కువ టర్నోవర్‌ నమోదు అయ్యేది ఆ ఒక్క రోజే. ఈ మతం తీసుకున్న తరువాత ఆదివారం వచ్చిందంటే  అంత వ్యాపారాన్ని వదులుకుని, చర్చికి పోవడం మొదలుపెట్టాడు. అంటే ఆర్థికంగా కూడా నష్టపోతున్నాడు. కుటుంబ సభ్యులందరూ కుమిలిపోతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా, దేవుడే కావాలంటాడు. ఇక అతని జీవితం నాశనయినట్లే. ఎన్ని సార్లు ఎంతో మంది నచ్చచెప్పినా, తన వైఖరి మార్చుకోవట్లేదు.

    దేవుడి పట్ల భక్తి ఉండొచ్చు, కాని మూర్ఖత్వం ఉండకూడదు. క్రైస్తవ దేశాల్లోనే ఎంతో మంది వాస్తవం తెలుసుకుని, చర్చి పట్ల విముఖత ప్రదర్శించడమో, లేదా హిందూ మతమో, బౌద్ధమతమో తీసుకోవడం చేస్తున్నారు. అటువంటిది ఇంతటి మౌఢ్యాన్ని నూరిపోయడం ఈ మతంలో వారికి ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కావడం లేదు.

    దివ్యవాణి విషయమే తీసుకుంటే ఆవిడ ఎన్నో కష్టాల్లో ఉండి ఉండవచ్చు. కొడుక్కి మందులతో నయం కాని జబ్బు వస్తే సిస్టర్‌ కొన్ని స్వాంతన మాటలు చెప్పిఉండవచ్చు. అంతమాత్రం చేత ప్రార్థన వల్లనే నా కొడుక్కి తగ్గిందని పత్రికా ముఖంగా ప్రకటన ఇవ్వడం ఎంత వరకు సమంజసం? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుంది? సెలబ్రిటీలు స్టేట్‌మెంట్లు ఇచ్చే ముందు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అది సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా చూసుకోవాలి. కేవలం ప్రార్థన వల్లనే జబ్బులు నయమయ్యే వీలుంటే, ఇన్ని హాస్పిటల్స్‌, ఇంతమంది డాక్టర్లు, వైద్య వ్యవస్థ, కొన్ని వేల కోట్ల రూపాయిల ఖర్చు.... ఇవన్నీ ఎందుకు? పైగా మిషనరీలే హాస్పిటల్స్‌ నడుపుతాయి. నర్సుల్ని తయారు చేస్తాయి. వైద్యం చేస్తూ, మందులు వాడుతూ, డాక్టర్లు చికిత్స చేస్తూ, వ్యాధి దేవుడి వల్లనే నయమయింది అనే వాళ్ళని ఏమనాలి?

    హిందూ స్వాములు, బాబాలు ఏదైనా మహిమ చేసారని చెప్పగానే అదంతా 'మ్యాజిక్‌' అంటూ గొంతు చించుకునే 'సమాజ సేవకులు', క్రైస్తవంలో పబ్లిక్‌గా ఇటువంటి పనులు చేస్తుంటే, నోరు మెదపరెందుకు? టి.వి.లో డజనుకు పైగా క్రైస్తవ చానళ్ళలో కళ్ళెదురుగా గుడ్డి వాళ్ళకు చూపు తెప్పిస్తున్నారు. కుంటివాళ్ళను పరిగెట్టిస్తున్నారు. ఇదంతా నిజమేనా? నిజమైతే ఇక హాస్పిటల్స్‌ మూసేద్దాం. డాక్టర్స్‌ని ఇళ్ళకి పంపేద్దాం. ఇంత జరుగుతున్నా, మీడియాగాని, ప్రభుత్వం గాని సుప్త చేతనావస్థలో ఉంటుంది. ఇది మన ప్రారబ్ధం.

    ఇదంతా నేను క్రైస్తవం పట్ల ద్వేషంతోనో, మరో దానితోనో రాయడం లేదు. ఎవరి మతాన్ని వారు అనుసరించే హక్కు ప్రతీ వారికి ఉంది. ఎవరి ఆరాధనా పద్దతులు వారివి. కాని ఆ పేరు చెప్పి ఎదుటి వారి విశ్వాసాల్ని, నమ్మకాల్ని అగౌర పర్చే హక్కు వారికి లేదు. బ్లాక్‌మెయిల్‌ చేసి, అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రపంచంలోనే పురాతన నాగరికతలోని ప్రజల్ని వారి సంప్రదాయాల నుండి శాశ్వతంగా దూరం చేసే సాంస్కృతిక దురాక్రమణ నుండి తమను తాము రక్షించుకునే ఆలోచనను ప్రతి ఒక్కరి హృదయంలోను రగిలించాలనేదే నా ప్రయత్నం.

Sunday, September 9, 2012

విశ్వమంతా విస్తరించిన భారతీయ సంస్కృతి : 'హైందవి' పుస్తక సమీక్ష

    ప్రపంచ దేశాలన్నీ అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నపుడు భారతదేశంలో మహోజ్జ్వల సంస్కృతి వెల్లివిరిసింది. చీకట్లో చిరుదివ్వె కాదది. మహా ప్రకాశవంతమైన నాగరికత. ప్రపంచంలోని అన్ని దేశాలకీ ఆ సంస్కృతే, ఆ నాగరికతే దిక్సూచి అయింది. ఆ నాగరికతే దారి చూపింది. కొన్ని లక్షల సంవ్సతరాల మానవ ఇతిహాస చరిత్రలో, కొన్ని వేల సంవత్సరాల మానవ నాగరికతా ప్రవాహంలో ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సాంఘిక వ్యవస్థలతో ప్రయోగాలు ఇవన్నీ ఫలించి, పరిఢవిల్లి, సమాజ హితం కోరే దార్శనికులు, ఆలోచనాపరులు, స్వలాభం ఆశించని భారతీయ రుషుల ఆలోచనల ఫలితంగా, భారతీయ నాగరికత రూపుదిద్దుకుంది. ఎటువంటి ప్రచార సాధనాలు లేని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని అన్ని దేశాలలో, మానవ జాతి ఉనికిలో ఉన్న ప్రతి గడ్డమీదా ఆర్ష ధర్మం ఆచరించబడింది. 'లోక స్సమస్తా సుఖినోభవన్తు' అని కోరుకుని, ప్రజలందరూ సుఖంగా ఉండేవేళ, ఆ ధర్మాన్ని కాదని, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం స్థాపించబడిన కొన్ని కొత్త మతాలు, వ్యాపార ధోరణిని అవలంభించి, లోకంలో ఉండే శాంతి సామరస్యాలను నాశనం చేసి, ప్రజల మధ్య యుద్ధాలు రెచ్చగొట్టి, అన్ని దేశాల పురాతన సంస్కృతుల్ని దారుణంగా తుడిచిపెట్టేసాయి.  కాని నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా బయటకి వస్తుంది. అది 'హైందవి' వంటి పుస్తక రూపంలో...

    హైదరాబాద్‌కి చెందిన శ్రీ ముదిగొండ ఇందుశేఖర్‌ గారి సంవత్సరాల కృషి ఫలితంగా 'హైందవి' రూపుదిద్దుకుంది. 'భారతీయ సంస్కృతి - విశ్వ వ్యాప్తం అని చెప్పుకోవడం కాదు, శాస్త్రీయంగా, సాంకేతికంగా, హేతుబద్దమైన ఉదాహరణలతో, కొన్ని వందల చిత్రాలతో, ఫోటో ఎవిడెన్స్‌లతో విశ్వం భారత సంస్కృతీమయం అని చెప్తుంది - హైందవి' అంటారు ఇందుశేఖర్‌గారు. అది నిజమే. ఏవో కొంత గాలి పోగుచేసి, మన గొప్ప మనం చెప్పుకున్నాం అనిపించుకోకుండా, నిజాయితీగా కృషి చేసి, ఆయన స్వయంగా కొన్ని, అంతర్జాలంలో వెతికి కొన్ని, స్నేహితుల ద్వారా కొన్ని విషయాలు సేకరించి, ఎంతో అమూల్య సంపదను ప్రోది చేసారు. ఇదంతా ఒక ఎత్తయితే సేకరించిన సమాచారాన్ని దేశాల వారీగా విడదీసి, ఆయా దేశాల నాగరికతను, సంస్కృతుల్ని అధ్యయనం చేసి, వాటిని ప్రాచీన ఆర్ష సంస్కృతితో తులనాత్మక పరిశీలన చేసి, పరిశోధనాత్మక వ్యాసంగా అందించిన ఇందుశేఖర్‌ గారి కృషి అభినందనీయం. కేవలం వ్యాసం వ్రాయడమే కాకుండా, ఎంతో శ్రమ కోర్చి కలర్‌ ఫోటోలను కూడా సంపాదించి, పుస్తకం మొత్తం వర్ణ రంజితంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. మరో ముఖ్యమైన విషయం... ప్రతీ వ్యాసంలోను ప్రస్తావనకు వచ్చిన విషయాలను, విశేషాలను తాను ఎక్కడి నుండి సేకరించిందీ, పుస్తకం వెనుక రిఫరెన్స్‌ల రూపంలో పొందుపరిచారు. ఏవైనా అనుమానాలు ఉన్నవారు ఆ రిఫరెన్స్‌లో చూపిన అంతర్జాల లంకెలుగాని, పుస్తక పుటల్ని గాని చూడవచ్చు.

    ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఉన్నది భారతదేశంలో కాదు, కంబోడియా దేశంలో. క్రైస్తవ మతం మూలాలు, ఇస్లాం మతం మూలాలు, అరబ్బుల, యూరోపియన్ల ప్రాచీన సంస్కృతి గురించి మనకు తెలియని ఎన్నో వివరాలు అందించారు. మనకు ప్రాచ్య దేశాలైన చైనా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, జపాన్‌ దేశాల్లో బయట పడిన ఆర్య దేవీ దేవతా విగ్రహాలు, అక్కడి పూజా మందిరాలు, ఇటలీ, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ వంటి దేశాలలో ఇప్పటికీ వాడుకలో ఉన్న ఆచారాలు, క్రైస్తవ, ఇస్లాం పూర్వపు సంప్రదాయాలు, వాటి పుట్టుక, ఆచరణ, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి సుదూర దేశాలలో కూడా భారతీయ ఆర్ష సంస్కృతి ఏ విధంగా పరిఢవిల్లిందో ఎంతో చక్కగా వర్ణించారు. ప్రాచీన సంస్కృతిని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చదవవలసిన పరిశోధనాత్మక గ్రంధం - 'హైందవి'

    పుస్తక రచయిత: ముదిగొండ మల్లిఖార్జున ఇందుశేఖర్‌ గారు, పుస్తకం సైజ్‌ : 1/8 డెమీ, పుటలు: 140 (అన్నీ మల్టీకలర్‌ పేజీలు), రచయిత    సెల్‌ నెం: 99082 21589

Saturday, September 8, 2012

మన్‌ 'మౌన' ప్రధాని

    అండర్‌ అచీవర్‌ అంటూ టైమ్‌ మ్యాగజైన్‌ గౌరవనీయ భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ని దుమ్మెత్తి పోసిన విషయం మరువక ముందే వాషింగ్‌టన్‌ టైమ్స్‌ తిరిగి అదే బాటలో నడిచింది. అండర్‌ అచీవర్‌ అనే మాటకు అచ్చతెలుగులో 'అసమర్థుడు' అని అర్థం చెప్పుకోవచ్చునేమో. భారతదేశ ప్రజలు అసలే తమను తాము తిట్టుకునే పనిలో బాగా బిజీగా ఉంటారు. దీనికితోడు సాక్షాత్తు ప్రధాన మంత్రిని కూడా ఆ విధంగా తిట్టుకోవడం ఎంత వరకు సమంజసం? అందుచేత అందరం కలిసి ఆయన్ని ఇంద్రుడు, చంద్రుడని కీర్తిద్దాం.

