Pages

Wednesday, July 30, 2008

కొల్లేరు- కవిత- ఎస్.ఆర్. భల్లం

ఎస్. ఆర్. భల్లం గారు అన్ని కవితా ప్రక్రియల్లో పేరు మోసిన కవే గాక, చక్కని సామాజిక స్పృహ వున్న వ్యక్తి. రాష్ట్ర, జాతీయ స్తాయిల్లో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. నాకు మంచి మిత్రుడవటం చేత ఆయన కవితల్లో మచ్చుకు ఒకదాన్ని మీకు రుచి చూపిందామనే ఆలోచనతో, ఆయన రాసిన "కొల్లేరు" కవితా సంపుటిలో నుండి, ఈ కవితని మీకందిస్తున్నాను.


కొల్లేరు
ఒక ప్రవాహం కాదు
స్వార్ధం ఎరకి చిక్కిన జలపుష్పం..
ప్రకృతి విడిచిన
ఒక మౌన దుఃఖ భాష్పం...
ఎన్ని రెక్కల కష్టం కూడితే
ఈ ద్రవీభూత జీవన యానం...

కొల్లేరంటే -
తడిపొడి ఇసుక కాదు
జలచరాల పోగూ కాదు
ఆశా నిరాశల అనంత యాత్రలో
బోర్లించిన అస్తిపంజరంలో
ఇసుమంత ఆర్ధ్రత

కొల్లేరంటే -
ఒక జననం... ఒక మరణం...
వాటి మధ్య నలిగే జీవనం...

తేట నీటి నుదుటి మీద
చీటపట చినుకుల
మెరుపుల మెరుగుల్ని దిద్దుకుంటూ
తెగిపోయిన
సుజల జ్ఞాపకాల్ని ముడి వేసుకోవడానికి
సమాధుల్లోంచి లేచిన శవంలా ఉందిప్పుడు కొల్లేరు.

ఎంత విశాలంగా వుండేది
వందల మైళ్ళకి విస్తరించిన ఈ జలరాశి
ఇప్పుడది అంతరించిపోయిన మూసీ

ఈ జల మైదానాన్ని
భూ ఖండాలుగా మార్చి దురాక్రమణ చేసేవాడొకడు
అపార జలనిధిని
చెరువు ముక్కలుగా కత్తిరించి
స్వార్ధ మత్స్యాల్ని సాగు చేసేవాడొకడు
క్షణం క్షణం కుచించుకుపోతున్న
ఈ జల సంపదని కాపాడేదెవరు?

ఇప్పుడు కొల్లేరు
ఏ కలంలోనూ సిరాగా ప్రవహించదు
ప్రవహించినా
అది డబ్బు సంతకానికి పనికొస్తుంది.

ఇప్పుడు కొల్లేరు
ఏ కావ్య రచనకూ ప్రేరణ కాదు
పాత జ్ఞాపకాల్ని తవ్వి తీయడానికి
పలుగూ పారల్ని సిద్దం చేసుకొండి

ఇలా కొల్లేటిని మార్చిందెవరు.
దుర్నీక్ష్య కాంతిలో వెలిగిన కొల్లేటి సలిలం
ఇప్పుడు దుర్గంద దుర్జలంగా మారిపోయింది

"నీళ్ళ పక్కన వున్నావ్... నీకేమిటి...?" అనేవారు
నీటి గొడుగు కింద వున్నావ్... నీకేమిటి...? అనేవారు
కాని ఇప్పుడు
నిజంగా కొంప కొల్లేరయింది

ఇప్పుడిది
గ్రామాల మధ్య దూరాల్ని పెంచిన
బురద మడుగు మాత్రమే...
ఈ మడుగు ఎప్పటికయినా ముందడుగు ఔతుందా...?

Sunday, July 27, 2008

ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే (Part 2)

"పెళ్ళంటే నూరేళ్ళ పంట" అని పెద్దలు చెపుతారు. కాని "పెళ్ళంటే నూరేళ్ళ వంట" అని పెళ్ళయిన ఏ అమ్మాయిని అడిగినా చెపుతుంది. అదే పెళ్ళయిన మగవాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. "పెళ్ళంటే నూరేళ్ళ మంట" అని శెలవిస్తాడు. అది మంట అయినా, వంట అయినా, పంట అయినా గాని పెళ్ళి చేసుకున్నాక, ఆడయిన, మగయినా, కొంచెం కష్టాలు, ఇబ్బందులు తప్పవని దీని సారాంశం.

నేను మొదటి భాగంలో చెప్పింది సరిగా అర్ధం కాలేదని మహేష్ కుమార్ గారు అన్నారు. అర్ధం కాక పోవడానికి ఏమీ లేదండి బాబు. "ఎంత వారలయినా కాంతా దాసులే అని" ఎవరో కవి చెప్పినట్లు, భార్య ఎన్ని కష్టాలు పెట్టినా సగటు మధ్య తరగతి జీవి ఏమి జరగలేదన్నట్లు మొఖం పెట్టి, కాస్త చిరునవ్వు చిందిస్తాడు. నిజానికి ప్రపంచ0లో కష్టాలు పడే ఆడాళ్ళు కొద్దిమందయితే, భార్య చేతిలో తన్నులు తినేవాళ్ళే (కనీసం చేతిలో వస్తువుని భర్త మొఖం మీద విసిరికొట్టేవాళ్ళు) చాలా మంది ఉంటారు. కాకపోతే మగాడు అంటే గంభీరంగా వుండాలి కాబట్టి, జెంటిల్మన్‌లా పోజు పెట్టి, తనకు జరిగిన అవమానాన్ని కడుపులోనే దాచుకుంటాడు. కనీసం కన్నీళ్ళు కూడా కనబడనివ్వడు. బయటకు చెపితే పరువు పోతుంది, అందరు నవ్వుతారనే భయం వల్ల. పాపం పూర్ ఫెలో.


ఈ టపా మొదటి భాగంలో భార్య సినిమాకోసం కాక, చీర సెలెక్షన్ విషయంలో గొడవ పెట్టుకుంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడలాంటిదే మరో సరదా అయిన సంఘటన గురించి చెపుతాను. మధ్యాహ్న సమయం. భోజనానికి ఇంటికి వస్తాడు భర్త. కంచం దగ్గర కూర్చుంటాడు. ఆ భార్యా, భర్తల మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చూద్దాము.


"ఏమండి, కొత్త వంట ఒకటి వండాను. వడ్డించమంటారా?"

"సరే పెట్టు""ఎలా వుందండి, నా వంట?"

"చాలా బాగుందోయ్. వంట విషయంలో నా భార్య కన్నా బాగా ఎవరు చేస్తారు చెప్పు?" భర్త మెచ్చుకోలు.

"అలా కాదండి. నిజంగానే బాగుందా?"

"ఎందుకలా అడుగుతున్నావు? నిజంగానే బాగుంది"

"అందులో ఉప్పు ఎక్కువయింది కదాండి...."

కొంచెం మొహమాటపడుతూ, "అవునోయ్, కొంచెం బాగా లేదు"

"ఆ మాట ముందే చెప్పొచ్చు కదాండి"

"అది కాదు, నువ్వు బాధ పడతావని..."

"అంటే నేను బాధ పడతానని నన్ను మెచ్చుకుంటున్నారన్న మాట"

"లేదు, లేదు, నువ్వెప్పుడూ బాగా వంట చేస్తావు, ఇప్పుడు కూడా నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను గాని, లేకపోతే చెప్పేవాడిని కాదు".

"అదిగో, అంటే ఇన్నాళ్ళ నుంచి నేను బాగా వంట చెయ్యకపోయినాగాని, మొహమాటనికి మెచ్చుకుంటున్నారన్న మాట. పోనీలెండి, అంతగా మీకు ఇష్టం లేకపోతే వచ్చేటప్పుడు హోటల్ నుంచి ఏమన్నా తెచ్చుకోండి. ఇంకెప్పుడు కొత్త వంటలు చెయ్యనులేండి"

భర్త, మనసులో... "ఎరక్క పోయి బాగాలెదన్నాను. ఇంకెప్పుడయినా భోజనం చేసేటప్పుడు ఏమి మాట్లాడకూడదు".

