Pages

Sunday, September 9, 2012

విశ్వమంతా విస్తరించిన భారతీయ సంస్కృతి : 'హైందవి' పుస్తక సమీక్ష

    ప్రపంచ దేశాలన్నీ అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నపుడు భారతదేశంలో మహోజ్జ్వల సంస్కృతి వెల్లివిరిసింది. చీకట్లో చిరుదివ్వె కాదది. మహా ప్రకాశవంతమైన నాగరికత. ప్రపంచంలోని అన్ని దేశాలకీ ఆ సంస్కృతే, ఆ నాగరికతే దిక్సూచి అయింది. ఆ నాగరికతే దారి చూపింది. కొన్ని లక్షల సంవ్సతరాల మానవ ఇతిహాస చరిత్రలో, కొన్ని వేల సంవత్సరాల మానవ నాగరికతా ప్రవాహంలో ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో సాంఘిక వ్యవస్థలతో ప్రయోగాలు ఇవన్నీ ఫలించి, పరిఢవిల్లి, సమాజ హితం కోరే దార్శనికులు, ఆలోచనాపరులు, స్వలాభం ఆశించని భారతీయ రుషుల ఆలోచనల ఫలితంగా, భారతీయ నాగరికత రూపుదిద్దుకుంది. ఎటువంటి ప్రచార సాధనాలు లేని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని అన్ని దేశాలలో, మానవ జాతి ఉనికిలో ఉన్న ప్రతి గడ్డమీదా ఆర్ష ధర్మం ఆచరించబడింది. 'లోక స్సమస్తా సుఖినోభవన్తు' అని కోరుకుని, ప్రజలందరూ సుఖంగా ఉండేవేళ, ఆ ధర్మాన్ని కాదని, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం స్థాపించబడిన కొన్ని కొత్త మతాలు, వ్యాపార ధోరణిని అవలంభించి, లోకంలో ఉండే శాంతి సామరస్యాలను నాశనం చేసి, ప్రజల మధ్య యుద్ధాలు రెచ్చగొట్టి, అన్ని దేశాల పురాతన సంస్కృతుల్ని దారుణంగా తుడిచిపెట్టేసాయి.  కాని నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా బయటకి వస్తుంది. అది 'హైందవి' వంటి పుస్తక రూపంలో...

    హైదరాబాద్‌కి చెందిన శ్రీ ముదిగొండ ఇందుశేఖర్‌ గారి సంవత్సరాల కృషి ఫలితంగా 'హైందవి' రూపుదిద్దుకుంది. 'భారతీయ సంస్కృతి - విశ్వ వ్యాప్తం అని చెప్పుకోవడం కాదు, శాస్త్రీయంగా, సాంకేతికంగా, హేతుబద్దమైన ఉదాహరణలతో, కొన్ని వందల చిత్రాలతో, ఫోటో ఎవిడెన్స్‌లతో విశ్వం భారత సంస్కృతీమయం అని చెప్తుంది - హైందవి' అంటారు ఇందుశేఖర్‌గారు. అది నిజమే. ఏవో కొంత గాలి పోగుచేసి, మన గొప్ప మనం చెప్పుకున్నాం అనిపించుకోకుండా, నిజాయితీగా కృషి చేసి, ఆయన స్వయంగా కొన్ని, అంతర్జాలంలో వెతికి కొన్ని, స్నేహితుల ద్వారా కొన్ని విషయాలు సేకరించి, ఎంతో అమూల్య సంపదను ప్రోది చేసారు. ఇదంతా ఒక ఎత్తయితే సేకరించిన సమాచారాన్ని దేశాల వారీగా విడదీసి, ఆయా దేశాల నాగరికతను, సంస్కృతుల్ని అధ్యయనం చేసి, వాటిని ప్రాచీన ఆర్ష సంస్కృతితో తులనాత్మక పరిశీలన చేసి, పరిశోధనాత్మక వ్యాసంగా అందించిన ఇందుశేఖర్‌ గారి కృషి అభినందనీయం. కేవలం వ్యాసం వ్రాయడమే కాకుండా, ఎంతో శ్రమ కోర్చి కలర్‌ ఫోటోలను కూడా సంపాదించి, పుస్తకం మొత్తం వర్ణ రంజితంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. మరో ముఖ్యమైన విషయం... ప్రతీ వ్యాసంలోను ప్రస్తావనకు వచ్చిన విషయాలను, విశేషాలను తాను ఎక్కడి నుండి సేకరించిందీ, పుస్తకం వెనుక రిఫరెన్స్‌ల రూపంలో పొందుపరిచారు. ఏవైనా అనుమానాలు ఉన్నవారు ఆ రిఫరెన్స్‌లో చూపిన అంతర్జాల లంకెలుగాని, పుస్తక పుటల్ని గాని చూడవచ్చు.

    ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఉన్నది భారతదేశంలో కాదు, కంబోడియా దేశంలో. క్రైస్తవ మతం మూలాలు, ఇస్లాం మతం మూలాలు, అరబ్బుల, యూరోపియన్ల ప్రాచీన సంస్కృతి గురించి మనకు తెలియని ఎన్నో వివరాలు అందించారు. మనకు ప్రాచ్య దేశాలైన చైనా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, జపాన్‌ దేశాల్లో బయట పడిన ఆర్య దేవీ దేవతా విగ్రహాలు, అక్కడి పూజా మందిరాలు, ఇటలీ, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ వంటి దేశాలలో ఇప్పటికీ వాడుకలో ఉన్న ఆచారాలు, క్రైస్తవ, ఇస్లాం పూర్వపు సంప్రదాయాలు, వాటి పుట్టుక, ఆచరణ, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి సుదూర దేశాలలో కూడా భారతీయ ఆర్ష సంస్కృతి ఏ విధంగా పరిఢవిల్లిందో ఎంతో చక్కగా వర్ణించారు. ప్రాచీన సంస్కృతిని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చదవవలసిన పరిశోధనాత్మక గ్రంధం - 'హైందవి'

    పుస్తక రచయిత: ముదిగొండ మల్లిఖార్జున ఇందుశేఖర్‌ గారు, పుస్తకం సైజ్‌ : 1/8 డెమీ, పుటలు: 140 (అన్నీ మల్టీకలర్‌ పేజీలు), రచయిత    సెల్‌ నెం: 99082 21589

4 comments:

 1. తాడేపల్లిగూడెం శ్రీవాసవి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ వల్లూరి విజయ హనుమంతరావుగారి పీహెచ్ డీ అంశంలో కూడా ఈ అంశానికి కాస్త సంబంధం ఉన్నవే. ఆయన ఐరోపా దేశాల్లో క్రైస్తవానికి పూర్వం విలసిల్లిన మతాలకీ హైందవం ఆధ్యాత్మిక స్ఫూర్తిని ఎలా అందించిందో సాధికారికంగా మాట్లాడుతూంటారు. మీ టపా చదువుతూంటే ఆయనే గుర్తుకువచ్చారు.
  ఇంతకీ దీని ధర ఎంతో చెప్పలేదు?

  ReplyDelete
 2. ఎక్కడ దొరుకుతుందో వెల ఎంతో చెబితే తెప్పించుకోవాలని ఉంది.

  ReplyDelete
 3. ఈ పుస్తకం ముఖ విలువ 300 రూపాయిలు. మిగిలిన వివరాల కోసం రచయితని సంప్రదించగలరు. సెల్ నెంబర్ పైన ఇచ్చాను చూడండి.

  ReplyDelete
 4. చాలా మంచి పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. చాలా కష్టపడి వ్రాసారు.

  ReplyDelete

Note: Only a member of this blog may post a comment.