    రాజకీయ నాయకులు ఎన్నడూ నిజమైన నాయకులు కాలేరని అందరికీ తెలిసిన విషయమే. కాని విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ వంటి మేధావులు నాయకులు కాలేకపోవడం నిజంగా బాధపడాల్సిన విషయమే. దీనికి కారణం ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పనిలేదు. ఆయన్ని వెనుక నుండి ఎవరు ఏ విధంగా ఆడిస్తూ, ప్రపంచానికి తోలుబొమ్మలాట చూపిస్తున్నారో జగమెరిగిన సత్యం. అంతర్జాతీయంగా భారత ప్రభుత్వ పరువును తీయడానికి ఏ దేశస్థులు ఈ హైడ్రామా ఆడిస్తున్నారో అందరికీ తెలుసు.

    మన్మోహన్‌ సింగ్‌ స్వతహాగా నెమ్మదైన వ్యక్తిత్వం కలవారు. 1990లలో పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా, ఇద్దరూ కలిసి చేపట్టిన సంస్కరణలు, గ్లోబలైజేషన్‌ వంటి వాటి వల్ల ఆయన ప్రతిష్ట ఇనుమడించింది. భారతదేశ ప్రధానిగా మన్మోహన్‌ను ఎన్నుకున్నపుడు తిరిగి అటువంటి ఆర్థిక సంస్కరణలు చేపట్టి, మరలా దేశ ప్రతిష్టను పెంచుతారని అందరూ భావించారు. కాని ఆయన ఇటలీ పెద్దల వారసత్వ పార్టీలో ఒక రబ్బర్‌ స్టాంప్‌గా మారిపోయారు. ప్రభుత్వం నిలువునా అవినీతిలో కూరుకుపోయినా, కుంభకోణాలు వరుసపెట్టి పార్లమెంటును కుదిపేస్తున్నా, పారిశ్రామిక, ఉత్పాదక రంగాల వృద్ధి రేటు దారుణంగా మందగించినా, రూపాయి విలువ పాతాళంలోకి కుంగిపోయినా, కనీస చర్యలు తీసుకోకుండా, అన్నిటికీ అతీతంగా ఉండగలగడం మన్మోహన్‌ సింగ్‌కే సాధ్యమయింది. పైగా ప్రపంచమంతటా ఆర్థిక వృద్ధి రేటు ఇలాగే ఉందన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వ వాదన. ఆర్థిక శాస్త్రంలో కనీస పరిజ్ఞానం ఉన్న వారికి ఎవరికైనా విషయం ఇట్టే అర్థమవుతుంది.

    భారత్‌ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. ఇక్కడి పారిశ్రామిక, సేవా రంగాలన్నీ వ్యవసాయాధారితాలే. అంటే వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతులు, వ్యవసాయ రంగంలోని వారు ఖర్చుపెట్టి, పారిశ్రామిక రంగంలోని ఉత్పాదనలు కొంటారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు బాగుంటే సేవా రంగం కూడా బాగుంటుంది. మన దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్‌ తక్కువ. అందుచేత ఎక్కువగా దేశీయంగానే ఆధారపడాలి. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా వచ్చే ఒడిదుడుకులకి భారత ఆర్థిక రంగం లోనవడకుండా స్థిరంగా ఉండడానికి ఇది ప్రధాన కారణం. ఇంతటి సుస్థిరమైన ఆర్థిక రంగంలో కూడా ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగిపోతుంది అంటే అది ఖచ్చితంగా నూటికి నూరుపాళ్ళు ప్రభుత్వ వైఫల్యమే. విచారించదగ్గ విషయం ఏమిటంటే ఈ ద్రవ్యోల్బణం ప్రభుత్వ ప్రేరేపితం. అంటే ప్రభుత్వం ఎక్కువ పన్నులు విధించే కొద్దీ, ఆర్థిక రంగంలో వస్తు, సేవలన్నీ విపరీతంగా ధరలు పెరుగుతూ ఉంటాయి. దాని కన్నా ప్రభుత్వ ఖర్చుని నియంత్రణ చేసి, దానిని సరైన విధంగా ఖర్చు చేయగలిగితే, పన్నులు విపరీతంగా విధించాల్సిన అవసరం ఉండదు. తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.

    ఇవన్నీ ప్రధాని స్థానంలో ఉన్న మన్మోహన్‌కి తెలియవని కాదు. ఆయనకి తెలుసు. కాని ఏమీ చేయలేని నిష్క్రియత. ఒక ప్రధానిగా అలంకార ప్రాయంగా ఉండడమే ఆయకిష్టం. మనసుని చంపుకుని ప్రధానిగా ఉండడం కన్నా, ఆ పదవికి రాజీనామా చేసి, తన గౌరవం నిలుపుకుంటే ఒక ఆర్థిక వేత్తగా ఆయనకు గౌరవప్రదం. అంతేగాని, ఒకరిచేతిలో కీలుబొమ్మగా, రబ్బర్‌స్టాంప్‌గా ఉండి, అంతర్జాతీయంగా తన పరువుతో పాటు, దేశ ప్రతిష్టకు కూడా భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే, చరిత్ర ఆయన్ను క్షమించదు. అటువంటి వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇప్పటికైనా ఆయన ధైర్యం వహించి, ఆర్థిక వ్యవస్థను, దేశ పరిస్థితిని చక్కబెట్టి, మంచి నాయకుడు అనిపించుకుంటారని ఆశిద్దాం.

Thursday, June 28, 2012

మహోన్నత భారతీయ ఆలోచనలపై ఒక విదేశీ వనిత అంతరంగం.

     దైవం ఎవరు?  దైవత్వం  అంటే ఏమిటి? అంటే, అందుకు నా సమాధానం దైవం, దైవత్వం అనుభవించాల్సినవే గాని నిర్వచనానికి అందేవి కావు.

    దైవం తిరుగులేని సంపూర్ణ శక్తి. మన కళ్ళ ఎదురుగా కనిపించే అన్ని అంశాలూ ఆ శక్తి నుండే వచ్చాయి. చివరికి ఆ క్రమంలో మానవులమైన మనం కూడా. ఇవన్నీ వస్తాయి... పోతుంటాయి. నేడు చూసినవి రేపు కనిపించవు. ఇటువంటి అశాశ్వతాలన్నీ ఆ శాశ్వతం నుండి వచ్చి మళ్ళీ అందులోనే చేరతాయి. అదే దైవం. ఆ శక్తే దైవత్వం.

    ఆ తర్వాతి ప్రశ్న దేవుడు ఎవరు అనేది. తనకన్నా శక్తివంతమైనది. తన చర్యలన్నింటినీ శాసించేది, తనకు తెలియని వాటినన్నింటినీ తెలిసిన ఒక  మహత్తర శక్తికి మానవుడు ఇచ్చిన పేరు భగవంతుడు.

    ఆ పదం ఇచ్చి, ఆ తర్వాత దానిని నిర్వచించే యత్నం చేశాడు. ఆ భగవంతుని చుట్టూ అర్థం లేని అంశాలు జోడించాడు.

    నేను చూపించిన వారే భగవంతుడు, అదే విశ్వసించాలి అంటూ నా బాల్యంలో బోధనలు చేసి నన్నొక నాస్తికురాలిగా మారేంతగా హింస పెట్టారు.

    భారతదేశం వచ్చిన తరువాతే భగవత్‌ తత్వం నాకు అర్థమైంది. భగవంతుడు విశ్వవ్యాప్తి చెందిన వాడు. మానవుడి పరిణామానికి ముందే ఉన్నది దైవత్వం. మానవుడు అంతమైనా ఆ దైవత్వం ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకుని ప్రజలందరినీ దైవత్వం వైపు మరల్చేందుకు ఏర్పరచినవి మందిరాలు. అందులోని విగ్రహాలు కేవలం రాతి బొమ్మలు కావు. అటువంటి బొమ్మలు బయట మనకెన్నో కనిపిస్తాయి. కాని వాటిలో దైవత్వం కనిపించదు.

    ఆ విగ్రహాలలో నిక్షిప్తం చేయబడిన ఒక మహత్తర శక్తి దైవత్వం. మహనీయులే ఆ ప్రతిష్ట చేయగలరు. అందులోని శక్తి స్వచ్ఛమైనది. వాస్తవమైనది. మానవుడు పూజలు చేయవలసింది ఆ శక్తికి. గ్రహించవలసింది ఆ శక్తిలోని భాగాన్ని.

    ఆ దైవమే మనుషులకు సరైన మార్గం చూపుతుంది. మానవుడిని ధర్మబద్దమైన జీవితంలో నడిపించగలిగిన శక్తి స్వరూపానికి బద్దులై జీవించడం అలవరచుకోవాలి.

    - మదర్‌ (అరవిందాశ్రమం)

(స్వాతి వారపత్రిక 29-6-2012 సంచికలో ఊపర్‌వాలా శీర్షిక నుండి గ్రహీతం)

Sunday, June 10, 2012

ఆంగ్లం వల్ల మాత్రమే మనం బ్రతకగలమా?

    'కన్న తల్లిని, సొంత ఊరిని మరువకూడదు' అంటారు. మాతృ భాషకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఒక వ్యక్తి తను పుట్టిన కుటుంబంలో కొన్ని తరాలుగా వాడుకలో ఉన్న భాషనే మాతృ భాషగా వ్యవహరిస్తుంటారు. మనందరికి మాతృభాష తెలుగు మాత్రమే. మాతృభాష అనేది ఒక వ్యక్తికి అత్యంత స్వాభావికంగా, సహజంగా వస్తుంది. నేర్చుకునేటపుడు కృత్విమత్వం అంటూ ఉండదు. కారణం... కొన్ని వేల సంవత్సరాలుగా ఆ కుటుంబంలో, సమాజంలో వాడుకలో ఉండడం వలన ఆ భాష పలికే తీరు, దాని భావం, వ్యాకరణాలతో సహా ఆ వ్యక్తికి సహజంగా సంక్రమిస్తుంది. ప్రత్యేకించి వ్యాకరణ సూత్రాలు, వాడుకను గురించిన నియమాలు ఎవరూ చెప్పనక్కర్లేదు. మాతృభాషలోని భావం హృదయానికి ప్రత్యక్షంగా అనుసంధానమై ఉంటుంది. అంటే వ్యక్తి యొక్క ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు అన్నీ మాతృభాషలోనే ఏర్పడతాయి, బయటకు వెల్లడించబడతాయి. మహాత్మా గాంధీ చెప్పినట్లు 'తన మాతృభాషలో సంపూర్ణ జ్ఞానం సంపాదించిన వ్యక్తి, ఇతర భాషలని కూడా ఎంతో తేలికగా నేర్చుకోగలుగుతాడు'.

    కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సామాన్యుడి దగ్గర నుండి ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కరు పర భాషా జపం చేస్తున్నారు. ఆంగ్లం నేర్చుకుంటేనే భవిష్యత్తు, అది లేకపోతే జీవితమే లేదు అనేట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడో పరాయి వారు వదిలి వెళ్ళిపోయిన భాషనే పట్టుకుని వేళ్లాడుతూ, భావి పౌరులకు కూడా అదే జీవితం అనేట్లుగా చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. అసలింతకీ ఆంగ్ల భాష నిజంగా ఉపయోగకరమైనదేనా? మాతృభాష కూడా నిర్లక్ష్యం చేసి, దాన్ని నేర్చుకోవలసిన అవసరం ఉందా అనేది మన ప్రశ్న.