ఇక చెప్పేదేముంది. ఆ మానవుడు భోజనం సమయంలో భార్య ముందు ఎప్పడూ నోరెత్తడు. ఏమన్నా అడిగినా తలూపి సమాధానం చెపుతాడు. దానర్ధం అవుననీ కాదు, కాదనీ కాదు. భార్య ఎలా అర్ధం చేసుకున్నా పర్వాలేదు. తనకి కడుపు నిండితే చాలు. ఒకవేళ తరువాత ఎప్పుడయినా మరో రోజు ఇంటికి లేట్‌గా వచ్చినట్లయితే, భార్యా మణి ఈ మానవుడికి భోజనం పెట్టకపోయినా బాధ పడడు. భర్త వచ్చిన విషయం కనిపెట్టిన ఆవిడగారు, "ఏమండి, నాకు కొంచెం తలపోటుగా ఉంది. నేను భోజనం చేసేసాను. కిచెన్ లో ఆ మూల అన్నం, కూరలు వున్నాయి. మీరే పెట్టుకుని తినేయండి" అంటుంది. ఇక అంతే. బుద్దిగా వెళ్ళి ఒక్కడే కూర్చుని భోజనం లాగించి, అంతే సైలెంట్‌గా వచ్చి పడుకుంటాడు సదరు భర్త గారు.

నీతి: భార్య ఎప్పుడు ఎటువంటి వంట చేసినా, భర్త దానిగురించి బాగుందనిగాని, బాగాలేదనిగాని కామెంట్ చేయకూడదు. అలాచేస్తే మొదటికే మోసం వస్తుంది.


ఇదండి సంగతి. ఇలాంటి మరో సరదా అయిన సంఘటన గురించి తరువాతి భాగంలో చదువుదాము.

Saturday, July 26, 2008

ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే (Part 1)

ఈ మధ్య సినిమాలలో ఒక విషయం స్పష్టంగా చెపుతున్నారు. హీరో తను ప్రేమించిన అమ్మాయి కోసం, తన ముచ్చట తీర్చడం కోసం అడ్డమయిన అగచాట్లు పడతాడు. అప్పటి వరకు ఆవారాగా తిరిగేసిన మన హీరో, ఎప్పుడయితే హీరోయిన్‌తో పరిచయమయిందో, ఆ అమ్మాయిని ప్రేమించానని డిసైడ్ అయిపోయేడో, ఇక చూడండి, తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నది కూడా గుర్తుకురాదు. లేదా, నక్సలైట్లలో చేరి కూడా వెనక్కి వచ్చేస్తాడు. హీరోయిన్ కోరిక తీర్చడమో, లేక ఆమెకున్న కష్టాల్ని తొలగించడానికో తన జీవితాన్నే త్యాగం చేసేస్తాడు. వచ్చీరాని తెలుగు మాట్లాడే విలన్ గాడితో ఇష్టం వచ్చినట్లు ఫైట్లు అవీ చేసేస్తాడు. చివరికి కధ సుఖాంతమవుతుంది, హీరొ, హీరోయిన్ ఒకటవుతారు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుని బయటకి వచ్చేస్తారు. ఇది మామూలుగా సినిమా కధ. అక్కడితో దీనికి శుభం కార్డ్ పడిపోతుంది.

చాలా మంది అనుకుంటున్నట్లు నిజానికి అది ముగింపు కాదు. పెళ్ళయిన తరువాతే మన హీరోకి అసలు కష్టాలు మొదలవుతాయి. మీరు గమనించారో లేదో, హీరోకి పెళ్ళయిన తరువాత ఏమి జరుగుతుంది అనే పాయింటు మీద ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క పెట్టగలరా? మీ వల్ల కాదు. పైన చెప్పిన్నన్ని కష్టాలు పడి, పెళ్ళి చేసుకున్నాక ఏ మగాడయినా సుఖ పడ్డ దాఖాలాలు వున్నాయా అని ఎవరినయినా ప్రశ్నించండి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అబ్బే అదేమి లెదండి. మేము బాగానే వున్నాము అని సింపుల్‌గా చెప్పేస్తారు. కాని, అదేదో సినిమా పాటలో చెప్పినట్లు, "మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టర్" అనే విషయం చాలా మంది పట్టించుకోరు. Don't marry - be happy అని మరో హీరో చేత చెప్పించినా దాని గురించి అసలు మాట్లాడుకోరు. వాస్తవ పరిస్తితి ఎలా వుంటుందో చూద్దాము.

చాలా ఇళ్ళల్లో ఉండేదే. నువ్వొకటంటే నేనొకటి అంటాను అనే నానుడి గుర్తుందా? అంటే భర్త అనుకున్నదానికి పూర్తి రివర్స్ లో చెయ్యడం. ఆయనకి ఏ చిరంజీవి సినిమాకో వెళదామని అనిపిస్తుంది. భార్యని రెడీ అవ్వమని చెపుతాడు. ఏ సినిమాకండి అని అడుగుతుంది భార్యామణి. చిరంజీవి సినిమాకి అని చెపుతాడు. కాదండి, మహేష్ బాబు సినిమాకి వెళదామండి, పక్కింటి పార్వతమ్మ వాళ్ళు చూసారట. చాల బాగుందట, అంటుంది. అప్పటికే ఆఫీస్ నుండి అలసి వచ్చిన ఆయనకి ఇక వాదించే ఓపిక లేక, సరేనంటాడు. ఏమి చీర కట్టుకోమంటారండి అని అడుగుతుంది.

"నీ ఇష్టమే, మంచి చీర కట్టుకో"'

"అలా కాదండి, ఎరుపు చీర కట్టుకోనా, బ్లూ శారీ కట్టుకోనా?"

"సరే, రెడ్ కలర్"

"అలా కాదండీ , బ్లూ శారీలో నేను చాలా అందంగా ఉంటానని మీరే అంటారు కదా"

"నిజమె"

"మరలాగయితే, రెడ్ అని ఎందుకు చెప్పారు, ఈ మద్యన నేను అందంగా ఉండడం మీకు ఇష్టం లేకపోతుంది"

"అది కాదే, ఏదో ఆలోచిస్తూ అన్నానులే, ఇప్పుడేమయింది? ఎందుకలా గొడవ చేస్తావు?"

"అదిగో ముందు గొడవ మొదలుపెట్టింది మీరా, నేనా?"

ఇలా గొడవ పెద్దదవుతుంది. తరువాత సినిమాకి వెళ్ళాలా వద్దా అనేది, ఆ భర్త ఓర్పు, నేర్పుల మీద ఆధార పడి ఉంటుంది. భార్యని బాగా బ్రతిమలాడుకోగలిగి, భార్య కాళ్ళో, కనీసం గడ్డమో పట్టుకోగలిగితే, అప్పటికి ఆవిడ క్షమించగలిగితే, ఆయనకి సినిమా చూసే భాగ్యం కలుగుతుంది. లేకపోతే సినిమా కాదు కదా, తన ముఖం చూసే భాగ్యం కూడా తన పతి దేవునికి అనుగ్రహించదు ఆ ఇల్లాలు.

సంసారమన్నాక, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. వాటి గురించి తరువాతి భాగంలో...

Monday, July 21, 2008

అచ్చుతప్పులా... మజాకా...

