Pages

Tuesday, October 12, 2010

అమ్మాయిలంటే అంత లోకువా?

కాలేజీకెళుతుంటే  కాలరెత్తి కన్నుకొడతాడే ఒకడు....
పౌడర్లు, అత్తర్లు పూసుకుని రాసుకెళతాడే ఒకడు....
సిటీ బస్‌లో పోతే భుజాలే తాకుతుంటరే
సినేమా చూస్తుంటే చేతులు పాముతుంటరే.
అయ్యో రామ మా అక్క మొగుడు ఒంటరిగుంటె వెర్రెక్కుతాడే
ఎదురింట్లోన బాబాయిగాడు ఏదో వంకతో తాకుతాడు
వయసులు వరసలు తెలియని సరసులు సన్నాసులు
వీధుల్లోకెళుతుంటే ఏక్సిడెంట్లే అయిపోతున్నాయే ఏంటో...
టైపింగూ సెంటర్లో వేలు పెట్టి కొట్టిస్తుంటాడే ఆంటీ...
టైలరింగ్‌ షాపోడు టేపుతో కొలతలంటడే..
గాజుల వ్యాపారి తేరగా నిమురుతుంటడే...

నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమాలోనిది ఈ పాట. ఈ పాటలోని ప్రతి పదంలో నేటి సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అనేక కష్టాల్ని చక్కగా వారిచేతనే చెప్పించాడు రచయిత / దర్శకుడు. అదేమి విచిత్రమో తెలియదు కాని, ఆడపిల్లలు రోడ్‌ మీద నడిచి వెళుతుంటే ఎప్పుడూ చూడని వింతజంతువుని చూసినట్లు ఫీలయిపోతారు మగవారు. ఇక అక్కడి నుండి వారు వేసే వెర్రి మొర్రి వేషాలకు అంతే ఉండదు. జుట్టు దువ్వుకునే వాడొకడు, బట్టలు సరిచేసుకునే వాడు ఒకడు, ముఖం అందంగా ఉందా లేదా అని తడుముకొనే వాడు మరొకడు. అబ్బాయికి చెలగాటం అమ్మాయికి ఇబ్బంది అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. ‘అందగత్తెలను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేల, కొందరు పిచ్చిన పడనేలా’ అన్నట్లు కొందరు మగవారు ఇలాంటి పాట్లు, ఫీట్లు చేస్తూ ఉంటే, వారినెలా ఏడిపించి ఆనందించాలా అని ఆలోచిస్తూంటారు కొంతమంది శాడిస్టులు. లవ్‌ లెటర్‌ ఇద్దామా, రాసుకు పూసుకు తిరుగుదామా, బ్లేడ్‌ పట్టుకు కోద్దామా, గొడ్డలితో నరుకుదామా లాంటి వన్నమాట. మరో విషయం. ఆడపిల్లల్ని రాసుకుంటూ వెళుతూ మగవాళ్ళు పొందే ఆనందానికి ఒక పేరుంది. దాని పేరు ‘శునకానందం’. దీనికాపేరు ఎందుకొచ్చిందో మీకు తెలుసా? శునకాలు... అదేనండి... కుక్కలు తమ యజమాని కనిపించగానే వెంటనే తోకాడిరచుకుంటూ వచ్చి కాళ్ళకి అడ్డంపడిపోతూ, ఒళ్ళంతా రాసుకుని, పూసుకుని తిరిగేస్తూ ఉంటాయి కదండి. అదన్నమాట. అలాగ ఆడపిల్లలు కనబడగానే ...... కార్చుకుంటూ, వాళ్లని తినేసేలా చూస్తూ, వీలువెంబడి తగులుకుంటూ వెళ్ళే వాళ్ళ ఆనందాన్ని శునకానందం అంటారన్నమాట.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొంచెం అఫీషియల్‌గా లైన్‌ వేసే వాళ్ళు మరికొందరు. పై పాటలో చెప్పినట్లు రకరకాల పేర్లతో ఏదో పని ఉందనే వంకతో అమ్మాయిల్ని తాకుతూ ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళని ఫ్యాన్సీ షాపుల్లోను, బట్టలషాపుల్లోను, టైలరింగ్‌ షాపుల్లో చూడవచ్చు. విద్యాసంస్థల్లో కూడా ఇటువంటి మాయరోగం చాలా మందిలో గమనించవచ్చు. చదువుకుంటున్న / గతంలో చదివిన ఆడపిల్లల్ని ఎవరినైనా కదిపి చూడండి. ఖచ్చితంగా వాళ్ళ చదువు పూర్తయ్యేలోగా కనీసం ఒకరిద్దరు చిత్తకార్తె శునకాల్ని చూసే ఉంటారు. వీరు పైకి చాలా పెద్దమనుషుల్లా ఉంటారు. అలాగే లోకాన్ని నమ్మిస్తారు. కాని పుస్తకాలు, పెన్నులు ఇచ్చే నెపంతో చేతులు తాకడం, రకరకాల మాటలతో మనసును గాయపరచడం, రకరకాల కారణాలతో ఒళ్ళంతా తడమటం, బల్లమీద వంగి ఏదైనా రాస్తుంటే, వెనక నుంచి ‘ఏదైనా’ కనబడుతుందని తొంగి చూడడం వంటివి ప్రతి అడపిల్ల జీవితంలో ఒకసారైనా జరిగుంటాయి. ఇవి గాక సిటీ బస్సుల్లోను, జనం ఎక్కువగా ఉన్నపుడు రైళ్లలోను ఎక్కితే ఇక ఆ చిట్టితల్లికి నరకం చూపించేందుకు పదుల సంఖ్యలో మానవ మృగాలు సిద్దంగా ఉంటారు. పనిచేసే చోట్ల, కార్యాలయాల్లో కూడా ఈ వికృత చేష్టలు ప్రతి క్షణం కనబడుతూనే ఉంటాయి.