భారతదేశంలో ఆంగ్ల విద్య:

    ఆంగ్లేయులు భారత దేశంలో అడుగుపెట్టిన తరువాత వారికి ఇక్కడ పరిపాలనలో సహకరించే వారు కరువయ్యారు. అప్పటి వరకు మధ్యవర్తుల ద్వారాను, రెండు భాషలు తెలిసిన దూబాసీలు (ద్విభాషీలు) ద్వారాను పరిపాలన, రాజులతో మధ్యవర్తిత్వం నడపడం వంటివి చేసారు. రాను, రాను వారికి ప్రతి పనికీ ఇంగ్లండు నుండి ఉద్యోగుల్ని తెచ్చుకొనేబదులు ఒక్కడే తమ మాటని అర్థం చేసుకుని, ఆచరించే గుమాస్తాల్ని తయారు చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అలా భారతదేశంలో ప్రవేశపెట్టబడిందే 'మెకాలే' విద్యా విధానం. అప్పటి వరకు సర్వ మానవాళికి, ప్రపంచంలోని ప్రతి దేశానికి దిశా నిర్దేశం చేసి, మొట్టమొదటి విశ్వవిద్యాలయాల్ని స్థాపించిన భారత దేశ విద్యా విధానం తన ప్రాభవాన్ని కోల్పోయి, పరాయి దేశస్థుల చేతిలోకి వెళ్ళిపోయింది. మెకాలే విద్యా విధానం యొక్క మొట్టమొదటి లక్ష్యం 'భారతదేశంలో తమ పరిపాలనకు కావలసిన గుమాస్తాల్ని' తయారుచేసుకోవడం. భారతీయులు తమ విలువైన సాంస్కృతీ సాంప్రదాయాల్ని మరచిపోయేలా చేయడం. భారతీయులు ప్రతీ విషయంలో ఆలోచించే 'ధర్మాన్ని' వారి నుంచి వేరు చేయడం. ఇవీ ఆంగ్ల విద్యా విధానం యొక్క విషపు ఆలోచనలు.

    స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గతించినా, మనం ఇంకా ఆ ఆలోచనా సరళి నుండి బయట పడడానికి ప్రయత్నం చేయడం లేదు సరికదా, రోజు రోజుకీ ఆ ఊబిలో ఇంకా ఇంకా కూరుకుపోతున్నాము. నా చిన్న తనంలో ఒకటవ తరగతి పుస్తకంలో ముందు పాఠం 'మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ'. ఇది అత్యున్నత భారతదేశ ఆలోచనా సరళి. తల్లితండ్రుల పట్ల, సమాజం పట్ల, గురువుల పట్ల మనం వ్యవహరించాల్సి తీరు పాఠ్యాంశాలుగా ఉండేవి. మీలో ఎవరైనా ఇప్పటి ఒకటో తరగతి పుస్తకాలు తీసి చూడండి. ముందుగా పరమత ప్రార్థన. ఇంకొంచెం ముందుకెళితే మనకు ఎందుకూ పనికిరాని, మన సంస్కృతికి సంబంధం లేని ఆంగ్లంలో ఉన్న పొట్టి పాటలు. వాటికి ఏ విధమైన అర్థం పర్థం ఉన్నట్లు తోచదు. వాటిని చదవకపోతే, కంఠతాపట్టి అప్పజెప్పకపోతే పిల్లలకి గుంజీలు, అరదండాలు. పోనీ అవేమన్నా జీవితానికి పనికొచ్చే విశేషాలా? తలా తోకా లేని పొట్టి పద్యాలు మాత్రమే. ఇలా మొదలైన విద్య ద్వారా కేవలం గుమాస్తాల్ని తయారు చేయగలం కాని, సమాజానికి, దేశానికి పనికొచ్చే ఆదర్శమూర్తుల్ని తయారు చేయలేము. తన కుటుంబానికిగాని, తను ఉంటున్న సమాజానికి గాని, కనీసం కట్టుకున్న భార్యకి, ప్రాణ స్నేహితుడి కూడా పనికిరాని, మాట్లాడ్డం తెలిసిన ఒక జంతువును తయారుచేసి, సమాజంలోని వదులుతున్నాము. దానివల్లనే నేడు మనం చూస్తున్న ఇన్ని దోపిడీలు, ఇంత అరాచకం, ఎదుటివారిపై నిందలు, మనం సిగ్గులేకుండా బ్రతుకులు వెళ్ళదీయడం..

ఆంగ్లం వల్ల మాత్రమే మనం బ్రతకగలమా?

    ఆంగ్లాన్ని సమర్థించే వాళ్ళు చెప్పే మొదటి మాట... ఆ భాష నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతకవచ్చు కదా... నిజమే.. ఆ భాష నేర్వడం వల్ల ప్రపంచంలో ఎక్కడికైనా బానిసగా వెళ్లి, గొర్రెల్లా విదేశీయులు చెప్పినదానికి తలూపుతూ, గుమాస్తాగా బ్రతుకును వెళ్ళదీయవచ్చు. కాని, నీ సమాజంలో సింహంలా బ్రతకడానికి మాత్రం ఆ భాష ఎందుకూ పనిచేయదు. కారణం... ఆ భాషలో తగలబడిన విద్యా జ్ఞానం. ఈ నిజాన్ని గుర్తించిన అనేక దేశాలు అంటే చైనా, జపాన్‌, కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని రద్దు చేసి, మాతృభాషలోనే విద్యాభ్యాసాన్ని చేసే వీలు కల్పిస్తున్నాయి. దాని వల్ల విద్యార్థికి తను నేర్చుకున్నదేమిటో అర్థం అవుతుంది. ఆ నేర్చుకున్న దానిని ఆలోచించడం, ఆచరణలో పెట్టడం వంటివి సులభ సాధ్యమవుతాయి. నేను జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా, కొరియా, జపాన్‌ వంటి వారితో వ్యాపారపరంగా మాట్లాడవలసి వచ్చినపుడు వారు ఆంగ్లంలో ప్రవీణులు కారన్న విషయాన్ని గ్రహించాను. వారికి వచ్చిన ఆంగ్లమంతా కేవలం వ్యవహారికం మాత్రమే. అంటే కేవలం ఎదుటి మనిషి భావాల్ని అర్థం చేసుకొనేవరకు మాత్రమే. వారికి ఆంగ్లమే జీవితం మాత్రం కాదు.

ప్రతీ సాంకేతిక పదానికి మాతృభాషలో పదం దొరకడం సాధ్యమేనా?


    'ప్రపంచంలో అన్ని భాషలను ప్రభావితం చేసి, తన పద సంపదతో వాటిని పరిపుష్టం చేసిన భాష సంస్కృతం. సంస్కృత భాషలో ఉన్నన్ని పదాలు, వ్యుత్పత్తి అర్థంతో సహా, ప్రపంచంలో మరే భాషలోను ఉండవు. సంస్కృతం భారతీయ భాషలకు ఆత్మ వంటిది. 'మనసుంటే మార్గం ఉంటుంది' అన్నట్లుగా మనసు పెట్టి వెతకాలే గాని, ప్రతీ ఆంగ్ల పదానికి మాతృభాషలో పదాన్ని సృష్టించవచ్చు. ఆ పదం సాధ్యమైనంత తేలికగా, పలకడానికి వీలుగా ఉండాలి. ఎప్పటికప్పుడు మిగిలిన అన్ని దేశాల్లోను జరుగుతున్న నూతన సాంకేతిక ఆవిష్కరణల్ని మాతృభాషలోకి తర్జుమా చేసేందుకు వీలుగా ఒక యంత్రాంగాన్ని రూపొందించాలి. అలాగే పాఠ్య పుస్తకాల్ని తరచుగా నూతన విషయాలతో క్రోడీకరిస్తుండాలి. ఇలా చేయడం వలన విద్యార్థులకి మాతృభాషపై అవగాహన పెరుగుతుంది. శాస్త్ర విజ్ఞానం పట్ల కూడా అభిరుచి కలుగుతుంది. సరైన శిక్షణ ఇస్తే ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థుల కంటే ధీటుగా మాతృభాషలో చదివే విద్యార్థులు మంచి ఫలితాలను అందించగలరని నేను ప్రత్యక్షంగా ఎన్నో సార్లు రుజువు చేసాను.

ఎన్నో లాభాలు:

మాతృ భాషలో విద్యాభ్యాసం చేయడం వలన ముందుగా ప్రపంచ పటంలో నుండి ఒక భాషని అంతర్థానం కాకుండా కాపాడుకోగలం. ఆ భాషలో ఉన్న నుడికారాలు, సంస్కృతి, సాహిత్యం, ఆ భాషకే సొంతమైన సొగసు, ఇవన్నీ మించి, మాతృభాషపై మమకారం, తద్వారా దేశభక్తి వంటివి విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. అన్నిటి కన్నా ముఖ్యంగా మేథో వలసని అరికట్టవచ్చు. అంటే ఇక్కడ విద్య నేర్చుకున్న వారందరూ సరైన సౌకర్యాలు లభించడం లేదని, అవకాశాలు లేవని విదేశాలకు వెళ్ళిపోవడాన్ని, అక్కడి వారికి బానిసత్వం చేయడాన్ని ఆపుచేయవచ్చు. తద్వారా మేథావుల సేవల్ని దేశ అభివృద్ధికి, తద్వారా సమాజ హితానికి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మేధావులందరూ విదేశాలకు వెళ్ళి అక్కడ అభివృద్ధి చేస్తుంటే, ఎందుకూ పనికిరాని వారు అధికారులుగా, రాజకీయనాయకులుగా మారి, దేశ అభివృద్ధి మాట అటుంచితే, సామాన్య ప్రజల్ని దోచుకు తింటున్నారు.

    ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే, ముందుగా విద్యా వ్యవస్థని మార్చాలి. భారతీయ విలువలకి విద్యలో ప్రాధాన్యం కల్పించాలి. మాతృభాషలో శాస్త్ర, సాంకేతిక పదాల్ని అనువాదం చేయాలి. వాటిని ఉపాధ్యాయులకు, విద్యార్థులు సంపూర్ణంగా అర్థం చేసుకునే విధంగా నిఘంటువులు, పుస్తకాలు రూపొందించాలి. దశల వారీగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్ని మూసివేయాలి. కేవలం వాడుక భాషగా మాత్రమే ఆంగ్లాన్ని ఉండనివ్వాలి. అంటే కేవలం అవసరమైన వారు మాత్రమే ప్రత్యేకంగా నేర్చుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సంపూర్ణంగా మాతృభాషనే వినియోగించుకొనేలా వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ప్రతి అడ్డమైన పదానికి ఆంగ్లాన్ని శరణు వేడే దుస్థితి నుండి బయటపడాలి. అపుడే మాతృభాషలు బతికి బట్టకట్టగలుగుతాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం సాధ్యమవుతుంది.

Sunday, April 8, 2012

అందమా... నీ పేరేమిటి అందమా..??

    అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.. అని సినీ కవి వ్రాసాడు. నిజమే.. అందం లేకపోతే ఆనందమే లేదు. ఆనందం లేకపోతే ఇక ఆ జీవితానికి అర్థం ఏముంది? అందానికి మానవ జీవితంలో ఎంతో ప్రాధాన్యముంది. అందంగా ఉండాలని కోరుకోని వారెవరుంటారు? ఊహ తెలిసినప్పటి నుండి, ముసలి వారి వరకు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు ఆరాటపడిపోతూంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చరిత్ర కందని కాలం నుంచీ అందం గురించి ప్రయత్నాలు మొదలయ్యాయంటారు, చరిత్రకారులు. చరిత్రనే ఎన్నో మలుపులు తిప్పిన ఘనత అందం సొంతం. అలనాటి రాణి క్లియోపాత్రా ప్రపంచ అందగత్తె అనిపించుకోవడానికి చేయని ప్రయత్నం లేదట. అంతటి అందగత్తెగా ప్రసిద్ధి గాంచడం వల్లనే కదా ఈజిప్టుకు అన్ని యుద్ధాలు వచ్చాయి. చివరికి సామ్రాజ్య పతనానికి దారి తీసాయి. ముంతాజ్‌ బేగం అందానికి దాసోహమవడం వల్లనే షాజహాన్‌ చరిత్రలో మరపురాని అద్భుత కట్టడం 'తాజ్‌మహల్‌'ని నిర్మించాడు, ప్రపంచానికి కానుకగా ఇచ్చాడు. భాగమతీ దేవి అందానికి సుల్తాన్‌ ముగ్దుడవ్వకపోతే హైదరాబాద్‌ నగరమే వెలిసి ఉండేది కాదు. 'ఆ రాణి ప్రేమ పురాణం, ఈ ముట్టడి కయిన ఖర్చులు... ఇవేవీ కావోయ్‌.. చరిత్ర సారం' అని మహాకవి ఎంత గింజుకున్నా చరిత్రలో అందం స్థానం అందానిదే.

    కావ్యాలలో నాయిక అందాన్ని, అంగాంగ సౌందర్యాన్ని వర్ణించడానికే కవులకు ఎన్నో తాళపత్రాలు కేటాయించేవారు. శృంగార నైషధంలో కవి శ్రీనాధుడు, వారకాంతల అందాన్ని రసవత్తరంగా వర్ణిస్తాడు. శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యదలో పల్లె పడుచుల అందాల్ని మాటల దోబూచులాటలలో చక్కగా, రసరమ్యంగా అభివర్ణిస్తాడు. అందరూ మానవ కాంతల అందాన్ని పొగిడితే, పోతన మాత్రం వీరికెవరికీ తీసిపోకుండా అందానికే అసూయ కలిగించే అంతటి అందగాడైన శ్రీకృష్ణుడు తన భాగవతంలో వర్ణిస్తాడు. 'నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, కృపా రసంబు పైజల్లెడు వాడు..... చెల్వల మానధనంబు దోచెనే, మల్లియలార, మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే' అంటూ కృష్ణుడు అందాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తాడు. ఇక అన్నమయ్య కీర్తనలలో వేంకటేశ్వరుని అందాన్ని పొగుడుతూ ఉండే కీర్తనలే ఎక్కువ. 'ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు' అంటూ బాల కృష్ణుని అందాన్ని వేడుకగా నోరారా కీర్తించాడు. ఆదిశంకరాచార్యులు 'సౌందర్య లహరి'లో సృష్టి అంతటా నిండి ఉన్న జగజ్జనని సౌందర్యాన్ని మనోహరంగా చాటారు.

    ఇదంతా బాగానే ఉంది. మరి అసలు అందం అంటే ఏమిటి? ఆధునిక కాలంలో, పాశ్చాత్య సంస్కృతిని వేలం వెర్రిగా అనుసరించే వారిలో అందం పట్ల దృక్పధం మారిపోతోంది. అందాన్ని కూడా మిగిలిన భౌతిక వస్తువుల మాదిరిగానే కొలతల్లో బంధించే సంస్కృతి ఇప్పుడు బాగా ప్రబలింది. అందాల పోటీల పుణ్యమా అని ఇపుడు ప్రతి అమ్మాయి అందంగా కనబడాలని ఆరాట పడిపోవడం చూస్తున్నాం. అమెరికా నుంచి అమలాపురం వరకు ప్రతి ఊళ్ళోను అందాల పోటీలు జోరుగా సాగిపోతున్నాయి. వీటికి ఊతం ఇస్తూ, ప్రతి ఊర్లోను, ఆ మాటకొస్తే, ప్రతి సందులోను బ్యూటీ పార్లర సంఖ్య పెరిగిపోయింది. ఎంత ఖర్చయినా పర్వాలేదు - అందంగా కనబడాలనే యువతులు / యువకుల సంఖ్య పెరిగిపోతోంది. అమ్మాయిలయితే జీరో సైజ్‌ - బ్యూటీ పార్లర్లు, అబ్బాయిలయితే సిక్స్‌ ప్యాక్‌ - జిమ్‌లు.. అంతే తేడా. ఇక వీధుల నిండా, గోడల నిండా, పత్రికలు, టి.వి.లు, సినిమాలు 'ఎందెందు వెతికిన అందందే గలడు చక్రి సర్వోపగతుండు' అని పోతన సెలవిచ్చినట్లు, ఇక్కడా అక్కడా అననేమి? ప్రతి చోటా అందాల ఆరపోతలే. అంగాంగ ప్రదర్శనలే. హీరో హీరోయిన్ల దగ్గర నుండి కాలేజీకి వెళ్ళే పిల్లల వరకు ఎవరు ఎంత చిన్న బట్టలు వేసుకుని, ఒళ్ళు కనబడేలా చేసుకుంటే వాళ్ళు అందగత్తెలు / అందగాళ్ళుగా చలామణి అయిపోతున్నారు. ఈ పిచ్చి బాగా ముదిరి లేపనాలు, ఔషధాలతో సరిపెట్టుకోకుండా, సర్జరీల వరకు వెళ్ళింది. అందానికి పైపై మెరుగులు దిద్దుతామంటూ మొదలుపెట్టిన ప్లాస్టిక్‌ సర్జన్లు రెండు చేతులా హాయిగా సంపాదిస్తున్నారు. పర్సు, ఒళ్ళు రెండూ గుల్లయిపోయినా ఎవరూ లెక్కచేయడం లేదు.

నిజానికి అందమనేది భౌతిక పరమైనది కానే కాదు, పైపై సోకులతో అందరికీ ప్రదర్శించేది కాదు. అందం ప్రధానంగా మానసికమైనది. రాముడు నల్లని వాడే, కాని రాముడంటే ఎంతో అందగాడు. మందస్మిత వదనారవిందుడు. అంటే ఎప్పుడూ చిరునవ్వు పెదవులపై తారాడే మోము కలవాడు. వినయ సంపన్నుడు, విలువల పట్ల అపారమైన నమ్మకం కలవాడు, ఆడిన మాటను తప్పని వాడు. అందుకే రామయ్య వెంట జనం పరుగులు తీసారు. మనసుల్ని రమింపచేసేంతటి అందం కలిగిన వాడు కాబట్టే ఆయన రాముడయ్యాడు. బోసి నవ్వుల గాంధీ తాతలో ఏ అందం ఉందని? ఆ నిష్కల్మష యోగి ఏ మేకప్‌ వేసుకున్నాడని... ఆడవారు తమ ఒంటి మీద నగలను ఆయన జోలిలో వేసేవారు? ఆ ముఖంలో ప్రతిఫలించింది మనసులో ఉన్న ఆత్మ సౌందర్యం. అదే కోట్లాది భారతీయులను ఒక్క తాటిపై నడిపించింది. మదర్‌ థెరిసా అందాన్ని, ఆమెలో కొట్టొచ్చినట్టు కనిపించే సేవా భావ సౌందర్యాన్ని కొలవగలిగే కొలతలు ఉంటాయా? ప్రపంచమంతా ఆమె సేవలను ఎందుకు గుర్తించింది? ఇక్కడ కూడా సమాధానం ఆత్మ సౌందర్యమే.

    భౌతిక సౌందర్యానికి కొన్ని పరిమితులున్నాయి. అది అశాశ్వతమైనది. ఈ రోజు మిస్‌ యూనివర్స్‌ అవ్వచ్చు. రేపు ఆమె ముఖం ఎవరూ గుర్తించరు. ఎందుకంటే సంవత్సరం తిరిగేసరికి మరో కొత్త మిస్‌ యూనివర్స్‌ తయారు. ఈ రోజు టాప్‌ హీరోయిన్‌ అవ్వచ్చు, రేపు ఏజ్‌ బార్‌ అయ్యాక ముఖం చూసే వాళ్ళే కరువు. ఎప్పటికీ తరిగిపోనిది ఆత్మ సౌందర్యం మాత్రమే. నమ్మిన విలువల్ని కాపాడుకుంటూ, పది మందితో మంచితనాన్ని పంచుకుంటూ, లోక కళ్యాణం కోసం పాటుపడే వాళ్ళది నిజమైన ఆత్మ సౌందర్యం. అది ఎన్నటికీ వాడిపోదు, ఎవరు వచ్చినా దాని గొప్పతనం పోదు. ఎవరు ఎంత అందంగా ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవరు మంచి దారిలో వెళతారో, ఎవరు పది మందికి వెలుగు చూపిస్తారో, ఆ వెలుతురులోనే వాళ్ళ సౌందర్యం ప్రకాశిస్తుంది... తర తరాల వరకు, యుగ యుగాల వరకు. అదే నిజమైన అందం.. అలాంటి అందమే మనసుకి నిజమైన ఆనందం.

Friday, April 6, 2012

భారతీయ ఆధ్యాత్మిక వేత్తలు, గురువులు, అందరూ గ్రూప్ ఫోటో దిగితే ఎలా ఉంటుంది?


ఒక కష్టమర్ కోరిక మీద సరదాగా ఫోటోషాప్‌లో మా ఆపరేటర్లు డిజైన్ చేసారు. ఈ అరుదయిన గ్రూప్ ఫోటో మీ కోసం....

Thursday, March 22, 2012

తెలుగు వారికి మాత్రమే గల ప్రత్యేకతలు

    తెలుగు వారి అచ్చ తెనుగు పండుగ 'ఉగాది' వచ్చింది. నందనానంద కరంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా మన తెలుగు వారికి మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకతలు, అవి చాలా ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు మీతో పంచుకుందామని...

అవధానం: సాహితీ ప్రక్రియల్లో విశిష్టమైనది అవధాన ప్రక్రియ. అష్టావధానం మొదలుకొని, సహస్రావధానం వరకు పృచ్ఛకులు అడిగిన అన్ని రకాల సాహితీ ప్రశ్నలను, గుర్తుంచుకొని, ఏక కాలంలో, ఆశువుగా అవధాని ఎవరి సమాధానం వారికి చెప్పడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అవధాని యొక్క మేధస్సు, ధారణా శక్తి, సాహిత్య పటిమ మీద అవధాన ప్రదర్శన, విజయం ఆధారపడి ఉంటాయి. ఇంతటి క్లిష్టతరమైన ప్రక్రియ మరే భాషా సాహిత్యంలోను కనిపించదు.

ఆవకాయ: ఆవకాయ పేరు చెప్పగానే నోరూరని తెలగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎవరో కవి చెప్పినట్లు, చెట్టు మీద కాయని, సముద్రంలో ఉప్పుని కలిపి చేసే ఈ పచ్చడి, దాని రుచి తెలుగు వారికి మాత్రమే సొంతం. పెళ్ళిజరిగినా, పేరంటం జరిగినా ఆవకాయ ఘుమఘుమలు లేకుండా నిండుదనమే ఉండదు కదండి.