ముద్రా రాక్షసాలు.... సో కాల్డ్ ప్రింటింగ్ మిస్టేక్స్... మనిషి వ్రాత మొదలు పెట్టినప్పటినుండి తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. కాగితం మీదో, తాళ పత్ర గ్రంధంలోనో ఏదయినా ఒకటి రాసినట్లయితే ఇక దాన్ని చెరపడం కుదరదు. అందుకే హంసపాదు అనే ప్రక్రియని మన కవులు కనిపెట్టారు. అంటే రాసేసిన తరువాత, ఎక్కడయినా తప్పులు కనిపిస్తే ఎక్కడయితే తప్పులు వున్నాయో, అక్షరం వదిలేసామో అక్కడ ఒక చిన్న ^ పెట్టి, పైన ఆ అక్షరాన్ని రాయడం అన్న మాట. అక్కడ వరకు బాగానే ఉంది గాని, ప్రింటింగ్ వాడుకలోకి వచ్చిన తరువాత అసలయిన ఇబ్బంది మొదలయింది. "ఈ భాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు" అని రజనీకాంత్ సినిమాలో డైలాగ్‌లా, ఒక సారి ప్రింటింగ్ అయిపోతే, ఎన్ని కాపీలు ప్రింట్ చేస్తే, అన్ని సార్లు తప్పు చేసినట్టు. ఇక దాన్ని సరిచేసే అవకాశం ఉండదు. అందుకనే పాత రోజుల్లో ప్రతీ పుస్తకానికి వెనుక తప్పొప్పుల పట్టిక తప్పనిసరిగా ఉండేది. ఏ పేజీలో ఎక్కడెక్కడ తప్పు ఉన్నది, దాన్ని సరిగా చదవవలసిన పదం ఏమిటి అనేది ఆ పట్టికలో వివరంగా ఇచ్చేవారు. ఈ ముద్ర రాక్షసాల్లో కూడా ఎన్నో సరదా పుట్టించేవి వుంటాయి.


అందరికీ తెలిసిందే. చాలా ప్రఖ్యాతి వహించిన అచ్చుతప్పు. "రాముని తోక పివరుండు ఇట్లనియె". చదివే వారికి రాముడికి తోక వుండడం ఏమిటో, రామాయణం మొత్తం వెదికినా పివరుడు అనే పాత్ర ఎక్కడ ఉందో తెలియక జుట్టు పీక్కుంటారు. నిజానికి అది స్పేసింగ్ వల్ల వచ్చిన అచ్చుతప్పు. "రామునితో కపివరుండు ఇట్లనియె" అనేది సరయిన పదం.



మరో సందర్భంలో పాండురంగారావు గారు విజిటింగ్ కార్డ్ ప్రింటింగ్ చేయమని ఇచ్చారు. తీరా ప్రింట్ అయిన తరువాత చూసుకుంటే మధ్యలో సున్నా ఎగిరిపోయింది. పాండురంగారావు కాస్తా "పాడురంగారావు" అయింది. ఇక ఆయన మొఖం చూడాలి. ఏమి అనలేని పరిస్తితి. ఆయన మంచివాడయితే దిద్దుకుని సరిపెట్టుకుంటారు. లేకపోతే మళ్ళీ ప్రింట్ చేసి ఇవ్వడమే. ఇదే క్రమంలో రంగారావు గారు కాస్తా లంగారావుగారు కూడా అయిపోతారు. చూసే వాళ్ళకు వినోదం, ప్రింట్ చేసిన వాళ్ళకు సంకటం, చేయించుకున్న వాళ్ళకు ఇబ్బంది.


ఇక శుభలేఖల్లో అయితే ఇలాంటి అచ్చుతప్పులు చాలా వస్తుంటాయి. సహజంగా ప్రింటింగ్ ప్రెస్సు వాళ్ళు ముందుగా ప్రూఫ్ కాపీ ఇస్తారు. శుభలేఖలు ప్రింట్ చేయించుకునే వారు జీవితంలో ఒక్క సారి ప్రెస్సుకి వస్తారు. వారికి ఈ తప్పులు గురించి అంతగా అవగాహన ఉండదు. కంప్యూటర్ ఆపరేటర్ తప్పులు లేకుండా చేస్తే ఫరవాలేదు. అక్కడేమన్నా తేడా జరిగిందా, ఇక అంతే సంగతులు. అమ్మాయికి, అబ్బాయికి కూడా వరుడు అని రావచ్చు. లేదా ఇద్దరికి వధువు అని రావచ్చు. రాత్రి పెళ్ళి ముహూర్తం అయితే, ఉదయం పెళ్ళి అని ప్రింట్ కావచ్చు. లేదా, సోమవారం బదులు శుక్రవారం అని రావచ్చు. ముందు చూసుకోరు. డెలివరి తీసుకుని, అందరికి పంచడం ప్రారంభించిన తరువాత, మీలాంటి వాళ్ళు ఎవరో అది చూసి, ఇందులో ఫలానా తప్పు ఉంది అని చెబుతారు. సగంలో ఆ శుభలేఖని పంచడం ఆపుచేసి ప్రెస్సాయనకి ఫోన్ చేస్తాడు. మీరు ప్రూఫ్ చూసుకున్నారు కదా అని సమాధానం వస్తుంది. ఇక చూడండి, శుభలేఖ వేయించుకున్నాయన లబోదిబో.


రోజు లక్షల కాపీలు ప్రింట్ అయ్యే వార్తా పత్రికలది మరో గొడవ. అసలే రాత్రి వేళల్లొ కంపోజ్ చేస్తారు. కంప్యూటర్ ముందు కూర్చున్నాయన మూడ్ బాగుంటే ఫర్వాలేదు. లేదా ఏదో తప్పు దొర్లిపోతుంది. ఇక అక్కడి నుండి సవరణలు, క్షమించమని అడగడాలు. చాలా కాలం క్రితం సంగతి. ఎవరో చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో పర్యటించారు. విలేకరి క్షామ పీడిత ప్రాంతాల్లో పర్యటించారు అని రాసి పంపించాడట. మర్నాడు పేపర్లో "ముఖ్యమంత్రి గారు కామపీడిత ప్రాంతాల్లొ పర్యటించారు అని వచ్చిందట". ఇక చెప్పేదేముంది, మర్నాడు అదే చోట సవరణలు, క్షమాపణలు మామూలే.


మరో సందర్భంలో "ఉదయం"లో అనుకుంటా, జిల్లాలో తరిగిపోతున్న వృక్ష సంపద అని ఆర్టికల్ వచ్చింది. ప్రింటింగ్‌లో మాత్రం "జిల్లాలో తరిగిపోతున్న వక్ష సంపద అని వచ్చింది. అన్ని కాపీలు ప్రింట్ అయిపోయి, అందరి దగ్గరకి వెళ్ళిపోయాయి. మళ్ళీ షరా మామూలే.


ఇవన్ని ఎవరిని ఇబ్బంది పెట్టేవి కావు గాని, మొన్నటి వారం సాక్షి పేపర్‌లో జరిగిన పొరపాటు అన్నిటి కంటే పెద్ద తప్పు. నిజానికి ఎవరో ఒక సబ్ ఎడిటర్ చేసిన తప్పుకు, యావత్తు జగన్ కుటుంబమే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తెలిసి జరిగినా, తెలియక జరిగినా తప్పు తప్పే. ఈ తప్పు దిద్దలేనిది. అచ్చుతప్పులా... మజాకా...


కొత్త సామెత: కాలు జారినా తీసుకోవచ్చు. నోరు జారినా తీసుకోవచ్చు. కాని ఒకసారి ప్రింట్ చేస్తే చెరపలేము, మార్చలేము.

Saturday, July 19, 2008

ఆశ తో జీవించండి... ఎప్పటికీ....

మీరు చాలా పెద్ద కష్టంలో వున్నానని భావిస్తున్నారా... ఐతే వీళ్ళని చూడండి.


మీ జీవితాన్ని భారంగా మోస్తున్నారని భావిస్తే, ఈ వ్యక్తి కన్నా ఎక్కువ భారాన్ని మోస్తున్నారా?




మీరు చేస్తున్న ఉద్యోగం మీకు భారంగా అనిపిస్తుందా... ఈ అబ్బాయి పరిస్తితి ఏమిటి?



మీ జీతం తక్కువని అనుకుంటున్నారా... ఈ అమ్మాయి మాటేమిటి?




మీకు ఎక్కువమంది స్నేహితులు లేరని బాధపడుతున్నారా? నిజమయిన స్నేహితుడు కనీసం ఒకడయినా వున్నాడా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.