అమ్మాయిలు చేసుకున్న పాపమేమిటో తెలియదు గాని, పేపర్లలో, మ్యాగజైన్లలో, టి.వి.ల్లో, వాల్‌పోస్టర్లలో, హోర్డింగుల్లో, సినిమాల్లో ఇలా ఎక్కడ చూసినా ఆడపిల్లలు సగం సగం బట్టలేసుకుని అవి కొనండి, ఇవి తినండి, ఇది చూడండి, అది వినండి అంటూ చిత్ర విచిత్ర విన్యాసాలతో బొమ్మలుంటాయి. అదేం చిత్రమో అర్థం కాదు. అమ్మాయిలు అందంగా ఉంటారు కాబట్టి వారి ఫోటో వేసి పబ్లిసిటీ చేయడంలో తప్పులేదు. కాని, అలా సగం సగం బట్టలు వేసి, వారి అభిమానాన్ని అలా నడి బజార్లో నిలబెట్టాల్సిన అవసరం ఉందంటారా? సినిమాల్లో పాటలు చూడండి. మంచు ప్రాంతాల్లో పాటలుంటాయి. చుట్టూ ఎటు చూసినా మంచు కురుస్తూంటూంది. హీరోకేమో పైనుంచి కింద దాకా సూటు, బూటు, కళ్ళకి జోడు. మరి హీరోయిన్‌ సంగతి... పాపం ఆ అమ్మాయి మాత్రం అంత చలిలో కూడా జానా బెత్తెడు బట్టలేసుకుని గంతులేస్తుంది. లేదా వర్షం పాటలో బట్టలన్నీ తడిసిపోయేలా డ్యాన్స్‌ చేస్తుంది. ఎంత డబ్బు తీసుకుంటే మాత్రం... ఆ అమ్మాయికి అభిమానం ఉండదా... మనకు మల్లే సిగ్గు వేయదా అని ఎవరైనా ఆలోచిస్తారా? ఈలలు, కేకలు, థియేటర్‌ దద్దరిల్లిపోతుంది. అందులో మహిళా ప్రేక్షకులు కూడా ఉండొచ్చు. చెప్పలేం.

ఇవన్నీ చదువులేని వారో, మంచి చెడు తెలియని వారో చేస్తున్నారంటే వారిని మార్చడానికి ప్రయత్నించవచ్చు. కాని, చదువుకున్న సంస్కార హీనుల్లో కూడా ఈ నీచత్వం బయటపడుతుంది. అదీ ఎక్కువ మోతాదుల్లో. ఆన్‌లైన్లో చాటింగ్‌ చేసేపుడు గమనించండి. ఎదురుగా ఆడపిల్ల ప్రొఫైల్‌ కనబడగానే స్నేహం పేరు చెప్పి వెంటనే లైన్‌ కలపడం, తరువాత అసభ్యకర పదాలతో వారిని ఏడిపిస్తూ ఆనందించడం. ఈ మద్యన ఒక సర్వేలో తేలిందేమిటంటే... ఆన్‌లైన్‌లో చాట్‌ చేసేటపుడు తమకు పరిచయం లేని ఆడపిల్లలు చాటింగ్‌ మొదలుపెడితే ఒక నిముషంలో లోపలే వారిని అసభ్యకర మాటలతో రంగంలోకి దించడానికి ప్రయత్నిస్తారట అబ్బాయిలు. ఇదంతా ఒక ఎత్తు. ఈ మధ్య వచ్చిన సెల్‌ఫోన్‌ కెమెరాలు, పెన్‌ కెమెరాలతో అమ్మాయిలకి ప్రైవసీ లేకుండా చేస్తున్నారు. ఏ షాపింగ్‌ మాల్‌లో, ఏ హోటల్‌లో, ఏ బాత్‌రూమ్‌లో కెమెరాలు ఉంటాయో, ఎక్కడ తమ వ్యక్తిగత జీవితం నెట్‌ పాలవుతుందోనని ప్రతీ క్షణం అమ్మాయిలు నరక యాతన పడుతున్నారు.

అందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆడపిల్లలంటే వారు ప్రాణం లేని బొమ్మలు కారు. ఏడిపించుకు తినడానికి, బ్లేడ్‌పెట్టి కోయడానికి దేవుడిచ్చిన ప్రాణులు కాదు అమ్మాయిలంటే.. వారికీ ఒక మనసుంటుంది. మనకు మల్లే ఒక వ్యక్తిత్వం ఉంటుంది. కాని ఖచ్చితంగా అమ్మాయిలు మగవారంత నీచంగా వారు ఆలోచించరు. మగవారికున్న ఫాంటసీలు ఉండవు. అది మాత్రం నిజం. మనకున్న బరితెగించే తత్వం వారి కుండదు. ఆడపిల్లలు సున్నిత మనస్కులు. నిజం చెప్పాలంటే ఆడపిల్లల్ని పువ్వులతో పోల్చవచ్చు. ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ‘పుష్ప విలాప కావ్యం’లో చెప్పినట్లు పువ్వులు మొక్కకి ఉన్నంత సేపు ఎంతో అందంగా, ఆనందంగా ఉంటాయి. పువ్వుల్ని చూసి ఆనందించాలే తప్ప, వాటిని కోసి, నునులేత రేకల్ని తెంపేసి, వాటిని నలిపి వాసన చూడాలనే ఆలోచన సరైనది కాదు. అమ్మాయిలకి ఇవ్వాల్సిన గౌరవం  ఇవ్వకపోయినా పర్వాలేదు గాని వారిని అగౌరపరచకుండా ఉంటే చాలు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించనక్కర్లేదు. మన సపోర్ట్‌ వారికి అక్కర్లేదు. కనీసం వారి దారికి అడ్డం రాకుండా ఉంటే చాలు. వారే తమ దారిని తామే వేసుకోగలరు. భువన శిఖరాలను అందుకోగలరు.

6 comments:

  1. మీరు చెప్పినవాటన్నింటితో నేను విబేధించను కానీ, కొన్నింటితో మాత్రం ఖచ్చితంగా విభేదించి తీరాల్సిందే. అందంగా ఉంటే చూడాలనుకోవడం మరీ అంత పాపమేంకాదు. అదీ ఆవిడగారు ఏ మోడలో, హీరోయినో అయితే ఇంక బాదేముంది. మేమేదో, ఇచ్చి పుచ్చుకునే ధోరణులలో వెలుతుంటాం అన్నమాట. అయినా షర్ట్ వేసుకోకుండా నటించే సల్మాను, ముసలి వయసులో ఆరుపలకల దేహాన్ని పెంచుకున్న షారుక్కు, ఛాన్సు దొరికితే చొక్కా విప్పే హృతిక్కు, ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు లెండి. వాల్లందరూ, మగాళ్ళు చూస్తున్నారని విప్పుతున్నారా..? దీని మీద నేనోక టపాకుడా రాశాను ఒక సారి వీలు చూసుకుని చదవండి.

    ఉక్రోషం: సినిమాలలో నాయికల వస్త్రధారణ

    అమ్మాయిలంటే చులకన్ భావం అందరికీ ఉండదుకానీ, మీకు మాత్రం అబ్బాయిలంటే బాగా చులకనగా ఉన్నట్లుంది. ఎందుకండీ?

    ReplyDelete
  2. సమాజంలో ఆడవార్ని గౌరవించడం మన సంప్రదాయం. అందరు బుద్దిమంతులు ఉండరు .అలాగని అందరు మగవాళ్ళును ఒకేలా పోల్చరాదు. అమ్మయుల స్కిన్ షో తగ్గిస్తే మగవాళ్ళ కంటి చూపు కూడతగ్గుతుంది

    ReplyDelete
  3. మొదట అమ్మాయిల సున్నితమైన మనసు మారాలి. అప్పుడే మగ వారికి బుద్ధి చెప్పొచ్చు.

    ReplyDelete
  4. @ శివ ప్రసాద్ గారు.. thanks

    @ ఆకాశ రామన్న గారు... అందాన్ని చూడాలనుకోవడంలో, చూడడంలో ఏ తప్పూ లేదు... అమ్మాయిల్ని ఆకర్షించడానికి వెర్రి మొర్రి వేసే వారిని చూస్తేనే నవ్వొస్తుంది.. అబ్బాయిలంటే నాకేమీ చులకన లేదండి... కాకపోతే, కొన్ని వందల మంది ఆడపిల్లల బాధలు, ఇబ్బందులు తెలుసుకున్న తరువాత ఈ టపా రాసాను.

    @ జగ్గంపేట గారు... అందరు మగవాళ్ళు అని నేను అనలేదండి... జనరల్‌గా చెప్పానంతే... స్కిన్ షో విషయమంటారా... మగవాళ్ళ బుద్ది సరిచేసుకోకుండా, అమ్మాయిల్ని వారికి నచ్చినట్టుగా వుండొద్దనడం సరికాదంటాను.

    @ తుషార గారు... బాగా చెప్పారు.

    ReplyDelete
  5. ఈ కాలంలో జాలిపడదగ్గవారూ, మానసిక సపోర్టు కావాల్సిన వారూ ఎవరైనా ఉన్నారంటే అది మగవాళ్ళే.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.