బుర్ర కథ: గ్రామీణ ప్రాంతాల్లో బుర్రకథని మించిన కాలక్షేపం మరోటి ఉండదు. గ్రామీణుల జీవనం, జానపదుల సాహిత్యం, వారి కథలు, పురాణాలు ఇలా ఒకటేమిటి? తందాన తాన అంటూ ముగ్గురు కలిసి ప్రదర్శిస్తూ, పాటలు పాడుతూ, పద్యాలు ఆలపిస్తూ  బుర్రకథ చెబుతుంటే, చెవి ఒగ్గని తెలుగు వాడు ఉంటాడా?


నాటకాల్లో పద్యాలు: తెలుగు వారి  నాటకాల్లో ప్రత్యేకత పద్యాలు. 'బావా ఎప్పుడు వచ్చితీవు' అని రాయబారం పద్యం ఆలపించినా, 'చెలియో చెల్లకో' అంటూ హరిశ్చంద్ర కాటిసీను పద్యం ఆలపించినా, తెలుగు వారు మైమరచిపోతారు. ఒకసారి ఒకటో కృష్ణుడు పద్యం ఆలపించి, దాని చివర ఆ..ఆ......ఆ........ఆ....... అంటూ రాగం ఆలపించడం మొదలు పెడితే ఇక నాటకం పూర్తయే సరికి తెల్లారిపోవలసిందే. తెలుగు అజంత భాష అవ్వడం వలన పద్యం చివర రాగం తీసినా మధురంగానే ఉంటుంది.

శ్రీ వెంకటేశ్వరుడు / అన్నమయ్య కీర్తనలు : తెలుగు వారికే ప్రత్యేకమైన ఇష్ట దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. అందరు దేవతలకి అన్ని చోట్ల దేవాలయాలు ఉండొచ్చు గాని, సాక్షాత్తు విష్ణువు వేంకటేశ్వరునిగా కొలువై వున్న తిరుమల గిరి తెలుగు వారి వరాల కొండ.  'ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే' అంటూ ఆ స్వామిని నోరారా కీర్తించిన అన్నమయ్య కీర్తనలు మనకు మాత్రమే సొంతం. 'చందమామ రావే, జాబిల్లి రావే' అంటూ అచ్చ తెలుగు సొగసులద్దిన అన్నమయ్య మన తెలుగు వాడు కావడం మనం చేసుకున్న అదృష్టం కాక మరేమిటి?

వేమన పద్యాలు: చిన్న చిన్న పద్యాలలో కొండంత భావాన్ని పొదిగిన వేమన పద్యాలు జీవిత సారాన్ని విశదీకరిస్తాయి. వేయి మాటల్లో చెప్పలేని విషయాన్ని నాలుగు వరుసల్లో చెప్పగలగడం, అదీ అతి చిన్న తెలుగు వాక్యాల్లో ఇమిడిపోవడం తెలుగు భాష గొప్పదనమైతే, అలా ఇమడ్చగలగడం వేమనకే సాధ్యం. తెలుగు వారి హృదయాలలో వేమన స్థానం ఎప్పటికీ పదిలం.

గోరుముద్ద, ఉగ్గుపాలు: మీరు ఎంత గొప్పగా ఎన్ని భాషలు మాట్లాడగలిగినా, గోరుముద్దని, ఉగ్గుపాలుని ఏ భాషలోకైనా అనువదించి చూడండి. తెల్ల ముఖం వేసారే? ఎందుకంటే ఈ పదాలకి సమానమైన పదాలు వేరే భాషల్లో దొరకవు. చిన్న పిల్లలకి పెట్టే గోరు ముద్దలు, ఉగ్గుపాలు తల్లి ప్రేమకు చిరునామాలు. తెలుగు తల్లులు ప్రేమకు ప్రతిరూపాలు.

వావి వరుసలు: తెలుగు వారి వావి వరుసలకి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనకు ఉన్నన్ని వరుసలు, బాంధవ్యాలు మరే భాష వారికి లేవంటే అతిశయోక్తి కాదేమో? అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, వదిన, మరదలు, బావ, బావ మరిది, తోడికోడలు, తోడల్లుడు అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ ఒక్కొక్క వరుసతో పిలుస్తూ ఉంటే ఉండే ఆనందమే వేరు. ఇప్పుడంటే కాన్వెంట్‌ చదువులు సోకయిపోయి, రిక్షా వాడి దగ్గర్నుండి, పాలబ్బాయి దాకా కనబడ్డ ప్రతి మగాడిని ఆంకుల్‌, ఆడాళ్ళని ఆంటీ అని పిలుస్తున్నారు, ఈ కాలం పిల్లలు. వారికి తెలుగు వారి వావి వరుసల్లో ఉండే మధురమైన ఆనందాన్ని తెలియజేయాల్సిన అవసరం అందరి మీదా ఉంది.

చీర / పంచెకట్టు: భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లండి, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడికైనా వెళ్ళండి. అచ్చ తెలుగు వాళ్ళని ఇట్టే పసిగట్టవచ్చు. తెలుగు వారి పంచెకట్టు, ఆడవారి చీరకట్టు జగత్‌ ప్రసిద్ధమైనది. పంచె కట్టుకుని, నుదుటన బొట్టు పెట్టుకుని, భుజాన ఉత్తీరీయం వేసుకుని తెలుగు పెద్దాయన నడిచి వెళుతుంటే, అప్రయత్నంగా చేతులు జోడించ బుద్దేస్తుంది. అలాగే చీర కట్టులో మగువ అందాన్ని వర్ణించడం మహాకవులకయినా సాధ్యం కాదేమో కదా..

తెలుగు భాష: గొప్ప చెప్పుకోకూడదు కానీ, అసలు తెలుగు భాషే తీయనైనది, కమ్మనైనది. అందుకే రాయల వారు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు విశిష్టతను చెప్పకనే చెప్పారు. గోదారి గలగలలు, కృష్ణమ్మ ఉరవళ్ళు కలగలిపి, కొంచెం తేనె, కొంచెం పంచదార కలిపితే అది తెలుగు భాష అవుతుందని ఒక కవి హృదయం. అది నిజమే కదా. 'నల్లని వాడు, పద్మ నయనమ్ముల వాడు, కృపా రసంబు పై జల్లెడు వాడు' అని పోతన అచ్చ తెలుగులో కృష్ణుడి వర్ణిస్తుంటే ఎంతటి అపురూపం... అసలు పోతన వల్ల తెలుగులో అన్ని మంచి పద్యాలు వచ్చాయా, తెలుగు సొగసు వల్ల పోతన అన్ని మంచి పద్యాలు రాయగలిగాడా అంటే... సమాధానం లేని ప్రశ్నే. 'విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి, మా ప్రాణముల్‌ తీతువానని ప్రశ్నించె' అని కరుణ రసాన్ని పాపయ్య శాస్త్రి ఒలికించినా, గోదారి అలలపై నాయుడు బావపై కన్నేసిన ఎంకి పాడిన పాటలు నండూరి వారి కలం నుంచి జాలువారినా, 'వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌ జగన్నాధ రథ చక్రాలొస్తున్నాయ్‌' అని శ్రీశ్రీ కలం ఘర్జించినా, అన్నీ తెలుగు వారి సంపదలుగానే మిగిలిపోయాయి. అంతటి అపురూప సంపదను జాగ్రత్తగా భావి తరాలకి అందించే భారాన్ని మన భుజాల మీదే పెట్టుకునే అపురూప అదృష్టానికి నోచుకునే తెలుగువారిగా పుట్టిన మనం ఎంతటి పుణ్యాత్ములమో కదా...

అందుకే... మరలా తెలుగు వారందరికీ, హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు...

Saturday, March 10, 2012

జ్యోతిష్యం గురించి కొన్ని వాస్తవాలు - అపోహలు (పార్ట్- 1)

       జ్యోతిశ్శాస్త్రం గురించి ఎన్నో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న వాదోపవాదాలు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్నాయి. వేదిక మారింది. తెలుగు బ్లాగులే ఆ వాదాలకి వేదిక. అత్యంత ప్రాచీనమైన భారతీయ శాస్త్ర సాంకేతిక విషయాలకి పట్టిన గతే ఇపుడు జ్యోతిశ్శాస్త్రానికి కూడా పట్టబోతోందనేది సుస్పష్టం. దీనికి కారణం ఈ శాస్త్రంపై అనేక మందికి ఉన్న అపోహలు మాత్రమే.

    జ్యోతిషం నిజంగా శాస్త్ర బద్దమైనదేనా, లేదా అది కేవలం వట్టి కల్పన మాత్రమేనా, మనుషుల బలహీనతలతో ఆడుకోవడానికి కొంత మంది మేధావులు తయారు చేసిన వట్టి అబద్దాలతో కూడిన పుస్తకం మాత్రమేనా? ఇవన్నీ పరిశీలించే ముందు మనకు మనం ఒక అభిప్రాయానికి రావడం మంచిది. ఎవరో చెప్పింది విని, రాసింది చదివి, మనకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచకుంటే అది అన్ని వేళలా సరైనది కాకపోవచ్చు, మనం తప్పు దారి పట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ముందు మన బుద్దికి పదును పెడదాం... అంటే తార్కికంగా ఆలోచిద్దాం. దేవుడు మనకు బుర్ర ఇచ్చింది అందుకే కదా...

    ఈ విశాల విశ్వంలో ప్రతీ అణువు మరో అణువుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఇది క్వాంటం మెకానిక్స్‌లో మొదటి సూత్రం. అతి చిన్న పరమాణువు మొదలుకొని, నక్షత్ర మండలాల వరకు ఉన్న కోటాను కోట్ల పరమాణువులు నిత్యం అదృశ్యంగా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటూ ఉంటాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఆ అణువులు అలా పరస్పర ఆధారితాలు కాకపోతే మనం ఇప్పుడు చూస్తున్న విశ్వమే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేదే కాదు. అంతెందుకు ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు. మన శరీరంలోని అతి చిన్న కణం, మరో కణం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి కొన్ని కోట్ల కణాలు కలిసి, భూమిచేత ఆకర్షించబడి ఉన్నాయి. ఈ భూమి తన కన్నా పెద్దదైన నక్షత్రం - సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరలా ఆ సూర్యుడు తన గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు వంటి వాటిటో కలిసి పాలపుంత (మిల్కీవే గెలాక్సి) చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పాలపుంత కూడా గుర్తు తెలియని మరో అద్భుత శక్తి చుట్టూ తిరుగుతోంది అంటారు. అంటే, ఈ విశ్వంలోని ప్రతి అణువు మరో అణువు చుట్టూ తిరుగుతుంది. ఆఖరికి బ్రహ్మాండం కూడా. ఆ తిరగడం కూడా ఎంతో ఖచ్చితత్వంతో.... ఎంత ఖచ్చితత్వమంటే పరమాణు గడియారంలో కొలవగలిగినంత... మిల్లీ సెకనులో అరసెకను కూడా తేడా రానంత... ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. విశ్వంలో అణువులన్నీ పరస్పర ఆధారితాలు మరియు అత్యంత ఖచ్చితమైన విశ్వ నియమాల ప్రకారం అవి నడుచుకుంటున్నాయి.