చదువుకోవడమే మీ సమస్య అయితే ఈ అమ్మాయిని చూడండి.




అందరు మిమ్మల్నినిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడితే, ఈ మనిషి గురించి ఆలోచించండి.




మీ బస్సు లేదా రైలు గురించి లోపాలు వెతుకుతున్నారా, వీళ్ళ నొకసారి చూడండి.



మీరుంటున్న సమాజం మీ పట్ల సానుభూతి చూపడం లేదనిపిస్తే, ఈమె సంగతేమిటి?



ఒక మిత్రుడు పంపించిన టపాకు తెలుగు అనువాదం చేసాను... మీ కోసం...

మీ... జగదీష్

Tuesday, July 15, 2008

ఇంగ్లీష్ భాష యొక్క సంస్కృత భాషా మూలాలు.

ప్రపంచలో అతి ప్రాచీనమయిన భాష సంస్కృతం. దేవ భాషగా ప్రసిద్ది చెందిన ఈ భాషలోనే మన మహర్షులు వేదాలు, పురాణాలు, మానవ సమాజ సంస్కృతీ వికాసానికి కావలసిని అనేక గ్రంధాలను రచించారు. ప్రపంచంలో అనేక భాషలకు తల్లి వంటిది సంస్కృతమే. ఇండొ- యూరోపియన్ భాషల్లో అత్యంత శాస్త్రీయంగా, సంపూర్ణముగా, వ్యాకరణబద్దమయిన మొట్టమొదటి భాష కూడా సంస్కృతమే. ఇంగ్లిష్ భాషలోనే కాక అనేక యూరోపియన్ భాషల్లో అనేక పదాలు సంస్కృత భాషా మూలాలకు సంబందించినవే అయి ఉంటాయి.


మానవులు సామాజిక జీవనం గడిపే తొలినాళ్ళలో మానవ సంబంధాల యొక్క పేర్లన్నీ సంస్కృత భాషలోనే ఉంటాయి. (కింద పట్టిక గమనించండి) మాత, పిత, సూన, దుహిత, ఇలా అన్ని మానవ సంబంధాలన్ని సంస్కృత భాషా సమాజంలోనే ఏర్పడ్డాయని మనకి అర్దం అవుతుంది. అసలు మనందరము మానవులం అనే మాట కూడా ఆ సమాజంలోనే ఆవిర్భవించింది. వేదాల ప్రకారం భూమిపై మనుషులందరము మనువు సంతతి. ఒక్కొక్క మహా యుగంలో ఒక్కొక్క మనువు ద్వారా మనుష్య సంతతి వ్యాపిస్తుంది. ప్రస్తుత యుగంలో వైవశ్వతుడు అనే మనువు మూలపురుషుడు. అందుకే ప్రస్తుత కాలాన్ని వైవశ్వత మన్వంతరంగా వ్యవహరిస్తారు. ఆ మనువు శబ్దం నుండి వచ్చిందే మానవ (MAN) అనే పదం.


ఇవే కాక, మనం నిత్య జీవితంలో ఉపయోగించే అనేక వస్తువుల, జంతువుల పేర్లు ఇవన్ని సంస్కృతం నుండి వచ్చినవే. ఏదయినా కాదు లేదా వద్దు అనే విషయాన్ని సూచించదానికి ఇంగ్లిష్‌లో No అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు. అది సంస్కృతంలో "న" అనే శబ్దం యొక్క రూపాంతరం. వ్యతిరేక అర్ధాన్ని సూచించేలా మనం వాడే Non- Un అనేవి కూడా వ్యతిరేక పదాలే. ఉదాహరణకు అభయం అంటే భయం లేక పోవడం. న+భయం= అభయం అయింది. un-expected అనే పదాన్ని తీసుకోండి. న+ ఆపేక్షిత = అనాపేక్షిత.


ఇవే కాక కొన్ని ముఖ్యమయిన పదాలు వాటి సంస్కృత మూలం కింద పట్టికలో ఇచ్చాను. ఇంగ్లిష్ భాష అంతా సంస్కృతం నుండి వచ్చింది అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గాని, ప్రస్తుతం మనం చూస్తున్న సమాజ మౌలిక నిర్మాణం అంతా ఒకే భాషా, సాంస్కృతిక కుటుంబానికి చెందిందని భావిస్తున్నాను. వసుదైక కుటుంబం అనే మాటకి అర్ధం ఇదేనేమో. (All universe is one family)

ఇంగ్లీష్ - సంస్కృతం - తెలుగు
Mother - మాతృః - అమ్మ

Father - పితృః - నాన్న

Brother - భ్రాతః - అన్న/ తమ్ముడు

Sister - సహోదరి - అక్క/ చెల్లి

Son - సూన - కుమారుడు

Daughter - దుహిత - కుమార్తె

Man - మానవ - మానవుడు

Name - నామ - పేరు

Three - త్రయ - మూడు

Decimal - దశ - పది

Door - ద్వార - తలుపు

Divine - దివ్య - దైవ సంబందమయిన

Path - పథ - దారి

Dental - దంత - దంతము

Nerve - నర - నరము

Tree - తరు - చెట్టు

Me/my - మై - నేను

Naval - నావ - నౌక/ఓడ

Heart - హృద్ - హృదయము/ గుండె

Cruel - కౄర - కౄరమయిన

Location - లోక - లోకము/ప్రదేశము

Axis - అక్ష - అక్షము

Yes - అసి - నిజం

No - న - లేదు/కాదు

Hunt - హంత - చంపు

Vehicle - వాహన్ - వాహనం

Mouse - మూషక్ - ఎలుక

Owl - ఔల్యూక - గుడ్లగూబ

Saturday, July 12, 2008

పాడుబడ్డ ట్రాక్ పై పతకాల కోసం పరుగు... ఒక గీత కధ.


గీత... అచ్చమయిన పదహారణాల తెలుగమ్మాయి... ఎన్నో పోటీల్లో దేశ ఖ్యాతి ఇనుమడింపచేసిన అమ్మాయి. పతకాల ట్రాక్ పై అలుపుసొలుపు లేకుండా పరిగెడుతూ, వెనక్కి తిరిగి చూసుకోని మంచి అమ్మాయి. పచ్చని పశ్చిమ గోదావరిలో పుట్టి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో పతకాలు తెచ్చి, ఇపుదు బీజింగ్‌లో జరుగబోయే ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించుకొస్తామని చెప్పిన గీత ఆత్మ విశ్వాసం వెనుక ఎంత కఠోరమయిన శ్రమ ఉందో, తెలుగుకోవాలంటే ఈనాడు నిన్నటి సంచిక చూడండి. లేదా ఇక్కడ క్లిక్కండి.

విశాలమయిన మైదానం.... అత్యుత్తమ సింధటిక్ ట్రాక్... అధునాతన హాస్టల్... అత్యున్నత ప్రమాణాలతో హాస్పిటల్... టెక్నో జిం ... స్విమ్మింగ్ పూల్... సైంటిఫిక్ లాబొరాటారీ, విదేశాల్లో ఒలింపియన్ల శిక్షణ కోసం అందుబాటులో ఉండే సౌకర్యాలివి. స్పాన్సర్లు... పర్యవేక్షకులు అదనం. మరి మనలో ఒకరిగా.. మన మధ్యే ఉంటోన్న సత్తి గీత ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించింది? ఎలాంటి వసతులు ఆమెకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుంటే తొలుత ఆశ్చర్యం... తర్వాత ఆవేదన.... చివరికి ప్రేరణ కలుగకమానదు. (పూర్తి పాఠం ఈనాడులో....)

