

ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుండి ఊళ్ళోకి వచ్చే బ్రిడ్జి ప్రక్కన గోదావరి గట్టున ఉన్నది ఈ కాటన్ మ్యూజియం. మ్యూజియంకి వెళ్ళే దారిలో అటూ ఇటూ పచ్చని చెట్లతో మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. లోపలికి వెళ్లడానికి మనిషికి 2 రూపాయిలు టిక్కెట్. పరిసరాలన్నీ చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. చక్కటి గార్డెన్ కూడా ఉంది. మధ్యలో ఠీవీగా నుంచుని ఉంది రెండు వందల సంవత్సరాల చరిత్రకు సాక్షిగా నిలబడిన చక్కటి భవనం. ఆ భవనంలోకి వెళుతుంటే మనసు అప్రయత్నంగా ఉద్విగ్నతకు లోనయింది. ఈ రోజు గోదావరి జిల్లాలు ఇంత సుసంపన్నంగా ఉండడానికి కారణమైన ఒక మహావ్యక్తి నివసించిన భవనం అదే అని తెలిసి ఒక పవిత్ర భావానికి లోనయ్యాను. మ్యూజియం లోపల గత కాలపు చరిత్రను చక్కగా చెప్పే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాటన్ జీవిత విశేషాలు, ఆయన వాడిన పరికరాలు, గోదావరి నదిపై కట్టిన ఆనకట్ట నిర్మాణ విశేషాలు, గోదావరి డెల్టా వివరాలు, ఆనకట్ట నమూనా, ఆక్విడెక్టుల వివరాలు ఇలా ప్రతి గదిలోను ఎన్నో విశేషాలు కొలువై ఉన్నాయి.
1830వ సం||రంలో గోదావరి జిల్లాల్లో అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయట. తినడానికి తిండి లేక, పశువులకు గ్రాసం దొరక్క గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయట. ఆనాటి లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో సుమారు రెండు లక్షల మంది మృత్యువాత పడ్డారు. వేరే దారిలేక పుట్టిన పసికందుల్ని పిల్లల్ని సంతలో అమ్ముకునే వారట. అటువంటి దుర్బర పరిస్థితుల్లో ఇక్కడికి దేవుడి రూపంలో వచ్చాడు సర్ ఆర్ధర్ కాటన్. కేవలం 15 సం||ల వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక సామాన్య ఉద్యోగిగా వచ్చి, ఇక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుని, ఇక్కడి ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో నీటి పారుదల రంగంపై పరిశోధనలు చేసి, గోదావరి నదిపై ఆనకట్ట కట్టి నీటిని నిలువ ఉంచి, కరువు పరిస్థితులను ఎదుర్కోవాలని బ్రిటిష్ గవర్నమెంట్‌కు నివేదిక పంపించాడట. వారు దానికి అనుమతి నివ్వడంతో కాటన్ రంగంలో దిగారు. అప్పటిలో అంటే 150 సం||ల క్రితం ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో గుర్రం మీద తిరుగుతూ, దొరికిన పళ్ళనే తింటూ, గోదావరి తీరంపై అనేక పరిశోధనలు చేసారు. ఆనకట్ట నిర్మాణానికి అనువైన ప్రదేశం కోసం తిరుగుతూ పాపి కొండల నుండి ధవళేశ్వరం వరకూ తిరిగి, అనేక కష్టనష్టాలను, బాధలను తట్టుకుంటూ చివరికి ధవళేశ్వరం ప్రాంతాన్ని ఆనకట్ట నిర్మాణానికి అనువైన ప్రదేశంగా గుర్తించారు. పాపికొండల ప్రాంతంలో గోదావరి ఉరవడి ఎక్కువగా ఉండటం, ఆ రోజుల్లో రెండు కొండల మధ్య ఆనకట్ట నిర్మాణానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మాణం కావించారు. పని మొదలు పెట్టిన మూడు సంవత్సరాలు వ్యవధిలోనే ఆనకట్ట నిర్మాణం పూర్తి కావించడం కాటన్ ఉక్కు సంకల్పానికి నిదర్శనం.
ఈనాటి మన వాళ్లు అంటే భారతీయులం అని చెప్పుకునే వాళ్ళు ఆయన్ని చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మన దేశస్థుడు కాకపోయినా, ఇక్కడి వాళ్ళ పట్ల అభిమానంతో రేయనక, పగలనక శ్రమించి, పూర్తి కమిట్‌మెంట్‌తో ఫలితాన్ని సాధించి అందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటి రాజకీయ నాయకుల్లో, ఇంజనీర్లలో, కాంట్రాక్టర్లలో (అందరూ పేరుకు భారతీయులే, దేశభక్తులే) ఎంత మందిలో అటువంటి కమిట్‌మెంట్ ఉంటుంది. ఈ రోజు వేసిన రోడ్డు, రేపు వర్షం కురవగానే పెచ్చులూడిపోతుంది. అటువంటిది 150 సం||లుగా కొద్దిపాటి మరమ్మత్తులతో ఆనకట్ట పనిచేస్తుందంటే ఆయన నిర్మాణ చాతుర్యానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఇప్పటి రాజకీయ నాయకులు ప్రాజక్టును సంవత్సరాల కొద్దీ సాగదీస్తున్నారు. ప్రాజెక్టు పూర్తికాకుండానే కాలువలు తవ్వేస్తున్నారు. కనీసం వాలు కూడా చూస్తున్నారో లేదో అనుమానమే. అటువంటిది ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో గుర్రం మీద, కాలి నడకనా, సరైన రోడ్లు కూడా లేని సమయంలో డెల్టా అంతా పర్యటించడం మాటలు కాదు. నీటి వాలు కనిపెట్టి ఆ రోజు తవ్విన కాలువలు ఈ రోజుకూ డెల్టాకు అన్నం పెడుతున్నాయి. ఇచ్చిన పనిని ఏదో ఒక రకంగా తూతూ మంత్రంగా దులిపేసే నేటి మన ఇంజనీర్ ఆఫీసర్లకి, ఆనాటి కాటన్ దొరకి ఎంత తేడాయో కదా.
కేవలం జీతం కోసం మాత్రమే పని చేసుంటే సవాలక్ష ఇంజనీర్లలో ఒకరిగా కాటన్ మిగిలిపోయేవాడు. కాని గుండెల నిండా కమిట్‌మెంట్, ప్రజలకు మేలు చేయాలనే తపనతో పని చేయడం వల్లనే కాటన్ ఒక మహామనీషి కాగలిగాడు. అందరికీ ఆదర్శం కాగలిగాడు. ఆయన నివసించిన ప్రదేశాన్ని కూడా ఈ రోజుకీ మనం గౌరవిస్తున్నామంటే అది ఆయన కృషి వల్ల మాత్రమే. ఇలా మా విద్యార్థినులకి కాటన్ గొప్పతనాన్ని చెబుతూ, మనసులో చెమర్చిన కృతజ్ఞతా భావం కన్నులలో నీటి రూపంలో తిరుగుతూండగా, దానికి ఆనకట్ట కట్టమని కాటన్‌ను స్మరించుకుంటూ, తిరిగి బస్సులలో బయలుదేరి రాజమండ్రి పయనమయ్యాము.