    ఇక జ్యోతిష శాస్త్రం విషయానికి వద్దాం. విశ్వంలో ఉండే ప్రతి గ్రహం, నక్షత్రం అంత నిర్దుష్టంగా ప్రవర్తిస్తున్నపుడు భూమి మీద ఉన్న మానవ జీవితం మాత్రం ఎందుకింత గందరగోళంగా ఉంది? దీనిపై ప్రాచీన ప్రపంచంలో ఎన్నో ఆలోచనలు, పరిశీలనలు జరిగాయి. ఒకసారి గ్రహాలు, నక్షత్రాల నడవడికను, దానిలోని నిర్ధుష్టాన్ని కనిపెట్టిన తరువాత, మానవ జీవిత విధానం కూడా వాటికి అనుగుణంగా ఉందేమో అన్న భావన ప్రాచీన సమాజంలో తలెత్తి ఉంటుంది. ఆ విదంగా గ్రహాలకు, నక్షత్రాలకు, మానవ జీవితానికి ఉండే సంబంధాన్ని ఆపాదిస్తూ ప్రతిపాదించబడిందే జ్యోతిశ్శాస్త్రం.

    ఈ ప్రకృతిలో... ఆ మాటకొస్తే ఈ విశ్వంలో ఉండే ప్రతీ అణువు ఒక నిర్ధిష్ట విధానంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అది మనకు ఎంత గందరగోళంగా కనిపించినా సరే... చర్మంపై ఉండే కణాలను భూతద్దంతో పరిశీలిస్తే, అవి ఒక రకంగా ఉన్నట్టు అనిపించవు. గందరగోళంగా, గజిబిజిగా ఉంటాయి. కాని దూరం నుంచి చూస్తే మాత్రం కణాలన్నీ కలిసి ఒక చక్కటి ఆకారంగా... మనిషిగా కనిపిస్తాయి. ఆపిల్‌ కంపెనీ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ చెప్పిన సూత్రం ఇదే. కనెక్టింగ్‌ డాట్స్‌... జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు అర్ధం పర్థం లేనివిగా కనిపిస్తాయి. కానీ వాటన్నిటినీ కలిపితే వాటిలో అర్థం ఉంటుంది.... అవన్నీ కలిస్తే... అదే జీవితం. ప్రతి మనిషి జీవితం వ్యక్తిపరంగా చూస్తే, ఎటువంటి అర్థం ఉండక పోవచ్చు. కాని, అందరినీ కలిపి, ఒక పద్దతి ప్రకారం వర్గీకరిస్తే, జీవితం యొక్క మౌలికాంశాల్లో ఏకరూపత మనకు అర్థం అవుతుంది. మనుషుల్ని ప్రవర్తనా పరంగా, ఆలోచనల పరంగా, జీవన విధాన పరంగా విడదీసి చూస్తుంది జ్యోతిశ్శాస్త్రం.

మానవులపై గ్రహాల ప్రభావం వుంటుందా?: 
జ్యోతిషాన్ని విమర్శించే వాళ్ళు ముందుగా చూపే కారణం... ఎక్కడో ఆకాశంలో ఉండే గ్రహాలు, అంత కన్నా దూరంగా ఉండే నక్షత్రాలు మానవ జీవితంపై, వారి ప్రవర్తనపై ఎటువంటి కారణాన్ని చూపలేవు అనేది. ఎక్కడో ఉండే కుజ గ్రహం (మార్స్‌ లేదా అంగారకుడు) భూమిపై ఒక సూదిని కూడా కదిలించలేడు, యుద్దాలకి, ప్రకృతి వైపరీత్యాలకి కారణం అవుతాడా.. అంటూ ఎగతాళి చేస్తారు. వీళ్ళందరికీ గురువయిన న్యూటన్‌ కనిపెట్టిన గ్రహబలం సిద్ధాంతం ఆధారంగా ఒక గ్రహం మనిషిపై చూపించే ప్రభావం కన్నా, ఇంట్లో వెలిగే బల్బు మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని లెక్కలు కట్టి మరీ వాదిస్తారు. కాని కఠోర వాస్తవం మరోలా ఉంది. దాన్ని మనం నమ్మక తప్పదు.

    జ్యోతిషంలో ముఖ్యమైన గ్రహం, మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది.. చంద్రుడు. చంద్రుడి ప్రభావం మనిషి మనసుపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే చంద్రుడు మనసుకి అధిపతి. ఈ ప్రతిపాదనకి మూల కారణం కూడా వివరిస్తాను. భూమిపై సముద్రంలో సంభవించే ఆటు పోట్లకి కారణం చంద్రుడే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అమావస్య, పౌర్ణమి రోజుల్లో ... చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు సముద్రంలో కొన్ని వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నీటి బుగ్గ పైకి లేస్తుంది. అది పైకి బోర్లించిన గిన్నెలా సముద్ర జలాల్లో కనిపిస్తుంది. చంద్ర భ్రమణంతో పాటుగా ఆ నీటిబుగ్గ సముద్రంపై తేలియాడుతూ ప్రయాణిస్తుంది. దాని వల్లనే పోటు వచ్చి, సముద్ర జలాలు ఉప్పొంగుతాయి. దీని వల్ల చంద్రుడి ప్రభావం భూమిపై ఉందని నిర్ధారణ అయింది. మనిషి శరీరంలో కూడా నూటికి 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. మనిషి ప్రవర్తనను నియంత్రించే మెదడులో అయితే 96 శాతం నీరు ఉంటుంది. అది చంద్రుడిచే ఆకర్షించబడుతుంది. అందుకే అమావస్య, పౌర్ణమి రోజుల్లో మానసిక వ్యాధిగ్రస్తులకి పిచ్చి ఎక్కువవుతుంది. చంద్రుడి వల్ల ప్రేరేపించబడతారు కాబట్టి వారిని ఇంగ్లీష్‌లో లూనాటిక్స్‌ (లూనార్‌ అంటే చంద్రుడు) అని వ్యవహరిస్తారు. అంటే ఇక్కడ మానవ మెదడుపై చంద్రుడి ప్రభావం నిజమని తేలింది.

    ఇక సూర్యుడు... భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటికి, వృక్ష కోటికి ఏకైక ఆధార భూతుడు. ఆయన నుంచి వచ్చిన శక్తి రకరకాల రూపాల్లోకి మారి, భూమిలోకి, భూమి నుండి మొక్కల్లోకి, మొక్కల నుండి మనకి ప్రవహిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే రకరకాల రంగులు, తరంగ దైర్ఘా ్యలు (ఫ్రీక్వెన్సీలు) మొక్కలు, జంతువుల్లో ఎన్నో మార్పుల్ని కలుగజేస్తాయి. ప్రాణులకి ఎంతో అవసరమైన 'డి' విటమిన్‌ మొదలుకొని, ప్రాణ హానిని కలుగజేసే అతి నీలలోహిత కిరణాలు (ఆల్ట్రా వయోలెట్‌ రేస్‌) కూడా సూర్యుడిలోనే ఉద్భవిస్తాయి. సూర్యుడి తాపం 5 డిగ్రీలు పెరిగితే చాలు... భూమి మీద జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. సూర్యుడు ప్రాణి కోటికి అత్యంత ముఖ్యమైన ఆధారం కాబట్టే సూర్యుడిని మన పూర్వీకులు 'సూర్య నారాయణుడు' అని నారాయణుడితో పోల్చారు. సూర్యుడికి ఉన్న విశిష్టతను, ప్రాచీన నాగరికతలన్నీ సూర్యుడినే ఎందుకు దైవంగా కొలిచాయన్న విషయాన్ని గురించి అత్యంత రహస్యమైన, విలువైన విషయాల్ని తరువాతి పోస్ట్‌లో వివరిస్తాను. దీన్ని బట్టి మానవ జీవితంపై సూర్యుడి ప్రభావం ఉందని తేలింది.

    ఇక మిగిలింది... ఇతర గ్రహాలు. బుధుడు మొదలుకొని, వరుణుడు (యురేనస్‌) వరకు గ్రహాలన్నీ సౌర కుటుంబంలో భాగమే. ముందు చెప్పుకున్నట్లుగా, గ్రహాలన్నీ పరస్పర ఆధారితాలు. సౌర కుటుంబంలో ఉన్న ఏ ఒక్క గ్రహాన్ని తొలగించినా సౌర కుటుంబం మొత్తం కుప్పకూలిపోతుంది. సూర్యుడు తన అఖండమైన శక్తితో ఏ విధంగా తనకు దగ్గరగా ఉన్న బుధ గ్రహాన్ని ఆకర్షించి ఉంచాడో, అంతే శక్తి వంతంగా తనకు అత్యంత సుదూరంలోని తోకచుక్కల్ని కూడా ఆకర్షించి, తన చుట్టూ పరిభ్రమించేలా చేసుకుంటున్నాడు. అత్యంత సాంద్రత కలిగిన గురు గ్రహం, నీటి కన్నా తక్కువ సాంద్రత కలిగిన శని గ్రహం కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అదే విధంగా ప్రతి గ్రహం ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తూ ఉంటుంది. ఆయా గ్రహాల్లో ఉండే మూలకాల్ని బట్టి, అది విడుదల చేసే ఫ్రీక్వెన్సీ ఆధారపడి ఉంటుంది. సహజంగానే ఆ ఫ్రీక్వెన్సీ సౌర కుటుంబ మంతా వ్యాపిస్తూ ఉంటుంది.

    మానవ శరీరం కూడా ఒక యంత్రమే. ఇంకా మాట్లాడితే... ఈ విశ్వంలో ఒక భాగమే. విశ్వంలోని ప్రతి శక్తి, ఈ చిన్ని యంత్రంపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. మానవ శరీరంలో ఎన్నో మూలకాలున్నాయి. అవి అత్యంత సూక్ష్మమైన మోతాదుల్లో ఉన్నాయి. మానవ ప్రవర్తనపై ఈ మూలకాలన్నీ ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఒక్కొక్క మూలకం పెరిగినా లేదా తగ్గినా, అలా జరిగిన మనిషి భావోద్వేగాల్లో, ప్రవర్తనలో, ఆరోగ్యంలో ఎంతో తేడా రావడం మనం గమనించవచ్చు. ఆయా మూలకాలు, ఆయా గ్రహాల ఫ్రీక్వెన్సీ బట్టి ప్రభావితం అవుతాయి. దాన్ని బట్టే ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం లేదా పతనమవ్వడం సంభవిస్తాయి. మనిషి ఆలోచనల్లో లేదా ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. మెదడులో ఒక చిన్న కణంలో సంభవించే మార్పు చాలు. కోపం రావడానికి గాని, ప్రేమ రావడానికి గాని. చంద్రుడు మన చేతిలో ఉన్న సీసాలో నీటిని ఏ విధంగాను ప్రబావితం చేయలేకపోవచ్చు. కాని, మెదడులో చెప్పుకోదగ్గ మార్పు తీసుకురాగలడు. అదే విధంగా కుజుడు భూమి మీది గుండు సూదిని కదల్చలేకపోవచ్చు. కాని, అదే కుజుడు భూగర్భంలో ఉన్న అపారమైన ఇనుప ఖనిజ ద్రవాన్ని (లావా) ఖచ్చితంగా ప్రభావితం చేసి, భూకంపాలను సృష్టించగలడు. ఇవన్నీ గ్రహ ప్రభావితాలే. ఇదే సూత్రం నక్షత్రాలకి కూడా వర్తిస్తుంది. ఇటువంటి సందర్భాలలో మనిషికి తెలిసిన భూమి మీది భౌతిక సూత్రాలు ఎందుకూ పనిచేయవు. అసలు గురుత్వాకర్షణ శక్తిని లెక్కగట్టడమే చాలా కష్టం. మనకి తెలిసిన సైన్స్‌ ప్రకారం కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఇతంత బ్రహ్మాండమైన గ్రహాలని, నక్షత్రాలని, తోకచుక్కల్ని ఒక చోట కట్టిపడేసి, ఒకదాని చుట్టూ ఒకటి తిరిగేలా చేయడం, పైగా ఒక్కొక్క ఖగోళ వస్తువుకి మధ్యలో కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ అవన్నీ ఒకదానికొకటి ఆకర్షించబడి ఉంటాయి. అవన్నీ అలా బంధించబడి ఉండాలంటే కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రం ఉంటే సరిపోదు. మధ్యలో ఇంకో పదార్థం ఉండి ఉండాలి. మనకి తెలియని ఆ పదార్థానికే కృష్ణద్రవ్యం (డార్క్‌ మేటర్‌) అని పేరుపెట్టారు మన ఖగోళ శాస్త్రజ్ఞులు. మనకు తెలిసిన ద్రవ్యం... భౌతిక పరమైనది ఈ విశ్వంలో 10 శాతం మాత్రమే. తెలియని ద్రవ్యం 90 శాతం ఉండొచ్చని అంచనా. ఆ డార్క్‌ మేటర్‌ విశ్వంలోని అన్ని శక్తుల్నీ ఎలా ప్రభావితం చేస్తుందే మన ఊహలకి కూడా అందదు. ఇలా గ్రహాలకి, మానవ జీవితానికి ఉన్న సంబంధాన్ని, మనిషి జీవితం కూడా కొన్ని ప్రకృతి సూత్రాలకి అనుగుణంగా నడుచుకుంటుందనే భావనని నిరూపించే ప్రయత్నమే జ్యోతిష శాస్త్రం. (ఇంకా వుంది)