మన దేశానికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణమయిన గీత పట్ల ప్రభుత్వ వైఖరి నిజంగా గర్హనీయం. నేను తనతో మాట్లాడిన ప్రతీ సారి, ప్రతీ పోటీలో పాల్గొనే ముందు, మన రాష్ట్రంలో క్రీడాకారుల పట్ల (క్రికెట్, టెన్నిస్ వంటి కొన్ని క్రీడల్ని మినహాయిస్తే), రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల చాల బాధగా మాట్లాడేది. శిక్షణ కోసం ఎలంటి సౌకర్యాలు కలిగించకుండా, ఎటువంటి అండదండలు అందించకుండా, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు తేవాలని ఆశించడం దురాశే అవుతుంది. కాని గీత మాత్రం తన శక్తికి మించి పరిగెట్టి మనదేశానికి పతకాలు సాధించాలని భగవంతుని ప్రార్ధించడం మినహా ఇంకేమి చేయగలము?

Wednesday, July 9, 2008

పశ్చిమ దేశాలకీ మనకీ మధ్య సాంస్కృతిక వైరుధ్యాలు.

ప్రాచీన కాలం నుండి భారత దేశం తనదయిన ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంది. భారతీయుల జీవన విధానం, ప్రకృతికి అనుగుణంగా వారు నిర్మించుకున్న తమదయిన ప్రత్యేక జీవన శైలి, అప్పటి పశ్చిమ దేశాల్లో ప్రజలని భారత దేశం వైపు ఆకర్షితమయ్యేలా చేసింది. చరిత్రకందని కాలం నుండి ఇప్పటి వరకు భారతీయ సంస్కృతి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకుంటూ, అనేక రకాలయిన ప్రజలు, వివిధ రకాలయిన భాషలు, భిన్న రకాలయిన వాతావరణం ఇవన్ని కలసి మన దేశానికి ఉపఖండం అనే పేరుని సార్ధకం చేసాయి. ఇంత వైవిధ్యమయిన దేశం ప్రపంచంలో మరెక్కడ ఉండదనడం అతిశయోక్తి కాదు. ఇన్ని రకాలయిన వైరుధ్యాలున్నప్పటికీ, అందరమూ ఒకే దేశంగా కలిసే ఉంటాము. దీనికి మూల కారణం మనందరి ఆలోచనల్లో వున్న పాజిటివ్ థింకింగ్. మనం చేసే ఏ పనయినా ఇతరులకు నష్టం కలిగించకూడదనే చూస్తాము. అదే సమయంలో ప్రకకృతికి దగ్గరగా ఉండేలా చూసుకుంటాము. దానివల్ల వ్యక్తిగా ప్రతీ ఒక్కరు సుఖంగా ఉంటారు, ప్రకృతికి హాని చేయ్యకుండాను ఉంటారు.


మా నాన్నగారు ఎప్పుడూ పుట్టిన రోజు ఫంక్షన్లకి గాని, మరే సందర్భంలోనూ కాండిల్స్ ఆర్పడం వంటివి చేయించరు. దీపాలార్పడం మన సంస్కృతి కాదురా అని అంటారు. "తమసోమా జ్యోతిర్గమయా" అనేది ఆయన సిద్ధాంతం. ఆయన మాటలు నాలో బలమయిన ముద్ర వేసి, పాశ్చాత్య దేశాలకి, మనకీ మధ్య వున్న తేడాల గురించి ఆరా తీయడం మొదలు పెడితే, ఎన్నో కొత్త విషయాలు ఆలోచనల్లోకి వచ్చాయి. మీరే చదవండి.


1. పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటి అన్ని సందర్భాలలో వాళ్ళు దీపం (candle) ఆర్పుతారు. మనం దీపారాధన చేసిగాని ఏ పనీ కూడా మొదలుపెట్టం.

2. మనం ఏ పని మొదలుపెట్టేప్పుడయినా, నిర్మించడం లేదా కట్టడంతో ప్రారంభిస్తాము. తాళి కడతాం, సంఖుస్తాపన చేసి ఇల్లు మొదలుపెడతాము. కాని వాళ్ళు మాత్రం తెంచడంతో మొదలుపెడతారు. పుట్టిన రోజ్కి కేక్ కటింగ్, ప్రారంభొత్సవానికి రిబ్బన్ కటింగ్ అలాంటివే.

3. ఎవరయినా ఎదురయితే మనం రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తాము. అదే వాళ్ళయితే shake hand ఇస్తారు. అవతలి వ్యక్తి చేతికి ఎమున్నాగాని అది మన చేతికి అంటుకుపోవలసిందే. రక రకాల రోగాలు చేతి స్పర్శ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

4. ఆత్మీయులు చనిపోయినప్పుడు, విషాద చిహ్నంగా పువ్వులను పార్ధివ శరీరం మీద పెడతారు వాళ్ళు. మనం పుష్పాలను పవిత్రంగా ఎంచి దేవునికి మాత్రమే సమర్పిస్తాము. శుభ కార్యాలలో వాడుతాము.

5. ఏ స్త్రీనయినా గౌరవించే సంప్రదాయం మనది. తెలియని అమ్మయిగాని, మహిళగాని కనిపిస్తే, గౌరవంగా "అమ్మ" అని సంబోధిస్తాము. తల్లితో సమానమయిన స్థానం కల్పిస్తాము. పాశ్చాత్యుల దృష్టిలో బయటి స్త్రీ ఎవరయినా ఒకటే. తన భార్యతో సమానం.

6. మనది అందరి సుఖం కోరే సంస్కృతి. "సర్వే జనాస్సుఖినో భవంతు". అంటే, లోకంలో అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంతాము. వాళ్ళు ఎప్పుడూ పరాయి దేశాన్ని ఎలా కొల్లగొట్టాలా అని అలోచిస్తూంటారు. (ప్రపంచ యుద్ధాలన్ని పాశ్చాత్య దేశాల వారి వల్లే వచ్చినవి.)

7. మనకుంటే ప్రక్కవాడికి సాయం చెయ్యాలనే ఆలోచన మనది. ప్రక్క వాడితో కూడా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనె ధ్యేయం వాళ్ళది. (భారతీయులెవరూ తాము కనిపెట్టిన వాటితో వ్యాపారం చెయ్యాలని అనుకోలేదు. కాని పడమర దేశాల నుండి కేవలం వ్యాపారం చెయ్యాలనే మన దేశానికి వచ్చారు.)

8. మనది ఆధ్యాత్మిక సంబంధమయిన ఆలోచనలయితే, వాళ్ళది పూర్తి వస్తుగత ఆలోచన. (మన వాళ్ళు వేదాలు రచించారు. భగవంతుడి గురించి ఆలోచించారు. అదే సమయం లో వాళ్ళు పిరమిడ్లు కట్టారు).

9. మనం ప్రకృతిని తల్లిలా భావిస్తాము. మనం పొందే ప్రతి ఉపకారానికి దైవంతో సమానంగా పూజిస్తాము. సూర్యుడు, భూమి, నదులు, చెట్లు ఇలా ఒకటేమిటి, అన్నిటిలోను దైవాన్ని చూస్తాము. కాని వాళ్ళ దృష్టిలో అవన్ని మనుషుల స్వార్ధం కోసం ఉపయోగపడేవి, పరిశోధనకి ఉపయోగపడే వస్తువులు మాత్రమే. మనం ప్రకృతిని ప్రేమిస్తాము, వాళ్ళు కామిస్తారు. అంతే తేడా.

10. మనం మనకి పాలిచ్చే ఆవుని గోమాతగా, తల్లికి ప్రతిరూపంలా భావిస్తాము, పూజిస్తాము. వాళ్ళు అదే ఆవుని తెగనరికి 'బీఫ్' పేరుతో లొట్టలేసుకుంటూ తింటారు.

ఇలా చెప్పుకుంటే పోతే చాలా విషయాలున్నాయి. మరో టపాలో వివరించే ప్రయత్నం చేస్తాను.

చివరిగా ఒక మాట: సాంస్కృతిక పరంగా ఎన్ని రకాలయిన వైరుధ్యాలున్నా, పాశ్చాత్యులలోని నిజాయితీ, శ్రమిచే తత్వం, అనుకున్న సాధించే వరకు నిద్రపోని నైజం, వస్తువు నాణ్యత విషయంలో ఎక్కడా రాజి పడని గుణం, ఇవన్ని నాకు నచ్చుతాయి.