Thursday, March 1, 2012

భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పతనానికి కారణాలు, నివారణలు....

      ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రాచీన భారతదేశం సాంకేతికంగా, ఆర్థికంగా అత్యంత బలమైన దేశం. సహజంగా, ఇప్పుడు మనం అమెరికా పరుగులు తీస్తున్నట్టుగా, అప్పటి ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ భారతదేశం వెళ్ళాలని ఉవ్విళ్ళూరేవారు. అలా వ్యాపారం నిమిత్తమం, విజ్ఞానం నిమిత్తం ప్రపంచం నలుమూలల నుండి భారతదేశానికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరగసాగింది. మంగోలాయిడ్లు, నీగ్రిటోలు, సుమేరియన్లు, పర్షియన్లు, అరబ్బులు ఇలా అనేక రకాల జాతుల ప్రజలు భారతదేశంలోకి వరదలా ప్రవహించారు. అలా బయటి వ్యక్తుల ప్రమేయం అధికమయ్యే సరికి ఇక్కడి ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం చోటు చేసుకుంది. కొత్త భాషలు, మతాలు, సంస్కృతులు ప్రవేశించే కొద్దీ సమాజంలో ఎన్నో సర్దుబాట్లు అవసరం అవుతాయి. వారి అలవాట్లు, వేషభాషలు ఇక్కడి వారికి అలవాటు పడడమో లేదా ఇక్కడి వారి సంస్కృతినే కొద్ది పాటి మార్పులతో వచ్చిన వారు అనుసరించడమో జరుగుతుంది. దీనినే సమాజ శాస్త్రం (సోషియాలజీ) లో అసిమిలేషన్‌ (తెలుగులో ??) అంటారు. అలా కొద్ది కాలం గడిచేప్పటికి సమాజంలో ఎన్నో చీలికలు కనిపిస్తాయి. పెద్ద కుటుంబాలు, ప్రాంతాలు, రంగులు, భాషలు ఇలా ఎన్ని రకాలుగా విడిపోవచ్చో అన్ని రకాలుగా సమాజం విడిపోవడం మొదలవుతుంది. ఇప్పటి వరకు అనుభవించిన సాంకేతిక పరిజ్ఞానం నిర్లక్ష్యం చేయబడుతుంది. సమాజంలో అలజడి రేగుతుంది. రాజ్యాలు కూలిపోతాయి. దేశమంతా చిన్న చిన్న ముక్కలవుతుంది. ఇక అంతటితో మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోతారు. ఈ విధమైన అలజడులు భారతదేశ చరిత్రలో ఎన్నో పర్యాయాలు సంభవించాయి. వేదకాలం పూర్తయిన తరువాత ఒకసారి, మరలా రాముడు రాజ్యం చేసిన తరువాత మరోసారి, మహాభారత యుద్ధం జరిగిన తరువాత మరోసారి సమాజం పూర్తిగా కల్లోలమయింది. వీటినే మనం యుగాలు అంటున్నాము. పాశ్చాత్య చరిత్రకి అందినంత వరకు భారతదేశంలో అటువంటి స్థితి మౌర్య సామ్రాజ్య స్థాపన వరకు ఉంది. అశోకుడు చిన్న చిన్న రాజ్యాల్ని జయించి, విశాల భారత సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాని అశోకుడి మరణం తరువాత మరలా సామ్రాజ్యం విచ్చిన్నమయింది. భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాల మధ్య మత పరమైన విబేధాలు రాజుకున్నాయి. శైవ, వైష్ణవ, శాక్తేయ తదితర మతాల మధ్య విద్వేషాలతో భారతదేశం అనేక కష్టాలలో పడింది. అటువంటి సమయంలో భారతదేశాన్ని ఆదుకొన్నవారు శంకర భగవత్పాదులు. ఆయన ఆసేతు హిమాచలం పర్యటించి, తన జ్ఞానంతో అన్ని మతాల సారం ఒకటే అని ప్రకటించి, దేశం నలుమూలలా శక్తి పీఠాలు స్థాపించి, అనేక చిన్న చిన్న మతాల్ని విలీనం చేసి, భారతదేశానికి ఆధ్యాత్మికంగా ఒక్కటే అనే రూపుని తీసుకువచ్చారు. మరలా దేశం అభివృద్ధి పొందడం మొదలయింది.

    కాని ఆయన ప్రయత్నం మరలా వృధా అయింది. ఈ సారి ముస్లిం దురాక్రమణదారుల చేతిలో భారతదేశం నష్టపోయింది. 13వ శతాబ్ది మొదలుకొని జరిగిన దండయాత్రల్లో దేశానికి ఆర్థిక నష్టంతో పాటు, సాంకేతిక, ఆధ్యాత్మిక నష్టం కూడా జరిగింది. వారి చేతుల్లో అనేక విలువైన దేవాలయాలు కొల్లగొట్టబడ్డాయి, అరుదైన శిల్ప కళ ధ్వంసం చేయబడింది. కొన్ని వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన విలువైన గ్రంధాలు, పరిజ్ఞానం మంటల్లో కాలి బూడిదయిపోయింది. ఈ సారి భారత సమాజంలో మరిన్ని దుర్మార్గపు మార్పులు చేయబడ్డాయి. ముస్లిం దురాక్రమణదారుల నుండి కాపాడుకోవడానికి సంపదనంతా దాచిపెట్టేసుకోవడం, పక్కవాడికి ఉన్నా లేకున్నా మన వరకు దా(దో)చుకొని, జాగ్రత్త పడడం వంటివి భారతీయుల జీన్స్‌లో అప్పుడే ప్రవేశపెట్టబడ్డాయి. అవి ఇప్పటికీ మనల్ని వదల్లేదనుకోండి - అది వేరే సంగతి. మన రాజకీయ నాయకుల్లో మరింత స్పష్టంగా వీటిని గమనించవచ్చు. ఆ సమయంలో ముఖ్యంగా, ఎక్కువగా బలయిపోయింది, నష్టపోయింది - ఆడపిల్లలే. చిన్న తనంలోనే పెళ్ళిళ్ళు చేయడం (బాల్య వివాహాలు), భర్త చనిపోతే ఎవరికీ దక్కకుండా భార్య కూడా చితిలో దూకి చనిపోవడం (సతీ సహగమనం), వయసులో ఉన్న అమ్మాయిలు ఎవరికీ కనబడకుండా ఉండాలనడం (పరదా పద్దతి) ఇవన్నీ మధ్య యుగాల్లోనే భారతీయ సమాజంలో ప్రవేశించి, మూఢాచారాలుగా స్థిరపడిపోయాయి. భారతీయులకి, ముస్లింలకి జరిగిన ఆధిపత్య పోరులో కూడా దేశం ఎంతో నష్టపోయింది.

    వీరిద్దరి పోరు ఇలా కొనసాగుతుండగా, మరో పెద్ద శత్రువు, యూరోపియన్లు వచ్చారు. వారి రాకతో హిందు, ముస్లింలు ఏకమైపోయి, ఆ పెద్ద శత్రువుని ఎదిరించే పనిలో లీనమైపోయారు. అయితే యూరోపియన్ల వల్ల, ముఖ్యంగా బ్రిటీష్‌ వారి వల్ల జరిగిన మంచి ఏమిటంటే, దేశానికి ఒక రూపం వచ్చింది. చిన్న చిన్న రాజ్యాలన్నీ పోయి, ఒకే దేశంగా ఆవిర్భవించింది - భారతదేశం.

    ఇలా కొన్ని వేల సంవత్సరాలుగా జరిగిన పోరాటాల వల్ల గాని, భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల వల్ల గాని భారతీయులలో మితిమీరిన సోమరితనం, నిర్లక్ష్యం, ఎదుటి వారిని దోచుకొనే తత్వం నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. దాని వల్లనే ఈనాడు సమాజంలో మనం చూస్తున్న అవినీతి, కోట్ల రూపాయిల కుంభకోణాలు, అభివృద్ధి లేకపోవడం, పేదరికం వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వాడు కూడా నాకు లాగే భారతీయుడే, సాటి మనిషే అన్న స్పృహ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనికి మతాన్ని గాని, సంస్కృతిని గాని ప్రాతిపదికగా తీసుకోవడంలో ఏ తప్పూ లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఏదో ఒక మతం వైపు మొగ్గుచూపాయి. కాని భారతదేశంలో దీనికి భిన్నంగా అన్ని మతాలు సమానమే అనే ధృక్పధంతో అందరినీ ఆదరించారు. అదే వారి పాలిట శాపమైంది.

    మనం ఏ మతాన్ని విమర్శించనవసరం లేదు. ఎవరిపైనా ఎదురు దాడి చేయవలసిన ఆగత్యం లేదు. మనలోని లోటుపాట్లని సరిచేసుకుని, మనల్ని మనం కించపరుచుకొని, ఎదుటి వారికి లోకువ ఇవ్వకుండా, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని భద్రంగా భావి తరాలకు అందించగలిగితే చాలు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కూడా బాల గంగాధర్‌ తిలక్‌ వంటి వారు ప్రసిద్ధ గణేష్‌ మహోత్సవాలు మొదలుపెట్టి, ప్రజల హృదయాల్లో జాతీయ భావనని రగిలించారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సమర్థ రామదాసు శివాజీకి, విజయనగర సామ్రాజ్య స్థాపనకి హరిహరరాయలు, బుక్కరాయలకి విద్యారణ్య స్వామి వంటి వారు వేదాలు, పురాణ కథల ద్వారానే దేశ భక్తిని రగిలించారు. పిల్లలకి కూడా పాఠ్యాంశాల్లో వేద శ్లోకాలని, పురాణాల్లోని ఆదర్శమూర్తుల కథల్నీ పెట్టడం వలన వారు కూడా పెద్దయాక ఆయా ఆదర్శాలని అవలంభించడానికి వీలవుతుంది. భారతదేశం ఎవరో దోచుకుని వదిలిపెట్టేసిన దేశం కాదని, మనం కూడా దోచుకోవడానికే ఉన్నామని కాకుండా, ఇది మనదేశమని, నేను భారతీయుడినని గర్వంగా చెప్పుకోగలిగిన విజ్ఞానం ఇక్కడ ఉందని, ఇక్కడి సంస్కృతికి నేను నిజమైన వారసుడనని, ప్రాచీన భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపచేయడం మన తక్షణ కర్తవ్యమని (-స్వామి వివేకానంద) ప్రతి వ్యక్తి భావించే విధంగా పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రతి రోజు పాఠశాల ప్రతిజ్ఞలో చెప్పుకోవడమే కాకుండా, నిజంగా ప్రతి ఒక్కరి చేత ఆలోచింపచేసి, ఆచరింపచేసే విధంగా చేయగలిగితేనే భారతదేశానికి నిజమైన విముక్తి, స్వాతంత్య్రం.

Sunday, February 26, 2012

ప్రాచీన భారతీయులు మనం అనుకున్నంత అమాయకులు మాత్రం కాదు

    భారతీయులు చరిత్ర కందని పూర్వపు రోజుల్లోనే ఇప్పటి వారు ఎవరూ కనీసం కలలో కూడా ఊహించలేని, నమ్మడానికి కూడా సాధ్యం కాని అత్యద్భుతమైన నాగరికతను, వైభవాన్ని అనుభవించారు. కేవలం భారతీయులు అనుకుంటే అది తప్పు అవ్వవచ్చు. ప్రాచీన ప్రపంచంలో అనేక నాగరికతలు కూడా అంతటి ఉన్నత స్థాయికి వెళ్ళాయి. అందరికీ ప్రముఖంగా తెలిసింది ఈజిప్ట్‌ నాగరికత. చరిత్రకు అందని అతి ప్రాచీన కాలంలోనే మన ఊహకు కూడా అందని అద్బుతమైన కట్టడాలను - పిరమిడ్లను కట్టారు. చుట్టూ ఎడారి ప్రాంతం. పక్కనే నైలు నది. పిరమిడ్స్‌ కట్టడానికి వాడిన రాళ్లు కూడా అక్కడికి ఎంతో దూరంగా ఉన్న కొండల నుండి తీసుకురాబడ్డాయి. ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే కొన్ని వందల టన్నుల బరువున్న రాళ్ళని నైలు నది మీదుగా రవాణా చేయడం ఒక ఎత్తయితే, వాటిని క్రమ పద్దతిలో కట్‌ చేయడం, పేర్చడం, కొన్ని వందల అడుగుల ఎత్తుకు పైకి ఎత్తి, అక్కడ ఖచ్చితంగా కొలతల ప్రకారం ఉంచగలగడం, ఇవన్నీ మనకు అంతు చిక్కని రహస్యాలే. ఆధునిక ఇంజినీరింగ్‌ కూడా అంతటి అద్బుతాన్ని సాధించలేదంటే అది అతిశయోక్తి కాదు.

    ఈజిప్ట్‌కు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోని మాయా నాగరికత మరో మిస్టరీ. దక్షిణ అమెరికాలో కూడా మహోన్నతమైన నాగరికత విలసిల్లింది. అక్కడ కూడా పిరమిడ్ల వంటి నిర్మాణాలు ఉన్నాయి. మనకు అంతు చిక్కని రహస్యమయ నాగరికతల్లో మాయా నాగరికత కూడా ఒకటి. మాయన్లు నిర్మాణ రంగంలో అద్వితీయులు. వారు కట్టిన నిర్మాణాలు ఇంజినీరింగ్‌ నిపుణుల్ని సవాలు చేసే విధంగా ఉంటాయి. మహా భారతంలో ప్రస్తావించిన దేవ శిల్పి మయుడు  కూడా ఈ మాయన్‌ నాగరికతకు చెందిన వాడుగా పలువురు చరిత్ర కారులు భావిస్తున్నారు. లంకా నగరం, మయ సభ వంటి నిర్మాణాలు ఆ రోజుల్లోనే అద్భుతమైనవి. కాని కొన్ని అంతుచిక్కని కారణాల వలన ఆనాటి నాగరికతలన్నీ ఆనవాళ్ళు కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. దానికి కారణాలేమిటనేది చరిత్ర కారుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అటువంటి సంఘటనే భారతదేశంలో కూడా జరిగి ఉండొచ్చని, దాని వల్లనే ఆనాటి నాగరికతా వైభవం ఇప్పటి తరానికి అందకుండా పోయి ఉండొచ్చని చరిత్రకారుల అబిప్రాయం.

  ప్రాచీన భారతదేశంలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదని వాదించే వాళ్ళు ముఖ్యంగా చెప్పే కారణం... ఇక్కడ ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన ఎటువంటి ఆనవాళ్ళు లభించడం లేదంటారు. అదీ నిజమే. పుస్తకాలు రాసినంత మాత్రాన అది నిజమైపోవాలని ఎక్కడా లేదు కదా... కాని.. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. వేదాల్లో గాని, రామాయణ, మహాభారతాల్లో గాని ప్రస్తావించినదంతా అబద్దమో లేదా కాల్పనికమో (ఫిక్షన్‌) అనుకుందాం.. మరలాగయితే అప్పటి వేద రుషులకి గాని, వాల్మీకి గాని, వ్యాసుడికి గాని కల్పనల్ని తమ కథల్లో ప్రస్తావించవలసిన అవసరం ఏముంది? వారువ్రాసిన గ్రంధాలేమీ ప్రజల్ని విజ్ఞానవంతులని చేయడానికి ఉద్దేశించినవి కాదు కదా. ఆ గ్రంధాల ముఖ్య ఉద్దేశ్యం ప్రజల నైతిక ప్రవర్తని సరైన దారిలో పెట్టడానికి, ధర్మ సూక్ష్మాల్ని విశదీకరించడానికే కదా.. ఏ విధంగా చూసినా ఆ గ్రంధాల్లో ఉన్న సైన్స్‌ విషయాలు అప్పటి సమాజంలో సహజమైన వాటిగానే పరిగణించాల్సి వస్తుంది.

    చిన్న ఉదాహరణ తీసుకుందాం... 2000 సంవత్సరానికి ముందు వచ్చిన సినిమాల్లో గాని, కథల్లో గాని ఎక్కడైనా సెల్‌ఫోన్‌ ప్రస్తావన ఉందా.. అది ఎంతటి సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా కానివ్వండి... అప్పటి సినిమాల్లో హీరోకి ఏదైనా ప్రమాదం జరగబోతోందని తెలిసిన వెంటనే హీరోయిన్‌ లేదా మరొకరో అడవిలో అడ్డదారి గుండా కారు కన్నా వేగంగా పరిగెత్తి, ఆయాసపడిపోతూ ఆ విషయాన్ని హీరోకి చెప్పేవారు. అందరూ ల్యాండ్‌ లైన్‌ ఫోన్లే వాడేవారు. కాని, ఇప్పటి సినిమాల్లో / సీరియల్స్‌ లో చూడండి.. ఎవరి దగ్గర చూసినా సెల్‌ ఫోన్‌ ఉంటుంది. అంటే కథ అనేది నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే చరిత్ర కూడా.  సమాజంలో లేని విషయాల్ని చెబితే ఆ కథని ఎవరూ ఆదరించరు. దీన్ని బట్టి చూస్తే, రామాయణ, మహాభారతాలు, పురాణాల్లో చెప్పిన చాలా సంఘటనలు నిజంగా జరిగాయనడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే అప్పటి సమాజ అవసరాలను బట్టి అప్పటి పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉండొచ్చు. ఇప్పటి సమాజ అభివృద్ధి, అవసరాల్ని బట్టి ఇప్పటి పరికరాలు, పరిజ్ఞానం ఉండొచ్చు. అంతేగాని ఇప్పుడు మనం వాడుతున్న ప్రతీ పరికరం పురాతన కాలంలో ఉండేదని చెప్పాలనుకోవడం దుస్సాహసమే.

    మరో ముఖ్యమైన వాదన ఏమిటంటే... భరధ్వాజుని వైమానిక శాస్త్రం ఆధారంగా బెంగుళూరులో ఎవరో విమానాన్ని తయారు చేయడానికి ప్రయత్నించారట. కాని విఫలమయ్యారట. దీన్ని బట్టి భారతీయుల గ్రంధాల్లో చెప్పింది నిజం కాదని వాదించవచ్చట. దాని పూర్తి వివరాలు నాక్కూడా తెలియదు. కాని ఒక్కటి మాత్రం చెప్పవచ్చు. బెంగుళూరులోనో మరో చోటో ఔత్సాహికులు ప్రయత్నించినా, ఆ ప్రయోగం విఫలమయినా దానికి ఆ గ్రంధం బాధ్యత వహించదు. మనందరికి తెలిసిన చిన్న ఉదాహరణ చెబుతాను. కంప్యూటర్‌లో 'సి' లాంగ్వేజి గురించి మీ అందరకూ తెలుసు. ఒక పుస్తకం కొనుక్కుని, ఆ పుస్తకంలో చెప్పినట్లు మన కంప్యూటర్‌లో, సి ప్రోగ్రామింగ్‌ చేస్తాము. కాని రన్‌లో ఎర్రర్‌ చూపిస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడ ఇబ్బంది ఉందో మనకు తెలియదు. కాని, ఒక కంప్యూటర్‌ నిపుణుడు మధ్యలో ఎక్కడో ఒక కామా గాని, సెమికోలన్‌గాని మరచిపోయినట్టుగా గుర్తిస్తాడు. వెంటనే అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర జరిగిన విషయంలోనే ఇంకొకరి సహాయం తీసుకోవలసి వచ్చినపుడు ఎప్పుడో గతంలో కొన్ని వేల యేళ్ళ క్రితం రాసిన గ్రంధంలో విషయాలన్నీ తప్పు అని వెంటనే నిర్థారించబూనడం హాస్యాస్పదమవుతుంది. అలాంటి అభిప్రాయానికి రావాలంటే ఎన్నో పరిశోధనలు అవసరమవుతాయి. ఆనాటి వస్తువుల పేర్లు, సాంకేతిక నామాలు, ఇలా చాలా వాటిల్లో ఎన్నో మార్పులు వచ్చి ఉండవచ్చు. వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని, సమగ్రంగా పరిశోధించాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల సంవత్సరాల తరువాత, అంటే ఇప్పటి నాగరికత అంతరించి పోయిన తరువాత, భవిష్యత్‌ తరంలో ఎవరికైనా సి.డి.లు., కంప్యూటర్‌ మదర్‌ బోర్డులు దొరికాయనుకుందాం. వారు మన గురించి ఏమని అనుకుంటారో ఊహించండి. అప్పట్లో మతిలేక ప్లాస్టిక్‌ ముక్కల్ని గుండ్రంగా కట్‌ చేసి, వాటిని అలంకారాలుగా ఉపయోగించుకొనే వారు అనుకునే అవకాశం ఉంది. మదర్‌బోర్డ్‌ని చూసి, అప్పట్లో జనాలకి చాలా కళాపోషణ ఉండేది అని చరిత్రలో వ్రాసుకుంటారు. కాని, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కనీసం వాళ్ళ ఆలోచనకి కూడా అందకపోవచ్చు. అంతమాత్రం చేత ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ నాగరికత అంతా జరగలేదు అని భవిష్యత్తు తరం వాళ్ళు అనుకుంటే అది ఖచ్చితంగా మన తప్పు కాదు.