Monday, July 7, 2008

మమ్మీ, డాడీ వద్దు.... అమ్మా, నాన్నే ముద్దు. (దయచేసి తెలుగుని కాపాడండి)

అమ్మ పిలుపులోని కమ్మదనం, నాన్న అనే పిలులోని ఆత్మీయత తెలుగులో ప్రతిఫలించినట్లుగా మరే భాషలోనీ కనిపించవు. మనందరం తెలుగు వాళ్ళము కాబట్టి, చిన్నప్పటి నుండి తెలుగులోనే మాట్లాడుతూ, ఆ మాధుర్యం మనం అనుభవించాము కాబట్టి మనకలాగే అనిపిస్తుంది. కాని ఈ తరం పిల్లలు ఏం పాపం చేసారని, వాళ్ళని చక్కటి తెలుగు భాషకి దూరం చేస్తున్నాము? కేవలం మమ్మి, డాడీ పిలుపులతోనే కాకుండా, కంటికి కనబడిన ప్రతీ వస్తువుని, మనతో మాట్లాడే ప్రతి మాటనీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలని పట్టుబట్టే తల్లిదండ్రులకు కొదవ లేదిప్పుడు. మనకంటూ ప్రత్యేకంగా ఒక సంస్కృతి, భాష, సంప్రదాయం ఉన్నాయి కదా. వాటిని వదిలేసి, ఎక్కడిదో అయిన పరాయి భాష కోసం ప్రాకులాడడం చూస్తే చాలా బాధగా ఉంది. మన తెలుగువాళ్ళ మీద ఒక జోక్ ఉంది. ఇద్దరు తెలుగువాళ్ళు కనబడితే వాళ్ళు తెలుగులో పలకరించుకోరట. ఇంగ్లీష్‌లో మాట్లాడితే అదేదో పెద్ద గొప్పయినట్టు. అదే తెలుగులో మాట్లాడితే చిన్నతనంగా ఫీల్ అయిపోతూంటారు చాలా మంది.


ఈ మధ్యన ఒక స్కూలుకి వెళ్ళాను. అక్కడ ఒక చిన్న కుందేలు ఉంది. చుట్టు చిన్నపిల్లలు మూగి దాన్ని వింతగా చూస్తున్నారు. అక్కడే ఉన్న చిన్న పాపని సరదాకి, "పాపా, కుందేలు చాలా బాగుంది కదమ్మ" అని అడిగాను. ఆ అమ్మాయి నా వంక విచిత్రంగా చూసింది. తనకి అర్ధం కాలేదు అనుకుంటా. "కుందేలు" అంటే ఏమిటి అంకుల్ అంది. నాకు ఒక్కసారే నోట మాట రాలేదు. అదేనమ్మ, ఇది కుందేలు కదా అన్నాను. లేదు అంకుల్, ఇది rabit అని సమాధానం చెప్పింది. వెంటనే అక్కడ ఉన్న పిల్లలందరు, దీన్ని rabit అంటారండి అన్నారు. ఒక్కసారిగా. నాకేమిచేయాలో పాలుపోలేదు. అంటే వారు కుందేలు అనే పదానికి దూరమయిపోయారు. నాకు అనుమానం వచ్చి అక్కడ వున్న చెట్టుని చూపించి అదేమిటమ్మా అని అడిగాను. Tree అని సమాధానం వచ్చింది. అంటే ఆ చిన్ని బుర్రలకి కేవలం తెలుగులో వాడే క్రియలు తప్ప మిగిలిన నామవాచకాలన్ని (nouns) ఇంగ్లిష్ మయం అయిపోయాయి.


దీనికి ప్రధానంగా చాలా కారణాలు కనబడుతుంటాయి. మొదటిది ఇంగ్లిష్ బాగా వస్తే ఉద్యోగాలు తొందరగా వస్తాయనేది. వాస్తవ పరిస్తితిలో కూడా ప్రపంచంలో మన వారు అన్ని రంగాలలోను బాగా రాణిస్తున్నారంటే ఇంగ్లిష్‌లో తగినంత పరిజ్ఞానం ఉండడం వలనే. బ్రతకడం కోసమే చదువు అనే భావన ఇప్పుడు బాగా స్తిరపడిపోయింది. చదువు విజ్ఞానం కోసం కాదు. ఒక ఉద్యోగం సంపాదించుకుని హాయిగా బ్రతకడానికి. దీనిలో వాస్తవం వున్నప్పటికీ, మనదయిన భాషా మూలాలని మరచిపోవడం చాలా బాధాకరం.


ప్రపంచంలో ఎన్నో భాషలకి లేని విశిష్టతలు తెలుగు భాషకి ఉన్నాయి. ప్రపంచంలోని ఏ భాషలోని కష్టమయిన పదాన్నయినా వుచ్చారణా దోషాలు లేకుందా పలకగలగడం తెలుగు వచ్చినవారు మాత్రమే చేయగలరు. అలాగే ఎంతటి సంక్లిష్టమయిన శబ్దాన్నయినా తెలుగులో స్పష్టంగా వ్రాయవచ్చు. అంత చక్కటి వర్ణమాల, వ్యాకరణం తెలుగు భాష సొంతం. అందుకే తెలుగుని Italian of the East అని అంటారు. కన్నడ, తెలుగు, సంస్కృత భాషల్లొ సమాన పండిత్యం కలిగిన శ్రీకృష్ణదేవరాయలు "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్నాడు. ప్రపంచంలో మరే భాషలోనూ లేని పద్యం, అవధానం, హరికధ, బుర్రకధ వంటి సాహితీ ప్రక్రియలు తెలుగు భాషకే సొంతం. అంతటి ప్రాముఖ్యం ఉన్న తెలుగు భాషని అంతరించిపోయే భాషల్లో చేర్చేసేలా వున్నారు ఇప్పటి పరిస్తితి చూస్తుంటే.

ప్రైవేట్ స్కూళ్ళు, కాన్వెంటులు వచ్చిన తరువాత పరిస్తితి మరింత దిగజారింది. తల్లిదండ్రుల ఆదూర్ధాని క్యాష్ చేసుకోవడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ, జాయిన్ అయిన వెంటనే "అ, ఆ"లతో కాకుండా, A,B,C,D లతో అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తున్నారు.


మీడియాలో కూడా యాంకరింగ్ పేరిట తెలుగు భాష ఎంత ఖూనీ అయిపోతుందో చూస్తూనే ఉన్నాము. ఎంత వయ్యారాలు పోతూ, తెలుగుని ఎన్ని రకాలుగా ఖూనీ చెయ్యవచ్చో అన్నిరకాలుగా చేసి మాట్లాడే వారు గొప్ప యాంకర్లుగా చెలామణి అయిపోతున్నారు. సినిమాల సంగతి చెప్పనక్కర్లేదు. ఇతర భాషల్లోని హీరోయిన్లని, విలన్లని దిగుమతి చేసుకుని, వారిచేత వచ్చీరాని తెలుగులో డబ్బింగ్ చెప్పించుకుని, వారు తెలుగుని నానా రకాలుగా హింసిస్తుంటే, విని ఆనందించేస్తుంటాము. తెలుగువారి ఆత్మాభిమానం ఎక్కడికి పోయిందో అర్ధం కాదు.


ఈ విషయంలో నా సలహా ఒకటే. మీ పిల్లలకి ఇంగ్లిష్ నేర్పండి. తప్పులేదు. కాని తెలుగుని దానికోసం బలి చేయవద్దు. గాంధీ గారు చెప్పినట్లు, "మాతృ భాషలో తగినంత పరిజ్ఞానం ఉంటే, ఆ వ్యక్తి మిగతా అన్ని భాషల్నీ తేలికగా నేర్చుకోగలుగుతాడు. A scientific knowledge of one language makes the knowledge of other languages comparatively easy. - Mahatma Gandhi. ముందు మాతృ భాషలో అంటే మనం ఇంటిలో మాట్లాడుకొనే భాషలో "అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, మమ్మ, తమ్ముడు, చెల్లి" ఇలా అన్ని తెలుగు పదాలు నేర్పించండి. కొంచెం పెద్దయ్యాకా, తన మాతృ భాషపై పూర్తి పట్టు సాధించాక, అప్పుడు ఇంగ్లిష్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ భాషనయినా ఇట్టే నేర్చుకుంటాడు. తేనెలూరు తెలుగు బాష సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించగలుగుతాడు.

Sunday, July 6, 2008

తిరుమల శ్రీనివాసుడి నగలని ప్రదర్శనకి ఉంచాలనుకోవడం భావ్యమేనా?


హిందువులకి, ముఖ్యంగా ఆంధ్రులకి తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడితో ఉన్న అనుబంధం చాలా గట్టిది. ఆయన నామస్మరణతోనే రోజు మొదలుపెట్టేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అందరి జీవితాల్లొ అంతటి ప్రాముఖ్యత వున్న శ్రీనివాసుడికి సంబందించిన ఏ వార్త అయిన, అయన పట్ల ఎవరు తీసుకునే నిర్ణయమయినా ఎంతో మందిపై ప్రభావం చూపుతుంది అంటే అతిశయోక్తి కాదు. శ్రీ వేంకటేశ్వరుడికి చెందిన ఆభరణాలను ప్రదర్శనకు వుంచాలనుకోవడం కూడ అలాంటి నిర్ణయమే.


అసలు విషయం చెప్పే ముందు నాకు తెలిసిన ఒక చిన్న సంఘటన గురించి చెపుతాను. చాన్నాళ్ళ క్రితం, నా స్నేహితుడు తన పెళ్ళి కోసమని శుభలేఖలు ప్రింట్ చేయించుకున్నాడు. తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని, స్వామి పాదాల దగ్గర ఆ శుభలేఖని ఉంచి, పూజ చేయించి, తరువాత అందరికీ పంచాలని తన ఆలోచన. అదెంతో కష్ట సాధ్యమయిన పనయినాగాని. వెంటనే తిరుపతికి వెళ్ళి, మొత్తం మీద స్వామి వారి పాదాల చెంత తన శుభలేఖని పెట్టించుకోగలిగాడు. పూజ ముగిసిన తరువాత, ఆ శుభలేఖని తిరిగి తీసుకుని వస్తుంటే, అక్కడ వున్న భక్తులు దేవుడిని తాకిన శుభలేఖని అత్యంత పవిత్రమయినదిగా ఎంచి, ఒక్క సారయినా ఆ శుభలేఖని ముట్టుకోవాలని ఒకేసారి ఎగబడ్డారట. వారి నుంచి తప్పించుకుని, జాగ్రత్తగా బయటకి వచ్చి చూసుకునేసరికి, తన చేతిలో శుభలేఖ తాలూకు చిన్న ముక్క మాత్రమే మిగిలిందట. దాన్నే అమూల్యమయిన ప్రసాదంగా భావించి తన పూజ గదిలో పెట్టుకూన్నాడనుకోండి. అది వేరే విషయం.


విషయమేమిటంటే, భగవంతునికి సంబంధించినది ఏదయినా, అది అత్యంత పవిత్రమూ, విలువయినది కూడా. సర్వాలంకార భూషితుడయిన శ్రీనివాసుని చూడడానికి ఎంతో శ్రమకోర్చి, ఎన్నో రోజులు ప్రయాణం చేసి భక్తులు వస్తారు. అంటే ఆయనకు అలంకారం చేసినవి కూడా ఆయనలో భాగమే. ఒక్కసారి ఆయనకు అలంకరించిన తరువాత ఏ ఆభరణమయినా, నగయినా అది భక్తులకి అత్యంత పవిత్రమయినది. అటువంటి నగలని, ఏ నిజాం నగలనో, కోహినూర్ వజ్రాన్నో పెట్టినట్టు ప్రదర్శనకు పెడితే, అది ఎంతో మంది మనోభావాలను దెబ్బ తీస్తుంది. పైగా దేవుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఒక పవిత్రమయిన ఉద్దేశ్యంతో, భక్తి భావంతో వెళతారు. కాని బయట ప్రదర్శనకు ఉంచిన ఆభరణాల విషయంలో అలా కాదు. అందుచేత, దేవునికి సంబందించిన విషయాలలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండ, టి.టి.డి. వారు తగు జాగ్రత్తలు తీసుకుని మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే ఉత్తమం.

ఇప్పుడు టి.టి.డి.వారు శ్రీనివాసుని నగలని ప్రదర్శనకు ఉంచకూడదని నిర్ణయం తీసుకోవడం ఏంతయినా అభినందించదగ్గ విషయం.

Saturday, July 5, 2008

మహిళా విలాపం

నీవు పుట్టక ముందే

అవనిపై అడుగుపెట్టక ముందే

అబార్షన్ పేరిట నీ ప్రాణాలు తీసే

రాక్షస కృత్యం మొదలవుతుంది

స్కానింగ్ మాయా దుర్భిణిలో చూసి

లోపల వున్నది నీవేనని తెలిసిన మరుక్షణం

కసాయి కత్తులు నీపై స్వైర విహారం చేస్తాయి

లోకం తెలియని పాపవయినా కనికరించదీ లోకం

జన్మనిచ్చే జనని సైతం

తానూ ఒక స్త్రీనని మరచిన క్షణం

నీపై నీకె కలిగేను ఏహ్య భావం



పాలుగారు బుగ్గల పసిదనం వీడకముందే

లోకం తీరు నీకు పూర్తిగా తెలియకముందే

కామంధుల కళ్ళు నీపై దాడి చేస్తాయి

చూపులతోనే నీ హృదయాన్ని గాయపరుస్తాయి

మాటలతోనే మనస్సుని ముక్కలు చేస్తాయి

ప్రేమ పేరుతో నీకు సమాధి కట్టడానికి

ప్రతీ క్షణం వేచి వుంటాయి తోడేళ్ళ గుంపులు



కాళ్ళ పారాణి ఆరకముందే

కమ్మని కలలు నిజమవకముందే

కట్న పిశాచి ఎదురవుతాడు

ఆశలన్నీ చిదిమేసి

అనుక్షణం నరకం చేసి

నీ జీవితంతో ఆడుకుంటాడు

మనసే లేని "అతడు"



ఎక్కడమ్మా, మీ స్త్రీ జాతికి విముక్తి

ఏమయిందమ్మ మీలో వున్న ఆ శక్తి

ఎదిరించి పోరాడితేనే మీకు మోక్షం

అలా చేసి అందరికీ కావాలి ఆదర్శం

Friday, July 4, 2008

చందమామ మొదటి సంచిక ఎప్పుడయినా చూసారా?

60 సంవత్సరాల క్రితం మన తెలుగు వాళ్ళయిన నాగిరెడ్డి, చక్రపాణి గార్లు చిన్నపిల్లల కోసం ఏదయినా చెయ్యాలనే సంకల్పంతో దివిలో నుండి చందమామను దింపి భువిలో చందమామగా నామకరణం చేసి చక్కటి పిల్లల కధల పుస్తకం ప్రారంభించారు. కేవలం చిన్నపిల్ల కోసం మాత్రమే కాక, పెద్దలకు, అన్ని వయసుల వారికీ ఉపయోగపడె ఎన్నో నీతి కధలు, అందరికీ అర్ధం అయ్యే విధంగా పురాణ కధలు చందమామలో వుంటాయి.


నా మట్టుకు నేను కూడా చందమామ ఫ్యాన్‌నే. నేనే కాదు, మా ఇంటిలో తాత గారి దగ్గర నుండి, నాన్నగరు, నేను, అందరము చందమామ అభిమానులమే. మా ఇంటిలో చందమామ పాత సంచికలన్నీ చక్కగ బైండింగ్ చేసి వుంటాయి. తెలుగు భాష మీద అభిమామనం, కావలసినంత పట్టు కావాలంటే చందమామ చదవాల్సిందే.
కాని 1960కి ముందున్న చందమామ సంచికలు ఎలా వుంటాయో తెలుసుకోవాలన్న కుతూహలం నాలో ఉండేది. కాని www.chamdamama.com చూసాకా ఆ బెంగా తీరిపోయింది. చందమామలో ప్రస్తుతం ప్రచురితమవుతున్న కధలతో పాటుగా, 1947 నుండి 1960 వరకు అన్ని సంచికలనీ pdf ఫార్మాట్లో వుంచారు. మనకు కావలసిన సంవత్సరం, నెల ఎన్నుకొంటే, వెంటనే ఆ సంచిక కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది.


అన్నిటికంటే చక్కని విషయం ఏమిటంటే, కధలతో పాటుగా, ఆ రోజుల్లో ప్రచురితమయిన ప్రకటనలతో సహా pdf లోకి మార్చడం జరిగింది. 1956 నాటి సంచికలో మాయాబజార్ సినిమా ప్రకటన చూడగానే కాల యంత్రంలో ఒకే సారి వెనక్కు వెళ్ళిపోయిన అనుభూతిని చెందాను. మీరూ ఈ అనుభూతిని సొంతం చేసుకోవాలంటే, తప్పకుండా ఆ websiteని సందర్శించండి.
సైట్ చిరునామా: http://www.chandamama.com/telugu/

Wednesday, July 2, 2008

పెన్ డ్రైవ్ లేదా మెమరీ చిప్‌లలో వైరస్‌ని క్లీన్ చేయడం ఎలా? (యాంటీ వైరస్ అందుబాటులో లేనపుడు)

ఈ మధ్యన పెన్ డ్రైవ్‌ల ద్వారా, మెమరీ చిప్‌ల ద్వారా వైరస్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి Rose.exe or regsvr.exe. పెన్ డ్రైవ్ లేదా మరేదైనా రిమూవబుల్ డ్రైవ్ పెట్టగానే windows XP Operating Systemలో కొన్ని ఆప్షన్స్‌తో కూడిన ఒక బాక్స్ వస్తుంది. దానిని OK చేయకుండా, cancel చెయ్యాలి. తరువాత, Windows key + R ప్రెస్ చేసి, Run బాక్స్ లో cmd అని టైప్ చేయాలి. DOS Prompt వస్తుంది. అక్కడ type x:\autorun.inf అని టైప్ చేయండి. ఇక్కడ x అంటే మీరు వైరస్ ఉందో లేదో చూడవలసిన డ్రైవ్ అన్న మాట. వైరస్ ఉన్నట్లయితే, అక్కడ autorun = rose.exe అనో మరొకటో వస్తుంది. సాధారణంగా వైరస్ file names మార్చుకుంటు ఉంటుంది. autorun ఎదురుగా ఏ file name ఉందో చూసి, అదే file nameను searchలో టైప్ చేసి, చూసినట్లయితే, ఆ ఫైల్ pen driveలో కనిపిస్తుంది. మీరు ఎప్పుడయితే డ్రైవ్ మీద double click చేసారో, మరుక్షణం వైరస్ మీ కంపూటర్ మీద దాడి చేస్తుంది. అ ఫైల్‌ను వెంటనే delete చెయ్యాలి. మీరు delete చేసిన ఫైల్స్ కాకుండా, మరొక ఫైల్ మీ డ్రైవ్‌లో ఉండిపోతుంది. అదే autorun.inf దీన్ని delete చెయ్యకపోతే మీ డ్రైవ్‌ని double click చేసినా అది open అవ్వదు. error message కనిపిస్తుంది.

autorun.inf ఫైల్‌ని delete చెయ్యడం గురించి:

ముందుగా notepadని open చెయ్యండి.
అక్కడ ఏమి టైప్ చేయకుండ, file - Save as అని select చేయండి.
file name దగ్గర autorun.inf అని టైప్ చేసి, కింద file type అనే చోట all files అని select చెయాలి.
కొత్త ఫైల్‌ని desktopమీదకు save చెయ్యండి.
ఇపుడు save బటన్ నొక్కండి.మీ desktop మీద autorun.inf ఫైల్ ఉంటుండి.
ఆ ఫైల్ ని copy చేసి, మీ drive మీద right clickచేసి paste అని select చేయండి.
file replace చెయ్యమంటారా అనే బాక్స్ వస్తుంది.
yes అని క్లిక్ చేయండి.
ఇపుడిక నిరభ్యంతరంగా మీ pen drive లేదా, memory chipని వాడుకోవచ్చును.

ఈ వైరస్ ని norton Antivirus క్లీన్ చెయ్యలేక పోయింది. quick heal 2008 అయితే బాగానే పనిచేస్తుంది అనుకొంటున్నాను.

గమనిక: ఇది నా సొంతంగా కనిపెట్టిన పద్దతి. Anti virus అందుబాటులో లేనప్పుడు ఈ పద్దతిలో వైరస్‌లటొ మనం పోరాడవచ్చు. ఇంతకన్నా మరింత మెరుగ్గా మరో పద్దతి ఉన్నట్లయితే నాకు చెప్పగలరు.

Tuesday, July 1, 2008

పిల్లలతో అర్ధనగ్న డాన్స్‌లా... హవ్వ

ఈ మధ్యన ఏ టి.వి. చానల్ చూసినా, డాన్స్ బేబి డాన్స్ అనో, డాన్స్ హంగామా అనో పేరు ఏదయితేనేనేం, పిచ్చి పిచ్చి డాన్స్ ప్రోగ్రాములు వెల్లువెత్తుతున్నాయి. పెద్దవాళ్ళవరకు అయితే పరవాలేదు కాని, మరీ దారుణంగా చిన్నపిల్లలచేత కూడా అర్ధ నగ్నంగా ఎబ్బెట్టు కలిగేలా డాన్సులు చేయిస్తున్నారు. కనీసం వారు డాన్స్ చేసే పాటలకు అర్ధం కూడా తెలియకపోయినా, ఆయా సినిమాలలో హేరో, హేరోయిన్లను అనుకరిస్తూ వారు చేసే చేష్టలు చూస్తుంటే జాలి, కోపం ఒకే సమయంలో కలుగుతున్నాయి. ఎక్కడయినా పల్లెటూరిలో రికార్దింగ్ డాన్స్ జరిగితె పత్రికలు, మీడియా, పోలీసులు దాన్నో పెద్ద తప్పుగా చిత్రీకరిస్తారు. అవి చేసేవాళ్ళు పొట్ట కూటి కోసం చేస్తున్నాగాని. ఇక్కడ వాళ్ళని సమర్ధించడం నా ఉద్దెశ్యం కాదు గాని, అదే తప్పు బహిరంగంగా రాష్ట్రమంతటా అనేక కోట్ల మంది చూస్తుండగా ప్రసారం చేయడం నిజంగా తప్పే. పైగా అదేదో గొప్ప పనిలా ఆ పిచ్చి గంతులలో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు అంటు కొలతలొకటి.

అన్నిటికంటే దారుణమయిన విషయం ఏమిటంటె తల్లితండ్రులు కూడా తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదు కాని, తమ పిల్లలని ఇలాంటి ప్రోగ్రాములకి ఎందుకు పంపుతున్నరో వారికే తెలియాలి. కన్న బిడ్డలకి అలాంటి చెత్త డ్రెస్సులు వేసి, పనికిమాలిన డాన్స్ (?) నేర్పించి అందరి ముందు పరువు పోగొట్టుకోవడానికి ఎందుకు పంపుతారో తెలియదు. మనకంటూ ఒక ప్రత్యేకమయిన సంస్కౄతి ఉంది కదా. దాన్ని ప్రోత్సహించనక్కర లేదు. కనీసం చెడగొట్టకుందా ఉంటే అదే పది వేలు. ఇలాంటి విష సంస్కౄతి ఇంకా విస్తరించకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవలసింది పిల్లల తల్లితండ్రులే.